ఇందిరను తాకిన ఎన్టీఆర్ ప్రభం‘జనం’

రామన్న శకం రానున్న శకం చైతన్య రథం సరి కొత్త పథం జన చిత్త రథం నెరవేర్చుటకై గురువేష పథం తెలుగు కీర్తి పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడిన రోజు.. రాజభవంతులను వీడి రాజకీయం పేడవాడి పూరిగుడిసెను చేరిన రోజు.. అదే తెలుగుదేశం పార్టీ తొలి సారి ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన రోజు.. అదే జనవరి 9, 1983. మూడున్నర దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో  ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ ను గద్దె దించి  తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలను చేపట్టిన రోజు జనవరి 9.   ఔను నాలుగు దశాబ్దాల కిందట ఇదే రోజున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత తొలిసారిగా కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ముఖ్యమంత్రిగా నాడు ఎన్టీఆర్ కొత్త చరిత్ర లిఖించారు. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్బావమే ఒక చరిత్ర, ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే అధికార పగ్గాలు చేపట్టడం మరో చరిత్ర. పార్టీ ఆవిర్బావం తరువాత ఆయన చేపట్టిన చైతన్య రథ యాత్ర చరిత్ర ఎన్నటికీ మరువని మహోన్నత చరిత్ర. 19 రోజుల పాటు ఎండ, వాన, రాత్రి, పగలు తేడా లేకుండా ఆయన రాష్ట్రం మొత్తం చుట్టేశారు. జనంతో మమేకమైపోయారు. అయితే అప్పట్లో అధికార మదంతో ఉన్న కాంగ్రెస్ ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తక్కువగా అంచనా వేసింది. అయితే ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. ఎన్నికలకు   రోజుల ముందు అంటే 1983, జనవరి 3న తిరుపతిలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల ప్రచార సభ జరిగింది. అదే రోజు అదే తిరుపతిలో ఎన్టీఆర్ ఎన్నికల సభ కూడా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాగాంధీ సభ అయితే సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ సభ. తొలుత ఇందిర సభకు జనం భారీగా హాజరయ్యారు. అయితే ఇందిర ప్రసంగిస్తుండగా..ఎన్టీఆర్ తిరుపతి చేరుకున్నారన్న సమాచారం వచ్చింది. అంతే నిముషాల్లో ఇందిర సభ ఖాళీ.. అమె ప్రసంగం అర్ధంతరంగా ఆపేసి వెళ్లిపోయారు. ఆమె వెళుతున్న హెలికాప్టర్ ఎన్టీఆర్ సభ మీదుగానే వెళ్లింది. అప్పుడు కానీ.. ఎన్టీఆర్ ప్రభజనం ఏమిటన్నది ఆమెకు అవగతం కాలేదు. అప్పుడు అర్దమై చేయగలిగిందేమీలేదు. అప్పటికే తెలుగుదేశం విజయం ఖరారైపోయింది. అదే  ఫలితాల్లో తేటతెల్లమైంది.  పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికార పగ్గాలు అందుకుని ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ప్రజా సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార వేదికపైనే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఫైలుపై సంతకం చేసి పేదవాడి అన్నంగిన్నెగా మన్ననలు అందుకున్నారు.  

చంద్రబాబుతో పవన్ భేటీ వెనుక ఆర్ఎస్ఎస్?!

రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ వెనుక అసలు కారణమేమిటన్న ప్రశ్నకు అనూహ్యమైన సమాధానం పరిశీలకుల నుంచి వస్తున్నది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ కలవడం వెనుక ఉన్నది ఎవరన్న దానికి ఆర్ఎస్ఎస్ అన్న సమాధానం వస్తోంది. అసలు గత కొంత కాలం నుంచీ ఏపీలో అధికార వైసీపీ ఆగడాలను అడ్డుకోవడానికి, అరాచకాలను ప్రశ్నించి ఎదుర్కొనడానికి ఐక్య పోరాటం అవసరమన్న భావన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ చంద్రబాబుల భేటీకి అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఇంత కాలం ఎవరికి వారుగా ప్రజా క్షేత్రంలో జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ఇరు పార్టీల అధినేతలూ భేటీ అవ్వడాన్ని, రాష్ట్రంలో పరిస్ధితులపై మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని ఇరు పార్టీల శ్రేణులూ కూడా స్వాగతిస్తున్నాయంటేనే రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత అవగతమౌతుంది.  అయితే మరో వైపు జగన్ పూర్తిగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు దాసోహం అయిపోయారు. బీజేపీ అధినాయకత్వం తానా అంటే తందానా అంటున్నారు. అందుకు కారణమేమిటంటే.. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ తన దుర్మార్గ పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అయితే మరొక్క చాన్స్ తనకు దక్కితే ఇక ఎదురే ఉండదన్న భావనతో ఉన్నారు. 2024 ఎన్నికలలో అధికారాన్ని నిలుపుకోగలిగితే.. ఆ తరువాత ఎన్నికల సమయానికి చంద్రబాబు వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉండదన్నది జగన్ భావన. అందు వల్ల ఈ సారికి ఎలాగైనా అధికారం నిలుపుకుంటే.. ఇక తిరుగుండదన్న భావనలో ఉన్నారు. అందుకే ఇటీవల సమీక్షల్లో కూడా ఆయన పార్టీ శ్రేణులకు ఇదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తే ముఫ్ఫై ఏళ్ల పాటు మనదే అధికారం అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో మరో చాన్స్ మామూలుగా అయితే కష్టమన్న ఉద్దేశంతో ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ ను శరణు జొచ్చారు. మోడీ సర్కార్, బీజేపీ అండతో రానున్న ఎన్నికల గండాన్ని దాటేస్తే.. రాష్ట్రంలో ఇక ఎదురుండదు కనుక అప్పుడు అవసరమైతే రాష్ట్రలో తన వల్ల ఇప్పుడు బలోపేతంగా కనిపిస్తున్న బీజేపీని నిర్వీర్యం చేయవచ్చని ఆయన యోచిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే.. బీజేపీ మెంటార్ గా చెప్పబడే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు.  రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ పోకడలు నచ్చని ఆర్ఎస్ఎస్ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీ విజయం సాధించకూడదన్న భావనకు రావడం వల్లనే తెలుగుదేశం, జనసేనల మధ్య సయోధ్యకు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ హిందుత్వ వ్యతిరేక పోకడలు, వైసీపీ హయాంలో  దేవాలయాలపై దాడులు, పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారం వంటి సంఘటనల పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉందని అంటున్నారు. అంతే కాకుండా.. తిరుమల పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా, ఒక ఆదాయవనరుగా భావిస్తూ..  కొండపై ఉన్న వసతి గృహాలలో రూము రెంట్  ను ఏకంగా ఒకేసారి రెండు రెట్లు అంతకంటే ఎక్కువగా పెంచడాన్ని కూడా ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది.  ఇంతవరకు  మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత వసతి గృహాల్లో రూ.500 నుంచి  రూ.600 వరకు ఉన్న గది అద్దెను ఒక్కసారిగా  రూ.1000కు పెంచేశారు. ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్  హౌస్‌ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. కార్నర్‌ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200కు పెంచారు. స్పెషల్‌ టైప్‌ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతో పాటు డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్‌ నగదుతో కలిపి రూ.3400 చెల్లించాల్సి ఉంటుంది.  ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అవసరాలకు మించిన ఆదాయం వస్తున్నా, కొండపై భక్తులకు కల్పించే సదుపాయాలుమెరుగుపరచడం గురించి పట్టించుకోకుండా, టీటీడీ ప్రధాన కర్తవ్యమైన   హిందూ ధర్మ ప్రచారం, జీర్ణ ఆలాయాల పునరుద్ధరణ, హిందూ ధార్మిక కార్యకలాపాల నిర్వహణకు తిలోదకాలిచ్చేసి తిరుమలను కేవలం ఒక ఆదాయ వనరుగా ఎంచి ఇష్టారీతిన  వసతి రెంట్ లను ఇష్టారీతిగా పెంచేయడాన్ని ఆర్ఎస్ఎస్ తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్రంలో  తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన ఒక్కటే మార్గమన్న భావనతోనే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనానితో ఉన్న పరిచయాలను పురస్కరించుకుని ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లేలా ప్రోత్సహించిందని చెబుతున్నారు. ఇరు పార్టీల మధ్యా సయోధ్య, అవగాహన తదితర అంశాలను పరిశీలించిన అనంతరం బీజేపీ స్టాండ్ ఏమిటన్నది తాము తేలుస్తామని ఆర్ఎస్ఎస్ పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే మొదట్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తాను అని చెప్పిన పవన్ కల్యాణ్ ఆ తరువాత స్టాండ్ మార్చుకున్నట్లు కనిపించినా ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో  వెనక్కు తగ్గి ఓటు చీలనివ్వనన్న స్టాండ్ ను పునరుద్ఘాటించారని చెబుతున్నారు. అందుకే చంద్రబాబుతో చర్చలలో ఇరు పార్టీల ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని అంటున్నారు.  జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటి దాకా వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలో పోరాడుతూ వచ్చినా ఇక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలన్న నిర్ణయానికి రావడం వెనుక.  జీవో నంబర్ 1 తో పాటుగా బీజేపీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు.

అటా ..ఇటా, బీజేపీ ఎటు?

భారతీయ జనతా పార్టీ ( బీజేపీ) దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న అతి పెద్ద రాజకీయ పార్టీ అని, ఆపార్టీ నాయకులు చెప్పే మాటల్లో ఎంతో కొంత నిజం ఉంటే ఉండవచ్చును. కానీ, దక్షిణాదిలో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్లో ఆ పార్టీకి ‘సూది’ మొనంత చోటు కూడా లేదు. ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి  0.5 శాతమో ఏమో ఓట్లు పోలయ్యాయి. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీజేపీకి రాష్ట్రంలో ఎక్కడా ప్రాతినిధ్యం అన్నదే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో బీజేపీ పోషించే పాత్ర ఆటలో అరటి పండు పాత్ర. అయినా రాష్ట్ర రాజకీయాల్లో కాషాయ పార్టీ మనుగడ సాగిస్తోందంటే అందుకు కేంద్రంలో ఉన్న అధికారమే కారణం. ఆ కారణంగానే, ఎలక్టోరల్ కాలేజీలో సింగిల్ ఓటు లేక పోయినా రాష్ట్ర పతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ముకు ఒక్క ఓటు బీరు పోకుండా నూటికి నూరు శాతం ఓట్లు పోలయ్యాయి. అధికార వైసీపీ,  ప్రతిపక్ష టీడీపీ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు రాష్ట్రపతి  ఎన్నికలలో బీజీపేకి జై కొట్టారు. అలాగే రాజ్యసభలో ఏపీ సభ్యులు  పార్టీలతో సంబంధం లేకుండా బీజేపీ అనుబంధ సభ్యులా  అన్నట్లుగా వ్యహరిస్తున్నారు. అలాగని వైసేపీ, టీడీపీ పార్టీలు బీజేపీ మిత్ర పక్షాలా అంటే, లేదు.  ఏపీలో అధికార, ప్రతిపక్షాలు రెండూ బీజేపీ మిత్ర పక్షాలు కాదు,  కానీ కాదనీ చెప్పలేము.  కారణాలు వేరు కావచ్చును కానీ, రాష్ట్రంలో 0.5 శాతం మాత్రమే ఓటున్న పార్టీకి 95 శాతానికి పైగా ఓటును షేర్ చేసుకునే అధికార ప్రతిపక్షాలు రెండూ,  ఏ ఫ్రిండ్ ఇన్ నీడ్ .. అన్నట్లుగా అవసరానికి స్నేహ హస్తాన్ని అందిస్తున్నాయి. అంతే కాదు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీ చెలిమిని రెండు పార్టీలు కోరుకుంటున్నాయి.ఇక ఏపీ రాజకీయాల్లో మూడో ప్రధాన పార్టీ జనసేన నేరుగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతానికి బీజేపీ మిత్ర పక్షంగా కొనసాగుతోంది. అయితే ఇది ఇంతవరకు ఉన్న పరిస్థితి..కానీ, ఆదివారం(జనవరి 8) తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ భేటీతో రాష్ట్ర రాజకీయాలలో,ముఖ్యంగా పొత్తులకు సంబందించి ఇంతవరకు ఉన్న అనుమానాలు చాలా వరకు తొలిగి పోయాయి. చాలా వరకు  క్లారిటీ వచ్చింది. తెలుగు దేశం, జనసేన మధ్య సీట్ల పంపకం వరకు పొత్తులు ఫైనలైజ్ అయినట్లు వస్తున్న ఉహాగానాల్లో నిజం వుందో లేదో కానీ, రెండు పార్టీలు, ఇద్దరు నేతల మధ్య పొత్తుకు సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన అయితే కుదిరిందని గట్టిగానే వినిపిస్తోంది. అయితే, ఇప్పడు బీజేపీ ఏమి చేస్తుంది, ఎటు వైపు మొగ్గు చూపుతుంది అనేది మరో మారు ఆసక్తికరంగా మారింది. నిజానికి, ఇంతకు  ముందే అనుకున్నట్లుగా ఏపీలో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేది లేదు. అయినా, అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని.. రక్తపాతం సృష్టిస్తారని ఇలాంటి పరిస్థితులు ఉండకూడదంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కీలకం అని టీడీపీ, జనసేన  సహా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కాగా, జగన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా,  జీఓ 1 తో  విపక్షాల కాళ్ళు చేతులు కట్టేసిన నేపధ్యంలో  కేంద్రంలో అధికారంలో ఉండడం అనే ఒకే ఒక్క కారణంతో బీజేపీ అవసరం ప్రతిపక్షాలకు వుందని, అందుకే ఆ విషయం చర్చించేందుకే  పవన్ కళ్యాణ్, చంద్రబాబును కలిశారని అంటున్నారు.భేటీ అనంతరం మీడియాతో  మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూడా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలు కలిసిరావాలని పిలుపు నిచ్చారు.చంద్రబాబుతో చర్చిన విషయాలను మా మిత్ర పక్షం ( బీజేపీ) నాయకులతోనూ చర్చిస్తానని చెప్పారు.  అయితే తెలుగు దేశం, జనసేన కూటమితో చేతులు కలిపేందుకు బీజేపీ అంగీకరిస్తుందా? అంటే, నిజానికి బీజేపీ ముందు మరో ఆప్షన్ లేదని అంటున్నారు. అంతేకాదు, పవన్ ద్వారా బీజేపీనే చంద్రబాబుతో రాయబారం నడిపిందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్’లో వినిపిస్తోంది. వైసీపీతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధాలు పొత్తులు పెట్టుకునే పరిస్థితి లేదు, వైసీపీ, సింహం సింగిల్ గానే వెళుతుందని, ప్రకటించింది. కాబట్టి   బీజేపీతో ప్రత్యక్ష పొత్తుకు అవకాశంలేదు  పరోక్ష పొత్తులే పెట్టుకోవాలి. అదే టీడీపీ అయితే రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధంగా వుంది. సో.. చివరాఖరుకి, 2014లో లాగా, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి  పోటీ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా అయితే వుంది.  2014లో  జనసేన  టీడీపీ, బీజేపీ కి మద్దతు మాత్రమే ఇచ్చింది. బరిలో దిగలేదు.  పోటీ చేయలేదు,, 2024లో బరిలో దిగుతుంది ..పోటీలో ఉంటుంది .. అదొక్కటే తేడా ముగిలినదంతా సేమ్ టూ సేమ్  అంటున్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం జనసేన విడాకులు ఇచ్చినా బీజేపీ ఒంటరిగానే వెళుతుందని, అంటున్నారు. అయితే, బీజేపే నిర్ణయం విషయం పక్కన పెడితే  చివరకు  టీడీపీ, జనసేన కలసి నడవడం మాత్రం ఖరారైందని, అందరూ అంటున్నారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ఆహ్వానితుల హాజరు అనుమానమే!

తెలంగాణ ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత  కల్వకుట్ల చంద్రశేఖర రావు, జాతీయ రాజకీయ ప్రస్థానంలో వడివడిగా అడుగులు వేద్దామనుకుంటున్నారు. అయితే కారణాలేవైనా ఆ అడుగులు తడబడుతున్నాయి. నిజం చెప్పాలంటే  కేసీఅర్, గత కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాల ప్రస్థానం గురించి ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తెరాస నాయకులు కుడా ఆయనకు వంత పాడుతున్నారు.   ఒకటి కాదని మరోటి వ్యూహాలు మారుస్తూ వచ్చారు. ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి, ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ ఇంకో ఫ్రంట్,  మరో  ఫ్రంట్  అంటూ రకరకాల ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలం కావడంతో    ఫ్రంట్ , టెంట్ ఆలోచనలను వదిలేసి కేసీఆర్  తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితిగా మార్చి  జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. మంచి ముహూర్తం చూసుకుని  దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర  కార్యాలయం కూడా ప్రారంభించేశారు. ఇక అక్కడ నుంచీ ఆయన జాతీయ రాజకీయ ప్రస్థానం మూడడుగులు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. ఢిల్లీలో బ్రహ్మాండమైన బహిరంగ సభ అన్నారు. ఏపీలోనూ సభలు నిర్వహిస్తామన్నారు. ఇంకా చాలా చాలా చెప్పారు. కానీ చివరకు బీఆర్ఎస్ తొలి మహాసభకు ఖమ్మం వేదికగా మారింది. అది కూడా కేవలం బీఆర్ఎస్ మహాసభగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం లేదు. ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం  చేసేందుకు అక్కడకు వెళుతున్న కేసీఆర్ పనిలో పనిగా బీఆర్ఎస్ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేశారు.   ఘనంగా హస్తిన వేదికగా నిర్వహించాల్సిన తొలి సభను స్వరాష్ట్రంలో అందునా ఖమ్మంలో ఏర్పాటు చేయడానికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర పార్టీల నాయకుల నుంచి ఆశించిన విధంగా మద్దతు రాకపోవడమేనని పరిశీలకులే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. అయితే కింద పడ్డా పైచేయి అనిపించుకోవాలని ఖమ్మం సభకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించామనీ, వారు వస్తున్నారనీ బీఆర్ఎస్ ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు వీరెవరు కూడా ఇంకా సభకు తమ హాజరుపై స్పష్టత ఇవ్వలేదని సమాచారం. వారి నుంచి సభకు వస్తున్నట్లు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదని అంటున్నారు.   గతంలో కూడా ఇక్కడ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రకటన సందర్భంలో కానీ, ఆ తరువాత అధికారికంగా బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి కానీ.. కర్నాటక మాజీ సీఎం వినా ఎవరూ హాజరైన దాఖలాలు లేవు. అలాగే ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగరంలో ఉండి కూడా ఢిల్లీ సీఎం హాజరు కాలేదు. ఆ కార్యక్రమానికి కూడా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు ఖమ్మం సభకు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంల హాజరుపై స్పష్టత లేదు. ఇక ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరైన వారిలో కొద్దో గొప్పో చెప్పుకోదగ్గ పేర్లు ఏమైనా ఉన్నాయంటే అవి కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రమే.   ఇక డిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి  పంజాబ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రైతు నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు హాజరైనా వారి వారి రాష్ట్రాలలో వారికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటన్నది తెలియదు.  దేశంలో రైతు నాయకుడిగా   గుర్తింపు ఉన్న తికాయత్ బీఆర్ఎస్ కార్యక్ర మాలకు దూరంగా ఉన్నారు. స్వాగత తోరణాల్లో కనిపించిన బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా  భారాస హస్తిన కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఖమ్మం సభకు హాజరయ్యేది ఎవరన్న విషయంలో సర్వత్రా సందిగ్దతే వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా జాతీయ రాజకీయాలంటూ ఆర్భాటంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి భారత్ చేర్చి కొత్త పార్టీని ఏర్పాటు చేసినా  ఆ కొత్త పార్టీ కూడా రాష్ట్రానికే పరిమితమైందా అన్న  అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

జోడో యాత్రలో జోష్.. ఆజాద్ కు షాక్ ?

కాంగ్రెస్ పార్టీతో ఉన్న 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని, సొంత కుంపటి పెట్టుకున్న, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాబ్ నబీ ఆజాద్  కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వెంట కాంగ్రెస్  చేయి వదిలి వచ్చిన 19 మంది నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 17 మంది నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వ్యక్తిగత కారణాలతో ఇద్దరు నేతలు రాలేకపోయారని.. త్వరలో వారు కూడా కాంగ్రెస్‌లో చేరతారని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఒకప్పుడు కాంగ్రీస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన గులాం నబీ ఆజాద్ 2019 ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ అధిష్టానంపై తిర్గుబాటు జెండా ఎగరేసిన  జీ 23లో కీలక భూమిక పోషించారు.  ఇంచుమించుగా రెండు సంవత్సరాలకు పైగా అసమ్మతి. గళం వినిపించిన ఆజాద్, మూడు నెలల కిందట  కాంగ్రెస్ పార్టీని వీడి తమ స్వరాష్ట్రం జమ్మూ కశ్మీర్ లో  డెమొక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ(డీఏపీ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే  మాజీ మంత్రులు, మరి కొందరు  ముఖ్య నేతలు ఆయన వెంట కాంగ్రెస్ కు గుడ్బై చెప్పారు.  డీఏపీలో చేరారు. అయితే, గులాం నబీ వెంట వెళ్ళిన నేతలందరు తాజాగా గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా సొంత గూటికి చేరారు. అజాద్ వెంట వెళ్ళిన 19 మంది ముఖ్య నేతల్లో 17 మంది స్వగృహ ప్రవేశం చేశారు. మరో ఇద్దరు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని నాయకులు అంటున్నారు. సొంతగూటికి తిరిగొచ్చిన వారిలో  జమ్మూ కాశ్మీర్‌ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్‌, పీసీసీ మాజీ అధ్యక్షుడు పిర్జాదీ సయీద్‌ కూడా ఉన్నారు. అదలా ఉంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో ప్రవేశించనున్న సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామం  హస్తం పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. కాగా  రాహుల్ గాంధీ  భారత్‌ జోడో యాత్ర మరో రెండు వారాల్లో జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించనున్న సమయంలో ఈ చేరికలు జరగడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర విజయవంతం అయిన నేపధ్యంలో పార్టీని వీడిన నేతలందరూ తిరిగి పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ నేతలందరూ 2 నెలల పాటు కాంగ్రెస్‌ సెలవుల్లోకి వెళ్లినట్లు భావిస్తాం. ఇది ఆరంభం మాత్రమే. జమ్మూ కాశ్మీర్‌లోకి యాత్ర ప్రవేశించాక మరిన్ని చేరికలు ఉంటాయి  అని కేసీ వేణుగోపాల్ అన్నారు. నిజానికి, గులాం నబీ అజాద్ కూడా తిరిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని వార్తలు వచ్చినా, అజాద్ ఆ వార్తలను ఖండించారు. అయితే భారత్ జోడో యాత్రలో ఆజాద్ పాల్గొనే అవకాం లేక పోలేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. అదలా ఉంటే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న జమ్మూ కశ్మీర్ లో భారత్ జోడో యాత్రకు నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్డుల్లా, పీడీపీ అగ్ర నాయకురాలు, మరో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా ఇతర చిన్న చితక ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతు నిస్తున్నాయి. మరోవంక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు వచ్చింది. ఈ యాత్ర రెండు రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో అడుగుపెట్టనుంది. ఆక్కడి నుంచి జమ్మూ కశ్మీర్‭లో ప్రవేశించి, జనవరి 26 కు ముగుస్తుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరుకూ సాగుతున్న ఈ యాత్ర అనంతరం, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మరో యాత్రకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ యాత్ర రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీ వాద్రా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

నడి సంద్రంలో కాంగ్రెస్.. రాహుల్ గట్డెక్కించేనా?

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ గత రెండు పర్యాయాలుగా సార్వత్రిక ఎన్నికలతో ఓటమితో ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. ఒకప్పుడు ఎదురు లేని అధికారం అనుభవించిన ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికలలో గెలుపు అంటేనే  మరిచిపోయిన పరిస్థితిలో పడింది. యావద్దేశంలో కేవలం మూడంటే మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. ఆ పార్టీ ప్రస్తుత  దుస్థితికి కారణాలేమిటన్నది పక్కన పెడితే.. కాంగ్రెస్ అంటేనే గాంధీలు.. గాంధీలంటేనే కాంగ్రెస్ అన్నట్లుగా ఆ పార్టీ గుర్తింపు పరిమితమైంది. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి చేపట్టినా గుర్తింపులో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. అందుకే ఇప్పుడు కూడా పార్టీని అధికారంలోకి తీసుకు రావాలంటే.. ఆ పని చేయగలిగిన వ్యక్తి కేవలం రాహుల్ గాంధీ మాత్రమేనని ఆ పార్టీ యావత్తూ  భావిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణగా సల్మాన్ ఖుర్షీద్ వంటి వారు నిత్యం గాంధీ కుటుంబ నామస్మరణ  చేస్తూ, ఖర్గేను ఖాతరు చేయకపోవడమే.  ఇది ఖర్గేతో సహా మనందరికీ తెలిసి బహిరంగ రహస్యమే. పైగా ఖర్గేది  కేవలం  అలంకారప్రాయమైన అత్యున్నత పదవి మాత్రమే. గాంధీ కుటుంబ వీర విధేయతకు దక్కిన నామమాత్రపు బహుమానంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఏకైక హోప్, ఆ పార్టీ ముఖచిత్రం, ప్రధాని అభ్యర్థి ఎవరంటే.. సందేహాలకు తావు లేకుండా అందరూ చెప్పే పేరు రాహుల్ గాంధీ.  ఈ విషయాన్ని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు కమలనాథ్ ప్రకటించేశారు కూడా.  పైగా కాంగ్రెస్ తో కూటమి కట్టే పార్టీలు ముందుకు వస్తే విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి కూడా రాహుల్ గాంధీనే అంటూ ఇంకా పొత్తు చర్చలు ప్రారంభంకాకుండానే కమల్ నాథ్ కుండ బద్దలు కొట్టేశారు.  పార్టీలో కొత్త జోష్ నింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. అధ్యక్ష స్థాయి కంటే తక్కువ పదవిలో ఇమడని, ఇమడలేని ఇమేజ్ ఉన్నపార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు  పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ సీడబ్ల్యూసీ లో శాశ్వత సభ్యులుగా నియమించే యోచన చేస్తోంది. అలా చేయడం ద్వారా  వారి నిర్ణయాలను పార్టీ శిరోధార్యంగా మోసే అవకాశం లభిస్తుందన్నది పార్టీ హైకమాండ్ (అంటే మరేదో బ్రహ్మ పదార్దంకాదు. గాంధీ కుటుంబమే.)  ఉద్దేశం. అలా అయితేనే ఉత్తరోత్తరా పార్టీలో ఎలాంటి పరిణామాలు సంభవించినా సోనియా, రాహుల్ స్థానాలకు, హోదాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉంటుంది.  వచ్చే నెల అంటే ఫిబ్రవరి 24-26 తేదీల్లో రాయపూర్ లో జరిగే కీలక ప్లీనరీ సమావేశాల్లో మల్లికార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగిస్తున్నట్లు పునరుద్ఘాటిస్తూ ప్రకటించనుంది. అలాగే పార్టీకి సంబంధించిన పొలిటికల్, ఎకనామిక్, ఇంటర్నేషనల్ అఫైర్స్, వ్యవసాయ, రైతు, , సామాజిక న్యాయ,  విద్య, ఉపాధి  వంటి అంశాలపై పార్టీ విధానాలను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈ ప్లీనరీ వేదికగానే పార్టీ  సమర శంఖారావం మోగించే అవకాశం ఉంది.  మూడు రోజులపాటు సాగే 85వ ప్లీనరీ సమావేశాలు పార్టీకి సరి కొత్త దశ-దిశను నిర్దేశిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీడబ్ల్యూసీని కాంగ్రెస్ అధ్యక్షుడే నామినేట్ చేస్తారు, ఒకవేళ ఎన్నికలు అనివార్యం అనుకుంటే ఈ ప్లీనరీలోనే దానిని కూడా మమ అనిపించేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సాధారణంగా ఉండేది.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, 23 మంది ఇతర సభ్యులు..వీరిలో 12 మందిని ఏఐసీసీ ఎంపిక చేసుకుంటుంది. మిగతావారిని పార్టీ అధ్యక్షుడే నామినేట్ చేసి అపాయింట్ చేస్తారు. ఓవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కు బహుళ జనాదరణ లభిస్తోంది. రాహుల్ కు ఆదరణ, అభిమానం పెరుగుతోంది. మరోవైపు ఈమధ్య కాలంలో మొట్టమొదటిసారి పార్టీపై యువకుల్లో, సెలబ్రిటీల్లో సానుకూలత లభిస్తోంది. అది కూడా రాహుల్   పాదయాత్ర వల్లే.  దీంతో తన పాదయాత్రను కొనసాగిస్తూ భారత్ జోడోయాత్ర 2.0 ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేలా   రాహుల్  ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని అంటున్నారు. దీంతో వచ్చే ఏడాది ఎన్నికలు సమీపించే వరకూ రాహుల్ ప్రజల మధ్యే ఉండేలా కార్యాచరణ రూపొందుతోందని చెప్పొచ్చు.  మొత్తం మీద కాంగ్రెస్ ను ఒడ్డుకు చేర్చాలంటే ఆ పార్టీకి ఉన్న ఏకైక హోప్ రాహుల్ మాత్రమే. జోడో యాత్ర ద్వారా తనకు లభిస్తున్న ఆరణను రాహుల్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వీలుగా మలచు కుంటారా అంటే వేచి చూడాల్సిందే అన్న సమాధానమేవస్తుంది.

భారత్ జోడో యాత్ర.. ఆల్ వుమెన్ వాక్

కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సోమవారం (జనవరి 9) అందరూ మహిళలే పాల్గొననున్నారు. ప్రస్తుతం రాహుల్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం (జనవరి 9) సాగుతున్నఈ యాత్రలో అందరూ వహిళలేప పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో రాహుల్ జోడో యాత్రకు భారీ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే యాత్రలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలన్నలక్ష్యంతో ఆల్ వుమెన్ వాక్ చాప్టర్ ప్రారంభించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. గత ఏడాది నవంబర్ 19న ఇందిరాగాంధీజయంతి సందర్బంగా కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కేవలం మహిళలు మాత్రమే నడిచిన సంగతి విదితమే. అలాగే గత ఏడాది డిసెంబర్ లో మహిళా శశక్తిదివస్ సందర్బంగా కూడ రాహుల్ లో కలిసి యాత్రలో కేవలం మాత్రమేపాల్గొన్నారు. ఇలా ఉండగా గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ జోడో యాత్ర ఈ  నెల 30న శ్రీనగర్ లో ముగియ నుంది.   

బీజేపీలో చేరండి.. పాపాలు కడిగేసుకోండి.. త్రిపుర సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ వామపక్ష నేతలకు బహిరంగ ఆహ్వానం పలికింది. త్రిపుర సీఎం మాణిక్ సాహా ఈ ఆహ్వానం పలికారు. బీజేపీని పవిత్రమైన గంగానదితో పోల్చుకున్న ఆయన.. గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయనీ, అలాగే వామపక్షాల నేతలు బీజేపీలో చేరి వారి పాపాలన్నీ కడిగేసుకోవాలని ఆయన  అన్నారు. త్రిపుర ఎన్నికలకు ముందు మాణిక్ సాహా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఎన్నికల ప్రచార సభలో  ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికలలో కూడా బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని త్రిపురలో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను విశ్వసించే వారంతా పాపులేననీ, వారు తమ పాపాలను కడిగేసుకోవాలంటే బీజేపీలో చేరడం ఒక్కటే మార్గమన్న అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడిన మాటలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే ఆందోళనకు దిగుతామనీ, ఆయనను రాష్ట్రంలో తిరగనిచ్చేది లేదంటూ హెచ్చరిస్తున్నాయి.  

తెలంగాణ నుంచి లోక్ సభకు మోడీ?.. బీజేపీ కొత్త వ్యూహరచన?

తెలంగాణ అధికారమే లక్ష్యంగా  బిజెపి కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈనేపథ్యంలోనే   తెలంగాణ నుంచి ప్రధాని మోడిని ఎన్నికల బరిలోకి దింపేందుకు బిజెపి సన్నాహాలు చేస్తున్నట్టు ఆ పార్టీ శ్రేణుల సమాచారం. 2024 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని ప్రధాని నరేంద్ర ఇప్పటికే ఒక నిర్ణయానికి విచ్చారని చెబుతున్నారు. ఇందుకు  దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను ఆయన ఎంపిక చేసుకున్నట్టు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది.   ఇప్పటికే మోడీకి సేఫ్ నియోజకవర్గాలుగా తెలంగాణలోని రెండు లోక్ సభ స్థానాలను బీజేపీ ఎంపిక చేసినట్లు  ఆ పార్టీ ఎంపీ ఒకరు తెలిపారు. ప్రధాని మోడి స్వయంగా తెలంగాణ నుంచి ఎంపీగా బరిలోకి దిగటం ద్వారా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలగా మార్చుకోవచ్చని బీజేపీ అధినాయకత్వం ఈ కొత్త ప్రణాళికను సిద్దం చేసిందని తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రధాని పోటీచేసే నియోజకవర్గంపైన బిజెపి తుది నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని సమాచారం.  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే కాకుండా, కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ టార్గెట్. అదే సమయంలో ఈ మారు దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారం దక్కించుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోడి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారని చెప్పటం ద్వారా రాష్ట్రంలో పాజిటివ్ వేవ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది  బీజేపీ.  తెలంగాణ లో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు.. ఆ తరువాత 2024లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రధాని మోడీ తెలంగాణలో పోటీ చేసే అంశం పైన అధికారికంగా ప్రకటనకు బీజేపీ సిద్దం అవుతోంది.  దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి  సానుకూలత పెరుగుతుందని భావిస్తోంది. ప్రధాని మోడీ దక్షిణాదిన తమిళనాడు నుంచి పోటీ చేస్తారని ఇప్పటి వరకు ప్రచారం సాగింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణలోని రెండు లోక్ సభ స్థానాల పైన కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో రాష్ట్రంలోనే అతి పెద్ది లోక్ సభ నియోజకవర్గం.. మినీ ఇండియాగా చెప్పుకొనే మల్కాజిగిరి ఒకటి. రెండోది వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం అని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి చెప్పుకొనే స్థాయిలో ప్రజాదరణ ఉంది. సికింద్రాబాద్ బీజేపీకి అనుకూలంమైన స్థానంగా బీజేపీ చెప్పుకుంటోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మోడీ  పోటీ చేయడం ద్వారా దాదాపుగా గ్రేటర్ నగరంతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపైన ఆయన ప్రభావం బాగా ఉంటుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.  అలాగే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయటం ద్వారా ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ అనుకూలత తగ్గి.. బీజేపీకి లాభిస్తుందన్న యోచనా చేస్తున్నారు.  ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయితే, అసెంబ్లీ ఎన్నికల్లోనే అదే అనుకూలంగా మారుతుందని  బీజేపీ భావిస్తోంది. ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేసే అంశం పై  బీజేపీ ఎంపీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  

జగన్ కు బీఆర్ఎస్ బిగ్ షాక్!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బిఆర్ఎస్ బిగ్ షాక్  ఇచ్చిందా? రాష్ట్రంలోకి రెడ్ కార్పెట్ అంటూ వెల్ కం చెప్పినా.. బీఆర్ఎస్ వైసీపీకి భారీ నష్టం చేకూరే స్టాండ్ తీసుకుందా అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  ఏపీ నుంచి చేరికలతో రాష్ట్రంలో బిఆర్ఎస్ కార్యకలాపాలు  జోరందుకున్నాయి. ఏపీలో ఆ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్  తమ పార్టీ ఉద్దేశాలు, విధానాలు, లక్ష్యాలన వెల్లడించారు. ఆయన వెల్లడించిన అంశాలు వైసీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా మారాయి.   రాష్ట్రంలో మూడు రాజధాను వివాదంపై బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటన్నది  చంద్రశేఖర్ తేటతెల్లం చేశారు.  ఒక టీవీ ఇంటర్వ్యూలో చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తోట చంద్రశేఖర్ ప్రజాభీష్టాన్నేతాము శిరసావహిస్తామని చెబుతూ..  ప్రజల్లో అధిక శాతం మంది అమరావతిలోనే రాజధాని ఉండాలనుకుం టున్నారని, తమ పార్టీ ది కూడా అదే అభిప్రాయం అని స్పష్టం చేశారు. అమరావతికే బిఆర్ఎస్ మద్దతని కుండబద్దలుకొట్టినట్టు  బహిరంగంగా చెప్పారంటే, అధి  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్దేశమేనని వేరే చెప్పనవసరం లేదు.  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. మొదటి నుంచి ఇద్దరూ పరస్పర సహాకార ధోరణినే అవలంబిస్తున్నారు.  అయితే   రాజధాని విషయంలో మాత్రం అమరావతికే బిఆర్ఎస్ మొగ్గు చూపడంతో వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని విస్పష్టంగా తేలిపోయింది. ఏపీలోకి అడుగుసెట్టిన భారత రాష్ట్ర సమితి లక్ష్యం తెలుగుదేశం, జనసేన ఓట్లు చీల్చి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడమేనన్న ప్రచారం  ఇప్పటికే రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. తెలుగుదేశం, జనసేనతోపాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ.. తదితర పార్టీలన్నీ అమరావతి రాజధానికే మద్దతు పలుకుతున్నాయి. వైసీపీ మాత్రం కర్నూలు, విశాఖ, అమరావతి అంటూ మూడు రాజధానుల పాట పాడుతోంది.   దీనిపై ఆ పార్టీకి రాజకీయ పార్టీల నుంచే కాదు, ప్రల నుంచి కూడా ఎటువంటి మద్దతూ లభించ లేదు.   రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్యా పలు సమస్యలు ఇప్పటికీ అపరిష్కృ తంగానే ఉన్నాయి.    ఏపీకి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాకానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, పోలవరం ప్రాజెక్టు.. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు.. లాంటివన్నింటిపై కేసీఆర్ అభిప్రాయం ఏమిటనేది స్పష్టత రావడంలేదు. తెలంగాణ వైపు నుంచి చూస్తే ఈ ప్రాజెక్టులన్నీ వస్తే తెలంగాణ కన్నా ఏపీ ముందు వరుసలో నిలబడటానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా జాతీయ పార్టీ నేతగా చూస్తే ఒక రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. మూడు రాజధానులపై తన విధానాన్ని ప్రకటించిన బీఆర్ఎస్ మిగిలిన అంశాలపై ఏ స్టాండ్ తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిందే.

ప్రజ్ణా ఠాకూరు విద్వేష ప్రసంగం.. చర్య తీసుకోవాలంటూ మాజీ బ్యూరోక్రాట్ల లేఖ

నిత్యం వివాదాలలో నిలిచే బీజేపీ ఎంపీ ప్రజ్ణా ఠాకూర్ మరో సారి వార్తల్లో నిలిచారు. విద్వేష ప్రసంగాల విషయంలో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ వంద మందికిపైగా మాజీ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన సాధ్వీ ప్రజ్ణాసింగ్ కు ఎంపీగా కొనసాగే అర్హత లేదంటూ ఆ లేఖలో మాజీ బ్యూరోక్రాట్లు పేర్కొన్నారు.   ఆమెపై   లోక్ సభ ఎథిక్స్ కమిటీ ఆమెపై  చర్యలు తీసుకోవాలని ఆ బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. 103 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరటం కర్నాటక, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మలుపుగా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన బిజెపి ఎంపి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ గత ఏడాది డిసెంబర్ 25న  కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో హిందూ జాగరణ్ వేదిక ఆధ్వర్యంలో జరిగిన దక్షిణ ప్రాంతీయ విభాగం వార్షిక సదస్సులో   ప్రసంగిస్తూ తమను తాము రక్షించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నందున హిందూవులు  తమ ఇళ్లలో కత్తులకు పదును పెట్టుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే మాజీ బ్యూరోక్రాట్లు ఆమెపై చర్య తీసుకోవాలని కోరుతూ బహిరంగ లేఖ రాశారు. అంతకు ముందు కూడా పలుమార్లు సాధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 మేలో కర్నాటకలో హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన గాడ్సే జయంతి వేడుకలలో సాధ్వీ ప్రజ్ణాసింగ్ పాల్గొన్నారు. గాడ్సేకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడంటూ సాధ్వీ ప్రజ్ణాసింగ్ ఆ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ప్రధాని మోడీ ప్రజ్ణాసింగ్ వ్యాఖ్యలు ఎంత మాత్రం క్షమార్హం కాదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హిందువులు ఆయుధం పట్టాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మాజీ బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం  చేసిన వారిలో   కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ మాజీ కార్యదర్శి అనితా అగ్నిహోత్రి, రాజస్థాన్ మాజీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్ అహ్మద్, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎస్పీ ఆంబ్రోస్ , ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్,  ఐపీఎస్ మాజీ అధికారి ఎ.ఎస్. దులత్ తదితరులు ఉన్నారు.

జోషిమఠ్ కుంగిపోతోంది..అధికారికంగా ధృవీకరించిన కేంద్రం

ఉత్తరాఖండ్ లో అత్యంత పవిత్రమైన జోషీమఠం కుంగిపోతోందని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే భూమి కుంగిపోయి వందలాది ఇళ్లు బీటలు వారాయి. పట్టణంలోని జనం బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు. పట్టణం సింకింగ్ జోన్ లో ఉందని కేంద్రం ప్రకటించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.  ఇప్పటికే  కొన్ని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.   రిలీఫ్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హిమాలయ పట్టణమైన జోషిమఠ్   కుంగుబాటుకు గురై అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఇప్పటికే ఛమోలీ జిల్లా కలెక్టర్ హిమాన్షు ఖురానా గడప గడపకు వెళ్లి స్థానికులను కలుస్తున్నారు. చీలికలు వచ్చిన భవనాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జోషిమఠ్ లో 4,500 భవనాలుండగా వీటిలో 610 భవనాలు బీటలు వారాయి.వాటిలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు. మొత్తం సహాయక చర్యలను ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తోంది. సాధ్యమైనంత త్వరగా వారినందరినీ అక్కడి నుంచి తరలించాలని కేంద్రం భావిస్తోంది. 

టీటీడీ నిలువు దోపిడీ.. కొండెక్కిన గదుల అద్దె!

తిరుమల ఒక పవిత్ర పుణ్య క్షేత్రం. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ప్రతి రోజూ దేశం నలుమూల నుంచి ఇంకా మాట్లాడితే, ప్రపంచం నలుమూలల నుంచి  లక్షల్లో భక్తులు వచ్చి వెంకన్న దేవుని దర్శించుకుంటారు. కానుకలు సమర్పించు కుంటారు. భక్తులు పైసా పైసా కూడబెట్టి, ముడుపులు కట్టి భగవంతునికి సమర్పించుకునే రోజువారీ హుండీ ఆదాయమే లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం( 2022 మర్చి 1 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు) లో హుండీ ఆదాయం రూ.1000 కోట్లు ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. కానీ, గత మార్చి మొదలు నవంబర్ వరకు ప్రతి నెల రూ. 100 కోట్లకు తగ్గకుండా ఆదాయం వచ్చింది. మూడు నెలల ముందుగానే గత అక్టోబర్ నాటికే హుండి ఆదాయం వార్షిక అంచనా రూ. 1000 కోట్లను దాటేసింది. దీంతో టీటీడీ తన అంచనాలను సవరించింది. ఈ వార్షిక సంవత్సరంలో రూ. 1600 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తుందని భావిస్తోంది.ఇక తల నీలాలు మొదలు  లడ్డూ ప్రసాదం, ప్రసాదం కవర్ల వరకు, దర్శనం టికెట్లు,ఆర్జిత సేవల టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ఇంకెన్ని వందల వేల కోట్ల రూపాయలు ఉంటుందో ఆ వెంకన్నదేవునికే తెలియాలి. అయితే, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అవసరాలకు మించిన ఆదాయం వస్తున్నా, ఇందుకు అదనంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశం అంతటా స్వామి వారి పేరున ఉన్న స్థిరాస్తులు, భూములు, పంట పొలాలు నుంచి వచ్చే ఆదాయం, బ్యాంకు డిపాజిట్స్ పై వచ్చే ఆదాయం, ఇతరత్రా అనేక మార్గాల్లో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానము ( టీటీడీ) దాహం తీరడం లేదు.  అందుకే ఇప్పడు కొత్తగా, కొండపై ఉన్న వసతి గృహాలలో రూము రెంట్  ను ఏకంగా ఒకేసారి రెండు రెట్లు అంతకంటే ఎక్కువ పెంచారు. ఇంతవరకు  మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత వసతి గృహాల్లో రూ.500 నుంచి  రూ.600 వరకు ఉన్న గది అద్దెను ఒక్కసారిగా  రూ.1000కు పెంచేశారు. ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్  హౌస్‌ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. కార్నర్‌ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200కు పెంచారు. స్పెషల్‌ టైప్‌ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతో పాటు డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్‌ నగదుతో కలిపి రూ.3400 చెల్లించాల్సి ఉంటుంది.  నిజానికి, ఇంతలా ఆదాయం వస్తున్నా కొండపై భక్తులకు కల్పించే సదుపాయాలు ఏమైనా మెరుగు పరిచారా అంటే అదీ లేదు. నిజానికి, హిందూ ధర్మ ప్రచారం,రాష్ట్రంలో, దేశంలో జీర్ణ ఆలాయాల పునరుద్ధరణ, హిందూ ధార్మిక కార్యకలాపాలు నిర్వహించడం టీటీడీ ప్రధాన కర్తవ్యం. వైసీపీ  ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాబాయ్ ఎస్వీ సుబ్బారెడ్డి  చైర్మన్  గానియమించిన పాలక మండలి, హిందూ ధర్మ ప్రచారం కంటే, అడ్డగోలుగా ఆదాయం పెంచుకునేందుకు, అన్యమత ప్రచారానికి ఎక్కవు ప్రాధాన్యత ఇస్తోందని, భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు ఎన్నో మార్లు ఆరోపించాయి, అయినా, టీటీడీ పట్టించుకోలేదు. ప్రభుత్వం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. వెంకన్న దేవుని ఆదాయాన్నే కాదు ఏకంగా ఆస్తులను మింగేసే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలున్నాయి. నిజానికి అవేవీ ఆరోపణలు కాదు, దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులను కాపాడ లేక పోతున్నామనే సాకుతో చెన్నై తదిర నగరాలలో ఉన్న అస్తుల అమ్మకానికి టీటీడీ గుట్టుచప్పుడు కాకుండా తీర్మానం చేసింది, అయితే, ఇంతలోనే ఆ నిర్వాకం బయటకు పొక్కడంతో, హిందూ సమాజం అప్రమత్తమై ఆందోళను దిగడంతో, టీటీడీ వెనకడుగు వేసింది. నిజానికి, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి,  అయిన తర్వాత ఒక్క తిరుమలలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై ప్రత్యక్షంగా,పరోక్షంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి.గడచిన ముడున్నసంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వందల ఆలయాలను దుండగులు ద్వంసం చేశారు. అయినా ఇంతవరకు ఒక్కరి మీద అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మరో వంక ప్రభుత్వం అన్య మత ప్రచారకులు, పాస్టర్లకు నెల జీతాలు ఇచ్చి పోషిస్తోంది.   ఆ విషయాన్ని అలా ఉంచి, మరో మారు తిరుమల వసతి గదుల రెంట్  విషయానికి వస్తే, దేశంలో అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాలలో తిరుమల మొదటి స్థానంలో ఉంటుంది.కానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క టీటీడీ  మాత్రమే, వసతి వ్యాపారం చేస్తోంది. దేశంలోని ఇతర పుణ్య క్షేత్రాలలో ఉచిత సత్రాలు లేదా నామ మాత్రపు రుసుముతో ఆ మేరకు సదుపాయాలు కల్పించే వ్యవస్థలున్నాయే కానీ, ఇలా దొరికిన కాడికి దొరికినంత దోచుకునే దోపిడీ వ్యవస్థ, ఇంకెక్కడా లేదు. అందుకే టీటీడీ పుణ్యాన తిరుమమలో వసతి అనేది అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. కొండెక్కి కూర్చుంది. స్టార్ హోటళ్ల స్థాయిలో రూమ్ రెంట్లు పెంచేస్తున్నారు. అందుకే సామాన్యులు తిరుమల వచ్చేందుకే భయపడే విధంగా టీటీడీ వ్యవహరిస్తోందని, సామాన్య భక్తులు వాపోతున్నారు. నిజానికి, ఒక్క గదుల విషయమే కాదు, టీటీడీ, జగన్ రెడ్డి ప్రభుత్వం సంయుక్తంగా తిరుమలను ఒక వ్యాపార కేంద్రంగా మార్చేందుకు కుట్రలకు పలపడుతోందని అంటే   కాదనలేని విధంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. అదే మంటే .. ఇదేమని అడుగేవారు లేరు. అదే టీటీడీ ధైర్యం. కానీ, ఎవరు అడిగినా అడగక పోయినా, సమయం వచినప్పుడు అడగవలసిన వారే అడుగుతారు. వడ్డీతో  సహా వసూలు చేస్తారు .. ఓంనమో వేంకటేశాయ !

కారులో తిరుగుబాటు కారణం అదేనా?

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.ముఖ్యంగా,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో అనూహ్య పరిణామాలు అతి వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నిజానికి, పార్టీలో, ప్రగతి భవన్  లో ఏమి జరుగుతోందో ఎవరికీ  స్పష్టంగా ఎవరికీ ఏమీ తెలియక పోయినా ఏదో జరిగిపోతోందనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఓ వంక ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం, మరోవంక అడ్డం తిరిగిన, భారాస ఎమ్మెల్యేల బేరసారాల కేసు విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు ప్రగతి భవన్ తలుపులు తడుతుందో అర్థం కాని ఆందోళనకర పరిస్థితి. మరోవంక  ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పార్టీలో రీసౌండ్ చేస్తున్న అసమ్మతి... ఈ అన్నిటినీ మించి, బీఆర్ఎస్ ముహూర్త బలం మీద వ్యక్త మవుతున్న అనుమానాలు. బీఆర్ఎస్ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు.   బీఆర్ఎస్ ముహూర్త బలం సంగతి ఎలా ఉన్నపటికీ పేరు మార్పుతో తెలంగాణ సెంటిమెంట్ చేజారి పోతోందనే అందోళన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిథులను వెంటాడుతోంది. మరోవంక పార్టీ భవిష్యత్ తో పాటుగా పార్టీలో తమ  భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలోనే పార్టీలో అసంతృప్తి, అసమ్మతి మెల్లమెల్లగా బయటకొస్తున్నాయని అంటున్నారు. వీటన్నిటికీ తోడు ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న నేతలు.. సిట్టింగులకే సీట్లు అంటూ పార్టీ అధినాయకత్వం చేస్తున్న ప్రకటనలతో, పలువురు ఆశావహులు  పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవంక, లీక్ అవుతున్న సర్వే రిపోర్టుల  ప్రకారం పది మంది మంత్రులతో పాటుగా 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరని జరుగతున ప్రచారంతో పార్టీలో పక్క చూపులు చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపద్యంలో ఖమ్మం జిల్లాలో మొదలైన గులాబీ రివోల్ట్ ఇప్పుడు మెల్లమెల్లగా ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది.ఖమ్మం జిల్లాలో మాజీ  ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే తన అసంతృప్తిని బహిరంగంగానే బయట పెట్టారు. మరోవంక ఆయన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి, పొంగులేటి కాషాయ ధారణకు  ముహూర్తం వినా మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. అలాగే పొంగులేటి పార్టీ మారితే, ఆయనతో పాటుగా భద్రాద్రి జడ్పీ చైర్మన కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మన మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణకుమారి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మట్టా దయానంద్‌, కోట రాంబాబు, తెల్లం వెంకటరావు, ఎస్సీ కార్పొరేషన మాజీ చైర్మన పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటకు చెందిన జారే ఆదినారయణ సహా పెద్ద సంఖ్యలోనే  భారాస నాయకులు, కార్యకర్తలు బీజేపీ గూటికి చేరతారని అంటున్నారు. అందుకే పొంగులేటి పార్టీ మారడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన  భారస నాయకత్వం ఆయన  వెంట వెళ్ళేవారిని గుర్తించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెసుస్తోంది.  మరోవంక అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన భవిష్యత్ రాజకీయాలపై ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తన ఆత్మీయులు నిర్వహిస్తున్న సమావేశాలతో   బలాన్ని కూడగట్టుకుంటున్న ఆయన తన ప్రసంగాల్లో ఎక్కడా బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా మాట్లాడడంలేదు. కేసీఆర్‌ సహకారంతో చేసిన అభివృద్ధి చేశానని స్పష్టం చేస్తున్నారు. పాలేరు నుంచే పోటీకి సిద్ధంగా ఉన్న ఆయనకు బీఆర్‌ఎస్‌ ఏమేరకు ప్రాథాన్యమిస్తుందనేది అంతుపట్టడం లేదు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పాలేరు అభ్యర్థిత్వం ఇస్తే సరే.. లేదంటే కాంగ్రెస్ లేదా బీజేపీ  మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. తుమ్మల ప్రస్తుతానికి అయితే ఖచ్చితమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదని, ఆయన నిర్ణయం తీసుకుంటే, ఆయనకు అనుకూలంగా ఉన్న వైరా మాజీ ఎమ్మెల్యే మదనలాల్‌ సహా వేర్వేరు నియోజక వర్గాలకు చెందిన అసంతృప్త నేతలు, వారి అనుచరులు ఆయన వెంట నడిచే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే  జూపల్లి కృష్ణారావు కూడా త్వరలోనే కారు దిగడం ఖాయమంటున్నారు. నిజానికి, బయటకు వినిపిస్తున్న పేర్లు కొన్నే అయినా, భారాస నుంచి బయట పడేందుకు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా గులాబీ నేతలు పదుల సంఖ్యలో సిద్దంగా ఉన్నారని అంటున్నారు. అందుకే తెలంగాణ రాజకీయాలు ఎప్పడు ఏ మలుపు తిరుగుతాయో ...అంతు చిక్కడం లేదని అంటున్నారు.

కండువాలూ, ఖర్చులూ మావే .. బీఆర్ఎస్ బంపర్ ఆఫర్

అదిగో ఆ ..గుండాయన ... డబ్బులు ఎవరికీ ఊరికే రావు ...అన్నారు, కానీ, అది తప్పు. ఆయన ఏదో తెరాస కాలంలో ఉండి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఏమో,కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ జమానాలో పైసలే కాదు, పార్టీ పదవులు కూడా ‘ఫ్రీ’ గానే వస్తాయి. ఉచిత కడువాలు కప్పుకుంటే చాలు, ఖర్చులే కాదు, కావాలంటే ఎక్స్చేంజి, షేరింగ్ ఆఫర్లు, నజరానాలు అందుకోవచ్చును. అయితే అందుకు కొన్నికండిషన్స్ అప్లయ్ అవుతాయి. షరతులు వర్తిస్తాయన్న మాట.  అయితే అవేమీ మరీ అంత కఠిన షరతులు కూడా కాదు. మీరు అలనాటి లంకలో పుట్టిన రాక్షసులే అయినా ఫర్వాలేదు ... మీకు ఏపీలో కాసింత గుర్తింపు ఉంటే చాలు,అలాగే నాలుగైదు పార్టీలు మారిన అనుభవము ఉంటే అది అదనపు అర్హత అవుతుంది. అలాగే, పోటీ చేసిన ప్రతి ఎన్నికలో ఓడి పోయిన అనుభవము ఉంటే ఇక తిరుగే లేదన్న మాట ... అలాంటి వారి కోసం బీఆర్ఎస్ తలుపులు ఎప్పుడూ బార్లా తెరుచుకునే ఉంటాయి.   సరే .. ఇదంతా ఏదో కాసింత తికమకగా గందరగోళం వుంది కదూ. ఇక డైరెక్ట్’గా పాయింట్లోకి వచ్చేద్దాం.   తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి (భారాస) గా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్, బంగారు తెలంగాణ బాటలో దేశాన్ని ‘బంగారు భారత్’ గా అభివృద్ధి చేసే పవిత్ర ఆశయంతో అడుగులు వేస్తున్నారు కదా.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని సంకల్పించారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్’ మీద కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. సొంత రాష్ట్రం సంగతి తర్వాత చూసుకుందామని, ముందు పక్కరాష్ట్రం  ఏపీకి పార్టీ అధ్యక్షుడిని అప్పాయింట్ చేశారు. అలాగే, ఏపీలో పార్టీలో చేరేందుకు ముందుకొచ్చే వారి కోసం ఒక బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చారని అంటున్నారు. సహజంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరేటప్పుడు, మంది మర్బాలాన్ని వెంట తీసుకు వెళ్లేందుకు, పెట్రోల్ ఖర్చులతో పాటుగా అనుచరుల విందు వినోదాలకు చేతి చమురు వదిలించుకోవలసి వస్తుంది. కానీ, ఏపీ నుంచి బీఆర్ఎస్’లో చేరేవారి కోసం కేసీఆర్, చుక్క చేతి చమురు అవసరంలేని బంపర్ ఆఫర్ ప్రకటించారని అంటున్నారు. బీఆర్ఎస్ లో చేరే నాయకులు, ఇంటి గడప దాటి కాలు బయట పెట్టింది మొదలు తిరిగి ఇల్లు చేరే వరకు అన్ని సదుపాయాలు బీఆర్ఎస్ చూసుకుంటుంది. అంతే, కాదు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారికి  అతిధి మర్యాదలు చేయడంతో పాటుగా బరువైన గిఫ్ట్ పాకెట్స్ కూడా ఐచ్చి పంపుతున్నారని అంటున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ నుంచి మూడు పార్టీలు మారిన జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ మాజీ అధికారి పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రశేఖర్’ను ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నియమించారు.ఈ ముగ్గురు ఏపీ నుంచి హైదరాబాద్‌’ చేరుకొని, భారాస కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆ ముగ్గురు నాయకుల వెంట వారి అనుచరులు భారీగానే ‘లగ్జరీ’ కార్లలో తరలివచ్చారు. తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు, స్వాగత తోరాణాలు కట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఖర్చుకు వెనకాడకుండా భారీగా ఖర్చు పెట్టారు. నిజానికి ఈ ఘన స్వాగతాలు, అతిధి సత్కార్యాలు చూసిన  ఏపీలో ఎటూ కాకుండా ఉన్న రాజకీయ నిరుద్యోగులు, పొలో మంటూ బీఆర్ఎస్’లో చేరేందుకు పరుగులు తీస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందులోను ఉచితాలకు అలవాటు పడిన ప్రాణాలు కదా .. మందు మాకు మర్యాదలు ఉచితంగా వస్తుంటే ఎలా కాదనగలరు.. అయితే విందు వినోదాల కోసం పార్టీలో చేరే వారు, నిజంగా పార్టీ కోసం పనిచేస్తారా, అంటే అది వేరే విషయం అంటున్నారు పరిశీలకులు.

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. పొత్తుపై క్లారిటీ వచ్చేసినట్లేనా?

జగన్  పాలనను జన క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వ రాజ్యహింస, అణచివేత పతాక స్థాయికి చేరుకోవడంతో ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదలాలని నిర్ణయానికి వచ్చాయా? ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా? బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందా?  అంటే ఈ రెండు పార్టీల శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. ఏవో రెండు మూడు జిల్లాలు వినా దాదాపుగా అన్ని జిల్లాలలోనూ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు కూడా ఖరారైపోయాయని చెబుతున్నారు. ఈ ప్రచారానికీ, ఊహాగానాలకూ బలం చేకూర్చేలా జనసేనాని పవన్ కల్యాణ్ ఆదివారం (జనవరి 8)న హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు పార్టీల మధ్యా పొత్తు విషయంలో క్లారిటీ వస్తుందని అందరూ భావిస్తున్నారు.  ఇటీవల చంద్రబాబు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన సందర్భంగా జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డుకున్న తీరును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నా.. ఈ భేటీకి అంతకు మించి రాజకీయ ప్రాధాన్యత ఉందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలపై ఒక క్లారిటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. గతంలో పవన్ కల్యాణ్ ను ఆయన విశాఖ పర్యటన సందర్భంగా ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు చంద్రబాబు పవన్ కల్యాణ్ కు సంఘీ భావం తెలిపిన సంగతి విదితమే. ఇరు పార్టీలూ కూడా జగన్ దుర్మార్గ పాలన అంతం కావాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అంటూ  పవన్ కల్యాణ్ చాలా కాలం కిందటే రాష్ట్రంలో పొత్తుల చర్చకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచీ ఏపీలో రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒక దశలో బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీని కలుపుకుని ముందుకు సాగాలన్న ఉద్దేశాన్ని చాటిన పవన్ కల్యాణ్.. ఇటీవలి కాలంలో బీజేపీ కలిసి వచ్చినా లేకున్నా తెలుగుదేశంతో కలిసి సాగాలన్న ఉద్దేశాన్ని చాటుతున్నారు.    జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటి దాకా వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ వచ్చాయి. అయితే జీవో నంబర్ 1 రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. విపక్షాలు రాష్ట్రంలో సభలూ, సమావేశాలూ నిర్వహించడానికే వీల్లేకుండా చేస్తూ జారీ చేసిన జీవోతో ఇక కలిసి అడుగులు వేయాలన్న నిర్ణయానికి జనసేన, తెలుగుదేశం పార్టీలు వచ్చేసినట్లు పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సంఘీభావం తెలపడానికి ఆయన నివాసానికి వెళ్లడం తేటతెల్లం చేసింది.  ఇక ప్రస్తుతానికి వస్తే చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా జగన్ సర్కార్ దుర్మార్గ విధానాలు, విపక్షాలపై అణచివేత ధోరణిపై చర్చ జరిగిందని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఒక ఐక్య కార్యచరణతో ముందుకుసాగాలన్న అభిప్రాయం వీరి భేటీలో వ్యక్తమైందని అంటున్నారు.  ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వేర్వేరుగా చేస్తున్న పోరాటాన్ని ఇక ఐక్యంగా కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ భేటీలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్‌1పైనా చర్చ జరిగిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో వీరిరువురి భేటీకి ఎనలేని రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. 

అహంకారానికి పరాకాష్ట కుప్పం దుర్మార్గం

రాజకీయాల్లో బండ్లు ఓడలు,ఓడలు బండ్లు కావడం పెద్ద విషయం కాదు. అందుకు కళ్ళ ముందే కావలసినన్ని ఉదాహరణలున్నాయి. అధికారం అండ చూసుకుని తప్పులు చేసుకుంటూ పోయే పాలకులు ఏదో ఒక రోజున అందుకు మూల్యం చెల్లించక తప్పుదు. తనకు పుత్రభిక్ష పెట్టమని వేడుకున్న సోదరి సాత్వతికి ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీ కృష్ణ పరమాత్మ, శిశుపాలుని వంద తప్పుల వరకు క్షమించాడు. అయితే, అహంకారంతో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయాడు. భోజ రాజుల్ని చంపి, వసుదేవుడు యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని కూడా సంహరించాడు. కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రువు  భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని ఘోరాలు జరిగినా కృష్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. కానీ చివరకు ఏమి జరిగింది .. ధర్మరాజు ఆహ్వనం మేరకు ఆయన తలపెట్టిన రాజసూయ యాగానికి వచ్చిన శిశుపాలుడు చేయరాని చివరి తప్పు చేశాడు.తొలి అర్ఘ్యానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు చేసిన నిర్ణయాన్ని అహంకారంతో తూల నాడాడు .. గొల్లవాడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు క్రిష్ణుడిని మాట్లాడి అవమానించాడు. భీష్మ పితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశ పడితే భీష్ముడు వారిని వారించాడు. దీంతో  శ్రీకృష్ణుడు సభ నుద్దేశించి శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం ఇంతవరకు అతడి అపరాధాలను మన్నించాను. నేటితో నూరు తప్పులు పూర్తయ్యాయి, కాబట్టి సహనం వహించిన నేను ఈ మూర్ఖుడిని ఇప్పుడే శిరచ్చేధం ద్వారా సంహరిస్తా నని సుదర్శన చక్రం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. అది ద్వాపర యుగం నాటి  కథ.  ఇది కలియుగం. యుగం ఏదైనా కాలం ఏదైనా అహంకారంతో విర్రవీగే వారు ఎవరైనా చివరకు సిక్ష అనుభవించక తప్పదు. ముఖ్యంగా అధికారం శాశ్వతం అనుకుని విర్రవీగే పాలకుల తప్పులను  ప్రజలు ఎప్పటికప్పడు లెక్కిస్తూనే ఉంటారు. ఐదేళ్ళు వరకు పాలకుల తప్పులను భరిస్తారు .. మన్నిస్తారు.ఆ గీత దాటిన తర్వాత వేటు వేస్తారు. ఆంధ్ర ప్రదేశ్  లో ఇప్పుడుదే జరుగుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకున్న వైసీపీ ప్రభుత్వ వరసగా తప్పులు చేసుకుంటూ పోతోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం తప్పులు ఎప్పుడోనే గీతను దాటాయి .. ఇప్పుడు  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా చోటు  చేసుకున్న పరిణామాలు ప్రమాద స్థాయినీ దాటి పోయాయి. ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.   మూడున్నరేళ్ళలో టన్నుల కొద్దీ తప్పులు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పడు, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీఓ1, తెచ్చింది. ప్రతిపక్ష గళం వినిపించకుండా చేసేందుకు సభలు, సమావేశాలు, రోడ్ షో ల పై నిషేధం విధించి. ఇందులో భాగంగానే  కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలను అడ్డుకోవడమే కాకుండా, అవమానించింది.  పోలీసులు  చిత్రంగా చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా వినని విధంగా మహిళలు తమపై హత్యాయత్నం చేశారని కేసులు పెట్టారు. నిజానికి, ఇది శిశుపాలుడు చేసిన చివరి తప్పును మించిన దుర్మార్గం. బ్రిటిష్ కాలంలో కూడా పోలీసులు ఇంత దుర్మార్గానికి ఒడి కట్టలేదు. అందుకే, ఇప్పుడు ప్రజలు సుదర్శన చక్రం, ప్రజాస్వామ్య వజ్రాయుధం సిద్దం చేసుకుంటున్నారు .. ఎన్నికల  సుముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారు.

జగన్ సర్కార్ కి కేవీపీ వాతలు!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు పరిచయం అవసరం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత ‘ఆత్మ’ మిత్రుడు. కేవీపీకి వైఎస్సార్ తో ఉన్న  ‘ఆత్మ’ బంధం గురించి తెలియని వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉండరు. వైఎస్సార్ ను నడిపించిన వాడు కేవీపీ అన్నది అందరికీ తెలిసియన్ విషయమే. నిజానికి, వైఎస్సార్ తోనే కాదు, ఆయన కుటుంబంతోనూ కేవీకి  మిత్ర బంధాన్ని మించిన ఆత్మీయ బంధం వుందనేది అందరూ అనుకునే మాట. నిజానికి  వైఎస్సార్ ఆకస్మిక మృతి తర్వాత కూడా ఆ కుటుంబంలో, కుటుంబ రాజకీయాలలో కేవీపీ కీలక పాత్రే పోషించారు. అయితే ఎప్పుడైతే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కేవీపీ వైఎస్ కుటుంబానికి దూరమవుతూ వచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో సంబంధాలను కేవీపీ పూర్తిగా తుంచేసు కున్నారు. అయితే ఎందుకనో తెలియదు కానీ,  వైఎస్సార్   ఆప్తులు ఎవరూ జగన్ రెడ్డికి ‘ఆత్మీయులు’ కాలేక పోయారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా, కేవీపీ, గడచిన  మూడున్నరేళ్ళలో  జగన్ రెడ్డి పరిపాలన మంచి చెడుల గురించి పెద్దగా మాట్లాడింది లేదు. కానీ, ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సంస్తాగత మార్పులు జరిగి గిడుగు రుద్ర రాజు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కీవీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలన గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడున్నరేళ్ళలో జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన సుందర ముదనష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేవీపీ, ప్రధానంగా పోలవరం.. ప్రత్యేక హోదా అంశం పైన స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం,  బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ధర్మ పోరాటం చేసిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, జగన్ రెడ్డి ప్రభుత్వం, ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాలకు వదిలేసిందని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి చేయాల్సి ఉంటే అటు కేంద్రం..ఇటు రాష్ట్రం ప్రాజెక్టు విషయంలో సరైన వైఖరితో లేవని విమర్శించారు. పోలవరం నిర్వాసితులు నాలుగున్నర లక్షల మందికి జగన్‌ దారి చూపడం లేదని, కనీసం ప్రోత్సాహకాలు అందించలేని హీన, దీనస్థితిలో ఉన్నారని కేవీపీ అసహనం వ్యక్తం చేశారు. అంచనాలు ఎంతైనా కేంద్రమే పోలవరం పూర్తి చేయాలని కేవీపీ డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత వైఫల్యాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు  వివరించాలని సూచించారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే, ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు. కేంద్రం దయ మన ప్రాప్తం అన్నట్లుగా చేతులు ఎత్తేశారు.అయితే  చేతులు ఎత్తేయ లేదు, కాళ్ళు పట్టుకోలేదు అని చెప్పుకునేందుకో ఏమో, ప్రధానిని కలిసిన ప్రతీ సందర్బంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని తన వినతి పత్రంలో చేరుస్తున్నారు. అటు కేంద్రం పార్లమెంట్ వేదికగా ఇప్పటికే పలు మార్లు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ నేత కేవీపీ ఇదే అస్త్రాన్ని తెర మీదకు తెచ్చారు.అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని, జోడో యాత్ర సందర్భంగా  రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు  సూచించారు. అదెలా ఉన్నా, జగన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీవీపే గళం విప్పడం ఇప్పడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్  గా మారింది. నిజానికి కేవీపీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి వాతలు పెట్టడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజుల క్రితం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ జగన్ రెడ్డి ప్రభుత్వంపై కేవీపీ తీవ్ర విమర్శలు చేశారు.  ఏపీలో పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కేవీపీ వ్యాఖ్యానించారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఏపీలో ప్రస్తుత పాలన సరైన దిశలో సాగటం లేదని అభిప్రాయపడ్డారు. విభజన హామీల కోసం ప్రభుత్వం నుంచి పోరాటం లేదని వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన విధానంలో వెళ్లటం లేదని కేవీపీ చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం సిద్దపడిందన్నారు. అయినా, అడ్డుకొనే ప్రయత్నాలు జరగటం లేదని ఆవేనద వ్యక్తం చేసారు. నాడు వైఎస్సార్ రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం, రాహుల్ ను ప్రధాని చేయటం ఆ రెండు లక్ష్యాలుగా కేవీపీ గుర్తు చేశారు. కాగా, ఏపీ రాజకీయాలలో కేవీపీ క్రియాశీలంగా మారడం, అది కూడా ఆప్త మిత్రుడు వైఎస్ పేరున వైఎస్ కుమారుడు జగన్ రెడ్డి  స్థాపించిన పార్టీ, (వైసీపీ) ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.

సూర్యకుమార్ యాదవ్ (ఎస్ కెవై) చెలరేగిన వేళ!

సూర్యకుమార్ యాదవ్.. ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ.. శ్రీలకం చేష్టలుడిగి నిలబడిపోయింది. ఫీల్డర్లు బౌండరీ అవతల పడిన బంతిని తీసుకురావడానికే పరిమితమయ్యారు. మిస్టర్ 360 గా మన్ననలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్..ఒంటి చేత్తో శ్రీలకంతో జరుగుతున్న మూడో టి20ని భారత్ ఖాతాలో వేసేశాడు. దీంతో శ్రీలంకతో టి20 సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలిచింది. ఇక మళ్లీ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విధ్వంసం వద్దకు వస్తే.. శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టి20లో సూర్యకుమార్ యాదవ్ ఏడు ఫోర్లు, 9 సిక్సర్లతో కేవలం 45 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దీంతో టి 20ల్లో మూడు శతకాలు బాదిన నాన్ ఓపెనింగ్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. సూర్యకుమార్ విధ్వంసక బ్యాటింగ్ తో టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ స్కోరులో సూర్యకుమార్ యాదవ్ స్కోరు 112 (51 బంతుల్లో) నాటౌట్. దీంతో 229 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది.దీంతో టీమ్ ఇండియా 91 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకు ముందు తొలుత టాస్ కోల్పోయి బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఇషాన్ కిషన్ తొలి ఓవర్ లోనే వెనుదిరిగాడు. అయితే రాహుల్ త్రిపాఠి బ్యాట్ ఝుళిపించాడు. 35 పరుగులు చేసి త్రిపాఠి వెనుదిరిగిన తరువాత మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు సూర్యకుమార్ యాదవ్. తనదైన స్కూప్ షాట్లతో సూర్యకుమార్ యాదవ్ విరుచుకుపడటంతో మైదానంలో శ్రీలంక ఫీల్డర్లది ప్రేక్షక పాత్రే అయ్యింది. బౌలర్ వేసిన ప్రతి బంతినీ బౌండరీ అవతల నుంచి తీసుకురావడానికే వారు పరిమితమయ్యారా అన్నట్లుగా సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యం కొనసాగింది. స్వల్ప వ్యవధిలో గిల్‌, హార్దిక్‌ (4), దీపక్‌ హుడా (4) వెనుదిరిగినా సూర్య కుమార్ యాదవ్ జోరు కొనసాగించాడు.