హైదరాబాద్‌ని అమ్మేస్తారు

  జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదుపై సోమవారం ఎల్బీనగర్ లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. అమలు చేయడానికి వీలుకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను కూడా అమ్మకానికి పెడుతోందని, సెక్రటేరియట్ ను కూడా ప్రవేటు సంస్థలకు ధారదత్తం చేసేందుకు సిద్ధమవుతోందని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు రావాలని సూచించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో రాజకీయ వలసలను ప్రోత్సహించిందే తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.

150 ఏళ్లు బతుకుతా

  పెళ్లి చేసుకోకుండా 150 ఏళ్లు బతుకుతానని యాంటీ ఏజింగ్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ అలెక్స జావోరొంకోవ్ అంటున్నారు. ప్రస్తుతం అలెక్స్ బ్రిటన్‌లోని బయోజెరంటాలోజీ రీసెర్చ్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. పెళ్లి, పిల్లలు అనే బాధ్యతలు లేకుండా క్రమం తప్పకుండా వ్యాయామం, వృద్దాపాన్యాన్ని అరికట్టే మందులు తీసుకుంటూ 150 ఏళ్లు జీవిస్తానని తెలిపారు. జీవితం మొత్తాన్ని ఏజింగ్ ను అరికట్టే ప్రయోగాలకే అంకితం చేస్తానని అన్నారు. ఇప్పటికే ఏజింగ్ ను అరికట్టే ప్రయోగాలన్నీ విజయం సాధించాయని అవి మందుల రూపంలో రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. భవిష్యత్తులో జన్యువుల చికిత్సకు సంబంధించిన వ్యాక్సిన్‌లు కూడా అందుబాటులోకి వస్తాయని, వాటిని కూడా తాను తీసుకుంటానని చెప్పారు. బ్రిటన్ లో అనేక ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల ఆయుషు ప్రమాణం పెరిగిందని చెప్పారు.

నేపాల్‌లో తెలుగు నటుడు మృతి

  నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో నేపాల్‌కి సినిమా షూటింగ్ కోసం వెళ్ళిన విజయ్ (25) అనే నటుడు, నృత్య దర్శకుడు దుర్మరణం పాలయ్యారు. ‘ఎటకారం’ అనే సినిమా షూటింగ్ కోసం యూనిట్ నేపాల్‌కి వెళ్లింది. షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా హఠాత్తుగా భూకంపం రావడంతో వారు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సినిమాలో హీరోగా చేస్తున్న విజయ్ అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఒక పాటకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఉన్నప్పుడు భూప్రకంపనలు రావడంతో వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని, అందువల్ల ప్రమదం నుండి బయటపడ్డామని కొంతమంది చిత్ర సిబ్బంది సమాచారమిచ్చారు. విజయ్ మృతదేహం భారత్ కు రప్పించే ప్రయాత్నాలలో ఉన్నారు.

హీరోయిన్ నగ్న వీడియో లీక్

  హీరోయిన్ రాధికా ఆప్టే నగ్న వీడియోలు లీక్ అయ్యాయి. ఇటీవల ఆమె అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న 20 నిమిషాల నిడివి వున్న షార్ట్ ఫిలింలో నటించింది. అందులో ఆమె నగ్నంగా నటించిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ నగ్న దృశ్యాలు లీక్ అయ్యాయని దర్శకుడు అనురాగ్ కాశ్యప్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాధికా ఆప్టే నగ్న దృశ్యాలు ఆదివారం నుంచి వాట్సప్ తదితర సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య కూడా రాధికా ఆప్టే బాత్రూమ్ సన్నివేశాలు అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ‌హల్‌చల్ చేశాయి. అప్పుడు రాధికా ఆప్టే ఆ వీడియోలలో వున్నది తాను కాదని ఖండించింది. ఇప్పుడు ఆమె నగ్న దృశ్యాలు లీకయ్యాయి. అయినా ఈ విషయంలో రాధికా ఆప్టే బాధపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే నటించడానికి లేని బాధ లీకైతే ఎందుకట?

జి.హెచ్.యం.సి. ఎన్నికలు డిశంబర్ లోనే

  తెలంగాణా ప్రభుత్వం కోరుకొన్న విధంగానే జి.హెచ్.యం.సి.ఎన్నికలను ఈ ఏడాది డిశంబర్ 15 లోపు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది. కానీ అక్టోబర్ 31లోగా వార్డుల విభజన ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ఆదేశించింది. గతేడాది డిశంబర్ 3నే జి.హెచ్.యం.సి.బోర్డు కాలపరిమితి ముగిసిన్పటికీ, వార్డుల పునర్విభజన చేయాలనే సాకుతో ఇంతవరకు జి.హెచ్.యం.సి.ఎన్నికలు వాయిదా వేసుకొంటూ వచ్చిన తెలంగాణా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు డిశంబరు వరకు గడువు కోరినప్పుడు కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ తెలంగాణా ప్రభుత్వ వాదనలు విన్న తరువాత డిశంబర్ 15 లోపు జి.హెచ్.యం.సి.ఎన్నికలను నిర్వహించేందుకు అనుమతిస్తూ ఈరోజు హైకోర్టు తుది తీర్పు చెప్పింది.   ప్రస్తుతం జి.హెచ్.యం.సి. పరిధిలో 150 వార్డులున్నాయి. వాటిని పెరిగిన జనాభాకి అనుగుణంగా 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాక జి.హెచ్.యం.సి.ని రెండు లేదా మూడు భాగాలుగా విభజించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమయినపటికీ జి.హెచ్.యం.సి. ఎన్నికలు ఖచ్చితంగా ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయం ఇప్పుడు స్పష్టమయింది. తెరాసతో సహా అన్ని రాజకీయ పార్టీలకు తగినంత సమయం చిక్కుతోంది కనుక అప్పటిలోగా అన్ని పార్టీలు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నధం కావచ్చును.

తెలంగాణ ఇంటర్ ద్వితీయ ఫలితాలు

  తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 61.41శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలలో బాలుర కన్నా బాలికలే ఆధిక్యం సాధించారు. రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మార్చి 9 నుంచి 27 వరకు జరిగిన ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు 5,06,789 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4.77 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,78,972 మంది ఉండగా 93,567 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. ఒకేషనల్ విభాగంలో 34 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

పది అడుగులు జరిగిన కాట్మండూ

  భారీ భూకంపం కారణంగా నేపాల్ రాజధాని కాట్మండూ గతంలో ఉన్న ప్రదేశంలోకంటే 10 అడుగులు దక్షిణం వైపుకి జరిగిపోయింది. ఈ విషయాన్ని భూగర్భ శాస్త్ర నిపుణులు వెల్లడించారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నేపాల్ ప్రాంతానికి భూకంపాలు తప్పనిసరి. అలాగే నేపాల్ నగర్ ఉన్న ప్రదేశంలో శతాబ్దాల క్రితం పెద్ద సరస్సు వుండేదట. ఇలాంటి ప్రదేశంలో వుండటం వల్లే కాట్మండూ నగరం భూకంపం తీవ్రతకు భారీగా గురైంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ఇక్కడ ప్రతి 75 సంవత్సరాలకు ఓసారి భారీ భూకంపం రావడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్, యురేసియా టెక్టానిక్ ప్లేట్లు (భూ ఫలకాలు) రెండూ పరస్పరం ఢీకొన్నాయి. అప్పటి నుంచి అప్పుడప్పుడు అలా ఢీకొనడం, భూకంపాలు సంభవించడం జరుగుతూనే వుంది.

నిండు గర్భిణి గిన్నిస్ రికార్డ్

  నిండు గర్భిణి 5కె రన్ లో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించింది. కరీంనగర్ కు చెందిన కామారపు లక్ష్మీ అనే ఆమె మిషన్ కాకతీయకు మద్దతివ్వాలన్న సంకల్పంతో ఇంతటి సాహసానికి పూనుకుంది. రేపో మాపో డెలివరీ కూడా అవుతుంది, అయినా లెక్కచేయకుండా స్ఠానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 5కె రన్ లో పాల్గొంది. ఉదయం 6 గంటలకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి టీవీఎల్ సత్యవాణి 5కె రన్ ను ప్రారంభించారు. లక్ష్మీ 5 కిలోమీటర్ల దూరం ఆగకుండా పరిగెట్టి కేవలం 30 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ ఎడిటర్ ఎం విజయభాస్కర్ రావు, ఉత్తర తెలంగాణ ప్రతినిధి యెడల్ల రమేశ్ ఈ రికార్డును నమోదు చేశారు.

భూకంప మృతులు 3218

  నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం మృతుల సంఖ్య క్షణక్షణానికీ పెరిగిపోతోంది. సోమవారం ఉదయానికి భూకంప మృతుల సంఖ్య 3218గా అధికారులు వెల్లడించారు. ఆదివారం కూడా నేపాల్‌లో అనేకసార్లు భూమి కంపించింది. భూమి కంపించినప్పుడల్లా జనం ఆందోళనలతో తల్లడిల్లుతున్నారు. రాజధాని ఖాట్మండూతో సహా అనేక ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా వున్న శిథిలాలను తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు భారీ సంఖ్యలో బయటపడుతున్నాయి. మృతదేహాలు పేరుకుపోతే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం వుండటంతో సామూహికంగా దహనం చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వారు ఎవరైనా గుర్తించే అవకాశం కూడా లేకుండా పోయింది. జీవించి వున్నవారే మరణించిన వారికి ఆత్మబంధువులై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు జరుగుతూ వుండగానే భారీగా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో భారీ వర్షాలు పడితే పరిస్థితి మరింత చేయిజారిపోతుందని భయపడుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదే వుంటున్నారు. రాత్రివేళ చలితో బాదపడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వీరందరికీ పునరావాసం కల్పించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నివేదికలు సిద్దం

  విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించనున్న మెట్రో స్పెషలిస్ట్ శ్రీధరన్ రెండు ప్రాజెక్టుల నివేదికలను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు. వీటిలో విజయవాడ ప్రాజెక్టు నిర్మాణానికి కి.మీ.కి 209కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ ప్రకారం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 6,823 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసారు. విజయవాడలో రెండు మెట్రో కారిడార్లు ఏర్పాటు చేయబోతున్నారు. వాటిలో ఒకటి విజయవాడ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12.76 కిమీ కారిడార్, రెండవది బస్టాండ్ నుంచి నిడమానూరు వరకు 13.27 కిమీ కారిడార్ నిర్మించేందుకు పూర్తి నివేదికను సిద్దం చేసారు. తాజా సమాచారం ప్రకారం విశాఖలో మూడు మెట్రో కారిడార్లు నిర్మించబోతున్నారు. త్వరలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నివేదిక వివరాలను కూడా ప్రకటిస్తారు.

నేపాల్ భూకంపం ధాటికి 2000కి పైగా మృతి

  నేపాల్ లో నిన్న సంభవించిన పెను భూకంపం ధాటికి సుమారు2000కి పైగా ప్రజలు మృతి చెందినట్లు అధికారిక సమాచారం. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక వేలమంది క్షతగాత్రులయారు. అయినప్పటికీ వందల సంఖ్యలో పేకమేడల్లా కుప్పకూలిపోయిన భవనాల క్రింద ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉన్నారో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. క్షతగాత్రులతో అన్ని ఆసుపత్రులు నిండిపోయాయి. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ అనేకమంది వైద్యం కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. వివిధ దేశాల నుండి అనేక సహాయ, వైద్య బృందాలు తరలివచ్చి సహాయ పునరావాస చర్యలలో పాల్గొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిన్న మరొకమారు భూకంపం సంభవించింది. నిన్న సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.9 నమోదు కాగా, ఈరోజు కొన్ని సెకండ్లపాటు మాత్రమే సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదైంది. కానీ ఈరోజు భూకంపం వలన మళ్ళీ అనేక భవనాలు కుప్పకూలాయి. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ ఇంత భారీ భూకంపం సంభవించడంతో నేపాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలతో రోడ్ల మీదే కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు నేపాల్ తో బాటు డిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలలో కూడా స్వల్ప భూప్రకపంనలు వచ్చాయి. కానీ ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు.

టాలీవుడ్ హీరోయిన్ అరెస్టు

  ఎర్రచందని కేసులో సినీనటి నీతూ అగర్వాల్‌‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో నీతూ అగర్వాల్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈమెను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా వున్నట్టు తెలుస్తోంది. ఎర్రచందనం కేసులో ఇప్పటికే అరెస్టయిన మస్తాన్‌వలీలో ఈమె సహజీవనం చేస్తోంది. మస్తాన్ వలీ నిర్మించిన ‘ప్రేమ ప్రయాణం’ సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది. మస్తాన్ వలీ కర్నూలు జిల్లా చాగలమర్రు ఎంపీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో మస్తాన్ వలీకి సహకరించడంతోపాటు ఆర్థిక లావాదేవీల్లో కూడా ఆమె పాత్ర వున్నట్టు తెలుస్తోంది. మస్తాన్ వలీ ఆమెను మూడో వివాహం చేసుకున్నాడని కూడా వినిపిస్తోంది. మస్తాన్ వలీని అరెస్టు చేసిన తర్వాత ఈనెల 13వ తేదీ నుంచి నీతూ అగర్వాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నేపాల్ భూకంపం మృతులు 1500

  నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా, 1500 మందిని పొట్టన పెట్టుకుంది. ఆదివారం ఉదయం వరకు 1500 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం వుందని భయపడుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.8గా నమోదైందని అధికారులు చెబుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ భారీగా దెబ్బతింది. ఈ నగరంలోని వీధులన్నీ హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాల్లో ఆస్పత్రులు కూడా కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టంతోపాటు విద్యుత్, సమాచార, రవాణ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోవడంతో నేపాల్‌లో ఎమర్జెన్సీని విధించారు.

నేపాల్ భూకంప మృతులు 700

  నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా, 700 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం వరకు 700 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం వుందని భయపడుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.9గా నమోదైందని అధికారులు చెబుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ భారీగా దెబ్బతింది. ఈ నగరంలోని వీధులన్నీ హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాల్లో ఆస్పత్రులు కూడా కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టంతోపాటు విద్యుత్, సమాచార, రవాణ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోవడంతో నేపాల్‌లో ఎమర్జెన్సీని విధించారు.

భూకంపం.. భారత్‌లో 10 మంది మృతి

  నేపాల్‌లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది కూడా. నేపాల్‌లో భూకంపం కారణంగా వందలాది మంది మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. భూకంపం కారణంగా ఇండియాలో కూడా మరణాలు సంభవించాయి. బీహార్లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్లో ఐదుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. బీహార్లోని భగల్పూర్ గ్రామంలో గోడ కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. సీతామాడి, డర్భంగా, వైశాలిలో భవనాలు కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. భూప్రకంపనల ధాటికి బీహార్‌లో అనేక ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆస్తి ఉత్తర్ ప్రదేశ్‌లో భూకంపం వల్ల ఐదుగురు మరణించినట్టు సమాచారం.