English | Telugu

అమితాబ్ డ్రీమ్ హోమ్ 'జ‌‌ల్సా' క‌థ‌.. ఆయ‌న మాట‌ల్లోనే...

 

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న డ్రీమ్ హోమ్ 'జ‌ల్సా' నుంచి ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తుంటారు. ప్ర‌తి ఆదివారం అభిమానులు త‌మ ఫేవ‌రేట్ స్టార్‌ను క‌లుసుకోవ‌డానికి జ‌ల్సాకు వ‌స్తుంటారు. తాజాగా జ‌ల్సా చ‌రిత్ర గురించి ఓపెన్ అయ్యారు బిగ్ బి. ఆ ప్లేస్ త‌న నివాసం ఎలా అయ్యిందో చెప్పుకొచ్చారు. చాలా మందికి తెలీని విష‌యం ఏమంటే.. అమితాబ్‌, జ‌యా బ‌చ్చ‌న్‌ల ఆ అంద‌మైన ఇల్లు ఒక ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ ద‌ర్శ‌కుడు.. ర‌మేశ్ సిప్పీ. 'స‌త్తే పే స‌త్తా' సినిమా చేశాక ఆ ఇంటికి అమితాబ్‌కు కానుక‌గా ఇచ్చారు సిప్పీ. ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే అమితాబ్ ఐకానిక్ ఫిల్మ్ 'షోలే'ను చేసిన విష‌యం తెలిసిందే.

ఏప్రిల్ 11న అమితాబ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ పిక్చ‌ర్‌ను షేర్ చేశారు. అది.. 'చుప్‌కే చుప్‌కే' సినిమా సెట్స్‌పై త‌ను, జ‌య ఉన్న ఫొటో. దాంతో పాటు, "చుప్‌కే చుప్‌కే.. హృషీకేశ్ ముఖ‌ర్జీ తీసిన మా ఫిల్మ్‌.. నేటితో 46 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటోంది. ఈ పిక్చ‌ర్‌లో మీరు చూస్తున్న ఇల్లు నిర్మాత ఎన్‌సీ సిప్పీ ఇల్లు.. దాన్ని మేం కొన్నాం, త‌ర్వాత అమ్మాం, మ‌ళ్లీ కొన్నాం.. పున‌ర్నిర్మించాం.. ఇది ఇప్ప‌డు మా ఇల్లు జ‌ల్సా. ఇక్క‌డ చాలా సినిమాలు.. ఆనంద్‌, న‌మ‌క్ హ‌రామ్‌, చుప్‌కే చుప్‌కే, స‌త్తే పే స‌త్తా.. ఇంకా అనేకం షూటింగ్ జ‌రుపుకున్నాయి." అని రాసుకొచ్చారు.

అమితాబ్ బ‌చ్చ‌న్‌కు బ‌లం ఆయ‌న భార్య జ‌య‌. 'ఫ్రైడే' మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో, ప్రియ‌మైన భార్య‌తో త‌న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు అమితాబ్‌. "ఇప్ప‌టికీ నా భార్య జ‌య‌, నేను ఒక‌రికొక‌రం స్వీట్‌హార్ట్స్‌మి. ఈ మాట చెప్తున్నానంటే ఆమె న‌న్నెంత ప్రేమిస్తుందో, ఎంత అనురాగాన్ని పంచి ఇస్తుందో గ్ర‌హించుకోవ‌చ్చు." అని చెప్పారు. ఆ ఇద్ద‌రి స్థిర‌మైన అనురాగానికి జ‌ల్సా ఒక వేదిక అయ్యింద‌నేది నిజం.