తెలంగాణా ఇస్తే సంతోషమే, కానీ...

తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా సమైక్యాంధ్రకి అనుకూలంగా మాట్లాడిన ఒకరిద్దరు కాంగ్రెస్ తెలంగాణా నేతల్లో మంత్రి దానం నాగేందర్ కూడా ఒకరు. అయన ఇంతవరకు ఏరోజూ కూడా మిగిలిని తెలంగాణా కాంగ్రెస్ నేతలతో కలిసి ఉద్యమాల బాట పట్టలేదు కూడా. అయితే, ఇక నేడో రేపో కేంద్రం తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన చేయబోతోందని బలమయిన సంకేతాలు వెలువడుతున్న ఈ తరుణంలోకూడా ఇంకా తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడి మరింత మంది శత్రువులను పోగేసుకోవడం ఎందుకనుకోన్నారో మరేమో, ఆయన ఈ రోజు హైదరాబాదులో మీడియావారితో మాట్లాడుతూ “ఇంతవరకూ నేనెప్పుడూ తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడలేదు. ఆవిధంగా మాట్లాడిన లాగడపాటి రాజగోపాల్ వంటి వారివల్లనే తెలంగాణా ఉద్యమాలు మరింత తీవ్రతరమయ్యాయి. అటువంటి వారిని తప్పు పట్టకుండా నన్ను వేలెత్తి చూపడం చాల తప్పు. కేంద్రం హైదరాబాదుని ఎక్కడ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేస్తుందో అనే ఆదుర్దతో నేను హైదరాబాదుని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరాను తప్ప, తెలంగాణా వద్దని గానీ, దానిని తెలంగాణాకి రాజధానిగా చేయోద్దనిగానీ నేనెన్నడూ అనలేదు. తెలంగాణా ఇస్తే నాకంటే సంతోషించేవారుండరు అని ఖచ్చితంగా చెప్పగలను. కానీ, మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొన్న నేను కట్టుబడి ఉంటాను. అది ప్రత్యేక తెలంగాణా అయిన సమైక్యంద్రా అయినా సరే.”

ఓవైసీ అరెస్టు: పాతబస్తీలో టెన్షన్ టెన్షన్

        ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్‌కు నిరసనగా పార్టీ కార్యకర్తలు బంద్‌కు పిలుపు నిచ్చారు. బలవంతంగా షాపులను మూసివేయిస్తున్నారు. బంద్ చేయని దుకాణాలపై రాళ్లతో దాడి చేశారు. పలుచోట్ల దుకాణాదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. కవరేజీకి వెళ్లిన మీడియాపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో పాతబస్తీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాతబస్తీలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. పాతబస్తీలో పరిస్థితిపై సీపీ అనురాగశర్మ మాట్లాడుతూ చిన్నచిన్న ఘటనలు మినహా పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. ఎలాంటి ఘటనలనైనా ఎదుర్కుంటామని సీపీ అనురాగ్‌శర్మ తెలిపారు.  

లగడపాటిగారి డ్రామా దేనికొరకు?

  చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు కృష్ణ జిల్లాలో ప్రవేశించబోతున్న తరుణంలో విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వీరంగం ఆడేసి మీడియాలోతెలుగుదేశంపార్టీ గురించీ సమైక్యాంద్ర గురించీ చాలానే మాట్లాడారు. అయితే, తెలంగాణాపై తన కాంగ్రెస్ పార్టీ మరో వారం రోజుల్లో తన నిర్ణయం ప్రకటించబోతుంటే, అయన ఇప్పుడు చంద్రబాబు వెంట ఎందుకుపడుతున్నారు? చంద్రబాబుని ఇప్పుడు సమైక్యాంద్రాకి ఒప్పిస్తే కేంద్రం మళ్ళీ తెలంగాణాను పక్కన బెడుతుందా? కాంగ్రేసుపార్టీలో ఆయనొక్కడే ఎందుకు ఇంత హడావుడి పడిపోతున్నారు? అసలు కాంగ్రెస్ అధిష్టానమే అయన వెనకుండి ఈ డ్రామా అంతా నడిపిస్తోందా?అంతిమంగా దీనివల్ల లాభపడేది ఎవరు, నష్టపోయేవారెవరు? చిన్నగా మొదలయిన ఆయన డ్రామా వెనుక ఇటువంటివి చాలా ప్రశ్నలే ఉన్నాయి.   మరొక్క వారం రోజుల్లో రాష్ట్రవిభజనపై ప్రకటన వెలువడనున్న ఈ సమయంలో, ప్రకటన వెలువడక మునుపే, ఇటువంటి డ్రామాతో తెలుగు దేశం పార్టీని ఇబ్బందికరమయిన పరిస్థితుల్లోకి నెట్టి రెండు ప్రాంతాలలో ఆ పార్టీని దెబ్బతీయాలనే ఆలోచన ఒకటి కనిపిస్తుండగా, కేంద్రం సమైక్యాంద్రాకి అనుకూలంగా నిర్ణయం తీసుకొనే ఆలోచన చేస్తుంటే, సీమంద్రాలో ఇటువంటి హంగామా చేయడం ద్వారా వేడిరాజేయగలిగితే ఈ సాకుతో తెలంగాణా ప్రకటనను పక్కనపెట్టేందుకు బలమయిన కారణం కాంగ్రెస్ పార్టీకి దొరుకుతుంది.   ఇక, లగాడపాటే ఎందుకు ముందుకు ఉరుకుతున్నారంటే, సమైక్యవాదిగా అయన ఇప్పటికే అందరికీ సుపరిచితుడు గనుక, అయన తన వాదనతో చంద్రబాబుకి అడ్డుపడి గొడవ సృష్టించగలిగితే కాంగ్రెస్ పార్టీకి లాభమే తప్ప కొత్తగా వచ్చే నష్టం ఏమి ఉండదు. అయన చంద్రబాబుని నిలవరించగలిగితే, కోస్తాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరగడమే గాకుండా, తెలుగు తమ్ముళ్ళ మద్య విభేదాలు పుట్టుకొస్తాయి. చంద్రబాబు నిర్ణయాన్ని సమర్దించేవారు, సమైక్యాంద్రకోసం పార్టీతో విభేదించేవారు రెండువర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈవిధంగా రెండు వర్గాలను సృష్టించగలిగితే, కాగల కార్యం గంధర్వులే చేసినట్లు తెలుగుదేశం పార్టీని వారే కుప్పకూల్చుకొంటారనే ఆలోచనతో లగడపాటి ఈ డ్రామా మొదలుపెట్టి ఉండవచ్చును.   ఇక, కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం ప్రకటించే సమయంలో రాష్ట్రంలో పూర్తీ ప్రశాంతత కోరుకొని ఉంటే, లగడపాటిని ఇంతవరకు వెళ్ళనిచ్చేదికాదు. బహుశః సమైక్యాంద్రాకి అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నందునే లగడపాటిని తెరవెనుకనుండి కాంగ్రెస్ అధిష్టానమే ఆడిస్తోందేమో అని అనుమానం ఉంది.   ఒకవేళ, కాంగ్రెస్ అధిష్టానంకి ఎటువంటి సంబంధంలేకుండా ఆయన తనంతట తానే ఇదంతా చేస్తుంటే, రాష్ట్రం విడిపోక మునుపే సమైక్యాంద్రా కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడిగా ప్రజలలో మంచిపేరు తెచ్చుకొంటే, ఆనక రాష్ట్రం విడిపోయినప్పుడు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి పోటీలో అందరికన్నా ముందు తానే ఉండవచ్చుననే ఆలోచనతో ఆయన ఈ హంగామా చేస్తున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.   చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా డిల్లీకి పరిగెత్తే కాంగ్రెస్ పెద్దలు, ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా, దాని అనుమతి లేకుండా ఈడ్రామా చేస్తున్నారని అనుకోలేము.

లగడపాటికి టిడిపిలోకి ఆహ్వానం

        తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆరాటపడుతున్న విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కావాలంటే తమ పార్టీ లోకి రావచ్చని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆహ్వానం పలికారు. పాదయాత్రలో బాబును కలిసి కనువిప్పు కలిగిస్తామని లగడపాటి చెప్పడం విడ్డూరమన్నారు. లగడపాటి చీప్ ట్రిక్స్ మానుకోవాలన్నారు. ఆయన నోటికి తాళం ఎలా వేయాలో తమకు తెలుసన్నారు. బాబు పర్యటన ఆపే దమ్ము, ధైర్యం లగడపాటికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆయన కలవాల్సింది తమ పార్టీ అధినేతని కాదని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అన్నారు. బాబు అపాయింట్మెంట్ కావాలంటే లగడపాటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలన్నారు.

ప్రజలకోసం పనిచేసేవాళ్లకే ప్రాధాన్యం: రాహుల్ గాంధీ

        జైపూర్‌ చింతన్ శిబిర్‌లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా ప్రసంగించారు. పార్టీలో తనకు అరుదైన గౌరవం లభించిందని, ఎనిమిదేళ్లుగా పార్టీలో ఎంతో నేర్చుకున్నానని, సీనియారిటీతో సంబంధంలేకుండా ప్రజలకోసం పనిచేసేవాళ్లకే పార్టీలో ప్రాధాన్యముంటుందని రాహుల్ గాంధీ అన్నారు. సామాన్య కార్యకర్తనుంచి పార్టీలోని అన్ని స్థాయుల్లోనూ తనకు అందరి సహకారం లభించిందన్నారు. సెల్‌ఫోనుతో సాంకేతిక విప్లవాన్ని సాధించామని, హరితవిప్లవం దేశాన్ని సస్యశ్యామలం చేసిందని, సంస్కరణల ఫలం సామాన్యుడికి దక్కిందనేందుకు సెల్‌ఫోన్ వినియోగమే నిదర్శనమని రాహుల్ చెప్పారు. గాంధీజీ సిద్ధాంతాలే తమ విధానాలని, ప్రజల మనోభావాలను అత్యంత గౌరవిస్తామని, అవినీతి నిర్మూలనకు తమ పార్టీ కట్టుబడి ఉందని, అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరముందని రాహుల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రజలందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనం రూపాయికి 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయని తన తండ్రి అభిప్రాయపడేవారని, 99 శాతం ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టామని రాహుల్ చెప్పారు. ఆధార్, నగదు బదిలీ వల్ల 100 శాతం ప్రయోజనం చేకూరుతోందన్నారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని, భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులను కాంగ్రెస్ పార్టీ తయారుచేస్తుందన్నారు. పార్టీలో పనిచేసేవారికే ప్రాధాన్యముంటుందని, పనిచేయనివారికి ఒకటిరెండు సార్లు చెప్తామని, మారకపోతే మరొకరికి అవకాశమిస్తామని ఆయన అన్నారు.

బిజెపి పై షిండే సంచలన వ్యాఖ్యలు, క్షమాపణకు డిమాండ్

        జైపూర్‌లోని కాంగ్రెసు పార్టీ చింతన్ శిబిర్‌లో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి,ఆర్ఎస్ఎస్ హిందూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. సంఝౌతా ఎక్సుప్రెస్, మక్కా మసీదు, మాలేగామ్ పేలుళ్ల వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని ఆయన ఆరోపించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్‌లు హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని తాను ఏదో కొత్త విషయం చెప్పలేదని, ఉన్న విషయాన్నే చెప్పానని అన్నారు. షిండే వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. షిండే వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై కాంగ్రెసు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆయన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలన్నారు. షిండే వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు.

విశాఖ తెలుగుదేశంలో ముసలం

  వైజాగ్ లో చిన్నగా మొదలయిన తెలుగు తమ్ముళ్ళ గొడవ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు రాజీనామాతో తీవ్ర స్థాయికి చేరుకొంది. వైజాగ్ లో రెండు వర్గాలుగా చీలిపోయిన తెలుగుదేశం సభ్యులు పోటాపోటీగా సభలు పెట్టుకొని ఒకరిని ఒకరు దూషించుకొంటూన్నారు. అయ్యన్నపాత్రుడి వర్గానికి చెందిన 23మంది అనుచరులు పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేసారు. వైజాగ్ లో ప్రముఖ కేంద్రమయిన గాజువాక తెలుగుదేశం పార్టీ విభాగానికి ఇన్-చార్జ్ కోన తాతారావు, శాసన సభ్యుడు రామకృష్ణ కూడా రాజీనామా చేసారు. అయ్యన్నపాత్రుడు స్వస్తలమయిన నర్సీపట్నంలో ఈ రోజు సాయంత్రం వారు సమావేశమయి తమ తదుపరి కార్యక్రమాన్ని ప్రకటించనున్నారు. అయ్యన్నపాత్రునికి మద్దతుగా మరి కొంతమంది శాసనసభ్యులు, కార్పొరేటర్ లు కూడా ఈ రోజు రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నారు.   మరో వైపు బండారు సత్యనారాయణ వర్గీయులు కూడా సమావేశాలు నిర్వహిస్తూ, పీల శ్రీనివాస రావు మరియు అయ్యన్న పాత్రుని వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లా ఇన్-చార్జ్ సుజన చౌదరి రెండు వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నపటికీ, తమ అనుచరుడిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన తరువాత ఇక మాట్లాడేందుకు ఏమి లేదంటూ అయ్యన్నపాత్రుడు ఆయనతో మాట్లాడేందుకు నిరాకరించినట్లు సమాచారం. నల్గొండలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొంటూ, పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమయిన సూచనలు చేస్తున్నారు. అయన అయ్యన్న పాత్రుడి రాజీనామాను తిరస్కరించారు.

టిడిపి నుంచి పీలా శ్రీనివాస్ సస్పెన్షన్

        విశాఖ తెలుగు తమ్ముళ్ల పై టిడిపి అధిష్టానం కన్నెర్ర జేసింది. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్టీఆర్ వర్థంతి సభ రసాభాసగా మారింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మీద పీలా శ్రీనివాసరావు వర్గం దాడి చేసింది.   బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అతికష్టం మీద అక్కడి నుండి తప్పించారు. ఈ వ్యవహారంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పీలా శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సత్యానారాయణ మూర్తి మీద దాడి చేసిన విషయం తెలియగానే హీరో బాలకృష్ణ ఆయనను ఫోన్ లో పరామర్శించారు. వెంటనే పార్టీ నేతలను సంఘటనపై విచారణకు ఆదేశించారు. బాలకృష్ణ చొరవ మూలంగానే పీలాను పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు

    ఇటీవల విడుదలయిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రాజకీయాలలో క్షణం తీరిక ఉండని చంద్రబాబుని సైతం ఆకట్టుకొంది. ఆయన ఆ సినిమా ఇంతవరకూ చూడకపోయినా, క్యాచీగా ఉన్న ఆ సినిమా పేరుని మాత్రం బహు చక్కగా తన ప్రసంగంలో వాడుకొన్నారు. నిన్న నల్గొండ జిల్లా కోదాడ పట్టణంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు వేస్తే అది పెరిగి పెద్ద ప్యాలెస్ అయిందని,డబ్బులు విరగకాసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ప్రజలు కడుపుబ్బా నవ్వుకొన్నారు. చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చమత్కారంగా మాట్లాడుతూ "ఎవరైనా పుణ్యం కోసం, తమ కోరికలు తీరడం కోసం ఏ గుడికో, చర్చికో, మసీదుకో వెళ్లి కొబ్బరికాయలు కొట్టి దేవుడికి పూజలు చేస్తారు. గానీ, అదే జగన్ పార్టీలో చేరాలంటే మాత్రం చంచల్‌గూడ జైలుకు వెళ్లక తప్పదు. ఆ పార్టీలో చేరాలనుకొనే ఏ నాయకుడయినా తన రాజకీయ జీవితానికి ఆ జైల్లోనే ప్రారంభించకతప్పదు. అప్పుడే అతని కోరికలు తీరుతాయి,” అని చంద్రబాబు పలికినప్పుడు జనం పెద్దగా ఈలలువేసి చప్పట్లు కొడుతూ ఆయనని ప్రోత్సాహించారు. “కోటి సంతకాలు సేకరించిన మాత్రాన్న దోషి నిర్దోషిగా మారిపోడని” జగన్ను ఉద్దేశిస్తూ ఆయన అన్నప్పుడు కూడా ప్రజలు అదే రీతిలో స్పందించారు.   తెలంగాణా విషయంలోతెలుగుదేశం పార్టీ మళ్ళీ మాట మార్చిందని తెరాస నేతలు చంద్రబాబును తప్పుపడుతున్నపటికీ, ప్రజలు వారిని పట్టించుకోవట్లేదని చంద్రబాబు పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన ఋజువు చేస్తోంది.

చార్మినార్ నిజాం జాగీర్ కాదు: జగ్గారెడ్డి

      ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ అసేంబ్లీ, చార్మినార్, ఎర్రకోట, తాజ్ మహల్ ల గురించి, అసేంబ్లీలో మహాత్మాగాంధీ విగ్రహం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పై జగ్గారెడ్డి మండిపడ్డారు. చార్మినార్, అసెంబ్లీ, తాజ్ మహల్, ఎర్రకోట మావే అని చెప్పేందుకు అది మజ్లిస్, రజాకార్ల జాగీర్ కాదని, అవి పూర్తిగా ప్రజల సొమ్ముతో కట్టినవని అన్నారు. మరో సారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పాషాఖాద్రీ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్రం కోసం కృషిచేసిన మహాత్మగాంధీ గురించి మాట్లాడిన అతనిపై చట్టపరమయిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను అందరూ ఖండించాలని, ఇకముందు ఇలాగే మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

వెంట్రుకపై వివరణ ఇచ్చిన రామ్ చరణ్

        ‘నాయక్’ ఆడియో విడుదల వేదికపై మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తేజ మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'రచ్చ' ఆడియో ఫంక్షన్ కు బాబాయ్ పవన్ కళ్యాణ్ రాలేదని ఓ పత్రిక, ఓ ఛానల్ వార్తలు రాసి మా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు అల్లారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ కు బాబాయ్ వచ్చాడు. నాన్న రాలేకపోయాడు. ఈ వేదిక మీద నాన్న లేని లోటును బాబాయ్ తీర్చాడు. నా తరువాతి ఫంక్షన్ కు బాబాయ్ రాకపోవచ్చు. మా అనుబంధాల గురించి అడ్డగోలుగా రాసే ఆ పేపర్, ఛానల్ వార్తలు నా వెంట్రుకతో సమానం” అని తెరపై చెప్పాల్సిన డైలాగులు స్టేజిపై చెప్పారు. ఇప్పుడు రామ్ చరణ్ సడన్ గా గేర్ మార్చాడు. తాను చేసిన వ్యాఖ్యలపై మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. ఎవరైతే మాపై ఆ రాతలు రాశారో నేను వాళ్ళను ఉద్దేశించే అన్నాను తప్ప మీడియా మొత్తాన్ని కాదని చెప్పారు. "ఐ లవ్ మీడియా..ఐ రేస్పెక్ట్ మీడియా" రోజు షూటింగ్ లో ఎంత బిజీగా వున్న ఒక గంట మీడియా కు కేటాయిస్తానని చెప్పారు. రామ్ చరణ్ కు ఉన్నట్లుండి మీడియాపై ఎనలేని ప్రేమ ఎందుకు పొంగుకొంచ్చిందో మరీ..!

చంద్రబాబుని శపిస్తున్న లక్ష్మీ పార్వతి

  స్వర్గీయ ఎన్.టి.రామారావుగారి హయంలో అటు తెలుగుదేశం పార్టీన్ని, ఇటు నందమూరి కుటుంబాన్ని ఒక ఆట ఆడుకొన్న లక్ష్మీపార్వతి, అయన పోయిన తరువాత రెంటికీ చెడిన రేవడిగా మిగిలిపోయింది. అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి కనీసం తానూ కూడా గెలవలేక చతికిలబడింది. నందమూరి కుటుంబాన్ని ఎంత మంచి చేసుకొందామని ప్రయత్నించినా ఎవరూ కూడా స్పందించకపోవడంతో, ఏక సభ్య పార్టీగా కొంత కాలం పార్టీని నడిపించి చివరికి జగన్ పార్టీలో తెలిందామె. అయితే, ఆమె ఆవేశం, ఆక్రోశం ఎన్నటికీ చల్లారేది కాదని అందరికి తెలుసు. ఈ రోజు తన భర్త నందమూరి తారకరామారావు గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆమె ఈ ఉదయం యన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు.   ఆ సందర్బంగా మీడియవారితో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆరిపోయే దీపం అని చెపుతూ చంద్రబాబు నాయుడుకు తన భర్త యన్టీఆర్ శాపం తగిలినందునే ఈనాడు ఈ విధమయిన కష్టాలు అనుభవిస్తున్నాడని ఆమె అన్నారు. అంతేగాకుండా, ఆమె తెలుగుదేశం పార్టీ జాతకం కూడా చెప్పారు. ఆంధ్ర, తెలంగాణా, జగన్ మోహన్ రెడ్డిల వల్ల, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నారు. రేపు జగన్ పార్టీ కూడా ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇలాగే శాపాలు పెడుతుందేమో తెలియదు.

గ్యాస్ డబ్బులకి కక్కుర్తి పడిన కేంద్రం

    ఇంతకాలం ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను ఇస్తున్న కేంద్రం కొద్ది నెలలక్రితం ఆయిలు కంపెనీల ఒత్తిళ్ళకి లొంగిపోయి, ఒకేసారి 6సిలిండర్లు కోత విధించేసింది. అంతటితో ఊరుకోకుండా ఒక కుటుంబానికి కేవలం 6సిలిండర్లు బహు చక్కగా సరిపోతాయని సెలవిస్తూ, అంతకంటే ఎక్కువ అనవసరం అన్నట్లు మాట్లాడింది. ఆపైన ఒక్క సిలిండరు ఇచ్చినా ఆయిలు కంపెనీలకు వందల, వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని ఆయిలు కంపెనీల తరపున వఖల్తా పుచ్చుకొని మరీ మాట్లాడింది. అయితే, కేంద్ర నిర్ణయానికి యావత్ దేశ ప్రజలే కాక, తమ స్వంత పార్టీ వారు సైతం తీవ్ర అభ్యంతరం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ సందిగ్ధంలో పడింది.   అంత భారాన్ని మోయలేనని చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మొన్న గుజరాత్ ఎన్నికల సమయంలో వోట్లు దండుకోవడానికి సిలిండర్లు మళ్ళీ 9కి పెంచేందుకు సిద్ధం అయినప్పుడు, ఎన్నికల కమీషన్ కొరడా జళిపించడంతో వెనక్కి తగ్గింది. అంటే, తనకు లాభం వస్తుందంటే ఓట్ల కోసం ఎరగా వేసి, అది ఎంత భారమయినా భరించగలదని పరోక్షంగా తెలియజేసింది.   గత కొన్నిదశాబ్దాలుగా ప్రభుత్వం తరపున వడ్డింపు వార్తలే తప్ప చిన్న శుభవార్తకి కూడా నోచని భారత ప్రజలకి, ఎన్నికలు ముంచుకొస్తున్నపుడు మాత్రమే ఏచిన్న శుభావార్తయినా వినే అవకాశం కలుగుతుంటుంది. మళ్ళీ అదే కారణంవల్ల ఈ రోజు ప్రజలకి మరో శుభవార్త వినే అవకాశం కల్గింది. పెట్రోలియం శాఖామాత్యులు వాయిలార్ రవి ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రస్తుతం ఇస్తున్న 6 గ్యాస్ సిలిండర్లను 9కి పెంచబోతున్నట్లు డిల్లీలో నేడు ప్రకటించేరు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అనే ప్రకటన వెనుక ఈ నాలుగు నెలలు కూడా ప్రజలనుండి ఎంత వీలయితే అంతా పిండుకొందామనే దురాశ కూడా కనిపిస్తోంది.   ధరలు పెంచేటప్పుడు అర్ధరాత్రి నుండే అమలు చేసే ప్రభుత్వం, ప్రజలకి మేలుచేసే నిర్ణయాలను మాత్రం అమలు చేయడానికి ఈ విధంగా మీనమేషాలు లెక్కపెట్టుకోవడం దాని నైజాన్ని తెలియజేస్తోంది.

తెలుగుదేశానికి కలిసొచ్చిన నల్గొండ బాబు పాదయాత్ర

  గత కొన్ని రోజులుగా చంద్రబాబుపై అలిగి ఆయన పాదయత్రకి, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న తెలంగాణానేత మోత్కుపల్లి నరసింహులు, ఈరోజు నల్గొండ జిల్లాలో అడుగుపెడుతున్న చంద్రబాబుతో ఆయన ఏవిదంగా వ్యహరిస్తారనే అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్న తరుణంలో, నరసింహులు స్వయంగా ఖమ్మం సరిహద్దు గ్రామం నేలకొండపల్లి మండలం పైనంపల్లికి వెళ్లి పార్టీ అధ్యక్షుడికి స్వాగతం పలికేరు. చంద్రబాబు కూడా ఆయనను ఆప్యాయంగా పలకరించడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా చాలా సంతోషించారు. మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ తమ మద్య విభేదాలేవి లేవని, తానూ కూడా తమ నాయకుడితో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని అన్నారు.   చంద్రబాబు తన పాదయాత్రలో ముందు నల్గొండ పర్యటనని రద్దు చేసుకోన్నపటికీ, బహుశః మోత్కుపల్లిని కలుపుకుపోవాలనే ఆలోచనతోనే నల్గొండలో కూడా ఆయన పాదయాత్ర మొదలుపెట్టి ఉండవచ్చును. ఆ నిర్ణయం వల్లనే ఈరోజు మోత్కుపల్లి వంటి సీనియర్ నాయకుడు పార్టీకి దూరం కాకుండా కాపాడిందని చెప్పవచ్చును. చంద్రబాబు గనుక నల్గొండలో ప్రవేశించకుండా ముందనుకొన్నట్లు నేరుగా కృష్ణా జిల్లావైపు సాగిపోయుంటే వారిరువురి మధ్య దూరం ఆలాగనే మిగిలిపోయి, చివరికి మోత్కుపల్లి మరో పార్టీ వైపు వెళ్లేందుకు దోహదపడేది. గానీ, చంద్రబాబు నిర్ణయం పార్టీకి మేలు చేకూర్చింది.   నల్గొండ జిల్లా కోదాడ మండలం శాంతినగర్లో అడుగుపెట్టిన చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికేరు. వారితో బాటు సిపిఐ, ఎమ్మార్పీఎస్, యుటిఎఫ్ కూడా స్వాగతం పలకడం మరో విశేషం.

మంత్రి దానం కాన్వాయ్ పై దాడి..అద్దాలు ధ్వంసం

        మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద మంత్రి దానం నాగేందర్ కాన్వాయ్పై తెలంగాణవాదులు గురువారం దాడి చేశారు. దాడిలో మంత్రి వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాగా దాడికి పాల్పడినవారిలో ఒకరిని దానం నాగేందర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇస్తుందన్న సంకేతాలున్నాయని అన్న దానం నాగేందర్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఆ తరువాత రోజే ఆయన తెలంగాణ ఇస్తే హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని మరో మంత్రి ముఖేష్ గౌడ్ తో కలిసి డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలతో కుమ్మక్కయిన దానం ఇలా మాట మార్చి తెలంగాణకు అడ్డుపడుతున్నాడని తెలంగాణ వాదులు ఆగ్రహంగా ఉన్నారు.

తెలంగాణాలో కొనసాగనున్న బాబు పాదయాత్ర

  ఖమ్మం జిల్లలో 9 రోజులు పాదయాత్ర చేసిన చంద్రబాబు, ఈ రోజు మద్యాహ్నం నల్గొండ జిల్లలో అడుగుపెట్టనున్నారు. కొద్దిరోజుల క్రితం తెలుగుదేశంపార్టీ నల్గొండ జిల్లాలో ఆయన పాదయాత్ర ఉండబోదని ప్రకటించగానే స్థానిక నేతలు, కార్యకర్తలు స్వయంగా చంద్రబాబును కలిసి తప్పనిసరిగా తమ జిల్లాలో కూడా పర్యటించమని కోరడంతో, చంద్రబాబు వారి విజ్ఞప్తి మన్నిస్తూ ఆ జిల్లాను కూడా పర్యటించాలని నిర్ణయించుకొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం తరువాత నల్గొండలో అయన పాదయాత్ర మొదలవుతుంది.   రెండు రోజుల క్రితం తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ అయన తెలంగాణా సరిహద్దు దాటబోతున్నాడు గనుకనే, ఇప్పుడు ఆయన పార్టీ తెలంగాణాపై మాటమార్చి సమైక్యాంద్రా అని మళ్ళీ పాతపల్లవి పాడుతోందని అన్నారు. అందువల్ల చంద్రబాబు తెలంగాణాలోనే పాదయాత్ర కొనసాగిస్తూ ఆమె సవాలును స్వీకరించినట్లు భావించవచ్చును. అయన తెలంగాణాలోనే ఉన్నందున, సీమంద్రాకి చెందిన ఆయన పార్టీ నేతలు సమైక్యాంద్రా పల్లవి ఎత్తుకొన్ననేపద్యంలో తెలంగాణావాదులు ఆయనను స్వయంగా కలిసి తెలంగాణాపై తెలుగుదేశంపార్టీ వైఖరిని మరో మారు తెలుసుకొనే అవకాశముంది.

హాటు హాట్టుగా బాలసాయి జన్మదిన వేడుకలు

  ఒక దయానందుడయిన స్వామీజీ తన భక్తురాలిని పడగదిలో అనుగ్రహిస్తే, మరో పిరమిడ్ బాబా ధ్యానం అంటూ జీన్స్ వేసి కన్నెపిల్లల నడుములు పట్టుకొని భక్తుల ముందే చిందులు వేస్తాడు. మరో బాబా తనకా డ్యాన్సులు చేయడం చేతకాక ఏకంగా ఫారిన్ సరుకునే తెప్పించి ‘సారోస్తారు..రొస్తారు..’ అంటూ సామాన్య ప్రజలకి కూడా అర్ధమయ్యే విదంగా డ్యాన్సులు చేయించి మరింత పేరుతెచ్చుకొన్నాడు.   కర్నూలులో నిన్న తన 51వ జన్మదిన వేడులను ఘనంగా జరుపుకొన్న బాల సాయిబాబా సమక్షంలోనే జరిగిన కార్యక్రమమిది. భజనలు, కీర్తనలు, సందేశాలు అంటే జనం రారనుకోన్నాడోయేమో, విదేశీ డ్యాన్సర్లను (విదేశీ భక్తులని బాబా ఉవాచ), స్వదేశీ డ్యాన్సర్ లను కూడా రప్పించి, వారి డ్యాన్సులతో ఆహుతులను అలరించాడు. డ్యాన్సులతో చిందులు పూర్తయిన తరువాత, ‘వాటేసుకో మ్మావా రాసేసుకో..’ అంటూ ఘాటయిన సినిమా పాటల కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేసారు బాబాగారు.   ఈ కార్యక్రమం ద్వారా లోకానికి, ముఖ్యంగా తనను విమర్శించే వారికీ తన పలుకుబడి తెలియజేసేందుకు, అయన కొందరు రాష్ట్ర మంత్రులు, (టీ జీ. వెంకటేష్) కేంద్ర మంత్రులు (బలరం నాయక్), క్రీడాకారులు (గుట్టా జ్వాల) సినిమా పరిశ్రమకు చెందిన గాయనీ గాయకులను కూడా పాల్గొనేలా చేసారు.   కొద్ది నెలల క్రితం రాష్ట్ర రాజధానిలో సరిగ్గా డీ.జీ.పీ. ఆఫీసు ముందే ఇంజన్ పాడయి నిలిచిపోయిన ఆటోలో బాలసాయికి చెందిన 11 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకొని ఆదాయశాఖవారికి అప్పగించినప్పుడు, వారు నోటీసులు పంపినా పత్తా లేకుండా పోయిన బాలసాయిబాబా, ఆ కధని ఎలా మేనేజ్ చేసాడో గానీ మరి తరువాత ఆ ఊసే వినబడలేదు. మళ్ళీ ఇంతకాలానికి హటాత్తుగా మంత్రులతో సహా కర్నూల్ పట్టణంలో ప్రత్యక్షమవడమే గాకుండా, ఈ విదంగా ఘనంగా తన పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకొన్నాడు.

కొండకు వెంట్రుకను ముడేసి లాగుతున్నజగన్ పార్టీ

  లోకం బాధని తన బాధగా అనుకొని మహాప్రస్తానానికి శ్రీకారం చుట్టినవాడు శ్రీశ్రీ. అయన తన మహాప్రస్తానంతో ఆ చంద్రార్కం నిలిచేపోయే కీర్తిని పొందగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన బాధను లోకం బాధగా భావించి జైల్లో ఉన్న తన నాయకుడికోసం మరో ప్రస్తానం చేసిన ఘనత సాధించింది.   జైల్లో ఉన్న ఖైదీలను కోటి సంతకాలతో విడిదల చేయించవచ్చుననే ఆలోచన ఆ పార్టీలో ఏమేధావికి కలిగిందోగానీ, కనీవినీ ఎరుగని ఒక వినుత్నమయిన కార్యక్రమానికి పురుడుపోసింది. ఆ మహాయజ్ఞం దిగ్విజయంగా పూర్తిచేసుకొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ కాగితాల కట్టలను మోసుకొనివెళ్లి రాష్ట్రపతికి సమర్పించడానికి ఈ రోజు డిల్లీ బయలుదేరుతోంది. ఈ రోజు సాయంత్రం 6.15గంటలకి రాష్ట్రపతి అపాయింట్మెంట్ పొందిన విజయమ్మ, తన పార్టీకి చెందిన పార్లమెంటు మరియు శాసన సభ్యులతో కలిసి వెళ్లి ఆయనను కలవనున్నారు.   అయితే, తమ శ్రమంతా ఏట్లో పిసికిన చింతపండేనని తెలియకనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత శ్రమ పడిందా అంటే కాదనే చెప్పవచ్చును. నాయకుడులేని సైన్యంలా ఉన్న ఆపార్టీ నేతలు, అసలు కదలక మెదలక కూర్చొనేకంటే, ఏదో ఒక దిశలో, తమకు తోచిన దిశలో ముందుకు సాగడం తప్ప ప్రస్తుతం చేయగలిగిందేమీ లేదని గ్రహించడం వల్లనే ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లు కనిపిస్తోంది. పార్టీలో స్తబ్దత పార్టీ కార్యకర్తల దైర్యాన్ని, ఉత్సాహాన్ని కబళించకుండా కాపాడుకొనే ప్రయత్నంగా కూడా దీనిని చూడవచ్చును. ‘ఒక ఐడియాతో జీవితాన్నే మార్చేస్తుంది’ అని అనుకోన్నపటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిన ఈ కోటి సంతకాల ఐడియా జగన్ జీవితాన్నిఎంత మాత్రం మార్చబోదని వారికీ తెలిసే ఉంటుంది. కొండకు వెంట్రుకను ముడేసి లాగితే కదిలితే కొండ కదలవచ్చును, లేదా పోయేది వెంట్రుకే!

హేట్ స్పీచ్, ఆ గొంతు నాది కాదు: అక్బరుద్దీన్

        నిర్మల్ బహిరంగ సభలో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన గొంతు తనది కాదని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసును ఎదుర్కుంటున్న అక్బరుద్దీన్ను పోలీసులు మంగళవారంనాడు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు విచారణ సాగింది. "నిర్మల్ సభలో పాల్గొన్నది నేనే. అందులో కనిపిస్తున్నది నేనే. కానీ అందులో అన్న మాటలు నావి కావు. ఆ గొంతు నాది కాదు. నేను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు” అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరు్ద్దీన్ ఓవైసీ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓ  వర్గం మనో భావాలు దెబ్బతీశారని ఆదిలాబాద్ జైలు లో ఉంటూ పోలీసు విచారణ ఎదుర్కొంటున్న అక్బరుద్దీన్ విచారణలో భాగంగా పోలీసులతో గొంతు నాది కాదని చెప్పడం తప్పించుకోవడానికే అని తెలుస్తోంది. యూట్యూబ్ లో వచ్చే ప్రసంగాల వీడియోల ఆధారంగా కేసును రుజువు చేసే సాంకేతిక పరిజ్ఞానం మన వద్ద లేదన్న ధైర్యంతో ఆయన ఈ విధంగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ సంధర్భంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఓ గంట ముందే విచారణ నిలిపేశారు. ఆ తరువాత ఆరోగ్యం మెరుగుపడింది. అయితే మెరుగయిన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని ఆయన తరపు న్యాయవాదులు పోలీసులను కోరారు.