కారులో తిరుగుబాటు కారణం అదేనా?

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.ముఖ్యంగా,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో అనూహ్య పరిణామాలు అతి వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నిజానికి, పార్టీలో, ప్రగతి భవన్  లో ఏమి జరుగుతోందో ఎవరికీ  స్పష్టంగా ఎవరికీ ఏమీ తెలియక పోయినా ఏదో జరిగిపోతోందనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఓ వంక ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం, మరోవంక అడ్డం తిరిగిన, భారాస ఎమ్మెల్యేల బేరసారాల కేసు విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు ప్రగతి భవన్ తలుపులు తడుతుందో అర్థం కాని ఆందోళనకర పరిస్థితి. మరోవంక  ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పార్టీలో రీసౌండ్ చేస్తున్న అసమ్మతి... ఈ అన్నిటినీ మించి, బీఆర్ఎస్ ముహూర్త బలం మీద వ్యక్త మవుతున్న అనుమానాలు. బీఆర్ఎస్ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు.   బీఆర్ఎస్ ముహూర్త బలం సంగతి ఎలా ఉన్నపటికీ పేరు మార్పుతో తెలంగాణ సెంటిమెంట్ చేజారి పోతోందనే అందోళన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిథులను వెంటాడుతోంది. మరోవంక పార్టీ భవిష్యత్ తో పాటుగా పార్టీలో తమ  భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలోనే పార్టీలో అసంతృప్తి, అసమ్మతి మెల్లమెల్లగా బయటకొస్తున్నాయని అంటున్నారు. వీటన్నిటికీ తోడు ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న నేతలు.. సిట్టింగులకే సీట్లు అంటూ పార్టీ అధినాయకత్వం చేస్తున్న ప్రకటనలతో, పలువురు ఆశావహులు  పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవంక, లీక్ అవుతున్న సర్వే రిపోర్టుల  ప్రకారం పది మంది మంత్రులతో పాటుగా 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరని జరుగతున ప్రచారంతో పార్టీలో పక్క చూపులు చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపద్యంలో ఖమ్మం జిల్లాలో మొదలైన గులాబీ రివోల్ట్ ఇప్పుడు మెల్లమెల్లగా ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది.ఖమ్మం జిల్లాలో మాజీ  ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే తన అసంతృప్తిని బహిరంగంగానే బయట పెట్టారు. మరోవంక ఆయన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి, పొంగులేటి కాషాయ ధారణకు  ముహూర్తం వినా మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. అలాగే పొంగులేటి పార్టీ మారితే, ఆయనతో పాటుగా భద్రాద్రి జడ్పీ చైర్మన కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మన మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణకుమారి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మట్టా దయానంద్‌, కోట రాంబాబు, తెల్లం వెంకటరావు, ఎస్సీ కార్పొరేషన మాజీ చైర్మన పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటకు చెందిన జారే ఆదినారయణ సహా పెద్ద సంఖ్యలోనే  భారాస నాయకులు, కార్యకర్తలు బీజేపీ గూటికి చేరతారని అంటున్నారు. అందుకే పొంగులేటి పార్టీ మారడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన  భారస నాయకత్వం ఆయన  వెంట వెళ్ళేవారిని గుర్తించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెసుస్తోంది.  మరోవంక అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన భవిష్యత్ రాజకీయాలపై ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తన ఆత్మీయులు నిర్వహిస్తున్న సమావేశాలతో   బలాన్ని కూడగట్టుకుంటున్న ఆయన తన ప్రసంగాల్లో ఎక్కడా బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా మాట్లాడడంలేదు. కేసీఆర్‌ సహకారంతో చేసిన అభివృద్ధి చేశానని స్పష్టం చేస్తున్నారు. పాలేరు నుంచే పోటీకి సిద్ధంగా ఉన్న ఆయనకు బీఆర్‌ఎస్‌ ఏమేరకు ప్రాథాన్యమిస్తుందనేది అంతుపట్టడం లేదు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పాలేరు అభ్యర్థిత్వం ఇస్తే సరే.. లేదంటే కాంగ్రెస్ లేదా బీజేపీ  మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. తుమ్మల ప్రస్తుతానికి అయితే ఖచ్చితమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదని, ఆయన నిర్ణయం తీసుకుంటే, ఆయనకు అనుకూలంగా ఉన్న వైరా మాజీ ఎమ్మెల్యే మదనలాల్‌ సహా వేర్వేరు నియోజక వర్గాలకు చెందిన అసంతృప్త నేతలు, వారి అనుచరులు ఆయన వెంట నడిచే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే  జూపల్లి కృష్ణారావు కూడా త్వరలోనే కారు దిగడం ఖాయమంటున్నారు. నిజానికి, బయటకు వినిపిస్తున్న పేర్లు కొన్నే అయినా, భారాస నుంచి బయట పడేందుకు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా గులాబీ నేతలు పదుల సంఖ్యలో సిద్దంగా ఉన్నారని అంటున్నారు. అందుకే తెలంగాణ రాజకీయాలు ఎప్పడు ఏ మలుపు తిరుగుతాయో ...అంతు చిక్కడం లేదని అంటున్నారు.

కండువాలూ, ఖర్చులూ మావే .. బీఆర్ఎస్ బంపర్ ఆఫర్

అదిగో ఆ ..గుండాయన ... డబ్బులు ఎవరికీ ఊరికే రావు ...అన్నారు, కానీ, అది తప్పు. ఆయన ఏదో తెరాస కాలంలో ఉండి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఏమో,కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ జమానాలో పైసలే కాదు, పార్టీ పదవులు కూడా ‘ఫ్రీ’ గానే వస్తాయి. ఉచిత కడువాలు కప్పుకుంటే చాలు, ఖర్చులే కాదు, కావాలంటే ఎక్స్చేంజి, షేరింగ్ ఆఫర్లు, నజరానాలు అందుకోవచ్చును. అయితే అందుకు కొన్నికండిషన్స్ అప్లయ్ అవుతాయి. షరతులు వర్తిస్తాయన్న మాట.  అయితే అవేమీ మరీ అంత కఠిన షరతులు కూడా కాదు. మీరు అలనాటి లంకలో పుట్టిన రాక్షసులే అయినా ఫర్వాలేదు ... మీకు ఏపీలో కాసింత గుర్తింపు ఉంటే చాలు,అలాగే నాలుగైదు పార్టీలు మారిన అనుభవము ఉంటే అది అదనపు అర్హత అవుతుంది. అలాగే, పోటీ చేసిన ప్రతి ఎన్నికలో ఓడి పోయిన అనుభవము ఉంటే ఇక తిరుగే లేదన్న మాట ... అలాంటి వారి కోసం బీఆర్ఎస్ తలుపులు ఎప్పుడూ బార్లా తెరుచుకునే ఉంటాయి.   సరే .. ఇదంతా ఏదో కాసింత తికమకగా గందరగోళం వుంది కదూ. ఇక డైరెక్ట్’గా పాయింట్లోకి వచ్చేద్దాం.   తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి (భారాస) గా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్, బంగారు తెలంగాణ బాటలో దేశాన్ని ‘బంగారు భారత్’ గా అభివృద్ధి చేసే పవిత్ర ఆశయంతో అడుగులు వేస్తున్నారు కదా.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని సంకల్పించారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్’ మీద కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. సొంత రాష్ట్రం సంగతి తర్వాత చూసుకుందామని, ముందు పక్కరాష్ట్రం  ఏపీకి పార్టీ అధ్యక్షుడిని అప్పాయింట్ చేశారు. అలాగే, ఏపీలో పార్టీలో చేరేందుకు ముందుకొచ్చే వారి కోసం ఒక బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చారని అంటున్నారు. సహజంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరేటప్పుడు, మంది మర్బాలాన్ని వెంట తీసుకు వెళ్లేందుకు, పెట్రోల్ ఖర్చులతో పాటుగా అనుచరుల విందు వినోదాలకు చేతి చమురు వదిలించుకోవలసి వస్తుంది. కానీ, ఏపీ నుంచి బీఆర్ఎస్’లో చేరేవారి కోసం కేసీఆర్, చుక్క చేతి చమురు అవసరంలేని బంపర్ ఆఫర్ ప్రకటించారని అంటున్నారు. బీఆర్ఎస్ లో చేరే నాయకులు, ఇంటి గడప దాటి కాలు బయట పెట్టింది మొదలు తిరిగి ఇల్లు చేరే వరకు అన్ని సదుపాయాలు బీఆర్ఎస్ చూసుకుంటుంది. అంతే, కాదు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారికి  అతిధి మర్యాదలు చేయడంతో పాటుగా బరువైన గిఫ్ట్ పాకెట్స్ కూడా ఐచ్చి పంపుతున్నారని అంటున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ నుంచి మూడు పార్టీలు మారిన జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ మాజీ అధికారి పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రశేఖర్’ను ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నియమించారు.ఈ ముగ్గురు ఏపీ నుంచి హైదరాబాద్‌’ చేరుకొని, భారాస కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆ ముగ్గురు నాయకుల వెంట వారి అనుచరులు భారీగానే ‘లగ్జరీ’ కార్లలో తరలివచ్చారు. తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు, స్వాగత తోరాణాలు కట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఖర్చుకు వెనకాడకుండా భారీగా ఖర్చు పెట్టారు. నిజానికి ఈ ఘన స్వాగతాలు, అతిధి సత్కార్యాలు చూసిన  ఏపీలో ఎటూ కాకుండా ఉన్న రాజకీయ నిరుద్యోగులు, పొలో మంటూ బీఆర్ఎస్’లో చేరేందుకు పరుగులు తీస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందులోను ఉచితాలకు అలవాటు పడిన ప్రాణాలు కదా .. మందు మాకు మర్యాదలు ఉచితంగా వస్తుంటే ఎలా కాదనగలరు.. అయితే విందు వినోదాల కోసం పార్టీలో చేరే వారు, నిజంగా పార్టీ కోసం పనిచేస్తారా, అంటే అది వేరే విషయం అంటున్నారు పరిశీలకులు.

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. పొత్తుపై క్లారిటీ వచ్చేసినట్లేనా?

జగన్  పాలనను జన క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఇంత కాలం తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వ రాజ్యహింస, అణచివేత పతాక స్థాయికి చేరుకోవడంతో ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు కదలాలని నిర్ణయానికి వచ్చాయా? ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా? బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందా?  అంటే ఈ రెండు పార్టీల శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. ఏవో రెండు మూడు జిల్లాలు వినా దాదాపుగా అన్ని జిల్లాలలోనూ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు కూడా ఖరారైపోయాయని చెబుతున్నారు. ఈ ప్రచారానికీ, ఊహాగానాలకూ బలం చేకూర్చేలా జనసేనాని పవన్ కల్యాణ్ ఆదివారం (జనవరి 8)న హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు పార్టీల మధ్యా పొత్తు విషయంలో క్లారిటీ వస్తుందని అందరూ భావిస్తున్నారు.  ఇటీవల చంద్రబాబు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన సందర్భంగా జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డుకున్న తీరును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నా.. ఈ భేటీకి అంతకు మించి రాజకీయ ప్రాధాన్యత ఉందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలపై ఒక క్లారిటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. గతంలో పవన్ కల్యాణ్ ను ఆయన విశాఖ పర్యటన సందర్భంగా ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు చంద్రబాబు పవన్ కల్యాణ్ కు సంఘీ భావం తెలిపిన సంగతి విదితమే. ఇరు పార్టీలూ కూడా జగన్ దుర్మార్గ పాలన అంతం కావాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అంటూ  పవన్ కల్యాణ్ చాలా కాలం కిందటే రాష్ట్రంలో పొత్తుల చర్చకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచీ ఏపీలో రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒక దశలో బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీని కలుపుకుని ముందుకు సాగాలన్న ఉద్దేశాన్ని చాటిన పవన్ కల్యాణ్.. ఇటీవలి కాలంలో బీజేపీ కలిసి వచ్చినా లేకున్నా తెలుగుదేశంతో కలిసి సాగాలన్న ఉద్దేశాన్ని చాటుతున్నారు.    జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటి దాకా వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ వచ్చాయి. అయితే జీవో నంబర్ 1 రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. విపక్షాలు రాష్ట్రంలో సభలూ, సమావేశాలూ నిర్వహించడానికే వీల్లేకుండా చేస్తూ జారీ చేసిన జీవోతో ఇక కలిసి అడుగులు వేయాలన్న నిర్ణయానికి జనసేన, తెలుగుదేశం పార్టీలు వచ్చేసినట్లు పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సంఘీభావం తెలపడానికి ఆయన నివాసానికి వెళ్లడం తేటతెల్లం చేసింది.  ఇక ప్రస్తుతానికి వస్తే చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా జగన్ సర్కార్ దుర్మార్గ విధానాలు, విపక్షాలపై అణచివేత ధోరణిపై చర్చ జరిగిందని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఒక ఐక్య కార్యచరణతో ముందుకుసాగాలన్న అభిప్రాయం వీరి భేటీలో వ్యక్తమైందని అంటున్నారు.  ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వేర్వేరుగా చేస్తున్న పోరాటాన్ని ఇక ఐక్యంగా కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ భేటీలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్‌1పైనా చర్చ జరిగిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో వీరిరువురి భేటీకి ఎనలేని రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. 

అహంకారానికి పరాకాష్ట కుప్పం దుర్మార్గం

రాజకీయాల్లో బండ్లు ఓడలు,ఓడలు బండ్లు కావడం పెద్ద విషయం కాదు. అందుకు కళ్ళ ముందే కావలసినన్ని ఉదాహరణలున్నాయి. అధికారం అండ చూసుకుని తప్పులు చేసుకుంటూ పోయే పాలకులు ఏదో ఒక రోజున అందుకు మూల్యం చెల్లించక తప్పుదు. తనకు పుత్రభిక్ష పెట్టమని వేడుకున్న సోదరి సాత్వతికి ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీ కృష్ణ పరమాత్మ, శిశుపాలుని వంద తప్పుల వరకు క్షమించాడు. అయితే, అహంకారంతో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయాడు. భోజ రాజుల్ని చంపి, వసుదేవుడు యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని కూడా సంహరించాడు. కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రువు  భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని ఘోరాలు జరిగినా కృష్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. కానీ చివరకు ఏమి జరిగింది .. ధర్మరాజు ఆహ్వనం మేరకు ఆయన తలపెట్టిన రాజసూయ యాగానికి వచ్చిన శిశుపాలుడు చేయరాని చివరి తప్పు చేశాడు.తొలి అర్ఘ్యానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు చేసిన నిర్ణయాన్ని అహంకారంతో తూల నాడాడు .. గొల్లవాడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు క్రిష్ణుడిని మాట్లాడి అవమానించాడు. భీష్మ పితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశ పడితే భీష్ముడు వారిని వారించాడు. దీంతో  శ్రీకృష్ణుడు సభ నుద్దేశించి శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం ఇంతవరకు అతడి అపరాధాలను మన్నించాను. నేటితో నూరు తప్పులు పూర్తయ్యాయి, కాబట్టి సహనం వహించిన నేను ఈ మూర్ఖుడిని ఇప్పుడే శిరచ్చేధం ద్వారా సంహరిస్తా నని సుదర్శన చక్రం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. అది ద్వాపర యుగం నాటి  కథ.  ఇది కలియుగం. యుగం ఏదైనా కాలం ఏదైనా అహంకారంతో విర్రవీగే వారు ఎవరైనా చివరకు సిక్ష అనుభవించక తప్పదు. ముఖ్యంగా అధికారం శాశ్వతం అనుకుని విర్రవీగే పాలకుల తప్పులను  ప్రజలు ఎప్పటికప్పడు లెక్కిస్తూనే ఉంటారు. ఐదేళ్ళు వరకు పాలకుల తప్పులను భరిస్తారు .. మన్నిస్తారు.ఆ గీత దాటిన తర్వాత వేటు వేస్తారు. ఆంధ్ర ప్రదేశ్  లో ఇప్పుడుదే జరుగుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకున్న వైసీపీ ప్రభుత్వ వరసగా తప్పులు చేసుకుంటూ పోతోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం తప్పులు ఎప్పుడోనే గీతను దాటాయి .. ఇప్పుడు  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా చోటు  చేసుకున్న పరిణామాలు ప్రమాద స్థాయినీ దాటి పోయాయి. ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.   మూడున్నరేళ్ళలో టన్నుల కొద్దీ తప్పులు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పడు, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీఓ1, తెచ్చింది. ప్రతిపక్ష గళం వినిపించకుండా చేసేందుకు సభలు, సమావేశాలు, రోడ్ షో ల పై నిషేధం విధించి. ఇందులో భాగంగానే  కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలను అడ్డుకోవడమే కాకుండా, అవమానించింది.  పోలీసులు  చిత్రంగా చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా వినని విధంగా మహిళలు తమపై హత్యాయత్నం చేశారని కేసులు పెట్టారు. నిజానికి, ఇది శిశుపాలుడు చేసిన చివరి తప్పును మించిన దుర్మార్గం. బ్రిటిష్ కాలంలో కూడా పోలీసులు ఇంత దుర్మార్గానికి ఒడి కట్టలేదు. అందుకే, ఇప్పుడు ప్రజలు సుదర్శన చక్రం, ప్రజాస్వామ్య వజ్రాయుధం సిద్దం చేసుకుంటున్నారు .. ఎన్నికల  సుముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారు.

జగన్ సర్కార్ కి కేవీపీ వాతలు!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు పరిచయం అవసరం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత ‘ఆత్మ’ మిత్రుడు. కేవీపీకి వైఎస్సార్ తో ఉన్న  ‘ఆత్మ’ బంధం గురించి తెలియని వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉండరు. వైఎస్సార్ ను నడిపించిన వాడు కేవీపీ అన్నది అందరికీ తెలిసియన్ విషయమే. నిజానికి, వైఎస్సార్ తోనే కాదు, ఆయన కుటుంబంతోనూ కేవీకి  మిత్ర బంధాన్ని మించిన ఆత్మీయ బంధం వుందనేది అందరూ అనుకునే మాట. నిజానికి  వైఎస్సార్ ఆకస్మిక మృతి తర్వాత కూడా ఆ కుటుంబంలో, కుటుంబ రాజకీయాలలో కేవీపీ కీలక పాత్రే పోషించారు. అయితే ఎప్పుడైతే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కేవీపీ వైఎస్ కుటుంబానికి దూరమవుతూ వచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో సంబంధాలను కేవీపీ పూర్తిగా తుంచేసు కున్నారు. అయితే ఎందుకనో తెలియదు కానీ,  వైఎస్సార్   ఆప్తులు ఎవరూ జగన్ రెడ్డికి ‘ఆత్మీయులు’ కాలేక పోయారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా, కేవీపీ, గడచిన  మూడున్నరేళ్ళలో  జగన్ రెడ్డి పరిపాలన మంచి చెడుల గురించి పెద్దగా మాట్లాడింది లేదు. కానీ, ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సంస్తాగత మార్పులు జరిగి గిడుగు రుద్ర రాజు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కీవీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలన గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడున్నరేళ్ళలో జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన సుందర ముదనష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేవీపీ, ప్రధానంగా పోలవరం.. ప్రత్యేక హోదా అంశం పైన స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం,  బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ధర్మ పోరాటం చేసిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, జగన్ రెడ్డి ప్రభుత్వం, ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాలకు వదిలేసిందని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి చేయాల్సి ఉంటే అటు కేంద్రం..ఇటు రాష్ట్రం ప్రాజెక్టు విషయంలో సరైన వైఖరితో లేవని విమర్శించారు. పోలవరం నిర్వాసితులు నాలుగున్నర లక్షల మందికి జగన్‌ దారి చూపడం లేదని, కనీసం ప్రోత్సాహకాలు అందించలేని హీన, దీనస్థితిలో ఉన్నారని కేవీపీ అసహనం వ్యక్తం చేశారు. అంచనాలు ఎంతైనా కేంద్రమే పోలవరం పూర్తి చేయాలని కేవీపీ డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత వైఫల్యాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు  వివరించాలని సూచించారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే, ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు. కేంద్రం దయ మన ప్రాప్తం అన్నట్లుగా చేతులు ఎత్తేశారు.అయితే  చేతులు ఎత్తేయ లేదు, కాళ్ళు పట్టుకోలేదు అని చెప్పుకునేందుకో ఏమో, ప్రధానిని కలిసిన ప్రతీ సందర్బంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని తన వినతి పత్రంలో చేరుస్తున్నారు. అటు కేంద్రం పార్లమెంట్ వేదికగా ఇప్పటికే పలు మార్లు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ నేత కేవీపీ ఇదే అస్త్రాన్ని తెర మీదకు తెచ్చారు.అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని, జోడో యాత్ర సందర్భంగా  రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు  సూచించారు. అదెలా ఉన్నా, జగన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీవీపే గళం విప్పడం ఇప్పడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్  గా మారింది. నిజానికి కేవీపీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి వాతలు పెట్టడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజుల క్రితం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ జగన్ రెడ్డి ప్రభుత్వంపై కేవీపీ తీవ్ర విమర్శలు చేశారు.  ఏపీలో పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కేవీపీ వ్యాఖ్యానించారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఏపీలో ప్రస్తుత పాలన సరైన దిశలో సాగటం లేదని అభిప్రాయపడ్డారు. విభజన హామీల కోసం ప్రభుత్వం నుంచి పోరాటం లేదని వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన విధానంలో వెళ్లటం లేదని కేవీపీ చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం సిద్దపడిందన్నారు. అయినా, అడ్డుకొనే ప్రయత్నాలు జరగటం లేదని ఆవేనద వ్యక్తం చేసారు. నాడు వైఎస్సార్ రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం, రాహుల్ ను ప్రధాని చేయటం ఆ రెండు లక్ష్యాలుగా కేవీపీ గుర్తు చేశారు. కాగా, ఏపీ రాజకీయాలలో కేవీపీ క్రియాశీలంగా మారడం, అది కూడా ఆప్త మిత్రుడు వైఎస్ పేరున వైఎస్ కుమారుడు జగన్ రెడ్డి  స్థాపించిన పార్టీ, (వైసీపీ) ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.

సూర్యకుమార్ యాదవ్ (ఎస్ కెవై) చెలరేగిన వేళ!

సూర్యకుమార్ యాదవ్.. ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ.. శ్రీలకం చేష్టలుడిగి నిలబడిపోయింది. ఫీల్డర్లు బౌండరీ అవతల పడిన బంతిని తీసుకురావడానికే పరిమితమయ్యారు. మిస్టర్ 360 గా మన్ననలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్..ఒంటి చేత్తో శ్రీలకంతో జరుగుతున్న మూడో టి20ని భారత్ ఖాతాలో వేసేశాడు. దీంతో శ్రీలంకతో టి20 సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలిచింది. ఇక మళ్లీ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విధ్వంసం వద్దకు వస్తే.. శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టి20లో సూర్యకుమార్ యాదవ్ ఏడు ఫోర్లు, 9 సిక్సర్లతో కేవలం 45 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దీంతో టి 20ల్లో మూడు శతకాలు బాదిన నాన్ ఓపెనింగ్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. సూర్యకుమార్ విధ్వంసక బ్యాటింగ్ తో టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ స్కోరులో సూర్యకుమార్ యాదవ్ స్కోరు 112 (51 బంతుల్లో) నాటౌట్. దీంతో 229 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది.దీంతో టీమ్ ఇండియా 91 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకు ముందు తొలుత టాస్ కోల్పోయి బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఇషాన్ కిషన్ తొలి ఓవర్ లోనే వెనుదిరిగాడు. అయితే రాహుల్ త్రిపాఠి బ్యాట్ ఝుళిపించాడు. 35 పరుగులు చేసి త్రిపాఠి వెనుదిరిగిన తరువాత మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు సూర్యకుమార్ యాదవ్. తనదైన స్కూప్ షాట్లతో సూర్యకుమార్ యాదవ్ విరుచుకుపడటంతో మైదానంలో శ్రీలంక ఫీల్డర్లది ప్రేక్షక పాత్రే అయ్యింది. బౌలర్ వేసిన ప్రతి బంతినీ బౌండరీ అవతల నుంచి తీసుకురావడానికే వారు పరిమితమయ్యారా అన్నట్లుగా సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యం కొనసాగింది. స్వల్ప వ్యవధిలో గిల్‌, హార్దిక్‌ (4), దీపక్‌ హుడా (4) వెనుదిరిగినా సూర్య కుమార్ యాదవ్ జోరు కొనసాగించాడు. 

బిర్సా ముండా హాకీ స్టేడియం.. నవీన్ పట్నాయక్- బీజేపీ మధ్య చిచ్చు!?

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వివాదాలకు దూరంగా ఉంటారు. తన పని తాను చేసుకుపోతూ ఉంటారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా ఆయన పని తీరు ఉండటంతో జనం మెచ్చిన సీఎంగా పాతికేళ్లుగా ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీ బిజూ జనతాదళ్(బీజేడీ) ఓటమి ఎరుగని పార్టీగా గుర్తింపు పొందింది. గుజరాత్ లో బీజేపీ సర్కార్ తరువాత సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న పార్టీగా బీజేడీ నిలుస్తుంది. పాతికేళ్లయినా రాష్ట్రంలో ఆ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత లేదు. పైపెచ్చు అభిమానం రోజు రోజుకూ పెరుగుతోంది. నవీన్ పట్నాయక్ వివాదరహితుడిగా పేరొందారు. అటువంటి నవీన్ పట్నాయక్ కు బీజేపీతో పేచీ వచ్చింది. అయితే ఈ పేచీకి కారణం రాజకీయం కాదు.. ఓ హాకీ స్టేడియం. ఔను హాకీ స్టేడియమే బీజేపీ, బీజేడీ మధ్య మాటల మంటలను రగిల్చింది.  ఈ నెల 13 నుంచీ ఎఫ్ఐహెచ్ ఒడిశా  మెన్స్ వరల్డ్ హాకీ కప్ టోర్నీ జరగనుంది.  వరల్డ్ హాకీ కప్ టోర్నీ కోసం రూర్కెలాలో నవీన్ పట్నాయక్ సర్కారు  అత్యాధునిక బిర్సా ముండా హాకీ స్టేడియం  నిర్మించింది. ఇదే ప్రపంచంలో అతి పెద్ద హాకీ స్టేడియం అంటూ ఒరిస్సా సర్కారు భారీఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ ప్రచారం ఎందుకో బీజేపీకి రుచించలేదు. దీంతో నవీన్ పట్నాయక్ సర్కార్ ప్రచారాన్ని తిప్పి కొడుతోంది.  ప్రతిష్ఠాత్మ టోర్నీకి ముందు ఈ స్టేడియం బీజేపీ, బీజేడీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. బిర్సా ముండా హాకీ స్టేడియం ప్రపంచంలో నాలుగో పెద్ద స్టేడియం మాత్రమేనని బీజేపీ గట్టిగి చెబుతుండగా, టర్నేషనల్ హాకీ ఫెడరేషనే బిర్సా ముండా స్టేడియంను ప్రపంచంలో అతిపెద్ద హాకీ స్టేడియంగా గుర్తించి సర్టిఫికెట్ సైతం ఇచ్చిందని ఒడిస్సా సర్కారు వాదిస్తోంది. అసలింతకీ స్టేడియం విషయంలో బీజేపీ ఎందుకు ఇంతగా స్పందింస్తోందన్న దానికి మాత్రం.. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం కారణమని అంటున్నారు. మొతేరాలోని సర్దార్ వల్లభాయ్ పటేస్ స్టేడియంను ఆధునీకరించి, 1.3లక్షల మంది కెపాసిటీతో నిర్మించి దానికి నరేంద్రమోడీ పేరు పెట్టారు. ఈ స్టేడియం 2020లో పూర్తయ్యింది. ఈ స్టేడియంకు ముందు వరకూ  ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) 90 వేల సీటింగ్ కెపాసిటీతో ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉండేది. దాని రికార్డును నరేంద్ర మోడీ స్టేడియం బద్దలు కొట్టి ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది. అందుకే ఇప్పుడు ఒడిశా సర్కార్ ప్రపంచంలోనే అతి పెద్ద హాకీ స్టేడియంను నిర్మించామని చెప్పుకోవడం బీజేపీకి రుచించడం లేదు. అందుకే  ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ బిర్సాముండా హాకీ స్టేడియంను ప్రపంచంలోనే పెద్ద హాకీ స్టేడియంగా గుర్తించినా అంగీకరించడానికి బీజేపీ ససేమిరా అంటోందని బీజేడీ చెబుతోంది.   

క్లాస్ రూంలో టీచర్ పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు..

అమెరికాలో గన్ కల్చర్ వెర్రి తలలు వేస్తోంది. పెద్దా చిన్నా తేడా లేకుండా అందరికీ గన్స్ అందుబాటులోకి ఎలా వస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ ఆరేళ్ల బాలుడు కాల్పులకు తెగబడిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, అమెరికాలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది. ఓ ఆరేళ్ల బాలుడు తన టీచర్ లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. అదీ తరగతి గదిలోనే. కారణాల గురించి ఆరా ఎందుకు కానీ.. వర్జీనియాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతున్న ఓ ఆరేళ్ల విద్యార్థి తన టీచర్ పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. తన స్కూల్ బ్యాగ్ లో గన్ పెట్టుకుని వచ్చిన ఆ ఆరేళ్ల కుర్రోడు.. తరగతి గదులోనే టీచర్ పై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులలో టీచర్ వినా  మరెవరూ గాయపడకపోవడంతో ఆ బాలుడి టార్గెట్ టీచరేనని నిర్ధారణకు వచ్చారు.   కాల్పులకు తెగబడిన విద్యార్థి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అమెరికాలో గన్ కల్చర్ కొత్తేమీ కాదు కానీ, ఇంత చిన్న పిల్లాడు కాల్పులకు తెగబడిన ఘటన  ఆందోళన కలిగిస్తోంది. 

జల్లి కట్టుకు తమిళనాడు సర్కార్ లైన్ క్లియర్

తమిళనాట సంక్రాంతి సంబరాలు, సంస్కృతిలో జల్లికట్టుదే అగ్రస్థానం. ఏటా జనవరి 1వ తేదీ నుంచే సంక్రాంతి సంబరాలు మొదలైపోతాయి. అంటే జల్లి కట్టూ సందడీ ఆరంభం అయిపోతుంది. అయితే ఈ సారి మాత్రం కొత్త సంవత్సరం వచ్చి వారం రోజులైనా జల్లి కట్టు సందడి ఎక్కడా కనిపించలేదు. ఇందుకు కారణం ఇప్పటి వరకూ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడమే. అయితే ఎట్టకేలకు శనివారం (జనవరి 7) జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం నుంచీ తమిళనాటలో జల్లి కట్టు సందడి ప్రారంభం కానుంది.  ఒక్క తమిళనాడులోనే కాకుండా ఏపీలోని చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్లు నిర్వహిస్తారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జల్లికట్టుకు అనుమతి ఇచ్చే విషయంలో స్టాలిన్ ప్రభుత్వం ఒకింత వెనుకాడటంతో తమిళనాట ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శనివారం జల్లికట్టు నిర్వహణకు సర్కార్ ఓకే చెప్పింది. కోవిడ్ ప్రొటోకాల్ తప్పని సరిగా పాటించాలని పేర్కొంటూ వీక్షకుల సంఖ్యపై ఆంక్షలు విధించింది. మూడు వందల మందికి మించి వీక్షకులను అనుమతించబోమని స్పష్టం చేసింది. అంతే కాకుండా జల్లికట్టుకు హాజరయ్యేవారంతా వ్యాక్సినేషన్ వేయించుకుని ఉండాలనీ, అలాగే కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉండాలని ప్రభుత్వం షరతులు విధించింది. ఇలా ఉండగా సంప్రదాయ క్రీడ జల్లి కట్టును చెన్నైలో కూడా నిర్వహించేదుంకు అనుమతించాలని ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హసన్ డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున చెన్నైలో జల్లికట్టు నిర్వహణకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉత్తమ్ వ్యాఖ్యలు.. దేనికి సంకేతం ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల మధ్య తలెత్తిన వివాదం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి  మార్పుతో సమసి పోయినట్లేనా? మాణిక్యం ఠాగూర్ స్థానంలో మాణిక్‌రావు థాకరే  నియామకంతో, సీనియర్లు సంతృప్తి చెందినట్లేనా? ఇక సీనియర్, జూనియర్ కొత్త పాత నాయకులు అంతా కలిసి పనిచేస్తారా? అంటే, అలాంటి సూచనలు ఏవీ కనిపించడం లేదని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మార్పు తర్వాత జరిగిన,  కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో   శిక్షణ తరగతులకు కూడా జానా రెడ్డి, భట్టి విక్రమార్క తప్ప మిగిలిన జీ 9 నాయకులు ఎవరూ హాజరు  కాలేదు. ఆ ఇద్దరు కూడా  మొక్కుబడిగా వచ్చి వెళ్ళారే తప్ప  రేవంత్ రెడ్డితో సయోధ్య  కుదిరిందనే సంకేతలేవీ ఇవ్వలేదు.   అదొకటి అలా ఉంటే  ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకులు ఎవరి దారిన వారు సొంత బాటలు వేసుకుంటున్నారని, ఎవరికి వారు తమ తమ సొంత నియోజక వర్గాలలో విజయం కోసం సొంత పంథాలో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. నిజానికి ఖమ్మం జిల్లాలో భారాస నాయకులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి సుధాకర రెడ్డి ఎలాగైతే స్వతంత్రంగా సొంత పంధాలో   ఆత్మీయ సదస్సుల  పేరిట సొంత ఇంటిని చక్కబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారో అదే పంథాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు సొంత నియోజక నియోజక వర్గాలపై దృష్టిని కేద్రీకరించారని అంటున్నారు. నిజానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అయితే  ఇక తానూ తన నియోజక వర్గానికే పరిమితం అవుతానని ప్రకటించారు. గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్నారు.   ఈనేపధ్యంలోనే టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన  హుజూర్‌నగర్ కోదాడ స్థానాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు తెర తీశాయి.  నూతన సంవత్సరం  సందర్భంగా  ఈ రెండు నియోజక వర్గాలకు సంబంధించిన తమ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఉత్తమ కుమార్ రెడ్డి  ఈ రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్‌ వేనంటూ జోస్యం చెప్పారు. అంతే అయితే, అది పెద్ద విషయం కాకపోవునేమో, కానీ, ఆయన అంతటితో ఆగలేదు.  హుజూర్‌నగర్‌లో మళ్లీ తానే పోటీ చేస్తానని స్పష్టం చేయడంతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని పేర్కొన్నారు. ఒక వేళ మెజార్టీ 50 వేలకు ఒక్క ఓటు తక్కువైనా రాజకీయ సన్యాసం తీసుకుంటాననని ప్రకటించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. ఎంపీగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి పార్టీ ప్రమేయం లేకుండా అసెంబ్లీకి పోటీ చేస్తానని తనంతట తానుగా ప్రకటించుకోవడం రేవంత్ రెడ్డి ని గిల్లడం కోసమేనా అనే చర్చ జరుగుతోంది.   మరోవంక ఉత్తమ కుమార్ రెడ్డి సవాలు విసిరిన కొద్ది రోజులకే, మంత్రి కేటీఆర్ హుజూర్ నగర్ లో పర్యటించి ఎప్పుడో మూడున్నర ఏళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు సంబందించిన శంకు స్థాపనలు  చేశారు. బహిరంగ సభలో ప్రసంగించారు. కానీ ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన తీసుకు రాలేదు. ఉత్తమ కుమార్ రెడ్డి పేరు అసలే ప్రస్తావించలేదు.  బీజేపీ, కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గానే కేటీఆర్ ప్రసంగం సాగింది.  రాష్ట్రం పన్నుల రూపంలో కేద్రానికి ఇచ్చిన నిధుల కంటే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎక్కువని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాలు విసిరారు.  కానీ ఉత్తమ కుమార్ రెడ్డి పేరైనా ఎత్తలేదు. దీంతో చర్చ కొత్త మలుపు తిరిగింది. నిజానికి, ఉత్తమ కుమార్ రెడ్డికి భారాస ముఖ్యనాయకులతో మంచి సంబంధాలున్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ  రహస్యమే. నిజానికి, కాంగ్రెస్, భారాసల పొత్తుకు సుముఖంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఉత్తమ కుమార్ రెడ్డి ఉన్నారని అంటారు. అలాగే  రేవంత్ రెడ్డి వర్గం కోవర్టులుగా ముద్ర వేసిన సీనియర్లలోనూ ఉత్తమ్ పేరు ఉందనే ప్రచారం జరుగుతోంది.  నిజమే ఉత్తమ కుమార్  రెడ్డి గతంలో రెండు పర్యాయాలు కోదాడ నుంచి, మూడు పర్యాయాలు హుజూర్ నగర్ నుంచి ఎన్నికయ్యారు. కాబట్టి  ఆయనకు ఆ నియోజక వర్గాలపై పట్టున్న మాట నిజమే.  అయితే, అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ  నల్గొండ ఎంపీగా ఎన్నికయ్యారు. హుజూర్‌నగర్ శాసనసభ స్థానాన్నికి రాజీనామా చేశారు. కానీ  ఆయన రాజీనామా కరాణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య, పద్మావతి పోటీ చేసి ఓడి పోయారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి సిట్టింగ్ స్థానంలో భార్యను ఉత్తమ్ గెలిపించుకోలేక పోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. కాగా.. అంతకుముందు 2018 జరిగిన ఎన్నికల్లోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేవలం 7466 ఓట్లతో గెలుపు సాధించారు. ఇదిలా ఉండగా..  తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఉన్న ప్రస్తుతపరిస్థితుల్లో మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి  గెలవటం.. అది కూడా 50 వేల మెజార్టీతో విజయం సాధించడం కొంత ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.  అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత గట్టిగా ఆ రెండు నియోజక వర్గాలు మావే.. మెజారిటీ 50వేలకు తగ్గితే రాజీనామా చేస్తాను అంటున్నారంటే అది కూడా ఆలోచించవలసిన విషయమే అంటునారు. మరో వంక నియోజక వర్గానికి వచ్చీ మంత్రి కేటీఆర్  ఉత్తమ్ సవాలుపై స్పందించకే పోవడం సైతం ఆలోచించవలసిన విషయమే అంటున్నారు. అంతేకాదు నియోజక వర్గానికి వచ్చి భారాసకు  ప్రధాన ప్రత్యర్ధిగా బావిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరైనా ఎత్తక పోవడం ఇంకా  ఇంకా ఆలోచించ వలసిన విషయమే అంటున్నారు.  ఈ నేపధ్యంలోనే భారాస నేతలో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనే పాత అనుమానాలు కొత్తగా తెర పైకి వస్తున్నాయి.

న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినా మారని జగన్ సర్కార్

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం ప్రసిద్ధ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సమాజంలో స్పందనా రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ రాసిన పాట. ఈ పాటను జగన్ సర్కార్ కు అతికినట్లు సరిపోతుంది. కోర్టులు ఎన్ని మొట్టి కాయలు వేసినా స్పందనే లేనట్టుగా, తనను కానట్టుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. ఏపీ సర్కార్ కు హైకోర్టు మొట్టి కాయలు వేయని రోజంటూ లేదంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఏపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు నష్టం చేకూరేదిగానే ఉంటుందనడానికి కోర్టులలో తగులుతున్న ఎదురు దెబ్బలే నిదర్శనం. జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులలో కేసులు పెద్ద ఎత్తున దాఖలౌతున్నాయి. ఆ కేసులలో దాదాపు అన్నిటిలోనూ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తాజాగా ఎస్సీ కార్పొరేషన్ నిధుల దారి మళ్లింపుపై హైకోర్టు జగన్ సర్కార్ కు గట్టిగా మొట్టికాయలు వేసింది. ఎస్సీ కార్పొరేషన్ పోటీ పరీక్షల శిక్షణకు బిల్లులు ఇవ్వడం లేదని.. ఎస్సీ కార్పొరేషన్​ నిధులు నవరత్నాలకు మళ్లిస్తున్నారని ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్​ను విచారించిన ఏపీ హై కోర్టు  ఎస్సీ కార్పొరేషన్ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిధుల మళ్లింపు కుదరదని 2003లోనే స్పష్టం చేశామని పేర్కొన్న ధర్మాసనం ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరనప్పుడు.. దాన్ని మూసేయడం మేలని అభిప్రాయపడింది. ప్రభుత్వ కార్పొరేషన్లు నామమాత్రంగా మారిపోయాయని..  బిల్లులు చెల్లింపు వివరాలతో అదనపు అఫిడవిట్ వేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీని హైకోర్టు ఆదేశించింది. సాధారణంగా కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడితే ఏ ప్రభుత్వమైనా నైతిక బాధ్యత వహిస్తుంది. నిర్ణయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. తప్పు సరిదిద్దుకుంటుంది. కానీ జగన్ సర్కార్   నైతికత అంటే అర్దం తెలియదన్నట్లుగా వ్యవహరిస్తోంది. కోర్టులు తలంటితే తల తుడుచుకుని మళ్లీ అదే తీరులో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ అప్పులపాలై గత్యంతరం లేని పరిస్థితుల్లో చోరీకి పాల్పడిన సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోనికి వచ్చింది. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఇక పెన్షనర్లను జేబు దొంగలుగా మారుస్తారా అని ప్రభుత్వాన్నిప్రశ్నించింది. ఇంతటి ఘాటు వ్యాఖ్యలను కూడా జగన్ సర్కార్ దున్నపోతుమీద వాన పడ్డ చందంగా దులిపేసుకుంటోంది. కోర్టు ఆదేశాలను కానీ, సూచనలను కానీ ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. పై పెచ్చు కోర్టు తీర్పులు, వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పడానికి కూడా జగన్ సర్కార్ వెనుకాడటం లేదు.  ఇందుకు అమరావతి పిటిషన్లపై సుప్రీం తీర్పుపై జగన్ రెడ్డి పార్టీ నేతలు చేసిన ప్రకటనలూ వ్యాఖ్యలే నిదర్శనం. అలాగే  ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా సర్కార్ కోర్టు ఆదేశాలను అమలు చేయకపోడంతో  హైకోర్టు బాధ్యులైన అధికారుల్ని న్యాయస్దానానికి పిలిపించి మరీ బిల్లులు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ ేసింది. ఆ ఆదేశాలు కూడా అమలు కాకపోవడంపై కాంట్రాక్టర్లు మరో సారి కోర్టును ఆశ్రయించారు.  ఈ నేపథ్యంలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులపై  హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం ఏకంగా 102 రివ్యూ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే హైకోర్టు మొత్తం 102 రివ్యూ పిటిషన్లనూ కోట్టి వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వ తీరు మారలేదు. కోర్టు తీర్పుల దారి కోర్టు తీర్పులదే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.   ఈ నేపథ్యంలో మరోమారు జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కేసులో హైకోర్టు రూ.40 లక్షలు బకాయిలు కట్టలేదని గ్రానైట్ పరిశ్రమకు కరెంటు నిలిపివేశారని.. మరి కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని.. మరి ప్రభుత్వ పవర్ ను ప్రజలు ఎప్పుడు తీయాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.     అందుకే.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని.. అని జగన్ సర్కార్ ను ఉద్దేశించి పాడుకోవాలేమో అని పరిశీలకులు అంటున్నారు. 

రేవంత్ కాంగ్రెస్ కాడి వదిలేస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ లో వర్గ పోరు చినికి చినికి గాలివానగా మారిందా?  అధిష్ఠానం జోక్యం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మార్పు తర్వాత కూడా విభేదాలు సమసి పోలేదా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.  అసమ్మతి నేతల తీరుతో రేవంత్ రెడ్డి విసిగిపోయారని ఆయన మాటలను బట్టే అర్ధమౌతుంది. పార్టీ కోసం అవసరమైతే తాను టీ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ అనడం వెనుక ఆయన ఫ్రస్ట్రేషనే కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తాను ఎంత ప్రయత్నిస్తున్నా అసమ్మతి నేతలు పడనీయడం లేదన్న భావన రేవంత్ లో నెలకొందన్న విషయాన్ని ఆయన సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ లోని కొందరు నేతలు  బిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ భావిస్తున్నారు.   ఆ విషయం తెలిసినా అధిష్ఠానం కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం రేవంత్ మనోభావాలను గాయపరిచిందని అంటున్నారు. అసమ్మతి వర్గం డిమాండ్ మేరకు   తెలంగాణ కాంగ్రెస్   వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ ను అధిష్ఠానం పక్కన పెట్టడం ఒక రకంగా తన దూకుడు తగ్గించాలని హెచ్చరించడంగానే రేవంత్ పరిగణిస్తున్నారని అంటున్నారు.  అసలు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి  నుంచీ పార్టీలో సీనియర్లుగా చెప్పుకుంటున్న వారి నుంచి ఎటువంటి సహకారం అందలేదన్నది వాస్తవం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ ఒక అడుగు ముందుకు వేస్తే.. అసమ్మతి వర్గం తన చర్యలతో పది అడుగులు వెనక్కులాగేసే ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం నుంచి నిన్న కాక మొన్న పార్టీలో చేరిన రేవంత్ కు టీపీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడమేమిటన్న దుగ్ధ వినా పార్టీలో అసమ్మతి నాయకులు రేవంత్ కు వ్యతిరేకంగా జట్టు కట్టడానికి మరో కారణం కనిపించదు.   రాష్ట్రంలో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లాలని భావించినా రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో అంతర్గత సమస్యలు అడుగడుగునా అడ్డం పడుతున్నాయి. తొలి నుంచీ  టీపీసీసీ చీఫ్ రేవంత్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు, ఇటీవల పీసీసీ కమిటీల్లోనూ  రేవంత్ వర్గానికి పెద్దపీట వేశారన్న నెపంతో ఒక్కసారిగా అసమ్మతి స్వరం పెంచడంతో పంచాయతీ రోడ్డెక్కింది. ఇంత కాలం పట్టీపట్టనట్టు వ్యవహరించిన అధిష్ఠానం రంగంలోకి దిగింది. అయితే కర్రా విరగకుండా, పామూ చావకుండా పంచాయతీని పరిష్కరించడానికి హై కమాండ్ చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు సరికదా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరింత బలహీన పరిచిందని పార్టీ వర్గాలే అంటున్నాయి.  పార్టీలో ఉన్న పంచాయితీలు మరింత రచ్చకెక్కాయి.  రేవంత్ రెడ్డికి  సహకరించాడని, రేవంత్ వర్గం వద్ద డబ్బులు తీసుకుని పదవులు కట్టబెట్టారని పార్టీ సీనియర్లు మాణిక్కం ఠాగూర్ ను ఆ పదవి నుంచి తొలగించాలని ఇటీవల తెలంగాణా కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ వద్ద డిమాండ్ చేశారు. ఇక దిగ్విజయ్ సింగ్ నివేదిక మేరకు అన్నంత పని చేసిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను పక్కన పెట్టి ఆయన స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా మాణిక్యరావు ఠాక్రేకు అవకాశం కల్పించింది. అయితే ఈ నిర్ణయం ఇటు రేవంత్ రెడ్డిని కానీ, అటు ఆయన వ్యతిరేక వర్గం వారిని కానీ సంతృప్తి పరచలేదనే చెప్పాలి. తన వ్యతిరేకుల డిమాండ్ కు తలొగ్గి అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం తనను బలహీనుడిని చేసిందని రేవంత్ భావిస్తుంగా, మాణిక్కం ఠాగూర్ ను మాత్రమే కాదు, రేవంత్ ను కూడా టీపీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలన్న తమ డిమాండ్ ను హై కమాండ్ పూర్తిగా నెరవేర్చలేదన్న అసంతృప్తి  రేవంత్ వ్యతిరేక వర్గంలో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ కాడె మోయడం అనవసరమన్న భావనకు వచ్చారని ఆయన వర్గీయులు అంటున్నారు. పార్టీ బలోపేతం చేయడానికి రేవంత్ చేపట్టదలచిన పాదయాత్రను సైతం తన వ్యతిరేక వర్గం అంటే సీనియర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని రేవంత్ ఏ విధంగానూ సహించలేకపోతున్నారని అంటున్నారు. అంతే కాకుండా పార్టీ హైకమాండ్ కూడా సీనియర్లు అన్న ఒకే ఒక్క కారణంతో తన వ్యతిరేక వర్గం మాటకు విలువనిస్తుండటం కూడా రేవంత్ రెడ్డికి మింగుడు పడటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నోటి వెంట రాజీనామా మాట వచ్చిందని అంటున్నారు.   టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలను సీనియర్లు తప్పుపడుతుండటాన్ని కూడా రేవంత్  సీరియస్ గా తీసుకున్నారంటున్నారు.  ఈ నేపథ్యంలోనే రేవంత్ తన భవిష్యత్ కార్యాచరణపై తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ ఏర్పాటు చేయడమా లేక తెలంగాణలో బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం గూటికి చేరడమా అన్న ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఒకే దెబ్బకు రెండు పిట్లలు.. ఇదే బీఆర్ఎస్ స్కెచ్

 ఒకే దెబ్బకు రెండు పిట్టలు..  బిఆర్ఎస్ వెనుక దాగి ఉన్న భారీ స్కెచ్ ఇదేనా? అంటే రాజకీయ వర్గాలు ఔననే అంటున్నాయి.  తెలంగాణలో కె. చంద్రశేఖర్ రావు,  ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఇద్దరు మళ్ళి అధికారంలోకి వచ్చేందుకు వేసిన మాస్టర్ ప్లానే బీఆర్ఎస్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ ఒక్కటే రాష్ట్రాలే రెండు అన్నట్లుగా ఒకే పార్టీతో ఇటు తెలంగాణ, అటు ఏపిలోనూ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేసిన బృహత్తర ప్రణాళికే బిఆర్ఎస్ అంటున్నారు ప్రాంతీయ సెంటిమెంట్ రగిలించి, దానిని  ఓట్ల రూపంలో దండుకోవాలి,  ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఆవిర్భవించిందంటున్నారు   బిఆర్ఎస్ విస్తరణ పేరిట ఏపిలో నాయకులను కొందరిని చేర్చుకొని, వారితో ప్రకటనలు చేయించడం, సమావేశాలు, సభల నిర్వహణకు సమాయత్తం కావడం ఇదంతా ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. బీఆర్ఎస్ సాకుతో కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడంపై ఏపీ నేతల నుంచి విమర్శలను ఆహ్వానించడం, వీటికి ప్రతిగా ఏపీ నేతలపై తెలంగాణలో ఆగ్రహజ్వాలలు ఎగసి పడటం జరగాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఏపీలో విస్తరణకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విశేష ప్రచారం చేశాయంటున్నారు.  బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏపీలో, బీఆర్ఎస్ పై విమర్శలకు నిరసనగా తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ రగల్చాలన్నదే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంగా చెబుతున్నారు.    ఆ వ్యూహంలో భాగంగానే తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ లో చేరగానే వైసిపి నేతలు, మంత్రులు తమ గళానికి పదును పెట్టారు. మంత్రులైతే.. ఏకంగా సిగ్గుండాలి.. బుద్ది  చెప్పుతారు.. అంటూ కేసీఆర్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. ఏపీకి వెన్నుపోటు పొడిచింది చాలదా..? శ్రీశైలంలో, నాగార్జున్ సాగర్ లలో విద్యుత్  దోచుకుంటూ.. నీటిని సముద్రంలోకి వదులుతున్న వాళ్ళు ఇక్కడకు వచ్చి  చేసేదేంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి రోజా కూడా తనదైన శైలితో స్పందించారు. విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే ప్రజలే బుద్ది చెప్పుతారంటూ నిప్పులు చెరిగారు.  కెసిఆర్ జాతీయ స్థాయిలో కొట్లాడాలే గానీ, ఆంధ్రప్రదేశ్ లో చేసేదేమిటి..? రాష్ట్ర విభజనలో,  ఏపీ నష్టపోవడంలోనూ ఆయన పాత్ర ఉందంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. ఈ విమర్శలు, నిప్పులు చెరగడాలు అన్నీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంలో భాగమేననీ అంటున్నారు.  ఇక ఏపీలో బీఆర్ఎస్ సభ తరువాత నుంచీ తెలంగాణ నుంచి ఏపీ నేతలపై విమర్శలు ప్రారంభమౌతాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇప్పటికే కేసీఆర్, ఆ తరువాత మంత్రులు ఏపీలో అభివృద్ధి లేమి గురించిన విమర్శలు మళ్లీ మొదలెట్టేశారు. తాజాగా స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణకు భారీగా రావడంపై హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో   కేటీఆర్ ప్రసగించారు. బీఆర్ఎస్ హయాంలో భారీగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. అయితే ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పుకోవాలంటే పోలిక ఉండాలి కాబట్టి పక్క రాష్ట్రాన్ని చూపించారు. ఆ రాష్ట్రం వెళ్లి చూసి వస్తే తేడా తెలుస్తుందన్నారు. ఏపీలో గుంతల రోడ్లు, విద్యుత్ కష్టాలు, తరలిపోతున్న పరిశ్రమలు,  కరవైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తెరాస ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇటీవల తిరుమల శ్రీవారి దర్వనం చేసుకున్నారు. ఆ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలలో మార్పు రావాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. ఏపీలో చాలామంది ఎమ్మెల్యేలు, మాజీలు బీఆర్ఎస్ పార్టీకి టచ్ లో ఉన్నారని త్వరలో అందరూ బీఆర్ఎస్ లో చేరతారని అన్నారు. సరైన నాయకత్వం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఒక పక్కా వ్యూహం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమ తమ రాష్ట్రాలలో తమ విజయం ఖరారు చేసుకోవడానికి, ఇరు రాష్ట్రాల ప్రజలలో సెంటిమెంట్ రగిల్చి.. ప్రాంతీయ చిచ్చు రగిల్చి లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ను వాడుకుంటున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.

తెరాస... భారాస డీఎన్ఏ ఒకటేనా?

ఉభయ తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒకటవుతాయా? ఒక్కటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడంలో కీలక భూమిక పోషించిన, తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడం వెనక ఇతరేతర కారాణాలు ఉన్నా ఉభయ తెలుగు రాష్ట్రాలను ఏకం చేసే ఆలోచన కూడా వుందా, అంటే, ఉన్నదని కాకున్నా, ఉంటే ఉండవచ్చే అనే అభిప్రాయం   అనుమనాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన సమయానికి,ఆయన ప్రధాన లక్ష్యం రాష్ట్ర విభజన కాకపోవచ్చని, దివంగత  మాజీ ముఖ్యమంత్రి  చెన్నారెడ్డిని బాటలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఆయన తెరాస స్థాపించారని, అనుమానించిన వాళ్ళు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ను సభలోనే వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.  సరే  అదంతా గతించిన చరిత్ర. అందులో ఏది నిజమో ఏది కాదో, ఇప్పడు అపస్తుతం. అలాగే  కేసీఆర్ కావాలనుకున్నా, మరొకరు వద్దనుకున్నా విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కలపడం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ, ఏపీలో అడుగు పెట్టేందుకు కదులుతున్న బీఆర్ఎస్  స్వరంలో మార్పు అయితే స్పష్టంగా వినిపిస్తోందని అంటున్నారు. ఒకప్పుడు ఆంధ్రా పాలకులు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని, ‘బ్యాన్’ చేశారని ఆరోపించిన నాయకులే  ఇప్పడు తెలంగాణ పేరు ఉచ్చరించేందుకు కూడా వెనకాడుతున్నారని అంటున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో  ‘వందే మాతరం’ నినాదం  ఎంత ప్రభావం చూపిందో, అంత కంటే ఎక్కువగా, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ  ఉద్యమాలను ప్రభావితం చేసిన, ‘జై తెలంగాణ’ నినాదం భారాస వేదికల నుంచి వినిపించడం లేదని తెలంగాణ ఉద్యమ ప్రజానీకం ఆవేదన, వ్యక్త పరుస్తున్నారు.  అలాగే, ఇంతవరకు రాష్ట్ర విభజన క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పడు, తిలా పాపం తల పిడికెడు అన్నరీతిలో కొత్త స్వరాన్ని ఎత్తుకున్నారు. అయితే ఆ మాట నేరుగా కేసీఆర్, కేటీఆర్ లేదా మరో తెలంగాణ నాయకుడో కాకుండా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు, తోట చంద్రశేఖర్ నోటి ద్వారా చెప్పించారు. చంద్రశేఖర్  ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు.   రాష్ట్ర విభజనకు ఒక్క తెరాస మాత్రమే కారణం కాదు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ అందరూ ఓకే చేస్తేనే రాష్ట్ర విభజన జరిగింద నే కొత్త స్వరాన్ని ఎత్తుకున్నారు.  అంతే కాకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ లిఖిత పూర్వకంగా లేఖ  ఇచ్చారని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయితే, ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరులు సహా ఉద్యమంలో భాగస్వాములైన అయిన అందరినీ పక్కన పెట్టి,  ఒక్క  కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని కేసీఆర్ లేకుంటే తెరాస లేదు  తెరాస లేకుంటే తెలంగాణ లేదు అంటూ రాష్ట్ర విభజన క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఇలా స్వరం మార్చడం దేనికి సంకేతం? అనే ప్రశ్నకు తెలంగాణ సమాజానికి సమాధానం చిక్కడం లేదు.  అదలా ఉంటే పూర్వాశ్రయంలో  తెరాస నాయకులుగా పిడికిలి బిగించి, ‘జై తెలంగాణ’ అని నిందించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు  తెలంగాణ పేరు ఉచ్చరించేందుకు కూడా  జంకుతున్నారు. ఎవరో కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం, ‘జై తెలంగాణ’  నినాదాన్ని నాలుక మీద నుంచి చెరిపేశారని  తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు  మేథావులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ఏదో ఆశించి తెలంగాణ నాదాన్ని, నినాదాన్నివదులుకోవడం ఒక్క రోజు భాగోతానికి మీసాలు గోరుకున్నట్లుందని, కోదండరాం వంటి  ఉద్యమ నేతలు  అంటున్నారు.   అలాగే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని మరో మారు కేసీఆర్  ప్రశ్నార్ధకం చేస్తున్నారని కేసీఆర్ ధోరణి   పట్టి పట్టి పంగనామాలు పెడితే, పక్కకెళ్ళి తుదిచేసుకున్నట్లు  ఉందని అంటున్నారు. అయితే మరోవంక మంత్రి కేటీఆర్, తెరాస పేరు భారాసగా మారిందే కానీ, పార్టీ డీఎన్ఎ మారలేదని, అదే రంగు, అదే రుచి, అదే వాసన కొనసాగుతుందని అంటున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏది నిజం ... కేసీఆర్ తల్లి పేరును తుడిచేసుకుంది నిజమా .. అదే డీఎన్ఎ అంటున్న కేటీఆర్ మాటలు నిజామా ? అని ప్రశ్నిస్తున్నారు.

కేంద్రం,రాష్ట్ర్రం మధ్య మళ్ళీ అదే పైసల పంచాయతీ

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య చాల కాలంగా సాగుతున్న పైసల పంచాయతీ, మళ్ళీ మరో మారు తెర వచ్చింది. ఓ వంక కేంద్ర నిధులను రాష్ట్రం దారి మళ్ళిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతుంటే, మంత్రి కేటీఆర్ మరో మారు,లెక్కల పంచాయతీని తెరపైకి తెచ్చారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం గద్దలా ఎగరేసుకు పోయిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.5,080 కోట్లను, పంచాయతీల ప్రమేయం లేకుండా ఒకే ఒక్క గంటలో రాష్ట్ర ప్రభుతం ఉడ్చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే, కిషన్ రెడ్డి  చేసిన ఆరోపణపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అసలు విషయాన్ని వదిలేసి  ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన పైసలను బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం ఖర్చుపెడుతున్నారని.. ఇది తప్పని నిరూపిస్తే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిజానికి మంత్రి కేటీఆర్  ఇదే సవాల్ గతంలోనూ చేశారు. అంతే, పంచాయతీ నిధుల దారి మళ్ళింపుకు సంబంధించి  కేంద్ర మంత్రి కొంచెం చాలా ఆలస్యంగా స్పందించారు. పంచాయతీ సర్పంచ్ లు కేంద్ర నిధుల దారి మళ్లింపు పై రాష్ట్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగతనానికి పాల్పడిందని మీడియా సాక్షిగా ఆరోపించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్లు లేదు. కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలపై మాత్రం రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు.  సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌  పర్యటనలో భాగంగా, నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. సవాల్ విసిరారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన పైసలను బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం ఖర్చుపెడుతున్నారని.. ఇది తప్పని నిరూపిస్తే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేంద్రం నిధులను పక్కదారి పట్టించారంటూ.. కిషన్‌రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.   ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన 3 లక్షల 68 వేల కోట్ల డబ్బును వెనుకపడిన బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం ఖర్చుపెట్టింది నిజం కాదా అని కేటీఆర్ నిలదీశారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వ్యయాలు, నిధుల పంపాకాలకు సంబంధించి ఆరోపణలు రావడం కొత్తకాదు. నిజానికి  నిధుల పంపకానికి సంబంధించి రాజ్యాగం నిర్దేశించిన నిర్దిష్ఠ  నియమ నిబంధనలున్నాయని నిపుణులు చెపుతుంటారు. దేశ రక్షణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దేశ రక్షణకు నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయవు, చేయవలసిన అవసరం ఉండదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక విధులుంటాయి. ఇది అందరికీ తెలిసిందే అయినా తరచూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ.. రాజకీయ పార్టీల నడుమ వివాదాలు తలెత్తడం ... విమర్శలు .. సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయ విచికిత్స తప్ప మరేమీ కాదు. అందుకే, ఇలాంటి వివాదాలు కొద్ది రోజులు మీడియాలో హల్ చల్ చేసి కనుమరుగై పోతుంటాయని అంటారు. నిజంగా జరుగుతున్నది కూడా అదే.  అయితే.. తెలంగాణ, కేంద్ర ప్రభూత్వాల నడుమ, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ల మధ్య ఈ విమర్శలు, ప్రతి  విమర్శలు శృతితి మించి రాగాన పడుతున్నాయని విజ్ఞులు, విమర్శకులు అంటున్నారు.

అప్పుడు ఇందిరమ్మ .. ఇప్పడు జగనన్న

వినాశకాలే విపరీత బుద్ధి  1975 జూన్ 25న అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించారు. రాత్రికి రాత్రి వందల సంఖ్యలో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో పముఖ సోషలిస్ట్ నాయకుడు, సంపూర్ణ క్రాంతి ఉద్యమ నిర్మాత  లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు. తలుపు తట్టారు. నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చిన జేపీతో పోలీసు అధికారులు దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం చెప్పారు. తాము ఆయన్ని అరెస్ట్ చేసేందుకు వచ్చామని తమతో సహకరించాలని కోరారు.అప్పుడు జేపీ ... ఎక్కువ తక్కువ లేకుండా ఒకే ఒక్క మాటన్నారు. ఆ మాటే .. వినాశకాలే విపరీత బుద్ధి.  ఆమాటకు అర్థం విడమరఛి చెప్పవలసిన అవసరం లేదు.ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పట్టిస్తుంది.అలాంటి పెడ ధోరణిని పెద్దలు వినాశ కాలానికి, పతనానికి సంకేతంగా నిలిచే విపరీత బుద్ధి అన్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎలాంటి రాజకీయ పరాభవాన్ని ఎదుర్కొన్నారో వేరే చెప్పనక్కరలేదు. అత్యవసర పరిస్థితి తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది. కాంగ్రెస్ పార్టీ ఓడి పోవడం కాదు, స్వయంగా ఇందిరా గాంధీ తమ సొంత నియోజక వర్గం రాయిబరేలి (యుపీ)లో ఓడిపోయారు. ఆమె కుమారడు సంజయ్ గాంధీ అమేథిలో ఓడి పోయారు.   ఇక ఇప్పుడు ఏపీకి వస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల కదలికలకు సంకెళ్ళు వేశారు. రాజకీయ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ   జీవో (నంబర్ 1) తెచ్చారు.  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అప్పుడు ఇందిరా గాంధీ అనుసరించిన మార్గంలోనే జగన్ రెడ్డి  ప్రతిపక్షాల పీక నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు కాదు  స్వపక్షీయులే అంటున్నారు. అందుకే  వినాశకాలే విరీత బుద్ధి  ‘దీవెన’ జగన్ రెడ్డికు కూడా వర్తిస్తుందని అంటున్నారు. ఇలా ఇంకెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో, రాజకీయ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధించడం  చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలోనూ ఆయన పర్యటను అడ్డుకోవడం  పోలీసుల దౌర్జన్యం ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్ట్ పాలన, నియంతృత్వ పోకడలకు అద్దం పడుతున్నాయి.ఇందిరమ్మ అత్యవసర పరిస్థితిని గుర్తు తెస్తున్నాయని అంటున్నారు.  నిజానికి  జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు నియంతృత్వ పోకడలు పోతున్నారనే ఆరోపణలున్నాయి.ఇప్పడు ఆయనకు సహజ సిద్ధంగా అబ్బిన కక్షపూరిత రాజకీయ సు...గుణాలకు ఓటమి భయం తోడవడంతో జగన్ రెడ్డి  వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వ్యవ్హరిస్తున్నన్నారని అంటున్నారు. ఆయన తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారనీ అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాయి. చేయాలి .. అందులో భాగంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన  కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ధర్నాలు, రోడ్డు షోలు, బహిరంగ సభల ద్వారా ప్రజా వ్యతీరేక ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెడతాయి.ఇవన్నీ, కూడా ఒక విధంగా ప్రజాస్వామ్య ఆభరణాలు. ఇప్పడు జగన్ రెడ్డి  ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి, అరాచక పాలనను, మరో మెట్టు పైకి తీసుకు పోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.   అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమి ఆశించి  ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఇంకేమి ఆశించి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారో కానీ,రాజకీయ వినాశనాన్ని ఆయన కోరి తెచ్చుకుంటున్నారని ప్రత్యర్ధి పార్టీల నాయకులే కాదు, సొంత పార్టీ, సొంత కుటుంబ సభ్యులే అంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు  నాయుడు  సభలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసి ముఖ్యమంత్రి రాజకీయ సభలు, ర్యాలీలపై విధించిన ఆంక్షలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అధికార పక్ష నేతలే ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలను చూసి జగన్ భయపడుతున్నాడనే సంకేతం పంపినట్లవుతుందని స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికలలో 151 సీట్లు మాత్రమే గెల్చుకున్నామని,ఈ సారి కుప్పంతో సహా మొత్తం 175 నియోజకవర్గాలలో ఎందుకు విజయం సాధించలేమని  గొప్పలకు పోయిన జగన్ రెడ్డి, ఇప్పడు ప్రతిపక్ష నాయకులకు భయపడి జీఓల చాటున దాక్కోవడం  ఎలాంటి సంకేతాలు పంపుతుందని ప్రశ్నిస్తున్నారు. నిజానికి, నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి మీటలు నొక్కుతూ ఓట్లు లెక్కేసుకుంటూ  ప్యాలెస్  లో కులాసాగా గడిపేశారు, కానీ  ఒక సారి బయటకు వచ్చిన తర్వాత కానీ, ఆయనకు సత్యం బోధ పడలేదు. మనము కట్టుకున్నవి దేవతా వస్త్త్రాలనే నిజం తెలిసి రాలేదు. ఇప్పుడు తెలిసొచ్చినా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఆయన విపరీత పోకడలు పోతున్నారని  వైసీపీ నేతలే వాపోతున్నారు.

ఇండియాలో విదేశీ వర్సిటీ బ్రాంచ్ లు.. మోడీ సర్కార్ కసరత్తు

ప్రపంచ ప్రసిద్ధి చెందిన వర్సిటీలు తమ క్యాంపస్ లను ఇండియాలో ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించేందుకు కసరత్తు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ద విశ్వవిద్యాలయాలలో చదవాల్సిన అవసరం లేకుండా ఆయా క్యాంపస్ లు ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆక్స్ ఫర్డ్, స్టాన్ఫోర్డ్, యేల్ తదితర యూనివర్సిటీలు ఇండియాలోనే తమ క్యాంపస్ లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది. ఇందుకు సంబంధించిన ముసయిదా డ్రాఫ్ట్ ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇప్పటికే రూపొందించింది.  ఆ ముసాయిదాను త్వరలోనే పార్లమెంటు ఆమోదానికి యూజీసీ పంపనుంది. ఈ వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి అధికారాలు కల్పించనుంది. అంటే భారత్ లో క్యాంపస్ లు ఏర్పాటు చేసే ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వ విద్యాలయాలు బొధనా సిబ్బందిని తామే స్వయంగా నియమించుకునే వెసులు బాటు ఉంటుంది.   విదేశీ యూనివర్సిటీలు స్థానిక సంస్థలతో భాగస్వామ్యం లేకుండానే సొంతంగా ఇండియన్ బ్రాంచ్ ను ప్రారంభించే వెసులు బాటు ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలను భారతీయ విద్యార్థులు స్వదేశంలోనే అందుకునేలా మోడీ సర్కారు ప్రయత్నాలు చస్తోంది.  భవిష్యత్తులో మ ఇండియా  గ్లోబల్ స్టడీ డెస్టినేషన్ గా  నిలవాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటోంది.   2022 గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ నెస్  ఇండెక్స్ ప్రకారం 133 దేశాలలో ఇండియా ర్యాంకు 101 స్థానంలో ఉంది. దీనిని మెరుగుపరచాలంటే.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యావకాశాలు భారత్ లో అందుబాటులోకి తీసుకురావడమొక్కటే మార్గంగా మోడీ సర్కార్ భావిస్తోంది. 

సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. చంద్రబాబుకు మద్దతుగా కుప్పంలో జనం నినాదం

చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఆ పేరంటేనే అధికార వైసీపీలో వణుకు మొదలైంది. అయన ఎక్కడకు వెళితే అక్కడ జనం ప్రభంజనంలా పోటెత్తుతున్నారు. ప్రభుత్వంపై, జగన్ పై ఆయన చేసే విమర్శలకు హర్ష ధ్వానాలతో ఆమోదం తెలుపుతున్నారు. ఇదే అధికార వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేస్తోంది. దీంతో ఆయనను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఆయన సభలు, సమావేశాలు నిర్వహించడానికీ, రోడ్ షోలు చేయడానికీ వీల్లేకుండా చీకటి జీవోలతో ఆంక్షలు విధించింది. అయితే కుప్పం పర్యటన చంద్రబాబులోని పోరాట యోధుడిని మరో సారి లోకానికి చూపింది. సొంత నియోజకవర్గంలో అడుగడుగునా పోలీసులు అవరోధాలు కల్పిస్తుంటే.. తనను కలవడానికి వచ్చిన వాళ్లపై లాఠీచార్జి చేసి గాయపరుస్తుంటే.. చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. పోలీసుల తీరును ఎండగట్టారు. సైకో పాలనలో బానిసలుగా మారారని పోలీసులపై జాలీ చూపారు. అయితే ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఏడు పదువ వయస్సులో గ్రామాలలో పాదయాత్ర చేశారు. ప్రచార వాహనాన్ని పోలీసులు దొంగిలించారని ఆరోపిస్తూ.. రోడ్డుపై పక్కన నిలిపి ఉన్న వాహనం టాప్ పైకి ఎక్కారు. వాన్ పక్కన నిట్ట నిలువుగా ఉన్ననిచ్చెనను అవలీలగా ఎక్కేసిన చంద్రబాబును చూస్తుంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్న మాట ఆయన విషయంలో అక్షర సత్యం అనిపించక మానదు. వ్యాన్ పై నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తం కుప్పం అంతా సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న నినాదాలతో మార్మోగిపోయింది. కుప్పం పర్యటన మూడో రోజు చంద్రబాబు గుడిపల్లిలోని తెలుగుదేశం కార్యాలయంలోకి వెళుతుంటే పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించిన నిరసనకు దిగారు. ఎక్కడ మాట్లాడాలో చెప్పండంటూ పోలీసులను నిలదీశారు. దొంగల్లా తన ప్రచార రథాన్ని ఎత్తుకు పోయిన వారు పోలీసులు ఎలా ఔతారన్నారు.  ఓటమి భయంతోనే జగన్ నల్ల జీవోలతో విపక్షాలను అణచివేయాలని   యత్నిస్తున్నారని చంద్రబాబు  విమర్శించారు.  ప్రజలు గమనిస్తున్నారని...  వాళ్లు తలచుకుంటే గుడ్డలు ఊడదీసి నిలబెడతారని హెచ్చరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ కు శిక్షపడటం ఖాయమని అన్నారు.  గొడ్డలి పోటుతో లేపేసి గుండెపోటు అని చెప్పింది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. తన ప్రచార రథాన్ని పోలీసులు దొంగిలించారనీ, అందుకే ఇక్కడ ఉన్న వ్యాన్ ఎక్కి ప్రసంగిస్తున్నానన్నారు.  

యువ‘గళం’ నొక్కేస్తారా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యవగళం పేరిట నిర్వహించే పాదయాత్రకు మరోవైపు.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వారాహి బస్సు యాత్రకు ఫూల్ స్టాఫ్ పెట్టేందుకు వైయస్ జగన్ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? అందుకే అర్థరాత్రి జీవో నెంబర్ 1 తీసుకు వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించగా.. జనవరి ఒకటోవ తేదీన గుంటూరులో జరిగిన తోపులాటలో ముగ్గురు మరణించారు.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభల్లో జరుగుతున్న విషాద ఘటనలపై జగన్ సర్కార్ ఆగమేఘాల మీద స్పందించింది.   రాష్ట్రంలో రోడ్ షో, సభలు, ర్యాలీలకు చెక్ పెడుతూ,  జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చింది. ఈ జీవో ప్రకారం ఎంపిక చేసిన  ప్రదేశాల్లోనే సభలు, సమావేశాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.  అయితే ఈ జీవోపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. లోకేష్ పాదయాత్రపై ప్రభుత్వ ఉత్వర్వులు అమలు కానున్నాయా? జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ బస్సు యాత్రకు ఈ నిషేధం వర్తించనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు.  ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దాదాపు 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడమే కాదు.. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. అయితే లోకేష్ పాదయాత్ర రహదారులపై జరగనుంది. అంతేకాదు.. వేలాది మంది ఈ పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి అడుగులు వేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో.. హాజరైన ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగించాల్సి ఉంటుంది. అలాంటి వేళ.. లోకేశ్ పాదయాత్రకు అనుమతి లభిస్తుందా? లేదా? అంటే సందేహమే అని వారు స్పష్టం చేస్తున్నారు.  దాదాపు 4 వేల కోలోమీటర్ల మేర జరగనున్న ఈ పాదయాత్రలో చాలా చోట్ల లోకేశ్.. ప్రజలతో మాట్లాడతారు.. పలు చోట్ల ఆయన సభలు ఏర్పాటు అవుతాయి.   అందుకోసం ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. అందుకు అనుమతులు కావాలంటే ఇస్తారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  బస్సు యాత్రకు తాజాగా విడుదలైన జీవో ప్రకారం.. అనుమతి లభిస్తోందనే ఆశలు అయితే లేవని రాజకీయ విశ్లేషకలు స్పష్టం చేస్తున్నారు.  ఓ వేళ.. ఒకరి పాదయాత్రకు.. మరొకరి బస్సు యాత్రకు అనుమతి ఇచ్చినా.. ఆవి ప్రారంభమైన కొద్ది రోజులకే వైయస్ జగన్..ముందుస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు.