రుణమాఫీపై కేంద్రం హామీ ఇవ్వలేదు..!

  రుణమాఫీపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై రెండు రాష్ర్ట ప్రభుత్వాలు చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. రుణమాఫీపై తెలంగాణకు కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వదన్న ఆయన ఇతర రాష్ర్టాల మాదిరిగానే తెలంగాణకు కూడా కేంద్రం సహాయం ఉంటుందన్నారు. మరోవైపు ఏపీ రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు. సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ, పలువురు బిజెపి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయ్యన్న పాత్రుడుతో వైకాపా గీత భేటి

గత కొంత కాలంగా జగన్ తో విభేదిస్తున్న విశాఖ జిల్లా, అరకు వైకాపా ఎంపీ కొత్తపల్లి గీత ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చలు జరిపినట్లు అయ్యన్న తెలిపారు. ఎంతో మంతి పార్టీని మారుతున్నారని ఈమె పార్టీ మారితో తప్పా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఆమె పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని... కానీ అటువంటి చర్చ జరగలేదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.

సోలార్ హబ్ గా ఏపీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ఏపీలోని పవర్ ప్రాజెక్టులకు ఇతర రాష్ర్టాల నుంచి బొగ్గు కేటాయిస్తున్నామని వెల్లడించారు. దేశంలో కరెంటు కోతలు లేకుండా చేయడమే మోడీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏపీని సోలార్ హబ్ గా మారుస్తామని గోయెల్ హామీ ఇచ్చారు. సోలార్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని, ఈ కమిటీ పదిహేను రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తుందని పీయూష్ తెలిపారు.

సమగ్రాభివృద్ధిని బాబు కోరుకుంటున్నారు: శివరామకృష్ణన్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రధాన పట్టణాల నిర్మాణానికి అనువైన 14 ప్రాంతాలను గుర్తించామని, ఆగష్టు 20 లోగా కేంద్రానికి తుది నివేదికను సమర్పిస్తామని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఏపీ సమగ్రాభివృద్ధిని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోందని, నీరు, రవాణా, ఇతర సౌకర్యాల లభ్యత కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ సూచించింది.ఇంకా ఐదు జిల్లాలో పర్యటించాల్సి ఉందని, వచ్చే పది రోజుల్లో ఆయా జిల్లాల్లో పర్యటిస్తామని ఆయన తెలిపారు. ఏపీలో వివిధ సంస్థల ఏర్పాటుకు 14 ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. తమది కేవలం రాజధాని ఎక్కడో నిర్దేశించే కమిటీ కాదని, రాష్ట్రంలో ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలో సూచిస్తామన్నారు. ఏపీకి సంబంధించి 192 ఆఫీసులు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. కార్యాలయాల తరలింపు సంక్లిష్టమైన సమస్యగా శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రతిఏటా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు కావాలని, పాలకులు, అధికారులు ఉద్యోగాలు కల్పించలేరన్నారు. ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలన్నారు. రాజధాని అ౦టే అద్భుత బిల్డింగ్‌లు కాదు....ప్రజలు, సర్వీసులని ఆయన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు ‘పిడికిలి’!!

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గుర్తుగా 'పిడికిలి ని'ఎన్నుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన తన పార్టీ గుర్తును ప్రకటించే అవకాశం వుందని భావిస్తున్నారు. జనసేన పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు కూడా పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా తాత్యాలిక కమిటీలు ఏర్పాటుకు పవన్ తన అనుచరులతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా జనసేనను విస్తరించాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌కి అంతర్జాతీయ స్థాయి రాజధాని!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు... ఆ వివరాలు...   1. ఆంధ్రప్రదేశ్ రాజధాని 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.   2. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో శివరామక‌‌ృష్ణన్ కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించిన మరుసటి గంట నుంచే రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తాం.   3. రాజధాని నిర్మాణం కోసం మెకంజీ, ఎల్ అండ్ టీ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి.   4. రాజధాని నిర్మాణం కోసం మలేషియా, సింగపూర్‌లను సందర్శించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.   5. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అవసరమయ్యే భూమి కోసం విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరిలో (వీజీటీఎం) భూ సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది.   6. వీజీటీఎం పరిధిలో 184 కిలోమీటర్ల పొడవు వుండే అవుటర్ రింగ్‌రోడ్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.   7. వీజీటీఎం రింగ్‌రోడ్డు పరిధిలోనే 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వుంది.   8. రాజధాని నిర్మాణం కోసం వాటాల పద్ధతిలో భూమిని సేకరిస్తారు. రైతులు భూములు ఇచ్చినచోటే రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.   9. మలేషియా పుత్రజయలా రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పుత్రజయ నగరాన్ని సందర్శించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.

మానవత్వానికి ప్రాంతీయ భేదం లేదు!!

  కొంతమంది మనుషులకే ప్రాంతీయ భేదాలు, విభేదాలు వుంటాయిగానీ మానవత్వానికి కాదు. అవును... మానవత్వానికి ప్రాంతీయ భేదం లేదు. ఈ విషయం మరోసారి రుజువైంది. మానవత్వం మీద మనిషికి ఉన్న నమ్మకాన్ని మరింత పెరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన జిల్లా అయిన మెదక్‌ జిల్లాలోని మాసాయిపేట దగ్గర జరిగిన స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది చిన్నారులు మరణించగా, 20 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడిన సంఘటన అందర్నీ కదిలించింది. ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులు మాసాయిపేట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ క్యాండిల్స్.తో శాంతి ప్రదర్శనలు నిర్వహించారు. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మానవత్వం విషయంలో మాత్రం తమకు ప్రాంతీయ భేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నిరూపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచి పోషించడానికి కంకణం కట్టుకున్న కొంతమంది రాజకీయ నాయకులు ఈ చిన్నారులలోని మానవత్వాన్ని చూసయినా బుద్ధి తెచ్చుకోవాలి.

చిన్నారుల పరిస్థితి విషమం.. శాంతి ర్యాలీలు

  మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల్లో ఐదు మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈమేరకు శనివారం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 15 మంది చిన్నారులు కోలుకుంటున్నారు. కోలుకుంటున్న విద్యార్థులను కాసేపట్లో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యశోద ఆస్పత్రిలో మొత్తం 20 విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.   మరోవైపు మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తుప్రాన్‌లోని విద్యార్థులు శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటు కృష్ణా జిల్లా నూజివీడులోని విద్యార్థులు కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేపట్టారు. ప్రమాదంలో మరణించిన చిన్నారుల ఆత్మ శాంతించాలని ప్రార్థించారు.

30వ రాష్ట్రంగా ‘దక్షిణ తెలంగాణ’: రేవంత్‌రెడ్డి

  మరో కొత్త రాష్ట్రం ఏర్పాటు అవ్వాలన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఈ అంకురార్పణ చేసిన వారు తెలంగాణ టీడీపీ నాయకుడు, కోడంగల్ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్‌లో కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే అవకాశం ఇచ్చి దక్షిణ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దక్షిణ తెలంగాణ అంటే చిన్న చూపు అని, అందుకే దక్షిణ తెలంగాణకు చెందిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూడటం భావ్యం కాదని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సూచించారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణ విషయంలో తన నిర్లక్ష్య ధోరణిని ఇలాగే కొనసాగిస్తే, దక్షిణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ఉద్యమం మొదలై, భవిష్యత్తులో దేశంలో 30వ రాష్ట్రంగా ‘దక్షిణ తెలంగాణ’ ఏర్పడుతుందేమోనని రేవంత్‌రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్న అంశం మీద ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద చంద్రబాబుకు కమిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. వీజీటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) పరిధిలో తక్షణం రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని అవకాశాలున్నాయని కమిటీ తేల్చింది. అయితే వీజీఎంటీ పరిధిలో భూ లభ్యత తక్కువగా వుందని వివరించింది. భూమిని సేకరించగలిగితే ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అన్నిరకాలుగా అనువుగా వుంటుందని కమిటీ చెప్పింది.

సుభాష్ చంద్రబోస్ కారు దొరికిందోచ్!

  నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన దాదాపు 90 ఏళ్లనాటి బేబీ ఆస్టిన్ కారును జార్ఖండ్లో కనుగొన్నారు. ఈ కారులోనే సుభాష్ చంద్రబోస్ 1930 నుంచి 1941 వరకు జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కారు జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లోని బరారీ కోక్ ప్లాంటు గోడౌన్లో కనిపించింది. ఈ కారు గురించి కోల్కతాలోని నేతాజీ రీసెర్చ్ బ్యూరోకు సమాచారం అందింది. త్వరలో ఈ కారును ఆ సంస్థ స్వాధీనం చేసుకునే అవకాశం వుంది. ఈ కారు నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఉపయోగించిన కారే.. అయితే దీని ఓనర్ మాత్రం ఆయన కాదు.. ఈ కారు సొంతదారు సుభాష్ చంద్రబోస్ మేనమామ అశోక్ బోస్.

మామిడిచెట్టుకు ఎలుక ప్రదక్షిణలు!

  ఆమధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం అనే ఊళ్ళో ఒక పందిగారు ఉదయాన్నే నిద్రలేచి, వాగులో స్నానం చేసి, అక్కడే ఉన్న ఓ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన సంగతి, ఆ పందిగారు తన ప్రదక్షిణలు చాలాకాలం కొనసాగించిన సంగతి గుర్తుండే వుంటుంది. ఇప్పుడు అలాంటిపనే ఓ ఎలుక గారు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో బావుసాయిపేట ఎల్లమ్మ దేవాలయం అనే గుడి వుంది. ఆ గుడి ఆవరణలో ఒక పెద్ద మామిడిచెట్టు వుంది. శనివారం ఉదయం నుంచి ఆ మామిడిచెట్టు చుట్టూ ఓ ఎలుక నాన్‌స్టాప్‌గా ప్రదక్షిణలు చేస్తూనే వుంది. ఈ వింత చూసి జనం గుమిగూడినా సదరు ఎలుక ఎంతమాత్రం భయపడకుండా ప్రదక్షిణాలు చేస్తోంది. దాంతో సదరు ఎలుకని దేవుడి అవతారంగా భావించి జనం దణ్ణాలు పెట్టేస్తున్నారు. ఎలుక గారికి ఎంతమాత్రం డిస్ట్రబెన్స్ లేకుండా దూరం నుంచే కొబ్బరికాయలు కొడుతూ పూజలు చేసేస్తున్నారు. పాపం ఆ ఎలుక మాత్రం చెట్టుచుట్టూ ఎంతసేపని తిరుగుతుంది. చీకటి పడిన తర్వాత ఏ పిల్లిగారో చూసే వరకు ఆ మామిడి చెట్టు చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత ఆ పిల్లి పొట్టలో తిరుగుతుంది!!

ఆ కుర్రోడికి నోట్లో 232 పళ్ళు!

  మనకి ముప్ఫై రెండు పళ్ళ సంగతే తెలుసు. కానీ ఆ కుర్రాడికి 232 పళ్ళ సంగతి తెలుసు. ఎందుకంటే అతని నోట్లోంచి 232 పళ్ళు బయటపడ్డాయి. ఆషిక్ గవాయ్ అనే ఓ ముంబై కుర్రాడు కుడిబుగ్గ బాగా వాచిపోయి ముంబైలోని జేజే ఆస్పత్రికి వెళ్ళాడు. అతని నోటిని పరీక్షించిన డాక్టర్లు నోళ్ళు తెరిచారు. ఎందుకంటే అతని పళ్ళ చిగుళ్ళలో బోలెడన్ని పళ్ళు మొలుస్తున్నాయి. డాక్టర్లు ఈ వ్యాధిని కాంప్లెక్స్ అడంటోమా వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి వల్ల దవడ లోపల ఒక కణితి పుడుతుంది. దానివల్ల అదనపు పళ్ళు వస్తాయి. మొత్తమ్మీద అతనికి ఆపరేషన్ చేసి అదనంగా ఉన్న 232 పళ్లను తీసేశారు. పళ్ళు వస్తే వచ్చాయి పోతే పోయాయిగాని ఇప్పుడు ఆషిక్ గవాయ్ అత్యధిక పళ్లు ఉన్న మనిషిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించబోతున్నాడు.

సానియాకి మంచు లక్ష్మి మద్దతు!

  టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం మీద వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారీగా విమర్శల వేడిని ఎదుర్కుంటున్న సానియా మిర్జాకి మంచులాంటి చల్లదనం ఉపశమనం కలిగిస్తోంది. అంటే, నటి, నిర్మాత మంచు లక్ష్మి సానియా మిర్జాకు తన మద్దతు ప్రకటించారు. ఈ అంశం మీద స్పందించిన మంచు లక్ష్మి సానియా మీర్జాపై విమర్శలు చేస్తున్న వారిని తప్పుపట్టారు. దేశం తరఫున ఆడుతూ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సానియాపై ఇలాంటి వ్యాఖ్యలు తగవని మంచు లక్ష్మి అభిప్రాయ పడ్డారు. తన పూర్తి మద్దతు సానియా మీర్జాకు ఉంటుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.