English | Telugu

క‌రోనాతో క‌న్నుమూసిన బాబా సెహ‌గ‌ల్ తండ్రి!

ప్ర‌ముఖ సింగ‌ర్ బాబా సెహ‌గ‌ల్ ఇంట క‌రోనా వైర‌స్ విషాదాన్ని నింపింది. ఆయ‌న తండ్రి జ‌స్పాల్ సింగ్ సెహ‌గ‌ల్ కొవిడ్‌-19తో పోరాడుతూ క‌న్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విషాద వార్త‌ను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా బాబా షెహ‌గ‌ల్ షేర్ చేశారు. 87 సంవ‌త్స‌రాల జ‌స్పాల్ సింగ్ ల‌ఖ్‌న‌వ్‌లోని త‌న కుమార్తె ఇంట్లో మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు.

త‌న తండ్రితో క‌లిసున్న ఓ పిక్చ‌ర్‌ను ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన బాబా సెహ‌గ‌ల్‌, "ఈ రోజు ఉద‌యం నాన్న మ‌మ్మ‌ల్ని వ‌దిలి వెళ్లిపోయారు. ఒక‌ వారియ‌ర్‌గా జీవించిన ఆయ‌న కొవిడ్ ముందు త‌ల‌వంచారు. ఆయ‌న కోసం ప్రార్థించండి. క్షేమంగా ఉండండి." అని పోస్ట్ చేశారు.

బాబా సెహ‌గ‌ల్ ఈ విష‌యం షేర్ చేసిన వెంట‌నే, ఆయ‌న ఫ్యాన్స్ దాన్ని రిట్వీట్ చేస్తూ, ఆయ‌న తండ్రి మృతికి సంతాపం తెలియ‌జేస్తూ వ‌చ్చారు. నిజానికి జ‌స్పాల్ సింగ్ కొవిడ్ నుంచి కోలుకుంటున్నార‌ని కుటుంబ స‌భ్యులు అనుకున్నారు. అయితే స‌డ‌న్‌గా సోమ‌వారం రాత్రి ఆయ‌న ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోయాయ‌నీ, హాస్పిట‌ల్‌కు తీసుకుపోయినా ఫ‌లితం లేకుండా పోయింద‌నీ స‌మాచారం.

క‌రోనా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా, ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌నేందుకు ఇటీవ‌ల వ‌రుస‌గా సంభ‌విస్తున్న ఘ‌ట‌న‌లు, మ‌ర‌ణాలే నిద‌ర్శ‌న‌మ‌ని నిపుణులు చెప్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే 'మ‌హాభార‌త్' న‌టుడు స‌తీశ్ కౌల్ కొవిడ్‌తో బాధ‌ప‌డుతూ మృతి చెందారు.