English | Telugu
హిందీ 'అన్నియన్' (అపరిచితుడు) రణవీర్ సింగ్!
Updated : Apr 14, 2021
శంకర్ డైరెక్షన్‌లో 2006లో వచ్చిన 'అపరిచితుడు' (అన్నియన్) మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. టైటిల్ రోల్ చేసిన విక్రమ్‌కు పెద్ద పేరు వచ్చింది. ఆ సినిమా వచ్చాక అప్పటికప్పడు పరస్పరం భిన్నంగా ప్రవర్తించే మనిషిని 'అపరిచితుడు' అనడం పరిపాటి అయ్యిందంటే ఆ సినిమా జనంలో కలిగించిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నిజానికి సమాజంలోని లంచగొండితనంపై ఓ యువకుడు చేసిన పోరాటం ఈ సినిమాలోని మెయిన్ ఎలిమెంట్. అలాంటి మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
శంకర్ స్వయంగా రూపొందించే ఈ రీమేక్ మూవీలో అపరిచితునిగా రణవీర్ సింగ్ నటించనున్నాడు. వాస్తవానికి 'అన్నియన్' మూవీ తెలుగులో మాదిరిగానే హిందీలోనూ డబ్బయి, 'అపరిచిత్' పేరుతో రిలీజయ్యింది. 'పద్మావత్' (2018)లో అల్లావుద్దీన్ ఖిల్జీగా తనలోని వెర్సటాలిటీని సూపర్బ్‌గా ప్రెజెంట్ చేసిన రణవీర్ అపరిచితుని క్యారెక్టర్‌కు పర్ఫెక్టుగా సూటవుతాడని శంకర్ తలచారు. "అద్భుతమైన సినిమా విజన్ కలిగిన శంకర్ డైరెక్షన్‌లో నటించే అవకాశం రావడం నాకు దక్కిన భాగ్యం." అని రణవీర్ వ్యాఖ్యానించాడు.
"ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎప్పుడూ కలగంటూ వచ్చాను. 'అన్నియన్' లాంటి ఫిల్మ్‌లో లీడ్ క్యారెక్టర్ చెయ్యడం ఏ ఆర్టిస్టుకైనా కల నిజమవడం లాంటిది. నేను బాగా అభిమానించే మనదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టుల్లో ఒకరైన విక్రమ్ సర్ ఒరిజినల్‌లో గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో మ్యాచ్ అవడం ఎప్పటికీ కష్టం. అదే తరహాలో ఆడియెన్స్‌తో కనెక్ట్ అవడానికి నా వంతు ప్రయత్నం చేయగలనని ఆశిస్తున్నా." అని అతను చెప్పాడు.
ఈ హిందీ రీమేక్‌ను పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతీలాల్ గడా నిర్మించనుండగా, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించనున్నది. 2022 మధ్యలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈలోగా కమల్ హాసన్‌తో చేస్తున్న 'ఇండియన్ 2' మూవీతో పాటు రామ్‌చరణ్‌తో సినిమాను శంకర్ పూర్తి చేయనున్నారు.