మటుమాయం కానున్నఅవినీతి, అధిక ధరలు

  లోకులు కాకులవంటి వారు. అవినీతి మరకలు అంటని కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు చవాకులు వాగుతుంటారు. కాంగ్రెస్ యువరాజావారు అవినీతిని అంతం చేయాలనే సంకల్పం చెప్పుకొని స్వయంగా చొరవ తీసుకొని రెండేళ్లుగా అటక మీద పడున్న లోక్ పాల్ బిల్లుని దుమ్ముదులిపి పార్లమెంటు చేత ఆమోదింపజేసినప్పటికీ ఒక్కరు కూడా పాపం! ఆయనను మెచ్చుకొన్న పాపాన పోలేదు. నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపడేస్తే గానీ తమకీ జ్ఞానోదయం కలగలేదా? అంటూ యువరాజవారని కూడా చూడకుండా జనాలు ఆయనతో పరాచికాలు ఆడారు.   కానీ ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడి వంటి వ్యక్తి గనుక ఈరోజు తమ పన్నెండు రాజ్యాల ముఖ్యమంత్రులను డిల్లీకి పిలిపించుకొని వెంటనే తమ తమ రాజ్యాల నుండి అవినీతిని, అధిక ధరలను తరిమేయమని హుకూం జారీ చేసారు. అయినా అనకూడదు కానీ, కొత్త పార్టీ పెట్టుకొని బయటకిపోయే కిరణ్ కుమా రెడ్డిని పట్టుకొని యువరాజవారు అవినీతిని, అధిక ధరలను అంతం చేయామని ఆదేశిస్తే పాపం ఆయన మాత్రం ఈ వారం పదిరోజుల్లో ఏమి చేయగలరు? అందుకే ఆయన యువరాజా వారికి ఒక దివ్యమయిన సలహా ఇచ్చినట్లు సమాచారం. మనకి చేతకాని ఈ అవినీతి, అధిక ధరల అంతం గురించి ఎంత మాట్లాడినా వచ్చేఎన్నికలలో రాష్ట్రంలో జనాలు మనకి ఓటేస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల వీటికంటే సమైక్యం గురించి మాట్లాడుకొంటే మనకి ఎక్కువ ‘లైక్స్’ వస్తాయని సూచించారు. కానీ యువరాజావారు ఆ సమైక్య టాపిక్ గురించి వేరేగా మాట్లాడుకొందామని, ఇప్పుడు మాత్రం అందరూ అవినీతి, అధిక ధరల గురించి అనర్గళంగా ఉపన్యసించండని ఆదేశించడంతో అందరూ దాని గురించే మాట్లాడేసి బయటపడ్డారుట. ఇంతకీ ఈ ప్రయాస అంతా అవినీతిని, అధిక ధరలను అంతం చేయడానికా లేక వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు మాత్రమేనా? అని ఎవరయినా ప్రశ్నిస్తే వారి అజ్ఞానికి నవ్వుకోక తప్పదు.   గమనిక: అదృష్టవశాత్తు ఆ పన్నెండు రాజ్యాలలో మన రాష్ట్రం కూడా ఒకటి గనుక ఒకవేళ రాత్రికి రాత్రే అధిక ధరలు, అవినీతి మాయమయిపోతే ఎవరూ ఆశ్చర్యపోవద్దని మనవి.

రోశమ్మకు బాలకృష్ణ సహాయం

      మద్యపాన వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్రంలో మద్య నిషేధం విధించేలా చేసిన నెల్లూరు జిల్లా దూబగుంటకు చెందిన ఉద్యమకారిణి రోశమ్మ గుర్తుందా. మద్య నిషేధం ఎత్తేసిన తరువాత ఆమె ఎవరికీ పట్టకుండా పోయింది. అయితే ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.   ఆమె ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న సినీ నటుడు బాలకృష్ణ... రోశమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రెండు కిడ్నీలు చెడిపోయి నెల్లూరులోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోశమ్మకు బాలకృష్ణ సేవా సమితి తరఫున దాని కన్వీనర్, టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రూ.25 వేలు అందజేశారు. అనంతరం ఆయన బాలకృష్ణకు ఫోన్ చేయగా రోశమ్మతో ఆయన మాట్లాడారు. అనారోగ్యంపై చింతించవద్దని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్యం, ఇతరత్రా సహాయాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు అండగా నిలుస్తారని రోశమ్మకు భరోసా ఇచ్చారు.

రాహుల్ పై 'ఆమ్ఆద్మీ' అభ్యర్ధి పోటీ?

      ఢిల్లీ పీఠ౦ దక్కించుకున్న ఆమ్ఆద్మీ పార్టీ తర్వాతి టార్గెట్ ఏమిటి? మనలో ఎవరికైనా ఇలాంటి అనుమానం ఉంటే దాన్ని ఆ పార్టీ నేత కుమార్ విశ్వాస్ నివృత్తి చేశారు. ఆయన ఈ ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని రాహుల గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ సందర్శించనున్నారు. అక్కడ జాదు సందేశ్ యాత్రలో పాల్గొననున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిస్థితిని సమీక్షించనున్నారు. ఉత్తరప్రదేశ్లో ఆమ్ఆద్మీ తొలి అడుగుగా దీన్ని రాజకీయవిశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.   కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే ఆలోచనతో ఉన్న ఆమ్ఆద్మీ ..దేశ వ్యాప్తంగా కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలపైనే దృష్టి సారించిందని, అందులో భాగంగానే రాహుల్ నియోజకవర్గాన్ని లక్ష్యం చేసుకుందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ యాత్రలోపాల్గొనడమే కాకుండా అక్కడ తమ పార్టీ కార్యకర్తలతో విశ్వాస్ సమావేశం కూడా నిర్వహించనున్నారని సమాచారం. కొసమెరుపు ఏమిటంటే..రానున్న లోకసభ ఎన్నికలలో రాహుల్ ప్రత్యర్ధిగా ఆమ్ఆద్మీ  విశ్వాస్ పేరు ఇప్పటికే తెరపైకి రావడం. ఒకవైపు కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కిన ఆమ్ఆద్మీ అదే కాంగ్రెస్ పార్టీని భావి ప్రధాని అయిన ఇలాకాలో జెండా పాతాలనుకోవడం..నిజంగా విశేషమే.  

ఓటమి వైరాగ్యం నుండి బయటపడిన కాంగ్రెస్

  రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ఆత్మవిమర్శ చేసుకొని, అంతర్గత లోపాలను సవరించుకొని ముందుకు సాగుతామని చెప్పుకోవడం కూడా ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఒక మూస ధోరణినికి అలవాటుపడిపోయిన పార్టీలు, వాటి నేతలు తమ అలవాట్లను, పద్దతులను అంత త్వరగా వదులుకోలేవని ఆ తరువాత పరిణామాలు స్పష్టం చేస్తుంటాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో ఓడిపోయిన తరువాత సోనియా, రాహుల్ గాంధీలు కూడా ఈ ఆత్మవిమర్శ పాటనే మరోమారు కోరస్ గా ఆలపించారు. కానీ, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం రెండు రోజులే అన్నట్లుగా ఈ ఆత్మవిమర్శ బాధ నుండి వారు కూడా చాల త్వరగానే బయటపడగలిగారు.   వచ్చేఎన్నికలలో విజయం సాధించడం కోసం తమ పార్టీ, ప్రభుత్వం ఏవిధంగా సన్నదమవ్వాలనే దానికంటే, తమ బలమయిన రాజకీయ ప్రత్యర్ధి నరేంద్ర మోడీని ఏవిధంగా కట్టడిచేయాలనే తీవ్రంగా ఆలోచిస్తూ, ఒక మహిళా ఆర్కిటెక్ట్ కదలికలను కనిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం గూడచర్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ఒక కమీషన్ వేస్తున్నట్లు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిన్న ప్రకటించారు. గోద్రా అల్లర్లలో మోడీ పాత్రను పరిశోదించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక పరిశోదనా బృందం (సిట్) మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడం సబబేనని నిన్న అహ్మదాబాద్ లోని మెట్రోపోలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే, మరో కేసులో విచారణ అంటూ హోంమంత్రి కమీషన్ వేయడం చూస్తే, కాంగ్రెస్ ఎన్నటికీ తన తీరు మార్చుకో(లే)దని స్పష్టం అవుతోంది. ఈ తెలివితేటలేవో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఉపయోగించుకోగలిగితే కొంతయిన ప్రయోజనం ఉంటుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ కోర్టు క్లీన్ చిట్

      రెండువేల రెండులో జరిగిన అల్లర్ల కేసులో బిజెపి ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఉరట లభించింది. గోద్రా అల్లర్ల ఘటనపై మోడీకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై జకియా జాఫ్రీ అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందా అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా ముఖ్యంగా బిజెపి శ్రేణులలో నెలకొంది. వారికి ఊరట ఇచ్చేవిధంగా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అంతకుముందు గోద్రా అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణ చేపట్టింది. 2008 మార్చి 8వ తేదీన సుప్రీం కోర్టు సిట్‌ను నియమించింది. నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన సిట్ 2012 ఫిబ్రవరిలో అల్లర్లలో మోడీ పాత్ర లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిని జకియా న్యాయస్థానంలో సవాల్ చేసింది.

జేసీకి జగన్ షాక్

      వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన౦తపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్ధిగా సరోజమ్మను ప్రకటించడంతో మాజీ,మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇరకాటంలో పడ్డారు. ఇటు టీడీపీ జగన్ పార్టీల మధ్య జేసీ ఊగిసలాడుతుంటే జగన్ మాత్రం తరచూ జేసీ మీద పోటీ చేస్తున్న తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పేరం నాగిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు. క్రిస్ మస్ సంధర్భంగా ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరాడు. 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు నుండి ఒరిగింది ఏమీ లేదని నాగిరెడ్డి ప్రకటించారు. రెండు రోజుల క్రితం జెసి మాటలను చూస్తే ఆయన జగన్ వైపు వెళ్తారని భావించారు. ఇప్పుడు పేరం జగన్ పార్టీలోకి వెళ్లడంతో జెసి సోదరులకు తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అంటున్నారు.

గంటా ... తెదేపా వైపే నంట ...

      రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు ఇంట్లో పెళ్ళిబాజాలు బాగా మోగుతున్నాయి. ఆయన కుమార్తె పెళ్ళి బుధవారం జరగనుంది కాబట్టి అందులో వింతేమీ లేదు. అయితే ఈ పెళ్ళిబాజాలు సౌండ్ తో పాటు గంటా కాంగ్రెస్ కు జెల్లకొట్టి మరో పార్టీలోకి 'జంప్' కానున్నారనే వార్తలు మరింత మోతెక్కిస్తున్నాయి. బుధవారం జరగనున్న పెళ్ళికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు అవుతుండడంతో ఈ 'మోత' మరింత పెరిగింది. గంటా-బాబు మధ్య చర్చలు ఇప్పటికే ఫలప్రదమయ్యాయని, ఇక బహిరంగ ప్రకటనే మిగిలిందని అంటున్నారు. గంటా చేరిక పట్ల అయిష్టంగా ఉన్న స్థానిక తె.దే.పా. నేత అయ్యన్నపాత్రుడిని చంద్రబాబు బుజ్జగించారని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ తో పాటు ఆయన కుమారుడికి ఎం.పి. టిక్కెట్ కు సైతం ఓకే చెప్పారు కాబట్టి ... గంటా ఇక తె.దే.పా.లో గణగణమానడం ఖాయమని తె.దే.పా. వర్గాలు ఉత్సాహంగా చెప్తున్నాయి. విశాఖ రాజకీయాలను గత కొద్దికాలంగా శాసిస్తున్న గంటా ... అంత తొందరపడే వ్యక్తి కాదని, అతను తెదేపాతో పాటు మరో పార్టీతోనూ టచ్ లోనే ఉన్నారని మరికొందరు సందేహిస్తున్నారు.

పదవుల పందారం ... 'అప్'డే ముసలం?

      ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయా? అవుననే ఢిల్లీ రాజకీయవర్గాలు అంటున్నాయి. ఢిల్లీ పీఠాన్ని అధిష్టించనున్న ఆమ్ ఆద్మీ ... అరడజను మంది మంత్రుల్ని సైతం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో మంత్రిపదవి ఆశిస్తున్న మరికొందరు ఆశావాహుల్లో ఆగ్రహం చోటుచేసుకుందని సమాచారం. వీరిలో ముక్యంగా ఎం.ఎల్.ఎ. వినోద్ తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యారని, ఆయన మీడియా సమావేశం నిర్వహించి తన కోపాన్ని వెళ్లగక్కనున్నారనే వార్తలు ఢిల్లీ రాజకీయాన్ని మరోసారి వేడెక్కించాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వహించారని వినికిడి. వీరి ద్వారా వినోద్ ను బుజ్జగించే కార్యక్రమం పూర్తయిందని, ఆయనకు ముఖ్యమంత్రి సమక్షంలో బాధ్యతలు నిర్వర్తించే మరో ప్రధాన పదవిని ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందని సమాచారం.

సంపూర్ణ తెలంగాణ బిల్లు కాకుంటే యుద్ధమే : కెసిఆర్

      ఎటువంటి షరతులూ లేకుండా, కేంద్రం ఆధిపత్యం చలాయించే ప్రయత్నాలు చేయకుండా ... వెంటనే సంపూర్ణ తెలంగాణ బిల్లును ఆమోదించకుంటే మళ్ళీ యుద్ధం తప్పదని తె.రా.స. అధినేత హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఏ రకమైన త్యాగానికైనా సిద్ధమేనన్నారు. సీమాంధ్రులకు రూ. లక్షకోట్లు కాకుంటే ఇంకెన్ని లక్షల కోట్లు ఇచ్చుకునా తమకు అభ్యంతరం లేదని, అయితే తమకు మాత్రం ఎటువంటి షరతులూ లేని తెలంగాణే కావాలన్నారు. రాష్ట్రం సాధించడమే తన కల అని, అది నెరవేర్చలేక, చరిత్రలో మరో చెన్నారెడ్డిలా మిగిలిపోవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు.

టీ-బిల్లుని సాగనంపిన తరువాత కార్యాచరణ!

  తెలంగాణా బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు వీరోచితంగా పోరాడేసి అడ్డుకొంటామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు, ఏపీయన్జీవోల నాయకుడు అశోక్ బాబు అందరూ కూడా బిల్లు రాగానే ఎందుకో అకస్మాత్తుగా చల్లబడిపోయారు. బిల్లుతో బాటు హైదరాబాదుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ బహుశః ముఖ్యమంత్రిని చల్లబరిస్తే, ఆయన తన అనుచరులను అశోక్ బాబును చల్లబరిచారేమో! ఏమయినప్పటికీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేటికీ కూడా రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొంటానని పలవరిస్తూనే ఉన్నారు. అదేవిధంగా అశోక్ బాబు కూడా వారం వర్జ్యం అన్నీ చూసుకొని మళ్ళీ సమ్మె మొదలుపెడతామని హెచ్చరిస్తూనే ఉన్నారు.   ఇక తాజా వార్త ఏమిటంటే, బిల్లుని శాసనసభలో అడ్డుకోవడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని, అందువల్ల జనవరి 23నో లేక ఇంకా ముందుగానో బిల్లును శాసనసభ గుమ్మం వరకు సాగనంపేసిన తరువాత, అందరూ ఒక సమావేశం ఏర్పరచుకొని సమైక్యాంధ్ర కోసం ఏవిధంగా పోరాడాలో నిశ్చయించుకొందామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది.   ఒకవేళ అప్పుడు కూడా కుదరకపోయినట్లయితే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తరువాతనో లేకపోతే పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లుకి రాష్ట్రపతి ఆమోద ముద్రవేసిన తరువాతనో ఆ సమావేశామేదో పెట్టుకొంటే ఇంకా బాగుంటుందేమో ఆలోచిస్తే బాగుటుంది కదా!

క్రిస్మస్ తాత...తెదేపా నేత..

      సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చిత్తూరు ఎం.పి. శివప్రసాద్ కు నటించడానికి పూర్తి సమయం చిక్కడం లేదనే బాధకు సమైక్య ఉద్యమం రూపంలో మంచి పరిష్కారం దొరికినట్టుంది. సీమాంధ్రలో ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన రోజుకో గెటప్ వేస్తూ ఉద్యమాన్ని 'కలర్ ఫుల్'గా మారుస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో కొరడాతో కొట్టుకోవడం దగ్గర్నుంచి నారదుడి వేషం దాకా ఆయన సమైక్య 'వేషాలు' జనాన్ని బాగానే అలరిస్తున్నాయి. అదే కోవలో ఆయన క్రిస్మస్ పండుగ రోజున ఏకంగా క్రిస్మస్ తాతగా ప్రత్యక్షమయ్యారు. పిల్లలతో కలిసి ఆడిపాడి వారికి చాక్లెట్లు వంటి బహుమతులు కూడా ఇచ్చారు. పనిలో పనిగా మీడియా మైకుల ముందు 'సమైక్య'బాణీ కూడా వినిపించేశారు. ఏదైతేనేం ... వేషాల విషయంలో ఈ ఎంపిగారి స్పీడ్ చూస్తుంటే గతంలో ఇదే తరహాలో గెటప్ ల కింగ్ గా పేరొందిన మాజీ టిడిపి నేత బండి అనంతయ్య రికార్డ్ ను సైతం త్వరలోనే అధిగమించేట్టున్నారని కొందరు అంటున్నారు.

జేసీ దివాకర్ రెడ్డి ఉద్వాసనకు సత్తిబాబు ప్రత్యేక శ్రద్ద

  మనిషి నచ్చకపోతే ‘రామా’ అన్నాతప్పుగా వినిపిస్తుంది. అదే నచ్చితే ఎన్నిమాటలన్నా ముద్దుగానే ఉంటుంది. ఇది అక్షరాల కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది. తెలంగాణా ఉద్యమం ఉదృతంగా సాగుతున్నతరుణంలో ప్రజాగ్రహానికి, తెరాసకు భయపడి టీ-కాంగ్రెస్ నేతలు చాలామంది కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా గాంధీని కూడా తీవ్రంగా విమర్శించారు. అయితే అప్పటికే బహుశః రాష్ట్ర విభజన చేసేందుకు నిశ్చయించుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణా ప్రకటన చేస్తే వారందరూ దారికి వస్తారనే ఆలోచనతో వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు.   అదేవిధంగా సీమాంధ్ర నేతలు కూడా ఇప్పుడు ఇంచుమించు అటువంటి పరిస్థితే ఎదుర్కొంటూ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే అధిష్టానానికి కళ్ళు చెవులు లేవా? అని నిలదీసారు. అనేక మంది యంపీలు, మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసారు. పార్టీకి అత్యంత విస్వసనీయులన దగ్గ లగడపాటి, ఉండవల్లి వంటివారు మరో అడుగు ముందుకువేసి యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అయినా వారినందరినీ కాంగ్రెస్ అధిష్టానం నేటికీ ఉపేక్షిస్తోంది.   కానీ సోనియా గాంధీని పదవి నుండి తప్పుకోమని అడిగినందుకు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ జేసి దివాకర్ రెడ్డికి షో-కాజ్ నోటీసులు జారీ చేసి బయటకి సాగనంపడానికి సిద్దం అవుతోంది. అధిష్టానంపై జేసీ కొంచెం నోరు పారేసుకొన్నవిషయం వాస్తవమే. కానీ, అయన కుటుంబం నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో అనుబంధం కలిగి ఉందనే సంగతిని కూడా విస్మరించి, ఆయనని బయటకి సాగానంపాలనుకోవడం విచిత్రమే.   అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రమేయం కంటే పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ అత్యుత్సాహమే ఎక్కువగా కనబడుతోంది. లేకుంటే, మొన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు జేసీని పిలిపించుకొని హెచ్చరికతో సరిబెట్టి ఉండేవారు. పాలెం బస్సు దుర్ఘటన తరువాత నుండి జేసీ, బొత్సల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. అందువల్ల జేసీ దివాకర్ రెడ్డి సోనియాగాంధీని విమర్శించగానే ఇదే అదునుగా బొత్ససత్యనారాయణ పావులు కదిపి జేసీని బయటకి సాగనంపుతున్నారు. కానీ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి నందునే జేసీపై చర్యలు తీసుకొంటున్నామని ఆయన చెప్పడం హాస్యాస్పదమే.

బాబు వ్యూహం: లోక్ సభకు బాలయ్య!

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన సమయం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అసెంబ్లీకి కాకుండా లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకసభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని ఈ పరిశీలన జరుపుతున్నారు. కొన్ని సీట్లలో ఆసక్తికరమైన పేర్లు కూడా ఆ పార్టీ పరిశీలనలో ఉన్నాయి.   బాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.గత ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకొంది. సంప్రదాయకంగా టీడీపీకి బలమైన ఈ సీట్లో బాలయ్యను నిలపాలన్నది అధినాయకత్వ యోచన. అక్కడ కాని పక్షంలో విజయవాడ సీటుకు కూడా బాలయ్య పేరును పరిశీలించే అవకాశం ఉంది. చంద్రబాబు కూడా లోక్‌సభకు పోటీచేసే అవకాశముందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికలలో బిజెపి, తెలుగుదేశంలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ హవా వీస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే గెలుపు ఖాయమని బిజెపి, టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే చంద్రబాబు ఎంపీగా వెళ్లి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని, ఆ హోదాలో రాష్ట్రంలోని ఇరుప్రాంతాల్లో ఆయన పార్టీకి ఇమేజ్‌ పెంచి, వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేస్తారని అంటున్నారు. ఇటీవల బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సైతం నారా చంద్రబాబు నాయుడును జాతీయ రాజకీయాలలోకి ఆహ్వానించిన సంగతి విదితమే. ఆ క్రమంలోనే చంద్రబాబు జాతీయ రాజకీయాలపై ఆసక్తి పెరిగిందని భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మూడవ పెళ్ళి..!!

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడో పెళ్ళి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ నగర్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ నటి, తీన్ మార్ కోస్టార్ డానా మార్క్స్తో సహవజీవనం చేస్తున్న పవన్ కళ్యాణ్ దానిని చట్టబద్దం చేయించెందుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని అంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తుంది.   కొన్ని నెలల క్రితం తన రెండో భార్య రేణుదేశాయ్ కు విడాకులిచ్చిన పవన్.. ఆ తరువాత డానా మార్క్స్తో తో సహజీవనం చేస్తున్నాడని వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిని పవన్ కూడా ఖండించలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి డానా క్రిస్టమస్ ను సెలబ్రేట్ చేసుకుందని కూడా చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ మూడో పెళ్ళి కూడా రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది.  దీనిపై పవర్ స్టార్ ఈ సారైనా స్పందిస్తాడా లేదా వేచిచూడాల్సిందే!  

డిశంబర్ 28న ఆమాద్మీ ప్రమాణ స్వీకారం

  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకి ఆమాద్మీ పార్టీకి అనుమతి ఈయడంతో, ఈ నెల 28న(శనివారం) డిల్లీ ప్రభుత్వపగ్గాలు చెప్పట్టేందుకు అమాద్మీ సిద్ధం అవుతోంది. డిల్లీలో సుప్రసిద్ధ రామ్ లీలా మైదానంలో మధ్యాహ్నం 12గంటలకు ప్రజల సమక్షంలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఆయన ఆరుగురు అనుచరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   అమాద్మీకి మొదట బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తాము అంశాల వారిగానే మద్దతు ఇస్తామని, అమాద్మీ ప్రభుత్వం తమ నేతలకు వ్యతిరేఖంగా చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని చెపుతోంది. ఇప్పుడు దానికి మరో వాక్యం అదనంగా జోడిస్తూ అమాద్మీకి తాము మూడు నెలల గడువు ఇస్తున్నామని, దాని పని తీరును బట్టి మద్దతు కొనసాగించే విషయం పరిశీలిస్తామని ప్రకటించింది. అంటే ముందే ఊహించినట్లుగా రాబోయే ఎన్నికల ముందు మద్దతు ఉపసంహరించి అమాద్మీ ప్రభుత్వాన్ని పడగొట్టబోతోందని స్పష్టం అవుతోంది.   అందుకు అమాద్మీ కూడా మానసికంగా సిద్ధమయ్యే ఉంది గనుక అమూల్యమయిన ఈ మూడు నెలల సమయంలో “నిజంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని’ ఏర్పాటుచేసి తనను తాను నిరూపించుకోగలిగితే, ఈసారి పూర్తి మెజార్టీతో ఎన్నికయి ఎవరి మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కలుగుతుంది.

లక్నోకి వెళ్ళినా ఒరిగిదేముంది

  ఆలూ లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు, శాసనసభ, మండలిలో రాష్ట్ర విభజన బిల్లుపై ఎటువంటి చర్చజరిగే అవకాశం లేకపోయినప్పటికీ, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉత్తరాఖండ్ విభజనపై అక్కడ శాసనసభలో ఏవిధంగా చర్చ జరిగింది? అందుకు అనుసరించవలసిన విధి, విధానాలేమిటి? వాటిని అక్కడి సభాపతి ఏవిధంగా అమలుచేసారు?వంటి విషయాలపై అధ్యయనం చేసేందుకు లక్నో వెళ్లారు. అసలు సభలో బిల్లుపై చర్చ జరిగే అవకాశమే లేదని తెలిసినప్పుడు ఆయన ఎంత అధ్యయనం చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం? అందువల్ల సభలో బిల్లుపై చర్చ జరగాలంటే ముందుగా సభని స్తంబింపజేస్తున్నపార్టీలను ఏవిధంగా దారిలో పెట్టాలో తెలుసుకొని వస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందేమో? బహుశః ఈసారి సమావేశాలు మొదలయినప్పుడుసభను స్తంబింపజేస్తున్న వారినందరినీ సస్పెండ్ చేసి మిగిలినవారితోనే సభ నిర్వహిస్తారేమో?

కావురికి ఇంట్లో ఈగల మోత

  నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే సీమంధ్ర కేంద్ర మంత్రులలో సమైఖ్యాలోచన కూడా ఉండదని సీమంధ్ర ప్రజలు గ్రహించలేకపోయారు కానీ, తెలంగాణా నేతలు, ప్రజలు మాత్రం ఆ విషయం బాగానే గ్రహించారని ఒప్పుకోక తప్పదు. కేంద్ర మంత్రి కావూరివారు మొన్నఉభయగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఆయనకి కోడిగుడ్లతో సత్కారం చేస్తే, నిన్నఆయన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో పర్యటించినప్పుడు మాత్రం తెలంగాణా వాదుల నుండి ఆయనకు ఎటువంటి ప్రతిఘటనా ఎదురవలేదు. ఆయన తెలంగాణాకి వ్యతిరేఖంగా ఎన్నిమాటలు మాట్లాడినా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలాగే ఆయన కూడా ఎన్నడూ అడ్డుపడలేదు. తన పదవిని కాపాడుకొనేందుకు పాపం ఆయన పడుతున్న తిప్పలను తెలంగాణా వాదులు సానుభూతితో అర్ధం చేసుకొన్నారు గనుకనే కేంద్రమంత్రిగా సిరిసిల్లా చేనేతన్నలకు వరాలు కురిపించడానికి వస్తున్న ఆయనకు స్వాగతం పలికారు. కానీ సార్వత్రిక ఎన్నికలు వస్తునందున ఆయన మంత్రిగిరీ మహా అయితే మరో రెండు మూడు నెలలుకు మించి ఉండబోదని తెలిసినప్పటికీ ఆయన తను శాశ్వితంగా అధికారంలో ఉండబోతున్నట్లు అనేక వాగ్దానాలు గుప్పించడమే విశేషం.