ఓడిన కార్పొరేటర్ల వసూళ్ల పర్వం! గ్రేటర్ లో కొత్త పంచాయితీ
posted on Dec 17, 2020 @ 11:57AM
తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం ముగిసింది. ఫలితం కూడా వచ్చేసింది. కాని ఇంకా కొత్త బల్దియా కొత్త పాలక మండలి కొలువు దీర లేదు. ప్రస్తుత పాలక మండి గడువు వచ్చే ఫిబ్రవరి వరకూ ఉంది. దీంతో గ్రేటర్ లో అనుకున్న ఫలితాలు సాధించని అధికార పార్టీ.. కొత్త పాలక మండలి ఏర్పాటుపై ఆచితూచి స్పందిస్తోంది. ఫిబ్రవరి వరకూ పాత టీమ్ నే కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఇదే ఇప్పుడు జీహెచ్ఎంసీలో పెద్ద సమస్యగా మారింది. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్ కార్పొరేటర్లు అక్రమ దందాలకు తెర తీశారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయామనే కసితో ఉన్న పాత కార్పొరేటర్లు.. తమకు మరో రెండు నెలలు అధికారం ఉండటంతో రెచ్చిపోతున్నారట. అందినకాడికి దోచుకుంటున్నారట. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేశారనే అనుమానం ఉన్న వ్యక్తులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. తమకు సహకరించే అధికారులతో కలిసి తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని పాత కార్పొరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
డివిజన్లలో పాత కార్పొరేటర్లు, కొత్తగా గెలిచిన కార్పొరేటర్ల మధ్య పంచాయితిలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన చోట ఈ సమస్య లేదు. పాతబస్తిలో తన స్థానాలను ఎంఐఎం నిలుపుకుంది కాబట్టి అక్కడ కూడా పెద్ద ఇబ్బంది లేదు. కాని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన డివిజన్లలో మాత్రం ఇలాంటి గొడవలు ముదురుతున్నాయి. ఫిబ్రవరి వరకూ తమదే అధికారమని టీఆర్ఎస్ పాత కార్పొరేటర్లు చెబుతుండగా.. ఎన్నికల్లో గెలిచిన తమకే ఆ అధికారం ఉంటుందని విపక్ష నేతలు వాదిస్తున్నారు. పాత, కొత్త కార్పొరేటర్ల మధ్య గొడవలతో బల్దియా అధికారులు నలిగిపోతున్నారని తెలుస్తోంది. బీజేపీ కార్పొరేటర్లు ఎక్కువగా గెలిచిన ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్ , సనత్ నగర్, అంబర్ పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం11 డివిజన్లు ఉండగా .. అన్ని డివిజన్లను బీజేపీ గెలుచుకుంది . 2016 ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసింది. ఇక్కడ టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉండటంతో ఆయన పాత కార్పొరేటర్లకు మద్దతుగా ఉంటున్నారు. దీంతో బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఓడించిన కార్పొరేటర్లు ఇంకా డివిజన్ లో పెత్తనం చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ముషిరాబాద్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. 2016 లో నియోజకవర్గంలోని 6 డివిజన్లకు 5 డివిజన్లను టీఆర్ఎస్, ఒక డివిజన్ ను ఎంఐఎం కైవసం చేసుకున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 5 డివిజన్లను బీజేపీ గెలుచుకోగా ఒక డివిజన్ ను ఎంఐఎం నిలబెట్టుకుంది. ఇక్కడ కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో డివిజన్లలో పెత్తనం కోసం పాత కార్పొరేటర్లకు, కొత్త కార్పొరేటర్లకు అధికారం కోసం ఆదిపత్య పోరు జరుగుతోంది. ఎమ్మెల్యే అండతో అధికార పార్టీ పాత కార్పొరేటర్లే అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గోషామహల్ నియోజకవర్గంలో ఈ గొడవ తారా స్థాయికి చేరింది. గోషా మహల్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉండగా తాజా ఎన్నికల్లో బీజేపీ ఐదు డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి చెందిన రాజాసింగ్ ఉన్నారు. 2016 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి ముగ్గురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. పాత కార్పొరేటర్లు బస్తీల్లో పెండింగ్ లో ఉన్న పనులు చేయించడం, ఓడిపోయినా ప్రజల్లో తిరుగుతుండటాన్ని కొత్త కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్... సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమై కొత్తగా గెలిచిన కార్పొరేటర్లకే సహకరించాలని ఆదేశించారనే ప్రచారం జరుగుతోంది. అంబర్ పేట, సనత్ నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోనూ మెజార్టీ డివిజన్లు బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ కూడా ఇదే సమస్య ఉందంటున్నారు.
ఈసారి అధికార పార్టీ దాదాపు 25 మంది సిట్టింగులను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చింది. వారిలో కొందరు విజయం సాధించారు. ఇక్కడ కూడా కొత్త, పాత కార్పొరేటర్ల మధ్య రగడ జరుగుతుందట. టికెట్ రాని కొందరు వేరే పార్టీలోకి పోగా.. ఇంకొందరు అధికార పార్టీలో ఉన్నారు. అయితే పాత కార్పొరేటర్ అధికార పార్టీలోనే ఉన్నా.. కొత్తగా గెలిచిన తన పార్టీ నేతలకు వారు సహకరించడం లేదటా. ఈ గొడవతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి పాత కార్పొరేటర్ దగ్గరికి వెళ్లాకా లేక కొత్తగా గెలిచిన నేత దగ్గరకు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారట. కొత్త పాలక మండలి ఏర్పడే వరకు ఈ సమస్యలు తప్పవని భావిస్తున్నారు. ప్రభుత్వమే దీనిపై క్లారిటీ ఇస్తే బెటరని ప్రజలు కోరుకుంటున్నారు.