ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీ స్టారర్ మూవీ?
posted on Feb 25, 2013 @ 2:50PM
కొద్ది రోజుల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ కోసం స్పయిన్ దేశం వెళ్ళినప్పుడు, అక్కడ శ్రీను వైట్ల దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటిస్తున్న‘బాద్షా’సినిమా షూటింగు కూడా జరుగుతుండటంతో అందరూ విదేశంలో కలుసుకోగలిగారు. వారందరూ కలిసి తీసుకొన్న ఫోటోలను ఇంటర్నెట్ లో కూడా పెట్టడంతో వారి అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.
అయితే యన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానులకు అంతకంటే ఆనందమయిన వార్త మరొకటి పూరీ జగన్నాథ్ చెప్పబోతున్నాడు. యన్టీఆర్, అల్లు అర్జున్ లను పక్కపక్కన చూసిన ఆయనకి వారిద్దరితో కలిపి ఒక మల్టీ స్టార్ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడమే తడువు, అతను వారిని అడగడం వారు మరో ఆలోచన లేకుండా పూరీకి ఒకే చెప్పేయడం జరిగిపోయాయి. అంటే త్వరలోనే ఇద్దరు పెద్ద హీరోలు యన్టీఆర్, అల్లు అర్జున్ వారికి జతగా మరో ఇద్దరో నలుగురో అందాల భామలతో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద సినిమా తీయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు.
ఇద్దరు అతిపెద్ద హీరోలను ఒప్పించగానే అతని పని అయిపోలేదు. అక్కడి నుండే అతని ‘కధ’ మొదలయింది. వారిద్దరికీ సరిపోయే విదంగా, వారి ఇమేజ్, వారి అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని మంచి కధను తయారు చేయడానికి ప్రముఖ సినీ కధా రచయితలు కోన వెంకట్ మరియు బీవీఎస్ రవికి పూరి బాధ్యత అప్పగించినట్లు సమాచారం.
అంతే కాదు, తన హీరోల స్థాయి, వారి అభిమానుల అంచనాలను అందుకొనే స్థాయిలో కధను తయారు చేసినట్లయితే, వారు ఇంతవరకు ఎన్నడూ తీసుకోనంత భారీ పారితోషికము కూడా ఇస్తానని చెప్పాడు.
ఇక, వీరందరినీ తట్టుకొనే భారీ పెట్టుబడిపెట్టగల నిర్మాత కోసం ఆయన ప్రస్తుతం వెతుకుతున్నాడు. ఒకే నిర్మాత అయితే అంత పెట్టుబడి పెట్టడం కష్టం గనుక, ఇద్దరు లేదా ముగ్గురు నిర్మాతలతో కలిపి ఈ సినిమా తీసేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే...