‘అమరావతి పాపం’ ఎవరిది..?
‘అమరావతి అవమానం’ మోదీదా? బీజేపీదా?
బీజేపీ-టీడీపీ భాగస్వాములే
బాబు జాగే కొంప ముంచింది
కులం కోణంలో జగన్ నిర్ణయాలు
అనాధగా మారిన అమరావతి
కడకు దిక్కయిన కోర్టులు
విభజన నుంచి ఇప్పటివరకూ.. దేశంలో రాజధాని నగరం లేని, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో పురోగమిస్తుంటే, ఏపీ మాత్రం అనాధగా దిక్కులు చూస్తున్న విషాదం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి మూడొందల రోజులు దాటిపోయాయి. నాటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు-హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో.. అమరావతిలో భూమి పూజ చేసిన ప్రాంతం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతిని కులం కోణంలో చూసి, ‘మూడు ముక్కలాట’కు తెరలేపడమే.. ఈ విషాదానికి అసలు కారణమన్నది బహిరంగ రహస్యం. ఒక్క జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు.. అటు బీజేపీ, ఇటు టీడీపీ.. అంతా కలసి, అమరావతిని అనాధను చేశారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ.
విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. శివరామకృష్ణన్ కమిటీ, దాని పర్యటనలు, ప్రజాభిప్రాయసేకరణ, దొనకొండలో రాజధానిని పెట్టాలని కొందరు, నూజివీడు అయితే బాగుంటుందని మరికొందరి సూచనల తర్వాత.. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ‘నారాయణ కమిటీ’ని తెరపైకి తీసుకువచ్చారు. కసరత్తులన్నీ పూర్తయ్యాక, అమరావతిని రాజధానిగా తేల్చారు. దానికోసం 32 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. వారిచ్చిన భూమునే పెట్టుబడిగా పెట్టి, మరికొంత కేంద్రసాయంతో రాజధాని నగరాన్ని నిర్మిస్తామని బాబు ప్రకటించారు. ఆ మేరకు రైతులకు కౌలుతోపాటు, కమర్షియల్ ప్లాట్లను కూడా ఇచ్చారు. కేంద్రం కూడా 7 వేల కోట్ల నిధులిచ్చిందని, ఆ డబ్బెక్కడికి పోయిందని సోము వీర్రాజు కొంతకాలం నుంచీ ప్రశ్నిస్తున్నారు. కానీ, అప్పటి సర్కారులో బీజేపీ కూడా భాగస్వామి అన్న వాస్తవాన్ని వీర్రాజు విస్మరించడం ఆశ్చర్యం.
జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, మూడు రాజధానులకు తెరలేపడంతో, అమరావతి కథ అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడ కమ్మ వర్గానికి చెందిన వారి భూములే.. ఎక్కువగా ఉన్నాయన్న అనుమానంతోనే, జగన్మోహన్‌రెడ్డి చూపు.. అమరావతి నుంచి విశాఖకు మళ్లింది. నాడు అక్కడ శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, ఇప్పుడు మౌనమునిగా మారారు. అమరావతిపై మీడియాలో మాట్లాడవద్దని బీజేపీ నాయకత్వం, నేతలకు లక్ష్మణరేఖ గీసింది. అధికారంలో ఉన్నప్పుడు మీనమేషాలు, తాత్కాలిక కట్టడాలతో పేరుతో పబ్లిసీటీ చేసుకున్న చంద్రబాబు.. చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు అమరావతి జపం చేస్తున్నారు. ఆ రకంగా అంతా కలసి, అమరావతిని అనాధను చేశారు. అందుకే ఈ పాపం అందరిన్నది ఆంధ్రుల ఆరోపణ.
పాపం అమరావతి! నిలువెత్తు బుద్దవిగ్రహం సాక్షిగా, ఇప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు.. మంత్రులతో అమ్మనాబూతులు తిట్టించుకుంటున్నారు. ధర్మాన కృష్ణదాస్‌అనే మంత్రి, రైతులను లం.. కొడుకులంటారు. మరికొందరు మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులంటారు. ఇంకొందరు మంత్రులు, టీ షర్టులేసుకుని ఉద్యమాలు చేస్తున్నారంటారు. మరికొందరు అది ‘కమ్మ’రావతి అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తారు. స్పీకర్ లాంటి వ్యక్తి దానిని ఎడారి, శ్మశానంతో పోలుస్తారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, వాటిని భరిస్తూ, సహిస్తూ, జైళ్లకు వెళ్లినా.. తమ ఉద్యమాన్ని 300 రోజులు దాటించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల పాపం పుణ్యాన, అనాధగా మారిన అమరావతి.. న్యాయం కోసం న్యాయస్థానం వైపు రోడ్డుకు మోకాళ్లు ఆనించి, దీనంగా చూస్తోంది.
మోదీ ప్రధాని హోదాలో వచ్చి శంకుస్థాపన చేశారు. ఢిల్లీని మించిన రాజధానిగా మారాలన్నారు. ఢిల్లీ కూడా చిన్నబోయేలా కొత్త నగరం ఉండాలన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరాలను, సందర్శించమని సలహా కూడా ఇచ్చారు. మేం మీ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు. కాబట్టి బీజేపీ అమరావతి నగరాన్ని, వాయువేగంతో నిర్మిస్తుందని భావించారు. ఆ తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కూడా కేటాయించారు. దానితో ఇంకేముంది? అమరావతి నగర నిర్మాణం, పంచకల్యాణి గుర్రంలా పరుగులు పెడుతుందనుకున్నారు. కానీ చంద్రబాబుతో దొస్తీ చెడటంతో, బీజేపీ తీరు కూడా మారింది. దానికితోడు నిర్మాణాల తాలూకు డీపీఆర్ కూడా కేంద్రానికి ఇవ్వలేదు. అప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ హయాంలో అమరావతికి అనుకూలంగానే తీర్మానించారు. ఆయన కూడా రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. మౌనదీక్ష నిర్వహించారు. ఇప్పుడు పరిస్థితి అందుకు రివర్సు. బీజేపీలో అమరావతి గురించి ఎవరు మాట్లాడితే, వారిపై వేటు వేస్తున్నారు.
ఈలోగా.. ఒక జీవీఎల్, ఇంకో సోము, ఇప్పుడు విష్ణువర్దన్‌రెడ్డి రూపంలో వెలువడిన అపశకునాల బట్టి, అమరావతికి కమలం పార్టీ కూడా శల్యసారథ్యం వహిస్తోందని స్పష్టమయింది. పైగా రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఏమీ లేదని, అఫిడవిట్ ఇచ్చింది. దీన్నిబట్టి.. మెడ మీద తల ఉన్న ఎవరైనా, అమరావతి అంశంలో జగన్ దారిలోనే.. బీజేపీ వెళుతోందన్న విషయం అర్ధమయి తీరాలి. అందుకే అమరావతి రైతులు ఢిల్లీలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా, అక్కడే ఉన్న మోదీ నుంచి ఒక్కమాట కూడా రాలేదంటే.. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏమిటన్నది సుస్పష్టం.
ఇక అమరావతి పాపంలో, చంద్రబాబుదే సింహభాగమన్నది.. ఈ పరిస్థితి-దుస్థితి అనుభవిస్తున్న వారి మాట. అధికారంలో ఉన్నప్పుడు గెజిట్‌లో అమరావతిని చేర్చకుండా.. డిజైన్లు, అత్యుత్తమ రాజధానుల సందర్శనల పేరిట చేసిన, ప్రచారంతో కూడిన కాలయాపనే ఈ పరిస్థితికి మూలం అన్నది, మెజారిటీ వర్గాల అభిప్రాయం. తాత్కాలిక నిర్మాణాలతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టే యోచన, పూర్తి స్థాయి నిర్మాణాలకు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు జగన్ దానిపై దృష్టి సారించే అవకాశం కూడా ఉండేది కాదన్నది వారి వాదన. నిజమే కదా మరి? తాత్కాలిక సచివాలయం పేరుతో బాబు, బడా కాంట్రాక్టరుకు సర్కారు భూమి ఇచ్చి మరీ, వందల కోట్లు సమర్పించుకున్నారు. సదరు కంపెనీ నిర్మించిన సచివాలయం ఖరీదు, హైదరాబాద్‌లో నిర్మించే భవనాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు.
నెల్లూరు నారాయణ సారథ్యంలో జరిగిన ఈ వ్యవహారంలో.. కాంట్రాక్టర్లు, వారిచ్చే కమిషన్లతో టీడీపీ లాభపడితే, పూర్తిగా నష్టపోయింది మాత్రం రైతులేనంటున్నారు. విభజన జరిగిన వెంటనే చంద్రబాబు మేల్కొని, బెజవాడకు వచ్చి పూర్తి స్థాయి నిర్మాణాలు చేయని పాపమే.. ఇప్పుడు రైతులకు శాపమైంది. అదే జగన్ మూడురాజధానుల ఆలోచనకు, ఊపిరిపోసిందనేది మెజారిటీ వర్గాల నిశ్చితాభిప్రాయం. అటు.. అమరావతిని ‘కమ్మ’రావతిగా ప్రచారం చేసిన వైసీపీ నేతలు, ఇప్పటివరకూ దానిని నిరూపించలేకపోయారు. అటు టీడీపీ కూడా, దానిని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయకుండా.. నారాయణ, పుల్లారావు వంటి భూములు కొన్న నేతలను కాపాడేందుకే ప్రాధాన్యమిచ్చింది. అమరావతి నిర్మాణ సమయంలో, నానా హడావిడి చేసిన ‘నారాయణ మాస్టారు’ ఇప్పుడు, ఏ కలుగులో దాగున్నారో ఎవరికీ తెలియదు.
నగర నిర్మాణం అవుతుందో లేదో తెలియని అయోమయం.. మూడు పంటలు పండే భూములిచ్చి.. ఇప్పుడు నెత్తిన చేయి పట్టుకున్న రైతులే, అమరావతిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్కారుకు.. ఎదురొడ్డి పోరాడుతున్న వేలాది మంది రైతులు, వారి పక్షాన పోరాడుతున్న ఒక సుంకర పద్మశ్రీ, మరో వెగలపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పువ్వాడ సుధాకర్, ఇంకో మార్టిన్, కంభంపాటి శిరీష, దుర్గాభవానీ, అక్కినేని వనజ వంటి జేఏసీ నేతలే, ఇప్పుడు అమరావతి కథలో హీరోలు. మరి వారంతా హీరోలయితే.. మోదీ-చంద్రబాబు-జగన్‌తోపాటు, అమరావతి గ్రామాలలో వీరవిహారం చేసి.. ఆడబిడ్డ తెచ్చుకున్న టిఫిన్ బాక్సులో ఉప్మా తిని, చివరాఖరకు కమలంతో చేతులు కలిపి.. ఇప్పుడు ఉద్యమాన్ని కాడికిందపడేసిన, జనసేన వీరుడు పవన్ సంగతేమిటన్న సందేహం రావచ్చు. ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కు! అది మీ ఇష్టం!!
-మార్తి సుబ్రహ్మణ్యం