రోడ్డెక్కిన మేయర్ అభ్యర్థులు

  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీల మేయర్ అభ్యర్థులు ఇద్దరూ రోడ్డెక్కారు. అయితే వీళ్లిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకోలేదు.. అధికారుల మీదే మండిపడ్డారు. రెండు వేర్వేరు కారణాలతో వీళ్లు ఆందోళన చేయాల్సి వచ్చింది. 39వ వార్డులో ఓటు వేసేందుకు వెళ్లిన టీడీపీ మేయర్ అభ్యర్థి పంకం రజనీ శేషసాయికి ఓటు లేదని చెప్పడంతో ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్‌లు లేకపోవడంతో ఓటర్లు చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని ఆమె అన్నారు. కార్పొరేషన్ సిబ్బంది స్లిప్‌లు పంపిణి చేస్తామన్నా, సగం మందికి మాత్రమే వచ్చాయని, మిగిలిన సగం మందికి స్లిప్‌ లు రాలేదని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటర్లు 960 మంది ఆగిపోయినట్లు ఆమె తెలిపారు. ఇక్కడ ఎవరూ సహకరించడం లేదని రజనీ శేషసాయి పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తప్పును సరిచేయడంతో ఆమె మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.   మరోవైపు, వైఎస్ఆర్ సీపీ మేయర్ అభ్యర్థిని షర్మిలారెడ్డి భర్త అనిల్ రెడ్డి ఓటు వేసేందుకు వెళ్లగా ఈలోపే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లు జరుగుతాయని తమకు అనుమానం ఉండటంతో ఆయనను ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఎంత సేపటికీ అనిల్ రెడ్డిని వదలకపోవడంతో షర్మిలారెడ్డి, ఇతర నాయకులు వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుమీదే కూర్చుని చాలాసేపు ధర్నా చేశారు. అనిల్ ఉంటే ఓటింగ్ బాగా జరుగుతుందన్న దుగ్ధతో టీడీపీ నాయకుడు బుచ్చయ్య చౌదరి ఇలా చేయించారని షర్మిలారెడ్డి ఆరోపించారు.   మొత్తమ్మీద ప్రధాన పార్టీల అభ్యర్థినులు ఇద్దరూ అధికారుల వైఖరి మీద ముందుగానే మండిపడుతూ ఆందోళనలు చేశారు. వీళ్లిద్దరిలో ఎవరు మేయర్ అయినా, తర్వాతి కాలంలో రాజకీయాలు, పాలన ఎలా ఉంటాయోనని ప్రజలు చెవులు కొరుక్కోవడం కనిపించింది.

ఒక కుటుంబం.. 47 ఓట్లు!

  అసలే ఎన్నికల వేళ.. ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయని తెలిస్తే చాలు.. అభ్యర్థులంతా వారింటికి వెళ్లి, ఆ ఓట్లు సంపాదించడానికి నానా పాట్లూ పడతారు. అలాంటిది ఒకే ఇంట్లో ఏకంగా 47 ఓట్లుంటే.. నేతల ప్రయత్నాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. బీహార్ లోని కిషన్‌గంజ్ నియోజకవర్గంలో 85 మందితో ఉన్న ఓ ఉమ్మడి కుటుంబానికి ఇదే కారణంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. పుర్నియా జిల్లాలోని జియాగచ్చి గ్రామంలో ఓ ఉమ్మడి కుటుంబం నివసిస్తోంది. 55 మంది పురుషులు, 30 మంది మహిళలు, 35 మంది చిన్నపిల్లలు ఉన్న ఆ అవిభాజ్య కుటుంబంలో 47 మందికి ఓటు హక్కు ఉంది. అంతే.. ఈ విషయం తెలుసుకున్న వివిధ పార్టీల అభ్యర్థులు వారి ఇంటికి క్యూలు కడుతున్నారు. ఆ 47 ఓట్లూ తమ ఖాతాలో వేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ‘‘ఈ లోక్‌సభ ఎన్నికల్లో మా కుటుంబం నుంచి 47 మంది ఓటు వేయనున్న నేపథ్యంలో మాకు విపరీతమైన డిమాండ్ పెరిగింది’’ అని ఆ కుటుంబ పెద్ద మహ్మద్ న జీర్ తెలిపారు.

మునిసి‘పోల్స్’లో హస్తవాసి?

  తెలంగాణాలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కొంతవరకు సానుకూల వాతావరణం కనిపించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉంటుందని, చాలాచోట్ల ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ నడిచిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల ఎంఐఎం కూడా కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఈ మూడు జిల్లాలతోపాటు ఖమ్మంలోనూ కాంగ్రెస్ పట్ల కొంచెం మొగ్గు ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తున్నా... వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బాగా పోటీపడినట్లు కనిపిస్తోంది. ఒకటీరెండు చోట్ల బీజేపీ హవా కొంత కనిపించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ కనిపించింది. మునిసిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల పట్టణాల్లో సానుకూల వాతావరణం కనిపించిందని ఆ పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో కూడా రెబల్స్ బెడద లేకుండా చూడడంలో సఫలీకృతులయ్యారు.

టీ-జేఏసీ నేతలకు కాంగ్రెస్, తెదేపా వల

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్  ఎన్నికలలో ఎలాగయినా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయంలో ఇంతకాలం తనతో కలిసి తెలంగాణా ఉద్యమాలు చేసిన విద్యార్ధులను, జేఏసీ నేతలను పక్కనబెట్టి, గెలుపు గుర్రాల కోసం చూస్తుండటంతో వారందరూ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొన్న జరిగిన టీ-జేఏసీ సమావేశంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తమను కాదని కొండా సురేఖ వంటి తెలంగాణా ద్రోహులను పార్టీలో జేర్చుకొని టికెట్స్ కేటాయించడాన్ని వారు తీవ్రంగా తప్పు పట్టారు. ఇక తెలంగాణా ఉద్యమాలలో అందరికంటే ముందుండి పోలీసుల చేతిలో లాటీ దెబ్బలు తిని, నేటికీ కేసులు ఎదుర్కొంటున్న ఉస్మానియా జేఏసీ విద్యార్ధులను కూడా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వారు కూడా తమ తరపున కొందరు విద్యార్ధులను ఎన్నికలలో అభ్యర్ధులుగా నిలబెట్టబోతున్నట్లు ప్రకటించారు.   అయితే దీనినొక అవకాశంగా భావించిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఉడుకు రక్తం గల విద్యార్ధుల కంటే జేఏసీ నేతలనే మంచి చేసుకొన్నట్లయితే లక్షలాది ఉద్యోగుల, వారి కుటుంబాల ఓట్లు రాల్చుకోవచ్చనే ఆలోచనతో, జేఏసీ నేతలు కాంగ్రెస్ లో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని వారు గనుక పార్టీలోకి వచ్చినట్లయితే తగిన విధంగా గౌరవించి ఆదరిస్తామని చెపుతూ వారిని పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదేవిధంగా తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న వివిధ జేఏసీలలో యువకులను పార్టీలోకి ఆకర్షించి వారికి టికెట్స్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేసారు.   ఈవిధంగా కాంగ్రెస్, తెదేపాలు జేఏసీ నేతలను తమవైపు త్రిప్పుకొనే ప్రయత్నాలు చేయడం చూసి తెరాస కూడా అప్రమత్తమయింది. టీ-యన్జీవో ఉద్యోగుల నాయకుడు శ్రీనివాసులు రెడ్డికి ఇప్పటికే టికెట్ ఖరారు చేయగా త్వరలోనే మరికొందరికి కూడా పార్టీకి బలం లేని నియోజక వర్గాలలో వారికి టికెట్స్ కేటాయించి వారి నోటనే తాము పోటీ చేయబోమని చెప్పించి నెపం తన మీద పడకుండా తెలివిగా తప్పుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీని వల్ల తెరాస నెపం తన మీద పడకుండా తప్పుకోవచ్చేమో కానీ పార్టీ పట్ల వారికేర్పడిన వ్యతిరేఖతను మాత్రం తగ్గించలేదు.

దటీజ్ రాహుల్ గాంధీ..దటీజ్ కాంగ్రెస్ పార్టీ

  కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి కాంగ్రెస్ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకొంటామని నాలుగు పడికట్టు పదాలు పలుకుతుంటారు, కానీ వారు కేవలం ఆత్మా వంచన మాత్రమె చేసుకోగలరని వారు పదే పదే నిరూపిస్తుంటారు. ఎన్నిసార్లు ఓడిపోయినా తమ అలవాట్లను, ఆలోచనలను, పద్దతులను కనీసం మాట తీరుని కూడా మార్చుకోకపోవడమే కాంగ్రెస్ లక్షణంగా భావించవచ్చును.   కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని విమర్శిస్తూ అతను తన స్వలాభం కోసం అన్నదమ్ములులాగ మెలుగుతున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి కూడా వెనుకాడరని ఆరోపించారు. అయితే ఎదుటవాడివైపు ఒక వ్రేలు చూపితే, మిగిలిన నాలుగు వేళ్ళు మనవైపే చూపుతాయనే అనే సంగతి బహుశః ఆయనకి మరి తెలుసో తెలియదో కానీ, తనను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి, తన తల్లి సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేసి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని అందరికీ తెలుసు. పాము తన పిల్లలను తానే తింటుదన్నట్లు, సీమాంద్రాలో తమ స్వంత పార్టీని, అక్కడి కాంగ్రెస్ నేతల భవిష్యత్తుని సర్వనాశనం చేయడంతో వారు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు చెల్లాచెదురయిపోవడం యువరాజవారి దృష్టికి రాలేదో వచ్చినా అది పెద్ద తప్పుగా కనబడలేదో ఆయనకే తెలియాలి.   గురువింద గింజ సామెతలాగా రాహుల్ గాంధీ తన కోసం తన తల్లి చేసిన నిర్వాకం గురించి ప్రస్తావించకపోయినా తన ప్రతీ సభలో మోడీని విమర్శించడం మానడు. మోడీ తన స్వలాభం కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుకొంటే, రాహుల్ గాంధీ స్వలాభం కోసం సోనియా గాంధీ, తెలుగు ప్రజలందరి జీవితాలతో, తన స్వంత పార్టీ నేతల జీవితాలతో కూడా చెలగాటమాడారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుని ఆమోదింప జేసేందుకు నిస్సిగ్గుగా చేతులు కలిపిన ఈ రెండు జాతీయ పార్టీల ఎన్నికల రాజకీయాలు ఎలా ఉన్నపటికీ, వాటికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీమాంద్రాకు చేసిన ద్రోహానికి తగిన గుణపాటం చెప్పేందుకు ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ మేకపోతు గాంభీర్యం నటించడంలో కాంగ్రెస్ కు మించిన వారు ఉండరు గనుక చిరంజీవి వంటి వారు ఇంకా తమ బస్సు యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చిందని చెప్పుకోగలుగుతున్నారు.

ఈవీఎంలతో దగా చేస్తారా?

  ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరుచుకుని పోయే అవకాశాలు నూటికి నూరుశాతం కనిపిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఇంటికి, కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీని పుట్టింటికి పంపడానికి పూర్తిగా ప్రిపేర్ అయి వున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ టీడీపీ అనే అంచనాలకు రాజకీయ పరిశీలకులు వచ్చేశారు. ఈ నేపథ్యంలో అధికారం నిలుపుకోవడానికి ఎలాంటి అడ్డదారులైనా తొక్కడానికి సిద్ధమయ్యే కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయనే అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.   కాంగ్రెస్ కుట్ర చేసి, ఓటర్లను దగా చేయడానికి అవకాశం వున్న ప్రధాన అంశం ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి ఓటు వేసినా ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే విధంగా ఈవీఎంలను కాంగ్రెస్ పార్టీ ‘తీర్చిదిద్దే’ ప్రమాదం వుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం ఓట్లు వేసే ఈవీఎంలు శత్రు దుర్భేద్యమైన కోటలేం కాదు. కాస్తంత ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం వున్న ఎవరైనా వాటితో ఫుల్లుగా ఆడుకోవచ్చు. తమకు ఇష్టమొచ్చిన విధంగా వాటిని వాడుకోవచ్చు. ఈవీఎంలను ఏరకంగానైనా పనిచేయించవచ్చన్న అభిప్రాయాలను అనేకమంది సాంకేతిక నిపుణులు వ్యక్తం చేశారు. ఈవీఎంలను నమ్మడానికి ఎంతమాత్రం వీలు లేదని వారు స్పష్టంగా చెప్పారు.   ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తనకు అనుకూలంగా మార్చే కుట్రకు తెరతీసే అవకాశం వుందన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏం పర్లేదు ఎన్నికల సంఘం వుంది కదా అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎన్నికల సంఘం మంచిదే. కానీ అందులో పనిచేసేవారిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా ఆడిస్తే అలా ఆడే ఈవీఎంలను అస్సలు నమ్మాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈవీఎంల నిర్వహణ మరింత పారదర్శకంగా, మరింత బాధ్యతాయుతంగా, మోసాలు జరగడానికి వీలు లేకుండా వుండే విధంగా ఏ చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలను ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన అవసరం వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

దేవీప్రసాద్ అలక!

  తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి, గొంతు నొప్పి పుట్టేలా అరిచిన పలువురు ఈసారి ఎన్నికలలో పోటీచేసి తమ అదృష్టాన్ని పరిశీలించుకోవాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారందరి ఫస్ట్ ఛాయిస్ టీఆర్ఎస్ పార్టీనే. ఆ పార్టీ ఇలాంటి వారిని అంతగాపట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. దాంతో చాలామంది ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారు. అలుగుతున్నారు. అలాంటి వారిలో ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ కూడా చేరారు. తెలంగాణ ఉద్యోగులలో విభజన కుంపటి రాజేయడానికి ఉద్యోగ సంఘాల నాయకులైన శ్రీనివాస్‌రెడ్డి, దేవీప్రసాద్ శాయశక్తులా కృషి చేశారు. ఉద్యోగులలో భావోద్వేగాలు పెరగడానికి వీరిద్దరూ శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వీరిద్దరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంది. వీరిద్దరూ కూడా టీఆర్ఎస్ దత్త పుత్రుల మాదిరిగా తమవంతు సేవలు అందించారు.   అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత మాత్రం టీఆర్ఎస్ పార్టీ శ్రీనివాసరెడ్డిని అక్కున చేర్చుకుని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ అసెంబ్లీ టిక్కెట్‌ కూడా ఇచ్చేసింది. అప్పటి వరకూ అక్కడ పార్టీకి సేవ చేసిన ఇబ్రహీం అనే కార్యకర్తకి జెల్ల కొట్టి మరీ శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. అయితే ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని, టీఆర్ఎస్ నుంచే తనకు ఆహ్వానం రావాలని కోరుకున్న దేవీప్రసాద్‌కి మాత్రం నిరాశే మిగిలింది. తన తోటి ఉద్యమకారుడు శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చి తనను ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో దేవీప్రసాద్ టీఆర్ఎస్ మీద అలిగినట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్‌కి దత్తపుత్రుడిలా వ్యవహరించిన దేవీప్రసాద్‌ని ఇటు టీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. మిగతా పార్టీలు కూడా దేవీ ప్రసాద్‌లో టీఆర్ఎస్ మనిషి కదా అని ఊరుకున్నాయి. దాంతో ఆయన పరిస్థితి ఇంటి కూటికి, బంతి కూటికి కూడా చెడినట్టు అయింది. దీనికి తగ్గ ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టుగా దేవీ ప్రసాద్ ఈ ఎన్నికలలో ఉద్యోగ సంఘాలు ఏ పార్టీని సమర్థించవని ప్రకటించారు. ప్రస్తుతం దేవీప్రసాద్ అలక తీర్చే బాధ్యత కేసీఆర్ మీదే వుంది.

కేజ్రీ చీప్ ట్రిక్స్!

  చీప్ ట్రిక్స్ ప్రదర్శించడంలో రాజకీయ నాయకులు ఏనాడో ముదిరిపోయారు. లేటెస్ట్ గా రాజకీయాల్లో ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముదురు రాజకీయ నాయకుల కంటే మరింత ముదిరిపోయాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కడానికి ముందు.. ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిన తర్వాత కేజ్రీవాల్ ప్రదర్శించిన చీప్ ట్రిక్స్ తో ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు. నిన్నగాక మొన్న కేజ్రీవాల్ ముఖం మీద ఎవరో వ్యక్తి ఇంకు చల్లాడు. ముఖం నిండా ఇంకు పెట్టుకునే కేజ్రీవాల్ ఓ మీటింగ్‌లో పాల్గొని భారీ స్థాయిలో ప్రసంగించాడు. ఇలాంటి సంఘటనలు తనను ఆపలేవని భారీ డైలాగ్స్ కొట్టాడు. మామూలుగా అయితే జనానికి క్రేజీవాల్ మీద బోలెడంత సానుభూతి పుట్టి వుండేది. అయితే కేజ్రీగారి క్రేజీ పనుల గురించి జనానికి ఇప్పటికే బాగా తెలిసిపోవడంతో ఈ సంఘటనని లైట్‌గా తీసుకున్నారు.   ఆ ఇంకు ఎవరో బయటివాళ్ళు చల్లారో, జనంలో సానుభూతి కొట్టేయడానికి కేజ్రీవాలే చల్లించుకున్నాడో ఆ కేజ్రీవాల్‌కే తెలియాలి. ఇంకు ట్రిక్ పనిచేయాలేదని అనుకున్నాడో ఏంటో గానీ లేటెస్ట్ గా కేజ్రీవాల్ మరో ట్రిక్ ప్రదర్శించాడు. పాపం కేజ్రీవాల్ ఏదో మీటింగ్‌కి ఎవరో వ్యక్తి వెనుక నుంచి ఆయన మెడమీద కొట్టాడట. అక్కడే వున్న కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారట.   ఈ పాయింట్‌ని కేజ్రీవాల్ అర్జెంటుగా ట్విట్టర్లో పెట్టేసి సానుభూతి పొందడానికి తెగ ప్రయత్నించేశాడు. దాంతోపాటు తన మెడమీద కొట్టిన వ్యక్తి మీద తనకెలాంటి కోపం లేదని అభినవ గాంధీ గారిలా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అయ్యా కేజ్రీవాల్ నువ్వెన్ని చీప్ ట్రిక్స్ ప్రదర్శించినా జనం నిన్ను నమ్మరు.

బీజేపీ లాగుడు ఎక్కువైంది!

  తెలుగులో ఓ సామెత వుంది.. తెగేదాకా లాగొద్దని. మరి ఇటువంటి సామెత మరి హిందీలో ఉందో లేదేమో అనిపిస్తుంది బీజేపీ వ్యవహారం చూస్తుంటే. ఒకవేళ వుంటే, బీజేపీ అగ్ర నాయకత్వం ఈ సామెతని చదివి వుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయాన్ని తెగేదాకా లాగే ప్రయత్నం మానుకుని వుండేది. తెలుగు తెలిసిన వెంకయ్య నాయుడో, కిషన్‌రెడ్డో ఈ సామెత గురించి బీజేపీ కేంద్ర నాయకత్వానికి చెప్తే బాగుండేది. అసలు రాష్ట్రంలో బీజేపీకి ఏమైనా సీన్ వుందా? రాష్ట్రం ముక్కలు కావడానికి సపోర్ట్ ఇచ్చిన బీజేపీకి సీమాంధ్రలో అసలు సీన్ వుంటుందా? ఏదో దేశమంతటా మోడీ గాలి వీస్తోంది కాబట్టి, కాంగ్రెస్ పాలనను అంతం చేయాల్సిన చారిత్రక అవసరం వుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీకి స్నేహహస్తాన్ని చాచింది. అయితే ముద్దు చేసినప్పుడే చంకనెక్కాలని తెలియని బీజేపీ ఓవర్‌యాక్షన్‌తో ఇష్యూని తెగ లాగుతోంది. బీజేపీ ఇలా తెగేదాకా లాగితే అటు సీమాంధ్రతోపాటు ఇటు తెలంగాణలో కూడా బీజేపీ చెవిలో కమలం పెట్టుకోవాల్సి వస్తుంది.   తెలుగుదేశం బీజేపీని న్యాయంగానే సీట్లు ఆఫర్ ఇచ్చినా, తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటున్న బీజేపీ అగ్ర నాయకత్వం కూరగాయలు బేరమాడినట్టు వ్యవహరిస్తోంది. మెట్టు దిగకుండా బెట్టు చేస్తోంది. అగ్ర నాయకత్వం జిడ్డు ధోరణి వల్ల అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో బీజేపీ నాయకులు దిగులు పెట్టేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే, టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ రెండు మూడు ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సిందే. ఆ విషయం తెలిసి కూడా అగ్ర నాయకత్వం చేస్తున్న నకరాలని ఎలా అర్థం చేసుకోవాలో అర్థంకాక వారందరూ డిప్రెషన్‌లో పడిపోతున్నారు. పార్టీ నాయకత్వానికి త్వరగా జ్ఞానోదయం కలిగాలని, తెలుగుదేశానికి, బీజేపీకి త్వరగా పొత్తు కుదరాలని తమ పార్టీ దైవమైన రాముడికి దణ్ణాలు పెట్టుకున్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ఇచ్చిపుచ్చకునే ధోరణితో వ్యవహరించకపోతే ఈసారి ఎన్నికలలో ఆ పార్టీ తూర్పు తిరిగి దణ్ణం పెట్టాల్సివస్తుందని రాజకీయ పరిశీకులు అంటున్నారు.

అక్కడ అబ్రహాం.. ఇక్కడ ఇబ్రహీం

  పాలమూరు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ప్రతి పార్టీలోనూ అసంతృప్తులు పెరిగిపోతున్నారు. పార్టీ హ్యాండిస్తే.. ఒక్క నిమిషం కూడా ఆలోచించడంలేదు ఆశావహులు. పార్టీ గోడ దూకేందుకు సిద్ధంగా ఉంటున్నారు. సీట్ల పంచాయితీ కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలో జంపింగ్ జపాంగ్ ల హడావిడి జోరుగా ఉంది.   ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీ ఫారాల విషయంలో తనను పట్టించుకోలేదని ఆలంపూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయినా పార్టీ అధినేతలు పట్టించుకోకపోవడంతో టీడీపీలో చేరారు. బాబు ప్రజాగర్జన సభలో పచ్చ కండువా కప్పుకున్నారు ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం.   మరో వైపు మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు తెరాస అభ్యర్ధి పోటీ చేసి ఓడిపోయిన సయ్యద్ ఇబ్రహీం టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా.. టీజీవో నేత శ్రీనివాస్ గౌడ్ తెరాసలో చేరడంతో ఇబ్రహీంకు గులాబీ బాస్ హ్యాండిచ్చారు. దీంతో ఇబ్రహీం అనుచరులు ఆందోళనకు దిగారు. అయినా తెరాస నేతలు స్పందించలేదు. తీవ్ర మనస్తాపం చెందిన ఇబ్రహీం చలో గాంధీభవన్ యాత్ర చేపట్టారు. ఇబ్రహీం కాంగ్రెస్ లో గూటికి చేరారు. మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ అబ్రహాం.. ఇక్కడ ఇబ్రహీం తప్పనిసరి పరిస్థితుల్లో గోడ రోజుల వ్యవధిలో అనూహ్యంగా పార్టీలు మారిపోయారు.

లెజెండ్ కు "బోరు" కొట్టింది

  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన లెజెండ్ సినిమా పేరుకు తగ్గట్టే మంచి విజయాన్ని సాధించిందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సింహా తరువాత ఆ స్థాయి విజయాన్ని సాధించిన నటసింహం కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు క్రిటిక్స్. లెజెండ్ విక్టరీని ఎంజాయ్ చేస్తున్న బాలయ్యకు షేక్ పెట్ ఎమ్మార్వో చిన్న షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా బోర్ వేసినందుకు బాలకృష్ణకు రెవెన్యూ అధికారులు శనివారం రూ.10 వేల జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని బాలకృష్ణ ఇటీవల బోర్ వేయించారు. అనుమతి లేకుండా హీరో బాలకృష్ణ బోర్ వేయించినట్లు స్థానికులు కొంతమంది ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. అనుమతి లేకుండా బోర్ వేయించినట్లు తేలడంతో బాలకృష్ణకు అధికారులు రూ. 10 వేల జరిమానా విధించారు.

వామపక్షాలే ఎందుకు విఫలమవుతున్నాయి?

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     "పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు మనం ఒక సత్యాన్ని ప్రకటించాలి " మీది సాయుధులయి ఉన్న [ఆర్మడ్ పవర్] ప్రభుత్వం, మాది ఆయుధశక్తి. దాన్ని మీరు కష్టజీవులయిన కార్మికవర్గంపై ఎక్కుపెట్టి కూర్చున్నారు. మేం మాత్రం మీకు వ్యతిరేకంగా సాధ్యమైన చోట్లల్లా శాంతియుత పద్ధతుల ద్వారానే పోరాడుతాం, అవసమైనప్పుడు మీపైన మేము సాయుధపోరాటమూ చేయక తప్పదు'' ఈ మాటలు అన్నదెవరో, ఆ మాటలు అందిస్తున్న సందేశమేమిటో భారతదేశంలో 80 సంవత్సరాల ఉనికి చరిత్రగల కమ్యూనిస్టుపార్టీ, తదితర వామపక్షాలకూ తెలిఉఅనిది కాదు. "పిడుక్కీ, బిచ్చానికీ ఒకేమంత్రం'' వాడకూడదన్న సైద్ధాంతిక పరిజ్ఞాన సందేశంలో పాటు, ఆ సామెతలోని రెండో కోణాన్ని, చైతన్యాన్ని, విప్లవ సంసిద్ధతకు కూఒడా ఆ సందేశంలో గుర్తుచేయకనే గుర్తుచేస్తోంది. ఆ సందేశాన్ని కమూనిస్తూ ఇంటర్నేషనల్ లో పునశ్చారణ తరగతుల్లో పాల్గొన్న వామపక్ష రాజకీయ ప్రతినిధులనుద్దేశించి కారల్ మార్క్స్ అందజేశాడు! అయితే నేడు భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పెట్టుబడీదారీ - భూస్వామ్య పాలనావ్యవస్థ ఏర్పడి క్రమంగా దేశప్రజల ఉమ్మడి సంపదను, వనరులను యథేచ్చగా దోచుకుని బలిసేందుకు అనుకూలమైన పాలనావ్యవస్థ స్థిరపడి జాతి మూలాలను గత 65 ఏళ్ళుగా పీల్చుకుతింటున్నప్పటికీ, నేటికీ భారతప్రజాతంత్ర విప్లవదశను, దిశనూ స్థిరపరచడంలో కమ్యూనిస్టులు సహా వామపక్షాలు విఫలమవుతూ వచ్చాయి. ఫలితంగా ఒకనాటి కమ్యూనిస్టుపార్టీ రెండుగా [సి.పి.ఐ. - సి.పి.ఎం.లుగా] చీలుబాతల్లో పయనిస్తూ ఉండటమేగాక, గత 55 ఏళ్ళలో ఒక్క త్రిపురలో తప్ప కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పరచికూడా వాటిని సంఘిటితం చేసుకోలేక క్రమంగా బలహీనపడుతూ వేగంగా చేజార్చుకుంటూ వచ్చాయి. వామపక్షశక్తుల్ని కూడగట్టడంలో ఒకమేర కొన్ని దశాబ్దాల క్రితం విజయం సాధించినట్టు కన్పించినా అధికార పదవీరాలస కొద్దీ కొన్ని సందర్భాల్లో అవినీతి పాలవుతూ కమ్యూనిస్టేతర వామపక్షశక్తుల విశ్వాసాన్ని కూడా క్రమంగా కోల్పోతూ వచ్చాయి - ఈ ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ. అంతేగాదు, మొత్తం కమ్యూనిస్టు ఉద్యమమే ఒక్క "రెండుపార్టీలు''గానే కాకుండా మావోయిస్టు పార్టీ సహా ఎంతలేదన్నా 12 ముక్కలుగా విడిపోయి పనిచేస్తున్నాయి, దేశవ్యాపితంగా ఇవన్నీ సంఘితం కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో ఎవరో కాదు, ఈ 'ముక్కలూ, చేక్కలే' చెప్పలేని పరిస్థితి. పైగా వీటి మధ్యనే - ఫలానా వాడు 'కోవర్టు' కాబట్టి ఫలానా వామపక్షీయుడు తమ 'పార్టీ'కి లేదా తమ గెలుపుకు వ్యతిరేకి కాబట్టి 'ఖతం' రాజకీయం ద్వారా పరస్పరం పరిమార్చుకోవడాలు జాస్తీగా సాగుతున్నాయి. సమీక్షలకు అతీతంగా ఓకే పంథాలో పెట్టుబడిదారీ-భూస్వామ్యవర్గ పాలనపై సాయుధ పోరాటంలో తప్పొప్పుల మధ్యనే ముందుకు సాగుఇతున్న పార్టీ ఒక్క మావోయిస్టు (మార్కిస్టు-లెనినిస్టు) పార్టీయేనని ప్రభుత్వం కూడా గుర్తించి, తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ పరిస్థితుల్లో గత 65 ఏళ్ళలో ఎన్నడూ లేనంతటి స్థాయిలో అవినీతిని, లంచగొండితనాన్నీ, సంపద దోపిడీని, స్వదేశీ విదేశీ గుత్తవర్గాల ప్రయోజనాలకు దేశాన్ని స్థావరంగా మార్చి, వేగంగా దుష్టపరిపాలనను సంఘిటిత పరుచుకుపోతున్న కాంగ్రెస్ - బిజెపి పక్షాలను తిరిగి అధికారంలోకి రాకుండా చేయగల వ్యూహరచనలు, ఆచరణలో వామపక్షశక్తులు విఫలమవడం విచారకరం. "అయ్యవార్లు ఏం చేస్తున్నారం''టే, చేసినతప్పులు దిద్దుకుంటున్నారన్న సామెతలాగా గత 80 ఏళ్ళుగానే ఈ వామపక్షాలు దిద్దుబాట్లతో, సవరణపట్టికలతోనే కాలక్షేపం చేస్తున్నారుగాని వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఒక్క తాటిపైకి తేవడంలో సతమతమవుతున్నట్టు కన్పిస్తున్నారుగాని, దేశ పేద, మధ్యతరగతి ప్రజాబాహుళ్యాన్ని విశాల ప్రాతిపదికపైన సంఘిటిత పరచడంలో విఫలమవుతున్నారు. ఎక్కడుంది లోపం? అసలు 'గాడు' ఎక్కడుంది? అసలు ఉభయ కమ్యూనిస్టుపార్టీల మధ్య ఉన్న వాస్తవ విభేదాలేమిటి? ప్రజలకు, మేధావులకు కూడా అంతుపట్టని పరిస్థితి ఏర్పడింది. రెండు పక్షాల మధ్య ఉన్న ఆ "విభేదాలు'' రాజకీయ సంబంధమైనవా? లేక వ్యక్తుల మధ్య వ్యక్తిగత తగాదాలు, కక్షలకు సంబంధించినవా? లేక రెండు పార్టీలూ కలిసి పూర్వపు ఏకైక పాట్టీగా పునరుజ్జీవం పండితే తమతమ నాయకత్వాలు, వేర్వేరు పదవులూ కోల్పోతామన్న బెంగా? వీటిలో ఏది అసలు కారణమని ప్రజలూ, ఉభయ కమ్యూనిస్టుపార్టీల శ్రేయోభిలాషులూ, చాలాకాలంగా "యాది'' కూడా రెండు పార్టీల నాయకత్వాలకూ కలగాకపోవటం, పునరాలోచాన చేసుకొనకపోవటం దురదృష్టకరమేగాదు, ఖండనార్హం కూడా. ఉభయ పక్షాల ప్రజలూ, క్యాడరూ కూడా నాయకత్వాలను లోలోన, బాహాటంగానూ తిట్టుకుంటున్నారన్న స్పృహ కూడా ఈ నాయకత్వాలకు లేదు. కనీసం విప్లవపంథాను తిరస్కరించినప్పటికీ నేటి పరిస్థితుల్లో అవసరమూ, అవశ్యమూ అయిన వామపక్షాల మధ్య ఐక్య సంఘటన సుదృఢం కావడానికీ దేశంలో రెండు ప్రజాస్వామ్య వ్యతిరేక లేదా బూటకపు ప్రజాస్వామ్యానికి ప్రతీకలుగా నిలిచిన కాంగ్రెస్ - బిజెపి పక్షాల రెక్కలు కత్తిరించడానికీ ముందు షరతు ఒక్కటే - ముందుగా సాయుధపోరాటంతో నిమిత్తంలేని ప్రజాతంత్ర వామపక్షాలయిన ఏకోదరులుగానే ఉంటూ ఏ నిర్థిష్టలక్షమూ లేకుండా, ప్రజలకు వివరించి చెప్పగల విస్పష్టమైన విధాన ప్రకటన లేకుండా అర్థాంతరంగా విడిపోయిన కమ్యూనిస్టుపార్టీలోని రెండు పక్షాలు - కమ్యూనిస్టుపార్టీ (సిపీఐ), మార్కిస్టుపార్టీలు వెంటనే విలీనం కావాలి. అప్పుడు మాత్రమే వామపక్ష కూటమి బలం పుంజుకుంటుంది; అది ఆధారంగా వామపక్ష ఐక్యసంఘటన పునాదిగా (సోషలిస్టు, రివల్యూషనరీ పార్టీ, వగైరా పక్షాలుసహా) దేశంలో బలమైన తృతీయ ఫ్రంటును నిర్మించగలుగుతారు. అంతేగాని ఎవరికీ వారే యమునా తీరేగా ఎవరి ఎన్నికల మానిఫెస్టోను వారుగా వేరుగా ప్రకటించుకుంటే అది ఐక్యసంఘటన ప్రణాళిక కాజాలదు. విశాల ఐక్యసంఘటనకు కూడా వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సంఘటిత పరిచి దేశాభ్యున్నతికి విస్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవచ్చు; తద్వారా పెట్టుబడిదారీ-భూస్వామ్య పక్షాలుగా, కుహనా ప్రజాస్వామ్య శక్తులుగా, కుహనా లౌకినవాదంలోనే మతపరమైన ఏజెండాతోనూ, మతపరమైన ఎజెండాలోనే కుహనా లౌకికవాదంతో నాటకాలాడుతూ దేశాప్రజల్ని జయప్రదంగా వంచిస్తున్న కాంగ్రెస్-బిజెపి పక్షాలకు ప్రత్యామ్నాయంగా విశిష్ట ప్రజాస్వామ్య ప్రజాతంత్ర ఐక్యసంఘటన ప్రభుత్వాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. కాని ఇందుకు తొలిషరతు - రెండు పార్లమెంటరీ పక్షాలుగా అవతరించిన రెండు కమ్యూనిస్టుపార్టీలూ ముందు ఏకంకావాలి. అంతేగాని రెండు ధనికవర్గ పార్టీల మధ్య  ఇచ్చకాలాడి నాలుగుసీట్ల కోసం పొత్తులు కుడిచే పార్టీలుగా వామపక్షాలు మనుగడ సాగించలేవు. ఉదాహరణకు రేపటి జనరల్ ఎన్నికల పూర్వరంగంలో సి.పి.ఐ. నాయకులు కాంగ్రెస్ కూ, తెలుగుజాతిని నిట్టనిలువునా చీల్చడానికి కారకుడయినా వ్యక్తి పార్టీ టి.ఆర్.ఎస్.కూ మధ్య సయోధ్య నెరపడానికి పావులు కదపడాన్ని ప్రజలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలే 'ఛీ' కొట్టి ఏవగించుకోసాగారు. ఈ ప్రయత్నంలో మతలబు - ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొంతనా కుదిరితే కమ్యూనిస్టుపార్టీకి కూడా ఒకటో ఆరో స్థానాలు కేటాయింపు జేసుకోవచ్చని సి.పి.ఐ. నాయకుల ఆశ! ఆ మాటకొస్తే - కమ్యూనిస్టు, మార్కిస్టు పార్టీల దిగజారుడు రాజకీయాల ఫలితంగానే, ఆంధ్రప్రదేశ్ విభజనకు పునాదులు పడ్డాయని చెబితే ఎవరూ నొచ్చుకోనక్కరలేదు. తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం లక్ష్యం - తెలంగాణలో దొరల, భూస్వాముల పెత్తనాన్ని, నిజాం నిరంకుశ పాలనను ఏకకాలంలో వదిలించి తెలంగాణా ప్రజలకు విమోచన కల్పించడంతో పాటు యావత్తు తెలుగుజాతిని ఓకే భాషా రాష్ట్రంగా స్థిరపరచటం. ఈ లక్ష్యానికి చేజేతులా తూట్లు పొడిచింది ఉభయ కమ్యూనిస్టు పార్టీల అనైక్యత మాత్రమే. సోనియా భజనబృందంలో ఈ రెండు పార్టీలూ తాజాగా చేరటం [అటు నారాయణ, ఇటు తమ్మినేని వీరభద్రం] పార్టీ కార్యకర్తలలో ఏవగింపుకు కారణమయింది! ఇలాంటి బాపతు వల్ల మూడవ కూటమిగానీ, ఫెడరల్ ఫ్రంట్ గానీ పగటి కలగానే ఉండిపోతుంది!

సరుకులిస్తాం.. మందు చీటీలిస్తాం

  కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల జోరు చిత్ర విచిత్రమైన రూపాలు తీసుకుంటోంది. డబ్బుపంపిణీకి ఇప్పటివరకు ఎక్కడా లేని మార్గాలను ఇక్కడి నాయకులు వెతుక్కుంటున్నారు. మద్యానికి చీటీలు ఇవ్వడం ఎప్పటినుంచో మనకు తెలుసు. నేరుగా మద్యం పంపిణీ చేసే పద్ధతి ఇంతకుముందు ఉండేది. అయితే, అలా తీసుకెళ్తుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేవలం చీటీలు మాత్రమే ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ చీటీ తీసుకెళ్లి ఫలానా వైన్ షాపులో ఇస్తే ఉచితంగా మద్యం ఇస్తారని చెబుతారు. ఇప్పుడు అది పచారీ సరుకుల వరకు వెళ్లింది. ఇందులోనూ రెండు రకాలున్నాయి. ఇళ్లకు వెళ్లి చీటీలు ఇచ్చి, అవి చూపిస్తే నెలకు సరిపడ సరుకులు ఉచితంగా ఇవ్వడం ఒకటైతే, నేరుగా పచారీ దుకాణాల్లోనే డబ్బులు తీసుకునేలా 1కె, 1ఆర్ అనే కోడ్ లాంగ్వేజిలో ఉంటున్న చీటీలు రెండో రకం. మచిలీపట్నం ప్రాంతంలోని కొంతమంది నాయకులు ఇలాంటి చీటీలు ఇస్తున్నారు. అందులో 1కె అంటే వెయ్యి రూపాయలని, 1ఆర్ అంటే రెండు వేలని అర్థం. ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి ఆయా చీటీల కాంబినేషన్ ఇస్తున్నారు. అవి తీసుకెళ్లి ఆ ప్రాంతంలో ఉన్న పచారీ దుకాణాల్లో చూపిస్తే, దానికి సమానమైన డబ్బు గానీ, సరుకులు గానీ ఇస్తారన్నమాట.

బిజెపితో పొత్తుకు సిద్దం: లోక్‌సత్తా

      భారతీయ జనతా పార్టీతో పొత్తుకు తాము సిద్దంగా వున్నామని, దానిపై ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నామని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. పొత్తులపై జాప్యం చేయడం సరికాదని ఆయన సూచించారు. ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన ఇస్తామని మోడీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రుణమాఫీ వల్ల రైతులు నష్టపోతారని, రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తున్న పార్టీలకు ఆ హక్కు ఎవరిచ్చారని జేపీ ప్రశ్నించారు. వస్తు ఉత్పత్తి రంగాలను మెరుగు పరిచి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు. వచ్చే పదేళ్లలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే దేశంలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయని జేపీ అన్నారు.

అవినీతి అంతమే టిడిపి లక్ష్యం

      భారత దేశంలో అవినీతిని పూర్తిగా ప్రక్షాళణ చేయడమే టీడీపీ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ 33వ ఆవిర్భావ దినోత్సం వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయమని వ్యాఖ్యానించారు. దేశానికి పట్టిన అరిష్టం కాంగ్రెస్ అని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పతనం ఖాయమని చంద్రబాబు విమర్శించారు. సింగపూర్‌తో పోటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే అని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

టిడిపి 33వ ఆవిర్భావదినోత్సవం

      1982లో ఆవిర్భవించిన టీడీపీ పార్టీ తన ప్రస్థానంలో 32వ మైలురాయిని దాటింది. మరోసారి తెలుగువాడి సత్తా చాటేలా 33వ ఏటా అడుగుపెట్టింది. టీడీపీ 33వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను బాబు గుర్తుచేసుకున్నారు.   పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ పవిత్ర ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, మూడు దశాబ్దాలుగా పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు, కార్యకర్తల త్యాగాలు, నిస్వార్ధ సేవలు, చంద్రబాబు సారథ్యంతో ఎదిగిన పార్టీ పయనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని టిడిపి పార్టీ నేతలు పిలుపునిచ్చారు.     VIDEO COURTSEY TV9

పాపం.. మెంటే పార్థసారథి

  చేతిదాకా వచ్చిన ముద్ద నోటికి అందకపోవడం అంటే ఇలాగే ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో మెంటే పార్థసారథి పేరు తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన అంత పెద్ద నాయకుడు. తెలుగుదేశం పార్టీతో ఆయన అనుబంధం మూడు దశాబ్దాలు. ప్రతి ఎన్నికల్లోనూ తనకు సీటొస్తుందనే ఆశతో ఉంటున్నారు. కానీ, ప్రతిసారీ అవకాశం దక్కినట్టే దక్కి.. చేజారిపోతోంది. ఈసారి కూడా అలాగే అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం సీటు రామాంజనేయులు (అంజిబాబు)కు ఇస్తామని హామీ కూడా ఇచ్చేశారు. ఈసారి ఎలాగైనా సరే టీడీపీ సీటు తనకే వస్తుందని.. ఖర్చుకు వెనుకాడబోనని పార్థసారథి ఎన్నికలకు సిద్ధమైన తరుణంలో అంజిబాబు రాక టీడీపీలో ముసలం రేపింది. ‘టీడీపీలో ఎప్పుడూ పల్లకి మోసే బోయీగానే ఉండిపోవాలా, పల్లకి ఎక్కే అవకాశం ఇవ్వరా’ అంటూ సారథి అనుచరులు, బంధుగణం అసహనంతో రగిలిపోతున్నారు. పార్టీ శ్రేణులు సైతం ఆవేదన చెందుతున్నాయి.   ఇటీవల పార్థసారథి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే అంజిబాబు వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఇందుకు పార్థసారథి ససేమిరా అన్నట్టు సమాచారం. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, తాను అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నానని.. ఈ విషయంలో నీ దారి నీదే.. నా దారి నాదే అని పార్థసారథి స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అంజిబాబు వెనుతిరిగినట్లు తెలిసింది. ఇంత జరిగినా, తనకు సీటు దాదాపు రాకపోవచ్చన్న విషయం తెలిసినా కూడా పార్థసారథి మాత్రం పార్టీ సేవ మానలేదు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం చెమటోడుస్తున్నారు.

మోడీని నరికేస్తానన్న కాంగ్రెస్ మసూద్ అరెస్ట్

    భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ముక్కలుగా ముక్కలుగా నరికేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సహరాన్ పూర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో విస్రృతంగా ప్రసారం కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విద్వేషపూరిత వ్యాఖ్యలకు గాను ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మసూద్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించింది. అటువంటి భాషను ఉపయోగించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఆపార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు. అభ్యంతరకర భాషనుపయోగించొద్దంటూ తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారన్నారు. తన వ్యాఖ్యలపై మసూదే మీడియాకు వివరణ ఇచ్చుకోవాలని సుర్జేవాలా అభిప్రాయపడ్డారు.

తెరాసలో కొండంత చిచ్చు

  వైకాపా నుండి వయా కాంగ్రెస్ తెరాస చేరుకొన్న కొండ సురేఖ దంపతులను పార్టీలో చేర్చుకొని వారికి టికెట్స్ కేటాయించడంపై తెరాసలోనే కాదు ఇతర పార్టీలలో నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. కొండా దంపతులు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా వ్యతిరేఖి అని తెలిసినప్పటికీ, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో వైకాపాలో కొనసాగడం వలన వారిరువురూ తెలంగాణా వ్యతిరేకులనే బలమయిన ముద్ర పడిపోయింది. అందుకే వారిని తెరాసలో చేర్చుకోవడంపై అనేకమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.   తెరాస సీనియర్ నేత చెరకు సుధాకర్ ఇటీవల పార్టీని వీడుతూ కేసీఆర్ పైఇదే విషయమై తీవ్ర విమర్శలు చేసారు. నిజామాబాద్ యంపీ మధుయాష్కీ గౌడ్ కూడా ఇంతవరకు కొండా దంపతులు తమ పార్టీలోనే ఉన్నారనే సంగతి మరిచిపోయినట్లు, వారిని తెరాసలో చేర్చుకొని టికెట్స్ కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. నిన్న న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయిన టీ-జేఏసీ నేతలు కూడా ఇదే విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, తమ అభ్యంతరాల గురించి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కు గట్టిగా చెప్పాలని ప్రొఫెసర్ కోదండ రామ్ పై వారు ఒత్తిడి చేసారు. ఈ సమావేశానికి హాజరయిన తెరాస సీనియర్ నేత శ్రవణ్ అందరూ తమ పార్టీనే తప్పుబట్టడంతో ఆయన సమావేశం మధ్యలోనే ఆగ్రహంతో లేచి వెళ్ళిపోయారు. ఈ చిచ్చు ఎప్పటికి ఆరుతుందో, దాని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో చూడాలి మరి.