ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు: ఐదుగురి మృతి

  ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు జరిగి ఐదుగురు మరణించారు. రాజధాని రాయ్‌పూర్ దగ్గర ఛోటి ఉర్లా గ్రామంలో వున్న నవభారత్ ఫ్యూజ్ కర్మాగారంలో శుక్రవారం తెల్లవారుఝామున పేలుడు సంభవించడంతో ఐదుగురు కార్మికులు మరణించారు. 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడినవారు రాయ్‌పూర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్మాగారంలో డిటోనేటింగ్ ఫ్యూజ్ తయారు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి కర్మాగారం పైకప్పు కుప్పకూలింది. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్టు తెలుస్తోంది.

ఒకే వేదిక మీద సచిన్, పవన్?

  టాలీవుడ్ మూవీ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంటర్నేషన్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం నాడు విజయవాడలో ఒకే వేదిక మీద కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడలో శుక్రవారం నాడు వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మించిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ వస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పొట్లూరి వరప్రసాద్ పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడు. ఈమధ్య ముగిసిన ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పొట్లూరి వరప్రసాద్‌కి టీడీపీ టిక్కెట్ ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో అది మిస్సయింది. అయినప్పటికీ పొట్లూరి వరప్రసాద్, పవన్ కళ్యాణ్ మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సచిన్‌తోపాటు పవన్ కళ్యాణ్‌ని కూడా పొట్లూరి వరప్రసాద్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్స్‌ని ఒకే వేదిక మీద చూస్తే ఇటు క్రికెట్ అభిమానులతోపాటు అటు సినిమా అభిమానులకు కూడా పండగే. సచిన్, పవన్ ఒకరినొకరు కలవటం ఇదే మొదటిసారి కాబోదు.. గతంలో చిరంజీవి కుటుంబాన్ని సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు కలిశారు.

శాసనమండలికి మంత్రి నారాయణ

  విద్యావేత్త నారాయణ ఆంధ్రప్రదేశ్ శాసనసభలోగానీ, శాసన మండలిలోగానీ సభ్యుడు కాకుండానే రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం ఆయన మంత్రిపదవి చేపట్టిన ఆరు నెలల లోగా శాసన సభకు గానీ, శాసన మండలి గానీ ఎంపిక కావలసి వుంది. ఈ నేపథ్యంలో ఆయనను శాసన మండలికి సభ్యుడిగా ఎంపిక చేయడానికి తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తోంది. మే 21న కోలగట్ల వీరభద్ర స్వామి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ ఖాళీని నారాయణతో భర్తీ చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. ఈ స్థానానికి ఆగస్టు 21వ తేదీన ఉప ఎన్నిక జరగబోతోంది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఈ ఉప ఎన్నికకు ఆగస్టు నాలుగో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 11వ తేదీలోగా నామినేషన్లు దాఖలుచేయాలి. ఉపసంహరణకు తుదిగడువు ఆగస్టు 14. అవసరమైతే 21వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండటం వల్ల ఎమ్మెల్సీ పదవికి నారాయణ ఎంపిక లాంఛనమే అవుతుంది.

చెప్పుల్లో 125 కోట్ల ఖరీదైన హెరాయిన్

  శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా హెరాయిన్ స్మగ్లింగ్‌ని అరికట్టడానికి పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్మగ్లర్లు తమ తెలివితేటలు పెంచుకుని విజయవంతంగా స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు వాళ్ళ ఖర్మ కాలి దొరికిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ముంబైలో జరిగింది. మహిళల చెప్పుల సోల్స్‌లో దాచి, చెప్పుల రవాణా పేరుతో జరుగుతున్న హెరాయిన్ స్మగ్లింగ్ గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. 125 కోట్ల రూపాయల ఖరీదైన 36 కిలోల బరువున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్త్రీల చెప్పుల రవాణా పేరుతో ఢిల్లీ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారాన్ని అందుకున్ను ముంబై పోలీసులు పక్కా స్కెచ్ వేసి హెరాయిన్‌ని, స్మగ్లర్ల బృందంలోని ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హెరాయిన్‌ని మొదట ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్‌కి, అక్కడి నుంచి ఢిల్లీకి తెచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై ‘సుప్రీం’లో ఇంప్లీడ్‌

  ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ అవుతామని తెలిపారు. ఆగస్టు 4న తీర్పు అనుకూలంగా వస్తే యథావిధిగా కౌన్సెలింగ్‌ కొనసాగిస్తామని, ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిమీద ఆగస్టు 5న సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వెలిబుచ్చుతున్నా ఉన్నత విద్యామండలి ముందుకే వెళ్తోంది. దీనిలో భాగంగా ఆగస్టు 7 నుంచి కౌన్సిలింగ్ జరుపుతామంటూ బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సరికొత్త లొల్లి

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు బోలెడన్ని వివాదాలు తలెత్తి, పరిష్కార మార్గం కనిపించక రెండు రాష్ట్రాల వారికీ ఇబ్బందికరంగా మారాయి. నీటి వివాదాలు, విద్యుత్ వివాదాలు, ఫీ రీ ఎంబర్స్‌మెంట్ వివాదం, ట్రాన్స్‌పోర్ట్ వివాదం, ఎంసెట్ కౌన్సిలింగ్ వివాదం... ఇలా రాసుకుంటూ వెళ్తే పెద్ద చేంతాడంత లిస్టు తయారవుతుంది. ఆ చేంతాడు చివర్లో కొత్తగా చేరిన సమస్య అసెంబ్లీ సెంట్రల్ హాల్ రిపేరు సమస్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం అసెంబ్లీ సెంట్రల్ హాల్‌‌ను పదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ‌ హాల్‌గా ఉపయోగించుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు సరైన సదుపాయాలు లేక ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరిగేనాటికి ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన సెంట్రల్ హాల్‌లో రిపేర్లు చేయిస్తున్నారు. లైట్లు మార్చడం, టాయిలెట్స్‌ని బాగుచేయడం, ఫ్యాన్లు, ఏసీలు బాగు చేయడం లాంటి పనులు చేయిస్తున్నాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి సోలిపేట రామలింగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణ చారిత్రక కట్టడమైన అసెంబ్లీ రూపురేఖలు మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న పనులను ఆపివేయించారు. నిజాం కట్టించిన అసెంబ్లీ హాలు తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమని, దాని రూపురేఖలు మార్చడానికి వీలు లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.   దానికి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి కాలువ శ్రీనివాసులు స్పందిస్తూ, అసెంబ్లీలో తమ రాష్ట్రం పది సంవత్సరాలపాటు సమావేశాలు నిర్వహించుకోవడానికి హక్కు వుందని, తాము కేవలం లైట్లు మార్చడం, ఫ్యాన్లు, ఏసీలు రిపేరు చేయడం లాంటి పనులు చేస్తున్నామే తప్ప, సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామే తప్ప అసెంబ్లీ రూపు రేఖల్ని ఎంతమాత్రం మార్చడం లేదని చెప్పారు. అయితే కాలువ శ్రీనివాసులు వాదనతో ఏకీభవించని సోలిపేట రామలింగారెడ్డి ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆయన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తే, ఈయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తారు.. అలా ఈ వివాదం ముదిరిపోతుంది. ఇరు రాష్ట్రాల మధ్య మరో తెగని సమస్యలా మారిపోతుంది. సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోగలిగిన అనేక అంశాలు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలుగా మారడం సాధారణమైపోయింది.

ఎంసెట్ కౌన్సిలింగ్ జరగనివ్వం: ఓయు విద్యార్థులు

  ఆగస్టు 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు స్పందించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ జరగనివ్వమని ప్రకటించారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయడానికే ఉన్నత విద్యామండలి ఇలా వ్యవహరిస్తోందని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు పిడమర్తి రవి, బాలరాజు ఆరోపించారు. ఈ విషయం మీద సుప్రీం కోర్టు తీర్పు ఆగస్టు 4న వచ్చే అవకాశం వుందని, ఈలోపే ఉన్నత విద్యామండలి 7 నుంచి కౌన్సిలింగ్ చేస్తామని ప్రకటించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు.

భూముల ధరలు పెంచుతారా? వద్దు: చంద్రబాబు

  ఆర్థిక ఇబ్బందులలో వున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక వనరుల కోసం అన్వేషణ ప్రారంభించింది. అయితే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సి వుంది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు ఈ సూత్రాన్ని గ్రహించకుండా భూముల విలువ పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా బోలెడంత డబ్బు వస్తుందని భావించారు. అనుకున్న తడవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల విలువను 30 శాతం పెంచుతూ ప్రతిపాదనలు తయారు చేసి ఫైలును ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట పెట్టారు. అయితే రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. ఈ ఫైలు మీద రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.ఇ. కృష్ణమూర్తి ఇప్పటికే సంతకం చేశారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తిరస్కరించారు. ఇప్పుడు భూముల విలువ పెంచడం వల్ల ప్రజల మీద భారం పడటంతోపాటు కొత్త రాజధాని నిర్మాణానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయని చంద్రబాబు అధికారులకు చెప్పారని తెలుస్తోంది.

నా ఆత్మకథ రాస్తా.. అప్పుడు చెప్తా: సోనియా

  విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు నట్వర్‌సింగ్ తన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’లోని కొన్ని అంశాలు బహిర్గతమైన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన అనేక విషయాలను, కాంగ్రెస్ పార్టీ తనకు చేసిన ద్రోహాన్ని నట్వర్ సింగ్ పొందుపరిచారు. సోనియాగాంధీ ప్రధానమంత్రి కాకపోవడానికి ఆమె చేసిన ‘త్యాగం’ కారణం కాదని, తన తల్లి ప్రధానమంత్రి అయితే నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ తరహాలోనే హత్యకు గురవుతుందని రాహుల్ గాంధీ భయపడటమేనని ఆ పుస్తకంలో నట్వర్ సింగ్ పేర్కొన్నారు. ఈ విషయం మీద సోనియా గాంధీ స్పందించారు. ఓ ఆంగ్ల టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా స్పందిస్తూ ‘‘నేను కూడా నా ఆత్మకథని రాస్తాను. అప్పుడు వాస్తవాలు బయటపడతాయి’’ అని ఆమె వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద నట్వర్ సింగ్ ఆత్మకథలోని విషయాలు సోనియాగాంధీకి ఇరిటేషన్ తెప్పించినట్టే వుంది. మొత్తమ్మీద నట్వర్ సింగ్ ఆత్మకథ విడుదలయ్యాక అందులో ఇంకెన్ని సంచలనాలు ఉంటాయో!

అసెంబ్లీ సంఘటన: అమ్మో... అతనొక సైకో!

  బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశ ద్వారాన్ని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకి చెందిన అశోక్‌రెడ్డి అనే వ్యక్తి ధ్వంసం చేశాడు. అతనని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి, స్పీకర్ ప్రవేశించే గేట్ నంబర్ 1 దూకి అశోక్ రెడ్డి లోపలకి ప్రవేశించి విధ్వంసకాండ సృష్టించాడు. మొదట అశోక్‌రెడ్డి మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పారు. కానీ, అతనొక పెద్ద సైకో అని విచారణలో తేలింది. వరంగల్ జిల్లా పస్రా గ్రామానికి చెందిన 29 ఏళ్ళ అశోక్ రెడ్డి చిన్నప్పటి నుంచి అసాధారణంగా, సైకోలాగా ప్రవర్తించేవాడని తెలుస్తోంది. 2005 సంవత్సరంలో పోడు భూమిని ఆక్రమించిన కేసు ఇతని మీద వుంది. చిన్నతనం నుంచే దొంగతనాలు, నేరాలకు పాల్పడేవాడు. పెళ్ళి చేస్తే బుద్ధి కుదురుతుందని భ్రమించిన పెద్దలు అతనికి పెళ్ళి చేశారు. అశోక్‌రెడ్డి బుద్ధి కుదరకపోగా ఒక ఆడపిల్ల అన్యాయమైపోయింది. అశోక్‌రెడ్డి భార్య ఈ సైకోని భరిస్తూ వస్తోంది. అశోక్‌రెడ్డి సైకో చేష్టలు కొద్ది రోజులుగా ముదరడంతో వైద్యులకు కూడా చూపిస్తోంది. బుధవారం ఉదయం భార్యతో గొడవ పడి బయటకి వచ్చిన అశోక్‌రెడ్డి తన ప్రతాపం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద చూపించాడు. అశోక్‌రెడ్డిని పోలీసులు రిమాండ్‌కి తరలించారు.

కాశ్మీర్‌ మీద వ్యాఖ్యలు: కవిత మీద బీజేపీ నేత కేసు

  జమ్ము-కాశ్మీర్‌ని, హైదరాబాద్‌ని భారత ప్రభుత్వం దురాక్రమణ చేసిందని, జమ్ము-కాశ్మీర్‌లోని కొంత భాగాన్ని వదులుకోవడానికి భారతదేశం సిద్ధపడాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ కవితకు ఇప్పుడు కష్టాలు వచ్చాయి. తెలంగాణ, జమ్మూకాశ్మీర్‌ల గురించి కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ లీగల్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కాశింశెట్టి కరుణాసాగర్ హైదరాబాద్‌లోని ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కవిత ఐపీసీ సెక్షన్ 124(ఎ), 153(బి), 505ల కింద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. మేజిస్ట్రేట్ ఈ కేసు విచారణను ఆగస్ట్ ఒకటో తేదీకి వాయిదా వేశారు.

సోనియాని చంపేస్తారని రాహుల్ భయం...

  రాహుల్ గాంధీ మంచి రాజకీయ నాయకులు కాకపోవచ్చు.. సరైన ప్రధానమంత్రి అభ్యర్థి కాకపోవచ్చు.. పరిపక్వత లేని రాజకీయ నాయకుడు కావచ్చు... తల్లి చాటున వుండి అధికారం చెలాయించిన వ్యక్తి కావొచ్చు.. ఆయనలో ఎన్ని లోపాలున్నా... ఒక్క ప్లస్ పాయింట్ మాత్రం వుంది. అది ఏమిటంటే, రాహుల్ గాంధీకి తన తల్లి అంటే అపారమైన ప్రేమ. చాల్చాల్లే తల్లి అంటే ప్రేమ లేనిది ఎవరికి? ఒక్క రాహుల్ గాంధీకే తల్లి అంటే ప్రేమా అని ప్రశ్నించొద్దు ప్లీజ్! రాహుల్ గాంధీకి తన తల్లి సోనియా గాంధీ అంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ అంటే.. ఆమెని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోకుండా చేసేంత ప్రేమ. 2004 ఎన్నికల తర్వాత సోనియాగాంధీ ప్రధానమంత్రి అవ్వాలని అనుకున్నారట. అయితే రాహుల్ గాంధీయే అడ్డు పడిపోయారట. సోనియా ప్రధాని అయితే, తన నానమ్మ ఇందిరా గాంధీలాగా, తండ్రి రాహుల్ గాంధీ లాగా తీవ్రవాదుల చేతిలో చనిపోయే ప్రమాదం వుందని భయపడిపోయాడట. అందుకే నువ్వు ప్రధానమంత్రి కావడానికి వీల్లేదమ్మా అని అడ్డు పడిపోయాడట. ఈ విషయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు నట్వర్ సింగ్ తన ఆత్మకథలో రాశారు. ఈ కుటుంబం గురించి ఇంకా బోలెడన్ని సంచలనాత్మక విషయాలను ఆయన తన ఆత్మకథలో పొందుపరిచారట.

జూరాలకు భారీగా నీరు.. పవర్ హౌస్ బుడుంగ్!

  కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతూ వుండటంతో కర్ణాటక సరిహద్దుల్లో వున్న మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలా ప్రాజెక్టు ఇన్ ఫ్లో 97,300 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 78,600 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 317.70 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 318.52 అడుగులు. జూరాలకు భారీగా వస్తున్న వరదల వల్ల పవర్ హౌస్ నీటమునిగింది. పవర్‌హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో కోట్లలో ఆస్తినష్టం సంభవించింది.

మా కౌన్సిలింగ్.. మా ఇష్టం.. కుదురుతుందా?

ఉన్నత విద్యామండలి ఆగస్టు ఏడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ విద్యాసంస్థలు కౌన్సిలింగ్‌లో పాల్గొనరాదని ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రం సొంతగా కౌన్సిలింగ్ నిర్వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తూ వుండటం పట్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులలో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మాట విని కౌన్సిలింగ్‌కి వెళ్ళకుండా వుంటే తర్వాత తమ పరిస్థితి ఎలా వుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. చాలామంది తెలంగాణ విద్యార్థులు ఈ టెన్షన్ తమకు ఎందుకని కౌన్సిలింగ్‌కి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పట్టుదలగా వ్యవహరించి తర్వాత మా కౌన్సిలింగ్ మేం చేసుకుంటాం, మా ఉన్నత విద్యామండలి మేం ఏర్పాటు చేసుకుంటాం అంటే చట్టపరంగా కుదురుతుందో కుదరదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆమాత్రం దానికే ఆమె పరువు పోయిందా? ఏవిటో!

  తన సినిమా, రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న జయలలిత ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో వున్నారు. ప్రస్తుతం అధికారంలో వున్న జయలలిత డీఎంకే పార్టీ భవిష్యత్తులో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నట్టుగా తొక్కేశారు. అయినప్పటికీ తనను గతంలో అసెంబ్లీ సాక్షిగా అవమానించిన డీఎంకే నాయకులను అంత సులభంగా ఆమె వదిలేలా లేరు. తాజాగా డీఎంకే నాయకుడు స్టాలిన్‌ మీద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువునష్టం దావా వేశారు. అసెంబ్లీ బయట తనకు, అసెంబ్లీ స్పీకర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారని జయలలిత తన పరువునష్టం దావాలో పేర్కొన్నారు. అయితే ఈ అంశంలో జయలలిత పరువేం పోయిందో అర్థంకాక అందరూ తలలు బాదుకుంటున్నారు. అసెంబ్లీ నుంచి బయటకి వచ్చిన స్టాలిన్ జయలలితకు, స్పీ్కర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షంలో వున్నవారు ముఖ్యమంత్రికి, స్పీకర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కొత్త విషయమేమీ కాదు.. అది అంతగా పరువునష్టం అని భావించాల్సిన విషయం కూడా కాదు. గతంలో ఇంతకంటే ఘోర అవమానాలను ఎదుర్కొన్న జయలలిత అస్సలు పరువునష్టం కాని అంశం మీదే పరువునష్టం దావా వేశారంటే దీని వెనుక ఏదో మతలబు వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కొండచరియ దుర్ఘటన: రాజ్‌నాథ్ పరామర్శ

  పూణె సమీపంలో కొండ చరియ విరిగిపడిన సంఘటనలో ఇప్పటి వరకు 25 మంది మరణించిన విషయం తెలిసిందే. శిథిలాల కింద మరో 100 మంది వున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంఘటన స్థలాన్ని గురువారం ఉదయం సందర్శించారు. సహాయక కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా పుణె జిల్లాలోని మలిన్ గ్రామంలో కొండ చరియ విరిగిపడటంతో ఈ దుర్ఘటన జరిగింది. కుండపోత వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయం కావడంతో సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు జాతీయ విపత్తు సహాయక దళం సభ్యులు 15 మందిని కాపాడారు. మొత్తం 44 ఇళ్లకు సంబంధించిన వారు శిథిలాల కింద చిక్కుకుని వున్నారు. కొండ చరియ శిథిలాలు, మట్టి కింద 100 మంది కూరుకుపోయి 24 గంటలు దాటిపోవడంతో మట్టి, బురద కింద చిక్కుకున్నవారు జీవించి లేరేమోనన్న భయం కలుగుతోంది.

ఎంసెట్ కౌన్సిలింగ్‌కి టీ స్టూడెంట్స్ వెళ్ళొద్దు: మంత్రి

  ఉన్నత విద్యామండలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆగస్టు 7వ తేదీ నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ కౌన్సిలింగ్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులెవరూ పాల్గొనాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. కౌన్సిలింగ్‌కి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క విద్యార్థి కూడా హాజరు కానవసరం లేదని, తెలంగాణలోని కాలేజీలు కూడా కౌన్సిలింగ్‌లో పాల్గొనకూడదని మంత్రి ప్రకటించారు. ఉన్నత విద్యామండలి ఇచ్చిన నోటిఫికేషన్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. మన రాష్ట్ర కౌన్సిలింగ్ మనమే చేసుకుందామని ఆయన అన్నారు. ఉన్నత విద్యామండలి నిర్ణయం ఏకపక్షమని మంత్రి తప్పు పట్టారు. తెలంగాణ విద్యార్థులకు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించడం తమ ప్రభుత్వ బాధ్యత అని, తమ రాష్ట్రంలోని కాలేజీల్లో నియామకాలు చేసే అధికారం ఆంధ్రప్రదేశ్‌కు లేదని మంత్రి స్పష్టం చేశారు.

స్కూలు బస్సు ప్రమాద బాధితులకు లోకేష్ పరామర్శ

  మెదక్ జిల్లా మాసాయిపేట దగ్గర స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో మరణించిన చిన్నారుల కుటుంబాలను తెలుగుదేశం యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబాలకు సరైన నష్టపరిహారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. మరణించిన చిన్నారుల కుటుంబలకు ఆర్థిక సాయం అందించడానికి ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్, గన్‌పూర్, వేలూరులలో లోకేష్ పర్యటించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కో చిన్నారి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే మరణించిన చిన్నారుల కుటుంబలోని పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలో ఉచితంగా విద్యాబోధన చేస్తామని, వారు ఎంతవరకు చదువుకున్నా ఆ బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని లోకేష్ ఈ సందర్భంగా ప్రకటించారు.