చల్లటి కబురు: ఇక వర్షాలే వర్షాలు!

  వర్షాకాలం వచ్చి చాలా రోజులైనా వర్షాలు కురవడం లేదని ఫీలవుతున్నారా? ఇక డోన్ట్ వర్రీ బీ హ్యాపీ.. రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురవబోతున్నాయి. త్వరలో మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ‘‘ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా.. ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన?.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా’’ అని ఎంచక్కా పాడుకోవచ్చు. ఇదేదో మాటవరసకో, పాట వరసకో చెబుతున్న విషయం కాదు.. నిజంగానే రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయట. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఈ విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతోంది. వాతావరణ కేంద్రం వర్షం కురుస్తుందని చెప్పింది కాబట్టి కచ్చితంగా వర్షం కురవదనే అనుమానాలేవీ పెట్టుకోకండి. ఎందుకంటే వర్షాలు ఖాయంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు నమ్మకంగా చెబుతున్నారు. వారు చెబుతున్న తీరు చూస్తుంటే నిజంగానే వర్షాలు కురుస్తాయన్న నమ్మకం కలుగుతోంది. ఎందుకంటే తమిళనాడు నుంచి విదర్భ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా వుందంట. క్రికెట్‌లో ధోనీ క్రీజ్‌లో స్థిరంగా వుంటే ఎలా పరుగుల వర్షం కురుస్తోందో, ఈ అల్ప పీడన ద్రోణి కూడా స్థిరంగా వుంటే వర్షాలు కూడా అలాగే కురుస్తాయి. అలాగే బంగాళా ఖాతం మీద ఉపరితల ఆవర్తనం భారీ స్థాయిలో వుందంట. అంటే అర్థం ఏంటంటే, ఇక వర్షాలను ఆపడం సాక్షాత్తూ ఆ వరుణ దేవుడి వల్ల కూడా కాదు. అంచేత మనమందరం ‘‘వానా వానా వందనం’’ అని పాట పాడుకోవడానికి రెడీగా వుందాం!

హెల్త్ బులిటిన్: నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం!!

  మాసాయిపేట రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన దుర్ఘటనలో 16 మంది చిన్నారులు మరణించిన విషాదం అందరి మనసులనూ కలచివేస్తేంది. కాగా తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులలో నలుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. తరుణ్, వరుణ్, ప్రశాంత్, వైష్ణవి అనే నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని యశోదా ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటిన్‌లో పేర్కొన్నారు. గాయపడిన చిన్నారులలో ఎనిమిది మంది ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డారని, వీరిని శనివారం నాడు ఐసీయు నుంచి సాధారణ వార్డుకు మారుస్తామని ఆ బులిటిన్‌లో పేర్కొన్నారు.

దంపతులను కాటేసిన కరెంటు తీగలు!

  కరెంటు తీగలు ముచ్చటైన జంటను కాటేసి పొట్టన పెట్టుకున్నాయి. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరిపాలెంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. శనివారం ఉదయం ఐదుగంటలకు నిద్ర లేచిన వెంకటేశ్వరమ్మ అనే మహిళ తమ ఇంటిముందు విద్యుత్ స్తంభానికి చెందిన విద్యుత్ తీగలు తెగి పడి వుండటాన్ని గమనించి వాటిని పక్కకి తొలగించే ప్రయత్నం చేసింది. దాంతో కరెంట్ షాక్‌కి గురై ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఇంట్లోంచి బయటకి వచ్చిన ఆమె భర్త విఘ్నేష్ ఇంటి ఎదురుగా భార్య చనిపోయి పడి వుండటాన్ని చూసి కంగారుపడిపోయి భార్యని పట్టుకున్నాడు. దాంతో అతను కూడా తీవ్ర విద్యుదాఘాతానికి గురై అతను కూడా అక్కడికక్కడే మరణించాడు.

సానియాపై టీ కాంగ్రెస్ తలోమాట: సోనియాకి ఫిర్యాదు!!

  సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అంశం మీద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలోరకంగా స్పందిస్తున్నారు. తమలో తాము తిట్టుకోవడానికి కొత్తపాయింట్ దొరికినందుకు చాలా సంతోషిస్తూ తిట్టుకుంటున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియాని ఎంపిక చేయడం ఏంటంటూ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు నిప్పులు చెరిగితే, హనుమంతరావు చేసిన వ్యాఖ్యల మీద టీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మల్సీ షబ్బీర్ అలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సానియా నియామకం నూటికి నూరుశాతం కరెక్ట్ అంటున్నారు. భారతదేశం కోసం అనేక పతకాలు సాధించిన సోనియా కోటి రూపాయలు ఇవ్వడానికి, పదవులు ఇవ్వడానికి అర్హురాలని అన్నారు. సానియా మీద వ్యాఖ్యలు చేసిన హనుమంతరావు మీద తమ అధినేత్రి సోనియాకి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. హనుమకు మాట్లాడే స్వాతంత్ర్యం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. విహెచ్‌ను కట్టడి చేయాల్సిందిగా ఆయన సోనియాకి రాసిన లేఖలో కోరారు. దీని మీద వీహెచ్ స్పందించారు. తాను తప్పేమి మాట్లాడలేదని అన్నారు. తెలంగాణలో జన్మించిన అజహరుద్దీన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించకుండా, ముంబాయిలో జన్మించిన సానియాకు ఎలా ఇస్తారని ప్రశ్నించానని చెప్పారు.

అంతా అయిపోయాక రైల్వే గేటు పెట్టారు!!

  మెదక్ జిల్లాలో మాసాయిపేట దగ్గర కాపలా, గేటు లేని లెవల్ క్రాసింగ్ కారణంగా పదహారు మంది బడి పిల్లలు చనిపోయాక రైల్వే అధికారులకు జ్ఞానోదయం కలిగింది. ఆగమేఘాల మీద అక్కడ రైల్వే గేటును ఏర్పాటు చేశారు. ఇక్కడ రైల్వే గేటు ఏర్పాటు ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకోని రైల్వే అధికారులు 16 మంది చిన్నారులు చనిపోయాక గానీ కళ్ళు తెరవలేదు. దుర్ఘటన జరిగిన ప్రాంతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వుంది. ప్రమాదం సంఘటనతో తీవ్ర దిగ్ర్భాంతికి గురైన కేసీఆర్ రైల్వే జిఎం శ్రీవాత్సవతో మాట్లాడి తక్షణమే గేటును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెంటనే శ్రీవాత్సవ సికింద్రబాద్‌లోని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వారు శుక్రవారం మాసాయిపేటకు చేరుకొని త్వరితగతిన పనులు చేపట్టారు. ఈ పని గతంలోనే చేసి ఉంటే 16మంది చిన్నారుల ప్రాణాలు నిలిచేవని స్థానికులు అంటున్నారు.

ఫేస్‌బుక్‌ సృష్టికర్త ఆస్తి 2 లక్షల కోట్లు!!

  ఇది మీరు కచ్చితంగా షేర్ చేయాల్సిన లేదా లైక్ చేయాల్సిన లేదా కామెంట్ చేయాల్సిన మేటర్. ఎందుకంటే ఇది ఫేస్‌బుక్‌ సృష్టికర్త, ఆ కంపెనీ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్‌కి సంబంధించిన తాజా వార్త. ఆ వార్త ఏమిటంటే, జుకర్‌ బర్గ్ ఆస్తి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. (3,300 కోట్ల డాలర్లు). ఫేస్‌బుక్ కంపెనీ షేర్ల విలువ గురువారం బాగా పెరిగిపోయి కొత్త గరిష్ట స్థాయిని చేరడంతో జుకర్ బర్గ్ ఆస్తి కూడా 160 కోట్ల డాలర్లకు పైగా పెరిగి ప్రస్తుతం వున్న స్థాయికి చేరింది. మార్క్ ఆస్తి మరో రెండు మూడు రోజుల్లో మూడువేల ఐదువందల కోట్లకు అంటే అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మార్క్ ఆస్తి విషయంలో జుకర్ బర్గ్ గూగుల్ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్, అమెజాన్ డాట్‌కామ్ సిఇఓ జెఫ్ బెజోస్‌ని మించిపోయాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో 30 ఏళ్ళ జుకర్ బర్గ్ 16వ స్థానంలో నిల్చారు. గూగుల్ వ్యవస్థాపకులు వరుసగా 17,18 స్థానాల్లో ఉండగా.. బెజోస్ 20వ ర్యాంకులో ఉన్నారు. 8,470 కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో ఉన్నారు. ఫేస్ బుక్ వినియోగదారులుగా మనం మార్క్ జుకర్ బర్గ్ మరింత ధనవంతుడు అవ్వాలని కోరుకుందాం.

ఏ రాష్ట్రం ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే: సచివాలయ ఉద్యోగులు

  కమలనాథన్ కమిటీ తన మార్గదర్శకాలను వెల్లడి చేసిన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు స్పందించారు. స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రం ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే వుంచాలని కోరారు. అవసరం అనుకుంటే దానికోసం సూపర్ న్యూమరిక్ పోస్టులనైనా సృష్టించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మురళీకృ‌ష్ణ అన్నారు. ఉద్యోగులు అధికంగా వున్నారనే కారణాన్ని చూపించి జూనియర్లను ఇతర రాష్ట్రాలకు పంపడాన్ని తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఉద్యోగుల విభజనను షెడ్యూలు ప్రకారమే పూర్తి చేయాలని కోరారు. స్థానికతను ఆర్టికల్ 371 (డి) ప్రకారం నిర్ణయించడం, భార్యాభర్తలు, ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులకు ఆప్షన్లు ఇవ్వడాన్ని సచివాలయ ఉద్యోగులు సమర్థించారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లోని క్లాజ్‌ ఎఫ్‌ తీవ్ర అభ్యంతరకరంగా ఉందని సచివాలయ ఉద్యోగుల ఫోరం కో-చైర్మన్‌ మురళీమోహన్‌ అన్నారు. ఈ క్లాజు తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులకు, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందికరమన్నారు.

విమానంలో సాంకేతిక లోపం: వెయిట్ చేసిన సచిన్!

  భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రయాణించాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమానం ముంబైకి వెళ్లాల్సివుంది. ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సచిన్ తిరుగు ప్రయాణంలో ఈ విమానంలో ముంబైకి వెళ్లేందుకు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అయితే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని ఆపివేశారు. దీంతో సచిన్ సహా ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో వేచి వున్నారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన తర్వాత సచిన్ ముంబై వెళ్ళినట్టు తెలిసింది.

గోవా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!!

  గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారింది. తాజాగా ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘‘మా గోవా రాష్ట్రంలో అయితే అమ్మాయిలు అర్ధరాత్రి దాటినా భయం లేకుండా తిరగొచ్చు. అదే ఉత్తర ప్రదేశ్‌లో అయితే సాయంత్రం ఆరు దాటాక రోడ్డు మీదకి వస్తే అమ్మాయిలు మాయమైపోతారు’’ అన్నారు. కొన్ని రాష్ట్రాలు పనిగట్టుకుని గోవా పేరును చెడగొట్టి, తద్వారా గోవాకు వస్తున్న లక్షలాది మంది పర్యాటకులను తమ రాష్ట్రాలు ఆకర్షించేందుకు యత్నిస్తున్నట్లు మనోహర్ పారికర్ ఆరోపించారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ గోవాకి వున్న మంచి పేరును చెడగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలపై టీ ఉద్యోగుల మండిపాటు!

  స్థానికత అంశంలో తాము చేసిన సూచనలను కమల్‌నాథన్ కమిటీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలను వెల్లడించిన విషయం తెలిసిందే. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను వైబ్‌సైట్‌లో పొందుపర్చిన అనంతరం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, స్థానికతపై తమ విజ్ఞప్తులు ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. స్థానికత నిర్ధారణకు సరైన యంత్రాంగం లేదని ఆరోపించారు. స్థానికతను నిర్ధారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగుల ఆప్షన్ ఫాంలో తల్లిదండ్రుల స్థానిక వివరాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురి మృతి!

  భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ఉత్తరప్రదేశ్‌లో కూలిపోయింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు సైనికోద్యోగులు మరణించారు. ఇది భారతదేశం రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్). ఈ హెలికాప్టర్ బరేలీ నుంచి అలహాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గడచిన మూడేళ్ళలో ఈ తరహా హెలికాప్టర్ ప్రమాదాలు పదకొండు జరిగాయి. శుక్రవారం జరిగిన ప్రమాదంలో వాంగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్ కూడా వున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు బారైలీ నుంచి అలహాబాద్‌కు బయల్దేరిన హెలికాప్టర్ లక్నోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి కూలిపోయింది.

ఉస్మానియా విద్యార్థులను కాళ్ళతో తొక్కుతున్నారు: రేవంత్

  తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు చేతులెత్తి మొక్కిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వారిని కాళ్ళకింద వేసి తొక్కుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దోపిడీకి వారసత్వంగా కేసీఆర్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. తన నియోజకవర్గంలో ఘోరమైన స్కూలు బస్సు ప్రమాదం జరిగితే ప్రమాద స్థలానికి వెళ్ళి పరామర్శించే తీరిక కేసీఆర్‌కి లేదా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. కేసీఆర్ చెబుతున్న 1956 స్థానికతకు వెనుక చాలా పెద్ద కుట్ర వుందన్న అనుమానాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు కూడా ఇలాంటి నిబంధనలు లేవని రేవంత్ రెడ్డి అన్నారు.

కమలనాథన్ కమిటీ సూచనలు... వివరంగా..!!

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ తన మార్గదర్శకాలను నిర్ణయించింది. ఈ మార్గదర్శకాలు 19 పేజీలు వున్నాయి. వాటిని వెబ్‌సైట్‌లో వుంచారు. ఆ వివరాలు....   1. ఏడేళ్ళ విద్యార్హత ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలి.   2. ఉద్యోగులలో దంపతులు, ఒంటరి మహిళలకు ఆప్షన్లు వుంటాయి.   3. రిటైరయ్యే ఉద్యోగులకు ఆప్షన్లు లేవు.   4. ఆర్టికల్ 371 డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతుంది.   5. గ్రూప్-4 ఉద్యోగులను పూర్తిగా స్థానికత ఆధారంగానే విభజించాలి.   6. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలి,.   7. నాలుగో తరగతి ఉద్యోగులకు ఆప్షన్లు లేవు.   8. వికలాంగులకు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఆప్షన్లు వుంటాయి.   9. ఒక్కసారి ఆప్షన్ ఇస్తే మళ్ళీ మార్చడానికి కుదరదు.   10. కమిటీ సూచించిన విధి విధానాల మీద ఏవైనా అభ్యంతరాలు, సలహాలు వుంటే ఆగస్టు 5వ తేదీ లోపు తెలియజేయాలి.   11. అభ్యంతరాలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది.   12. 1975 ఆర్డర్ సర్వీసు రికార్డ్ ఆధారంగా స్థానికతను గుర్తిస్తాం.   13. తప్పుడు స్థానికత ధ్రువీకరణ ఇస్తే కఠినచర్యలు ఉంటాయి.

ఏడేళ్ళ విద్యార్హతే స్థానికతకు కొలమానం: కమలనాథన్!

  ఆంద్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజన అంశానికి సంబంధించి తాము సూచించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో కమిటీ ఉంచింది. కేంద్రం ఆమోదం మేరకు 19 పేజీల మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచింది. ఉద్యోగులలో దంపతులు, ఒంటరి మహిళలకు ఆప్షన్లు ఉంటాయని, అయితే రిటైరయ్యే ఉద్యోగులకు మాత్రం ఆప్షన్లు లేవని అందులో తెలిపారు. ఏడేళ్ల విద్యార్హతల ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలని కమలనాథన్ కమిటీ సూచించింది. ఆర్టికల్ 371 డి రెండు రాష్ట్రాల్లో కొనసాగుతుందని, గ్రూప్‌-4 ఉద్యోగులను పూర్తిగా స్థానికత ఆధారంగా విభజించాలని నిర్ణయించారు. ఏడేళ్ల విద్యార్హత ఆధారంగానే స్థానికత నిర్ణయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. నాలుగోతరగతి ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, వికలాంగులకు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఆప్షన్ సదుపాయం ఉంటుందని తెలిపారు. అలాగే, ఒక్కసారి ఆప్షన్‌ ఇస్తే మళ్లీ మార్చడం కుదరదని స్పష్టం చేశారు. విధివిధానాలపై అభ్యంతరాలు, సలహాలు ఉంటే ఆగష్టు 5 లోపు ఇవ్వాలని కమలానాథన్‌ కమిటీ కోరింది. వాటిని పరిశీలనకు తీసుకున్న తర్వాత మళ్లీ కేంద్రం తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుందని చెప్పారు. 1975 ఆర్డర్ సర్వీసు రికార్డ్ ఆధారంగా స్థానికతను గుర్తిస్తామన్నారు. తప్పుడు స్థానికత ధ్రువీకరణ ఇస్తే తీవ్రమైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.

డోంట్ వర్రీ.. మై హూనా: సైనాకి కేటీఆర్ భరోసా!

  టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు ఓకే మరి నా పరిస్థితేంటని బ్యాడ్మింటన్ స్టార్ సైనా రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన 50 లక్షల మొత్తం ఇప్పటికీ అందలేదని సైనా ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్లో స్పందించారు. సైనా విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. సైనాతో పాటు షూటర్ గగన్ నారంగ్ (రూ.50 లక్షలు), కబడ్డీ క్రీడాకారిణులు మమతా పూజారి, నాగలక్ష్మి (చెరో రూ.25 లక్షలు) కూడా నజరానా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమస్య తప్పక పరిష్కారమయ్యేలా చూస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వీరే కాకుండా రాష్ట్రానికి చెందిన ఒలింపియన్లంతా తమకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ ట్విట్టర్ మెసేజ్‌కి సంతోషించిన సానియా థాంక్యూ సార్ అని ట్విట్ చేసింది. దానికి కేటీఆర్ స్పందిస్తూ వెల్‌కమ్ సైనా అన్నారు.