‘కమలం’ కోర్ కమిటీపై కిరికిరి!
posted on Nov 6, 2020 @ 3:36PM
సునీల్-మధుకర్ ఏం చేస్తున్నట్లు?
సస్పెన్షన్లు, సమావేశాలపై చర్చించరేం?
సొంత నిర్ణయాలపై నేతల సీరియస్
క్రమశిక్షణ ఆరోప్రాణంగా చెప్పబడే భారతీయ జనతా పార్టీలో.. ఇప్పుడు అదే లోపించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమిష్ఠి నిర్ణయాల స్ధానంలో, ఒకరిద్దరు తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్లతోపాటు, కొత్తగా పార్టీలో చేరిన నేతలు భగ్గుమంటున్నారు. పార్టీపరంగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్న నాయకత్వం, వివాదాల్లో మాత్రం శరవేగంగా దూసుకుపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా.. కోర్ కమిటీ రూపకల్పన, ఆ పేరుతో పిలుస్తున్న ఆహ్వానితుల జాబితాపై పార్టీ ఎంపీలు సైతం రుసరుస లాడుతున్నారు.
ఏపీ బీజేపీలో లుకలుకలు పెరుగుతున్నాయి. సస్పెన్షన్లు, మీడియా చర్చలకు వెళ్లే ప్రతినిధుల జాబితా కూర్పుపై.. రాష్ట్ర అధ్యక్షుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోము వీర్రాజు అధ్యక్షడయి చాలాకాలమయింది. అయినా ఇప్పటివరకూ, కోర్ కమిటీ కూర్పుపై.. సీనియర్లతో సమావేశం నిర్వహించకపోవడంపై, అగ్రనేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కోర్ కమిటీ ఏర్పాటుచేస్తే, అందులో కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏకపక్ష నిర్ణయాలకు అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్లనే, కోర్ కమిటీ ఏర్పాటుచేయకుండా, కేవలం ఒకరిద్దరే స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.
కోర్ కమిటీ ఏర్పాటుచేస్తే, అందులో తమ నిర్ణయాలను ప్రతిఘటన ఉండే ప్రమాదం ఉన్నందున, సాధ్యమయినంత వరకూ ఆలస్యం చేసి, ఈలోగా కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ముగ్గురు ఎంపీలు రాష్ట్ర నాయకత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందున, వారిని కోర్ కమిటీలో లేకుండా చూసేందుకే ఆలస్యం చేస్తున్నారంటున్నారు.
ఇటీవల విశాఖలో ఏర్పాటుచేసిన కోర్ కమిటీ సమావేశానికి.. యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావును మాత్రమే పిలిచి, రాష్ట్ర ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆహ్వానించకపోవడం వివాదానికి దారితీసింది. అసలు సాంకేతికంగా ఏపీతో ఏమాత్రం సంబంధం లేని జీవీఎల్, కోర్‌మిటీలో ఎలా సభ్యుడవుతారన్న ప్రశ్నలు వినిపించాయి. ఇన్చార్జి సునీల్ దియోధర్, సంఘటనా కార్యదర్శి నూకల మధుకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కేవలం జీవీఎల్ సూచనల ప్రకారం పనిచేస్తున్నారని, ప్రస్తుతం పార్టీని జీవీఎల్లే నడిపిస్తున్నారన్న వ్యాఖ్యలు, పార్టీ నేతల అంతర్గత సమావేశాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త కమిటీ వేయనందున, గతంలో వేసిన కోర్ కమిటీ ఇప్పుడు పనిచేస్తుందా? లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కోర్‌కమిటీలో సబ్ కమిటీ వేసి, మళ్లీ దానిపై ఇంకో మినీ కోర్ కమిటీ వేసినట్లున్నారన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇటీవలి విశాఖ భేటీలో.. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ వ్యాఖ్యలు చర్చకు వచ్చాయట. ఆమెను ఓ ప్రధాన కార్యదర్శి విమర్శించడం మంచిదికాదని, మహిళలకు గౌరవం ఇవ్వాలని, భేటీలో పాల్గొన్న పురందీశ్వరి మందలించారట. అయితే అక్కడే ఉన్న రాష్ర్ట ఇన్చార్జి సునీల్ దియోధర్ మాత్రం, అందుకు భిన్నంగా.. ప్రధానిని వాడు, వీడు అని సంబోధించినా ఎవరూ స్పందించలేదని, ఒక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాత్రమే స్పందించారని మెచ్చుకున్నారట. అయితే అసలు సుంకరపద్మశ్రీ ప్రధానిని దూషిస్తూ, ఏ పత్రికలు, చానెళ్లలో వచ్చిందో తాము చూడలేదని, ఆ పేరుతో ప్రధాన కార్యదర్శి మహిళను దూషిస్తే, ఆయనను సునీల్ సమర్థించడంపై నేతలు విస్మయం వ్యక్తం చేశారట.
ఇక పార్టీ వాణి బలంగా వినిపించే ఓవి రమణ, వెలగపూడి గోపాలకృష్ణ, తాజాగా లంకాదినకర్‌ను సస్పెండ్ చేసిన సందర్భంలో.. నాయకత్వం తమను సంప్రదించకపోవడంపై సీనియర్లు, ఎంపీలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ ముగ్గురు చేసిన తప్పేమిటో చెప్పకుండా, నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా.. ఏకంగా సస్పెండ్ చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. వీరిలో రమణ,అమరావతిపై పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలనే పత్రికలో వ్యాసం రాయగా, ఆయనపై వేటు వేశారు. ఇక పార్టీ ఆఫీసుకు వెయ్యి గజాల స్థలం ఇచ్చి, ఆఫీసు కూడా నిర్మించేందుకు సిద్ధమయిన వెలగపూడి గోపాలకృష్ణ, తనను తాను చెప్పుతో కొట్టుకుంటే.. ఆయనపైనా వేటు వేశారు.అయితే.. ఆయనను వెంటనే జాతీయ హిందూమహాసభకు, రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో బీజేపీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది.
జాతీయ మీడియాలో పార్టీ వాణిని, సమర్థవంతంగా వినిపిస్తున్న లంకా దినకర్‌పై వేటు వ్యవహారమయితే.. ఢిల్లీ వరకూ వెళ్లింది. జాతీయ నాయకులు సైతం ఆయనపై వేటు వార్త విని ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఇద్దరు ఎంపీలు కూడా.. దీనిపై అధ్యక్షుడు నద్దా, పార్టీ సంఘటనా జాతీయ ప్రధాన కార్యదర్శి, సంయుక్త ప్రధాన కార్యదర్శికీ ఫిర్యాదు చేశారట. స్వయంగా నద్దా సమక్షంలోనే పార్టీలో చేరిన లంకాదినకర్ వంటి వారికే దిక్కు లేకపోతే, ఇక తమ పరిస్థితి ఏమిటని, ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు బిక్కుబిక్కుమంటున్నారట.
నిజానికి జాతీయ మీడియాలో కనిపించే జీవీఎల్ కంటే, దినకర్ వాదనలోనే ఎక్కువ రుజువులు, ఆధారాలుంటాయన్న ప్రశంసలు వినిపిస్తుంటాయి. బహుశా దినకర్‌కు అదే శాపంగా మారిందన్న వ్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు. ప్రధానంగా.. టీడీపీ నుంచి చేరిన కమ్మ వర్గానికి చెందిన నేతలను, ఒక వ్యూహం ప్రకారం వెళ్లగొడుతున్నారన్న ప్రచారం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.
ఇక వివిధ చానెళ్ల చర్చలకు వెళ్లే ప్రతినిధుల జాబితాపైనా, పార్టీ వర్గాల్లో వెటకారపు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సోమనాధ్ ఆలయం ఎక్కడుందో కూడా చెప్పలేని వారిని, టీవీ చర్చలకు ప్రతినిధులుగా ఎంపిక చేసిన, పార్టీ మేధావులను మెచ్చుకోవాల్సిందేనంటున్నారు. అసలు ఆ జాబితాలో ముప్పావుశాతం మందికి, ఇప్పటిదాకా చానెళ్లలో చర్చలకు వెళ్లిన అనుభవమే లేదని గుర్తు చేస్తున్నారు. మంత్రిగా పనిచేసిన రావెల కిశోర్‌బాబు, ఆదినారాయణరెడ్డి వారితో నిత్యం మీడియా ప్రతినిధులు మట్లాడుతుంటారు. కానీ వారికి ఇప్పుడు గొంతు విప్పే అవకాశం లేకుండా పోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాయలసీమలో ఒకస్థాయిలో ఇమేజ్ ఉన్న ఆదినారాయణరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి స్థానం లేకుండా పోవడం ఏమిటంటున్నారు. టీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు కాలం నుంచీ, పార్టీ వాణిని సమర్ధవంతంగా వినిపిస్తున్న పురిఘళ్ల రఘురాం వంటి.. సీనియర్ నాయకుడినే జాబితా నుంచి తప్పించడంపై, పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సునీల్ దియోధర్ ఆయనకు, ప్రాధాన్యం తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ నాయకత్వంతో సన్నిహితంగా ఉండటంతోపాటు, ఏపీ-తెలంగాణకు చెందిన పార్టీ నేతలకు ఢిల్లీలో ఏళ్లతరబడి.. సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రఘురాం లాంటి వంటి కార్యదక్షులనే పక్కకుపెడితే, ఇక మామూలు నేతల సంగతేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పార్టీని చక్కదిద్దాల్సిన రాష్ట్ర పార్టీ సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డిజీ, ఆ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తన విచక్షణ వినియోగించడం మానే సి, కేవలం ఇద్దరు ముగ్గురు నేతల ఆలోచన ప్రకారమే, నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్‌డి విల్సన్, పురిఘళ్ల రఘురాం, లంకా దినకర్‌పై సస్పెన్షన్- నోటీసులివ్వాలని సునీల్ దియోధర్ చే సిన ఒత్తిళకు, మధుకర్‌రెడ్డి గట్టిగా సమాధానం ఇవ్వలేకపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
-మార్తి సుబ్రహ్మణ్యం