English | Telugu

సినిమా సెలబ్రిటీలు ఇలాంటి వ్యాపారాలు కూడా చేస్తున్నారా?

సినిమా సెలబ్రిటీలు ఇలాంటి వ్యాపారాలు కూడా చేస్తున్నారా?

సినిమా రంగంలో రాణించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ కెరీర్‌లో ఎంతో డబ్బు సంపాదిస్తారు. కానీ, కొందరు మాత్రమే సంపాదించిన ఆస్తిని కాపాడుకుంటారు లేదా కొన్ని రెట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పాతతరం నటీనటుల స్థితిగతుల్ని చూసిన ఇప్పటితరం వారు ఈ విషయంలో కాస్త ముందు చూపుతో ఉంటున్నారనే చెప్పాలి. ఉదాహరణకు టాలీవుడ్‌లోని కొందరు యంగ్‌ హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని రకాల వ్యాపారాల ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. రెస్టారెంట్స్‌, బ్యూటీపార్లర్లు, పబ్బులు.. ఇలా ధనిక వినియోగ దారులే టార్గెట్‌గా వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇది టాలీవుడ్‌ ప్రముఖులకు సంబంధించిన విషయం. ఇక బాలీవుడ్‌లో మరో రకమైన వ్యాపారం జరుగుతోంది. 

బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించడం ద్వారా ఇక్కడా కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న మనోజ్‌ సడన్‌గా అతనికి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌ను రూ.9 కోట్లకు అమ్మేశాడు. ఆ ప్రాపర్టీని ఎందుకు అమ్మాడు అనే విషయం గురించి ఆరా తీస్తే బాలీవుడ్‌లో జరుగుతున్న కొత్త వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని మినర్వా సెంటర్‌లో పదేళ్ళ క్రితం ఒక అపార్ట్‌మెంట్‌ను రూ.6 కోట్లకు కొనుగోలు చేశాడు మనోజ్‌. ఇప్పుడు దాన్ని రూ.9 కోట్లకు అమ్మి మూడు కోట్లు లాభాన్ని ఆర్జించాడు.

బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులు ప్రస్తుతం ఈ బిజినెస్‌పై దృష్టి పెట్టారని తెలుస్తోంది. అపార్ట్‌మెంట్స్‌, ఇండిపెండెంట్‌ హౌసెస్‌ని కొనడం, తిరిగి అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ విషయం తెలిసి ఆయా ప్రముఖుల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా సెలబ్రిటీలు అయి వుండి ఈ తరహా వ్యాపారం చేయడం ఏమిటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఈ కొత్త బిజినెస్‌పై రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా కూడా ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఓ భవనాన్ని రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. కొనడం, అమ్మడం అనే వ్యాపారం ద్వారా ఈమధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు కోట్లలో లాభాలు పొందుతున్నారని తెలుస్తోంది.