జనసేనతో బీజేపీ కటీఫ్.. వైసీపీతోనే కలిసి వెళుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనాలంటే పొత్తులు అనివార్యం అన్న నిర్ణయానికి ప్రధాన పార్టీలు వచ్చేశాయి. ఈ విషయంలో మొదటి నుంచీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనని, ఈ విషయంలో అవసరమైతే ప్రధాని మోడీతో స్వయంగా మాట్లాడుతాననీ కూడా ప్రకటించారు. అయితే ఏపీలో ఇసుమంతైనా ఓట్ స్టేక్ లేని బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో ఒకింత ప్రాధాన్యత ఏపీలో రాజకీయంగా లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పవన్ కల్యాణ్ ను ఒక ట్రాప్ లో చిక్కుకునేలా గత మూడున్నరేళ్లుగా దిగ్బంధంలో ఉంచగలిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధం, అరాచకాలు పెరుగుతున్న నేపథ్యంలో జనసేనాని రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండాలన్న దానిపై ఒక క్లారిటీకి వచ్చేశారు. ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయనతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం.. రణస్థలితో సభలో మాట్లాడిన ఆయన తెలుగుదేశంతో కలిసి సాగనున్నట్లు దాదాపుగా స్పష్టత ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీని పూర్తిగా విస్మరించినట్లే కనిపించింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో కలిసి నడవాలా వద్దా అన్నది బీజేపీయే నిర్ణయించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇంత కాలం మిత్రపక్షంగా ఉన్నా జనసేనను బీజేపీ విస్మరిస్తే.. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన బీజేపీని ఇగ్నోర్ చేసింది. బంతిని ఆ పార్టీ కోర్టులోకే నెట్టేసింది. తొలి సారి జనసేనాని ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటించినప్పుడు రాష్ట్రంలో 2014 నాటి పొత్తులు పొడుస్తున్నాయా అన్న చర్చ తెరమీదకు వచ్చింది.  జనసేన విశాఖ గర్జన సందర్భంగా  చోటు చేసుకున్న పరిణామాలు, పవన్ కల్యాణ్ ను హోటల్ కు పరిమితం చేసేలా ఆంక్షలు విధించడం తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించడమే కాకుండా.. ఆయన విశాఖ నుంచి వచ్చిన తరువాత స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయనతో కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంగా జనసేన మిత్ర పక్షం బీజేపీ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు ఖాయమని అంతా భావించారు.   ఈ సందర్భంగానే రాష్ట్ర పతి ఎన్నిక సందర్భంగా  బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ  బీజేపీపై ఎంత  ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా  ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడం,  చంద్రబాబుకు   12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం వీటన్నిటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు దగ్గరౌతున్నాయనడానికి పరిశీలకులు నిర్ధారణకు వచ్చేశారు. అాదే విధంగా `ఢిల్లీలో  మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి కేంద్రం నుంచి అందిన ఆహ్వానం మేరకు  చంద్రబాబు  హస్తిన వెళ్లడం, ఆ సందర్బంగా కొద్ది సేపు మోడీతో ముచ్చటించడాన్ని కూడా పరిశీలకులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనడానికి తార్కానాలుగా పేర్కొన్నారు. అయితే.. ఏపీ బీజేపీలో మాత్రం తెలుగుదేశంతో మైత్రి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఇటీవల హస్తినలో జరిగిన  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీలో పొత్తులు వద్దని నిర్ణయించింది.  ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పొత్తులకు దూరం అని బీజేపీ ప్రకటించడమంటే వైసీపీకి సానుకూలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం 1 లేదా 1.5 శాతం ఓట్లతో బీజేపీ రాష్ట్రంలో సాధించేదీ, సాధించగలిగేదీ ఏమీ లేకపోయినా.. జనసేనకు దూరం జరగడం ద్వారా ఏపీలో వైసీపీ పట్ల బీజేపీ సానుకూలంగా ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.  పేరుకు సొంతంగా ఎదగడానికే పొత్తులకు దూరం అని చెబుతున్నా.. ఇప్పటి వరకూ కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీలోని జగన్ సర్కార్ కు అందిస్తున్న సహకారాన్ని గమనిస్తే బీజేపీ జగన్ పార్టీకి దగ్గరౌతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

రక్తంతో మోడీకి నిరసన లేఖలు

బృందావన్ టెంపుల్ కారిడార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.   బంకి బిహారీ  ఆలయం చుట్టూ  నిర్మించ తలపెట్టిన ఈ కారిడార్ పనులను స్థానికులు, వ్యాపారులు, పూజారులు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని రోజులుగా యూపీ సర్కారు, కేంద్రానికి తమ గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యతిరేకతను పట్టించుకోవడం లేదంటూ వారు వినూత్న నిరసనకు దిగారు. బృందావన్ టెంపుల్ కారిడార్ పనులను ఆపేయాలంటూ వీరు ప్రధాని మోడీకీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు రక్తంతో లేఖలు రాశారు.   బృందావన్ కారిడార్ ప్రాజెక్టు ప్రతులను తగులబెట్టి..తమ రక్తంతో మొత్తం 108 లేఖలను రాశారు.   బృందావనం పవిత్రతను కాపాడాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కాగా మందిరాన్ని ఆనుకున్న వీధుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నవారంతా తమ వ్యాపారాలు మూసేసి రోడ్డెక్కారు. కాశీ విశ్వనాథ్ టెంపులు కారిడార్ ప్రాజెక్టులా దీన్ని నిర్మిస్తే చాలా మంది ఉపాధి కోల్పోవడమే కాకుండా    సొంత ఇళ్లను కోల్పేయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంకి బిహారీ మందిరంలో కృష్ణుడు చిన్న బాలుడిలా ఉంటూ దర్శనం ఇస్తాడు..అయితే ఈ మందిరంలో తరచూ తొక్కిసిలాట జరిగి మరణాలు సంభవిస్తుంటాయి. భక్తుల రద్దీని తట్టుకునే  ప్రభుత్వం తలపెట్టిన ఈ కారిడార్ పనులు ఆపేయాలంటూ స్థానికులు న్యాయపోరాటానికి దిగారు.

ఖమ్మంలో మరో బహిరంగ సభ.. ఈ సారి బీజేపీ?

ఖమ్మంలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.  ఈసారి బీజేపీ.. ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు  తెలుస్తోంది. వచ్చే నెలలో ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ సభకు కమలం పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరవుతారని.. వారి సమక్షంలో ఖమ్మం జిల్లాకు చెందిన లోక్‌సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాషాయం కుండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు.  మరో వైపు జనవరి 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సభ జరిగిన రోజే న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరిగింది,  కానీ పొంగులేటి కమలం గూటికి చేరడం మాత్రం జరగలేదు. ఖమ్మం వేదికగా కేసీఆర్ సభ జరిగిన అనంతరం..  బీజేపీలో చేరాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి  భావించారని.. అందుకే ఆయన బీజేపీలోకి ఎంట్రీ కొంచం వాయిదా పడిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి.. అనంతరం మునుగోడులో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో  కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా.. బీజేపీ మాత్రం అనూహ్యంగా ఓటు బ్యాంకును భారీగా పెంచుకొంది.   అదే విధంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ సభావేదికపైనే పొంగులేటిని బీజేపీ గూటిలో చేర్చుకోవాలని కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఎందుకంటే.. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తెలంగాణలోని ఖమ్మం వేదికగా నిర్వహించిన శంఖారావం సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత...  సైకిల్ పార్టీకి కేడర్ తప్ప లీడర్ లేంటున్న ప్రత్యర్థి పార్టీల నాయకులకు..ఈ సభతో సరైన సమాధానం లభించినట్లు అయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభకు.. వివిధ రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు  హాజరయ్యారు.   దీంతో బీజేపీ అగ్రనాయకత్వం.. ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ స్పష్టమైన సందేశం ఇవ్వాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది.    ఇప్పటికే తెలంగాణలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని  కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటి .. అధికారం చేపట్టాలని  బీజేపీ భావిస్తోంది. ఆ క్రమంలో తెలంగాణలో పార్టీ బలహినంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి..  ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగు వేస్తోంది.  అందులోభాగంగా వివిధ పార్టీల్లో ఉన్న కీలక నేతలను తమ గుటిలోకి తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. అదీ కూడా గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో తమ పార్టీకి ఏ మాత్రం ఢోకా లేదనే ఓ స్పష్టమైన సంకేతాన్ని, సందేశాన్నీ.. ప్రత్యర్థి పార్టీలకే కాదు.. ప్రజలకు సైతం ఇవ్వాలన్న  అజెండాతో కమలదళం.. ఆ దిశగా అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

జై తెలంగాణ అనేందుకు కేసీఆర్ కు భయమా?

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ రేపిన దుమారం కొంత సర్డుమణిగింది. ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు వచ్చిన దారిన వెనక్కి వెళ్ళారు. ఆ వచ్చిన నలుగురూ ఏ సందేశం తీసుకు వెళ్ళారో ఏమో కానీ, భారాస నాయకులు, కార్యకర్తలే కాదు తెలంగాణ మేథావులు,సామాన్య ప్రజానీకంలోనూ అంతర్మథనం మొదలైన సంకేతాలు స్పష్టమవుతున్నాయి.  మరో వంక ఖమ్మం సభ మంచి చెడులు, లాభ నష్టాలపై అన్ని పార్టీలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార భారాసలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడదు కదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయ విశ్లేషకులు విభిన కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. అయితే  ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా ఖమ్మం సభ ఇస్తుందనుకున్న క్లారిటీ అయితే ఇవ్వలేదని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.  తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి( తెరాస) పేరును  భారతీయ రాష్ట్ర సమితిగా (భారాస) గా మార్చడంతోనే తెలంగాణ అస్థిత్వ రాజకీయాలకు, రాజకీయ విలువలకు పార్టీ దూరమైందని.. ఇప్పడు ఖమ్మం సభలో ఎక్కడా జై తెలంగాణ నినాదమే వినిపించక పోవడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతోందని విశ్లేషకులు అంటున్నారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎక్కడ తెరాస సభ జరిగినా, జై తెలంగాణ నినాదమే ప్రధానంగా వినిపించేది. చివరకు ఆ నినాదంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసేది,  కానీ, ఇప్పడు జై భారత్  కేసీఆర్ తమ ప్రసంగం ముగించారు. కానీ, ఏ నినాదం నినదిస్తూ 1200 మంది ప్రాణత్యాగం చేశారో .. అమరులయ్యారో ఆ ‘జై తెలంగాణ’ అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. ఇది ప్రజలకు పార్టీకి మధ్య దురాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు.  ఇదే విషయంగా రాజకీయ ప్రత్యర్దులే కాదు, మేథావులు, ఉద్యమ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏవరి దాకానో ఎందుకు, తెలంగాణ మలి దశ ఉద్యమంలో,కేసీఆర్ కు  కుడి భుజంగా నిలిచిన కోదండరాం, బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగా అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని  ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల పంపిణీ జాప్యానికి వ్యతిరేకంగా ఈనెల 30న ఢిల్లీలో జరప తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను కోదండరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. కృష్ణా నదీపైన ప్రాజెక్టులు అన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, కాళేశ్వరం కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు పూర్తి కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందని చెప్పడం అబద్దమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. పేదల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారన్నారు.  ప్రైవేటుకు వ్యతిరేకమని చెబుతున్న కేసీఅర్ సింగరేణిలో సగం ప్రైవేటు పరం చేసింది నిజం కాదా? అని కోదండరాం ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు తప్పితే అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, విద్యా, వైద్యం, సింగరేణి ప్రైవేటు అయ్యాయనీ, ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయన్నారు. ఈ నెల 30న కృష్ణా నదీ జలాల్లో వాటాపై డిల్లీలో పోరాడుతామని, 31న విభజన హామీలపై సెమినార్ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. ఒక్క కోదండ రామ్ మాత్రమే కాదు, భారాస నాయకులు కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంద్రా పాలకులు అసెంబ్లీలో తెలంగాణ పేరును బ్యాన్ చేశారని ఆరోపించిన కేసేఆర్, ఇప్పడు స్వరాష్ట్రంలో తెలంగాణ పేరును నిషేదించారని ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

మోడీకి వ్యతిరేకంగా బీబీసీ డాక్యుమెంట్

వలసవాద పాలన అంతమై, ఏడున్నర దశాబ్దాలు పూర్తయినా  బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ ధోరణి మాత్రం మారలేదు. ఇప్పటికీ భారత దేశాన్ని, భారతీయ ఆచార వ్యవహారాలను అవహేళన చేయడం మానలేదు. భారతే దేశం విభిన్న రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రపంచం అంతా గుర్తించినా, బీబీసీ మాత్రం భారత దేశం సాధించిన పురోగతిని తిరోగమనంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా, కేంద్రంలో అధికార మార్పిడి జరిగి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీబీసీ సాగిస్తున్న భారతగా వ్యతిరేక ప్రచారం మరింత  పెరిగింది. హద్దులు దాటి, వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారిన వైనం ఈ మధ్య కాలంలో మరింత పస్పుటంగా కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌ వివాదాస్పదంగా మారింది. ఈ సిరీస్ పై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతి పాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్థత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది.  బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ మోడీ పై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.  2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెబుతూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికి పైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడారు.   బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని అన్నారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి జోప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం  స్పష్టమవుతున్నాయన్నారు.  దీనిని ప్రసారం చేయడం వెనుక ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. గౌరవ, మర్యాదలతో పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు. అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన మనం ఇప్పుడు ఎందుకు స్పందించాలని అడిగారు. జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని వారు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనే మాటలను తాను విన్నానని, వలసవాద ఆలోచనా ధోరణి అనే పదాలను మనం మాట్లాడటానికి ఓ కారణం ఉందని తెలిపారు. మనం పదాలను ఇష్టానుసారం వాడబోమన్నారు. ఇంక్వైరీ ఏమిటి? వారు అక్కడ దౌత్యవేత్తలు కదా? అన్నారు. ఇన్వెస్టిగేషన్ అంటే దేశాన్ని వారు పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.  అయితే, దురదృష్టం ఏమంటే ... బీబీసీ తప్పుడు కథనాలను బ్రిటన్ లోని భారతీయలు వ్యతిరేకిస్తున్నారు. కానీ, దేశంలోని కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు బీబీసీ కథనానికి సోషల్ మీడియాలో ప్రాచుర్యం కల్పిస్తున్నారు.

బాబులు పసికట్టారు.. బాబుదే అధికారం

రాజకీయ నాయకుల లెక్కలు తప్పవచ్చును. రాజకీయ విశ్లేషకుల అంచనాలు తారుమారు కావచ్చును. పీకేల సర్వేలు, జ్యోతిష్య పండితుల లెక్కలూ తపవచ్చును  కానీ  రేపటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ రోజే పక్కగా చెప్పే పండితులు ఎవరైనా ఉన్నారంటే, వారు  ప్రభుత్వ అధికారులు మాత్రమే. అవును, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చాలా గుంభనంగా అసలేమీ తెలియనట్లు ఉంటారు కానీ  రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో ఇట్టే పట్టేస్తారు.  రాజకీయలతో అసలు ఏ సంబంధం లేనట్లుండే అధికారులు రాజకీయ పరదాల చాటున ఏమి జరుగుతుందో కళ్ళు మూసుకుని చూసేస్తారు అందుకు తగ్గట్టుగా తమను తాము ట్యూన్ చేసుకుంటారు. స్ట్రాటజీలు మార్చుకుంటారు, ఇప్పడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు వరసగా హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు. అక్కడ రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నిజాన్ని, అధికారులు పసి గట్టారు. అందుకే, అలా ఒకరివెంట ఒకరుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు హైద‌రాబాద్ లో  చంద్ర‌బాబుని  క‌లుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  నిజానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో వైఎస్పార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే, జగన్మోహన్ రెడ్డి అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు బుక్కయ్యారు. జైలు పాలయ్యారు. అలాగే, జగన్ రెడ్డి  ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సీఎస్, డీజీపీలతో సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టు బోనెక్కారు. అవమానాలు ఫేస్ చేశారు. చివాట్లు తిన్నారు. అయినా కొందరు అధికారులు తాము చేస్తున్నది తప్పని తెలిసీ, ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారుల ఒత్తిళ్ళకు తలొగ్గి తప్పులు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు  టీడీపీ నాయకులు, కార్యకర్తలను అనేక విధాల వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు అలాంటి వారంతా, ప్రభుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డం లేద‌ని వాపోతున్నారు. అలాంటి వారు ఇప్పడు గతంలో చంద్ర‌బాబు నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ... త‌మ త‌ప్పుల్ని మ‌న్నించేయాల‌ని ముందుగానే వేడుకుంటున్నారు.  నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తప్పు చేసిన అధికారులు చేసిన తప్పు ఒప్పుకుని పశ్చాతాపం ప్రకటిస్తే,  పెద్దమనసు చేసుకుని అలాంటి వారిని క్షమించి వదిలేసిన సందర్భాలు లేక పోలేదని అంటారు. అలాగే, అప్పట్లో బెట్టింగ్ మాఫియా కేసుల్లో అడ్డంగా దొరికిపోయిన అధికారిని చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన విచక్షణాధికారాలను వినియోగించి రక్షించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే,, అదే ఐపీఎస్ అధికారి వైసీపీ స‌ర్కారు రాగానే టిడిపిపై జులుం చెలాయిస్తూ చెల‌రేగిపోయారు. ఇప్పడు మళ్ళీ ఆయనే అన్యధా శరణం నాస్తి, అంటూ చంద్రబాబు నాయుడుని వేడుకునేందుకు, అయన అప్పాయింట్ మెంట్ కోసం, బూట్లు అరిగేలా తిరుగుతున్నారని  స‌మాచారం.   మ‌రోవైపు సీఐడీలో ప‌ని చేస్తున్న వారంతా చంద్ర‌బాబుని ఎలాగైనా క‌లిసి త‌మ త‌ప్పేమీ లేద‌ని  పై అధికారులు, రాజకీయ పెద్దలు ఆడుతున్న జగన్ నాటకంలో తాము పావులమయ్యామంటూ  అంటూ చెప్పుకుంటామ‌ని రిఫ‌రెన్సులు వెతుక్కుంటున్నార‌ట‌. మరో వంక రాష్ట్ర రాజకీయాలలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చంద్రబాబు నాయుడు అప్పాయింట్ మెంట్ కోసం పడుతున్న తీరును గమనిస్తున్న రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్న టీడీపీ నాయకులు, మంచి రోజులు మళ్ళీ  వస్తున్నాయనే విషయాని పసిగట్టి  యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం తో రాష్ట్రంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణంపై అన్ని వ‌ర్గాల‌కు స్ప‌ష్ట‌త వస్తోంది. మ‌రోవైపు బాబు-ప‌వ‌న్ భేటీతో జగన్ అధికారం అంతం అవ్వడం ఖాయమన్న విషయంలో  అంద‌రికీ క్లారిటీ  వ‌చ్చేసింది. తెలుగుదేశం ప్ర‌భుత్వం రావ‌డం ఖాయ‌మ‌ని నిర్ధారించుకున్న నేత‌లు చంద్రబాబుతో కాదంటే చిన‌బాబు లోకేష్ తో కుదిరితే కప్పు కాఫీ, కాదంటే నాలుగు మాటల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ప‌ద‌వుల కోస‌మో, కేసుల భ‌యంతోనో, తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోస‌మో పార్టీ మారిన వారు సైతం తెలుగుదేశంలోకి మ‌ళ్లీ వ‌స్తామంటూ సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. అలా ఫీలర్స్ పంపుతున్న వారిలో ప్రస్తుతం వైసీపీలో ఉన్న కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు అంటేనే అంత... ఎప్పుడు ఏ గాలి ఎటు వీస్తుందో .. ఎవరికీ తెలియదు.

భద్రతా లోపాలు.. భారత్ జోడో యాత్ర కుదింపు?

రాహుల్ భారత్ జోడో యాత్రను కుదిస్తారా? అనంతనాగ్ ప్రాంతంలో పాదయాత్ర కాకుండా జోడో యాత్ర వాహనాలలో సాగుతుందా? అంటూ కాంగ్రెస్ వర్గాలు ఔననే అంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను కుదించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అనామక వ్యక్తులు జోడో యాత్రలోని అకస్మాత్తుగా వచ్చి చేరుతున్నారని కాంగ్రెస్ అనుమానిస్తోంది. రాహుల్ ను హగ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. రాహుల్ భద్రత విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. ఆయన సెక్యూరిటీ మాత్రం రాహుల్ గాంధీ భద్రత పరమైన ప్రొటోకాల్ ను పాటించడం లేదని అంటున్నది. ఈ నేపథ్యంలోనే అనంతనాగ్ కు రాహుల్ జోడో యాత్ర చేరుకోగానే పాదయాత్రగా కాకుండా రాహుల్ వాహనంలో ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తోంది. అలాగే రూట్ మ్యాప్ లో కూడా మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం రోజుకు పాతిక కిలోమీటర్లు  పాదయాత్ర సాగుతుందడా..దానిని కూడా తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే శ్రీనగర్ లో లాల్ చౌక్ లో భారత జెండా ఆవిష్కరణ కార్యక్రమం రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ కాకుండా మరో చోట రాహుల్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని చెబుతోంది. 

జగన్ సర్కార్ పై గవర్నర్ కు ఉద్యోగుల ఫిర్యాదు

జీతాల కోసం, ప్రైవేటు ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చును. ఆందోళనకు దిగారంటే సరిపెట్టుకోవచ్చు. సమ్మెకు దిగారంటే ఔను మరేంచేస్తారని సమాధాన పడొచ్చు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు వీధుల్లోకి రావడం, ఆందోళనలకు దిగడం, సమ్మె చేయడం కాదు ఏకంగా గవర్నర్  ను కలిసి, ప్రతి నెలా ఫస్ట్’ కు జీతాలు ఇప్పించండి మహా ప్రభో అని మొరపెట్టుకోవడం బహుశా  మరో రాష్ట్రంలో ఎక్కడా ఉండదేమో. ఆ ప్రత్యేక ‘గౌరవం’ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ‘గౌరవ’ ముఖ్యమంత్రి   వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది.  నిజానికి  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర  గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి, తమ సమస్యలను ఏకరవు పెట్టడమే కాదు, ఏకంగా తమ ప్రభుత్వం మీద తామే ఫిర్యాదు చేశారు. ఇది కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్కార్ కు మాత్రమే దక్కిన మరో ‘విశేష’ గౌరవం కావచ్చును. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఏదైతే వుందో అది నభూతో న భవిష్యతి.. అన దగిన ‘అద్భుత’  సన్నివేశం కావచ్చును.  నిజమే, ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వివాదాలు తలెత్తడం, జీతాల పెంపు కోసమో, పీఆర్సీ కోసమో సమ్మెలు చేయడం కొత్తకాదు  కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్రంలో తమ పరిస్థితి ముందు నుయ్యి వెంక గొయ్యి అన్న చందంగా మారిందని, గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పీఅర్సీ విషయంలో మోసపోయినా, నష్ట పోయినా ప్రభుత్వం ఏదో విధంగా ఉద్యోగులను ఆదుకుంటుందనే ఓ చిన్న ఆశతో ఉండేదని  ఇప్పడు ఆ కాస్త ఆశ కూడా ఆవిరై పోవడంతో చేసేదిలేక  గవర్నర్  ఆశ్రయించామని ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా ముందు గోడును వెళ్లబోసుకున్నారు. నిజానికి  వైసీపీ ప్రభుత్వం అధిఅక్రంలోకి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోలి సంతకం చేసింది మొదలు రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ  పూర్తిగా గతి తప్పిందని  ఇంతవరకు విపక్షాలు, ఆర్థిక నిపుణులు మాత్రమే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాదారు .. వారేమన్నారంటే ...   రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సూర్యనారాయణ, ఆస్కారరావుతో పాటు మరో ఆరుగురు నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.  ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెలా మొదటి తేదీనే ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సూర్యనారాయణ ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్‌ను విత్‌డ్రా చేశారు. 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నారు. మేం ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలు వివరించాం. మా సమస్యలను గవర్నర్‌ సానుకూలంగా విని కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం అవమానకర రీతిలో వ్యవహరిస్తోంది. మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను సమాయత్తం చేస్తాం. ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర కౌన్సిల్‌ నిర్ణయం ప్రకారం ఆందోళన చేపడతాం. ఆర్థికశాఖ అధికారులు, మంత్రివర్గ ఉప సంఘానికి సమస్యలు చెప్పాం. వారు స్పందించకపోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. బకాయిల చెల్లింపులపై జోక్యం చేసుకోవాలని ఆయన్ను కోరాం అని సూర్యనారాయణ తెలిపారు.

ఇదిగో ఇంకో .. ఫార్మ్ హౌస్ కథ

భారత రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్యేల కొనుగోలుకు,బీజేపీ నాయకత్వం ప్రయత్నించిందంటూ భారాస నాయకత్వం చేసిన ఆరోపణలు, ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేపట్టిన విచారణ  చిత్ర విచిత్ర మలుపులు తిరిగి, చివరకు సిబిఐకి చేరింది. సిట్  విచారణ చెల్లదని తేల్చిన రాష్ట్ర హై కోర్టు  విచారణను సిబిఐకి అప్పగించాలని ఆదేశించడంతో, డామిట్  కథ అడ్డం తిరిగిందని భారాస ప్రభుత్వం తల పట్టుకుంది. అయితే, పరిస్థితిని మదింపు వేసుకుని కేసును సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుతం అప్పీల్ కు వెళ్లింది.  కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో ఇటు సిట్ దర్యాప్తుతో పాటు సీబీఐ దర్యాప్తు కూడా నిలిచిపోయింది.   అయితే, ఆ ఫార్మ్ హౌస్ కథ.. అలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి మరో ఫార్మ్ హౌస్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని సుమారు 25 మంది కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ మాట్లాడారని రేవంత్ రెడ్డి  ఆరోపించారు. వారిని ఫామ్ హౌజ్ కు పిలిచి మాట్లాడారని అన్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలిసిందని అన్నారు. ఆ నేతలకు రూ.500 కోట్ల ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం తెలిసి తమ నేతలకు సైతం ఏఐసీసీ క్లాస్ తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  తక్కువ మార్జిన్‌తో గెలిచే నేతలను టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ ఈ పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయం కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామికి కూడా తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ మీటింగ్‌కు కుమారస్వామి రాకపోవడానికి అదే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, భారాస ఆవిర్భావ సభ నేపథ్యంగా ఆయన చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాలో దుమారం రేపుతున్నాయి. నిజానికి  కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానంలో అందరికంటే ముందుగా ఆయనతో జట్టు కట్టింది, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్’ అధ్యక్షుడు కుమార స్వామి. అలాంటిది  పార్టీ అవిర్భావ సభకు ఆయనే రాలేదు. సరే, ఆయన బిజీగా ఉండి రాలేక పోయారని అనుకున్నా, అయన తరపున ఆయన కుమారుడో లేదా జేడీఎస్ మరో ముఖ్య నాయకుడో మరొకరో అయినా రావాలి కదా ..కానీ, ఎవరు రాలేదు. దీంతో రేవంత్ రెడ్డి ఆరోపణలలో ఎంతో కొంత  నిజం ఉండే ఉంటుందని  అంటున్నారు. నిజానికి , కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ముందుకు సాగేందుకు, అడుగడుగునా ‘డబ్బు’ మూటలనే నమ్ముకుంటున్నారని అంటున్నారు. సో.. రేవంత్ రెడ్డి చేసియన్ సంచలన ఆరోపణల పై విచారణకు ఆదేశిస్తే, మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాని అంటున్నారు.

మిడిల్ క్లాస్ మెలోడీ మాయమౌతోందా?

యూనియన్ బడ్జెట్ అనగానే దేశంలో మధ్యతరగతి ఆశల పల్లకిలో ఊరేగడం మొదలెట్టేస్తోంది. ఇది ఏటా మామూలుగా జరిగే వ్యవహారమే. అయితే అదే మధ్య తరగతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి సంపన్నులకు సానుకూలంగా.. మధ్య తరగతిని దిగువ మధ్య తరగతిని డిమోషన్ ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన అన్నది పరిపాటిగా మారిపోయింది.  స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ నిర్లక్ష్యానికి గురౌతు వస్తున్న వర్గం ఏదైనా ఉందా అంటే అది మిడిల్ క్లాస్ వర్గం మాత్రమేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. మధ్యతరగతి ఆదాయం, పొదుపులపై ఎక్కవ శ్రద్ధ, దృష్టి పెడుతుంది. ప్రభుత్వాలు దానినే లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ ల పేరుతో ఆ తరగతి మీద దాడి చేస్తున్నాయి. అంటే మధ్యతరగతిని దోచి సంపన్నులకు భారీగా, పేదలకు పరిమితంగా పంచి పెడుతున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు బడ్జెట్‌ ప్రస్తావన వచ్చినా   మధ్యతరగతి వర్గం తమకు ఏదైనా మేలు జరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏడున్నర దశాబ్దాలుగా మధ్యతరగతికి మిగిలింది ఆ ఎదురు చూపే.. ప్రభుత్వాలు మాత్రం మధ్యతరగతి నెత్తిన ఎంత పెద్ద బండ పెడితే.. అంతగా దేశాభివృద్ధి జరిగిందన్నట్లు భావిస్తూ ముందుకు సాగుతున్నాయి.  ప్రభుత్వం చెప్పే జీడీపీ పెరుగుదల మధ్యతరగతిని పీల్చి పిప్పి చేయడంపైనే ఆధారపడి ఉందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.   ఎందుకంటే దేశాబివృద్ధిలో అత్యంత కీలకమైన పన్నులు కట్టేది ఎక్కువగా మధ్య తరగతే. ధరల భారాన్ని మోసేదీ ఆ తరగతే. బడ్జెట్‌ వస్తోందంటే చాలు ఆ తరగతి జీవుల్లో  పన్నుల భయం పట్టుకుంటుంది. ఆ పన్నులపై శ్లాబులు ఇస్తే బాగుండుని, ఆదాయపన్ను మినహాయింపు పెంచితే చాలనీ కోరుకుంటుంది.  గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ సమయం అయినా కాకపోయినా, సందర్భం వచ్చినా రాకున్నా తాను మధ్యతరగతికి చెందిన మహిళలని చెప్పుకుంటుంటారు. గత నాలుగు బడ్జెట్ లలో ఆమె మధ్యతరగతికి ఒరగబెట్టిందేమీ లేదు. ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో ఆమె వరుసగా ఐదో సారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పుడు కూడా యథావిధిగా తాను మధ్యతరగతి మహిళలనీ, వారి కష్టాలు, బాధలు, ఆశలూ తనకు బాగా తెలుసుననీ చెప్పుకొచ్చారు.  ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన తాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మధ్యతరగతి మీద అదనపు పన్నుల భారం ఉండబోదని ఆమె ప్రకటించారు. అయితే అదనపు ఆదాయం కోసం ప్రభుత్వాలు ఎక్కువగా ఆధారపడేది మధ్యతరగతి మీదే.  ఆ తరగతి జీవుల ద్వారానే అధికంగా పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతుంది.  అందువల్ల బడ్జెట్‌కు సంబంధించి ఏ ప్రస్తావన వచ్చినా మధ్యతరగతి జనులే ముందుగా స్పందిస్తుంటారు సాలీనా రూ. 5.30 లక్షలు సంపాదించే వారంతా మధ్యతరగతికి చెందినవారేనని ‘ప్రెస్‌’ అనే ఆర్థిక వ్యవహారాల అధ్యయన సంస్థ చెప్పింది. దాని ప్రకారం, దేశంలో 30 శాతం కుటుంబాలు మధ్య తరగతికి చెందినవే. 2018-19 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 5.60 కోట్ల మంది వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయగా, అందులో కోటీ 90 లక్షల మంది అంటే 34 శాతం మంది రూ. 5.25 లక్షల లోపు ఆదాయం కలిగినవారే, అంటే మధ్య తరగతి వారే.   అంతేకాదు, దేశంలో అసలు సిసలు కొనుగోలుదారుల గణాంకాలను సేకరించినప్పుడు కూడా మధ్యతరగతి జనులే అధికం.   ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి మీద పన్నుల భారం వేయబోమని చెప్పిన నిర్మలా సీతారామన్‌, ప్రాథమిక సదుపాయాల కల్పన మీదే దృష్టి కేంద్రీకరింస్తామనీ, వీటి అభివృద్ధి మీదే భారీగా పెట్టుబడి పెట్టబోతున్నామనీ ప్రకటించారు. నిజానికి ప్రాథమిక సదుపాయాల కల్పన అనేది మధ్య తరగతికి పెద్దగా ప్రయోజనం కలిగించే అంశమేమీ కాదు. అది తమ జీవన స్థితిగతులను, జీవిత నాణ్యతను పెంచగ లదనే నమ్మకం ఆ తరగతి జీవులలో ఇసుమంతైనా లేదు. ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా సౌకర్యాల వల్ల మధ్యతరగతి ప్రత్యక్షంగా లబ్ధి పొం దుతుందే తప్ప ప్రాథమిక సదుపాయాల వల్ల కాదన్నది పలు అధ్యయనాలు వెల్లడించాయి. మరి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల మొదటి తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ అయినా ఏదో ఒక మేరకు మధ్యతరగతి జనుల.. వీరిలో అత్యధికులు వేతన జీవులే ఆశలను నెరవేర్చేదిగా ఉంటుందా? చూడాలి.

కొయ్యా గుర్రం ఎగరావచ్చు!

మూడు పార్టీలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, మరో జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ... ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్బావ సభ వేదిక నుంచి ప్రసంగించిన నేతలు ఈ ఐదుగురు. సరే, ఐదుగురు నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. దేశం ఏమైపోతోందనే ఆవేదన, ఆగ్రహం వ్యక్తపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేసేఆర్  అయితే, 2024 ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ ఇంటికి ...మేము ఢిల్లీకీ అని, చాలా విశ్వాసంగా ప్రకటించారు.  అయితే, ఈ ‘మేము’ లో ఉన్నది ఎవరు? వేదిక మీద ఐదు ముఖాలు కనిపించినా, ఉన్నది బీఆర్ఎస్  సహా  నాలుగే పార్టీలు.. అందులో లోక్ సభలో సింగిల్ సీటున్న పార్టీ ఒకటి (ఆప్), రెండే సీట్లున్న పార్టీ ( సిపిఐ) ఇంకొకటి, ఐదు సీట్లున్న పార్టీ (ఎస్పీ), మూడు సీట్లకు పరిమితం అయిన సిపిఎం మరొకటి. ఇక బీఆర్ఎస్ సంగతి చెప్పనే అక్కరలేదు. కారు సారు పదహారు ..కాస్తా తొమ్మిదికి చేరింది.  అంటే 545 సంఖ్యా బలమున్న లోక్  సభలో బీఆర్ఎస్ వేదికను అలంకరించిన జాతీయ నేతల టోటల్ స్ట్రెంక్త్  20కి లోపే. పోనీ ఈ నాలుగు పార్టీల ఐదుగురు నేతలు ఒకే మాట మీదున్నారా? అంటే  అదీ లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా నలుగురూ నాలుగు పక్కలకూ లాగుతున్నారు. ముఖ్యంగా ఎంత చెడ్డా  లోక్ సభలో అధికారికంగా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా, జాతీయ స్థాయిలో  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే ..అయినా కాంగ్రెస్ పొత్తు విషయంలో ఏ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఏ రెండు పార్టీలు కాదు, ఏ ఇద్దరు నాయకుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు.   కేసీఆర్  బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీని కూడా శత్రు పక్షంగా చూస్తున్నారు. ఆ రెండు పార్టీల నిర్వాకం వల్లనే దేశం ఈ దౌర్భాగ్య స్థితి చేరిందని ఆయన అంటున్నారు. మరో వంక సిపిఐ నేత డి.రాజా కాంగ్రెస్ సహా లౌకికవాద ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటైతేనే కానీ, మోడీ పీఠాన్ని కదల్చలేమని అంటున్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సగం అటు సగం ఇటుగా ఉన్నారు. అదే పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి మాన్    బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. అలాగే సిపిఐ జాతీయ నేత రాజా, కాంగ్రెస్ తో కలిసి నడవాలని అంటే, కేరళ ముఖ్యమంత్రి (సిపిఎం) హస్తం పార్టీతో చేయి కలిపేది లేదని అంటున్నారు. అఫ్కోర్స్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా కాంగ్రెస్   కలిసిపోదామని అన్నా, గత ఏప్రిల్లో జరిగిన సిపిఎం కాంగ్రెస్  ఏచూరి ప్రతిపాదనను తోసి పుచ్చింది. జాతీయ స్థాయిలో ఏ పార్టీ, కూటమితో పొత్తు ఉండదని, సిపిఎం కాంగ్రెస్ ఆమోదించిన రాజకీయ తీర్మానంలో స్పష్టం చేసింది.  నిజానికి, ఈ నాలుగు పార్టీలు ఐదుగురు నాయకులే కాదు, ఓ వంక నుంచి మమతా బెనర్జీ, మరో వంక నుంచి నితీష్ కుమార్, ఎవరికి వారు 2024 ఎన్నికలలో మోడీని ఇంటికి పపంపాలని శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, అది అయ్యే పనేనా? అందులోనూ... కాంగ్రెస్ ను పక్కన పెట్టి, అంటే ..ఏమో కొయ్యా గుర్రం ఎగరావచ్చు .. అంటున్నారు.

బీఆర్ఎస్ కు కుమార స్వామి దూరం ఎందుకంటే.. ?

ఖమ్మం బీఆర్ఎస్ సభకు జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దూరంగా ఉన్నారు. ఆయనే కాదు.. జీడీఎస్ పార్టీ ప్రతినిధులెవరూ కూడా హాజరు కాలేదు.  దీంతో.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ పయనం ప్రారంభించనప్పటి నుంచీ ఆయనతో అడుగులు వేయడానికి ఉత్సాహం చూపిన జేడీఎస్, కుమారస్వామి.. బీఆర్ఎస్ కు దూరం జరిగారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ తన జాతీయ ఆకాంక్షను బయటపెట్టిన క్షణం నుంచీ..   కుమారస్వామి ఆయనకు మద్దతు పలికారు.  పార్టీ ప్రకటన సందర్భంలోనూ,  ఢిల్లీ లో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ కుమార స్వామి కేసీఆర్ వెంట నిలిచారు. కానీ   ఆవిర్భావ సభకు మాత్రం దూరం జరిగారు. బీఆర్ఎస్ వర్గాలు ఆయన బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని చెబుతున్నా.. జేడీఎస్ కు సంబంధించి ఎవరూ ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభకు హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే ఎక్కడో ఏదో చెడిందన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.  అలాగే.. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఖమ్మం ఆవిర్భావ సభలో ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్ కర్నాటక బాధ్యతలు ప్రకాశ్ రాజ్ చేపడతారన్నంతగా ప్రచారం జరిగినా.. అత్యంత కీలకమైన ఆవిర్భావ సభకు ఆయన గైర్హాజర్ కావడంతో ఏదో జరిగింది, బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ దూరం జరిగారా, లేక కేసీఆరే పక్కన పెట్టారా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కుమారస్వామి బీఆర్ఎస్ తో ఎడం పాటించడంతో..   జేడీఎస్ బీఆర్ఎస్ మిత్రపక్షంగా ముందుకు సాగడానికి సుముఖంగా లేదన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తుండటం జేడీఎస్ నేత కుమారస్వామికి నచ్చలేదనీ, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి జేడీఎస్ అభ్యర్థుల కోసం ప్రచారానికే పరిమితమవ్వాలన్న ఆయన కండీషన్ ను కేసీఆర్ అంగీకరించలేదనీ ఒక ప్రచారం జరుగుతోంది. అందుకే బీఆర్ఎస్ తో పొత్తుకు ముందే కుమారస్వామి తెగతెంపులు చేసుకున్నారని అంటున్నారు.   అసలింతకీ ఖమ్మంలో జరిగిన ఆవిర్భావ సభతో కేసీఆర్ భారాస పార్టీ జాతీయ పార్టీగా అన్ని వర్గాల గుర్పింపు పొందేసినట్లేనా? అంటే ఔనన్న సమాధానం వస్తుందా, వచ్చిందా? అని స్పష్టంగా చెప్పలేము. కత్తీ పోయి డాలు వచ్చే ఢాంఢాంఢాం అన్నట్లుగా ఆవిర్బవం నుంచీ తొడుగా ఉన్న మిత్రుడు దూరమై కొత్త మిత్రులు వచ్చారు అని మాత్రమే చెప్పగలం.  జేడీఎస్ దూరమై ఆప్ దగ్గరైంది. వామపక్షాలు వచ్చి చేతులు కలిపినా.. ఆ పార్టీలకు కేసీఆర్ బలం కావాలే తప్ప కేసీఆర్ కు అవి బలంగా ఉండే అవకాశం లేదు. మరి ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సాధించిందేమిటయ్యా అంటే జేడీఎస్ ను దూరం చేసుకుని ఆప్ కు దగ్గరవ్వడం. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో.. ఆప్ అధినేత కేజ్రీవాల్ కు కూడా అంతే బలీయంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో పాగా కోసం ఆప్ గతంలో కొంత ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదు. దీంతో ఆయన వ్యూహం మార్చి తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి ఆప్ ను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం హస్తినలో ఆందోళనలకు దిగినప్పుడు కూడా స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారాస విషయంలో మాత్రం ఆయన ఖమ్మం సభకు రావడానికి ముందు వరకూ ఎటువంటి సానుకూలతా ప్రదర్శించలేదు. హిమాచల్, గుజరాత్ ఎన్నికలలో ఆప్ పరాభవం తరువాత వ్యూహం మార్చుకుని భారాస ఆవిర్భావ సభకు హాజరయ్యారు. భారాస అండతో తెలంగాణలో  బలోపేతం అన్న వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ పార్టీ పూర్తిగా విస్తరించకముందే.. కొందరు మిత్రులను దూరం చేసుకుని కొత్త మిత్రులకు దగ్గరయ్యారు అని మాత్రమే భారాస ఆవిర్భావ సభ ద్వారా వెల్లడైంది. అయినా తనకు తానుగా జాతీయ నాయకుడినని భావిస్తున్న కేసీఆర్ కు నిజంగా ఆ గుర్తింపు వచ్చిందా? ఓ ముగ్గురు, నలుగురు ఇతర పార్టీల కు చెందిన నాయకులు మద్దతు పలికితే బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోతుందా? ఆయనకు జాతీయ నేతగా గుర్తింపు వచ్చేసిందా? ఆయనను కలిసిన వారంతా తమ నాయకుడిగా కేసీఆర్ ను అంగీకరించేసినట్లేనా?  అంటే కాదనే రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత మూడు నాలుగేళ్లుగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన కేసీఆర్ సొంతంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసేసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేస్తానంటున్నారు.  కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్  వంటి వారు జాతీయ రాజకీయాలలో బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత విషయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వారు ముగ్గురూ కూడా ఆది నుంచీ కేసీఆర్ తో అడుగులు వేయడానికి సుముఖంగా లేరు. స్టాలిన్ అయితే కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర శక్తుల ఐక్యత వీలుకాదని ఇప్పటికే కుండ బద్దలు కొట్టేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ది కూడా దాదాపు అదే బాణి, అదే బాట. ఆయన సొంత రాష్ట్రం బీహార్ లో జేడీఎస్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో పొత్తులో ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆవిర్బావ సభతో కేసీఆర్ సాధించిందేమిటన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది.  

ఫామ్ హౌస్ కేసు.. తెర వెనుక ఏదో జరుగుతోందా?

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ట్రాప్ చేసి పట్టుకున్న ఫామ్ హౌస్ కేసు ఎటూ కాకుండా ఇరుక్కుపోయింది. సిట్ దర్యాప్తును వేసి.. బీఎల్ సంతోష్ లాంటి బీజేపీ పెద్ద తలకాయని ఇరికించేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినా చివరికి రివర్స్ అయింది. హైకోర్టు కేసును సీబీఐకి ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ వ్యూహం దెబ్బతింది. అనుకున్నదొకటీ అయినదొకటీ అన్నట్లుగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి.  ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యుత్సాహం  పార్టీ చేతిలోని ఆయుధాన్ని ప్రత్యర్థికి అప్పగించిందని పార్టీవర్గాలే అంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విషయంలో కేసీఆర్ బీజేపీ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టానని సంబరపడినంత సేపు పట్ట లేదు.. ఆ కేసు తిరిగి తిరిగి తమ పార్టీ ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటోందని తెలియడానికి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.  కేంద్రానికేనా దర్యాప్తు సంస్థలు.. రాష్ట్రాలకు లేవా అంటూ ఈ కేసు దర్యాప్తునకు సీట్ ను ఏర్పాటు చేసినప్పుడు పార్టీ క్యాడర్ లో,  పార్టీ మారాలంటూ  తమను ప్రలోభ పెట్టారంటూ ఫిర్యాదు చేసిన అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపించిన ధీమా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించడంతో నీరుగారిపోయింది.  ఇందుకు  ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గాభరా, కంగారూ  నిదర్శనం. ట్రాప్ జరిగిన సమయంలో పోలీసులు కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు జరిగిన ప్రచారమే కానీ, అందుకు తగ్గ ఆధారాలు ఇప్పటికీ బయటకు రాలేదు.  నిజంగా అప్పట్లో సొమ్ము బయటపడి ఉంటే.. ఈడీ ఈ పాటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించేసి ఉండేది. అయితే ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే అప్పట్లో సొమ్ము రికవరీ చూపలేదన్న వాదన కూడా ఉంది. అయితే ఫామ్ హౌస్ కేసులో సొమ్ములు కనిపించకపోయినా  వ్యూహాత్మకంగా ఈడీ రంగప్రవేశం చేసింది. ఆ వెను వెంటనే హైకోర్టు   సీబీఐకి కేసు అప్పగించింది. దీంతో ఈ కేసు విషయంలో ఒక తార్కిక ముగింపునకు ఎంతో సమయం పట్టదన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లోనూ, రాజకీయ వర్గాలలోనూ కూడా వ్యక్తమైంది. సీబీఐ, ఈడీల రంగ ప్రవేశంలో ఇక ఫామ్ హౌస్ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ,   సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లే కాక, ఫిర్యాదు చేసి నలుగురు ఎమ్మెల్యేలూ కూడా దర్యాప్తు సంస్థల స్కాన్ లోనే ఉంటారు. ఎవరు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించారన్న దగ్గర నుంచి, ఎలా ట్రాప్ చేశారు, సొమ్ముల సమీకరణ ఎలా వరకూ అన్ని అంశాలనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలుగులోనికి తీసుకు వస్తాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో సిట్ వైపు నుంచి మాత్రమే వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు సిట్ ఇంత వరకూ చేసిన దర్యాప్తు, వెల్లడించిన విషయాలూ అన్నీ పక్కకు వెళ్లిపోతాయి. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం ఇక సిట్ కు లేదు.  సో.. ఆ దర్యాప్తును అంతా పక్కన పెట్టేసి కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రోహిత్ రెడ్డి కంగారు పడుతున్నారు. ఈడీ, సీబీఐలకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారమే లేదంటున్నారు. హైకోర్టు ఫామ్ హౌస్ ట్రాప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రోహిత్ రెడ్డి తన స్పందన తెలిపారు. కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారన్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని నిందలేశారు. కోర్టు తీర్పు మేరకే కేసును సీబీఐ దర్యాప్తు చేయనుందన్న సంగతి విస్మరించి మరీ బీజేపీపై నిందలేశారు. అంతకు ముందు ఇదే కేసుకు సంబంధించి తనను ఈడీ విచారించిన తరువాత కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు. రెండు సందర్భాలలోనూ ఆయనలో ఆందోళన, గాభరా స్పష్టంగా కనిపించింది. మీడియా ముందుకు రాలేదు కనుక మిగిలిన ముగ్గురూ ఎలా ఫీల్ అవుతున్నారన్న సంగతి తెలియడం లేదు.. కానీ ఈ ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో మొదటి నుంచీ క్రియాశీలంగా ఉన్నదీ, కీలకంగా వ్యవహరించినదీ పైలట్ రోహిత్ రెడ్డే. ఈడీ విచారణ అనంతరం తనపై కేసులు నమోదౌతాయనీ, అరెస్టు చేస్తారనీ అనుమానం వ్యక్తం చేసిన ఆయన నందకుమార్ ఫిర్యాదు మేరకే తనపై కేసులు పెడతారన్నారు. అయినా ఫామ్ హౌస్ లో డబ్బుల చెలామణియే జరగలేదనీ, అలాంటప్పుడు కేసులు ఎలా పెడతారనీ కూడా ప్రశ్నించారు.   అసలు వాస్తవానికి రోహిత్ రెడ్డి నందకుమార్ ద్వారా బీజేపీ పెద్దలు తనను ప్రలోభపెట్టారనీ, పార్టీ మారితే వందకోట్లు ఇస్తామని ప్రతిపాదించారనీ ఆరోపించారు. ఇంతకీ ఈ నందకుమార్ స్వయంగా రోహిత్ రెడ్డికి పార్టనర్. ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్ కేసులో ఇంత వరకూ బయటపడని మరింత లోతైన వ్యవహారం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ అనుమానాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడౌతాయని పరిశీలకులు అంటున్నారు. అలా వెల్లడౌతాయన్నకంగారు రోహిత్ రెడ్డి మాటల్లో బయటపడుతోందనీ అంటున్నారు.  మొత్తం మీద సిట్ దర్యాప్తు తో బీఆర్ఎస్ నేతల్లో కనిపించివన ధీమా ఇప్పుడు హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోనికి దిగనుండటంతో ఆవిరైపోయినట్లే అన్న  భావన సర్వత్రా వ్యక్తమైంది. అయితే ఆ తరువాతే కథ విచిత్రంగా మలుపులు తిరుగుతోంది. కేసును సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ అప్పీల్ కు వెళ్లింది.  కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అంతే ఇటు సిట్ దర్యాప్తుతో పాటు సీబీఐ దర్యాప్తు కూడా నిలిచిపోయింది.   సీబీఐ విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు అయినా  ఆ దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించలేదు. జనరల్ కన్సంట్ లేదన్న సాకు చూపుతూ వాచారణ కోసం సీబీఐ తెలంగాణ సర్కార్ కు లేఖ రాసింది.  హైకోర్టు ఆదేశించినందున అలా అనుమతి కోరాల్సిన అవసరమే లేదు.  అయినా సీబీఐ అనుమతి కోరుతూ లేఖ రాసింది. కోర్టు తీర్పు కారణంగా అనుమతి నిరాకరించే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. అందుకే అనుమతి నిరాకరించనూ లేదు.. అలాగని అనుమతి ఇవ్వనూ లేదు. ఇటు తెలంగాణ సర్కార్, అటు సీబీఐ కూడా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయని భావించాలి. అన్నిటికీ మించి ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా హఠాత్తుగా అనూహ్యంగా మౌనం దాల్చాయి. కేసు కోర్టు పరిధిలో ఉంది కనుక మాట్లాడటం లేదని అనుకోవడానికి కూడా లేదు. దీంతో ఈ నిశబ్దం ఈ కేసు విషయంలో తెరవెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

శుభమన్ గిల్ డబుల్ సెంచరీ..న్యూజిలాండ్ తో తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్  విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు   ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల వరకూ వెళ్లినా బ్రేస్ వెల్   బ్రేస్ వెల్ పోరాటం జట్టును పోటీలోకి తీసుకువచ్చింది.  తొలుత  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఓపెనర్  శుబ్ మన్ గిల్ 149 బంతులలో ఆరు సిక్సర్లు, 19 ఫోర్లతో అజేయంగా 208 పరుగులు చేశాడు. గిల్ మినహా మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. స్కిప్పర్ రోహిత్ శర్మ 38 బంతులలో 34 పరుగులు,   విరాట్ కోహ్లీ పది బంతులలో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. తర్వాత ఇషన్ కిషన్ 14 బంతులలో 5 పరుగులు చేసీ ఔట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 31 పరుగులు,  హార్దిక్ పాండ్యా 38 బంతులలో 28 పరుగులు చేశారు. ఇక చివరిలో వాషింగ్టన్ సుందర్ 14 బంతులలో 12 పరుగులు చేయగా .. శార్దుల్ ఠాకూర్ మూడు బంతులలో మూడు పరుగులు చేయడం జరిగింది. భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్  ఆరంభం నుండే వికెట్లు కోల్పోతూ వచ్చింది. 130 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన దశలో ఆ జట్టు విజయం గురించి ఎవరికీ అంచనాల్లేవు. ఆ స్థితిలో  బ్రేస్ వెల్, శాంట్నార్   క్రీజులో నిలదొక్కుకొని అటాకింగ్ గేమ్ ఆడి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇ న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ ను రేసు గుర్రంలా పరుగులు పెట్టించారు. దీంతో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే ఒక అధ్భుత బంతితో   సిరాజ్  శాంట్నార్(57)ను అవుట్ చేయడంతో న్యూజిలాండ్ జోరు తగ్గింది. ఆ తర్వాత బ్రేస్ వెల్.. ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాట్స్ మెన్ లు…క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. దీంతో 12 పరుగుల తేడాతో ఇండియా గెలవడం జరిగింది. ఉత్కంఠ భరీతంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్ సిరజ్ 4 వికెట్లు తీశాడు.శుభమన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో డబుల్ సెంచురీ బాది తన సత్తా చూపారు శుభమన్. కేవలం 145 బంతుల్లోనే డబుల్ సెంచురీ చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో శుభమన్ ఆట క్రికెట్ లవర్స్ ను అలరించింది. ఇలా వన్డేల్లో డబుల్ సెంచురీ చేసిన ఐదవ ఇండియన్ క్రికెటర్ గా శుభమన్ గిల్ నిలిచాడు. డబుల్ సెంచురీ ఫీట్ లో భాగంగా ఆయన 19 బౌండరీలు, 8   సిక్సులు కొట్టి ఆకట్టుకున్నారు. వన్డేల్లో ఇలా డబుల్ సెంచురీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు శుభమన్ గిల్.

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఎన్నికల షెడ్యూల్ ఇదే!

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది.  త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మేఘాలయ,నాగాలాండ్‌లలో కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడతాయని తెలిపింది.   నాగాలాండ్ శాసన సభ గడువు మార్చి 12తోనూ, మేఘాలయ అసెంబ్లీ గడువు మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  బుధవారం (జనవరి 18)  మీడియా సమావేశంలో  త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. ఎన్నికల అక్రమాలపై సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేస్తే తక్షణమే స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలంటే ప్రజా భాగస్వామ్యం తప్పని సరి అని ఆయన పేర్కొన్నారు.

కొత్త బడ్జెట్ పై కోటి ఆశలు .. శతకోటి సందేహాలు!

బడ్జెట్ అనగానే, అందరికీ కామన్ గా ఉండే కోర్కెలు కొన్నుంటాయి. మరో వంక ఎవరి లెక్కలు వారి కుంటాయి.  ఎంత కాదనుకున్నా  ఎవరికివారు నాకేంటి? అని ప్రశ్నించు కుంటారు. అయితే, ఎవరి కోర్కెలు ఎలా ఉన్న సర్కార్ వారి ప్రాధాన్యతలు సర్కార్ వారి కుంటాయి.  చివరకు  మన తెలుగింటి కోడలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ను ఎంత రుచిగా, శుచిగా సిద్దం చేస్తారో...  ఎంత చక్కగా వండి వార్చి వడ్డిస్తారో... చూడవలసిందే.  తినబోతూ రుచులేందుకు అనుకోవలసిందే. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, ఫిబ్రవరి 1న వరసగా ఐదవ సారి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2023- 2024 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు.  గత మూడేళ్ళుగా కొవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. అలాగే  పైపైకి పరుగులు తీసిన ద్రవ్యల్బణం కూడా గడచిన రెండు మూడు నెలలుగా మెల్ల మెల్లగా ఒక్కో మెట్టూ దిగి వస్తోంది.  నిజానిక ,కొవిడ్ అనంతర కాలంలో ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారులకు బడ్జెట్    కసరత్తులో ఎంత  ఒత్తిడి ఎదుర్కున్నారో వేరే చెప్పనక్కరలేదు. అయుతే ఈసారి ఆ ఒత్తిడి కాసింత తగ్గింది. నిధుల కేటాయింపు విషయంలో కొంత మేరకు  వెసులు బాటు కలిగిందని అనుకోవచ్చునని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అదే సమయంలోప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రం అభిలషనీయం కాదని,   ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తునారు కూడా.   అదలా ఉంటే వచ్చేది ఎన్నికల సీజన్ ...  2023లో తొమ్మిది రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటుగా, 2024 లోక్ సభ ఎన్నికలకు కూడా ఈ బడ్జెట్టే దిక్సూచి.  వచ్చే సంవత్సరం 2024 ఏప్రిల్, మే నెలలలో లోక్ సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఎన్నికలకు ముందు ప్రస్తుత మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్  ఇదే కావడంతో ఈ బడ్జెట్  పై అంచనాలు  అధికగానే ఉన్నాయి. అయితే, చివరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఎవరి అంచనాలను ఏ మేరకు నెరవేరుస్తారన్నది .. ఫిబ్రవరి 1న గానీ తెలియదు. కానీ, ఎంత కాదన్నా  ఎన్నికల సంవత్సరంలో ప్రజాకర్షక పథకాల విషయంలో ఆర్థిక మంత్రి కట్టుబాట్లను కొంత మేర సడలించుకోక  తప్పదని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.    అయినా ఎప్పటిలానే వడ్డింపులు ఉంటాయా? తాయిలాలు ప్రకటిస్తారా? మధ్య తరగతి ముచ్చట తీరుస్తారా? వేతన జీవులకు పన్నుపోటు నుంచి మరి కొంత ఉపశమనం కల్పిస్తారా? అనే చర్చ అయితే జోరుగానే సాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవుల ఈసారి బడ్జెట్‌లో పన్ను స్లాబ్‌లలో మరింత సడలింపును ఆశిస్తున్నారు. కొత్త పన్నులు వద్దమ్మా .. అని నిర్మలమ్మను కోరుకుంటున్నారు. కోవిడ్ కాలంలో  ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఇబ్బంది పడుతున్న కార్మికవర్గం ఈసారి మోడీ ప్రభుత్వం పన్ను శ్లాబులలో మినహాయింపు ఇవ్వగలదని ఆశతో ఉన్నారు. కొత్తగా పన్నుల వడ్డన ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన ప్రాయంగానే అయినా స్పష్టమైన సంకేతమే ఇచ్చారు.  కానీ, శ్లాబులపై ఇంకా స్పష్టత రాలేదు.  రాజకీయంగా ఒత్తిళ్ళు పెరుగతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం , ప్రస్తుత బడ్జెట్  ఎన్నికల బడ్జెట్  గానే  వండి వారుస్తుందనే ఆశలు మాత్రం మధ్యతరగతి ప్రజల్లో మెండుగా ఉన్నాయి. అందుకే మధ్యతరగతి  ఫిబ్రవరి 1 కోసం ఎదురుచుస్తున్నది. అలాగే, నిరుద్యోగ యువత కొత్త బడ్జెట్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి కల్పన కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపధ్యంలో మధ్య తరగతి ప్రజల జీవనోపాధి అవకాశాలు కల్పనకు బడ్జెట్ దారి చూపుతుందని ఆశిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య బీమా రంగం పుంజుకుంది. అయితే ఆరోగ్య బీమా విషయంలో ప్రభుత్వం నుంచి నిబంధనలలో కొంత సడలింపు ఉంటుందని అన్నివర్గాల ప్రజలు ఆశిస్తున్నారు. ఆరోగ్య బీమా, జీవిత బీమాలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని కోరుతున్నారు. ఇలా మధ్య తరగతి కోర్కెల చిట్టా చాలానే వుంది. అయితే నిర్మలమ్మ  ఏమంటారో..  ఎవరిని ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి మరి ..

కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారం.. అదే బీజేపీ లక్ష్యం

ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నదే ఆ దిశా నిర్దేశం. ఇప్పటికే వరుసగా రెండు సార్లు తన నాయకత్వంలో పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, దేశంలోని మోజారిటీ రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకునే లా విజయవంతంగా వ్యూహాలు పన్నిన మోడీ.. ముచ్చటగా హ్యాట్రిక్ విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను అమలు చేయడమే కాకుండా.. పార్టీ శ్రేణులకు కార్యాచరణ ప్రాణాళికను కూడా ఇచ్చేశారు.   మరో 400 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం కోసం పని చేయాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా యువ ఓటర్ల వద్దకు పార్టీ చేరుకోవాలని మోడీ పార్టీ కార్యవర్గ సమావేశాలలో ఉద్బోధించారు.  18-25 ఏళ్ల మధ్య ఉన్న ప్రజలందరినీ పార్టీ రీచ్ అవ్వాలనీ.. యువతను పార్టీ చేరుకోగలిగితే విజయం సులభ సాధ్యమౌతుందని ప్రధాని మోడీ  ప్రభోదించటం వెనుక భారీ స్కెచ్ ఉందంటున్నారు. పరిశీలకులు. దేశంలో యువ జనాభా, యువ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు ఫస్ట్ టైం ఓటర్లే..కాబట్టి యువతను ఆకట్టుకుంటే ఆ కుటుంబాన్నంతా గంపగుత్తగా ఆకట్టుకున్నట్టేనన్నది మోడీ  ఉద్దేశంగా చెబుతున్నారు. యువతకు రాజకీయాలంటే ఆసక్తి ఉన్నా పెద్దగా పట్టుండదని పైగా చరిత్ర, సమకాలీన పరిస్థితులపై సరైన అవగాహనా ఉండదు కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇందుకు సామాజిక మాధ్యమాన్ని మించిన వేదిక, సాధనం లేదని మోడీ విస్పష్టంగా చెప్పారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఎకానమీగా భారత్ ను తీర్చిదిద్దిన ఘనత తమదేనంటూ ప్రజల్లో ఊదరగొట్టడాన్ని బీజేపీ తన అజెండాలో పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం కూడా ఇదేనని పరిశీలకులు వివ్లేషిస్తున్నారు. రామ మందిర నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టడం మొదలు.. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 360ని ఉపసంహరించటం వరకూ గత రెండు దఫాలుగా మోడీ సర్కారు చేపట్టిన   నిర్ణయాలను ప్రచారంలోకి తేవాలని డిసైడ్ అయినట్టు మోడీ మాటలను బట్టి అవగతమౌతోంది.   సంతృప్తికరమైన పాలన అన్న నినాదంతో 2024 లోక్ సభ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోందన్నది వారి విశ్లేషణల సారాంశం. అందుకే మోడీ బీజేపీ ఇప్పుడు కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక సామాజిక ఉద్యమం అని మోడీ అంటున్నారు.  ప్రత్యర్థుల ఎత్తులను ఆదిలోనే చిత్తులు చేసేలా ఆస్త్రాలను సంధించే పని బీజేపీ ఇప్పటి నుంచే మొదలెట్టేసింది.  దేశ భవిష్యత్తు   గొప్పగా, ఉజ్వలంగా ఉంటుందని భరోసా కలిగేలా, విపక్షాలు అత్యంత బలహీనంగా ఉన్నాయని నమ్మేలా ప్రజలలో ప్రచారాన్ని ఊదరగొట్టేయడమే బీజేపీ తాజా వ్యూహం అని పార్టీ కార్యవర్గ సమావేశంలో మోడీ ప్రసంగాన్ని బట్టి అర్థమౌతుంది.   బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ తెలంగాణ బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలన్న మోడీ మాటలు తెలంగాణ బీజేపీకి పెద్ద టానిక్ లా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేపట్టిన యాత్ర బాగుందని.. దీన్ని మిగతా రాష్ట్రాలు రోల్ మోడల్ గా తీసుకోవాలని మోడీ చెప్పటం మిగతా రాష్ట్రాలపై గట్టి ప్రభావం చూపటం ఖాయం. ఇంత భారీ యాత్రను బండి ఎలా చేపట్టారో అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపాలన్న మోడీ నిర్ణయం దక్షిణాదిలో బీజేపీకి మరింత ఉత్సాహాన్ని, ఊపునూ తీసుకువస్తుందన్నది ఆయన ఉద్దేశం, ఎత్తుగడగా కనిపిస్తోంది. దేశంలో మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రభావమంతంగా ప్రచారం చేసుకోవడంలో పార్టీ సఫలం కాలేదన్నది రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయం.  అందుకే అన్నిరకాల ప్రచార, ప్రసార సాధనాలను గరిష్ఠంగా ఉపయోగించుకునేలా సన్నద్ధం కావాలన్నది మంగళవారం ముగిసిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయంగా చెప్పాలి. కర్నాటక, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగనున్న ప్రతి అసెంబ్లీ ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే 2024లోక్ సభ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్నది మోడీ ప్రసంగ సారాంశం.  2023 ఏడాది పార్టీ దృష్ట్యా అత్యంత ముఖ్యమైన సంవత్సరమని పదేపదే నద్దా, మోడీ-షాలు పేర్కొంటుండటం వెనుక ఉన్న కారణం కూడా ఇదే. అలాగే బీజేపీకి  కొరకరాని కొయ్యలుగా మారిన 160 లోక్ సభ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయా నియోజకవర్గాలలో పాగా వేసేలా  కార్యచరణను చేపట్టాలని మోడీ ఆదేశం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ తోపాటు సబ్కా ప్రయాస్ కూడా అవసరం అంటూ మోడీ కొత్త నినాదాన్ని పార్టీకి అందించారు.  ఓబీసీలను మరింత మచ్చిక చేసుకుని, ఎస్సీ, ఎస్టీలను తమ పార్టీ వైపుకు పెద్ద ఎత్తున మళ్లించేలా కమలనాథులు చేస్తున్న కృషి సరిపోదని.. అన్ని రాష్ట్ర శాఖలు మరింత కృషి చేయాలంటూ ఎండ్ టు ఎండ్ ఎన్నికల సిద్ధాంతాన్ని వల్లె వేస్తూ బీజేపీ లీడర్లందరికీ కార్యవర్గ సమావేశం టార్గెట్లు నిర్దేశించింది.  ఈ ఏడాది జరిగే 9 అసెంబ్లీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేస్తే తప్ప వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం అన్న పార్టీ లక్ష్యం సాకారదన్న ఉద్దేశంతో బీజేపీ కార్యవర్గ సమవేశం వేదికగా నిర్ణయించింది. 

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవమే.. రఘురామ ఫ్లాష్ సర్వే వెల్లడి

రాష్ట్రంలో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఊహకు అందనంత మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని వైసీపీ రెబల్ ఎంపీ  కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలు టిడిపికి దన్నుగా నిలిచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయనిరఘురామకృష్ఱం రాజు అన్నారు.   తాను ప్రాంతాల వారిగా ఇటీవల నిర్వహించిన ఫ్లాష్  సర్వేలో తెలుగుదేశం కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని తేట తెల్లమయిందని చెప్పారు. మంగళవారం (జనవరి 17) రచ్చబండ కార్యక్రమంలో  ఆయన ఉత్తరాంధ్ర లో పది నుంచి 12 శాతం టిడిపికి  ఎడ్జ్ ఉంటే, ఉభయగోదావరి జిల్లాలలో అది 14 నుంచి 16 శాతం, కృష్ణా, గుంటూరు జిల్లాలలో 12 నుంచి 14 శాతం, ఒంగోలు నెల్లూరులలో ఎనిమిది నుంచి పది శాతం, అనంతపురం, కర్నూలులలో 10 నుంచి 12 శాతం, కడప చిత్తూరులలో 6 నుంచి 8 శాతం   ఉందని వివరించారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని తాను మొదటి నుంచి చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వై నాట్ 175 అని  వైసీపీ అధినేత, ఆ పార్టీ నాయకులు ఎంతగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా, వాస్తవం వారికి పూర్తిగా ప్రతికూలత ఉందని స్పష్టమైతోందని పేర్కొన్నారు.   ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే వైసీపీకి దారుణమైన పరాభవం తప్పదని అనిపిస్తోందని అన్నారు. గత ఎన్నికలలో వైసీపీ గెలుపునకు దోహదపడిన బాబాయ్ హత్య, కోడి కత్తి కేసులు ఇప్పుడు అధికార పార్టీకి బూమరాంగ్ అవుతాయన్నారు. అప్పుడు వైసీపీ వైఎస్ వివేకా హత్య వెనుక తెలుగుదేశం ఉందని ఆరోపించిందనీ, అలాకే కోడి కత్తి తో తనను హత్య చేయడానికి తెలుగుదేశం ప్రయత్నించిందని చాటుకుని జగన్ సానుభూతి పొందారనీ, ఇప్పుడా రెండు కేసుల వెనుక ఉన్నది ఎవరన్నది స్పష్టంగా తేలిపోవడంతో.. నాడు వైసీపీకి ప్లస్ అయిన ఈ రెండు కేసులూ కూడా మైనస్ అయి ఆ పార్టీ పుట్టి ముంచబోతున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు.

కుక్కలతో పాము ఫైట్

మామూలుగా వీధికుక్కల ఫైట్ చూస్తూనే ఉంటాం. అయితే ఒక పాముతో వీధికుక్కలు వీరోచితంగా ఫైట్ చేసిన సన్నివేశానికి మాత్రం హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీ పార్క్ వేదిక అయ్యింది. నాలా లోంచి బయటకు వచ్చిన పాము పరిసరాలలోని ఇళ్ల వైపు వెడుతుండగా గమనించిన రెండు వీధికుక్కలు దానిని అడ్డగించాయి. ఫైట్ చేశాయి. ఆ ఫైట్ లో పాము కాటుకు గురై ఒక కుక్క చనిపోయింది. అయినా సరే మరో కుక్క దానిని ఇళ్ల వైపు వెళ్ల కుండా అడ్డుకుంది. చివరకు ఆ పామే.. యుద్ధం విరమించి పొదల్లోకి పాక్కుంటూ వెళ్లిపోయింది. ఈ ఫైట్ కు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్ అయ్యాయి.