English | Telugu
ఏక్తా కపూర్‌పై క్రిమినల్ కేసు.. విచారణకు ఆదేశించిన ముంబై కోర్టు!
Updated : Feb 16, 2025
ఏక్తా కపూర్.. ఈ పేరు తెలియని సినిమా ప్రేమికులు, టీవీ వీక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మొదట టీవీ సీరియల్స్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఏక్తా.. ప్రముఖ బాలీవుడ్ హీరో జితేంద్ర కుమార్తె. ఆమె తల్లి శోభా కపూర్‌తో కలిసి 100కి పైగా సీరియల్స్, 50కి పైగా సినిమాలు, 50కి పైగా వెబ్ సిరీస్‌లను నిర్మించారు. 1995లో బాలాజీ టెలి ఫిలింస్ సంస్థను ప్రారంభించి సీరియల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బాలాజీ ఫిలింస్, బాలాజీ మోషన్ పిక్చర్స్.. ఇలా రకరకాల బేనర్స్‌పై ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు. 30 సంవత్సరాలుగా నిర్విరామంగా సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న ఏక్తా కపూర్ ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నారు. ఎన్నో సార్లు కోర్టు మెట్లెక్కారు. ఇప్పుడు ఓ కొత్త వివాదం ఆమె చుట్టుముట్టింది.
భారత సైనికులను అవమానించారనే ఆరోపణలతో ఏక్తా కపూర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు వెంటనే విచారణ చేపట్టాలని, మే 9లోగా పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఏక్తా కపూర్‌పై యూట్యూబర్ వికాస్ పాఠక్ ఫిర్యాదు చేశారు . ఈ ఫిర్యాదులో ఏక్తా కపూర్‌ను మాత్రమే కాకుండా ఏక్తా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీ, ఆమె తల్లిదండ్రులు శోభ, జితేంద్ర కపూర్‌లను కూడా పేర్కొన్నారు. ఆల్ట్ బాలాజీలో ప్రసారమైన ఓ వెబ్ సిరీస్‌లో ఒక సైనికాధికారి అభ్యంతర కరమైన చర్యకు పాల్పడుతున్నట్టు చూపించారని ఆరోపించారు వికాస్ పాఠక్. భారత సైన్యం సైనిక యూనిఫాంలో జాతీయ చిహ్నంతో అభ్యంతరకరమైన చర్యలను ప్రదర్శించడం ద్వారా, నిందితులు మన దేశ ఖ్యాతిని, గౌరవాన్ని దెబ్బతీశారు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఏక్తాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే చర్చలు బాలీవుడ్‌లో జోరుగా సాగుతున్నాయి.
30 సంవత్సరాల ఏక్తా కపూర్ కెరీర్‌లో వివాదాలు కొత్తేమీ కాదు. ఆమె నిర్మించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఎన్నోసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందులో ప్రధానంగా రాగిణి ఎంఎంఎస్2 చిత్రంలోని ఓ సన్నివేశం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీంతో ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో నిషేధించారు కూడా. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా 2011లో ఏక్తా కపూర్ నిర్మించిన ది డర్టీ పిక్చర్ ఘనవిజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.