జగన్ పరువు తీస్తున్న పోలీసులు!

రైతన్న చేతికి బేడీలా? సిగ్గుచేటు

 

యాక్షన్ చేయమంటే ఓవరాక్షన్ చేస్తున్నారా?

 

వైసీపీ నేతల సీరియస్

 

జగన్‌కు విపక్షం నుంచి ఇప్పట్లో ప్రమాదం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఇప్పుడు జూమ్‌లో జీవిస్తోంది. మిగిలిన పక్షాలు ప్రకటనలతో జీవించేస్తున్నాయి. అయినా.. జగన్ పాలనపై జనంలో వ్యతిరేకత పెరగడం ఆశ్చర్యమే కదా? మరి విపక్షాలన్నీ బలహీనంగా ఉంటే, జగన్‌కు ఇక సమస్య ఏమిటి? అన్నదే కదా సందేహం. యస్. జగన్ సర్కారు పాలిట అధికారులే విపక్షాలు. వారే ఇప్పుడు ఆయనకు ఓ పెద్ద సమస్య.

 

జగన్ సీఎం అయిన తర్వాత, పోలీసు ‘పవరు’ పెరిగింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగు పెట్టిన వారిపై, టీడీపీ సర్కారు కేసులు పెడితే, విపక్ష నేతగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి దానిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్వేచ్ఛ కూడా లేదా అని వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఐడీని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావన కల్పించడంలో, పోలీసులు విజయం సాధించారు.

 

గ్రామాల్లో విపక్షాలకు చెందిన కార్యకర్తలు, గ్రామం విడిచిపోయేలా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక అధికార పార్టీ నేతల మెహర్బానీ కోసం పోలీసుస్టేషన్లే వేదికగా, శిరోముండనాలు చేస్తున్న దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్-టీడీపీ పాలించినా.. పోలీసులు, ఈ స్థాయి ఓవరాక్షన్ చేసిన దాఖలాలు లేవు. అధికార పార్టీకి 60 శాతం సానుకూలంగా పనిచేస్తే, ప్రతిపక్షాలకు 40 శాతం సానుకూలంగా ఉండేవారు. గ్రామస్థాయిలో కక్షలు, ముఠా తగాదాల నేపథ్యంలో హత్యాకాండలు మాత్రమే చూశాం.

 

కానీ, గత 17 నెలల నుంచి ఇవన్నీ మారిపోయాయి.. జర్నలిస్టులను కూడా కేసులు, సీఐడీ విచారణ పేరిట వేధించడం చూస్తున్నాం. టీవీ5 జర్నలిస్టు మూర్తి, తెలుగువన్ అధినేత రవిశంకర్‌ను వేధించిన సందర్భాల్లో, వారికి కోర్టులే దిక్కయ్యాయి. ఇక అమరావతి ఉద్యమాన్ని కవర్ చేస్తున్న విలేకరులపై కులం పేరుతో దూషించిన కేసులు పెట్టి, కోర్టులో అభాసుపాలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోలీసుల స్థాయి చిన్నదయిపోతుంది. అది వారి గౌరవానికే భంగకరం.

 

ఇప్పుడు పోలీసుల ఓవరాక్షన్.. రైతుల చేతికి బేడీలు వేసేవరకూ వెళ్లడం ద్వారా, నిరంకుశత్వం పరాకాష్టకు చేరినట్లే లెక్క. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు చేతికి, బేడీలు వేసిన చిత్రాలు చూసిన రైతన్న గుండె కాలిపోయింది. ఆత్మగౌరవరం దెబ్బతింది. రైతులలో రాజకీయ పార్టీలకు అభిమానులు ఉండవచ్చు. కానీ రైతు ఎక్కడైనా రైతే. రైతు ఆత్మగౌరవానికి మాత్రం పార్టీలుండవు.

 

సాటి రైతు చేతికి బేడీలు వేసిన పోలీసు చర్యతో, నిజమైన రైతు ఆత్మాభిమానం ఎందుకు దెబ్బతినకుండా ఉంటుంది? దేశద్రోహులకు జైళ్లలో బిర్యానీలు పెట్టి, తెగమేపుతున్న ఈ కాలంలో.. బ్యాంకులకు వందలు, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి, కాలరెగరేసిన వారికి రెడ్‌కార్పెట్ వేస్తున్న ఈ రోజుల్లో..చట్టంలో లొసుగులను ఆసరా చేసుకుని, వైట్‌కాలర్ నేరగాళ్లు, హంతకులు దర్జాగా తిరుగుతున్న ఈ రోజుల్లో.. సేద్యం చేసుకునే తోటి రైతు చేతులకు బేడీలు వేస్తే, రైతాంగం మనసు మండకుండా, నవరంధ్రాలు మూసుకుంటాయని భావించడమే వెర్రితనం.

 

అసలు నిందితుల చేతికి బేడీలు ఏ దశలో వేయాలి? ఏ రకమైన నేరస్తుల చేతికి మాత్రమే అవి ఉండాలి? అసలు మానవహక్కుల గురించి జ్ఞానం లేని పోలీసులు చేసిన ఓవరాక్షన్‌కు, జగన్ సర్కారు పరువుపోయిందన్నది వైసీపీ నేతల ఆందోళన. సాధారణ రైతు చేతికి బేడీలు వేసిన ఫొటోలు, సోషల్ మీడియాలో వస్తే.. సర్కారు పరువు గంగలో కలసిపోతుందని తెలియని వారి చేతిలో, పోలీసు వ్యవస్థ ఉండటం దారుణమని వైసీపీ నేతలు మొత్తుకుంటున్నారు.

 

పోలీసులను యాక్షన్ చేయమంటే, ఓవర్ యాక్షన్ చేస్తున్నారని.. వారివల్లనే తమ ప్రభుత్వం పరువుపోతోందని, వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసు ఓవరాక్షన్ వల్ల డీజీపీ, స్వయంగా రెండుసార్లు హైకోర్టు గడప తొక్కాల్సిన దుస్థితి కూడా, కిందిస్థాయి పోలీసులలో మార్పు తీసుకురాకపోవడమే విచిత్రం. ఇప్పుడు రైతులకు బేడీలు వేసిన పోలీసు ఓవరాక్షన్‌తో జగన్ ప్రభుత్వం, రైతుల ముందు ముద్దాయిగా నిలబడాల్సిన దుస్థితి వచ్చిందంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి రాజకీయంగా కొత్త అస్త్రం ఇచ్చినట్టయిందని వాపోతున్నారు.

 

‘రైతుల చేతికి సంకెళ్లు వేయమని జగన్ ఎందుకు చెబుతారు? మొన్న సర్వే రాళ్లకు, జగన్ ఫొటో వేసిన విషయం ఎవరికీ తెలియదు. అధికారులే ఓవరాక్షన్ చేశారు. అది తెలిసి మందలించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అంటే అది జగన్‌కు తెలియకుండానే జరిగిందని తేలింది కదా? తన ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని ఏ సీఎం అయినా కోరుకుంటారా? ప్రభుత్వం దగ్గర మార్కులు కొట్టేయాలన్న ఓవరాక్షన్‌తోనే ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్లనే, హైకోర్టు దృష్టిలో మేం చులకన అవుతున్నాం. ఇప్పుడు ఆ పోలీసులను సస్పెండ్ చేయవచ్చు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా? ఆ నష్టాన్ని పోలీసులు మళ్లీ భర్తీ చేయగలరా?’ అని ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిజమే కదా?.. తన ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవాలని, ఏ పాలకుడు మాత్రం కోరుకుంటారు?

-మార్తి సుబ్రహ్మణ్యం