ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులు క్లోజ్!  జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్ 

ఇన్ సైడర్ ట్రేడింగ్.. గత 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న  వైసీపీ నేతలు పదేపదే చెబుతున్న మాట ఇది. టీడీపీపై ఆరోపణలు చేయడానికి వినిపించిన నినాదం ఇది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ నేతలు బినామి పేర్లతో కారు చౌకగా వందల ఎకరాల భూములు ముందే కొనిపెట్టారని  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తో పాటు వైసీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు అదే పనిగా ఆరోపిస్తున్నారు. అప్పటి  టీడీపీ ప్రభుత్వమే అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ప్రొత్సహించిందని చెబుతూ వస్తున్నారు. వైసీపీ నేతల ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండించారు టీడీపీ నేతలు. మాటలు కాదు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే నిరూపించాలని సవాల్ చేశారు. గత 20 నెలలుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు పుల్ స్టాప్  పడింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో జగన్ రెడ్డి  ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిదంటూ  ఏపీ  ప్రభుత్వం నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. 


రాజధాని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కిలారు రాజేష్‌తో పాటుగా మరికొందమందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. దీంతో వాటిని కొట్టివేయాలని కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసులు.. కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ రాజేష్ తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా నమోదు చేస్తారని? న్యాయవాది వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ లేదని పేర్కొంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు ఐపీసీ సెక్షన్లు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కిలారు రాజేష్‌తో పాటు మరికొందరిపై నమోదైన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

2019లో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పడి నుంచే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు 2019 డిసెంబర్ 28 న  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఏపీ సర్కార్ కొందరి పేర్లతో జాబితా విడుదల చేసింది. మొత్తం పదకొండు మంది పేర్లలో చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లతో పాటూ, యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన రావు పేర్లు తో పాటూ చాలా మంది పేర్లు ఉన్నాయి. వీరంతా నిబంధనలను తుంగలో తొక్కి వేలాది ఎకరాలు కారుచౌకగా కొన్నట్లు ఆరోపించింది. తెల్లరేషన్ కార్డు దారులకు కూడా  అమరావతిలో  వందలాది ఎకరాలున్నట్లుగా రికార్డుల్లో ఉందని.. వారంతా టీడీపీ నేతల బినామీలేనని కారు డ్రైవర్లు, పనిమనుషుల పేర్లపై కూడా భూములున్నాయని జగన్ సర్కార్ ఆరోపించింది. 
 
 ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణకు ఆదేశిస్తూ జనవరి 23, 2020న ఉత్తర్వులు ఇచ్చింది జగన్ రెడ్డి సర్కార్.  ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది. మంగళగిరి, తుళ్లూరు రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి వారి వివరాలు సేకరించారు అధికారులు. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 761 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అత్యధికంగా తుళ్లూరులో 245 ఎకరాలు కొనుగోలు చేసినట్టు గుర్తించామన్న సీఐడీ అధికారులు.. తెల్ల రేషన్ కార్డుదారులపై చీటింగ్, బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.  2020 ఫిబ్రవరి 29న టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. అంతేకాదు గత ప్రభుత్వ పాలనపై నియమించిన సిట్ కూడా అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హడావుడి చేసింది. విజయవాడలోని కొందరు నివాసాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. 
   
అయితే జగన్ ప్రభుత్వం విచారణల మీద విచారణలు జరిపిస్తున్నా టీడీపీ నేతలు మాత్రం జంకలేదు. అమరావతిలో  ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, అలాంటిది ఉంటే ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకునేదని టీడీపీ నేతలు చెప్పారు. ఇప్పుడు వాళ్లు చెప్పిందే నిజమైంది. గత 20 నెలలుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్ని ఉట్టివేనని తేలిపోయింది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేయడంతో వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. హైకోర్టు తీర్పుపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామరాజు కృష్ణం రాజు.. జగన్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. సీఐడీ కేసులు పెట్టినప్పుడే అవి చెల్లవని తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది ఉండదని, అలాంటి వాటిపై కేసులు పెట్టడం కూడా కుదరదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అమరావతిలో  ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఆధారాలు ఉంటే..  గత 20 నెలలుగా ఎందుకు నిరూపించలేకపోయందని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రఘురామకృష్ణం రాజు.