English | Telugu

అలియా భ‌ట్ రెట్‌లైట్ ఏరియా బ్యాగ్రౌండ్ సినిమా వ‌చ్చేది ఆరోజే!

కొన్ని రోజులుగా భారీ సినిమాల రిలీజ్ డేట్‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వాటి స‌ర‌స‌న లేటెస్ట్‌గా 'గంగూబాయ్ క‌థియ‌వాడి' సినిమా కూడా చేరింది. అలియా భ‌ట్ టైటిల్ రోల్ పోషించ‌గా సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని 2022 జ‌న‌వ‌రి 6న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఓ కీల‌క పాత్ర చేసిన ఈ చిత్రాన్ని నిజానికి ఈ ఏడాది జూలై 30న విడుద‌ల చేయాల‌ని మొద‌ట అనుకున్నారు. కానీ కొవిడ్ సెకండ్ వేవ్ దెబ్బ‌కు పోస్ట్‌పోన్ త‌ప్ప‌లేదు.

ఈ ఏడాది జూలైలో అలియా భ‌ట్ షూటింగ్ పూర్తి చేసింది. గుజ‌రాత్ నుంచి త‌న ప్రియుడితో క‌లిసి ముంబై వ‌చ్చి అత‌ని వ‌ల్ల‌ మోస‌పోయి, వ్య‌భిచార గృహానికి అమ్ముడుపోయి, బ‌ల‌వంతంగా ప‌డుపువృత్తిలోకి దిగాల్సి వ‌చ్చిన ఓ యువ‌తి క‌థ 'గంగూబాయ్ క‌థియ‌వాడి'. 20వ శ‌తాబ్దం మ‌ధ్య‌లో ప‌లువురు మాఫియా క్రిమిన‌ల్స్‌తో సంబంధాలు పెట్టుకొని, ద‌క్షిణ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ప‌ట్టు సాధించింది గంగూబాయ్‌. ఒక వ్య‌భిచార గృహానికి య‌జ‌మానురాలిగా అవ‌తార‌మెత్తిన ఆమె ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కామాఠిపురాలో ఉండే మ‌హిళ‌లు, అనాథ‌ల కోసం ఏం చేసింద‌నేది ఈ చిత్రంలోని ప్ర‌ధానాంశం.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ, జ‌యంతీలాల్ గ‌డా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో పార్థ్ సంతాన్‌, శంత‌ను మ‌హేశ్వ‌రి, సీమా ప‌హ్వా కీల‌క పాత్ర‌ధారులు.