English | Telugu
మ్యూజికల్ బ్లాక్ బస్టర్ `సాజన్`కి 30 వసంతాలు!
Updated : Aug 30, 2021
ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఒకరి కోసం మరొకరు తమ ప్రేమను త్యాగం చేయాలనుకోవడం.. అనే పాయింట్ చుట్టూ భారతీయ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో హిందీ చిత్రం `సాజన్`కి ప్రత్యేక స్థానం ఉంది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రం.. 1991కి గానూ బాలీవుడ్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మూడు కోట్ల రూపాయిల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ ముంగిట రూ. 18 కోట్లు ఆర్జించింది. ఇదే చిత్రం స్ఫూర్తితో తెలుగులో `అల్లరి ప్రియుడు` (1993), `నీ స్నేహం` (2002) సినిమాలు రూపొందగా.. అవి కూడా మ్యూజికల్ గా మెప్పించి విజయపథంలో పయనించడం విశేషం.
లారెన్స్ డిసౌజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి నదీమ్ - శ్రావణ్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ``బహుత్ ప్యార్ కర్తే హై`` (మూడు వెర్షన్స్), ``దేఖా హై పెహ్లీ బార్``, ``తుమ్ సే మిల్ నే కి తమన్నా హై``, `జియే తో జియే కైసే`` (నాలుగు వెర్షన్స్), ``మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై``, ``పెహ్లీ బార్ మిలే హై``.. ఇలా ఇందులోని గీతాలన్నీ విశేషాదరణ పొందాయి. సల్మాన్ పాటలన్నింటికీ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రం అందించడం విశేషం. అంతేకాదు.. ఈ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు (కుమార్ సను) విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ దక్కాయి. 1991 ఆగస్టు 30న విడుదలై అఖండ విజయం సాధించిన `సాజన్`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.