ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు

  ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. జూలై 1 విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నాది. అరవింద్ కుమార్‌ను మరోసారి విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. అయితే, ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై కంపెనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నిస్తోంది. సీజన్ 9, తర్వాత రేస్‌ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు.   

జగన్‌కు అరెస్ట్ భయం..హైకోర్టులో పిటిషన్

  వైసీపీ అధినేత జగన్ , ఆ పార్టీ నేతలకు పల్నాడు ఫియర్ పట్టుకుంది. పోలీసుల ఆంక్షలను సవాల్ చేస్తూ జగన్ పల్నాడులో భారీ జన సందోహాన్ని మోహరించడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో జగన్ , బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు గురువారం విచారిస్తామని పేర్కొంది. విచారణ అనంతరం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది జగన్ తోపాటు వైసీపీ వర్గాల్లో ఉత్కంఠగా రేపుతోంది. కేసును కోర్టు క్వాష్ చేయకపోతే ఏ క్షణమైనా జగన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వైసీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం జగన్ డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకోగా…మంగళవారం జగన్ కారును సీజ్ చేసి నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు.ఈ క్రమంలోనే ఆయనను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుకున్నారో ఏమో, కేసును క్వాష్ చేయాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ జగన్ కు నిరాశ ఎదురైతే ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచే అవకాశం ఉంది.  

ఆషాఢ మాసం బోనాలను జంట నగరాలు ముస్తాబు

  హైదరాబాద్ జంటనగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసింది. నగరంలోని 2,783 దేవాలయాలకు వివిధ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిధులను చెక్కుల రూపంలో జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ఆషాఢ మాసంలో ముందుగా నగరంలోని గోల్కొండ బోనాలు జూన్‌ 29న జులై 1, 2 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జులై 13, 14 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం బోనాలు, జులై 20న లాల్‌ దర్వాజా బోనాలు.. జులై 23న చార్మినార్‌ భాగ్యలక్ష్మి బోనాలు, మిగిలిన దేవాలయాల్లో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు.  జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూ హిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి.పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో రూ.10 కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. హైదరాబాద్-గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు అమ్మవారికి మెట్ల బోనాలు, ఒడి బియ్యం సమర్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు   

రూ.3,626 కోట్లతో పూణే మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం

  ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినేట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  1975లో అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మరోవైపు ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.   పూణేలోని మెట్రో లైన్ ఫేజ్-2 కోసం రూ.3,626 కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేసింది. ఆగ్రాలోని పొటాటో రీజ‌న‌ల్ సెంట‌ర్ ఏర్పాటుకు రూ.111.5 కోట్లు మంజూరు చేసింది. అదే విధంగా కోల్డ్ ఫీల్డ్ రీహాబిటేష‌న్ కోసం రివైజ్డ్ మాస్ట‌ర్ ప్లాన్‌కు రూ.5,940 కోట్ల రూపాయలు కేటాయించింది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రను స్వాగతిస్తూ మరో తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.  

కేసీఆర్‌ వల్లే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు : కవిత

  గోదావరి జలాల అంశంపై నిన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసరడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అసెంబ్లీలో కచ్చితంగా చర్చిద్దాం అయితే ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలని కవిత డిమాండ్ చేశారు.  కేసీఆర్ దమ్ము ఏమిటో అసలైన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ ముఖ్యమంత్రి కాగలిగారని ఆమె అన్నారు. ఇదే సమయంలో, పెన్షన్ల పెంపుదల వంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామన్న హామీని విస్మరించారు. వికలాంగుల పెన్షన్ ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచకుండా మోసం చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైంది?" అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ హామీలన్నింటినీ తక్షణమే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు

ఇక పార్టీ కార్యకర్తల నుంచి ప్రతి రోజు ఫీడ్ బ్యాక్ : లోకేష్

  రెడ్ బుక్ పేరు ఎత్తితే చాలు వైసీపీ నేతలకు గుండెపోటు వస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. ఇకపై ప్రతిరోజూ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని  లోకేష్ తెలిపారు. కూటమి సర్కార్ ఏడాది పాలను జులై 2 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కూటమిలో మనది పెద్దన్న పాత్ర అని.. సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు.  ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తాను ప్రతీ రోజు ఐదుగురు ప్రజలు, ఐదుగురు కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని..తెలుగు దేశం పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని స్పష్టం చేశారు. అమరావతి బిల్లు విషయంలో టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాలని వైసీపీ నేతలు చూశారని ఆయన అన్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుతోనే ఉంటామని చెప్పారని పేర్కొన్నారు. చంద్రబాబు అభివృధి చేసిన జైలులోనే ఆయనను పెట్టినప్పుడు నాకు చాలా బాధ వేసిందని లోకేశ్ తెలిపారు. వైసీపీ నేతల దురాగతాల వల్ల టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయారని ఆయన అన్నారు.  టీడీపీ సిద్ధాంతాలు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను అహంకారంతో కాకుండా బాధ్యతతో చేయాలని ఆయన కోరారు. అలా అహంకారంతో ఉంటేనే 151 నుంచి 11కి వచ్చారని వైసీపీ వ్యాఖ్యనించారు. మచిలీపట్నం అంటే తెలగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. ఇక్కడ ఎప్పుడైతే గెలిచామో అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించాం. మంత్రి కొల్లు రవీంద్రపై గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా టీడీపీ కోసం, చంద్రబాబునాయుడు గారికోసం నిలబడ్డారు. మచిలీపట్నంలో అక్రమ కేసులతో ఎంత వేధించినా పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయాన్ని సాధించి పెట్టిన కార్యకర్తలకు నమస్కారాలని లోకేశ్ తెలిపారు.  ప్రజలకు మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకోవాలి. మెగా డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని. పెద్దఎత్తున కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది నిరుద్యోగ భృతి మొదలుపెడుతున్నామని లోకేశ్ పేర్కొన్నారు. భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. వారిని గౌరవించాలనేది టీడీపీ నినాదం. మహిళలను గౌరవించాలనేది ముందు మన ఇంట్లో మొదలవ్వాలి. 50శాతం పనులు మగవారు, 50శాతం పనులు ఆడవారు చేయాలని పాఠ్యాంశాల్లో పెట్టాం. జులై 5న మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ లో తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు అందించాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సబ్సీడీ మొత్తాన్ని మహిళల అకౌంట్లలో జమచేస్తాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, దివ్యాంగ పెన్షన్ రూ.6వేలు, పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నామని ఆయన తెలిపారు  

దళిత సోదరుడు సింగయ్యది జగన్ చేసిన హత్యే : సోమిరెడ్డి

  దళిత సోదరుడు సింగయ్యను హత్య చేసింది మాజీ సీఎం జగనేని టీడీపీ నేత మాజీ మంత్రి,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా 9 గంటలు వేల మందితో ర్యాలీ చేశారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హచయాంలో దళితులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని తెలిపారు. సింగయ్య మృతిని జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్ పేరు తీసేసి రప్ప...రప్ప పార్టీ అని పెట్టుకో పార్టీ అని పెట్టుకోవాలని సూచించారు.  ర్యాలీలో కాన్వాయ్ కింద పడితే తొక్కేసి వెళ్లిపోయారని విమర్శించారు.  కనీసం దిగి బాధితుడిని ఆస్పత్రికి కూడా తరలించలేదని, సింగయ్యది ముమ్మాటికీ హత్యని సోమిరెడ్డి ఆరోపించారు.తీవ్రంగా గాయపడిన సింగయ్యను ముళ్లకంపల్లో పడేసి వెళ్ళిపోతారా.. అంటూ జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాంటి వారి వల్ల దళితులు, గిరిజనుల ప్రాణాలకు హానీ కలుగుతోందన్నారు. ఈ దేశ చరిత్రలో రూ. 43 వేల‌ కోట్ల కుంభకోణంలో జగన్ నిందితుడని సోమిరెడ్డి అన్నారు. జగన్ పర్యటనలో 679 మంది పోలీసులను పెడితే ఇంకా బందోబస్తు సరిపోలేదని విమర్శలు చేస్తున్నారని, 90 కిలోమీటర్ల రోప్ పార్టీని పెట్టాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.  జగన్‌కు సిగ్గూ శరం ఉండాలన్నారు. జగన్ కోసం వచ్చిన అభిమానిని నిలువునా ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు. ఆయన కారులో ఉన్న పెద్దరెడ్డి కారు కింద పడితే అలాగే వదిలేసి వెళుతారా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో ముగ్గురు చనిపోయారని, జగన్ తీసుకున్న అనుమతి ఒకటి.. చేసింది మరొకటని విమర్శించారు. గత వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎంత అవినీతి చేయోచ్చో.. ఏపీ లిక్కర్ స్కామ్ చూస్తే అర్థమవుతోందని సోమిరెడ్డి తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్‌తో సినీ తారల కుటుంబంలో చిచ్చు పెట్టారు : టీపీసీసీ

  మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్‌తో సినీతారల కుటుంబంలో చిచ్చు పెట్టారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రైతుభరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పినట్లుగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని అన్నారు. చివరకు సొంత బీఆర్‌ఎస్ పార్టీ నేతలనూ వదలేదని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్, కేటీఆర్ కు ఎవరిచ్చారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. మా ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారు..?  దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య అని ఆయన తెలిపారు.  ఈ కేసులో ఎంత పెద్దవాళ్లు ఉన్నా శిక్ష పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చించి నిర్ణయం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలన గోల్డెన్ పిరియడ్ అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలు, జుబ్లీహీల్స్‌ ఉపఎన్నికకు పార్టీని సన్నద్ధం చేసేలా పలు కీలక నిర్ణయాలుతో వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహలపై వరుస సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు గెలిచేది కూడా తామేనని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు  

దేవుడి పేరిట రాజకీయాలు చేస్తే..చూస్తూ ఊరుకోం

  పవన్ కళ్యాణ్‌కి తమిళ రాజకీయాల్లో తొలి ఎదురు దెబ్బ తగిలిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇలాంటి రాజకీయాలు చేస్తానని ముందుకొచ్చిన రజనీకాంత్  అక్కడ తన పొలిటికల్ ఖాతా తెరవకుండానే ప్యాకప్ చెప్పేశారు. ఆయన నాన్ లోకల్ కూడా కావడంతో.. అప్పట్లో శీమాన్ తదితరులు ఇక్కడ రాజకీయ పార్టీ పెడితే ఒప్పుకునేది లేదంటూ తెగేసి చెప్పారు. ఇప్పుడు పవన్ చూస్తే తమిళనాడు సంప్రదాయానికి విరుద్ధంగా ఆధ్యాత్మిక రాజకీయాల బాట పట్టారు.నిజానికి ఇక్కడ ఎంత ద్రవిడ వాదం ఉన్నా.. భక్తి ఏం తక్కువ ఉండదు. కరుణానిధితో సహా అందరూ ఇక్కడ సెంటిమెంట్లు ఫాలో అయ్యేవాళ్లే. కానీ విచిత్రమైన విషయమేంటంటే.. పైకి అందరూ ద్రవిడ వాదం వల్లె వేసేవారే.  ఆ మాటకొస్తే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ సైతం ద్రవిడవాదే. అలా అయితేనే ఇక్కడ నెగ్గుకు రాగలం.ఈ విషయం తెలీకుండా పవన్ ఇక్కడ తనదైన సనాతన్ మార్క్ పాలిటిక్స్ ప్లే చేస్తానంటూ కుదరదని అంటున్నారు తమిళులు. అందుకే సత్యరాజ్ నుంచి ఫస్ట్ వార్నింగ్ వచ్చింది. ఇది తర్వాతి రోజుల్లో చాలా చాలా ముదరబోతుంది. దానికి తోడు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడ బీజేపీ నుంచి ప్రచారం చేసేలా కనిపిస్తోంది. వీటిని ముందే గుర్తించిన తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన హవాకు ముందు నుంచే బ్రేకులు వేస్తున్నారు.ఈ రోజున దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తామంటే కుదరదని సత్యరాజ్ నుంచి ఒక హెచ్చరిక అయితే వచ్చింది. వచ్చే రోజుల్లో ఈ హెచ్చరికల తీవ్రత ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది.

పవనిజం.. వ్యూహాత్మక ‘సనాతన’ ప్రయాణం?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ జ‌ర్నీ ఈ ప‌న్నెండేళ్ల‌లో ప‌న్నెండు మ‌లుపులు తిరిగిన మాట నిజం. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌త క‌ట్ట‌ని వారు లేరు. వారిలో క‌మ్యూనిస్టులున్నారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో మాయావ‌తి వంటి  ద‌ళిత నేత‌లున్నారు. ఇక చెగువేరా సంగ‌తి స‌రే స‌రి. ఫైన‌ల్ గా ఆయ‌న సేన‌- బీజేపీ, టీడీపీతో చేస్తోన్న‌ ప్ర‌యాణం గురించి తెలియంది కాదు. కానీ ప‌వ‌న్ పై ఇప్పుడు చ‌ర్చంతా ఏంటంటే ముస్లిం టోపీ  ధ‌రించి, గొడ్డు మాంసం తిన‌డం  లో త‌ప్పు లేద‌ని.. త‌న తండ్రి దీపం మంట‌లో సిగ‌రెట్ వెలిగించుకునేంత నాస్తికుడ‌ని చెప్పుకుని, ఆపై బైబిల్ ప‌ట్టుకుని త‌న పెళ్లాం పిల్ల‌లు పూర్తి క్రిష్టియ‌న్ల‌ని చెబుతూ.. చివ‌రికి ఆయ‌నిలాంటి నిగూఢ‌మైన వారాహీ దీక్ష‌లు, వాహ‌నాల‌కు ఆ పేరుబెట్ట‌డంతో పాటు య‌జ్ఞ‌యాగాల నిర్వ‌హ‌ణ‌, కుంభ‌మేళాలో    స్నానాలు.. ఇవ‌న్నీ ఏం చెబుతున్నాయ్? ఆయ‌న హిందువా ముస్లిమా క్రిష్టియ‌నా?  లేక కొత్త పేరు ఏదైనా పెట్టాలా?  జ‌నాన్నిలా సందిగ్దంలో ప‌డేయ‌టం ప‌వ‌న్ మార్క్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ.  ప‌వ‌న్ ప‌య‌న‌మెటు? ఈయ‌న్ని మ‌న‌మెలా అర్దం చేసుకోవాలి? అంటే  ప‌వ‌న్ పెద్ద  స్కెచ్చే వేశారని అంటారు కొంద‌రు ఆధ్యాత్మిక రాజ‌కీయ పండితోత్త‌ములు. వ‌చ్చ‌  రోజుల్లో ఆయ‌న స్టార్ క్యాంపెయిన‌ర్ గా దేశమంతా ఒక ర‌క‌మైన ఫాలోయింగ్ తీసుకురావాలంటే అందుకు త‌గిన మార్గం కోసం వెతుకుతుండ‌గా వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన చందంగా మారిందట ఈ స‌నాత‌నం. దీని ప‌వ‌ర్ కేవ‌లం ఒక‌టీ రెండు రాష్ట్రాల‌కు సంబంధించింది కాదు. ఇది దేశ వ్యాప్తంగా క‌నిపించే కామ‌న్ పాయింట్. గ‌తంలో ర‌జ‌నీకాంత్ ని వాడాల‌నుకున్నారు మోడీ. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు అదే ప‌నిగా పంచ‌క‌ట్టుకుని వెళ్ల‌డం చూసే ఉంటాం. ఆయ‌న కూడా అందుకు త‌గిన విధంగానే రియాక్ట్ అయ్యారు కూడా. తాను చేస్తే గీస్తే ఆధ్యాత్మిక రాజ‌కీయాల‌నే చేస్తాన‌న్నారు. కాకుంటే ఈ సూప‌ర్ స్టారుడికి కాలం ధ‌ర్మం పెద్ద‌గా క‌ల‌సి రాలేదు. దీంతో ర‌జ‌నీ ఛాన్స్ మిస్ చేసుకుంది క‌మ‌లం దండు. స‌రిగ్గా ఈ టైంలో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీకి ఇక ఆశాకిరణంగా కనిపించారు. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని మోడీ  ఎప్పుడైనా  ఎక్క‌డైనా మొద‌టి ప్ర‌యారిటీ కింద గుర్తిస్తారు.   అంతెందుకు ప్ర‌మాణ  స్వీకార స‌మ‌యంలో   మోడీ ప‌వ‌న్, చిరంజీవిల చేతులు పైకి లేపి.. ఇచ్చిన సంకేతం ఏమిటి? అందుకే ప‌వ‌న్ ఈ  దిశ‌గా త‌న అడుగులు వేస్తూ బీజేపీ  పాలిట ఒక స్టార్ క్యాంపెయిన‌ర్ గా త‌న ప‌రిధిని పెంచుకుంటూ పోతున్నారు. అందుకే త‌మిళ‌నాడు బీజేపీ  సైతం మురుగ‌న్ పేరిట ఒక ఆధ్యాత్మిక స‌భ‌ను ఏర్పాటు చేసింది. కార‌ణం ఇక్క‌డ మురుగ‌న్ అన్న‌దొక ప్ర‌త్యేక మ‌తం. ఈ దేవుడి పేరు చెబితేనే మొత్తం ఊగిపోతారు. త‌ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి పెద్ద పీట వేసి.. ఇక్క‌డి తెలుగు ఓట‌ర్ల‌ను విశేషంగా ఆక‌ర్షించి.. ఆపై.. త‌మిళ‌నాట త‌న ఓటు బ్యాంకును మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని క‌మ‌ల‌ద‌ళం చూస్తున్న‌దని పరిశీలకుల విశ్లేషణ. అది మోడీ ఆదేశాను సార‌మో మ‌రొక‌టో తెలీదు కానీ..  ఈ దిశ‌గా ప‌వ‌న్ కి కూట‌మి ప్ర‌భుత్వంలోనూ భారీ ఎత్తున ప్ర‌యారిటీ ద‌క్కుతోంది. మొన్న క‌ర్ణాట‌క‌ ఏనుగుల వ్య‌వ‌హారంలోనూ ఆయ‌న ద‌గ్గ‌రుండి వాటిని తీసుకోవ‌డం.. ఇలా ప‌వ‌న్ ని రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచేందుకు   బీజేపీ ఒక ప‌థ‌కం ప్ర‌కారం వెళ్తున్న‌ట్టుగా స‌మాచారం.  మ‌న‌మంతా ఏమ‌నుకుంటున్నాం,, ఇదేంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా చేస్తున్నారు? ఆయ‌న‌కు ముస్లిం- క్రిష్టియ‌న్- మైనార్టీ ఓట్లు వ‌ద్దా? అని తీసిక‌ట్టిన‌ట్టు మాట్లాడుకుంటాంగానీ.. ఈ మొత్తం జ‌ర్నీలో ఆయ‌న్ని స‌నాత‌న ధ‌ర్మ వార‌ధిగా భారీ  క‌మ‌ల వ్యూహ‌మే ర‌చిస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ఇదంతా అంటున్నారు.  ఆయ‌న కూడా వెళ్లిన ప్ర‌తి ప్రాంతాన్నీ.. ఇక్క‌డే  నేను పుట్టా. ఇక్క‌డే  నేను పెరిగా ఇక్క‌డే నా సినిమాలు ఎక్కువ ఆడేవి అంటూ ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ అక్క‌డి వారిని ఆక‌ట్టుకునే య‌త్నం చేస్తుంటారు. ఇదంతా ఒక విస్తృత రాజ‌కీయాల్లో భాగంగానే చూడాలంటారు కొంద‌రు ఎన‌లిస్టులు.  ఎందుకంటే తాను కేవ‌లం ఒక కాపు నేత‌గా మాత్ర‌మే కాకుండా.. స‌ర్వ‌జ‌న..  స‌ర్వ‌కుల నేత‌గా ఎద‌గ‌డం ఒక అనివార్యంగా కావ‌డంతో.. ఇదిగో ఇదీ పరిస్థితి. ప‌వ‌న్ అలవోకగా చెప్పే  డైలాగ్ లోనూ ఒక వ్యూహం ఉంటుంద‌ని అంటారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. అందులో భాగంగానే ఇదంతా జ‌రుగుతున్న‌ట్టుగా ఒక టాక్ న‌డుస్తోంది దక్షిణాది రాజకీయవర్గాల్లో. అందుకే ఇత‌ర రాష్ట్రాల వేదిక‌ల‌పై ప‌వ‌న్ కి ఇంత ఎలివేష‌న్ అంటున్నారు విశ్లేష‌కులు.

రైతు బంధు డబ్బుల కోసం తండ్రి నాలుక కోసేసిన కొడుకు

రైతు బంధు డబ్బుల విషయంలో  ఘర్షణ పడి తండ్రి నాలుక కోసేసిన సుపుత్రుడి ఉదంతమిది. ఈ దారుణం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. రైతు బంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కోపంతో దాడి చేసి నాలుకు కోసేశాడో సుపుత్రుడు. తాండాకు చెందిన బానోత్ కిర్యా కు ఇద్దరు కుమారుడున. రైతు బంధు పథకం కింద బానోత్ కిర్యా ఖాతాలో ఇటీవల తొమ్మిది వేల రూపాయలు జమ అయ్యాయి.  ఎకరాకు రూ.6 వేల చొప్పున  ఎకరంన్నర పొలం ఉండటంతో తొమ్మిదివేలు కిర్యా ఖాతాలో జమ అయ్యాయి.  ఆ సొమ్ములు తనకు ఇవ్వాలని చిన్న కుమారుడు సంతోష్ కోరాడు. అయితే తండ్రి కిర్యా మాత్రం తాను నాలుగువేల రూపాయలు మాత్రమే ఇస్తాననీ, తన అనారోగ్యం కారణంగా ఐదు వేలు ఖర్చయ్యయనీ చెప్పాడు. దీంతో  ఆగ్రహానికి గురైన సంతోష్ తండ్రిపై దాడి దాడి చేసి కొడవలితో తండ్రి నాలుకను అతడు కోసేశాడు. ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా నాలుగు కుట్టుపడ్డాయి,   కీర్యా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు.  

ఆ చీకటి రోజులపై ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకం.. మోడీ

దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎమర్జెన్సీ డైరీస్ అన్న పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఎమర్జెన్సీ చీకటి రోజులలో ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై  ది ఎమర్జెన్సీ  ఈ ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నట్లు పేర్కొన్న ఆయన ఆ సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో చాలా మందికి అనుభవాలు ఉన్నాయని.. ఎన్నో కుటుంబాలు బాధపడ్డాయని గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితుల్ని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

సెప్టెంబర్ 30లోగా స్ధానిక ఎన్నికలు.. తెలంగాణ హైకోర్టు

ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ  స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత తొలగిపోయింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు బుధవారం (జూన్ 25)  కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30లోపు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే నెల రోజులలోగా  వార్డుల విభజన చేయాలని స్ఫష్టం చేసింది. ఇలా ఉండగా  ఎన్నికల నిర్వహణకు 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం, 60 రోజుల గడువు కావాలని  రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టును కోరాయి. వీరి విజ్ణప్తులను పరిగణనలోనికి తీసుకున్న తెలంగాణ హైకోర్టు కో సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  వాస్తవానికి స్థానిక సంస్థల గడవు ముగిసి సంవత్సరం పైనే అయింది. రాష్ట్రంలో2019లో చివరిసారిగా, విడతల వారీగా, మూడు నాలుగు నెలలు పాటు స్థానిక సంస్థల ఎన్నికలు  జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌ల పదవీకాలం గత సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. అలాగే.. ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 3న, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్ల పదవీకాలం అదే సంవత్సరం జూలై 4న ముగిసింది. మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం గత ఆగష్టులో ముగిసింది ఇక అప్పటి నుంచి పంచాయతీ మొదలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వరకు స్థానిక సంస్థలో, ప్రజా పాలన స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.

తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్

ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. బుధవారం (జూన్ 25) జరిగే ఈ సమావేశంలో ఈ ఇద్దరు సీఎంలతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్ సీఎంలు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రగతి అజెండాపై చర్చిస్తారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాజెక్టులు సహా పలు కీలక అంశాలపై మోడీ చర్చిస్తారని అంటున్నారు. అలాగే  రాష్ట్రాల మధ్య సహకారం పెంచి, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. వివాదాస్పద అంశాలైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌పై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే పోలవరం అంశం కూడా మరోమారు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పురోగతి, ఒడిశాలో రూ.18,600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, తెలంగాణలో రూ.56,000 కోట్ల ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్‌లో గనుల సంబంధిత సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం.  

క్వాంటం వ్యాలీ ముందు తీసికట్టు సిలికాన్ వ్యాలీ!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీని అమెరికాలోని సిలికాన్ వ్యాలీని మరిపించేలా తీర్చిదిద్దనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. క్వాంటం వ్యాలీ అత్యధునిక సాంకేతికలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  సిలికాన్ వ్యాలీ తీసికట్టు అయ్యే విధంగా దేశంలోనే మొదటి టెక్నాలజీ వ్యాలీగా  క్వాంటం వ్యాలీని తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. 1990లలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లే.. ఇప్పుడు క్వాంటం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్ ఏర్పాటు తొలి అడుగు వేయాలన్నది చంద్రబాబు లక్ష్యంగా చెబుతున్నారు.  క్వాంటం వ్యాలీ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముందు ముందు కనీసం 15లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంటున్నారు. క్వాంటం వ్యాలీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే.   క్వాటం మిషన్ పేరిట బుధవారం విజయవాడలో నిపుణులతో వర్క్ షాప్ జరిగింది. మొత్తం మీద సాంకేతిక అద్భుతంగా క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకోబోతున్నది. క్వాంటం వ్యాలీ ప్రత్యేకతలను చాటే విధంగా నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఐకానిక్ టవర్ ను నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. వచ్చే ఏడాది జనవరి 1న క్వాటం వ్యాలీని ప్రారంభించేందుకు ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైంది.  

ఖ‌తార్ ఖ‌త‌ర్నాక్ దెబ్బ?.. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టాప్!?

ఈ ట్రంపున్నాడే.. తొంద‌రెక్కువ- వివ‌రం త‌క్కువ‌.. అంటారు కొంద‌రు. జీ- 7 నుంచి హ‌డావిడిగా వెళ్తూ కాల్పుల విర‌మ‌ణ‌క‌న్నా మించి జ‌ర‌గ‌బోతోంద‌ని  బిల్డ‌ప్ ఇచ్చి వెళ్లారు.  తీరా చూస్తే.. ఇరాన్ తో కాళ్లా వేళ్లా బతిమిలాడుకుని ఈ యుద్ధం ఆపుకోవ‌ల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు. కార‌ణం ఏంటంటే ఖ‌తార్ రాజ‌ధాని దోహా ఔట్ స్క‌ర్ట్స్ లో 60 ఎక‌రాల్లో 1996లో స్థాపించిన అల్ ఉదీద్ అనే   సైనిక స్థావ‌రంపై ఇరాన్ గురి చూసి కొట్ట‌డ‌మేన‌ట‌. ఉండే వాడు ఉండ‌కుండా మొన్న గ‌త ఇర‌వై ఏళ్ల‌లో ఏ అధ్య‌క్షుడూ  వెళ్ల‌ని విధంగా ఇక్క‌డి  సైనికుల‌ను వెళ్లి క‌లిసి వ‌చ్చారు ట్రంప్.  సుమారు 12 రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మ‌ధ్య బీభ‌త్స‌మైన యుద్ధం. అది ఎంత‌గా ఉంటే ఇజ్రాయెల్ రోజుకు 2400 కోట్లు ఖ‌ర్చు చేసి మ‌రీ చేస్తోన్న యుద్ధం. నిజంగా అమెరికా డైరెక్ట్ ఎంట్రీ లేకుంటే ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగేది కాదేమో. త‌న బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబ‌ర్ల‌తో ఇరాన్ అణు శుద్ధి  కేంద్రాల‌పై దాడులు చేసి  నానా హంగామా చేయ‌డం యూఎస్ కి ఎంత చేటు తెచ్చిందంటే.. ఇరాన్ టార్గెట్ ఇటు తిరిగేంత‌.  అప్ప‌టికీ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ స‌ల‌హాదారు అలీ అక్బ‌ర్ అంటూనే ఉన్నాడు అమెరికాకు ప్ర‌తీకార దాడులు త‌ప్ప‌వ‌ని. అన్న‌ట్టుగానే ఖ‌త‌ర్ లోని యూఎస్ సైనిక స్థావ‌రం మీద బాంబుల వ‌ర్షం కురిపించారు. అందులో యూఎస్ మాత్ర‌మే కాదు యూకే ఇత‌ర విదేశీ విమానాలెన్నో ఉంటాయి. అంతేనా  ఏకంగా ప‌ది వేల మంది సైనికులు ఇక్క‌డ ఉంటారు. అంత పెద్ద ఎయిర్ బేస్ అది. సెప్టెంబ‌ర్ లెవ‌న్ అటాక్స్ త‌ర్వాత ఇక్క‌డి నుంచి ఆఫ్గ‌న్ తాలిబ‌న్లు, అల్ ఖైదా కార్య‌క‌లాపాల‌ను కంట్రోల్ చేస్తూ వస్తోంది అమెరికా.  దీంతో పాటు బ‌హ్రెన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్దాన్, కువైట్, సౌదీ సిరియా అంటూ 8 స్థావ‌రాలుండ‌గా.. వీట‌న్నిటిలో క‌లిపి సుమారు 50 వేల మంది  సైనికులుంటారు.. వీటిలో ఖ‌తార్ చాలా చాలా  కీల‌కం. దీని ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నియంత్రిస్తూ ఉంటుంది అమెరికా. వీట‌న్నిటికి తోడు ఇది ఇరాన్ కి కేవ‌లం 190 కిలోమీట‌ర్లు మాత్ర‌మే. ఇక్క‌డ కొడితే ఫ‌స్ట్ అందులో ఎన్ని విమానాలను కొట్టింది.. ఎంద‌రు సైనికుల‌ను చంపార‌న్న విష‌యం అటుంచితే.. అస‌లీ స్థావ‌రాన్ని టార్గెట్ చేయ‌డంతో అమెరికా పేరు యుద్ధ మార్కెట్లో    మ‌ట్టికొట్టుకుపోతుంది. మొన్న భార‌త్- పాక్ యుద్ధం ఆప‌డంలో కూడా స‌రిగ్గా ఇదే స‌మ‌స్య‌. త‌మ ఎఫ్- 16లను భార‌త్ అవ‌లీల‌గా దాడి చేసేస్తుంద‌న్న మాట మార్కెట్లో వినిపిస్తే ఇంకేమైనా ఉందా? అది త‌మ ఆయుధ వ్యాపారం మొత్తాన్ని కుప్ప కూల్చేస్తుంది. అందుకే ఈ యుద్ధం విష‌యంలోనూ.. ట్రంప్ వెంట‌నే అలెర్ట్ అయ్యి.. అప్ప‌టి వ‌ర‌కూ బీరాల‌న్నిటినీ తూచ్ అనేశారు. కాల్పుల విర‌మ‌ణ‌కు ర‌మ్మంటూ ఇరాన్ని బ‌తిమ‌లాడుకున్నారు. ఈ విష‌యం ఇరాన్ యంత్రాంగం చెబుతోంది. అందుకే తాము కాల్పుల విర‌మ‌ణ చేసుకున్నామ‌ని అంటోంది. మొన్నే ఈ స్థావ‌రాన్ని సుమారు 8 బిలియ‌న్ డాల‌ర్ల‌తో అప్ గ్రేడ్ చేసిన‌ట్టు చెబుతుంది వాషింగ్ట‌న్ కి చెందిన ద హిల్ అనే ప‌త్రిక‌. ఇపుడా డ‌బ్బు మొత్తం మంట గ‌ల‌వ‌డంతో పాటు.. త‌మ దేశ ప‌రువు అమాంతం పోతుంది. దీంతో ప‌రిస్థితి అర్ధం చేసుకున్న ట్రంప్.. ఇరాన్ తో ఒక స‌యోధ్య‌కు వ‌చ్చారు. ఈ దిశ‌గా ట్రూత్ అనే సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ పెట్టారు. పోస్టు పెట్టిన ఆరు గంట‌ల‌కు ఇరాన్ ఇజ్రాయెల్ రెండూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తాము వ‌చ్చిన‌ట్టు అంగీక‌రించాయి. ఇందులో ఇజ్రాయెల్ అంటున్న మాట ఏంటంటే.. త‌మ ఆప‌రేష‌న్ రైజింగ్ ల‌య‌న్ మిష‌న్ కంప్లీట్ అయ్యింది. ఇరాన్ సైనిక నాయ‌క‌త్వంతో పాటు లేటెస్టుగా మ‌రో అణు సైంటిస్టును కూడా హ‌త‌మార్చాం అంటోంది. దీంతో తాము హ్యాపీ అన్న‌ది ఇజ్రాయెల్ అంటోన్న మాట‌. ఈ ప‌న్నెండు రోజుల యుద్ధం ద్వారా తాము సుమారు 25 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసినా.. అందుకంటూ ఒక ప‌ర‌మార్ధం ఉందంటోంది. ఇజ్రాయెల్ వ‌ర‌కూ ఓకేగానీ.. ఇప్పుడు అమెరికా సిట్యువేష‌నే మ‌రీ దారుణంగా త‌యారైంది. అమెరికా వ‌దిలిన బాంబుల ద్వారా ఇరాన్ కోల్పోయిందేమీ లేదు. పైపెచ్చు 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఇరాన్ ద‌గ్గ‌ర ఎంతో సేఫ్ గా ఉంది.  దీంతో ప‌ది అణు బాంబుల త‌యారీ చేయ‌వ‌చ్చ‌ని  తెలుస్తోంది. అయినా స‌రే అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ చేస్తోన్న కామెంట్ ఏంటంటే.. మ‌ళ్లీ  ఇరాన్ అణ్వాయుధ తయారీ చేస్తే అత్యంత శ‌క్తిమంత‌మైన అమెరిక‌న్ ఆర్మీ ప్ర‌తాపం చ‌వి చూడాల్సి వ‌స్తుంద‌ని. ఇక్క‌డ ఎవ‌రు ఎవ‌రికి ప్ర‌తాపం  చూపించారో.. అంద‌రూ చూశారంటూ కొంద‌రు కామెంట్లు చేయ‌డం క‌నిపిస్తోంది.

జగన్ కు ప్రాణహాని లేదు.. కోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ

తనకు ప్రాణహాని ఉందనీ, అదనపు భద్రత కావాలని గగ్గోలు పెడుతున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల్లోని డొల్లతనం కేంద్ర హోంశాఖ తేటతెల్లం చేసింది. పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎటువంటి ప్రాణహానీ లేదని కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టుకు తెలిపింది. జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక నివేదిక సమర్పించింది.  ఆ నివేదికలో జగన్ కు ఎలాంటి ప్రాణహాని కానీ, ముప్పు కానీ లేదని పేర్కొంది. ఈ మేరకు ఆ నివేదికను డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఏపీ హైకోర్టుకు నివేదించారు.  తనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రతను పునరుద్దరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించాలని ఆ పిటిషన్‌లో జగన్ కోరారు. జగన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే 58 మందితో జగన్‌కి జడ్‌ప్లస్ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు. ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వ న్యాయవాదిపేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశిం చింది. కాగా ఈ కేసు విచారణ జులై 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. 

ఎమర్జెన్సీ చీకటి రోజులపై బిజెపి అవగాహన సదస్సులు

  దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తియన సందర్భంగా నాటి చేదు ఘటనలు, ఆ చీకటి రోజులపై నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా బుధవారం (జూన్ 25) అవగాహన సదస్సులు నిర్వహించనుంది.  దేశం లో  ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్  ఇష్టానుసారం గావ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందనీ,   ఎమర్జెన్సీ పేరుతో  కాంగ్రెస్ వ్యవహరించిన నియంతృత్వ ధోరణులను, నాటి అమానుష ఘటనలను నేటి యువతరానికి  తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది.   21 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ కాలంలో లక్షలాది మంది జైళ్ల పాలయ్యారనీ, అసలు దేశమే ఒక జైలుగా మారిపోయిందనీ ఆ పార్టీ పేర్కొంది. ఎమర్జెన్సీ కాలంలో   ప్రశ్నించిన ప్రతి ఒక్కరు జైలు పాలయ్యారని బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఏలూరులో జరిగే అవగాహన సదస్సుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్, అలాగే పాలకొల్లులో జరిగే సదస్సుకు రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిథి భువనేశ్వర్హాజరౌతారని తెలిపారు. అలాగే తిరుపతి సదస్సు కు , ఎంపీ అపరాజిత సారంగి ముఖ్య అతిథి గా హాజరౌతారు.