English | Telugu

యాక్షన్‌ సీన్స్‌ చేస్తూ ప్రమాదానికి గురైన బాలీవుడ్‌ హీరోయిన్‌!

సినిమా నిర్మాణం కోసం డబ్బునే కాదు, కాలాన్ని కూడా వెచ్చించాల్సి ఉంటుంది. కొందరు నటీనటులు తమ పాత్రకు న్యాయం చెయ్యాలన్న ఉద్దేశంతో ప్రాణం పెట్టి ఆయా పాత్రలను పోషిస్తుంటారు. దాని కోసం ఎంతటి రిస్క్‌ తీసుకోవడానికైనా వెనుకాడరు. అలా చాలా మంది నటీనటులు పర్‌ఫెక్షన్‌ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. హీరోగానీ, హీరోయిన్‌గానీ తీవ్రంగా గాయపడితే అది సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని నెలలపాటు షూటింగ్‌ని వాయిదా వెయాల్సి వస్తుంది. అందుకే హీరోలు ఎక్కువ రిస్క్‌ తీసుకోకుండా దర్శకనిర్మాతలు చూస్తుంటారు. అయినా కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి.

తాజాగా అలాంటి ఓ ఘటన బాలీవుడ్‌లో జరిగింది. హీరోయిన్‌ ప్రియాంక చోప్రా షూటింగ్‌లో గాయపడిరది. ‘ది బ్లఫ్‌’ అనే సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో తనకు ప్రమాదం జరిగిందని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది ప్రియాంక. అంతేకాదు, దానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్‌ చేసింది. ఆమె ముఖంపై, మెడపై గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ‘వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం’ అంటూ ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది మాత్రం చెప్పలేదు. ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్‌ నిలిపి వేశారు. ఆమెను సిడ్నీలోని హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ప్రియాంకకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే మళ్ళీ షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారనేది తెలియాల్సి ఉంది.