తొలిరోజు స‌మ్మె స‌క్సెస్‌

  తెలంగాణ ప్రక‌ట‌ణ‌కు నిర‌స‌గా సీమాంద్ర ఉద్యోగ సంఘాలు త‌ల పెట్టిన స‌మ్మె తొలిరోజు విజ‌య‌వంతం అయింది.. ఈ మేర‌కు ఎపిఎన్జీవోస్ నేత అశోక్‌బాబు ఒక ప్రక‌ట‌న చేశారు. ఈ రోజు స‌చివాలంలో విలేకరుల‌తో మాట్లాడిన ఆయ‌న స‌మ్మెకు స‌హ‌క‌రించిన ఉద్యోగుల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడిన అశోక్ బాబు, సీమాంద్రలోని అన్ని జిల్లాల్లో స‌మ్మె విజ‌య‌వంతం అయిన‌ట్టు త‌మ‌కు స‌మాచారం అందింద‌న్నారు. స‌మ్మెలో పాల్గొనే వారు విద్వేషాలు రెచ్చగొట్టే నినాదాలు ప్రసంగాలు చేయ‌వ‌ద్దని కొరారు. రాష్ట్ర విభ‌జ‌న నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃస‌మీక్షించాల‌ని ఆయ‌న కోరారు. కొంత మంది నాయ‌కులు ఇక్కడ స‌మ్మె చేయ‌వ‌ద్దని త‌మ‌ని విజ‌య‌వాడ, తిరుప‌తి వెళ్లమ‌ని త‌మ‌ని బెదిరిస్తున్నార‌ని చెప్పారు. ఇప్పుడే ప‌రిస్థితి ఇలా ఉంటే రేపు రాష్ట్రం విడిపోయాక ఎలా ఉంటుంద‌ని ఆయ‌న ప్రశ్నించారు. రాష్ట్ర విభజన మీకు ఎంత అవసరమో, రాష్ట్రం కలిసి ఉండటం తమకు అంత అవసరం అన్నారు.

సీమాంద్రలో చ‌దువులు కూడా బంద్‌

  సీమాంద్ర జిల్లాల్లో రోజు రోజుకు ఉద్యమం ఉదృతం అవుతుంది. ఇప్పటికే చాలా శాఖ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు స‌మ్మెలో పాల్గోంటుండ‌గా ఇప్పుడు తాజాగా సీమాంద్రల్లోని 13 జిల్లాల‌కు సంభందించిన ఉపాధ్యాయులు స‌మ్మెకు సిద్దం అవుతున్నారు. చాలా మంది ప్రజా ప్రతినిధులు ఉద్యమంలో పాల్గొన‌క పోయినా ఉద్యోగులు, అన్ని వ‌ర్గాల ప్రజ‌లు స‌మైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు మిగిలిన ఉద్యోగ సంఘాల‌తో పాటు సమైక్యాంధ్ర కోసం  13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాలు కూడా సమ్మె చేయడానికి  సిద్ధమవుతున్నాయి. ఆ ప్రాంత ఉపాధ్యాయ సంఘాల నేతలు రేపు  హైదరాబాద్లో సమావేశం కానున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఉపాద్యాయుల‌కు సీమాంద్ర స్థాయిలో జెఏసిలు లేక‌పోవ‌డంతో ఇప్పటి వ‌ర‌కు వారు నిర‌స‌న‌లకు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. 13 జిల్లాల ప్రతినిధులతో  బుధవారం హైదరాబాద్‌లో జరిగే కీలక  సమావేశంలో సీమాంధ్ర స్థాయి ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయాలని  నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి ఉపాధ్యాయులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

దిగ్విజ‌య్‌తో తెలంగాణ‌ ఎంపిల భేటి

  సీమాంద్రలో జ‌రుగుతున్న స‌మైక్య సెగ‌ల నేప‌ధ్యంలో తెలంగాణ ప్రాంత ఎంపిలు ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ దిగ్విజ‌య్ సింగ్‌తో భేటి అయ్యారు. సీమాంద్రల్లో వ‌స్తున్న నిర‌స‌న‌ల‌తో నిర్ణయంలో మార్పు చేయ‌కూడ‌దని కొర‌డంతో పాటు, వీలైనంత త్వర‌గా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాల‌ని కోరారు. రాష్ట్ర విభ‌జ‌న ఆల‌స్యమ‌వుతున్న కొద్ది స‌మ‌స్యలు జ‌ఠిల‌మ‌వుతున్నాయ‌ని కాబ‌ట్టి వీలైనంత త్వర‌గా విభ‌జ‌న ప్రక్రియ పూర్తిచేయాల‌ని కోరిన‌ట్టుగా ఎంపి రాజ‌గోపాల్ రెడ్డి చెప్పారు. సీమాంద్ర ప్రజ‌ల‌కు తాము ర‌క్షణ క‌ల్పిస్తామ‌ని ఎంపి బ‌ల‌రాం నాయ‌క్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ త‌రువాత కూడా వారిని సోదురులుగానే చూస్తాం అని ఎంపిలు  చెప్పారు.

కబాడ్డార్ కొడకల్లారా! ఈటెల

  ఈ రోజు హైదరాబాద్ విద్యుత్ సౌధాలో జరిగిన తెలంగాణా విద్యుత్త్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్న తెరాస నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రుల భార్యలు సమైక్యాంధ్ర కోరుతూ గవర్నర్ నరసింహన్ న్ను కలవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ‘తెలంగాణాలో వేయి మంది యువకులు బలిదానాలు చేసుకొంటే చూస్తూ కూర్చొన్న మీ భర్తలని నిలదీయకుండా, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడే సమయంలో వచ్చి సమైక్యాంధ్ర కోరడం ఖండిస్తున్నామని’ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసి సాధించుకొన్న తెలంగాణాను అడ్డుకొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెపుతూ “కబాడ్డార్ కొడకల్లారా!” అని ఈటెల హెచ్చరించారు. ఒకరిపై మరొకరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని కాంగ్రెస్ అధిష్టానం పదే పదే కోరుతునప్పటికీ, ఆయన మాటలను ఎవరూ ఖాతరు చేసే ఆలోచనలో లేరని అర్ధం అవుతోంది. ఇటువంటి మాటల వలన తెరాస నేతలే రాష్ట్ర విభజన ప్రక్రియకు అడ్డుపడుతున్నట్లవుతుంది. అదే జరిగితే ఈటెల చెపుతున్నట్లు హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడటం ఖాయం. అప్పుడు తెలంగాణా ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం, ఉద్రిక్తతలను నియంత్రించేందుకు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, మిగిలిన ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విదించే అవకాశం ఉంది.

కేసీఆర్ ని కాల్చిపారేస్తాం

      టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ని 10 రోజుల్లో చంపేస్తాం అంటూ ఓ బెదిరింపు లేఖ ఆ పార్టీ ఆ పార్టీ కార్యాలయానికి వచ్చింది. ఈ లేఖ ఆంధ్రా నక్సల్స్ పేరిట వచ్చింది.   అసలు ఈ బెదిరింపు లేఖ సెన్సేషన్ కోసం కేసీఆరే క్రియేట్ చేసుకున్నాడా ? లేకపోతే నిజం గానే వచ్చిందా..అన్న విషయం మీద ఈ లేఖ గురించి చిన్న చర్చ జరపబోతున్నాం. మీ మీ కామెంట్స్ తెలియజేయండి. కామెంట్స్ లో వాడే భాషలో అసభ్యమైన పదాలు ఉండకూడదు. ఒక వ్యక్తి సంస్కారం అతని తల్లిదండ్రుల నుండి అతనికి అబ్బుతుంది. ఆ వ్యక్తి సంస్కార హీనంగా ప్రవర్తిస్తే వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం కూడా ఆదే అని అర్ధం. కాబట్టి మీరు కామెంట్స్ చేసే ముందు మీ తల్లి దండ్రులను ఓ సారి గుర్తు చేసుకోండి.

ఆంధ్రులకు సాగునీటికొరత తీర్చే గోదావరి - పెన్నార్ లింకు కాలువలు

ప్రొఫెసర్ టి.శివాజీరావు, డైరెక్టర్, పర్యావరణ అధ్యయన కేంద్రం, గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్నం       ఒకానొకప్పుడు ఎడారికి గురికాబోతున్న రాయలసీమ సాగు భూములకు కృష్ణానదీ జలాలే శరణ్యమని ప్రభుత్వాధికారులు, ఇంజనీర్లు అనుకునేవారు. ఈస్ట్ ఇండియా బ్రిటిషుపాలకులు 19వ శతాబ్దంలోనే తుంగభద్రపై సుంకేశుల ఆనకట్టకట్టి పెన్నానదిలోకి నీరు మళ్ళించడానికి కడప-కర్నూలు సాగునీటికాలువలు త్రవ్వించారంటే రాయలసీమకు కృష్ణాజలాల తరలింపే శరణమని నిరూపించారు. అటు పిమ్మట 1901లో మద్రాసు ప్రభుత్వం నియమించిన సర్.కాలిన్ స్కాట్ కూడా కృష్ణా పెన్నానదుల అనుసంధానం కోసం తుంగభద్ర ప్రాజెక్టు కట్టమన్నారు. అందువల్ల 1905లో ప్రఖ్యాతి గాంచిన ఆంగ్లేయ ఇంజనీరు మెకంజీ దొర తుంగభద్రపై సముద్రమట్టం  మీద 1630 అడుగుల ఎత్తువరకు తుంగభద్ర నీటి జలాశయమట్టాన్ని వుంచుతూ రాయలసీమలో దాదాపు 9 లక్షల ఎకరాలకు సాగునీరిమ్మని సిఫారసు చేశారు. ధనాభావం వల్ల ప్రభుత్వం ఈ ఆయకట్టును 4 లక్షల ఎకరాలకు కుదించింది. 1927లో ప్రభుత్వం కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టి కృష్ణానీటినిదాదాపు 12 లక్షల ఎకరాలకు అందించమన్నారు. ఆ తరువాత మద్రాసు ప్రభుత్వం 1952లో రాయలసీమ సాగునీటి కోసం కృష్ణానదిపై సిద్దేశ్వరం జలాశయాన్ని నిర్మించి 7లక్షల ఎకరాలను సాగుచేద్దామనుకున్నారు. 1953లో ఖోస్లా నిపుణుల కమిటీ సిద్దేశ్వరం డ్యాం జలాశయం నీటిమట్టం 885 అడుగుల నుండి సాగునీటిని రాయలసీమకు మళ్ళించమన్నారు. కానీ దురదృష్టవశాత్తు మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాలు యేవి కూడా ఈ ప్రాజెక్టులను డబ్బులేదనే వంకతో అమలుపరచలేదు. అందువల్లనే ఆంధ్రరాష్ట్రాన్ని సాధించటానికి కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ నాయకులు ప్రయత్నించినపుడు 1837లో శ్రీబాగ్ ఒడంబడికను సాగునీటి పంపిణీకై రూపొందించి కృష్ణాజలాలను మరలించేటపుడు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. కానీ ఆఒడంబడిక ఇంతవరకు అమలుకాలేదు. ప్రస్తుతం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినట్లయితే రాయలసీమకు నీరు రాక ఎడారిగా మారుతుందని రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కానీ దీనికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వైనగంగ-పెన్నా నీటిపారుదల ప్రాజెక్టును 1980 నుండి అమలు చేయమని కోరడంలో రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు సభ్యులు విఫలమవుతూ వచ్చారు. ఈ ప్రాజెక్టు వివరాలను తెలుసుకోవడం ఆంధ్రుల అందరి ముఖ్య కర్తవ్యం. అంతే కాదు ఈ ప్రాజెక్టును అమలు చేయడం వల్ల నీటికొరత రాదు. తెలంగాణా రాష్ట్రం నుండి విడిపోయినట్లయితే కోస్తా జిల్లాలు ఎడారులవుతాయని రాజకీయనాయకులు ప్రజలను భయపెడుతున్నారు. నిజానికి కృష్ణాజలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ప్రజలు ఎగువభాగంలో ఉన్న తమ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి  బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను తుంగలోకి తొక్కి మళ్ళించుకోవడంతో ఆంధ్రకు రావలసిన దాదాపు 460 శతకోటిఘనపుటడుగులు (టి.ఎం.సి.) రావడం లేదని గ్రహించలేకపోతున్నారు. 1978 ప్రాంతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కర్ణాటక నాయకులైన శ్రీశంకరానంద్,  శ్రీరామకృష్ణహెగ్డే అలమట్టి ప్రాజెక్టును విపరీతమైన ఎత్తుకుపెంచినట్లయితే తమ రాష్ట్రంలోని కరవు ప్రాంతాలను సాగుచేసుకోవచ్చునని కేంద్ర జలవనరుల సంఘం అధికారులతో కుమ్మక్కై అలమట్టి డ్యాం ఎత్తును బాగా పెంచేందుకు ప్రయత్నించి సాధించారు. కానీ ఇందువల్ల కృష్ణా డెల్టా భూములు రాయలసీమభూములు ఎడారులవుతాయని అప్పుడే గ్రహించి కొంత మానవతా దృక్పధంతో వారికి ఎక్కువనష్టం రాకుండా చేయడానికి గోదావరి వరదలను, మిగులు జలాలను తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు రాష్ట్రాలు కూడా మళ్ళించడానికి ఇంద్రావతి-వైనగంగ-శ్రీశైలం-కావేరి లింకు ప్రాజెక్టును బృహత్తర సాగునీటి ప్రాజెక్టుగా రూపొందించి అమలు చేయాలన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం సూచించింది కాబట్టి దాన్ని అమలు చేయమని అడగడానికి ఆంధ్రులు ఎన్నుకొన్న రాష్ట్ర శాసనసభ్యులుగాని, పార్లమెంటు సభ్యులుగాని యేమాత్రం శ్రద్ధచూపకపోవడంతో అది మూలన పడేశారు. ఒకానొకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాయలసీమను రత్నాలసీమగా మార్చడానికి మిడ్ పెన్నార్ ప్రాజెక్టును రూపొందించి అటు పిమ్మట తుంగభద్ర జలాశయాన్ని నిర్మించి రాయలసీమ ప్రజలకు సాగునీరిద్దమనుకుంటే స్వార్థపరులైన రాయలసీమ నాయకులే ఈ ప్రాజెక్టులనుండి నీటిని రాయలసీమ భూములకు రానీయకుండా కుట్రలు పన్నిరాయలసీమ బంగారు భవిష్యత్తును నాశనం చేశారు. గతజలసేతుబంధనం అన్నట్లు పాతవిషయాలు మరచిపోయి ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇంద్రావతి-వైనగంగ-శ్రీశైలం లింకు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లయితే గోదావరిలో ప్రతి యేటా సముద్రంపాలయ్యే దాదాపు 1000 నుండి 2000 టి.ఎం.సి.ల నీటిని మళ్లించి ఆంధ్ర రాష్ట్రప్రజలకు తాగునీటిని, సాగునీటిని సరఫరా చేయవచ్చు. ఇందుకోసమై ప్రజలంతా ఈ ప్రాజెక్టును గురించి బాగా అర్థం చేసుకునేటట్లు చేయడానికి ఈ క్రింద ఇచ్చిన చిత్రపటం బాగా దోహదపడుతుంది.

రాష్ట్ర విభజన తెదేపా, వైకాపాలను దెబ్బతీయడానికే జరుగుతోందా

  కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక, రాష్ట్రంలో అతని ప్రాభల్యం తగ్గించేందుకే రాష్ట్ర విభజన చేస్తోందని వైకాపా ఆరోపిస్తుంటే, అదేమీ కాదు, కాంగ్రెస్ పార్టీ తెరాస, వైకాపాలను తనలో విలీనం చేసుకొని రాష్ట్రంలోతమ పార్టీని భూస్థాపితం చేయడానికే ఈ ఎత్తు వేసిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిజానికి ఆ రెండు పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ అఖిలపక్ష సమావేశంలో లేఖలు ఇచ్చిన సంగతిని కూడా ఇప్పుడు మరుగుపరుస్తూ, కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు అమలు చేస్తోందని వాదించడం చాలా అసమంజసం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వారు ఆరోపిస్తున్నట్లుగానే తమని రాజకీయంగా దెబ్బతీయడానికే రాష్ట్ర విభజన చేస్తోందని అనుకోన్నపటికీ, అందుకు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాటిలాగే ఒక రాజకీయ పార్టీయే గనుక, తనకు లబ్ది చేకూర్చేవిధంగానే నిర్ణయం తీసుకోవడం సహజం. రాష్ట్రంలో ఒక సీపీఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజన ను సూత్రప్రాయంగా ఆమోదిస్తూ లేఖలు ఇచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ తనకనుకూలంగా పావులు కదుపుతోందని ఆ పార్టీపై ఆరోపణలు చేయడం అవివేకం.   తెదేపా, వైకాపాలు రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుతం ఏవిధంగా రాజకీయ చదరంగం ఆడుతున్నాయో, కాంగ్రెస్ కూడా అదేవిధంగా ఆడుతోంది. ఈ ఆటలో కాంగ్రెస్ పార్టీ తమపై పైచేయి సాధించిందని బాధపడుతూ ఉద్యమాలు చేయడంకంటే, స్పష్టమయిన వైఖరితో మాట్లాడితే ప్రజలందరి అభిమానం పొందగలుగుతారు. అందుకోసం, ముందుగా ఆ రెండు పార్టీలు తాము తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలమా కాదా? అనే విషయంపై స్పష్టత ఏర్పరచుకొన్న తరువాత మిగిలిన విషయాలు మాట్లాడటం మంచిది. ఎందుకంటే, ఆ విషయంపై స్పష్టత ఈయకుండా, విభజన ప్రక్రియలో సమన్యాయం పాటించాలని ఉద్యమాలు చేయడం అనుచితం.   ఒకవేళ వారు తెలంగాణా ఏర్పాటుకి మనస్పూర్తిగా అంగీకరిస్తున్నట్లయితే, డొంక తిరుగుడు లేకుండా ఆ విషయం విస్పష్టంగా ప్రకటించి, ఆ తరువాత విభజన ప్రక్రియ ఏవిధంగా జరగాలని వారు కోరుకొంటున్నారో స్పష్టంగా ప్రకటించడం వలన, ప్రజలకి వారి విధానం ఏమిటో అర్ధం అవుతుంది. అంతేగాక రాష్ట్రంలో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చితి తొలగే అవకాశం కూడా ఏర్పడుతుంది. కానీ వారు ఆవిధంగా చేయకుండా తెలంగాణకు తాము వ్యతిరేఖం కాదంటూనే సమన్యాయం కోసం ఉద్యమాలు చేస్తామనడం వలన, అంతిమంగా వారే రెండు చోట్ల నష్టపోవడం ఖాయం.   సీపీఎం నేత సీతారం ఏచూరి నిన్నరాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కూడా ఇదేవిధంగా హెచ్చరించారు. రాబోయే ఎన్నికలలో రెండు ప్రాంతాలలో గెలవాలనే తాపత్రయంతో, కాంగ్రెస్ పార్టీ ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడితే అది నిప్పుతో చెలగాటమే అవుతుందని, అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారడం ఖాయమని ఆయన హెచ్చరించారు.   ఈ హెచ్చరిక వైకాపా, తెదేపాలకు కూడా చక్కగా వర్తిస్తుందని చెప్పవచ్చును. కానీ, వైకాపా తెలంగాణాలో తన పార్టీని వదులుకోవడానికి సిద్దపడినందున ఆ పార్టీకి కొత్తగావచ్చేనష్టం ఏమిలేకపోయినా, తెదేపా ఈ రెండు కళ్ళ సిద్ధాంతం మళ్ళీ అమలు చేయాలని చూస్తే, ఆ పార్టీ రెండు రాష్ట్రాలలో కూడా తీవ్రంగా నష్టపోక తప్పదు.

కెసిఆర్ ను 10 రోజుల్లో చంపేస్తాం

      టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును 10 రోజుల్లో కాల్చిపారేస్తామ౦ అంటూ సోమవారం ఓ బెదిరింపు లేఖ రావడం సంచలనం సృష్టిస్తోంది. కెసిఆర్..యూ విల్ బి షాట్ డెడ్ విత్ ఇన్ 10 డేస్ అంటూ ఎల్ఈటీ ఆంధ్రా నక్సల్స్ పేరిట బెదిరింపు లేఖ వచ్చినట్లు పార్టీ కార్యాలయం సోమవారం రాత్రి వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఇతర ఎమ్మెల్యేలు మంగళవారం రోజు డిజిపి దినేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే కెసిఆర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇటీవల తెరాస నేతలు చెప్పిన విషయం తెలిసిందే.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నారు

      తెలుగువారి ఆత్మగౌరవాన్ని చట్టసభలో అవమానిస్తున్నారని నంద‌మూరి హ‌రికృష్ణ అన్నారు. తెలంగాణ అంశంపై రాజ్యస‌భ‌లో చ‌ర్చకు అనుమ‌తించ‌డంతో హరికృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఆయన తెలుగులో ప్రసంగిస్తుండగా ఉప‌స‌భాప‌తి అందుకు అడ్డుచెప్పటంతో స‌భ‌లో కాసేపు గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది.   మీరు తెలుగులో మాట్లాడాలనుకుంటే మీరు ముందుగా చెప్పాలని ఉప‌స‌భాప‌ది ఆయనకి సూచించారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావాలి కదా అంటూ ప‌లుమార్లు ప్రసంగానికి అడ్డుత‌గిలారు. దీంతో ఇది మా దౌర్భాగ్యం అని హరికృష్ణ కోపంగా అన్నారు.   తెలుగు నేల‌కు చెందిన మేము తెలుగులో మాట్లాడకూడదా? నేను తెలుగులోనే మాట్లాడతాను. మీకు తెలుగులో అర్థం కాకపోతే ట్రాన్స్‌లేట‌ర్‌ను పెట్టుకోండి అంటూ త‌న ప్రసంగాన్ని కొన‌సాగించారు హరికృష్ణ. తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్టు తెలంగాణాపై నిర్ణయం చేసేశారు. కాంగ్రెస్ ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏక‌ప‌క్షంగా నిర్ణయం తీసుకుంద‌న్న ఆయ‌న ఒక కంట్లో కన్నీరు, మరో కంట్లో పన్నీరా, ఒక కంట్లో కారం, మరో కంట్లో కాటుక పెతడారా? అని ఆయన విమ‌ర్శించారు.

మోడి చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే

  హైద‌రాబాద్‌లో జ‌రిగిన న‌వ‌భార‌త యువ‌భేరి స‌భ‌లో మోడి చేసిన వ్యాఖ్యల‌పై కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శానాస్త్రాల‌ను ఎక్కుపెట్టింది. ప్రత్యేక తెలంగాణపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ చెప్పిన వన్నీ అబద్దాలేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. మోడి స‌భ‌లో చేసిన ప్రసంగంపై స్పందించిన దిగ్విజ‌య్‌, మోడి ఎప్పుడు వాస్తవాల ఆధారంగా మాట్లాడ‌ర‌న్నారు. తెలంగాణ పై బిజెపి స్పష్టమైన వైఖ‌రి లేద‌న్న ఆయ‌న తెలంగాణ, సీమాంధ్రపై మోడీ చెప్పినవన్నీ అబద్దాలే అన్నారు.   ప్రస్థుతం ప‌దే ప‌దే తెలంగాణకు మ‌ద్దతు ప‌లుకుతున్న బిజెపి గ‌తంలో తెలంగాణ‌కు అంగీక‌రించ‌లేద‌న్నారు.. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు లాల్ కృష్ణ అద్వాని తెలంగాణ వ‌ద్దర‌న్న విష‌యం గుర్తు చేశారు. మోడి మాటల్లో కొత్తద‌నం ఏమి లేద‌న్న ఆయ‌న మోడి స‌భ మామూలు రాజ‌కీయ స‌భ‌లాగే సాగింద‌ని ఎద్దేవా చేశారు. ఏపి ఎన్జీవోల‌ను స‌మ్మె విర‌మించాల‌ని కోరిన దిగ్విజ‌య్‌, సీమాంద్ర ప్రజ‌లు త‌మ స‌మ‌స్యల‌ను ఆంటోని క‌మిటీతో చ‌ర్చించాల‌న్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమన్నారు. ఎన్జీవోలతో చ‌ర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సుముఖంగానే ఉంద‌న్నారు.

సీమాంద్రల్లో స‌క‌లం బంద్‌

  ఏపిఎన్జీవోలు ముందు నుంచి ప్రక‌టిస్తున్నట్టుగా ఈ అర్థరాత్రి నుంచి స‌మ్మె య‌థాత‌థంగా జ‌రుగుతుంద‌న్నారు. సోమ‌వారం మంత్రి వ‌ర్గ ఉప‌సంఘంతో ఎన్జీవోలు జ‌రిపిన చ‌ర్చలు విఫ‌ల‌మ‌వ్వటంతో రేప‌టి స‌మ్మె య‌దాత‌థంగా జ‌ర‌గ‌నుంది. చ‌ర్చల అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఏపి ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు ఈమేర‌కు ప్రక‌టణ చేశారు. సీమాంద్ర స‌మ‌స్యల‌ను ఆంటోని క‌మిటీకి వివ‌రించే వ‌ర‌కు స‌మ్మె వాయిదా వేసుకోవాల‌ని ఉప‌సంఘంతో త‌మ‌ని కోరింద‌న్న ఆయ‌న అందుకు తాము అంగీక‌రించ‌లేద‌న్నారు.. సోమ‌వారం అర్ధరాత్రి నుంచే స‌మ్మె ప్రారంభం అవుతుంద‌ని ఎక్కడ బ‌స్సులు అక్కడే నిలిచిపోతాయ‌ని అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోలతో చ‌ర్చలు జ‌రిపిన వారిలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో సహా మంత్రులు ఆనం రాం నారాయణ  రెడ్డి, పితాని సత్యనారాయణలు ఉన్నారు. ఉద్యోగులు స‌మ్మె విర‌మించాల‌ని విధుల‌కు హాజ‌రు కావాల‌ని వారు కోరారు. శాంతియుత పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపచేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాబోతున్నాం’’ అని ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తేల్చిచెప్పారు సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్‌టీసీ సిబ్బంది, సహకార సంస్థల సిబ్బంది సమ్మె చేయనున్నట్లు ఆయన స్పష్టంచేశారు.

స‌భ‌లో తెలుగులో ప్రసంగించిన హ‌రికృష్ణ

  తెలంగాణ అంశంపై రాజ్యస‌భ‌లో చ‌ర్చకు అనుమ‌తించ‌డంతో వివిధ పార్టీల నేత‌లు త‌మ అభిప్రాయాల‌ను వెల్లడించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ స‌భ్యుడు ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి హ‌రికృష్ణ రాజ్యస‌భ‌లో తెలుగులో ప్రసంగించారు. అయితే ఉప‌స‌భాప‌తి అందుకు అడ్డుచెప్పటంతో స‌భ‌లో కాసేపు గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. స‌భ‌లో హ‌రికృష్ణ ప్రసంగానికిఅడ్డు చెప్పిన ఉప‌స‌భాప‌ది మీరు తెలుగులో మాట్లాడాలనుకుంటే మీరు ముందుగా చెప్పాలని ఆయన సూచించారు. సభ ఉపాధ్యక్షుడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావాలి కదా అంటూ ప‌లుమార్లు ప్రసంగానికి అడ్డుత‌గిలారు. దీంతో ఇది మా దౌర్భాగ్యం అని హరికృష్ణ కోపంగా అన్నారు. తెలుగు నేల‌కు చెందిన మేము తెలుగులో మాట్లాడకూడదా? నేను తెలుగులోనే మాట్లాడతాను. మీకు తెలుగులో అర్థం కాకపోతే ట్రాన్స్‌లేట‌ర్‌ను పెట్టుకోండి అంటూ త‌న ప్రసంగాన్ని కొన‌సాగించారు హరికృష్ణ. తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్టు తెలంగాణాపై నిర్ణయం చేసేశారు. కాంగ్రెస్ ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏక‌ప‌క్షంగా నిర్ణయం తీసుకుంద‌న్న ఆయ‌న ఒక కంట్లో కన్నీరు, మరో కంట్లో పన్నీరా, ఒక కంట్లో కారం, మరో కంట్లో కాటుక పెతడారా? అని ఆయన విమ‌ర్శించారు.

అద్వాని తెలంగాణ వ‌ద్దన్నారు

  రాష్ట్రంలో ఏర్పాడ్డ ప్రత్యేక పరిస్థితుల నేప‌ధ్యంలో రాజ్యస‌భ‌లో తెలంగాణ ప్రక‌ట‌నపై చ‌ర్చ జ‌రిగింది. అయితే రాష్ట్ర విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న కాంగ్రెస్ రాజ్యస‌భ స‌భ్యుడు కెవిపి రామ‌చంద్రరావు కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్థుతం తెలంగాణ‌కు బ‌య‌మైన మ‌ధ్దతు ప‌లుకుతున్న బిజెపి పార్టీకి చెందిన ప్రముఖులు గ‌తంలో రాష్ట్రవిభ‌జ‌న‌కు అడ్డుప‌డ్డారన్నారు. 2002లో తెలంగాణ విభజన నిర్ణయాన్ని అప్పటి హోం మంత్రి అద్వానీ తిరస్కరించారని  కేవీపీ తెలిపారు. 2002 ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ బిల్లును అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వానీ తిరస్కరించారన్నారు.   అయితే ప్రస్థుతం అన్ని పార్టీలు కాంగ్రెస్‌ను కార్నర్ చేయ‌టాన్ని ఖండిచిన ఆయ‌న 2004లో మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ రెండో ఎస్సార్సీని మాత్రమే ప్ర ప్రస్తావించిందన్నారు. ఈ మేర‌కు 2004లోనే టీఆర్‌ఎస్ పార్టీతో కాంగ్రెస్‌కి ఒప్పందం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రం నలుమూలాల పర్యటించి శ్రీకృష్ట కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అయితే ప్రస్థుతం విభ‌జ‌న నేప‌ధ్యంలో శ్రీకృష్ణ క‌మిటీ సిఫార్సుల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి అన్నారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విభ‌జ‌న‌ను కోరుకోలేద‌ని, విభ‌జ‌న‌కు అంద‌రి అభిప్రాయాలు మాత్రమే కోరారన్నారు.

తెలుగోడి ఘనత....ఏమవునో ఈ చరిత ?

      ....సాయి లక్ష్మీ మద్దాల   నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా జరుగుతున్న వివాదం రాష్ట్ర విభజన. ఆంధ్ర - తెలంగాణాలుగా రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణ ప్రాంతవాసులు కోరుతుంటె, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంద్ర ప్రాంతవాసులు కోరుతున్నారు. తెలంగాణాప్రాంతం అభివృద్ధికి వెనుకబడిందని, తమ ప్రాంతం వారికి ఉద్యోగాలలో అన్యాయం జరిగిందని వారు వినిపిస్తున్న వాదన. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంద్ర ప్రాంతం అభివృద్ధికి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. తమ ప్రాంతం వారికి ఉద్యోగాలు ఉండవని వారి వాదన. ఈ రెండు వాదనల సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థితి గతులను కూలంకషంగా పరిశీలించాలి.     గుజరాత్,రాజస్థాన్ ల నుండి వచ్చిన టాటాలు, బిర్లాలు, అంబానీలు లేకుండా ఎంత కష్టమో...నేడు ఆంధ్ర, రాయలసీమవాసులు లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని ఉహించడం అంతే కష్టం. ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ముఖ్యంగా సీమాంద్ర ప్రాంతంలో సాగుబడి లో ఉన్న పంట భూమి ఎక్కువ. అలాగే హైదరాబాద్ ను మినహాయిస్తే హైదరాబాద్ చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతం, మిగిలిన తెలంగాణా జిల్లాలలోను వ్యవసాయం ప్రధాన ఆధారం. భారతదేశం లో పల్లెలు ఎక్కువ అన్నది ఎంత సత్యమో... ఆంధ్రరాష్ట్రంలోను గ్రామీణ ప్రాంతం ఎక్కువ అన్నది అంత నిజం. గ్రామీణ ప్రాంతంలో  ప్రజలు  వ్యవసాయంతో బాటుగా వారి వారి కుల వృత్తులు, చేతి వృత్తులు ఆధారంగా వారి జీవనోపాధి సాగుతుంది. అలాగే కళాకారులకు, నాటకరంగం ఆధారం.    రాను రాను దేశం, రాష్ట్రం ఆధునీకరణను సంతరించుకుంటున్న తరుణంలో హైదరాబాద్ రాజధానిగా అవతరించిన ఆంధ్రరాష్ట్రం ఎన్నో కొత్తపుంతలు తోక్కనారభించింది. అందులో భాగంగానే వివిధ పరిశ్రమలు, వ్యాపారాలు, వాణిజ్య సముదాయాలు హైదరాబాద్ లో అవతరించాయి. దీనికి ముఖ్యకారణం పరిశ్రమలనుకూలమైన వాతావరణం ఉండటం. హైదరాబాద్ దేశంలో మద్య ప్రాంతంగా ఉండటం, పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రభుత్వ భూములు అధికంగా ఉండటం.   ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను పాలించిన రాజులు కళాకారులను, కవులను ఎంతగానో ఆదరించారు. తద్వారానే అక్కడ నాటక రంగం గణనీయమైన పేరు ప్రఖ్యాతలు గడించింది. ఆ కారణంగానే  ఆ సీమాంద్ర ప్రాంతం నుండి  విజయనగరం జిల్లా, కృష్ణా, గోదావరి జిల్లాల  నుండి ఎందరో కళాకారులూ పుట్టుకొచ్చారు. కాలభ్రమేణ నాటక రంగం నుండి సినిమా  రంగం అవతరించి సినీపరిశ్రమగా ఎదిగింది అలా మద్రాసు నుండి N.T రామారావు గారి ప్రోద్భలంతో  హైదరాబాద్  సినీ పరిశ్రమ తరలివచ్చి నేటి  హైదరాబాద్ అభివృద్దికి సినీ పరిశ్రమ కూడా ఒక కారణమయ్యింది. ఇక విద్య విషయానికొస్తే ఉస్మానియా యూనివర్సిటీ స్వాతంత్ర్యం రాక ముందు నుంచి ఉన్నప్పటికీ కొన్ని కార్పోరేట్ కళాశాలలు, విశ్వవిద్యలయాలు, మరికొన్ని విభిన్నమైన రంగాల అధ్యయనానికి  ఉపయోగపడే విద్యాసంస్థలు ( ఇంజనీరింగ్, మెడికల్, బిజినెస్ మేనేజ్ మెంట్, చైతన్య , నారాయణ కాలేజీలు) వంటివి  ఆవిర్భవించాయి. ఇవన్ని ఆధునీకరణను బాటలు వేసే యోచనతో వచ్చినవే. తదననుగుణంగా విద్యారంగంలోను ఆంధ్ర రాష్ట్రం  ప్రపంచందేశాలతో పోటీపడగలుగుతోంది.                ఇక కంప్యూటర్ రంగంలో నిపుణుల విషయానికొస్తే ఒక్క హైదరాబాద్ లోనే కాక మద్రాస్, బెంగుళూర్, పూణే, నోయిడా  లాంటి నగరాలన్నిటిలోను ఆంధ్ర,రాయలసీమప్రాంతం నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రగతిలోనే కాదు. భారతదేశ ప్రగతిలోను ప్రపంచ ప్రగతిలోను  వీరి భాగస్వామ్యాన్ని ఎవరు కాదనలేని సత్యం. Infosys,Wipro,Tcs,IBM, లాంటి సంస్థలన్నిటి లో తెలుగువారు ముఖ్యంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఎక్కువగా ఉండటం గమనార్హం.   ఇక తెలంగాణా ప్రాంతం వ్యవసాయరంగ అభివృద్ధి విషయానికొస్తే స్వయంగా ఆంధ్రప్రాంతం రైతులను పిలిపించుకొని వ్యవసాయం చేయటం  అంటేనే వీరి పాత్ర ఎంతవరకు తెలంగాణాలో ఉందో చెప్పవచ్చు. ఆ రకంగానే  నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతంలో వ్యవసాయం అంతగా  శోభిల్లుతోంది.   ఒకనాడు తెలంగాణాలో దొర పెత్తనం ఎంతగా  విలయ తాండవం చేసిందో అందరికి తెలుసు. ఆ కారణంగానే తెలంగాణాలో బానిసత్వం, పెట్టిచాకిరి విధానం భయంకరంగా ఉండేది. దానికి కారణం తెలంగాణా ప్రాతంలోని కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు అని అందరికి తెలుసు,. కానీ సీమాంద్ర ముఖ్యమంత్రులైన యన్.టి. రామారావు, చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రాంతంలోని పటేల్,పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రజల జీవన స్థితి గతులలో ఎంతో మార్పును తీసుకువచ్చారు. తెలంగాణ ప్రాంత అభివృద్దికి ఎంతగానో కృషి చేసారు.  ప్రతి పల్లెలో కూడా విద్యుతీకరణ జరిగింది . వీరిహయంలోనే రోడ్ల నిర్మాణం గాని, రవాణా సౌకర్యం గాని జరిగింది. Hitech  ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాడు.  నేడు గుజరాత్ ను అందరు అభివృద్దికి చిహ్నంగా చూపిస్తూన్నారు. గుజరాత్ అభివృద్దికి ముఖ్య కారణం అక్కడి వ్యాపార వ్యవస్థ సూరత్ లోని కాటన్ మిల్లుల నేపద్యంలో స్థాపించబడిన వస్త్ర వ్యాపారం గణనీయ అభివృద్ధిని సాధించి, గుజరాత్ అభివృద్ధికి దోహదపడింది. కానీ  అక్కడ చదువు కున్నవారి శాతం బాగా తక్కువ. ఆ కారణంగానే నెలకొల్పబడిన IT పరిశ్రమ పనిచేయటానికి నిపుణులైన విద్యావేత్తలు లేని కారణంగా అనేకమంది తెలుగు వాళ్ళు  అక్కడి  IT పరిశ్రమలలో పనిచేస్తూన్నారు. తద్వారా గుజరాత్ అభివృద్ధిలో తెలుగువారు భాగస్వాములయ్యారు. అలాగే గుజరాతీయులు పాకిస్తాన్ లోను వ్యాపారాలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్ధికాభివృద్ధిలో  దాదాపు 50% వాటా గుజరాత్ వారి శ్రమ ఉందనేది వాస్తవం.   ముంబాయిలో మరాఠీ భాష, గుజరాతీ  భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు కానీ ముంబాయ్ సినీ పరిశ్రమను ఎలుతున్నది మాత్రం నార్త్ ఇండియన్లు. దీనికి ఎవరిని తప్పు పట్టాలి? కళనా ? భాషనా?  ఒక ప్రాంత్రం అభివృద్ధి అనేది అన్ని రంగాల మీద ఆధారపడి ఉంటుంది. విద్యారంగం, వ్యవసాయ రంగం, వ్యాపార రంగం,పారిశ్రామిక రంగం, సీని రంగం, వార్త పత్రికలు, వర్తక, వాణిజ్య రంగాలు అన్నింటిని సాముహిక కృషి తోనే ఆ' ప్రాంతం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో  సహజ  వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సక్రమమైన పద్దతిలో వినియోగించుకో గలిగేతెలివితేటలు, సామర్ధ్యం, ఆర్ధికశక్తి, శ్రామిక శక్తి కావాలి. వీటన్నింటి ఒకచోట చేర్చగలిగే సమర్ధతే అభివృద్ధికి చిహ్నం.  ఒక ప్రాంతంలోని వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే మరొక ప్రాంతంలో పరిశ్రమలకు అనువైన మౌళిక పరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారం చేయటానికి అవసరమైన పెట్టుబడిని అందించడంతో పాటుగా అభిలాషకూడా ఉండాలి. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయగల సంకేతిక నైపుణ్యం తెలిసిన నిపుణులై శ్రామిక వర్గం కావాలి. అన్నింటికి మించి  వ్యాపార రంగ అభివృద్దికి దోహదపడే భూమి కావాలి. అ రకంగానే పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి లో అందరి సమిష్టి కృషి లేకపోయి వుంటే. సీమాంద్ర  ప్రాంత వాసులు తెలంగాణా అభివృద్ధిలో  భాగస్వాములు కాకపోయి ఉంటే హైదరాబాద్ రాష్ట్రంగానే  ఉండి ఉంటే ఖచ్చితంగా తెలంగాణా ప్రాంతం బీహార్,ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల లగే  ఉండేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.   ఒకనాడు కలసికట్టుగా ఒకరి నుండి ఒకరు పని పాటలు, నైపుణ్యలు తెలిసుకుని ముందుకు సాగిన తెలుగు జాతి నేడు  రాజకీయ దుష్టశక్తులు ఆడుతున్న చదరంగంలో అమాయకంగా బలవడం ధర్మమా ? మనలో ఎక్కడైనా వెనుకబాటు తనం ఉంటే దానికి కారకులైన వారిపై కలసి కట్టుగా పోరాడాలే కానీ విడిపోయి సాధించేదేముంది ? మరింతగా వైషమ్యాలు పెరిగి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నుండి నేతలకు విశ్రాంతి కలిగించడం తప్ప.   

కాంగ్రెస్ లోకి మాజీలు

      తెలంగాణ ఉద్యమం ఉదృతమైన అనేక సార్లు కేసీఆర్ ఆటంకం కలిగించారని మాజీ మంత్రి విజయ రామారావు ఆరోపించారు. సోమవారం ఉదయం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు అండగా ఉండాలనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేశామని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం చేస్తారని భావిస్తున్నామన్నారు. తెలంగాణ వస్తే దళితులకు న్యాయం జరుగుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీమాంధ్రలో ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్‌కు అండగా నిలవాలని భావిస్తున్నామని మరోనేత విజయరామారావు చెప్పారు.

వ్రతం చెడినా ఫలితం దక్కించుకోలేని వైకాపా

  జగన్ మోహన్ రెడ్డి తెలంగాణాలో కాలుమోపడానికి కూడా ఇష్టపడని అక్కడి ప్రజలను, కొండ సురేఖ, మహేందర్ రెడ్డి వంటి అనేకమంది తెలంగాణా నేతలు, కార్యకర్తల నిర్విరామ శ్రమఫలితంగా షర్మిల పాదయాత్ర సజావుగా సాగిపోయింది. విజయమ్మ రచ్చబండ కబుర్లనీ తెలంగాణా ప్రజలు ఓపికగా విన్నారు. షర్మిల, విజయమ్మలిరువురూ మండు వేసవిలో ఎంతో శ్రమ పడి తెలంగాణాలో పాదయాత్రలు, రచ్చబండ కార్యక్రమాలు, సభలు నిర్వహించారు. స్వర్గీయ వైయస్సార్ పై అభిమానంతో ఆ పార్టీలో చేరిన వేలాది తెలంగాణా కార్యకర్తలు, వందలాది నేతలు, తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా తెరాసకు ఎదురొడ్డి నిలిచి పార్టీని కాపాడుకొన్నారు. కానీ వారందరి శ్రమంతా కూడా జగన్ మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేఖంగా తీసుకొన్న ఒకే ఒక నిర్ణయంతో వ్యర్ధమయిపోయింది.   అంతేగాక, విస్వసనీయతకు పేటెంట్ హక్కులు తమవేనన్నట్లు మాట్లాడే వైకాపాను ఇప్పుడు తెలంగాణాలో ఎవరూ నమ్మడం లేదు. చివరికి పార్టీకోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలు కూడా ఆ పార్టీ తమని నట్టేట ముంచింపోయిందని తిట్టుకొంటూ, ఇక చేసేదేమిలేక మరో కొత్త పార్టీని వెతుకొంటున్నారు. రోజుల గడుస్తున్న కొద్దీ తెలంగాణాలో ఆ పార్టీ కార్యాలయాలు ఒకటొకటిగా మూత పడుతున్నాయి.   ఇదంతా ఎందుకు జరిగిందంటే కేవలం పార్టీకి దూరదృష్టి లోపించడం వలనేనని చెప్పవచ్చును. ఆ పార్టీ స్థాపించే నాటికే తెలంగాణా కోసం ఉద్యమాలు తీవ్రంగా సాగుతున్నాయి. అటువంటప్పుడు తమ పార్టీ రాష్ట్ర విభజనపై ఎటువంటి అభిప్రాయం కలిగిఉందో ఆపార్టీకి స్పష్టత కలిగి ఉండి ఉంటే, ఆ పార్టీ తెలంగాణాలో ఇంత శ్రమపడవలసిన అవసరం ఉండేదికాదు.   కేవలం ఆంద్ర ప్రాంతానికే తమ పార్టీని పరిమితం చేసుకొని ఉంటే, నేడు హటాత్తుగా సమైక్యరాగం ఎత్తుకోవలసిన అవసరము ఉండేది కాదు. అక్కడి ప్రజలచేత, పార్టీనేతలు, కార్యకర్తలచేత శాపనార్ధాలు పెట్టించుకొనే కష్టం తప్పేది. మొకాలి నొప్పితో షర్మిల పాదయాత్ర చేసే కష్టం, మండే ఎండలలో విజయమ్మ రచ్చబండ కబుర్లు అన్నీతెలంగాణాలో బదులు ఆంద్ర ప్రాంతంలోనే చేసుకొని ఉంటే కనీసం వారి శ్రమకు ఫలితమయినా దక్కి ఉండేది. పైగా ఆంధ్ర ప్రాంతంలో సమైక్యరేసులో అందరికంటే ముందు ఉండగలిగేది.   కానీ, వైకాపాకు మొదటినుండి సరయిన రాజకీయ మార్గదర్శనం చేసే సమర్దులయిన నేతలు లేకపోవడం చేతనో లేక ఉన్న వారి సలహాలు సూచనలు పాటించే అలవాటు లేకపోవడం వలనో లేక చంచల్ గూడా జైలు నుండి జగన్ మోహన్ రెడ్డి పార్టీకి శల్యసారధ్యం చేస్తునందునో మొత్తం మీద ఆపార్టీ చాలా అవమానకరంగా మూటాముల్లె సర్దుకొని తెలంగాణా నుండి బయటపడిందని చెప్పవచ్చును. వ్రతం చెడినా ఫలితం దక్కకపోవడం అంటే ఇదేనేమో.

మోడీని ప్రధాని కానివ్వం: ఒవైసీ

      నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొడతామని మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. మోడీ రాక సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బావమరిది, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్రమంత్రి చిరంజీవి బావమరిది, ఇతర ప్రముఖులు, పలు రాజకీయ నాయకులు హోటల్‌లో మోడీని కలవటాన్ని బట్టి.. వారు ఎంతవరకు లౌకికవాదాన్ని పాటిస్తున్నారో అర్థమవుతోందన్నారు. రాష్ట్ర విభజనతో ముస్లింలకు ఒరిగేదేమి లేదని, కేవలం మతతత్వ శక్తులకే లబ్ధి చేకూరుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనను ఎంఐఎం వ్యతిరేకించిందన్నారు. రాబోయే ఆరేడు నెలల్లో ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, మజ్లిస్ కార్యకర్తలు ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

జగన్, విజయమ్మల రాజీనామాలు పార్టీకి లాభమా, నష్టమా

  జగన్, విజయమ్మల రాజీనామాలతో వైకాపా చాలా తెలివిగా పావులు కదిపిందని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. తమ రాజీనామాలతో తమ ప్రియతమ శత్రువు చంద్రబాబుని, అధిష్టానానికి వ్యతిరేఖంగా మాట్లాడి సీమంద్రాలో ఒక్కసారిగా తన రేటింగ్ పెంచుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వైకాపా అధిగమించిందని విశ్లేషణ. అయితే, వారు తమ వద్ద ఉంచుకొన్నఆఖరి అస్త్రాలను కూడా ఒక చిన్న ప్రయోజనం ఆశించి నిరుపయోగపరుచుకొన్నారని చెప్పక తప్పదు. షర్మిల పాదయాత్ర కూడా ముగించుకొని వచ్చేసారు గనుక, 'సమైక్య చాంపియన్ షిప్ కోసం జరుగుతున్నరేసులో' ఆమెచేత సభలు, దీక్షలు, ర్యాలీలు నిర్వహింపజేసినా వైకాపాకి అదే ఫలితం వచ్చి ఉండేది. కానీ, జగన్ మోహన్ రెడ్డి చాలా అనాలోచితంగా, దూకుడుగా రాజీనామాలు సమర్పించడం వలన, ఇక ఆ పార్టీ నేతలెవరూ కూడా చట్టసభలలో ప్రవేశించే అవకాశం పోగొట్టుకొన్నారు.   ఇంకా సాధారణ ఎన్నికలకి దాదాపు 7-8నెలలు సమయమున్న ఈ తరుణంలో పార్టీకి చెందిన అందరూ రాజీనామాలు చేసి చట్ట సభలలో తమ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేసుకోవడం ఒక అనాలోచిత నిర్ణయమని చెప్పక తప్పదు. ఒక వేళ రాష్ట్ర విభజనపై తీర్మానం చేసేందుకు రేపు రాష్ట్ర శాసనసభను నిర్వహిస్తే, మిగిలిన అన్నిపార్టీలు సభలో తమ వాదనలు వినిపిస్తుంటే, వైకాపా మాత్రం అసెంబ్లీ బయట కూర్చొని ధర్నాలు దీక్షలు చేసుకొంటూ కాలక్షేపం చేసుకోవలసి ఉంటుంది.

విభజనపై ఎంవీవీఎస్ ఘాటు వ్యాఖ్యలు

      టిడిపి మాజీ ఎంపీ, సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి సాధారణంగా సౌమ్యంగా ఉంటారు. అలాంటి నేత విభజనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోవాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరని ఆయన అన్నారు. అది లేకుండా చేస్తే మాత్రం రక్తపాతమేనని ఆయన హెచ్చరిస్తున్నారు.   రాష్ట్ర విభజనపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, అయితే హైదరాబాద్ భవిష్యత్తు, రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన విధివిధానాలు, ఆర్థికపరమైన అంశాలపై తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని, ఇక చంద్రబాబు నోరు విప్పే సమయం ఆసన్నమైందని మూర్తి అన్నారు. అధికార దాహంతో, రాజకీయ స్వార్థంతో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌ను విభజించే హక్కు, అర్హత కాంగ్రెస్ పార్టీకి లేవని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన అభినందించారు.