సీతక్కపై మావోయిస్టుల గుస్సా

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దాసరి అనసూయ, సీతక్కకు ప్రత్యేక స్థానం వుంది. సీఎం రేవంత్‌రెడ్డి సీతక్క తనకు సొంత అక్క కంటే ఎక్కువని పలు సంధర్భాలలో స్వయంగా చెప్పుకున్నారు, అంటే, ఆ ఇద్దరి అనుబంధం గురించి ఇక వేరే చెప్పవలసిన అవసరం లేదు. మరోవంక మావోయిస్టు సిద్దాంత మూలాలు ఉన్న సీతక్కకు సహజంగానే అడవి బిడ్డలతో ప్రత్యేక అనుబంధం వుంది. అడవి బాట వదిలి జాతీయ రాజకీయ స్రవంతిలోకి వచ్చిన, గిరిజనులతో  సీతక్క సంబంద బాధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏ పదవి’లో ఉన్నా, గిరిజనంతో కలిసే జీవిస్తున్నారు. గిరిజనుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో గిరిజన ఎమ్మెల్యేగా ఆమె,నెత్తిన మూటతో కాలినడకన కొండలు గుట్టలు ఎక్కి, గిరిజనులు నిత్యావసర సరుకులు మందులు అందించి సీతక్క శభాష్ అనిపించుకున్నారు. అందుకే, ములుగు నియోజకవర్గం ప్రజలు ఆమెను వరసగా మూడు మార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇప్పడు రేవంత్ రెడ్డి ఆమెను మంత్రిని చేశారు. అయితే, ఇప్పడు సీతక్క ఒక వంక సొంత పార్టీలో వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. ఆమె పైన ఎప్పుడు లేని విధంగా ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి  ఇతరత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవంక, మాజీ కామ్రేడ్ సీతక్కను టార్గెట్ చేస్తూ, మావోయిస్టులు ఆమె తమ మూలాలను మరిఛిపోయారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో, తాజాగా, మావోయిస్టులు ఆమెను హెచ్చరిస్తూ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా  మారింది. ఈ లేఖలో మావోయిస్టులు ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా.. మంత్రి సీతక్క స్పందించడం లేదని ఆరోపించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మావోయిస్టులు వివరించారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా...? అంటూ ఆమెను సూటిగా ప్రశ్నించారు.  అయితే ఆదివాసీల వ్యవహారంలో మావోయిస్టులు తనకు రాసిన లేఖ పై సీతక్క, వెంటనే స్పందించారు.తన మూలాలను తానెప్పుడు మరిచి పోలేదన్నారు. ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉన్న,  జీవో 49ను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టానని వివరించారు. ఆ క్రమంలో ఆదివాసీల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతోపాటు తానూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్పా.. ఎవరూ ఆదివాసీల జోలికి వెళ్లడం లేదని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. అయితే ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడాలంటూ మావోయిస్టులకు ఆమె పరోక్షంగా సూచించారు. అయితే, ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా మెయిన్ స్ట్రీమ్ రాజకేయల్లో ఉన్న సీతక్క, తొలి సరిగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కుంటున్నారని, ఆమె సన్నిహితులు అవేదన వ్యక్తపరుస్తున్నారు.

గుంటూరు ఎస్పీపై పొలిటికల్ కుట్ర?

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌పై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందా? ఆయన వరుస వివాదాలలో చిక్కుకోవడానికి కారణాలేంటి? ఎవరైనా ఆయన్ని ప్రత్యేకంగా టార్గెట్‌ చేసి వివాదాల్లో నెడుతున్నారా?..  గుంటూరులో జగన్ కాన్యాయ్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్య కేసులో జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించింది ఎవరు?  తీవ్ర కలకలం రేపిన ఆ ప్రమాదానికి సంబంధించి వినిస్తున్న ప్రచారంపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు. గుంటూరు మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో అక్కడ రాజకీయాలు అంతే హాట్‌గా ఉంటాయి.. ప్రతిపక్షాన్ని అధికారపక్షం, అధికార పక్షాన్ని ప్రతిపక్షం ప్రతిరోజు ఏదో ఇష్యూకి సంబంధించి టార్గెట్ చేసుకుంటూనే ఉంటాయి. అలాంటి గుంటూరులో పోలీస్ అధికారులుగా పని చేయాలంటే కత్తి మీద సామే అంటారు. కరవమంటే కప్పకు కోపం..  విడవమంటే పాముకు కోపం అన్నట్లు జిల్లాలో పనిచేసే ప్రతి అధికారి పరిస్థితి అలాగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి జిల్లాలో జిల్లా ఎస్పీగా పనిచేయటం అనేది ఒక సవాల్ అని గుంటూరు జిల్లాలో  గతంలో పనిచేసిన అధికారులు సైతం చెబుతూ ఉంటారు.  ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కూడా ప్రతిరోజు ఒక సవాల్నే ఎదురుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా సింగయ్య యాక్సిడెంట్ కి సంబంధించి అనేక చర్చలు నడుస్తున్నాయి. జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యారు. పోలీసులు సింగయ్యను హాస్పిటల్‌కి తరలించినా ఆయన మృతిచేందారు. జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయి మృతి చెందాడన్న విషయం వైరల్ గా మారింది. అసలు సింగయ్యకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏ వాహనం ఢీకొని చనిపోయిందనే దానిపై పెద్ద చర్చ మొదలైంది. జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీ కొనే సింగయ్యే చనిపోయాడని మొదట  ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ జగన్ పర్యటన ముగియకుండానే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ప్రెస్ మీట్  పెట్టి సింగయ్యఅనే వ్యక్తి చనిపోయింది జగన్ కాన్వాయ్ ఢీ కొనడం వల్ల కాదని ఒక ప్రైవేట్ వాహనం గుద్దటంతో చనిపోయాడంటూ ఆ వాహనం నెంబరు  ప్రకటించారు. ఇప్పుడు ఈ అంశమే గుంటూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు.. పోలీస్ డిపార్ట్‌మెంట్లో సైతం ప్రకంపనలు  సృష్టిస్తోంది.  అయితే జగన్  ప్రయాణిస్తున్న వాహనమే సింగయ్యను ఢీ కొన్న  ఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో గుంటూరు జిల్లా ఎస్పీకి అసలు ఆరోజు సింగయ్యను  ప్రైవేటు వాహనం ఢీ కొందని ఎవరు చెప్పారు. అలా చెప్పాల్సిన అవసరం ఏ అధికారికి వచ్చింది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు జిల్లా పోలీసుల్లో చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలోని కొందరు పోలీసులు వైసీపీ నేతలకు టచ్ లో ఉండటం వల్లే గుంటూరు జిల్లా ఎస్పీని తప్పుదారి పట్టించే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని పోలీసులే గుసగుసలాడుకుంటున్నారు. గతంలోనూ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలోనూ ఎస్పీ సతీష్‌కుమార్ కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన ఆదేశాలు లేకుండానే కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వచ్చాయి. గోరంట్ల మాధవ్ అరెస్టు విషయంలో సైతం గుంటూరు జిల్లా ఎస్పీని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించారని కొందరు అధికారులను డ్యూటీలో నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను ఎవరు టార్గెట్ చేస్తున్నారనేది డిపార్ట్‌మెంట్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలోనూ గుంటూరు జిల్లా ఎస్పీ ఒక మీడియా సమావేశంలో తన వెనక ఏం జరుగుతుందనేది తెలియటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. కొందరు కింద స్థాయి అధికారులు ఎస్పీ సతీష్ కుమార్  ఆదేశాలు పాటించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని డిపార్ట్‌మెంట్ వర్గాలు అంటున్నాయి.  మరి ఆ అధికారులు ఎవరు, వారు ఎవరి కోసం పనిచేస్తున్నారన్న దానిపై విచారణ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి కేసులను ఛేజించడంలో ఉన్నత అధికారుల మన్ననలు కూడా పొందుతున్న గుంటూరు జిల్లా ఎస్పీ  సతీష్ కుమార్.. పొలిటికల్ అరెస్టులు, వాటి వ్యవహారాల్లో మాత్రం ప్రతిసారి ఏదో ఒక విధంగా విమర్శలు పాలవుతున్నారు.  గోరంట్ల మాధవ విషయంలోనూ నిఘా వైఫల్యంతో  కింది స్థాయి సిబ్బంది సస్పెన్షన్‌కు గురయ్యారు. వరుసగా పొలిటికల్ ఘటనల్లో విమర్శలు ఎదుర్కొంటున్న జిల్లా ఎస్పీని కింది స్థాయి అధికారులే తప్పుదారి పట్టిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సతీష్ కుమార్ టార్గెట్‌గా పని చేస్తున్న ఆవర్గాలే రేపు ఒకవేళ సతీష్ కుమార్ మారిపోయి వేరే అధికారి వచ్చినా, అయన్ని సైతం తమకు అనుకూలంగా పనిచేయకపోతే ఇలాగే టార్గెట్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్తేనే నిజమైన న్యాయం : ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకు వెళ్తేనే నిజమైన న్యాయం జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక నా ఫోన్ ట్యాప్ చేశారని ఆయన అన్నారు. మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాప్ అయ్యిందని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను గతంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.  నా ఫోను, నా భార్య ఫోను ట్యాప్ చేసి బెదిరించారని కొండా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేసీఆర్, కేటీఆర్‌లకు కఠిన శిక్ష విధించాలని విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రస్తావించి, జాతీయ స్థాయిలో చర్చిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సమగ్రంగా నిరూపించేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.  

ఏపీ పర్యాటక అభివృద్ధికి చర్యలు : సీఎం చంద్రబాబు

  ఏపీలో టూరిజం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ‌ జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్ క్లేవ్‌లో పర్యాటక క్యారవాన్లను ఆయనతో కలిసి ప్రారంభించారు. భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదే అని ఎప్పుడో చెప్పా ఈ రంగంలో అనేక ఉద్యోగాలోస్తాయి ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ పర్యటక శాఖకు సలహాదారుగా ఉండాలని యోగా గురువు రాందేవ్ బాబాను  చంద్రబాబు కోరారు. ముప్పై సంవత్సరాలు రాందేవ్ బాబా తనకు తెలుసని, పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. సోషలిజం, కమ్యూనిజానికంటే టూరిజానికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయని, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. 1000 కిలో మీటర్లకు పైగానే సముద్ర తీరం ఉందని, అలాగే ఫారెస్ట్ సైతం ఉన్నాయని ఆయన చెప్పారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో యోగాంధ్ర నిర్వహించామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారంలో అనుమతులు వెంటనే ఇస్తున్నామని, రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విశాఖ, రాజమండ్రి, అమరావతి, తిరుపతి, అనంతపురంలో ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.అంతకు ముందు ప్రసిద్ధ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది.  విజయనగరం జిల్లాలో వందల కోట్ల రూపాయల వ్యయంతో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ స్వయంగా జిల్లాలో పర్యటించి, పరిశ్రమ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు.విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలోని చినరావుపల్లి గ్రామంలో 172 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను నెలకొల్పనున్నట్లు బాబా రాందేవ్ మీడియాకు వివరించారు. ఇక్కడ భారీ స్థాయిలో ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  

జగన్ కారును తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు.. తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టు

  వైసీపీ అధినేత జగన్  కారును  రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 డీహెచ్‌ 2349 కారు ఫిట్‌నెస్‌ను ఎంవీఐ గంగాధర ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు.  ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు. మాజీ  సీఎం రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు.  మరోవైపు జగన్‌కు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది.  సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్‌  అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ఇప్పటికీ మీ పొలిటిక‌ల్ స్టోరీలో..విల‌న్ చంద్ర‌బాబేనా క‌విత‌క్కా?

    ఆంధ్రా బిర్యానీ ఏం తింటాం అంటూ క‌విత‌క్క ఈ మ‌ధ్య చేసిన  కామెంట్ బాగా ట్రోల్ అవుతోంది. ఆమె అంటున్న మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తుంటే వీళ్ల విన్నింగ్ ఎలిమెంట్ తెలంగాణా క‌న్నా మించి బాబుతోనే ఎక్కువ‌గా ముడి ప‌డి ఉంద‌న్నట్టు తెలుస్తోంది. దానికి తోడు బీఆర్ఎస్ ప్ర‌స్తుతం త‌న పార్టీ పేరులోని తెలంగాణ అనే ఒక సెంటిమెంటు మిస్ అయ్యింది. దీంతో చేసేది లేక త‌మ ద‌గ్గ‌రున్న పాత తెలంగాణ సౌండ్ తో ఉన్న సంస్థ ఏద‌ని చూసిన వారికి క‌నిపించింది తెలంగాణ జాగృతి. దీన్ని మ‌ళ్లీ అట‌క మీద నుంచి దించి.. పాత బోనాల కుండ‌కు కొత్త సున్నం కొట్టి అలంక‌రించిన‌ట్టు అలంక‌రించి చూశారు. రాజీవ్, ఇందిర పేర్లేనా.. మా తెలంగాణ యోధులు ఎంత మంది ఉన్నారు? వారి పేర్ల‌ను ఎందుకు పెట్టొద్ద‌ని నిల‌దీశారు క‌విత‌. అంతా బాగానే ఉంది. ఇది క‌రెక్టు కూడా. కానీ ఇదే జాగృత‌క్క తాను తెలంగాణ‌కు సంబంధించిన ఒక పాటను ఎక్క‌డో ప‌రాయి రాష్ట్రం వాడైన‌- గౌతం వాసుదేవ మీన‌న్ తో కోట్లు ఖ‌ర్చు పెట్టి చేయించారు. త‌న‌కు అలాంటి పాటింపులు ఉండ‌వు కానీ.. తాను మాత్రం ఇత‌ర్ల‌ను ఎంతో గొప్ప‌గా నిల‌దీస్తార‌న్న పేరు సాధించారామె. ఇప్పుడు చూస్తే ఆంధ్ర బిర్యానిని అడ్డు పెట్టుకుని.. బాబును అటాక్ చేస్తున్నారు క‌విత‌క్క‌. నిజంగా అయితే ఇక్క‌డ టీడీపీ ఏమంత యాక్టివ్ గా లేదు. కాకుంటే గ‌తంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వ‌చ్చి ముఖ్యమంత్రి  అయిన రేవంత్ రెడ్డి ద్వారా బాబు ప్ర‌భావం తెలంగాణ‌పై ఇంకా ఉందంటూ ఆమె చేస్తున్న కామెంట్లు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తున్నాయ్. నిజానికి ఏపీకి తెలంగాణ‌కి మ‌ధ్య ప్ర‌స్తుతం బ‌న‌క‌చ‌ర్ల బ‌డబాగ్ని స‌ల‌స‌ల కాగుతోంది. కేసీఆర్ లా తాను కూడా.. ఏపీ ప్రోగా ఉండొచ్చు రేవంత్ రెడ్డి. కానీ ఆయ‌న చూస్తే అలా లేరు. త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే అని స్ప‌ష్టంగా తెలియ చేస్తున్నారు. బేస‌గ్గా రేవంత్ రెడ్డి అలాంటి బ్లైండ్ మైండ్ సెటెడ్ ఫెలో అయి ఉంటే ఇదే అల్లు అర్జున్ ని జైల్లో పెట్టి ఉండ‌రు. పెట్టాక పిలిచి మ‌రీ అవార్డు ఇచ్చి ఉండ‌రు. అవార్డు ఇచ్చాక అత‌డు కౌంట‌ర్లు వేస్తున్నా చూస్తూ ఊరుకుని ఉండ‌రు. దీన్నిబ‌ట్టీ ఇక్క‌డ లిబ‌ర్టీ ఎలాంటిదో తెలుసుకోవ‌చ్చని అంటారు కొంద‌రు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో చంద్ర‌బాబుతో పీక‌లోతు పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఆయ‌న‌ ప్ర‌భావంతో తెలంగాణ‌ను పాలిస్తున్నార‌ని ఎలా చెప్పగ‌ల‌రో కేవ‌లం క‌విత‌క్క‌కు మాత్ర‌మే అర్ధ‌మ‌య్యే భాష‌.బేసిగ్గా క‌విత‌క్క ప్రాతినిథ్య‌వ వ‌హించే పార్టీకి కానీ కుటుంబానికి గానీ ఎప్పుడూ ఎవ‌రో ఒక విల‌న్ కావాలి. ఆ విల‌నీ  బాబులో చూసుకోవ‌డం ద్వారా  ఎక్కువ లాభాన్నిచ్చేది గ‌తంలో. అయితే ప్ర‌స్తుతం మారిన రాజ‌కీయ ప‌రిణామ క్ర‌మాల‌ దృష్ట్యా కొన్నాళ్ల వ‌ర‌కూ ఆయ‌న మాట ఉచ్చ‌రించ‌డం ప‌క్క‌న పెట్ట‌డంతో న‌ష్టాలు, ప‌రాజ‌యాలు రావ‌డం మొద‌లైంది. దీంతో తిరిగి త‌మ ల‌క్కీ సెంటిమెంట్ తెలంగాణ‌, త‌మ‌కు క‌లిసొచ్చే పొలిటిక‌ల్ విల‌న్ బాబు బ్రాండ్ వాడ‌కాన్ని మొద‌లు పెట్టిన‌ట్టుంది. అందులో భాగంగానే క‌విత‌క్క ఈ బాబు నామ జ‌పంగా తెలుస్తోందంటున్నారు విశ్లేష‌కులు.

ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి మహిళ దుర్మరణం

  కడప జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ మహిళ సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పోట్లదుర్తి గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ  రోజూ లాగే తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రాత్రి ఇంట్లో ఛార్జింగ్ పెట్టారు.  దీంతో పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మమ్మ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు  

డిప్యూటీ సీఎం సినీ లుక్.. ఖుషీ అయిపోతున్న పవన్ ఫ్యాన్స్

కొత్త లుక్‌లో కనిపించిన డిప్యూటీ సీఎం పవన్‌‌కల్యాణ్‌ను చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేనేత వస్త్రాల్లో కనిపించిన ఆయన.. అందుకు భిన్నంగా ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్య పరిచారు. షర్ట్,ఫ్యాంట్‌తో టక్‌ చేసుకుని సినిమాటిక్‌ లుక్‌లో కనిపించిన పవన్ స్టార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ శంకుస్ధాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ లుక్ హాట్ టాపిక్‌ అయింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతులు స్వీకరించిన తర్వాత...ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పవన్‌ గతంలో ఎన్నడూ కనిపించని డిఫరెంట్‌ లుక్‌లో దర్శనమివ్వడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. డిప్యూటీ సీఎం హోదాలో ఇలా కనిపించడం తొలిసారి కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అయింది.  గత ఎన్నికల్లో ప్రచారం సమయం నుంచి జనసేన అధినేతగా పార్టీ సభలు, సమావేశాల్లో పవన్‌కళ్యాణ్ కుర్తా ఫైజమాలోనే కనిపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా  ప్రభుత్వ కార్యక్రమాల్లో చేనేత వస్త్రాలతోనే పవన్ ఎక్కువగా కనిపించారు. చాలా రోజులు తర్వాత ఓ ప్రభుత్వ కార్యక్రమంలో షర్ట్, ఫ్యాంట్‌తో  రావడంతో ఆయన అభిమానులు తెగ హ్యాపీ అయిపోతున్నారు. స్టైలిష్‌ లుక్‌లో ఉన్న  పవన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనెల 22న పవన్‌ కల్యాణ్‌ తమినాడులోని మధురైలో పర్యటించారు. మధురైలో జరిగిన మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన సంప్రదాయ పంచకట్టులో కనిపించారు. టీవల డిప్యూటీ సీఎం డిఫరెంట్ లుక్‌లో కనిపించి సందడి చేస్తున్నారు. ఇటీవల విజయవాడలోని పెనమలూరు మండలంలో ఓ సెలూన్‌ను పవన్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సాదాసీదాగా ఓ టీషర్ట్, షార్ట్‌తో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచారు.  ఆ సమయంలో పవన్ హెయిర్ స్టైల్ కూడా కొత్తగా కనిపించింది. ఇటీవల పవన్‌ ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. కుంభమేళాకు వెళ్లిన సందర్భంలో పవన్‌ ఫిట్‌నెస్‌పై ట్రోల్స్‌ నడిచాయి. పవిత్ర స్నానం చేస్తున్నప్పుడు తీసిన ఫోటోల్లో  పొట్టతో లావుగా కనిపించడంతో ట్రోలింగ్ జరిగింది. కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా మారిపోయిన పవన్ ఫిట్‌నెస్‌ని పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు చెక్‌ పెట్టే విధంగా పవన్‌ కొత్త లుక్‌లో కనపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొంటున్న ఆయన మళ్లీ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి యంగ్ లుక్‌లోకి మారిపోయారనే చర్చ నడుస్తోంది.  రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని చేనేత వస్త్రాల్లో తప్ప వేరే దుస్తుల్లో ఆయన్ని చూడటమే గగనమైపోయింది. సినిమా షూటింగుల్లో కూడా ఫ్యాషన్ దుస్తులు వేసుకోవడం తగ్గించేశారు. ఆయన ఇప్పుడు స్టార్‌ హీరో మాత్రమే కాదు.. ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా. దీంతో పవన్‌ని బయట ఇకపై ఫ్యాషన్ దుస్తుల్లో చూడలేమా అని ఫ్యాన్స్ తెగ ఫీలైపోతూ వచ్చారు. అయితే వారి ఆశలు నెరవేర్చేలా సరికొత్తగా కనిపించారాయన. మొత్తానికి డిఫరెంట్ లుక్‌లో ఉన్న డిప్యూటీ సీఎంను చూసి ఫాన్స్ సంబరపడిపోతున్నారు.

జూబ్లీలో గెలవాలి ..ఎలా అందరి నోట అదే మాట

  గెలవాలి .. గెలిచి తీరాలి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా అభ్యర్ధి ఎవరైనా,  కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి ... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ పార్టీ నాయకులకు ఇచ్చిన ఆదేశం, కాదంటే చేసిన సూచన ఇది. అవును, ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో మీనాక్షీ నటరాజన్ జూబ్లీ ఉప ఎన్నిక పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. నగర నేతలందరినీ సమీకరించి, శక్తి యుక్తులు అన్నిటినీ జోడించి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. అలాగే అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా, కాంగ్రెస్ నాయకులు కసరత్తు ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ అయితే ఇప్పటికే టికెట్ తనకే అని, తానే అభ్యర్ధినని  ప్రకటించుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడ, అజారుద్దీన్ గత ఎన్నికల్లో పోటీ చేశారు, కాబట్టి, మరోసారి టికెట్ ఆశించడంలో తప్పులేదు కానీ, చివరకు అభ్యర్ధి ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. మరో వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అభ్యర్థి ఎంపికకు సంబంధించి, ఎవరూ మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. నాయకుల నోళ్లకు తాళాలు వేశారు. అయితే, ఇప్పటికే, అజారురుద్దీన్, గతంలో ఎంఐఎం టికెట్ ఫై పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్ సహా మరో ఇద్దరు ముగ్గురు,ముఖ్య నేఅల వారసులు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంఐఎం మద్దతు విషయం తేలితేనే కానీ, కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనేది తేలదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా వుంది. అయితే, ముస్లిమేతర (నాన్ ముస్లిం) అభ్యర్ధిని బరిలో దించితేనే, ఎంఐఎం మద్దతు ఉంటుందని, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ షరతు విధించినట్లు చెపుతున్నారు. నియోజక వర్గంలో ముస్లిం ఓటు బ్యాంక్ లక్షకు పైగా ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే, ఎంఐఎం మద్దతు అనివార్యమని భావిస్తోంది. సో .. ఒవైసీ షరతుకు కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించక తప్పదని అంటున్నారు.  వరసగా మూడు సార్లు ఓడిపోయినా నియోజక వర్గంలో ఒంటరిగా పోటీ చేసే సాహసం కాంగ్రస్ చేయక పోవచ్చని సో ..తొందరపడి ముందుగానే  కర్చీఫ్ వేసిన అజారుద్దీన్‌కు మొండి చేయి తప్పక పోవచ్చని అంటున్నారు. అదెలా ఉన్నా, హస్తం పార్టీ జూబ్లీ సీటు మీద చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఓ వంక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్, మరో వంక పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్, ఇంచుమించుగా ప్రతి రోజు ఎంతో కొంత సమయాన్ని జూబ్లీ ఉప ఎన్నికకు కేటాయిస్తున్నారు. సందర్భంతో సంబంధం ఉన్న లేకున్నా ఉప ఎన్నిక ప్రస్తావన చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, రాష్ట్రరాజధానిలోనూ ‘జీరో’ కు పరిమితమైన నేపధ్యంలో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ వరసగా మూడు సార్లు సింగిల్ సీటు కూడా గెలవలేదు. ఉప ఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశ పడుతోంది. ఇప్పటికే ఉపఎన్నికల్లో ఒక సీటు (కంటోన్మెంట్) గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ  జూబ్లీని తమ ఖాతాలో చేర్చుకోవాలని ఆశ పడుతోందని అంటున్నారు. అయితే, జూబ్లీలో కాంగ్రెస్ గెలుపు సాధ్యమేనా అంటే, అప్పుడే ఒక అంచనాకు రావడం కుదరదు కానీ, కాంగ్రెస్ పార్టీ జూబ్లీలో పాగా వేయడం అంత ఈజీ కాదాని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీకే కాదు, బీఆర్ఎస్, బీజేపీలు సహా, ఏ పార్టీకి కూడా జూబ్లీ అంత ఈజీ’ గా చిక్కే సీటు కాదని అంటున్నారు.   కాంగ్రెస్ కథ అలా ఉంటె, బీఆర్ఎస్’ తమ పార్టీ  సిట్టింగ్ ఎమ్మెల్యే,మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన సీటును ఎలా అయినా నిలబెట్టులోవాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా, గులాబీ బాస్, కేసీఆర్ కూడా మీనాక్షీ నటరాజన్’ కంటే ఎక్కువగా జూబ్లీ గెలిచి తీరాలన పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా మాగంటి ఫ్యామిలీ నుంచే అభ్యర్ధిని నిలబెట్టాలని కేసీఆర్ మొదటి నుంచి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.  నిజానికి బీఆర్ఎస్ టికెట్ కోసం మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, విష్ణువర్ధన్  రెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డితో పాటుగా, మరి కొందరుపోటీ పడుతున్నారు. అయితే, చివరకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి, మాగంటి సునీత బరిలో దిగడం ఖాయమని అంటున్నారు. నిజానికి మొదట్లో పోటీకి ఆమె అంత సుముఖంగా లేక పోయినా ఇప్పడు మనసు మార్చుకున్నారని, పార్టీ వర్గాల సమాచారం. నిజానికి, ఇంతవరకు రాజకీయాలకు దూరంగా ఉన్న మాగంటి సునీత, ఇటీవల  చనిపోయిన, బొరబండ డివిజన్’ బీఆర్ఎస్ మైనారిటీ సెల్’ అధ్యక్షుడు మహమ్ముద్ సర్దార్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులు, దాసోజు శ్రవణ్, విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి’తదితర నాయకులతో కలిసి పరామర్శించారు.  దీంతో,ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టడం, ఉప ఎన్నికల్లోపోటీ చేయడం ఖాయమని అంటున్నారు. జూబ్లీ ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు కమలం పార్టీ కూడా సిద్దమవుతోంది. కాగా, గత  ఎన్నికల్లో  పోటీచేసి ఓడిపోయిన లంక దీపక్ రెడ్డి, మహిళా నాయకురాలు కీర్తి రెడ్డి, ఎన్వీ సుభాష్.. మరో కార్పొరేటర్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఇంతవరకు మూడు నాలుగు స్థానాలు పరిమితమైన బీజేపీ, ఉప ఎన్నికల్లోనూ ఆటలో అరటి పండుగా మిగులుతుందని అంటున్నారు. ఏమైనా, జూబ్లీ ఉప ఎన్నిక, సిటీ రాజకీయాలలోనే కాదు రాష్ట్ర రాజకీయల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే,జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయలపైనా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

స్థానిక ఎన్నికలు సజావుగా సాగుతాయా?

తెలంగాణ రాజకీయాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఓ వంక ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దుమారం రేపుతుంటే..  మరో వంక గత బీఆర్ఎస్  ప్రభుత్వ, ‘ఘన’  చరిత్రకు అద్దం పట్టే,  ప్రతిష్టాత్మక’ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫార్ములా - ఈ కార్ రేస్  ఇతరత్రా అవినీతి కేసులు, రాష్ట్ర రాజకీయాల్లో  సంచలనం సృష్టిస్తున్నాయి. ఏ రోజుకు ఆరోజు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి.  అదొకటి అలా ఉంటే..  అన్ని పార్టీలకూ,  మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు తరుము కొస్తున్నాయి. 2019లో ఎన్నికల్లో కొలువు తీరిన స్థానిక సంస్థలు కాలం చేసి, సంవత్సరం పైగానే అయినది.  అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ.. స్థానిక ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది.  అయితే.. ఇక ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేకుండా రాష్ట్ర హై కోర్టు ఎన్నికలను పదేపదే వాయిదా వేయడాన్ని తప్పుపడుతూ, సర్కార్ నెత్తిన అక్షితలు వేయడంతో పాటుగా , 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాలని  ప్రభుత్వానికి గడవు విధించిది.  ఈ నేపధ్యంలో ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. రాష్ట్ర హై కోర్టు విధించిన 90 రోజుల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  మరో వంక ఎటు తేలని బీసీ రిజర్వేషన్  వ్యవహారం, సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఉన్నది. ఈ  పీటముడిని విప్పితేగానీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి లేదు. అయితే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనసులో ఏముందో ఏమో కానీ..  ఈరోజుకు కూడా రిజర్వేషన్లపై ఎటూ తేల్చకుండా నాన్చివేత ధోరణి అవలబిస్తోంది. అదలా ఉంటే 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని, లేదంటే.. అంటూ బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇలా ఎటు చూస్తే  అటు పటు నిరాశ  అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం    చిక్కుల్లో చిక్కుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అదొకటి అయితే..  ఏదో ఒకటి చేసి, కోర్టు ఆదేశాల ప్రకారం, 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించినా.. ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో అధికార పార్టీలో అనుమనాలు  తొలగడం లేదని అంటున్నారు.  కాంగ్రెస్ ముఖ్యనాయకులు, పొరుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  స్టైల్లో స్థానిక ఎన్నికలను స్వీప్ చేస్తామని చెపుతున్నా.. పార్టీ అంతర్గత సర్వేల ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. ఫలితాలు కూడా అలాగే ఉంటాయనే భయాన్ని వ్యక్త పరుస్తున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లోనే కాదు..  పార్టీలోనూ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు సప్ష్టంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రికే తమ మంత్రుల పనితనం మీద విశ్వాసం లేదని, ఇక ప్రజలకు ప్రభుత్వం పై విశ్వాసం ఎలా ఉంటుందని  విశ్లేషకులు అంటున్నారు.  నిజంగా కూడా సామాన్య ప్రజలు.. ముఖ్యంగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం స్వచ్చందంగా పనిచేసిన వివిధ వర్గాల ప్రజలు.. ముఖ్యంగా నిరుద్యోగ యువత, పేద మహిళలు,  మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి మహిళలు కూడా.. కాంగ్రెస్ పార్టీని సొంత చేసుకునేదుకు, సమర్ధించేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. ముఖ్యంగా.. మహిళలకు ఇచ్చిన ప్రత్యేక హామీలు ఏవీ అమలు కాకపోవడంతో మహిళల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువ ఉందని అంటున్నారు. స్థానిక ఎన్నికలో మహిళా వ్యతిరేకత ప్రభావం భారీగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.  అలాగే..   ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు,  420 హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న  సాచివేత ధోరణి, రుణ మాఫీ, రైతుభరోసా సహా ఏ ఒక్క పథకాన్ని సంతృప్తి కరంగా పూర్తి చేయక పోవడంతో  అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారస్థాయికి చేరిందని అంటున్నారు. ఈ నేపధ్యంలో,కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పాటించి ఎన్నికలకు వెళుతుందా? అన్న  అనుమానాలు కూడా విపక్షాలు వ్యక్త పరుస్తున్నాయి. అయితే..  ప్రభుత్వం ఎన్నికలు మరో సారి వాయిదా వేసే ఆలోచన చేయక పోవచ్చని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహిస్తుందా?  లేక, ఏపీలో జగన్ రెడ్డి నిర్వహించిన  అరాచక, అప్రజాస్వామిక పద్దతిలో మమ  అనిపిస్తుందా  అనే అనుమానాలు అందరిలో ఉన్నాయని అంటున్నారు.

మంత్రి పొంగులేటికి మల్లికార్జున ఖర్గే వార్నింగ్

  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పొంగులేటిపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయిన ఖర్గే.. గంటసేపు మాట్లాడారు. ‘బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని కోరారు.  ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు' అని ఖర్గే హెచ్చరించినట్టు సమాచారం. మంత్రి పొంగులేటి తీరు నచ్చక తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు టాక్. అలాగే గతంలో బాంబులు పేలతాయని.. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి. రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమన్వయంగా ఉండాలని పొంగులేటికి మల్లికార్జున్ ఖర్గే సూచించారు.  

జగన్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ

పల్నాడు పర్యటనలో తన వాహనం ఢీ కొని సింగయ్య మరణించిన ఘటనపై జగన్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.   దీంతో  ఆ పార్టీ నేతలకు పల్నాడు ఫియర్ పట్టుకుంది. పోలీసుల ఆంక్షలను సవాల్ చేస్తూ జగన్ పల్నాడులో భారీ జన సందోహాన్ని మోహరించడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. నమోదైన కేసు నాన్ బెయిలబుల్ కే  కావడంతో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై కోర్టులో గురువారం (జూన్ 26)  విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో  శుక్రవారానికి (జూన్ 27) వాయిదా పడింది.   రాజకీయ ప్రతీకారంతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన సెక్షన్లు పెట్టారని  జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసును కొట్టేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.  

సైకిల్ యాత్రికుడి భారతదేశ యాత్ర గుంటూరు ప్రవేశం

పర్యావరణ సమతుల్యతపై ప్రజలలో అవగాహన కల్లించడమే ధ్యేయంగా ఓ యువకుడు చేపట్టిన సైకిల్ యాత్ర గుంటూరు చేరుకుంది. డిగ్రీ విద్యార్థి కోటా కార్తిక్ ఈ  బృహత్ కర్యక్రమాన్ని చేపట్టాడు. చిన్ననాటి నుంచే భూమిపై పచ్చదనాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మొక్కలు నాటుతూ, పర్యావరణ కాలుష్యాన్నితగ్గించే లక్ష్యంతో ముందుకు సాగిన కోటా కార్తిక్  ఇప్పుడు అదే లక్ష్యంతో కడప టు కాశ్మీర్ అంటూ సైకిల్ పై భారతదేశ యాత్ర ప్రారంభించాడు. సేవ్ ఎర్త్.. సేవ్ ట్రీస్ అనే నినాదంతో ఈ యాత్ర చేపట్టాడు. తన యాత్ర పొడవునా దారిలో మొక్కలు నాటుతూ.. వాతావరణ కాలుష్యాన్ని రహిత భారత దేశ నిర్మాణంపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్న కోటా కార్తీయ్ యాత్ర గుంటూరు చేరుకుంది. ఈ సందర్భంగా కార్తిక్ తన యాత్ర లక్ష్యాన్ని వివరించారు.   చిన్న వయసులోనే భూమిని కాపాడటం మొక్కలు నాటి  కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఉద్దేశం తో సైకిల్ పై భారత దేశ యాత్ర చేపట్టానన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కార్తీక్ ను అభినందించారు.  నేటి యువకులు చదువులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో పాటు పర్యావరణ సమతుల్యత ఎలా చేయాలి అనేది కూడా గ్రహించాలని, అందుకు కోటా కార్తిక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు ఈయన యాత్ర దిగ్విజయంగా జరగాలని ప్రతి గ్రామం పట్టణం నగరాల్లో ఈ యువకుడికి సంఘీభావం తెలియజేయాలని  కోరారు. 

అంత‌రిక్ష ప్ర‌యోగాల్లో శుభాంశు శుక్లా శుభారంభం!

14 రోజుల ట్రిప్ కి 550 కోట్ల రూపాయల పెట్టుబడి. ఈ ప్రయోగంతో భారత్ ఏం సాధిస్తోంది? ఇదొక గేమ్ ఛేంజరా? అయితే అదెలా? ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి  యాక్స్- 4 మిషన్ ప్రయోగం ఆక్సియమ్ స్పేస్, నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో.. కలసి చేస్తోన్న సంయుక్త ప్రయోగం భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ గా శుభాన్ష్. బరువులేని వాతావరణంలో నివసించే ట్రైనింగ్ డ్రాగన్ ద్వారా ప్రయాణించి.. ISSకి చేరిక అంతరిక్షంలో నాయకత్వ అనుభవం కోసం 12 ప్రయోగాల్లో.. 7 జీవ శాస్త్రానికి చెందినవి 2026- ఇస్రో గగన్ యాన్ లో ఇది కీలకం అంతరిక్ష నివాసం, ప్రయోగశీలత  అంతర్జాతీయ నియమాల పాటింపు సరికొత్త పార్టనర్ షిప్పులు లభించే ఛాన్స్. 2035- ఇండియన్ స్పేస్ సెంటర్ కి హెల్ప్ అంతరిక్షంలో ఎలా పని చేయాలో ఒక అనుభవం ఎమర్జెన్సీ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? ఐఎస్ఎస్ పరికరాలను ఎలా వాడాలన్న విషయాల్లో ట్రైనప్ యాక్స్- 4 నాసా, ఇసా, యాక్సియమ్ స్పేస్ తో.. మెరుగు పడనున్న సంబంధ బాంధవ్యాలు స్పేస్ లీడర్షిప్ కి దోహద పడనున్న ప్రయోగం కండరాల వ్యాధి నివారణకూ సహాయం ISS నుంచి స్కూల్ పిల్లలతో చాట్ చేయనున్న శుక్లా ఆ అంతరిక్ష ప్రయోగాల లక్ష్యం మైక్రో ఆల్గేతో ఆహారాన్ని పెంచడం, - సైనో బ్యాక్టీరియా నుంచి ఆక్సిజన్ తయారీ, - అంతరిక్షంలో మానవ కండరాల రక్షణ, సలాడ్ తయారీ కోసం విత్తనాలు,  టఫ్ టార్డిగ్రేడ్స్ కాగా  మరో ముఖ్య ప్రయోగం ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యకరంగా ఉండటం ఎలా? అన్నది లక్ష్యం.  భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకే బీజాలు ఇవి బీజాలు. భూమిపై మెరుగైన జీవితాన్నీ ఇవ్వగలవు  2026లో రూ. 20, 193 కోట్లతో గగన్ యాన్ ముగ్గుర్ని 3 రోజుల పాటు 400 కి. మీ కక్ష్యలోకి పంపేదుకు  యాక్స్- 4 తో ఈ ప్రయోగం ఒక ట్రయిల్ రన్ గా చెప్పాల్సి ఉంటుంది. నాసా, ఇసాతో కలసి పని చేయడంతో వరల్డ్ క్లాస్ మిషన్ లో శుక్లా పెట్ నేమ్ 'షక్స్’. కాగా ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ.. 140 కోట్ల మంది ప్రయాణమిది అన్నారు. ఈ ప్రయోగానికి అయ్యే వ్యయం  రూ. 550 కోట్లు కేవలం ఖర్చు కాదనీ.. భారత అంతరిక్ష భవిష్యత్ కి పెట్టుబడి అని అభివర్ణించారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దాదాపు నెలన్నర నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా పట్టిన సమయం తెలిసిందే. వసతి గదుల కోసం కూడా భక్తులకు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.  విద్యాసంస్థలు తెరుచుకోవడం, పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  గురువారం (జూన్ 26) శ్రీవారిని 75,001 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,765 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల వచ్చింది. ఇక శుక్రవారం (జూన్ 27) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లునిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.  టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమ యం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలుచేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది.  

బాబాయిని ఏసేసినోడికి సింగయ్య ఒక లెక్కా? : వర్ల రామయ్య

  సొంత బాబాయిని ఏసేసినోడికి సింగయ్య ఒక లెక్కా అని  జగన్‌ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. సింగయ్య చావుకు తన కారుకు సంబంధం లేదని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? సింగయ్యను వైసీపీ కార్యకర్తలే టైర్ క్రింద నుండి లాగి పక్కన పడేయలేదని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? ఆయన ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ ని  నిలదీశారు.  చిన్న నాటి నుండి జగన్ రెడ్డి వ్యక్తిత్వం నేర ప్రవృత్తితో మిళితం అయ్యిందని.  విద్యార్థి దశలోనే ప్రశ్నాపత్రాలు దొంగిలించారన్న ఆరోపణలు తనపై ఉన్నాయిని రామయ్య అన్నారు.  ఆ ఆరోపణలపై ఇప్పటికీ జగన్ రెడ్డి నుండి సమాధానం లేదు. పార్లమెంట్ కు రాజీనామా చేయనన్నాడని.. లాలించి పెంచి ప్రేమించిన బాబాయిని లాగి చెంప పగలగొట్టిన మనస్తత్వం జగన్‌దని ఆయన ఆరొపించారు. హైదరాబాద్ కు వద్దని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను వారించినా బెంగళూరులో ఉండకుండా పదే పదే హైదరాబాద్ కు వచ్చి తండ్రికి తలనొప్పి కలిగించిన కొడుకు జగన్ రెడ్డి.  తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్ ది. ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన జగన్ కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని ఆయన పేర్కొన్నారు.  సొంత తల్లి తన ఇంట్లో లేకపోవడానికి జగన్ రెడ్డి వీపరీత మనస్తత్వమే కారణం. సోంత చెల్లి తనకు దూరం అవ్వడానికి జగన్ వీపరీత మనస్తత్వమే కారణం. మాజీ సీఎంకు ధనాశకు వారు ఎక్కడో ఉంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. జగన్ రెడ్డి బాబాయి కూతరు సునీత నాడు న్యాయం కోసం ఢిల్లీ నడివీధుల్లో ఎండలో నడుస్తుంటే నాకే బాధేసింది జగన్ రెడ్డికి మాత్రం మనసు కరగలేదని ఆయన అన్నారు. అధికార దాహం కోసం జగన్ రెడ్డి ఏదైనా చేయగలరు. స్టేరాయిడ్స్ తీసుకునే అథ్లెట్ కు.. అరాచకంతో అధికారంలోకి రావాలనుకునే జగన్ రెడ్డికి ఎటువంటి తేడాలేదు. తన ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఏవర్గానికి మేలు చేశాడో చెప్పగలడాని వర్ల రామయ్య నిలదీశారు.  

రోడ్డు ప్రమాదంలో ఎస్సై కానిస్టేబుల్ మృతిపై...చంద్రబాబు విచారం

  కేసు విచారణలో భాగంగా నిందితుల కోసం కారులో హైదరాబాద్ వెళ్తున్న ఏపీ పోలీసులు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురికావడం విషాదకరమని సీఎం చంద్రబాబు  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం. అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ లు అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్‌లకు అందుతున్న వైద్య సహాయం గురించి అధికారులతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.  వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు, అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చంద్రబాబు వివరించారు. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.  

గోల్కొండ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు

  హైదరాబాద్‌లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వ తరుపున  పట్టు వస్త్రాలను మంత్రి కొండా సురేఖ, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ సమర్పించారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి తొలి బోనం నేవేద్యంగా ఇచ్చారు. మరోవైపు.. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.  గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.ఈ బోనాలు జూలై 24వ తేదీ వరకు గురు, ఆదివారాల్లో కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ యేడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 

నేడు జగన్నాథుని నేత్రోత్సవం

  జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు కోలుకున్నాడు. గురువారం (26వ తేదీన) నవయవ్వన రూపంతో భక్తులకు దర్శనం ఈయనున్నాడు. శుక్లపక్షమి పాడ్యమి తిథి పర్వదినం పురస్కరించుకుని గురువారం బ్రహ్మాండనాయకుని నేత్రోత్సవం పూరీ శ్రీక్షేత్రంలో నిర్వహించనున్నారు. కాగా పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం (27న) నిర్వహించనున్నారు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలు నేడు శ్రీక్షేత్రం ఎదుట కార్డన్ కు చేరుకోనున్నాయి. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి