English | Telugu

'దృశ్యం 2' హిందీ రీమేక్‌లో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, ట‌బు

మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా జీతు జోసెఫ్ రూపొందించిన 'దృశ్యం 2' మూవీ ఒరిజిన‌ల్ త‌ర‌హాలోనే ప్రేక్ష‌కుల్ని బాగా ఆక‌ట్టుకుంటోంది. కాక‌పోతే థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్ర‌వ‌రి 19న ఈ చిత్రం విడుద‌లైంది. ఇప్ప‌టికే ఈ మూవీ తెలుగు రీమేక్‌ను వెంక‌టేశ్‌తో తీయ‌డానికి జీతు జోసెఫ్ ప్లాన్ చేస్తున్నాడు.

లేటెస్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ ప్ర‌కారం 'దృశ్యం 2' హిందీ రీమేక్‌లో అజ‌య్ దేవ్‌గ‌ణ్ న‌టించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ హ‌క్కుల్ని ముంబై ప్రొడ్యూస‌ర్ కుమార్ మంగ‌త్ చేజిక్కించుకున్నారు. 'దృశ్యం' హిందీ వెర్ష‌న్‌లోనూ దేవ్‌గ‌ణ్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ మూవీలో ఆయ‌న భార్య‌గా శ్రియ న‌టించ‌గా, తెలుగులో న‌దియా చేసిన పాత్ర‌ను ట‌బు చేశారు. ఇప్పుడు సీక్వెల్‌కూ ట‌బు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

అయితే దేవ్‌గ‌ణ్ వైఫ్ క్యారెక్ట‌ర్‌ను ఎవ‌రు చేస్తార‌నే విష‌యంలో క్లారిటీ రాలేదు. ఈ సినిమాలోనూ శ్రియ కంటిన్యూ అవుతారా, లేదా అనేది వెల్ల‌డి కాలేదు. అలాగే 'దృశ్యం'ను నిషికాంత్ కామ‌త్ డైరెక్ట్ చేయ‌గా, సీక్వెల్‌ను ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నేది పెండింగ్‌లో ఉంది. నిషికాంత్ అనారోగ్యంతో అనూహ్యంగా గ‌త ఏడాది ఆగ‌స్ట్ 17న హైద‌రాబాద్‌లో మృతి చెందారు.

ఒరిజిన‌ల్ మూవీ స్టోరీ ముగిసిన ఆరేళ్ల త‌ర్వాత ఏం జ‌రిగింది, ఆ కేసును పోలీసులు మ‌ళ్లీ ఎలా ద‌ర్యాప్తు చేసి, హీరో ఫ్యామిలీ చేసిన హ‌త్య‌లో సాక్ష్యాధారాలు సేక‌రించారా, లేదా అనేది ఈ సీక్వెల్‌లోని ప్ర‌ధానాంశం. సీక్వెల్‌కు సంబంధించి హిందీ వెర్ష‌న్‌లో చిన్న చిన్న మార్పులు ఉంటాయ‌ని నిర్మాత కుమార్ మంగ‌త్ వెల్ల‌డించారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెకండాఫ్‌లో మొద‌ల‌వుతుంద‌నీ, మూవీ 2022లో విడుద‌ల‌వుతుంద‌నీ ఆయ‌న చెప్పారు.