ప్రణాళికా సంఘం పరిశీలనలో ఏపీకి ప్రత్యేక హోదా... ప్యాకేజీ..
posted on Aug 1, 2014 @ 1:40PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని కేంద్ర ప్రణాళికా సంఘం చురుకుగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా దక్కవలసి వుంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద కేంద్ర ప్రణాళికా శాఖామంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ గురువారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నామని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై ఏర్పడిన సందిగ్ధతకి తెరపడింది. అలాగే ఏపీలో వెనక బడి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర రీజియన్లకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని ప్రధాని అధ్యక్షతన జరిగే జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.