ఒకే ఒక్కామె..

  ఎవరూ సాధించలేని ఘనతను సాధించిన వ్యక్తిని ఒకే ఒక్కడు అని అంటాం. అదే ఘనతను ఒక మహిళా సాధిస్తే ఒకే ఒక్కామే అని అనాలి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నుంచి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సింతు శకుంతల సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్టంలో 1096 జెడ్పీటీసీ స్థానాలలో ఏకగ్రీవంగా ఎన్నికైనది ఇదొక్కటే. శకుంతల టీడీపీ బీ ఫారంతో నామినేషన్ వేసింది.   గతంలో జెడ్పీ వైస్ చైర్మన్ గా, నరసన్నపేట ఎంపీపీగా పని చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిమ్మ ఉషారాణి వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసింది. ఉషారాణి నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసేందుకు అభ్యర్ధి కూడా దొరకని పరిస్తితుల్లో టీడీపీ అభ్యర్ధి శకుంతల ఏకగ్రీవంగా ఎన్నికైంది. సిమ్మ ఉషారాణి మామా, భర్త ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతురాలు, రాజకీయవేత్త అయిన ఉషారాణి నామినేషన్ చెల్లలేదంటే శకుంతల లక్ కాకపొతే మరేంటి అని నరసన్నపేట జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ ఎన్నికలలో 'జనసేన' పోటీ చేయదు: పవన్

      సమాజం కోసం పనిచేసే నిస్వార్ధమైన యువ నాయకుల కోసం వెతుకున్నానని, అలాంటి నాయకులు దొరికే వరకు పోటీ చేయబోనని, అలాంటి నాయకులు దొరికితే సమాంధ్రతో పాటు తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలలో పోటీ చేసి ఓట్లు చీల్చిచడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ఆర్ధిక రాజధాని నిర్మించగల సమర్ధవంతమైన నాయకుడినే ఎన్నుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో పోటీ చేయకపోయిన ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టి, అవినీతి, నీచ రాజకీయాలు చేసే నాయకులను జనసేన పార్టీ తగిన బుద్ది చెబుతుందని హెచ్చరించాడు.

మోడీ ప్రధాని అవడం ఖాయం: పవన్

      నరేంద్ర మోడీని తాను కలవడంపై ఇతర రాజకీయ పార్టీల నేతలు హేళన చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. తమ అవసరాలకు రాజకీయ పార్టీ నేతలు బిజెపి నేతలను కలిస్తే తప్పులేనప్పుడు..తాను నరేంద్ర మోడీని కలిస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మీకో సిద్ధాంతం నాకో సిద్ధాంతమా అని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత విభజనపై ఆయన స్పందించిన తీరు నాకు నచ్చిందని అన్నారు. దేశానికి కావాల్సిన సమర్ధవంతమైన నాయకుడు నరేంద్ర మోడీ అని ప్రశంసించారు. ఈ సారి మోడీ దేశానికి ప్రధాని అవుతారని, తన మద్దతు ఆయనకేనని పవన్ సభలో ప్రకటించారు. యువత కూడా మోడీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. బిజెపి నాయకులు కాకినాడలో ప్రత్యేక తెలంగాణ అని చెప్పారని, ఆ రోజుల్లో సీమాంధ్ర నాయకులు ఎవరూ మాట్లాడలేదని, అందువల్ల బిజెపి గురించి మాట్లాడలేకపోతున్నామని అన్నారు.

వేర్పాటువాదాన్నిఅడ్డుకొనేందుకే జనసేన: పవన్

  కాంగ్రెస్ అనుసరించిన ఈ విభజన వాదం వలన దేశంలో వేర్పాటువాదం పెరిగిపోతోంది. ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల ఉన్న గ్రామంలో ఉన్న 14ఏళ్ల పిల్లాడికి కేసీఆర్ మీద కోపం ఎందుకు కలుగుతోంది? ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్న పిల్లాడికి, శ్రీకాకుళంలో ఉన్న పిల్లాడికి మధ్య ఎందుకు వైరం ఏర్పడింది అంటే కాంగ్రెస్ అనుసరిస్తున్న విభాజించి పాలించు అనే పాలసీ వల్లనే. అదే విధంగా మొన్న పార్లమెంటులో కొందరు యంపీలు మేము అసలు భారత దేశంలోనే ఉన్నామా? అని ప్రశ్నించినప్పుడు నాకు చాల భయం కలిగింది. దీనిని ఇలాగే వదిలిపెడితే దేశం మరో శ్రీలంకలా తయారవుతుందని భయపపడ్డాను.ఇటువంటి విభజనవాదులు అందరూ ఏకమయితే దేశం ఏమవుతుందనే భయంతోనే నేను ఈ రోజు రాజకీయాలలోకి వచ్చేను.

రాజు నీతి తప్పితే... నేల సారం తప్పుతుంది: పవన్

      ప్రజలకు మంచి చేస్తారని రాజకీయ నాయకులను ఎన్నుకొంటె వాళ్ళు అవీనీతి, లంచగొండితనానికి అలవాటు పడి రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రోమన్ చక్రవర్తులు ఎంగిలి మెతుకులు విసిరినట్లు తెలుగు ప్రజలకు ప్యాకేజీలు విసిరారని ఆయన అన్నారు. కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. భారత జాతికి తూట్లు పొడిచారని ఆయన అన్నారు. 120 ఏళ్ల చరిత్ర అంటారు, ఇది కాంగ్రెసు చేసిన నిర్వాకమని అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్లు దానికి తూట్లు పొడిస్తే మనకు ఎలా నమ్మకం కుదురుతుందని ఆయన అన్నారు. చట్టం అందరికీ సమానంగా పనిచేయడం లేదని అన్నారు.

ప్రజారాజ్యం విలీనంపై ఎందుకు మౌనం: పవన్

  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని నేను భావించాను. ఘన చరిత్రగల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వ్యవహారాన్ని సమర్ధంగా నిర్వహిస్తుందని భావించే నేను ఆరోజు మౌనం వహించేను. నా కంటే ఎంతో అనుభవజ్ఞులయిన రాజకీయనేతలు ఈ విషయంపై సరయిన నిర్ణయమే తీసుకొని ఉండవచ్చని భావించబట్టే నేను ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం జరిగినా నేను మౌనం వహించాను. ఈ ఐదేళ్ళలో నేను ఈ వ్యవహారంపై మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. కానీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరుని చూసిన తరువాత నేను ఇక సహించలేకనే నేను రాజకీయాలలోకి రావలసి వచ్చింది.

అందరికీ సమన చట్టమే జనసేన పార్టీ సిద్ధాంతం

  ప్రతీ ఐదు సం.లకి కండువాలు మార్చుకొనే పార్టీ కాదు జనసేన. పార్టీకి మ్యానిఫెస్టో లేదని చాలా మంది విమర్శించారు. నిజమే..మా పార్టీకి ప్రత్యేకమయిన మ్యానిఫెస్టో లేదు. కానీ ఈ అవినీతిని కూలద్రోయడమే మా మ్యానిఫెస్టో. చట్టం కొందరికి అధిక సమానం. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి చట్టాలు వర్తించవు. వారికి బెయిలిచ్చి సాగనంపుతారు. కానీ ప్రభుత్వాదేశాలను పాటిస్తూ వారిపై చర్యలు తీసుకొన్న నిజాయితీ గల అధికారులను మాత్రం పోస్టింగ్ ఇవ్వకుండా కూర్చోబెట్టి శిక్షించబడతారు. వారెవరూ మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అందరికీ ఒకే చట్టం, అందరికీ సమానమయిన చట్టం వర్తింపజేస్తుంది. చివరికి పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టమే జనసేన కోరుకొంటోంది.

కాంగ్రెస్ ను వేళ్ళతో సహా పికివేయాలి: పవన్

      విశాఖలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తొలిబహిరంగ సభ ప్రారంభమైంది. నలుమూలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేశారు. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. నటుడిగా ఓనమాలు నేర్పింది వైజాగే. నాయకులను పల్లకీలో మోసి ఢిల్లీ పీఠం మీద కూర్చోబెడితే మనకే వెన్నుపోటు పొడిచారు. రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది సమస్యలు సృ,ష్టించడానికి కాదని, పరిష్కరించడానికి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అనే వృక్షాన్ని వేళ్ళతో సహా పికీ వేయాలి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా రాష్ట్రాన్ని విభచించింది. కలిసి ఉన్నవారిని విడగొట్టి కనీసం పశ్చాత్తాపం కూడా లేదని అన్నారు.

కడుపు మండే రాజకీయాలలోకి వచ్చాను: పవన్

  కాంగ్రెస్ పార్టీ పల్లకీని తెలుగు ప్రజలు భుజాలు ఒరిసిపోయేలా మోస్తే వారు తెలుగు ప్రజలను చీల్చి, భారత జాతి సమగ్రతను కూడా చెడగొట్టారు. పైగా పదే పదే 150 సం.ల చరిత్ర గల పార్టీ మాదని చెప్పుకోవడం మాతాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఉంది. తెలుగు ప్రజలందరూ ఒక్కసారి చ్చీ కొడితే కాంగ్రెస్ పార్టీ కనబడకుండా కొట్టుకుపోతుంది. నేను కడుపు మండి రాజకీయాలలోకి వచ్చెను. ప్రజలను దోచుకొంటున్న రాజకీయ నాయకులను చూసి రాజకీయ లలోకి వచ్చెను. కుళ్ళిపోతున్న ఈ రాజకీయ వ్యవస్థను చూస్తూ ఇంట్లో పళ్ళు కొరుకు కొంటూ కూర్చోకుండా సమాజం పట్ల నా వంతు బాధ్యతని నిర్వహించెందుకే జనసేన పార్టీని పెట్టాను. అందుకే ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను దాని మూలాల నుండి క్రూల దోయాలి. అందుకు బలమయిన సిద్ధాంతాలు కావాలి. అనేక పుస్తాకాలను చదివి, నాకు అన్ని విధాలా తృప్తి కలిగించిన సిద్దాంతామే ఈ ఇజం..జనసేన పార్టీ సిద్దాంతం. నేను వ్రాసుకొన్న ఈ ఇజం పుస్తకాన్ని యావత్ ప్రజలకు అంకితం ఇస్తున్నాను.

రామ్‌చరణ్ రాజకీయం

      తండ్రి చిరంజీవి రాజకీయంగా చాలా పూర్ అని సాక్ష్యాధారాలతో నిరూపణ అయిపోయింది. ఈ విషయంలో చిరంజీవితోపాటు ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అయితే రామ్ చరణ్ మాత్రం రాజకీయాలు నడపడంలో తండ్రిలాంటి వాడు కాదన్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఒకసారి రామ్ చరణ్ టాలెంట్ బయటపడింది. సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావుకు ఎదురుతిరిగి మాట్లాడే సాహసం ఎవరూ చేయరు. ఆయన ఎవరిమీదైనా ఇన్‌డైరెక్ట్ గా కామెంట్లు చేస్తే, ఆ కామెంట్లు తగిలినవాళ్ళు కిక్కురుమనకుండా వుండటం తప్ప లేనిపోని తలనొప్పుడు ఎందుకని బయటపడరు.   అయితే రామ్ చరణ్ మాత్రం ఓ సందర్భంలో దాసరి మీద డైరెక్ట్ ఎటాక్ ఇచ్చాడు. ఆ విషయం అప్పట్లో చినికి చినికి గాలివానలా మారి మళ్ళీ తగ్గిపోయింది.  అప్పటి వరకూ రామ్ చరణ్ తండ్రిచాటు బిడ్డ అనుకున్నవాళ్ళు రామ్ చరణ్‌లోని దూకుడును చూసి ఆశ్చర్యపోయారు. అలాగే ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు రామ్ చరణ్ తాను బాబాయితో లేనని స్పష్టంగా ప్రకటించి తనకి ఎలాంటి మొహమాటాలు లేవని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా గురువారం నాడు రామ్ చరణ్ పుట్టినరోజు వుందని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ వైజాగ్‌లో రాజకీయ మీటింగ్ పెట్టాడు. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్ళాలా.. పవన్ కళ్యాణ్ మీటింగ్‌కి వెళ్ళాలా అని అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తన పుట్టిన రోజు వేడుకలకు రాకపోయినా పర్లేదు బాబాయి మీటింగ్‌కే వెళ్ళండని ఫ్యాన్స్ కి సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా సందేశం ఇవ్వడం ద్వారా రామ్ చరణ్ తనలో వున్న పరిణతిని ప్రదర్శించాడని పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్‌కి భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన పక్షంలో నేను చెప్పాను కాబట్టే అంతమంది వచ్చారని చరణ్ అనొచ్చు. ఒకవేళ్ళ పవన్ మీటింగ్‌కి అభిమానులు తక్కువగా వస్తే నా పుట్టిన రోజునే మీటింగ్ పెట్టడం వల్లే అభిమానులు హాజరు కాలేదని మరో కోణంలో మాట్లాడొచ్చు. తన కత్తికి రెండువైపులా పదును వుండేలా చూసుకున్న ‘మగధీర’ రామ్ చరణ్ భవిష్యత్తులో రాజకీయ రంగంలో రాణించడానికి అర్హతలు వున్న వ్యక్తిలా ఇప్పటి నుంచే ప్రూవ్ చేసుకుంటున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

చిరు ఫ్యాన్స్ కి దారేది?

      చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఫ్యాన్స్ కింగుల్లా తిరిగేవారు. చిరంజీవి ఫ్యాన్ అంటే సమాజంలో కాస్తంత క్రేజ్, ఇంకాస్త భయం వుండేది. ‘నేను చిరంజీవి ఫ్యాన్’ అని చెప్పుకోవడానికి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరేవారు..గర్వపడేవారు. చిరంజీవిని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా పళ్ళు రాలగొట్టడానికి రెడీగా వుండేవాళ్ళు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంటరై అట్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ కి విలువ సంగతి దేవుడెరుగు.. జనాల్లో సాక్షాత్ చిరంజీవికే విలువ లేకుండా పోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది మరింత అట్టడుగుకి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘నేను చిరంజీవి ఫ్యాన్‌ని’ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితిని ఆయన అభిమానులు ఎదుర్కొంటున్నారు. అందుకని అందరూ సేఫ్ సైడ్‌గా పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ వైపు షిఫ్టయ్యారు.   లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సొంతగా రాజకీయ కుంపటి పెట్టుకుని అన్నయ్యకి, ఆయన పార్టీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తూ వుండటంతో  ఇప్పుడు చిరు ఫ్యాన్స్ కి చిరు, రామ్ చరణ్ వైపు వుండాలా? లేక పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్‌కి తమ మద్దతు లేదని చిరు కుటుంబం ప్రకటించడంతో, గురువారం నాడు పవన్ వైజాగ్‌లో నిర్వహించే సభకి వెళ్ళాలా లేక హైదరాబాద్‌లో వున్న రామ్‌చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనాలా అని ఫ్యాన్స్ డోలాయమాన స్థితిలో వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి ఫ్యాన్స్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ ఇబ్బందిని అర్థం చేసుకున్న రామ్ చరణ్ తానే ముందుకు వచ్చి ఈసారి తన బర్త్ డేకి రాకపోయినా పర్లేదుగానీ, బాబాయ్ మీటింగ్‌కి వెళ్ళండని ఫ్యాన్స్ కి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్ చెప్పారా లేదా అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ హైదరాబాద్ బయల్దేరారని తెలుస్తోంది. పవన్ వైపే పూర్తిగా మొగ్గు చూపిన కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. ఏం చేయాలో అర్థంకాని చాలామంది ఫ్యాన్స్ మాత్రం ఇంట్లోనే ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చోవాలని డిసైడైనట్టు తెలుస్తోంది. మొత్తంమీద పవన్ కళ్యాణ్ మీటింగ్ డే, రామ్ చరణ్ బర్త్ డే ఒకేరోజు రావడంతో ఫ్యాన్స్‌ అయోమయానికి గురయ్యారు.  

షర్మిల ప్రసంగంతో వైఎస్ఆర్ సీపీలో చీలిక

      సాధారణంగా ఎక్కడైనా ఒక పార్టీకి చెందిన అగ్రనాయకులు పర్యటిస్తే ఆ ప్రాంతంలో సదరు పార్టీ ఎంతోకొంత బలోపేతం అవుతుంది. అప్పటివరకు అభిమానులుగా మాత్రమే ఉన్నవారు కూడా పార్టీ సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది. కానీ, జగన్ పార్టీలో అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు.. నోటిఫికేషన్ వెలువడగానే జగన్ కుటుంబంలోని ముగ్గురు నాయకులు తలో మైకు పట్టుకుని మూడు ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్లలో జగనన్న వదిలేసిన బాణం షర్మిల మాటలు ఇప్పుడు ఆ పార్టీ చాపకిందకి నీళ్లు తెస్తున్నాయి. కృష్ణా జిల్లా నూజివీడులో షర్మిల చేసిన ప్రసంగం ఆ పార్టీకి చేటు తెచ్చింది. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడు అసెంబ్లీ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆమె బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇదే సీటు ఆశిస్తున్న మరో నాయకుడు లాకా వెంగళరావు యాదవ్ తీవ్ర ఆవేదనకు గురై.. అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇది ఏకంగా పార్టీలోనే చీలికకు కారణం అయ్యేలా ఉంది. ఉదయం 9.30 గంటలకే షర్మిల వస్తారని నాయకులు ప్రకటించడంతో రెండు గంటల పాటు జనం ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇక ప్రతాప్ పేరు ప్రకటించగానే వెంగళరావు యాదవ్ అనుచరులు, ఆయన అభిమానులు ఒక్కొక్కరుగా అక్కడినుంచి వెళ్లిపోయారు. పార్టీలో రాబోయే రోజుల్లో పరిస్థితికి ఇది అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానించారు.

మహిళా స్థానంలో పురుషుడి పోటీ?

      ఓ జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. పార్టీల్లో చాలా రోజుల నుంచి తిరుగుతున్న నేతలు తమ సతీమణులను బరిలోకి దింపుతారు. ఇది సాధారణంగా జరిగే సంగతి. అయితే.. మహిళా రిజర్వేషన్ స్థానంలో ఓ ఎస్టీ వ్యక్తి నామినేషన్ వేశాడు. స్వీకరించిన అధికారులు అన్నీ పరిశీలించి ఆటోరిక్షా గుర్తు సైతం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్‌ స్థానంలో పురుషుని నామినేషన్ ఎలా చెల్లుబాటు చేశారంటూ ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో తేరుకుని రాత్రికి రాత్రి హడావుడిగా ఫైనల్ జాబితా నుంచి తొలగించారు. వరంగల్ జిల్లా కొత్తగూడ జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ నుంచి టీడీపీ, కాంగ్రెస్‌తో సహా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఫైనల్ జాబితాలో బరిలో నిలిచినట్లు ప్రకటించారు. జనరల్ మహిళ స్థానంలో ఇదే మండలం పూనుగుండ్ల గ్రామానికి చెందిన పెనుక కృష్ణారావు (ఎస్టీ) నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ సమయంలో కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో అధికారులు జనరల్ అభ్యర్థులకు తీసుకునే డిపాజిట్ రూ. 5000 తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 2500 తీసుకుంటారు. నామినేషన్ల పరిశీలనలో పేజీని నాలుగుసార్లు చూసిన అధికారులు అన్నీ ఒకే చెప్పారు. ఉపసంహరణల తర్వాత రంగంలో ఉన్న అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అందులో కృష్ణారావుకు ఆటో గుర్తు ఇచ్చారు. చివరకు ఎవరో అభ్యంతరం వ్యక్తం చేయడంతో నాలుక కొరుక్కుని.. తూచ్ అంటూ కృష్ణారావు పేరు తీసేశారు.

ఒక్క సీటు.. వంద కోట్లు!!

      లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు మన రాష్ట్రంలో ఓ నాయకుడు పెడతానంటున్న ఖర్చు ఎంతో తెలుసా?.. అక్షరాలా వంద కోట్ల రూపాయలు!! మరొకాయన అంత కాకపోయినా, కనీసం 35 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారట! ఇవన్నీ ఎవరో ఆషామాషీగా అన్న మాటలు కావు. సాక్షాత్తు కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ వద్ద సదరు అభ్యర్థులే స్వయంగా చెప్పిన విషయాలు. వీటిని బ్రహ్మ ఓ సందర్భంలో చెప్పారు. ఎన్నికల సమయంలో తరలిస్తున్న డబ్బును పోలీసు తనిఖీలలో పట్టుకుంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 80 కోట్లు పట్టుకుంటే, అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే దాదాపు 50 కోట్లు పట్టుకున్నారట. హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్రా ప్రాంతంలో కేవలం ఒక్క సంఘటనలోనే రెండు కోట్ల రూపాయల నగదు, రెండు కిలోల బంగారం దొరికాయంటే ఈ 50 కోట్లు ఓ లెక్కా?   త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ఖర్చు సగటున రూ.10 కోట్ల రూపాయల దాకా ఉంటుందని ఈసీ పేర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిసా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశాలున్నాయని బ్రహ్మ తెలిపారు. ఇటీవల తన వద్దకు వచ్చిన ఓ నేత.. అ భ్యర్థి ఎన్నికల ఖర్చును రూ.70 లక్షలకు పెంచినంత మాత్రాన ఏం సరిపోతుందని, ఆ కాస్త సొమ్ముతో తాము ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించారని, ఆ పరిమితిని కనీసం రూ.3 కోట్లు చేసి ఉంటే బాగుండేదని సూచించారని బ్రహ్మ చెప్పారు. గెలుపు కోసం తాను రూ.35 కోట్ల వరకూ ఖర్చు చేస్తానని ఆయనే చెప్పారని వెల్లడించారు. ఎన్నికలలో డబ్బు ప్రభావం ఎంత కీలకంగా మారిందో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలని బ్రహ్మ అన్నారు.  

అన్నీ మాకే కావాలి

      ఆశకు అంతుండాలి అంటారు. కానీ, బోలెడంత ఆశిస్తే కొంతయినా దక్కకుండా పోతుందా అన్నది వీరి థియరీ. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఎంపీటీసీ ఎన్నికలలో జగన్ పార్టీ నాయకులు చిత్ర విచిత్రాలు చూపిస్తున్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు వలవల రాజా బొబ్బిల్లంక ఎంపీటీసీ స్థానం నుంచి బరిలోకి దిగితే.. ఆయన భార్య లక్ష్మీ వాగ్దేవి ఇనుగంటివారి పేట స్థానంలో పోటీలో ఉన్నారు. అలాగే, రఘుదేవపురం మాజీ సర్పంచి పట్టపగలు విష్ణుప్రసాద్ రఘుదేవపురం-1 స్థానం నుంచి పోటీ చేస్తుంటే, ఆయన భార్య పద్మావతి రఘుదేవపురం-3 స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇంతకీ.. వీళ్లంతా పోటీ చేస్తున్నది ఏ పార్టీ నుంచో తెలుసా? ఇంకేది, జగన్ పార్టీ నుంచే.

వైజాగ్ చేరుకొన్న పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొనేందుకు కొద్ది సేపటి క్రితమే చేరుకొన్నారు. ఆయనకు వైజాగ్ విమానాశ్రయం వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ మొదట తన అభిమానులతో, హైదరాబాదు నుండి వచ్చిన తన ప్రతినిధులతో సమావేశమవుతారు. తమ అభిమాన హీరోతో కలిసి మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరుతున్న అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం భోజనానంతరం సిటీలో జరుగబోయే ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ అందుకు పోలీసులు అనుమతించవలసి ఉంది. ఒకవేళ వారు అనుమతించినట్లయితే ఆయన ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. లేకుంటే సాయంత్రం సభ మొదలయ్యే వరకు చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చిన అభిమానులతో పార్టీ నిర్మాణం గురించి, ఇతర విషయాల గురించి చర్చించి సాయంత్రం నేరుగా సభకు రావచ్చును.   ఇప్పటికే చుట్టుపక్కల జిల్లాల నుండి ఆయన అభిమానులు భారీ ఎత్తున సభాస్థలికి (ఇందిరా ప్రియదర్శిని స్టేడియం) చేరుకొంతున్నారు. వైజాగ్ నగరంలో అప్పుడే పవన్ కోలాహలం మొదలయిపోయింది. ఎక్కడ చూసినా కుర్రకారు, జనసేన లోగో ఉన్న టీ షర్టులు ధరించి, బైకులకు జనసేన జెండాలు తగిలించుకొని కేరింతలు కొడుతూ రివ్వు రివ్వున దూసుకుపోతూ చాలా హడావుడి చేస్తున్నారు.

బీ ఫారాలిస్తాం.. ‘లెక్క’ మీరే చూసుకోండి

  శాసనసభ, లోక సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాలు మాత్రమే ఇస్తామని నిధులు ఇవ్వలేమని కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, చిరంజీవి చెబుతున్నారట. చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి లోకసభ మినహా మిగిలిన 14 అసెంబ్లీ, చిత్తూరు, రాజంపేట లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డికి అప్పగించారు.   బస్సు యాత్రలో భాగంగా తిరుపతికి వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి చిరంజీవి తిరుపతి శివార్లలోని ఒక హోటల్లో వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉందని, అయినా పనిచేయక తప్పదని ఉద్బోధించారు. అన్ని స్థానాలకు టికెట్లు ఆశించే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని, అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ పెద్ద ఎత్తున నిధులు అందజేస్తుందనే ప్రచారం తీసుకొచ్చారని, అటువంటిదేమీ ఉండదని ఆశావహులకు స్పష్టం చేయాలని కూడా వారు కుండబద్దలు కొట్టారు.   తిరుపతికి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులు టికెట్‌ను ఆశిస్తూ రఘువీరాతో భేటీ అయినప్పుడు కూడా నిధుల విషయం చర్చకు వచ్చినట్లు తెల్సింది. వారితో కూడా నిధుల విషయంలో పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా పోటీ చేస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఇస్తామని మాత్రమే భరోసా ఇచ్చినట్లు తెల్సింది. తాను కష్టకాలంలో పార్టీ బాధ్యతలను స్వీకరించానని నిధులు ఆశించకుండా వస్తే బీ ఫారం మాత్ర ఇస్తానని తేల్చిచెప్పారు. దీంతో ఆ నాయకులు అసంతృప్తికి గురయ్యారు. తిరుమలలో కలిసిన ఒకరిద్దరి నాయకులకు కూడా రఘువీరారెడ్డి ఇదే విషయాన్ని చెప్పిట్లు తెలిసింది.

తూర్పు టీడీపీలో తోట మంట

  మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరగానే కాకినాడ పార్లమెంటు సీటు తనదేనంటూ పార్టీలో అన్నీ తానే అన్నట్టు ప్రకటించుకోవడం టీడీపీలో కొత్త చిచ్చురేపింది. తన మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుతో దౌత్యం నడిపించి మరీ నరసింహం టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు ప్రచారమైంది. దాంతో అక్కడి టికెట్ ఆశిస్తున్న జ్యోతుల చంటిబాబు వర్గం కన్నెర్ర చేసింది. చంటిబాబు 24 గంటల అల్టిమేటమ్ ఇవ్వడంతో చంద్రబాబు ఆయనను చర్చలకు పిలిచి, జగ్గంపేట టిక్కెట్టు మరెవరికీ ఇచ్చేది లేదని చెప్పారు. దాంతో కొంతవరకు వివాదం సర్దుమణిగిందని అనుకుంటుంటే.. కాకినాడ ఎంపీ సీటు తనదేనని జిల్లా ముఖ్య నేతల సమక్షంలోనే తోట ప్రకటించుకున్నారు. దీంతో, కాకినాడ పార్లమెంటు సీటుపై ఆశలు పెంచుకుని, గడచిన ఆరేడు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విశ్వంను రేసు నుంచి తప్పించేందుకు మామా, అల్లుళ్లైన మెట్ల, తోట ఎత్తులు వేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో తునిలో నిర్వహించిన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమావేశంలో విశ్వంను ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు నేతలకు పరిచయం చేశారు. అంతకంటే ముందు పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అని ప్రకటించారు. పెద్దాపురం టిక్కెట్టు కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలనే నిర్ణయంతో విశ్వం సీటు పెద్దాపురం నుంచి ఒకసారి పిఠాపురం అని, మరోసారి కాకినాడ రూరల్ అని..మార్చి, మార్చి ఇప్పుడు కాకినాడ ఎంపీ సీటుకు కూడా ఎసరు పెడుతున్నారని ఆయన అనుచరులు, కైట్ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. దీంతో ఏం చేయాలో తెలియక పార్టీ నాయకత్వం తల పట్టుకుంటోంది.