మోడీ, జయలలిత మీద కార్టూను.. నిరసన జ్వాల.. శ్రీలంక సారీ...

  శ్రీలంక సైనిక వెబ్‌సైట్లో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను కించ పరిచే విధంగా ఒక కార్టూన్, వ్యాసం పోస్టు చేశారు. జయలలిత నరేంద్రమోడీకి రాసే లేఖలన్నిటినీ ప్రేమ లేఖలుగా అభివర్ణిస్తూ ఈ వ్యాసం, కార్టూన్ వున్నాయి. శ్రీలంక ప్రభు త్వ భద్రతా శాఖ వెబ్‌సైట్ నిర్వహిస్తోంది. భద్రతా శాఖ కార్యదర్శిగా శ్రీలంక అధ్యక్షుడు రాజ పక్సే సోదరుడు కోత్తప్పయే ఉన్నారు. ఈయన పర్యవేక్షణ కింద పని చేసే ఈ వెబ్‌సైట్లో ముఖ్యమంత్రి జయలలిత వైఖరికి వ్యతిరేకంగా ఒక వ్యాసం, కార్టూన్ పోస్ట్ చేశారు. దీనితో తమిళనాడులోని రాజకీయ పార్టీలు, తమిళ ప్రజలు అనేక చోట్ల శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహింయారు. నుంగంబాక్కంలోని శ్రీలంక దౌత్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో లయోలా కళాశాల సమీపంలో ఆందోళనకు దిగారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. చివరికి శ్రీలంక ప్రభుత్వం జయలలితకి, నరేంద్రమోడీకి సారీ చెప్పింది..

హైదరాబాద్ మెట్రో... నో ప్రాబ్లం.. విస్తరణ... కేటీఆర్ హామీ..

  హైదరాబాద్‌లో మెట్రో రైలు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రో రైలు వ్యవస్థపై వస్తున్న వార్తలన్నీ అపోహలని ఆయన తెలిపారు. మెట్రో రైలు పీజీ కోర్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో మార్గాన్ని 250 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందనిచెప్పారు. అసెంబ్లీ వద్ద భూగర్భ మెట్రో నిర్మాణంపై మెట్రో ఎండీ ఎంవీఎస్ రెడ్డి, మిగతా ఏజన్సీలు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించాలని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు అవాంతరాలు ఉంటే సీఎం కేసీఆర్‌తో, మెట్రో ఎండీతో మాట్లాడతామని అన్నారు. ప్రభుత్వ పరంగా మెట్రో రైలుకు కట్టుబడి ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

సారీ నట్వర్‌సింగ్ తాతయ్యా: ప్రియాంక

  కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ పుస్తకం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఈ పుస్తకం పుణ్యమా అని సోనియా, రాహుల్, ప్రియాంకకి సంబంధించిన అనేక విషయాలు బయటపడ్డాయి. పాపం నట్వర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి పళ్ళూడిపోయే వయసు వచ్చే వరకూ సేవ చేశారు. అయినా ఆయన్ని ఓ కుంభకోణానికి బాధ్యుణ్ణి చేసి బలిపశువుని చేశారు. పాపం నట్వర్ సింగ్ పరిస్థితి ఓడ మల్లయ్య... బోడి మల్లయ్యలా తయారైంది. అయితే ఈమధ్యకాలంలో నట్వర్ సింగ్ తన ఆత్మకథ రాస్తున్నారని, అందులో వివాదాస్పద అంశాలు వుంటాయని అనుమానం వచ్చిన సోనియా ఫ్యామిలీ నట్వర్ సింగ్‌ని కాకా పట్టడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తల్లిని, తమ్ముడిని భుజాన వేసుకుని తిరిగే ప్రియాంక నట్వర్ సింగ్‌కి గతంలో జరిగిపోయినవన్నీ మర్చిపో తాతయ్యా.. అవన్నీ బయటపెట్టకు తాతయ్యా ప్లీజ్ అని సొంత మనవరాలిలాగా గోముతనం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నో ఢక్కాముక్కీలు తిన్న నట్వర్ సింగ్ ప్రియాంక అభిమానానికి మురిసిపోకుండా తన ఆత్మకథలో అనేక వివాదాస్పద అంశాలు చేర్చి కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని కడిగిపారేసే పనిలో వున్నారు.

ఏపీలో బదిలీలపై నిషేధం ఎత్తివేత

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీలపై ఉన్న నిషేధాన్ని నెల రోజులపాటు ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలరోజుల్లో మండల స్థాయి పదవులలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని స్థాయుల్లో ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా వున్నాయి.   1. ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ని కరువు లేని రాష్ట్రంగా మార్చాలని నిర్ణయం.   2. ఐటీ కంపెనీలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాయితీ. ఒక్కో ఉద్యోగికి 60 వేల రూపాయల చొప్పున రాయితీ. ఐటీ కంపెనీల విద్యుత్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ.   3. భూగర్భ జలాలు పెంచడానికి నీరు-చెట్టు కార్యక్రమం.   4. ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో అన్న ఎన్టీఆర్ క్యాంటిన్లు. తక్కువ ధరకే ఆహారాన్ని అందించే ఎన్టీఆర్ క్యాంటిన్లు.   5. మాఫియాకి అడ్డుకట్ట వేయడానికే మహిళలకు 25 శాతం ఇసుక రీచ్‌లు.   6. పాఠశాలల్లో హాజరు శాతం పెంచడానికి బయో మెట్రిక్ విధానం అమలు.   7. విశాఖ, వీజీటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి)లో మెట్రో రైలు ఏర్పాటు.

ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌తో అవసరమే లేదు: చంద్రబాబు

  తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా ఎంపిక కావడం, అది పెద్ద ఇష్యూ కావడం గురించి తెలిసిందే. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనే అంశం ఇష్యూ అయింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరనే పాయింట్ వెలుగులోకి వచ్చింది. కొంతమంది అత్యుత్సాహంతో మహేష్‌బాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అనే విషయాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ అంశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అవసరమే లేదని స్పష్టం చేశారు. బ్రాండ్ అంబాసిడర్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.

సుబ్రతా రాయ్ నెత్తిన పాలు...

  సహారా అధినేత సుబ్రతా రాయ్ నెత్తిన సుప్రీం కోర్టు పాలు పోసింది. వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాల కేసులో సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ గత కొంతకాలంగా జైల్లోనే వుంటున్న విషయం తెలిసిందే. తనను జైల్లోంచి విడుదల చేస్తే ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి జనానికి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని సుబ్రతారాయ్ గత కొంతకాలంగా సుప్రీం కోర్టుకు మొర పెట్టుకుంటున్నాడు. అయితే దీనికి గతంలో అనేకసార్లు సుప్రీంకోర్టు నో చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు సుబ్రతారాయ్‌కి ఒర అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం సుబ్రతా రాయ్ వుంటున్న తీహార్ జైలు నుంచే ప్రతి నెలా 10 రోజులపాటు తన ఆస్తుల అమ్మకాలను పర్యవేక్షించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఈనెల 5వ తేదీ నుంచి తన ఆస్తుల విక్రయానికి సంబంధించిన లావాదేవీలను జైలు ఆవరణలోనే జరుపుకోవచ్చని సూచించింది.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై ‘సుప్రీం’లో ఇంప్లీడ్‌

  ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు ఇంప్లీడ్‌ దాఖలు చేసింది. ఎంసెట్ కౌన్సిలింగ్‌కి తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఆగస్టు 4న సుప్రీంకోర్టు తీర్పు రానుంది. ఆగస్టు 4న తీర్పు అనుకూలంగా వస్తే యథావిధిగా కౌన్సెలింగ్‌ కొనసాగిస్తామని, ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిమీద ఆగస్టు 5న సమావేశం నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వెలిబుచ్చుతున్నా ఉన్నత విద్యామండలి ముందుకే వెళ్తోంది. దీనిలో భాగంగా ఆగస్టు 7 నుంచి కౌన్సిలింగ్ జరుపుతామంటూ బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ దాఖలు చేసింది.

భార్య గొంతు కోశాడు... ఆత్మహత్యాయత్నం చేశాడు..

  అనంతపురంలో ఓ భర్త తన భార్య గొంతు కోశాడు. ఆ తర్వాత తన చెయ్యి కోసుకుని పరారయ్యాడు. అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్‌లో రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న యువతి మీద ఆమె భర్త దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. దాంతో ఆమె గిలగిలా కొట్టుకుంటూ రోడ్డు మీద పడిపోయింది. భార్య గొంతు కోసిన సదరు భర్త తన చేతిని కూడా కోసుకున్నాడు. ఈ సంఘటన చూసి జనం గుమిగూడటంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్న ఆ యువతిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భార్య గొంతు కోసి, తన చేతిని కోసుకున్న భర్త కోసం గాలిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

పోలవరంతో పెను ప్రమాదం: కవిత

  ఆంధ్రప్రదేశ్ మీద టీఆర్ఎస్ ఎంపీ కవిత తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం కానున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా భవిష్యత్తులో పెను ప్రమాదాలు తలెత్తే అవకాశం వుందని చెబుతూ ఆ విధంగా ఆమె ఆంధ్రప్రదేశ్‌ మీద తన అభిమానాన్ని చాటారు. పార్లమెంటులో పోలవరం ప్రాజెక్టు అంశం మీద మాట్లాడుతూ కవిత ఇలా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్నీ సంప్రదించకుండా పోలవరం ప్రాజెక్టు మీద ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మీద సమగ్ర అధ్యయనం జరగాల్సి వుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులకు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం కాదని ఆమె అన్నారు.

కేసీఆర్ 1956 సర్టిఫికెట్ తెచ్చుకోగలరా: కిషన్ రెడ్డి

  స్థానికత నిర్ధారణ కోసం 1956 నుంచి తమ కుటుంబం తెలంగాణలోనే నివసిస్తోందన్న సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామం నుంచి ఆసర్టిఫికెట్ తెచ్చుకోగలరా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల ఫీ రీయింబర్స్‌మెంట్ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానం సమర్థనీయంగా లేదని ఆయన విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ స్థానికతకు సంబంధించిన వివాదాన్ని సృష్టించారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులను మానసికంగా ఎంతో బాధపెడుతోందని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వైఖరీ వల్ల బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. కేసీఆర్ తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.

ప్రణాళికా సంఘం పరిశీలనలో ఏపీకి ప్రత్యేక హోదా... ప్యాకేజీ..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని కేంద్ర ప్రణాళికా సంఘం చురుకుగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా దక్కవలసి వుంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద కేంద్ర ప్రణాళికా శాఖామంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ గురువారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నామని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై ఏర్పడిన సందిగ్ధతకి తెరపడింది. అలాగే ఏపీలో వెనక బడి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర రీజియన్లకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని ప్రధాని అధ్యక్షతన జరిగే జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

శ్రీలంకకు సైన్యం సంగతి రాజీవ్ సొంత నిర్ణయం: నట్వర్

  శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపించే నిర్ణయం రాజీవ్ గాంధీ సొంతగా తీసుకున్నారని, ఈ విషయంలో ఆయన తన కేబినెట్‌ని ఎంతమాత్రం సంప్రదించలేదని, అధికారుల సలహా కూడా తీసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ తెలిపారు. ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పేరిట ఆయన రాసిన పుస్తకంలో ఇందిరాగాంధీ కుటుంబం గురించి వ్యక్తంచేసిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపించడం అనే అంశం చివరికి రాజీవ్ గాంధీ హత్యకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని రాజీవ్ గాంధీ సొంతగా తీసుకున్నారు. ఆయన చావుకు ఆయనే కారణమయ్యారు. ఈ విషయాన్ని నట్వర్ సింగ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనే కోరగానే రాజీవ్ గాంధీ ఎంతమాత్రం ఆలోచించకుండా సైన్యాన్ని శ్రీలంకకి పంపారని నట్వర్ చెప్పారు. శ్రీలంక ప్రభుత్వంతోగానీ, ఎల్.టి.టి.ఇ. అధినేత ప్రభాకరన్‌తోగానీ రాజీవ్ గాంధీ వ్యవహరించిన విధానం సమర్థనీయం కాదని అన్నారు. ఈ విషయాలను తాను ప్రశ్నిస్తే రాజీవ్ గాంధీ తనను కసురుకున్నారని నట్వర్ వెల్లడించారు.

తాటతీస్తాం: పాక్‌కి ఇండియా వార్నింగ్!!

  భారత సైనిక దళాల ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఇలా పాకిస్థాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. పాక్ సైనికులు భారత సైన్యం మీద దాడులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని, అలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సైనికుల తలలు కత్తిరించడం లాంటి ఘటనలు జరిగితే చాలా వేగంగా, ఘాటుగా, పాకిస్థాన్ ఊహించని విధంగా ప్రతిస్పందిస్తామని ఆయన హెచ్చరించారు. ఆర్మీ చీఫ్‌గా పదవి చేపట్టి 24 గంటలు గడవక ముందే ఆయనీ హెచ్చరికలు చేయడం విశేషం. దల్బీర్ సింగ్ సుహాగ్ భారతదేశ 26వ ఆర్మీ చీఫ్‌.

ఫేస్‌బుక్ మీద 725 కోట్ల కేసు!

  సామాజిక నెట్‌వర్క్ ఫేస్‌బుక్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని నష్టాలూ వున్నాయి. ఫేస్‌బుక్ వినియోగదారుల నుంచి ఎన్ని ప్రశంసలు పొందుతూ వుంటుందో అన్ని విమర్శులూ భరిస్తూ వుంటుంది. తాజాగా ఫేస్‌బుక్ మీద ఒక అమెరికా మహిళ పరువునష్టం దావా వేసింది. తన పరువు పోగొట్టినందుకు ఫేస్‌బుక్ తనకి 123 మిలియన్ డాలర్లు (725 కోట్ల రూపాయలు) నష్టపరిహారంగా ఇవ్వాలని తన దావాలో పేర్కొంది. ఇంతకీ ఆమె పరువు ఏ విధంగా పోయిందంటే... అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన మరియం అలీ అనే మహిళ ఇల్లినాయిస్‌కి చెందిన అదీల్ షా అనే వ్యక్తిని ప్రేమించింది. ఎంచక్కా సహజీవనం చేసింది. ఐదేళ్ళ క్రితం వీరిద్దరూ తిట్టుకుని, తన్నుకుని విడిపోయారు. మరియం అలీ మీద అదీల్‌కి ఏరేంజ్‌లో కోపం ఉందోగానీ, అతను మరియం అలీ పేరు మీద ఫేస్‌బుక్ ఫేక్ ఖాతాని తెరిచి ఆమెకి సంబంధించిన ‘‘ఫొటోలు’’ అప్‌లోడ్‌ చేశాడు. ఆ అకౌంట్, అందులో వున్న తన ‘‘ఫొటోలు’’ చూసి కంగారుపడిపోయిన మరియం అలీ ఈ అకౌంట్‌ని తొలగించండి మహప్రభో అని ఫేస్‌బుక్‌కి కంప్లయింట్ చేసింది. మరియం ఎంత మొత్తుకున్నా ఫేస్‌బుక్ సదరు అకౌంట్‌ని తొలగించలేదు. దాంతో ఆమె ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందంటూ కోర్టుకెక్కింది.

సమ్మె బాటలో ఆర్టీసీ

  ఆర్టీసీ సమ్మె బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికుల క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) నిధులను ఆర్టీసీ వినియోగించుకుని ఆ నిధులను తిరిగి జమచేయని అంశం మీద కార్మికులు ఆగ్రహంగా వున్నారు. ఈ అంశం మీద శనివారం నుంచి సమ్మె చేయనున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఇయు) నాయకులు ప్రకటించారు. సీసీఎస్‌కి సంబంధించిన 220 కోట్లను ఆర్టీసీ తన సొంత ఖర్చులకు వాడుకుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ డబ్బు వడ్డీతో కలిపి 293 కోట్లకు చేరిందని, ఆ డబ్బును వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సమ్మె నిర్ణయాన్ని మరో కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) విభేదిస్తోంది. ముందస్తు నోటీసులు లేకుండా సమ్మెచేయడం సరికాదని పేర్కొంది.

తైవాన్‌లో కోనసీమ తరహా గ్యాస్ పేలుడు

  ఇటీవల కోనసీమలోని నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్‌ లీకేజీ కారణంగా పేలుడు జరిగి అనేకమంది మరణించిన విషయం తెలిసిందే. తైవాన్‌లో కూడా సరిగ్గా అలాంటి గ్యాస్ పేలుడు ప్రమాదం జరిగింది. దక్షిణ తైవాన్‌లోని కౌషింగ్ నగరంలో జరిగిన ఈ గ్యాస్ పేలుడులో 15 మంది మరణించగా, 243 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. భూగర్భంలోంచి వెళ్తున్న గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ఈ దుర్ఘటన జరిగింది. కౌషింగ్ నగరంలోని ఓ ప్రాంతం ప్రజలు శుక్రవారం ఉదయం నుంచి ఏదో గ్యాస్ వాసన వస్తోందని భావిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా గ్యాస్‌కి మంటలు అంటుకుని పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా మరణాలు, గాయపడటం మాత్రమే కాకుండా భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. వీధుల్లో తిరిగే వాహనాలన్నీ పాడైపోయాయి. అనేక భవనాలు కూడా రూపురేఖలు మారిపోయాయి. ఈ పేలుడు ధాటికి భూకంపం వచ్చినట్టుగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.