50 వేల కోట్ల విలువైన భూ వివాదానికి 80 ఏండ్ల చరిత్ర!
8 దశాబ్దాలు... 12 హత్యలు.. 80 సర్వే నెంబర్ .. 867 ఎకరాల ల్యాండ్ .. 50,000 కోట్ల రూపాయలు. హైదరాబాద్ లో సంచలనం బోయినపల్లి కిడ్నాప్ కేసుకు కారణమైన న్యూహఫీజ్‌పేట భూ వివాదం చరిత్ర ఇది. హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 80లోని భూమి దశాబ్దాలుగా వివాదాల్లో ఉంది. కోర్టు కేసులతో కొనసాగుతూనే ఉంది. హత్యలు-ప్రతి హత్యలతో దాదాపు డజను మందిని ఈ భూమి బలిగొన్నది. దశాబ్దాల క్రితం రూ. వేలల్లో విలువ ఉన్నప్పుడు ప్రారంభమైన వివాదం.. ఇప్పుడు ఆస్తి విలువ వేల కోట్లకు చేరుకున్నా కొలిక్కి రాలేదు.
శేరిలింగంపల్లి మండలం న్యూహఫీజ్‌పేట సర్వే నంబర్ 80లోని భూములపై ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య మొదట వివాదం కొనసాగింది. మార్తాండ్‌నగర్ వెనుకవైపు, కొండాపూర్ అంతర్గత రహదారి మధ్యలో ఉన్న ఓ 40 నుంచి 50 ఎకరాల భూమి తమదేనంటూ దివంగత మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి గతంలో చుట్టూ ప్రహరీ నిర్మించి రేకులతో ఫెన్సింగ్ వేశారు. భూముల చుట్టూ వేసిన ఫెన్సింగ్ రేకులపై తొలుత ఏవీ ఎస్టేట్స్ అని బోర్డులు పెట్టారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆ బోర్డులు తొలగించి కేపీ ఎస్టేట్స్ అని పేరు మార్చారు. ఈ బోర్డుల ప్రకారం ప్రస్తుతం కిడ్నాపునకు గురైన కె.ప్రవీణ్‌రావు పొజిషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు ఏవీ ఎస్టేట్స్‌గా ఉన్న పేరు ఆయన చనిపోయాక కేపీ ఎస్టేట్స్‌గా మారిందని స్థానికులు అంటున్నారు. హఫీజ్‌పేట్‌లోని 50 ఎకరాల భూమి తమదేనని మాజీ మంత్రి భూమా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భూమా కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై ఏపీ, తెలంగాణలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెబుతున్నారు. తమ భూమిని కబ్జా చేసి మైహోమ్స్‌కు లీజ్‌కు ఇచ్చారని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వివాదం జరుగుతున్న హఫీజ్‌పేట స్థలంలో తనకు 40 శాతం వాటా ఉన్నట్లు పోలీసుల విచారణలో భూమా అఖిలప్రియ చెప్పినట్లు తెలిసింది. మిగతా భూమిలో 30 శాతం సుబ్బారెడ్డికి, మిగతా 30 శాతం ప్రవీణ్‌కు చెందుతుందని ఆమె వివరించినట్లు సమాచారం.
నిజాం రాష్ట్ర రైల్వే నిర్మాణ సమయంలో ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఖుర్షీద్ జాహీ పాయ్‌గా, చావూస్, నవాబ్ వంశీయులకు చెందిన భూములను నిజాం ప్రభుత్వం సేకరించింది. ఆ ఆస్తులకు ప్రత్యామ్నాయంగా.. హఫీజ్‌పేట్ సర్వేనంబర్ 80, హైదర్‌నగర్‌లో భూములను కేటాయిస్తూ.. 1929లో ఏడో నిజాం మీర్-ఉస్మాన్ అలీఖాన్ ఫర్మాన్ జారీ చేశారు. జాగీర్దారీ వ్యవస్థ రద్దయ్యాక ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై 1958లో పాయ్‌గా వారసుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకొందరు తమ వాటా భూములను గ్రేటర్ గోల్కొండ వారసులకు అగ్రిమెంట్ చేశారు. ఆ సమయంలో నిజాం ప్రభువే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు ఉన్న లింక్ డాక్యుమెంట్‌ను జత చేశారు. అప్పటినుంచే ఈ భూమిపై సీఎస్-14/1958 కేసు న్యాయస్థానంలో మొదలైంది. 1968 జూన్ 28న హైకోర్టు ఈ భూములపై ప్రిలిమినరీ డిక్రీని ఇచ్చింది. అయితే ప్రిలిమినరీ డిక్రీ వచ్చాక.. హక్కుదారులెవరూ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదు. కొండలు, గుట్టలు, అడవి మాదిరిగా ఉన్న ఈ భూముల్లో అసైన్‌మెంట్ డీడ్ చేసుకునేందుకూ ఆసక్తి చూపలేదు. దాంతో. ఆ సర్వే నంబర్-80లోని భూములన్నీ సర్కారువేనని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈ మేరకు పలు కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేసింది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కూడా ఈ భూములన్నీ సర్కారువేనని పేర్కొంటూ వాటిని నిషేధిత జాబితాలో పెట్టింది.
పాత ముంబై జాతీయ రహదారి, కొత్త ముంబై జాతీయ రహదారికి మధ్య ఈ ప్రాంతం వారధిగా ఉండడం.. కొండాపూర్‌లో 8వ బెటాలియన్ ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఏర్పాటవడంతో పాయ్‌గా, చావూస్ వారసులు సర్వే నంబర్-80లోని భూముల్లో ఎవరికి వారుగా కాలనీలు, ప్లాట్లు ఏర్పాటు చేసి, విక్రయాలు సాగించారు. అలా 1983-84లో సుభాష్ చంద్రబోస్ నగర్ పేరుతో వెంచర్‌ను అభివృద్ధి చేసిన కబీరుద్దీన్ ఖాన్ రూ. 15లకు గజం చొప్పున భూములను విక్రయించారు. అదే సమయంలో.. ప్రేమ్‌నగర్, మార్తాండనగర్ పేరుతో ఇస్మాయిల్, పాయ్‌గా కాలనీ పేరుతో పాయ్‌గా వారసులు, మరికొన్ని పేర్లతో చావూస్ వారసులు ప్లాట్లను విక్రయించారు. 30.31 ఎకరాలను ఓ 30 మంది వ్యక్తులు క్లెయిమ్ చేస్తూ రాగా.. 116 ఎకరాలను బి.శివరామకృష్ణ, సి.కల్యాణ్, మరో వ్యక్తి, ముంబైకి చెందిన సైరస్ ఇన్వె్‌స్టమెంట్స్ క్లెయిమ్ చేస్తూ వచ్చింది. కొన్ని భూములు చేతులు మారుతూ వచ్చాయి.
కొండాపూర్ ప్రాంతంలో 1990 తొలినాళ్లలో శిల్పారామం రావడం.. ఆ తర్వాత హైటెక్‌సిటీ నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో కోర్టుల్లో వివాదాలకు పరిమితమైన ఈ భూమి.. హత్యలు-ప్రతి హత్యలకు వేదికగా మారింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా.. అధికార, ప్రతిపక్షాల నేతలు కబ్జాలకు పాల్పడ్డారు. 1989లో సాబేర్ చావూ్‌సను అతడి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సాబేర్ తండ్రి.. తన ప్రత్యర్థులపై బేగంబజార్‌లో బాంబుతో దాడి చేయించాడు. తుపాకీతో ఫైర్ చేయించారు. 1997లో రియల్టర్ హరిబాబు హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మాదాపూర్‌లో అబూబకా్‌సను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. ఇప్పుడు భూమా అఖిలప్రియ-ప్రవీణ్‌కుమార్ మధ్య వివాదంలో ఉన్న భూమిలో.. శేఖర్‌నాయుడు అనే రియల్టర్‌ను ప్రభాకర్‌రాయుడు అనే వ్యక్తి 2005లో హత్య చేయించాడు. ఆ తర్వాత ప్రభాకర్ రాయుడు పంజాగుట్టలో హత్యకు గురయ్యాడు. తాజాగా ప్రవీణ్‌కుమార్, అతడి సోదరుల కిడ్నాపయ్యారు. కొందరు రియల్టర్లల ఈ భూములను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. తప్పుడు కేసులతో.. సెటిల్మెంట్ డిక్రీలు పొంది.. వాటి ఆధారంగా మ్యుటేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందినదని 2003లో సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో వివాదం రాజుకుందంటున్నారు.
ప్రవీణ్ రావు కిడ్నాప్ తో హఫీజ్ పేట భూములు మళ్లీ తెరపైకి రావడంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య సంచలన ఆరోపణలు చేశారు. మియాపూర్, హఫీజ్ పేటలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు రాజకీయ నేతల కబ్జాల్లో ఉన్నాయన్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్. సినీ నిర్మాత సీ కల్యాణ్, ఐ సుదర్శన్ రావులు ఈ భూముల కబ్జా వెనక ఉన్న పెద్దలని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రికి భూకబ్జాల్లో పాత్ర ఉందని గాదె ఇన్నయ్య ఆరోపించారు. మెదక్, మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 మంది వెలమ దొరలు.. 50 వేల కోట్ల విలువైన భూములను తమ చేతుల్లో ఉంచుకున్నారని గాదె ఇన్నయ్య సంచలన ఆరోపణలు చేశారు.