English | Telugu

కొవిడ్‌తో 'చిచ్చోరే' తార అభిలాష మృతి

హిందీ, మ‌రాఠీ చిత్రాల న‌టి అభిలాష పాటిల్ కొవిడ్‌-19తో పోరాడుతూ మృతి చెందారు. ఆమె వ‌య‌సు న‌ల‌భై పైన ఉంటుంది. సోష‌ల్ మీడియా ద్వారా ఆమెకు తోటి తార‌లు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌, న‌వీన్ పోలిశెట్టి, శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన హిట్ ఫిల్మ్ 'చిచ్చోరే'తో పాటు 'బ‌ద్రీనాథ్ కీ దుల్హ‌నియా', 'గుడ్ న్యూజ్' లాంటి సినిమాల్లో అభిలాష న‌టించారు. అలాగే తుఝా మంఝా అరేంజ్ మ్యారేజ్‌, బేకో దేతా కా బేకో, పిప్సీ లాంటి పేరుపొందిన మ‌రాఠీ సినిమాల్లో ఆమె న‌టించారు.

ఇటీవ‌ల కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యి చికిత్స తీసుకుంటూ వ‌చ్చిన అభిలాష బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు భ‌ర్త‌, ఓ కుమారుడు ఉన్నారు. 'బాప్‌మానుస్' సీరియ‌ల్‌లో ఆమె భ‌ర్త‌గా న‌టించిన సంజ‌య్ కుల‌క‌ర్ణి మాట్లాడుతూ, "బాప్‌మానుస్‌లో మాతో క‌లిసి న‌టించిన‌ జ్యోతి పాటిల్ నిన్న‌ సాయంత్రం దాదాపు 6 గంట‌ల ప్రాంతంలో ఫోన్‌చేసి, అభిలాష ఆరోగ్య స్థితి గురించి చెప్పింది. ఇటీవ‌ల అభిలాష‌ బెనార‌స్ వెళ్లింద‌నీ, అక్క‌డే ఫీవ‌ర్ వ‌చ్చింద‌నీ, ముంబైకి తిరిగొచ్చాక టెస్ట్ చేయించుకుంటే క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చింద‌నీ తెలిసింది. నేను ఆమెకు కాల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను కానీ, ఆమె రెండు నంబ‌ర్లు స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. ఆ త‌ర్వాత 8.30 గంట‌ల‌కు అదే సీరియ‌ల్‌లో మా కొడుకుగా న‌టించిన ఆనంద్ ప్ర‌భు ఫోన్ చేసి, ఆమె మ‌ర‌ణ‌వార్త‌ను తెలియ‌జేశాడు. ఇది నాకు చాలా షాక్ క‌లిగించింది. జీవితంలో ఆమె సాధించాల్సింది చాలా ఉంది. ఆమెకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆమె చాలా స‌హృద‌యురాలు, చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే ఆర్టిస్ట్‌. ఇండ‌స్ట్రీకి ఇది చాలా పెద్ద లోటు." అని చెప్పారు.

బాలీవుడ్‌కు సంబంధించి కొవిడ్‌-19 బారిన‌ప‌డిన కొద్దిమంది సెల‌బ్రిటీల‌లో అభిలాష ఒక‌రు. అలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌, సోను సూద్‌, విక్కీ కౌశ‌ల్‌, భూమి పెడ్నేక‌ర్‌, క‌త్రినా కైఫ్‌, కార్తీక్ ఆర్య‌న్ లాంటివాళ్లు దీని బారిన ప‌డి కోలుకోగా, దీపికా ప‌డుకోనే ప్ర‌స్తుతం స్వీయ ఐసోలేష‌న్‌లో ఉంది.