పెరిగిన నేరాలు, ఘోరాలు! క్రైమాంధ్రగా మార్చేశారా?
posted on Nov 4, 2020 @ 1:11PM
మూడు మర్డర్లు.. ఆరు అత్యాచారాలు.. పన్నెండు కిడ్నాపులు.. 24 దోపిడీలు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి. కొన్ని నెలలుగా ఏపీలో క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోయింది. మహిళల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కామంతో కొందరు, ప్రేమ పేరుతో మరికొందరు మహిళలపై దాడులు చేస్తున్నారు. కిరాతకంగా చంపేస్తున్నారు. పసి పిల్లలను కూడా వదలడం లేదు కిరాతకులు. కిడ్నాపులకైతే అంతే లేకుండా పోతోంది. చోరీలు, దొమ్మీల గురించి ఇక చెప్పనవరమే లేదు. మొత్తంగా దేశ వ్యాప్తంగా నమోదవుతున్న ఐపీసీ కేసుల్లో టాప్ లో నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. ఇదే ఇప్పుడు ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. నవ్యాంధ్ర కాస్త క్రైమాంధ్రగా మారిపోయిందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ గాజువాకలో వరలక్ష్మి అనే విద్యార్థినిని ఇటీవలే దారుణ హత్యకు గురైంది. నగరం నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి దారుణానికి ఒడిగట్టాడు కిరాతకుడు. దానికి కొన్ని రోజుల ముందే విజయవాడలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి చంపేశాడు. గత నెల9న కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్సార్‌సీపీ నేత సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సుబ్బరాయుడిని.. కర్రలతో దాడి చేసి కొట్టి చంపారు దుండగులు. జూన్ 29న మచిలిపట్నంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు మోకా భాస్కరారావు హత్య జరిగింది.మునిసిపల్ చేపల మార్కెట్లో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అతన్ని పొడిచి చంపారు.ఇవీ ఇటీవల జరిగిన దారుణాలు. ఇలాంటి ఘటనలు గత ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూనే ఉన్నాయి. రోజు ఏదో ఒక చోట దారుణం జరుగుతూనే ఉంది. గతంలో కంటే మహిళలపై క్రైమే రేట్ పెరగడం మరింత ఆందోళన కల్గిస్తోంది.
2020 మొదటి ఆరు నెలల్లో ఏపీలో 18 వేల 438 ఐపీసీ కేసులు నమోదయ్యాయి. ఏపీలో నమోదవుతున్న క్రైమ్ కేసుల్లో మహిళలపై వేధింపులు మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. జూన్ వరకే 584 రేప్ కేసులు వచ్చాయంటే ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. 359 హత్య కేసులు రాగా, 289 అల్లర్ల కేసులు రికార్డయయ్యాయి. 325 కిడ్నాప్ మరియు అపహరణ కేసులు, 584 అత్యాచార కేసులు నమోదయ్యాయి. డబ్బుల కోసం 14 హత్యలు జరిగినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే 14 దోపిడీలు, 103 దొంగతనాలు జరిగాయి. 1,483 చోరీలు, 3,935 సాధారణ దొంగతనాలు, గృహ విచ్ఛిన్నం కేసులు నమోదయ్యాయి. 8,057 హర్ట్ కేసులు, చిన్న కేసులు, 2,873 మోసం కేసులు, 394 క్రిమినల్ ఉల్లంఘన కేసులు మరియు ఎనిమిది నకిలీ కరెన్సీ నోట్లు పోలీసుల క్రైమ్ రికార్డుల్లో ఉన్నాయి.
మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన నివేదికలో ఉంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు 6,454 చోటుచేసుకోగా అందులో 1,892 ఏపీలోనే జరిగాయని పేర్కొంది. పనిప్రదేశాల్లో, ప్రజారవాణాలో ఈ ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని నివేదికలో చెప్పింది. మానవ అక్రమ రవాణా కేసుల్లోనూ మహారాష్ట్ర తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉంది. అయితే లాక్డౌన్ సమయంలో మహిళలపై నేరాలు మరియు హత్యలు ఎక్కువగా పెరిగాయి. కోవిడ్ -19 లాక్ డౌన్ అమలు చేయడానికి భారీ పోలీసు బలగాలను మోహరించడం. లాక్డౌన్ సమయంలో పోలీసు స్టేషన్లు సాధారణ ఫిర్యాదులను అంగీకరించలేదని అందుకే మహిళలపై దాడులు పెరిగిపోయాయని పోలీసులు చెబుతున్నారు.
అంధ్రప్రదేశ్ లో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరహా నేరాల రేటు జాతీయ స్థాయిలో కంటే ఏపీలోనే అత్యధికంగా ఉందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక ఇచ్చింది. ఎస్సీలపై నేరాలకు సంబంధించి 2018లో 1,836 కేసులు నమోదుకాగా 2019లో ఆ సంఖ్య 2,071కు చేరింది. 12.79శాతం మేర పెరిగినట్టు స్పష్టం చేసింది.. ఆంధ్రప్రదేశ్‌లో 84.5 లక్షల మంది ఎస్సీ జనాభా ఉండగా..లక్ష మంది జనాభాకు 24.5 నేరాలు జరిగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 4.5శాతం ఏపీలోనే జరుగుతున్నాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ కక్షలు నేపథ్యంలోనో.. ఇతర పార్టీల సానుభూతిపరులనే కారణంతోనో.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనో.. ఇలా వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్నాయి.
దళితులపై దాడులు పెరగడమే కాదు తర్వాత వారికి న్యాయం చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. న్యాయం కోసం వెళ్లిన బాధిత దళితులకు పోలీస్ స్టేషన్లలో వేధింపులు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దళితులపై పోలీసులు దాడులు పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. జూలై 22న ముసుగు ధరించలేదని, మద్యం తాగి వాహనం నడుపుతున్నాడని ప్రకాశం జిల్లా చీరాలలో ఒక దళిత యువకుడిని పోలీసులు కొట్టారు. కొన్ని రోజులకు ఆ యువకుడు చనిపోయారు. పోలీసుల కొట్టిన దెబ్బల వల్లే యువకుడు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దళితుడైన జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపై అనంతపురం జిల్లాలో ఇటీవల దాడి జరిగింది. ఒక జడ్జీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉంటే.. మిగితా దళితుల భద్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.దళితులపై దాడుల అంశమే కాదు.. ఆర్థిక, సైబర్ నేరాలు, వృద్ధులు, మహిళలపై నేరాల్లోనూ గతంతో పోలిస్తే గణనీయ వృద్ధి పెరిగింది.
తెలంగాణలో జరిగిన దిశ ఘటన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. దిశ యాక్ట్ ప్రకారం 21 రోజుల్లోనే నిందితులను పట్టుకొని విచారించి తగిన శిక్ష వేయాలి. ఈ దిశగా ప్రభుత్వం యాక్ట్ ను తీసుకొచ్చింది. దిశ బిల్లుతో పాటు దిశ మొబైల్ అప్లికేషన్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకుంది. స్పందన, మహిళా మిత్ర, సైబర్ మిత్ర, మహిళా పోలీస్ వంటి కార్యక్రమాలను మహిళలు, బాలికలపై నేరాలకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంది. దీంతో క్రైమ్ రేట్ తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ తగ్గకపోగా ఈ విషయంలో పెరిగిపోయింది. ఈ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నది. ఐదు నెలల్లో ఏడువేలకు పైగా మహిళలపై వేధింపులు, అత్యాచారాల కేసులు నమోదవుతున్నాయి అంటే రాష్ట్రంలో క్రైమ్ హిస్టరీ ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్ రేట్ ఊహించని స్థాయిలో పెరదడం జనాల్లో ఆందోళన పెంచుతోంది. జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న దిశా చట్టం చట్టబండలైందా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దిశా పోలీస్ స్టేషన్లు దిక్కు లేకుండా పోయాయని మండిపడుతున్నారు. ఈ నేరాలు, ఘోరాలను భరించాల్సిందేనా అని ప్రభుత్వాన్ని , పోలీసులను నిలదీస్తున్నారు ప్రజలు.దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. చట్టాలు చేశామని చేతులు దులుపుకుంటే ఏమిటి ప్రయోజనం అని పేర్కొన్నారు. దిశ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలులోకి తెచ్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు.. వరుసగా జరుగుతున్న ఘటనలకు బాధ్యతగా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ ఇప్పటికైనా జగన్ సర్కార్ మెల్కోని నేరాలు, ఘోరాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుందాం..