English | Telugu
డ్రగ్ కేస్.. పోలీసుల అదుపులో బిగ్ బాస్ కంటెస్టెంట్!
Updated : Mar 30, 2021
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు అజాజ్ ఖాన్‌ను మంగళవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అదుపులోకి తీసుకుంది. ఒక డ్రగ్ కేసులో అతడిని ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అజాజ్ గుజరాత్ నుంచి నిన్న ముంబైకి వచ్చాడు. డ్రగ్ పెడ్లర్ షాదాబ్ బటాటా అరెస్ట్ తర్వాత ఎన్సీబీ చేపట్టిన దర్యాప్తులో అజాజ్ ఖాన్ పేరు బయటకు వచ్చింది.
డ్రగ్ కేసులో అజాజ్ పేరు బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు. 2018లో, అతని దగ్గర ఎనిమిది ఎక్‌స్టసీ టాబ్లెట్స్ లభించడంతో ముంబైలోని ఓ హోటల్‌లో ఉన్న అతడిని నవీ ముంబైకి చెందిన యాంటీ-నార్కోటిక్స్ సెల్ అరెస్ట్ చేసింది. అప్పట్లో నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నాడనే అభియోగంతో అతడిపై కేసు పెట్టారు.
అలాగే, 2019 జూలైలో అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసి, మతపరమైన విద్వేషాలను రేపెడుతున్నాడనే అభియోగంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాదు, తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో ఒక అభ్యంతరకర పోస్ట్ పెట్టాడనే ఆరోపణలతో 2020 ఏప్రిల్‌లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ఫేస్‌బుక్ లైవ్ సెషన్ సందర్భంగా దానికి సంబంధించి కామెంట్ చేయడంతో ఖర్ పోలీస్ స్టేషన్ అధికారులు విచారణ జరిపి, అరెస్ట్ చేశారు.
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ షో 7వ సీజన్‌లో అతను కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.