ఆందోళన విరమించిన రెజ్లర్లు.. బ్రిజేష్ భూషణ్ పపైపోయినట్లేనా?

భారత రెజ్లర్ల తో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చలు ఫలించాయి. దీంతో గత మూడు రోజులుగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లు తమ ఆందోళనను విరించారు.  భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి విదితమే.   కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో శుక్రవారం (జనవరి 20) అర్ధరాత్రి ముగిసిన సుదీర్ఘ చర్చల తర్వాత ఆందోళన విరమించారు.  బ్రిజ్ భూషణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, సమాఖ్యలో ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణకు ముగ్గురు ప్రముఖ మాజీ క్రీడాకారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వారికి  హామీ ఇచ్చారు. కమిటీలో ఇద్దరు మహిళలు ఉంటారని చెప్పారు. ఆ కమిటీని శనివారం (జనవరి 21)న ప్రకటిస్తారు.   విచారణ పూర్తయ్యేంత వరకూ రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ కార్యకలాపాలను కూడా కమిటీనే పర్యవేక్షిస్తుంది.  మరోవైపు మహిళా రెజ్లర్లు  బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు భారత ఒలింపిక్ సంఘం దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. భారత్ రెజ్లర్ల ఆందోళనకు కారణమైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎవరు? రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎలా ఎంపికయ్యారు అంటే..  బీజేపీ ఎంపీగా ఆరు సార్లు గెలిచిన   బ్రిజ్ భూషణ్ ప్రస్తుతం  ఉత్తర్ ప్రదేశ్ లోని కైసర్ గంజ్ నియోజకవర్గానికి ఎంపీగా  ప్రాతినిధ్యం వహిస్తున్నరు.  2011 నుంచి ఈయన రెజ్లింగ్ ఫెడరేషన్  అధ్యక్షుడిగా ఉన్నారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సుమీత్ మాలిక్, బజరంగ్ పూనియా వంటి రెజ్లింగ్ హేమాహేమీలు ఇప్పుడు ఈయన దిగిపోవాలని.. ఈయన ఆధ్వర్యంలో సాగిన లైంగిక కాండలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మహిళా రెజ్లర్లు, మహిళా రెజ్లింగ్ శిక్షకులపై గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులు రెజ్లింగ్ ఫెడరేషన్ క్యాంపులో రొటీన్ గా మారాయంటూ వినేష్ ఫోగట్ ఆరోపించారు.  అయితే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తనపై ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అంటున్నారు.   గోండా, కైసర్ గంజ్, బలరాంపూర్ వంటి నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ కు విస్తృత రాజకీయ అనుభవం ఉంది. గోండా నివాసి అయిన బ్రిజ్ భూషణ్ తాను యువకుడిగా ఉన్నప్పుడు స్వయంగా కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు. 1980ల్లో విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లో చేరారు. హిందుత్వ ఇమేజ్ తో ఈయన చాలా తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. అయోధ్య రామ మందిర ఉద్యమ సమయంలో ఈయన పేరు మారుమోగింది కూడా. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. కానీ 2020లో కోర్టు నిరపరాధిగా ప్రకటించింది. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీతోపాటు మరో 40 మందిపై అయోధ్య విషయంలో ఛార్జ్ షీట్ నమోదు కాగా వీరిలో బ్రిజ్ భూషణ్ కూడా ఒకరు.   దశాబ్దకాలంగా రెజ్లింగ్ ఫెడరేషన్ పై పట్టు బిగించిన ఈయన మంచి వక్త. ప్రస్తుతం 66 ఏళ్ల వయసున్న ఈయన తనపై వినేష్ ఫోగట్ వంటివారు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు. వివాదం నేపథ్యంలో తాను బజరంగ్ పూనియాతో సహా చాలామందితో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికే ఆయన వివరణ కూడా ఇచ్చారు.

‘యువగళం’తో జగన్ కు ఉక్కపోత!

లోకేష్ తండ్రి అడుగుజాడలలో నడుస్తున్నారు. తండ్రి బాటలోనే పాదయాత్ర చేయాలని సంకల్పించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గతంలో ఏపీలో పాదయాత్ర చేసిన సంగతి విదితమే. 208 రోజుల పాటు సాగిన ఆ యాత్రలో చంద్రబాబు 2, 817 కిలోమీటర్లు నడిచారు. హిందు పురం నుంచి ఇచ్ఛాపురం దాకా వస్తున్నా మీకోసం అంటే ఆయన అడుగులు వేస్తుంటే యావదాంధ్రదేశం ఆయన వెంట కదిలిందా అనేలా అద్బుత స్పందన వచ్చింద. ఇప్పుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తండ్రి బాట పట్టారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.  జనవరి 27న నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర తన తండ్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ప్రారంభమయ్యే లోకేష్‌ పాదయాత్ర సక్సెస్ కోసం పార్టీ సర్వం సిద్ధంగా ఉంది.   ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్.. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు నడవనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. అయితే.. నారా లోకేష్ పాదయాత్ర పేరు వినగానే జగన్ సర్కార్ ఎందుకో వణికి పోతోంది.  అందుకే  యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. లేఖలు రాసినా శనివారం (జనవరి 21) వరకూ ఎటువంటి స్పందనా ప్రభుత్వం నుంచి లేదు. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా పాదయాత్ర జరిగి తీరుతుందని తెలుగు తమ్ముళ్లు గట్టిగా చెబుతున్నారు. పాదయాత్రకు అనుమతే అవసరం లేదని.. ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన ప్రకటనలను వారు ఇప్పుడు బయటకు తీస్తున్నారు.     నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా, యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా తన పాదయాత్ర జనవరి 27 నుంచి ప్రారంభమౌతుందని నవంబర్ లోనే లోకేష్ ప్రకటించారు. వచ్చే ఎన్నకలలో తాను పోటీ చేయదలచిన మంగళగిరి నియోజకవర్గంలో మీడియా సమావేశం పెట్టి మరీ  పాదయాత్ర తేదీ ప్రకటించారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలో తొలి అడుగులు వేసిన లోకేష్.. మొదటి నుంచీ మంచి అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు పొందారు. తెలుగుదేశం విధాన నిర్ణయాలలో వెనుక ఉండి కీలకంగా వ్యవహరించిన లోకేష్..  ఇప్పుడు ప్రజా నాయకుడిగా, ప్రజల మనిషిగా వారితో మమేకం అయ్యారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమౌతో ప్రజాభిమానాన్ని గెలుచుకున్నారు. ఇదంతా ఆయన చంద్రబాబు తనయుడు కావడం వల్లనే జరగలేదు. రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టే యత్నాలు చేశారు. అయితే వాటన్నిటినీ  తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని లోకేష్ ఇప్పుడు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారు. అన్నిటికీ మించి లోకేష్ పార్టీ కార్యకర్తలతో పూర్తిగా మమేకమై మెలుగుతారు. సాధారణంగా నాయకుడికి కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలు నాయకులు అనే కాదు, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ, వారి వారి పుట్టిన రోజున లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తారు. ప్రధాని సంతకంతో శుభాకాంక్షలు అందడం ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది. ఇక పార్టీ కార్యకర్తలకు అయితే కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకులు ఇంకా ఉన్నారు.  ఆ కోవలోకే వస్తారు.. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన దుష్పరిణామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు లోకేష్ పూర్తి స్థాయిలో  సిద్ధమయ్యారు. అదే సమయంలో యువగళంలో యువతను ఆకట్టుకునేలా టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు.     నిజానికి తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా లోకేష్ పార్టీ కార్యకర్తల మంచి చెడులు చూసుకుంటున్నారు, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇష్తున్నారు. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే సంప్రదాయాన్ని టీడీపీతోనే ప్రారంభించారు. ఈ ఆలోచన లోకేష్ బ్రెయిన్ చైల్డ్ . కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి లోకేష్ ప్రత్యేక  వ్యవస్థను ఏర్పాటు చేశారని.. ఇప్పుడు అందివచ్చిన టెక్నాలజీ సాయంతో అందరితో దగ్గర సంబంధాలు పెంచుకుంటున్నారు. లోకేష్ తీరుతో పార్టీలో యువత మరింత చురుకుగా పని చేస్తోందని అంటున్నారు.   అందుకే లోకేష్ పాదయాత్ర అంటేనే వైసీపీలో వణుకు పుడుతోంది. అనుమతులు ఇవ్వకుండా కుట్రలకు తెరలేపుతోంది. పార్టీ నేతలూ, శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తోంది. పార్టీ నేతలను విచారణల పేరుతో పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తోంది. ఎలాగైనా సరే పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు లోకేష్ పాదయాత్రపై జనంలో మరింత క్రేజ్ ను పెంచుతున్నాయి. లోకేష్ పాదయాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్న చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు విజయ్ ను పాదయాత్ర ప్రారంభమయ్యే జనవరి 27వ తేదీన విచారణకు రావాలని సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే లోకేష్ కానీ, తెలుగుదేశం శ్రేణులు కానీ వీటన్నిటినీ ఖాతరు చేయడం లేదు.   పాదయాత్రకు అనుమతి, భద్రత కల్పించడంపై టీడీపీ నేతలు గతంలో రికార్డెడ్ గా అందించిన దరఖాస్తులపై  పోలీసుల నుంచి ఇంత వరకూ ఎటువంటి స్పందనా లేదు. పాదయాత్రకు అనుమతి ఉందని కానీ, లేదని కానీ తేల్చి చెప్పలేదు. అనుమతి లేదని చెబితే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఏ విషయం చెప్పకుడా నాన్చుతూ చివరి నిముషంగా యాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య  డీజీపీకి మరో లేఖ   రాశారు. యాత్రకు అనుమతి రాకపోతే చట్ట పరంగా ఏం చేయాలన్న విషయంపై కూడా తెలుగుదేశం కసరత్తు చేస్తున్నది. అలాగే  విపక్ష నేతగా ఉన్న సమయంలో  జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఎలాంటి అనుమతులూ తీసుకోకున్నా.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యాత్రను అడ్డుకోలేదు. పటిష్టమైన భద్రత కల్పించి మరీ యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందించింది.  అప్పటి విషయాలన్నీ ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకు వస్తున్న తెలుగుదేశం  లోకేష్ పాదయాత్ర విషయంలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని జనంలో ఎండగడుతోంది. 

అత్తమీద కోపం దుత్త మీద అంటే ఇదే..!

అత్తమీద కోపం దుత్త మీద చూపినట్టు అంటారు. అలాగే అనుమానం పెను భూతం అని కూడా అంటారు. ఉత్తర ప్రదేశ్ లోని వ్యక్తి చేసిన పని అచ్చం అలాగే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని షాజాన్ పూర్ లో నివసించే అబిద్ అనే  తన పెంపుడు పిల్లిని పోగొట్టుకున్నాడు. తానెంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లిని పొరుగింటి వ్యక్తే చంపేసి ఉంటాడని అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే  పెనుభూతంగా మారింది. అయితే తన కోపాన్ని ఆ వ్యక్తిపై ప్రదర్శించలేక ఆ కోపాన్ని ఎదురింటి వ్యక్తి పెంచుకుం టున్నపావురాలపై చూపాడు. తన పిల్లిని దొంగిలించాడన్నఅనుమానంతో పొరుగున ఉన్న వ్యక్తి పెంచుకుంటున్న దాదాపు 30 పావురాలను విషమిచ్చి చంపాడు.  

ఎర్రబెల్లి ఓవరాక్షన్.. సీఎం సీరియస్?

ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చాలా చక్కని, దగ్గరి సంబంధాలే ఉన్నాయి. అవును ఒక్కప్పుడు తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, ఎర్రబెల్లి   ముఖ్యమంత్రి కేసీఆర్ ను చాలా తీవ్రంగా దూషించారు. దుర్భాష లాడారు. అయినా  ఎర్రబెల్లి తనను ఎంత లేసి మాటలన్నా  ఎంతగా దూషించినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అంటే అది మామూలు బంధం కాదు. చాలా గట్టి బంధం అని వేరే చెప్పనకకరలేదు.  అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్  కు ఒక లెక్కుంది, ఆయనకు దగ్గరయ్యే కొద్ది దూరం పెరుగుతుంది. ఎంతటివారైనా, ఎంతటి బంధం, బంధుత్వం ఉన్నా, గీత దాటానంతవరకే గీత దాటితే, ఎంతటి వారికైనా వాత తప్పదు.  నరేంద్ర మొదలు ఈటల వరకు, ఎవరి కథ తీసుకున్నా అదే ముగింపు కనిపిస్తుంది. అయితే ఎర్రబెల్లికి ఆ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసిందో ఏమో కానీ  నోరు జారారు. గీత దాటారు ముఖ్యమంత్రిని మెప్పించాలని అనుకున్నారో  ఏమో కానీ, అనుమతి లేకుండా సర్వే నిర్వహించడమే కాకుండా, పాతిక మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని మీడియా ముందు మాట్లాడి భారాసలో ప్రకంపలు సృష్టించారు. అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకుని కావచ్చు అబ్బే ... నేన్నది అది కాదు, మీడియా వక్రీకరించిందని తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు.   అయితే ఎర్రబెల్లి కుప్పి గంతులు  ముఖ్యమంత్రి కేసేఆర్ దగ్గర పనిచేయలేదో ఏమో  కానీ, ఎర్రబెల్లి కామెంట్స్‌పై కేసీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని  అత్సుత్సాహం ప్రదర్శించవద్దని ఫోన్‌లో కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిధి దాటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇంకోసారి అలా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే ఎర్రబెల్లి చేత ఆ ప్రకటన చేయించారని, అయితే, అది కాస్తా లీక్ కావడంతో  ముఖ్య మంత్రి సీరియస్ అన్న ఎపిసోడ్ ను తెర మీదకు తెచ్చారని అంటున్నారు.   సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ టికెట్లు ఇస్తానంటూ గతంలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేలందరికీ టికెట్ కన్ఫామ్ అని కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో.. అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే పాతిక మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో సంచలనం రేపాయి. కేసీఆర్ అందరికీ టికెట్లు ఖాయమని చెప్పగా..  ఎర్రబెల్లి ఎందుకు అలా కామెంట్స్ చేశారనే చర్చ తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి కామెంట్స్ వెనుక కేసీఆర్ ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.  ఇప్పుడు ఎర్రబెల్లికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారనే వార్తలతో ఆ ప్రచారానికి కాస్త తెరపడినట్లు అయింది. కానీ, అసలు కథ ఏమిటి?  అంటే  నిజానికి భారస ఎమ్మెల్యేలలో కేవలం 25మందికి కాదు, సగం మందికి పైగానే ఎమ్మెల్యేలు చిక్కుల్లో ఉన్నారు.  మరో వంక పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యా పెరుగు తోందని అంటున్నారు. అందుకే, కేసీఆర్  వ్యూహాత్మకంగా ఎర్రబెల్లి ఎపిసోడ్  వన్ అండ్, టూ.. సీక్వెల్ ను తెరకెక్కించారని అంటున్నారు. అయితే ఏది నిజం ఏది కాదు అంటే, ఏమో ..ఎవరికీ తెలియదు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులల సందడి.. చూద్దాం రారండి!

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులులు సందడి చేస్తున్నాయి. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ప్రస్తుతం 26 పులులు ఉన్నాయి.   తెలంగాణ అటవీ, పర్యావరణ   శాఖ   అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. తాజాగా  మన్ననూర్ లోని వనమాలికలో నూతనంగా నిర్మించిన 6 కాటేజీలు, 8 సఫారీ వాహనాలను ప్రారంభించింది. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల సంఖ్య  బాగా పెరిగింది. దీంతో అడవుల ప్రత్యేకత కాపాడుతూనే, పర్యావరణహిత టూరిజం అందుబాటులోకి  తీసుకువచ్చింది ప్రభుత్వం. దీనిలో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ది చేయడానికి కార్యాచరణ రూపొందించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో రూ. 1.20 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేసిన 8 సఫారీ వాహనాలు, రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించిన 6 కాటేజీలను ప్రారంభమయ్యాయి. సహజమైన అటవీ వాతావరణంలోనే పులులను వీక్షించే అవకాశం, వెసులుబాటు కల్పించింది.   ఇంకెందుకు ఆలస్యం చూసొచ్చేద్దాం రండి. అన్నట్లు ఇక్కడ ఆన్ లైన్ కాటేజీలు బుక్ చేసుకోవడానికి వెసులు బాటు ఉంది.

బీఆర్ఎస్ తో పొత్తు .. పావులు కదుపుతున్న కాంగ్రెస్ పెద్దలు ?

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకోసం కేసీఆర్... తహతహ లాడుతున్నారా? ప్రస్తుత పరిస్థితిలో  దేశం సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే, కాంగ్రెస్ ‘చే’ తోడు అనివార్యమనే నిర్ణయానికి వచ్చారా? అంటే, అవుననే అంటున్నారు, అటూ ఇటూ ఉన్న ముఖ్య నేతల సన్నిహిత నాయకులు. నిజానికి  ఇదేమి కొత్త విషయం కాదు. పొలిటికల్, మీడియా సర్కిల్స్ లో ఈ చర్చ చాలా కాలంగా జరుగుతూనే వుంది. ఇప్పుడు ఫ్రెష్ గా మరో మారు తెర మీదకు వచ్చింది.  ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్న నేపధ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ముఖ్య నేతలు కొందరు, అంతకు ముందు ఏంతో కాలంగా, తాము చేస్తూ వచ్చిన భారాస తో పొత్తు ప్రతిపాదనను మరో మారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఆ తర్వాత ప్రత్యేక పరిశీలకునిగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ ద్వారా తమ ప్రతిపాదనను మరో మారు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళారు. అప్పటినుంచి ఢిల్లీ హైదరాబాద్  మధ్య ‘పొత్తు’ ప్రతిపాదన చక్కర్లు కొడుతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధిష్టానికి ఇచ్చిన నివేదికలో భారాస, కాంగ్రెస్ పొత్తు ప్రస్తవన చేసినట్లు తెలుస్తోంది.  ఈ నేపధ్యంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెర వెనక నడుస్తున్న రహస్య రాయబారాల వివరాలను బయట పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు తొమ్మిది నెలల క్రితం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనను ఏఐసీసీ ముందు పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్‌తో పొత్తుపై ఏఐసీసీ తమ అభిప్రాయాలను అప్పట్లో కోరిందని, అప్పట్లో తాము వద్దని చెప్పినట్లు అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు గురించి పార్టీలో చర్చ జరిగిన మాట వాస్తవమేనని, తనకు పూర్తి సమాచారం ఉందని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌తో కొట్లాడుతున్నప్పుడు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి సరెండర్ అయినట్లు ఉంటుందని అద్దంకి దయాకర్ అభిప్రాయపడ్డారు. గతంలో కేసీఆర్ బీహార్ వెళ్లి నితీష్ కుమార్‌ని కలిశారని, ఆ తర్వాత రెండు రోజులకే నితీష్ కుమార్ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి కేసీఆర్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవాలని కోరినట్లు అద్దంకి దయాకర్ చెప్పారు. కానీ రాహుల్ గాంధీ ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదని, లైట్‌గా తీసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఇప్పటికీ కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు ఏఐసీసీ దగ్గర బీఆర్ఎస్ పొత్తు గురించి ప్రపోజల్స్ ఇప్పటికీ పెడుతున్నారని, దయాకర్ స్పష్టం చేశారు.  తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తుకు రావాలని గతంలో కాంగ్రెస్ జాతీయ నేతలు కొంతమంది చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాటిని కొట్టిపారేస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎవరైనా నేతలు బీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.ఆ తర్వాత పొత్తు వార్తలకు చెక్ పడగా.. ఇటీవల మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన రిపోర్టుతో మరోసారి చర్చ మొదలైంది. ఇదలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ లో వర్గ పోరును చల్లార్చేందుకు, అధిష్టానం దూతగా హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ను కలిసిన మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరు తెలంగాణలో బీజేపీ అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ తో పొత్తు అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. భారాస పొత్తుతో పోటీచేయడం వలన కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారాన్ని పంచుకుంటుంది.అదే ఒంటరిగా పోటీ చేసి ముక్కోణ పోటీలో ఇరవై పాతిక సీట్లు గెలిచినా, గత అనుభవాలను బట్టి చూస్తే  గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టమవుతుందని ఆయన వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గద్దల్లా ఎగరేసుకు పోవడానికి బీఆర్ఎస్ కు తోడు ఇప్పుడు బీజేపీ కూడా సిద్ధంగా ఉందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, నిర్ణయం తీసుకోవాలని ఆయన హితబోధ చేసినట్లు తెలుస్తోంది.  దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా, తొలి పర్యటనలో కొంత సమాచారం సేకరించిన  తెలంగాణ కాంగ్రెస్ కొత్త  ఇంచార్జి మాణిక్‌రావు థాకరే, తాజా పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు విషయం పై కూడా ప్రత్యేక దృష్టి కేద్రీకరిస్తారని తెలుస్తోంది.

బాధిత కుటుంబాలకు సాయంపై వైసీపీ వికృత రాజకీయం

ఓ అబద్దాన్ని నిజం చేయాలంటే.. చాలా చాలా చేయాలి. అందుకు చదువు చట్టుబండలు అవసరం లేదు కానీ... కాస్తాంత కపటం, మోసం ఉంటే చాలు. సామిరంగా.. జనాన్ని ఏంటి ప్రతిపక్ష పార్టీలను సైతం రింగ రింగా అంటూ.. అల్లాడించేయచ్చు. స్కూళ్లు‌, కాలేజీల్లో నేర్పని ఈ విద్య.. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగానే ఒంట పట్టించుకుంది.  ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కందుకూరులో బాదుడే బాదుడు కార్యక్రమంలో   జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించారు. ఈ సందర్భంగా టీడీపీ, ఆ పార్టీ నేతలతోపాటు ఎన్నారైలు సైతం స్పందించి భారీగా నష్ట పరిహారాన్ని చెక్కులుగా అందించారు. అయితే ఎన్నారై కంచర్ల శ్రీకాంత్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయంటూ.. మృతుల కుటుంబాలకు నకిలీ చెక్కులు అంటగట్టారంటూ.. వైసీపీ.. సోషల్ మీడియా సాక్షిగా .. తెలుగుదేశం పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ.. విషం కక్కుతోంది.  ఈ విషయంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. అదే సోషల్ మీడియా సాక్షిగా స్పందించారు. నాయకుడు దొంగ పనులు చేస్తే, అనుచరులు వెధవ పనులే చేస్తారు. జగన్ రెడ్డి నోరిప్పితే అబద్దం.. వైసీపీ కార్యకర్తలు చేసేదంతా దుష్ప్రచారం. కందుకూరు మృతుల కుటుంబాలకు ఎన్ఆర్ఐ కంచర్ల శ్రీకాంత్ ఇచ్చిన చెక్కులు క్యాష్ చేసుకున్నాక బౌన్స్ అయ్యాయని జగన్ ఫేక్ గ్యాంగ్ విష ప్రచారం చేస్తోంది. శవాలపైనా, చివరకు మరణించిన వారి కుటుంబాలకు చేసే సాయంపైనా వికృత రాజకీయాలు చేయడం కేవలం వైసీపీకే సాథ్యమంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. బాధిత కటుంబాలకు టీడీపీ తరఫున ఇచ్చిన చెక్కు నెంబర్లను సైతం నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ మొత్తం ఎపిసోడ్‌పై నెటిజన్లు..  వైసీపీకి చురకలంటిస్తున్నారు. అధికారం అందుకోవడం కోసం.. విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా కోడి కత్తి డ్రామా నడిపినా.. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైనా.. జస్ట్ గుండెపోటుతో ఆయన మరణించారంటూ తొలుత మీడియాకు చెప్పినా... ఈ హత్య కేసు సీబీఐకి అప్పగించినా.. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి.. సబీఐ ఎదుట ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరెవరో చెప్పినా.. ఈ హత్య కేసు ముందు సాగపోవడం వెనుక ఉన్నది ఎవరనేది ప్రజలందిరికీ తెలిసిందేనని నెటిజన్లు వైసీపీకి చురకలంటిస్తున్నారు. అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కోడి కత్తి కేసులో పోడిపించినవాడు తాడేపల్లి ప్యాలెస్‌లో సకల భోగాలు అనుభవిస్తున్నాడని... కానీ కోడికత్తితో పోడిచిన వాడు   గత నాలుగేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని..  నెటిజన్లు అంటున్నారు.     ఈ ఘటనలు గడిచి... నాలుగేళ్లు అయినా.. వీటిపై స్పందించని అధికార వైసీపీ,  కందుకూరు ఘటనలో బాధితులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యారంటూ అబద్దపు వార్తలు..  అదే పనిగా ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని నెటిజనులు వైసీపీని నిలదీస్తున్నారు. అధికారం అందుకోవడం కోసమే కాదు.. ఆ వచ్చిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం.. ఎన్ని చేయడానికికైనా.. ఎంత చేయడానికైనా.. ఎంతటి విషప్రచారానికైనా.. తెగబడడం  జగన్, ఆయన పార్టీ నైజం అన్నట్లుగా పరిస్థితి ఉందని నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు. ఉన్న అధికారాన్ని నిలుపుకోవడం కోసం.. సమాధులనే పునాదులుగా చేసుకుని.. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే నైజం జగన్ పార్టీలో కొట్టోచ్చినట్లుగా కనిపిస్తోందని  నెటిజన్లు తమ అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక.. జనవరి నుంచి జగనన్న ఏమిటో చూపిస్తాడు.. చూడండంటూ.. జగన్ సైన్యం పేరిట.. సోషల్ మీడియాలో గత ఏడాది నవంబర్‌లో జగన్ సైన్యం.. తన ఖాతాలో పోస్ట్ పెట్టిందని.. అది ఇలాంటి వాటి కోసమేనా అని నెటిజన్లు డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

హైపర్ ఆదికి రోజా సపోర్ట్

పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, జగన్ మీద పోటీకి సిద్ధం .. హైపర్ ఆది..  ఇంతకీ ఈ హైపర్ ఆదీ ఎవరు? చాలామందికి తెలియక పోవచ్చును కానీ, ఓ ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే ... ఓ బూతు కామెడీ షో చూసే వారికి మాత్రం ఇతగాడి పరిచయం అవసరం లేదు. సరే .. ఇప్పుడు విషయం అదికాదు కాబట్టి, ఆవిషయాన్ని పక్కన పెట్టి, విషయంలోకి వస్తే... ఈ ఆది అనే వాడు... జనసేన వేదిక నుంచి పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ ప్రభత్వం పై సెటైర్లు, పంచ్ డైలాగులతో విరుచుకు పడ్డారు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, జగన్ మీద పోటీకి సిద్ధం, అంటూ జగన్ రెడ్డి ఇమేజ్ మొత్తాన్ని బెలూన్ లో గాలిలా కామెడీగా తీసి పారేశారు. మరో కమెడియన్, ఏపీ సర్కార్ లో ఉన్నశతకోటి సలహాదారుల్లో .. మరో సలహదారు అలీ, ఇటీవల జగన్ రెడ్డి ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని చేసిన కామెంట్ కు కౌంటర్ గా ఆది ఈ వ్యాఖ్య చేశారు  కావచ్చు.    అయినా, ఆది కామెంట్స్ మీద వైసేపీ నేతలు భగ్గుమంటున్నారు. కొంచెం చాలా తీవ్రంగానే హెచ్చరిస్తున్నారు. అతగాడి భాషలోనే సమాధానం ఇస్తున్నారు. కానీ మంత్రి రోజా మాత్రం, ఆది అమాయకుడు అంటూ కితాబు నిస్తున్నారు. జగన్ రెడ్డిని ఇంతవరకు ఎవరూ దూషించనంతగా దూషించడమే కాకుండా తలకాయ ఎక్కడ  పెట్టుకోవాలో తెలియని విధంగా తొడగొట్టి సవాలు విసిరిన ఆది ని నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు అంటూ మంత్రి రోజా సర్టిఫికేట్ ఇస్తున్నారు. అయితే రోజా రియాక్షన్ చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎవరైనా చిన్నమాట అంటేనే రెచ్చిపోయే రోజా అంతలేసి మాటలన్న ఆది విషయంలో ఎందుకిలా ‘చిన్నోడు’ ఏమీ తెలియని అమాయకుడు అంటూ చిరునవ్వుతో ఎందుకు సమర్ధించు కొచ్చారు? ఆ మాటలు అన్నది ఆది అయినా అనిపించింది, మెగా ఫ్యామిలీ  అంటూ, ఊరుము ఉరిమి మంగలం మీద పడినట్లు చిరంజీవి ఫ్యామిలీ మీద ఎందుకు పడ్డారు? ఆదిని రక్షించే బాధ్యతను ఆమె ఎందుకు భుజాల మీద వేసుకున్నారు? ఎందుకు ఆదికి అండగా నిలిచారు? అంటే అందుకు మంత్రి రోజా పూర్వాశ్రయంలో, జబర్దస్త్ షో జడ్జిగా ఈ ఆది వేసిన జోకులకు పగలబడి నవ్వారు. ఆ విధంగా ఆ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ బంధం ఉంటే ఉండవచ్చని, అందుకే ఆమె, ఆది మీద ఆగ్రహాన్నిడైవెర్ట్ చేసేందుకే మెగా ఫ్యామిలీ మీద మండి పడుతున్నారనే టాక్ ఒకటి నడుస్తోంది.  చిరు ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా మందిని నాశనం చేశారు, చిరు ఫ్యామిలీ మాట వినకుంటే సినిమా అవకాశాలు రావు, మెగా ఫ్యామిలీలో హీరోలకు వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ లో ఏమి లేకుండా చేస్తారు. అందుకే ఆది లాంటి చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటూ చెప్పు కొచ్చారని అంటున్నారు. అయితే  ఆది మరీ అంత అమాయకుడు కాదని, అతగాడికీ మంత్రి రోజా స్థాయిలో రాజకీయ కోరికలున్నాయని అంటారు. రణస్థలంలో ఇటీవల జనసేన నిర్వహించిన యువశక్తి సభలోనూ ఆది ఘాటుగా మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చేందుకే ఆది అలా రెచ్చిపోయారని అంటున్నారు.  మరో వంక ప్రకాశం జిల్లాకు చెందిన హైపర్ ఆది.. సొంత జిల్లా నుంచే పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. దీంతో ప్రధానంగా రెండు నియోజక వర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిలో గిద్దలూరు నియోజకవర్గం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆది సొంత ఊరికి దగ్గరలోనే ఈ నియోజకవర్గం ఉంది. అక్కడ జనసేన పార్టీ కూడా బలంగా ఉందని జనసేన నేతలు చెబుతున్నారు.అయితే, పులివెందులలో  జగన్ రెడ్డి పైనే పోటీకి సై అంటున్న ఆది..నగరిలో మంత్రి రోజా పై పోటీ అంటే ఏమంటారో ..  సై ..అంటారా .. నై అంటారా? ఊ అంటారా.. ఊహూ అంటారా అటూ సోషల్ మీడియాలో పంచుల మీద పంచులు పడుతున్నాయ్ .. అయితే, రాజకీయాలు ‘జబర్దస్త్’ స్థాయికి  పడిపోవడమే కొంచెం చాలా విచారం ... అనే బాధపడేవాళ్ళు బాధపడుతున్నారు.

బీఆర్ఎస్ టార్గెట్ కాంగ్రెస్.. బీజేపీకి లబ్ధి చేకూరేలా కేసీఆర్ చాణక్యం

కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యం అంటూ  తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయ రాజకీయాలలోకి లాంగ్ జంప్ చేసిన కేసీఆర్ నిజంగా ఆ లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నారా? అందు కోసమే దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీఆర్ఎస్ శాఖల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించేశారా? ఆ దిశగా ఆయన అడుగులు సవ్యంగా పడుతున్నాయా? అంటే మాత్రం సంతృప్తి కరమైన సమాధానం రాదు. ఆయన పైకి చెబుతున్న లక్ష్యం ఒకటి.. ఆచరణలో అమలు చేస్తున్న వ్యూహం మరొకటి అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  కేసీఆర్ బయలకు బీజేపీ లక్ష్యం అని చెబుతున్నా.. ఆయన టార్గెట్ చేసింది మాత్రం కాంగ్రెస్స్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఖమ్మం బీఆర్ఎస్ సభను చూపుతున్నారు. ఆ సభకు ఒడిశాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఒడిశా పీసీసీ కార్యదర్శి కైలాశ్ కుమార్ ముఖి హాజరు కావడం, ఆ మరునాడే ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు ప్రకటించడాన్ని చూపుతున్నారు. అలాగే అంతకు ముందు ఒడిశా మాజీ సీఎం    గిరిధర్ గమాంగ్ తో సీఎం కేసీఆర్ భేటీ  అయ్యారు.  ఒడిశా నుంచి గిరిధర్ కుమార్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మరీ కేసీఆర్ వారితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా... 9 సార్లు లోక్ సభ ఎంపీగా.. 1999, ఫిబ్రవరి 17 నుంచి 1999, డిసెంబర్ 6 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గిరిధర్ గమాంగ్ తన కుమారుడికి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన తన కుమారుడితో కలిసి కేసీఆర్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కాంగ్రెస్ టార్గెట్ గానే పావులు కదుపుతున్నారనడానికి వీటికి తోడు.. కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆయన బేరసారాలు జరిపారన్న ఆరోపణలు కూడా బలం చేకూరుస్తున్నాయి.    ఈ ఏడాది జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నది రేవంత్ ఆరోపణ. ఆ రాష్ట్రానికి చెందిన దాదాపు పాతిక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారనీ, ఇందుకు వారికి రూ.500 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారనీ టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నిటికీ బలం చేకూర్చేవిగానే బీఆర్ఎస్ గమనం, ప్రస్థానం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైకి బీజేపీని గద్దె దించడమేనని కేసీఆర్ చెబుతున్నా.. ఆయన అసలు లక్ష్యం మాత్రం కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమేనని అంటున్నారు. బీఆర్ఎస్ ద్వారా రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడమే కేసీఆర్ అక్ష్యమని అంటున్నారు.   తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకలోతు ఇరుక్కుపోవడం, అలాగే తనపైనా కొన్ని పాత కేసులు ఉండటంతో వాటి నుంచి బయటపడేందుకే కేసీఆర్ బీజేపీకి లోపాయకారీ సహకారం అందిస్తున్నారనీ, అందుకే బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తన వంతు దోహదం చేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇవన్నీ పక్కన పెడితే వాస్తవంగా ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ మంచి మిత్రులు, ఇద్దరూ కూడా ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు.. అలాగే కేసీఆర్ తెలంగాణలో మరోసారి గద్దెనక్కాలన్న లక్ష్యం చేరుకోవాలంటే.. ఈ సారి అంత సులభ సాధ్యం కాదు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న మోడీ, కేసీఆర్ లు ఇరువురూ కూడా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అందుకే తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఇద్దరూ కూడా వ్యూహాత్మక వైరం పాటిస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ గతం నుంచీ ఉన్నవే. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలే. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు తరువాత ఆ ఆరోపణలన్నీ నిజమేనని నమ్మడానికి వీలు కలిగించేవిగానే కేసీఆర్ అడుగులు, వ్యూహాలూ ఉన్నాయి.  కేసీఆర్ జాతీయ రాగం అందుకున్న క్షణం నుంచీ ఆయన ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ మిత్రపక్షాలను ఆ పార్టీకి  దూరం చేసి కాంగ్రెస్ ను ఏకాకిని చేయడంగానే సాగాయి. తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం రమ్మని ఆహ్వానించారు.  అలాగే, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచి విడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు.  ఇలా చెప్పుకుంటూ పొతే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన కాంగ్రెస్ ను బలహీన పరిచి బీజేపీని బలపరిచేందుకు చేసిన కుట్రగానే పరిశీలకులు చెబుతున్నారు. సరే కేసీఆర్ చేసిన ఆ ప్రయత్నాలు  ఫలించ లేదు అది వేరే విషయం. ఇప్పుడు సొంతంగా బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీ పెట్టి కూడా అవే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నిటి వెనుకా మోడీని మరో సారి కేంద్రంలో అధికారంలో కూర్చోపట్టి, తెలంగాణలో తన అధికారాన్ని పదిలం చేసుకోవడానికేనని పరిశీలకులు అంటున్నారు. పనిలో పనిగా తన కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు కూడా బీజేపీకి, మోడీకి తెరవెనుక నుంచి సాయపడుతున్నారని అంటున్నారు.  

ఆహా మోడీ.. ఓహో మోడీ.. కేంద్రానికి కావల్సిందదేనా?

ప్రధాని మోడీకి ఎన్నికల లబ్ధి వినా మరేం కనిపించడం లేదా? ఆఖరికి గణతంత్ర దినోత్సవాలను కూడా ఎన్నికలలో లబ్ధి చేకూర్చే కార్యక్రమంలా మార్చేస్తారా? అంటే పరిస్థితులు గమనిస్తుంటే ఔననే అనాల్సి వస్తోంది. బడుగులకు పెద్ద పీట వేయాల్సిందే.. ఎవరూ కాదనరు. వారి ఆదాయం పెంపునకు మార్గాలు చూపాలి. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కానీ ఒక ఉత్సవానికి ముఖ్య అతిథిలను చేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? కానీ మోడీ మాత్రం అలా చేస్తే చాలు ఓట్లు వాటంతటవే రాలుతాయని అంటున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను బడుగులకు భాగస్వామ్యం థీమ్ తో నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ థీమ్ తో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా గణతంత్ర స్ఫూర్తిని చాటుతున్నామని మోడీ సర్కార్ ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. అంతే కాకుండా సాధారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొదటి వరుసలో కూర్చునే అవకాశాన్ని వీవీఐపీలకు ఇస్తారు. కానీ ఈ సారి బడుగుల భాగస్వామ్యం థీమ్ తో నిర్వహిస్తున్న ఈ గణతంత్ర దినోత్సవంలో మాత్రం ఆ అవకాశాన్ని రిక్షా కార్మికులు, తోపుడు బండ్ల వ్యాపారులకు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల వేళ బడుగుల ఓట్లకు గాలం వేయడానికి మోడీ సర్కార్ వేసిన కొత్త ఎత్తుగడగానే దీనిని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో తోపుడు బండ్ల కార్మికులను ఆదుకోవడం కోసం అంటు ఘనంగా ప్రకటనలు గుప్పించినా ఆ తరువాత వారిని పూర్తిగా విస్మరించిన కేంద్రం ఇప్పుడు ఎన్నికల వేల ఓట్ల గాలం కోసం కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తోందంటున్నారు.  వీవీఐపీలకు కాకుండా రిక్షా కార్మికులు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులకు కేటాయించినట్టు కేంద్రం స్పష్టం చేసింది.  ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరౌతున్నారు. మొత్తం 45,000 మంది ఈ పెరేడ్ లో కూర్చునే సదుపాయం ఉంది. రాజ్ పథ్ రోడ్డును కర్తవ్యపథ్ గా పేరు మార్చాక జరుగుతున్ తొలి రిపబ్లిక్ డే పెరేడ్ ఇదే.  

మోడీ ప్రచారయావ.. ఉద్యోగ నియామకాల్లోనూ గెలుపు లెక్కలే..

ప్రజా ధనంతో సొంత ప్రచారం చేసుకునే విషయంలో ప్రధాని మోడీ కొత్త పుంతలు తొక్కుతున్నారు. స్వాతంత్ర్య భారత దేశంలో గత ఏడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న నియామక ప్రక్రియను కూడా తన ఘనతగా చాటుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. వివిధ శాఖలలో ఉద్యోగాల నియామకం ఒక నిరంతర ప్రక్రియ. ఆయా ఉద్యోగాలలో ఎంపికైన వారు తమ అర్హతను రుజువు చేసుకుని, అవసరమైన పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన వారే. వారికి హక్కుగా వచ్చే నియామకాలను కూడా ప్రధాని మోడీ ఇప్పుడు.. తన ఉదారత్వంగా చాటుకుని ప్రచారం పొందాలని చూస్తున్నారు. ఇప్పటి వరకూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మందికి ప్రధాని మోడీ నియామక పత్రాలు (అప్పాయింట్ మెంట్ లెటర్స్) పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి రోజ్ గార్ మేళా అని పేరు పెట్టి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామకపత్రాలను పంపిణీ చేసిన మోడీ.. ఇటువంటి మేళాల ద్వారా యువతకు సాధికారత లభిస్తుందన్నారు. రోజ్ గార్ మేళా ద్వారా స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, టీచర్, నర్సు, డాక్టర్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, మల్టీ టాస్క్ స్టాఫ్ లకు మోడీ నియామక పత్రాలు అందజేశారు. ఏడున్నర దశాబ్దాలలో గతంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదా?  నియామక పత్రాలు అందుకోలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యే విధంగా మోడీ చేసిన ఈ హంగామా రాజకీయ వర్గాలలో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎన్నికల ప్రయోజనాలు లక్ష్యంగా ఇటీవలి కాలంలో ప్రధాని మోడీలో ప్రచార యావ విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారం చేపట్టడానికి పూర్వం కూడా కోట్లాది మంది  తమ అర్హతలను ప్రూవ్ చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అయినా అప్పటి ప్రభుత్వాలేవీ ఇలా అర్భాటంగా ప్రచార పర్వానికి తెరతీసిన దాఖలాలు లేవు. ఎన్నికలు గతంలోనూ జరిగాయి. కానీ అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇప్పటి మోడీ సర్కార్ లాగా ఒక పద్ధతి ప్రకారం..జరిగే నియామకాలను రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకున్న దాఖలాలు వేవు.   ఉద్యోగ నియామకాల ప్రక్రియను పర్యవేక్షించే వ్యవస్థలు ఉన్నాయి. వాటి ద్వారానే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి. ఆయా వ్యవస్థల ఆధ్వర్యంలోనే రాత పరీక్షలు జరుగుతాయి. అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్ వస్తాయి. ఇంటర్వ్యూలో కూడా అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇదీ నియామక ప్రక్రియ. ఆ విధంగా తమను తాము ప్రూవ్ చేసుకుని, రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి నియామకపత్రాల పంపిణీ అంటూ మోడీ ఆర్భాటం చేయడమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.. ఆ తరువాత వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ప్రధాని మోడీ పార్టీ లక్ష్యమేమిటో ప్రకటించేశారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తీరాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ఈ విజయాల ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కేంద్రంలో తాను మళ్లీ ముచ్చటగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఇదే బీజేపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యం అని విస్పష్టంగా చెప్పేశారు. ఇప్పటికే గత ఎనిమిదేళ్లుగా ఎన్నికల నుంచి ఎన్నికలకు అన్న టార్గెట్ తోనే ప్రబుత్వాన్ని నడుపుతున్న మోడీ సర్కార్ ఇక ఇప్పుడు పాలనను పూర్తిగా గాలికి వదిలేసి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

రైల్వే బడ్జెట్ గమ్యం మారింది

బడ్జెట్ అనగానే సహజంగా, సాధారణ బడ్జెట్ గురించే ఆలోచిస్తారు, కానీ, రైల్వే బడ్జెట్  గురించి పెద్దగా పట్టించుకోరు. సాధారణ బడ్జెట్ ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతుంది. సాధారణ బడ్జెట్ ప్రభావంతో పప్పు ఉప్పు మొదలు, చుట్టా బీడీ దాకా అన్నిటి ధరలు పెరుగుతాయనే భయం సామాన్యులను సహజంగా వెంటాడుతుంది.  అంతే సహజంగా  ప్రజల జీవన ప్రమాణాలపై సాధారణ బడ్జెట్ ప్రభావం ఉంటుంది. సాధారణ బడ్జెట్ కు ఉన్న ప్రాధాన్యత  రైల్వే బడ్జెట్ కు లేక అపోవడానికి అదొక కారణం అయితే,  గతంలో ఎప్పుడూ రైల్వే బడ్జెట్ కు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు పెద్దగా లేక పోవడం మరొక కారణం కావచ్చును. అయితే, ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం సుస్థిర ఆర్థిక  అభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తోది. ముఖ్యంగా రవాణా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు రోడ్డు, జల, వాయు మార్గాలతో పాటుగా రైలు మార్గాల విస్తరణ, ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే, ఇటీవల కాలంలో రైల్వే బడ్జెట్  కూడా చర్చకు వస్తున్నది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. దీంతో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు..  తదితర విషయాలపై అందరిలోనూ ఈ బడ్జెట్ ఆసక్తిని నింపుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో వందే భారత్‌ రైళ్లు, బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే మూడేళ్లలో 400 సెమీ హైస్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించినట్లు గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు వీటిపై ఏం చర్యలు తీసుకుంటారన్నదని ఆసక్తిగా మారింది. భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బడ్జెట్‌ను పెంచే అవకాశాలు ఉన్నాయి. రైల్వేలకు కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండగా అది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం పెంచి రూ. 1.9 లక్షల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.45 లక్షల కోట్ల క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌తో పోలిస్తే  వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూలధన వ్యయం రూ. 3 ట్రిలియన్లకు అంటే 20 శాతానికి పైగా పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 2024 మొదటి క్వార్టర్‌లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వందే భారత్ రైలు  రీవ్యాంప్డ్ స్లీపర్ వెర్షన్ గురించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు ప్రకటించిన దానికి మించి ఈ ఏడాది బడ్జెట్‌లో మరో 400 కొత్త వందే భారత్ రైళ్ల ప్రణాళికలను ప్రభుత్వం ఆవిష్కరించే అవకాశం ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌, శతాబ్దీ ఎక్స్‌ప్రెస్‌లు సహా అన్ని హైస్పీడ్‌ రైళ్లను ఒక్కొక్కటిగా పక్కన పెట్టి వాటి స్థానంలో అన్ని చోట్లా వందే భారత్‌ రైళ్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచనలో ఉంది. ప్రధాన మార్గాల్లో వేగాన్ని గంటకు 180 కిలోమీటర్ల స్థాయికి పెంచాలని చూస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశం స్టాండర్డ్-గేజ్ వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవల చెప్పారు. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే 180 కిమీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో రైళ్లను తయారు చేయగల సామర్థ్యం ఉన్న ఎనిమిది దేశాల సరసన భారత్‌ చేరుతుంది. 2025-2026 నాటికి యూరప్‌, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాలోని మార్కెట్‌లకు ఎగుమతి చేయడానికి రైళ్లను తయారు చేయాలని కూడా రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే, బహుశా చరిత్రలో మొదటి సారి రైల్వే బడ్జెట్ కోసం ప్రజలు  ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు ఎవరు  రైల్వే మత్రిగా ఎవరున్నా..  రైల్వే బడ్జెట్ లో సింహ భాగం మంత్రి వర్యుని స్వరాష్రాతునికి వెళ్ళిపోవడం ఆనవాయితీగా వస్తోంది.  ఇప్పుడు ఆ దృక్పథం మారింది ..వార్షిక బడ్జెట్ కు అనుబంధంగా ఆర్థిక మత్రిత్వ శాఖ రైల్వే బడ్జెట్ రూపొందించడంతో బడ్జెట్ బరువుతో పాటుగా దృక్పథం కూడా మారింది ... జాతీయ దృక్పథం ప్రాధాన్యత సంతరించుకుంది.

జీవో నంబర్1పై సుప్రీంలో జగన్ సర్కార్ కు దక్కని ఊరట

జీవో నంబర్ 1 విషయంలో జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో కూడా ఊరట లభించలేదు. రాష్ట్రంలో సభలూ సమావేశాలను నిషేధిస్తూ జగన్ సర్కార్ విడుదల చేసిన జీవో నంబర్ 1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు జరిగే విచారణలో వాదనలు వినిపించాలని ఏపీ సర్కార్ కు సూచించింది. 23వ తేదీన కేసు విచారణలోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు జడ్జిని ధర్మాసనం ఆదేశించింది.  ప్రమాదాల నివారణ కోసమే జీవో నంబర్ 1 తీసుకొచ్చామని, ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని జగన్ ప్రభుత్వం చెబుతున్నా. వైసీపీ వినా అన్ని రాజకీయ పార్టీలూ  జీవోను వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసమే జీవో తెచ్చారని, ఎమర్జెన్సీ కంటే కూడా దారుణమైన జీవో ఆరోపిస్తున్నారు. జీవోను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ వేశారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ చేపట్టి జీవోను ఈ నెల 23 వరకూ హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.

రాహుల్ పాదయాత్రలో టీ షర్ట్ పైన జాకెట్..

భారత్ జోడో యాత్రలో శుక్రవారం ఓ విశేషం కనిపించింది. ఇంత కాలంగా కేవలం టీ షర్ట్ మాత్రమే వేసుకుని చలిని లెక్క చేయకుండా పాదయాత్ర సాగించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో ఆయన పాదయాత్ర పవేశించిన తరువాత చలి నుంచి రక్షణ కోసం జాకెట్ ధరించారు. ఇప్పటి వరకూ 125 రోజులలో 3400 కీలోమీటర్ల మేర పాదయాత్ర సాగించిన రాహుల్ గాంధీ ఇన్ని రోజులూ చాలా చాలా సింపుల్ గా టీ షర్ట్ మాత్రమే ధరించి నడక సాగించారు. ఎందరు ప్రశ్నించినా తనకు చలి అనిపించేంత వరకూ స్వెట్టర్, జాకెట్ వేసుకునే ప్రశక్తి లేదని రాహుల్ పలుమార్లు స్పష్టం చేశారు. గజగజలాడించే చలిలో సైతం ఆయన కేవలం టీషర్ట్ తోనే నడిచారు. అయితే పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ లో అడుగు పెట్టిన తరువాత ఆయన జాకెట్ వేసుకోక తప్పలేదు. జమ్మూలో ఉదయం నుంచీ చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో రాహుల్ గాంధీ కొద్ది సేపు టీషర్ట్ వేసుకున్నారు. అనంతరం తొలగించేశారు అది వేరే విషయం. జమ్ము-కశ్మీర్ లో రాహుల్ కు మరింత  భద్రతా ఏర్పాట్లు చేశారు.  భద్రతా వలయాన్ని పటిష్టం చేశారు. జామర్స్ ను కూడా పెట్టారు. కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో కాలి నడకన వెళ్లద్దంటూ భద్రతా బలగాలు రాహుల్ ను ఇప్పటికే హెచ్చరించాయి కూడా. ఈనేపథ్యంలో భారత్ జోడో యాత్రలో కొన్ని మార్పులు చేస్తూ, పాదయాత్రను కుదిస్తున్నారుకూడా.

ఆర్థిక క్రమశిక్షణ ఎదీ?

ఎవరి బడ్జెట్ వారిదే.. ఎవరి తీరు వారిదే.. ఎక్కడా సామరస్యం కనిపించడం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక దేశం అన్నట్లుగా ఆయారాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆర్థిక వ్యవహారాలవిషయంలో ఎవరి తీరు వారిదే అన్నట్లుగా తయారైంది. ప్రపంచాన్ని ఇప్పుడు ఆర్థిక మాంద్యం కమ్మేస్తోంది. ఇప్పటి వరకూ భారత్ మాత్రం ఆ ఆర్థిక మాంద్యం బారిన పడలేదు. ఇందుకు కారణాలనేకం ఉన్నా.. దేశం కూడా ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే ఆర్థిక మాంద్యం బారిన పడక తప్పదన్నసంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కేంద్రం, కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఆ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇసుమంతైనా దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.   ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం, దేశ ఆర్థిక పరిస్థితి గురించిన పట్టింపే లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఏవో కొన్ని రాష్ట్రాలు ప్రపంచ ఆర్థిక పోకడలు.. రానున్న ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ విధానాలను సవరించుకుంటున్నప్పటికీ.. చాలా రాష్ట్రాలు తమ ఆర్థిక విధానాలను వచ్చే ఎన్నికలలో విజయానికి పెట్టుబడి మార్గాలుగానే భావిస్తు్నాయి. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయమే తీసుకుంటే సంక్షేమం పేరుతో ఉచితాలు, బుజ్జగింపులకే నిధులను దారాదత్తం చేస్తున్నది. ఉచితాల కోసం అప్పులు, ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులూ అంటూ, అభివృద్ధి, ఆదాయం పెంచుకునే మార్గాల వైపు దృష్టి సారించకుండా వ్యవహరిస్తున్నది.    సంక్షేమ పథకాలు, ఉచితా లపై చూపిస్తున్నంత శ్రద్ధను రాష్ట్రాలు పెట్టుబడులు, అభివృద్ధి, ఆదాయాన్నిపెంచుకునే విధానాలపై పై చూపించడం లేదు.  వర్తమాన ఆర్థిక సమస్యలను భవిష్యత్తుకు వాయిదా వేయాలన్న రాష్ట్రాల ఆలోచనల వల్ల భవిష్యత్  కూడా అంధకారమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా భవిష్యత్తు ప్రణాళికలపై, అవసరాలపై   దృష్టి పెట్టాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని, పెట్టుబడులు పెంచడానికి, ఆర్థిక వనరులను సమ కూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తమ దుబారా, వ్యర్ధ వ్యయాలను అదుపు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలను చుట్టుముట్టి, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న ఆర్థిక మాంద్యం భారతన్ను కూడా కబళించే అవకాశం లేకపోలేదు. భవిష్య త్తులో ఎదురు కాబోయే ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమ తీరు మార్చుకుని, అభివృద్ధి పథకాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాలి.

బీఆర్ఎస్ కు ఖమ్మం సభ ప్లస్సా.. మైనస్సా?

బీఆర్ఎస్ ఖమ్మం సభ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నట్లు విజయవంతమైందా? విపక్షాలు చెబుతున్నట్లుగా అట్లర్ ప్లాప్ అయ్యిందా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ సభ బీఆర్ఎస్ లో జోష్ నింపిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ మొదలు పెట్టినప్పటి నుంచీ ఆయన చేసిన ప్రయత్నాలు నీరు గారిపోయాయన్న అభిప్రాయమే రాజకీయ వర్గాలలో వ్యక్త మౌతోంది. గతంలో సిఎం కెసిఆర్ పలు రాష్ట్రాలకు వెళ్లి మరీ కలిసిన సిఎంలను బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఆహ్వానించలేదా..?  ఆహ్వానించినా వారు రాలేదా..? అన్న ప్రశ్నలు భారాస వర్గాలలోనే వినిపిస్తున్నాయి.   పలువురు సిఎంలతో చర్చించిన సిఎం కెసిఆర్ బీఆర్ఎస్ ఆవిర్బావ సబకు  వారినెందుకు దూరం పెట్టారన్నచర్చ సామాన్య జనంతో పాటుగా రాజకీయ వర్గాలలో కూడా జోరుగా సాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరేన్, బిహార్ సిఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతాబెనర్జీ  వీరితో పాటు ఎన్సీపి అధినేత శరద్ పవార్, శి వసేన అధినేత  ఉద్దవ్ ఠాక్రే, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ లను కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదు.. ఒక వేళ ఆహ్వానించినా వారు ఆ ఆహ్వానాన్ని మన్నించలేదా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  ఆదిలోనే వారితో సిఎం కెసిఆర్ కు సయోధ్య కరువైందా...?  లేక బిఆర్ఎస్ తో వారు దూరంగా ఉండాలని భావిస్తున్నారా..? అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు వారెవరూ రాకపోవడం కేసీఆర్ తొలి అడుగులోనే జాతీయ రాజకీయాలలో తడబడ్డారా అన్న అనుమానాలను పరిశీలకుల వ్యక్తం చేస్తున్నారు. మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి అని ఖమ్మం సభ వేదికగా గంభీరంగా ప్రకటించిన కేసీఆర్.. కేవలం ఈ సభకు వచ్చిన ముగ్గురు, నలుగురు నాయకులతో ఎర్రకోటమీద జెండా ఎగురవేయగలనని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం సభకు వచ్చిన నాయకుల పార్టీలన్నీ కలిపినా కూడా పట్టుమని పాతిక లోక్ సభ స్థానాలు లేవు. అటువంటిది.. ఈ మద్దతుతో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేస్తానంటే నమ్మశక్యంగా లేదనీ, అతి విశ్వాసమో.. లేదా అతి అమాయకత్వమో తప్ప మరొకటి కాదనీ అంటున్నారు.   జాతీయ స్థాయిలో రాజకీయం చేద్దామని భావిస్తున్న  సిఎం కెసిఆర్ కు  ప్రాంతీయ పార్టీల నుంచి ప్రతిబంధకాలు ఎదురౌతున్నాయన్న భావనా వ్యక్తమౌతోంది.   ప్రతి రాష్ట్రంలోనూ బిఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ఉద్దేశానికి ఆయా రాష్ట్రాల్లోని అధికార ప్రాంతీయ పార్టీల నాయకత్వం   విముఖత ఎదురౌతోందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో బిఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కు ఆయా రాష్ట్రాలలో ప్రతికూలతలే ఎదురౌతున్నాయనీ, అందుకే ఇప్పటి వరకూ ఏపీలో వినా మరే రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ శాఖలు ఏర్పాటు కాలేదనీ విశ్లేషిస్తున్నారు.   

మంగళగిరిలో నారా లోకేష్ కు నల్లేరు మీద బండి నడకే!

మంగళగిరిలో అధికార వైసీపీకి ఆ పార్టీలోని లీడర్ల నుంచి కేడర్ వరకు అంతా వరుసగా ఝలక్ ఇచ్చారు... ఇస్తున్నారు.  తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, కోమ్మారెడ్డి వీరారెడ్డి, నూతలపాటి నంబూద్రిపాద్, తిరువీధుల నరసింహమూర్తి తదితరులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు.ఇటీవలి కాలంలో  వైసీపీ నుంచి భారీగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. అలా వలస వస్తున్న వారిలో లీడర్ నుంచి కేడర్ వరకు   ఉంటున్నారు.   అయితే టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు పోటెత్తడంపై   విపక్ష నేతగా వైయస్ జగన్.. నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు.. అలాగే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఆయన అమలు చేస్తున్న   విధానాలకు ఎక్కడా పొంతన లేదని...  ముఖ్యంగా  రాష్ట్ర రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చిన  జగన్ అధికారంలోకి రాగానే.. మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారనీ, ఆ కారణంగా వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించే మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయిపోతోందనీ స్థానికులు చెబుతున్నారు.  అలాగే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రచారంలో భాగంగా.. నాటి ప్రతిపక్ష నేత  జగన్..  టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తన కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి ఇస్తానని.. నియోజకవర్గ ప్రజల సాక్షిగా ప్రకటించారు... కానీ వైయస్ జగన్.. తన రెండు కేబినెట్ల కూర్పులో ఎక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కనిపించలేదు.. వినిపించలేదు.  ఇలా   జగన్ ప్రతిపక్షనేతగా మాట తప్పం.. మడం తిప్పమంటూ ప్రకటించి,  ముఖ్యమంత్రి కాగానే.. మాట తప్పేయడం.. మడమ తిప్పేడయం చేశారని నియోజకవర్గ ప్రజల్లు సోదాహరణగా చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి  జంప్ చేసిన  చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి సైతం వైయస్ జగన్... తన కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్య శాఖను కట్టబెట్టారని..  దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకానొక దశలో తీవ్రంగా హర్ట్ అయి.. బుంగమూతి సైతం పెట్టుకున్నారని.. అందుకే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఇప్పటికే   ఎమ్మెల్యే ఆళ్ల... స్వయంగా తన కేడర్ వద్ద పేర్కొన్నట్లు ఇప్పటికే నియోజకవర్గంలో ఓ టాక్ అయితే హల్‌చల్ చేస్తోంది.   ఇంకోవైపు గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా నారా లోకేశ్.. గత మూడున్నర్లేళ్లుగా నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటూ.. వారి సమస్యలపై  అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారని.. అలాగే  నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు ... ఆరోగ్య సంజీవినీ పేరిట మొబైల్ వైద్యశాలలు సైతం ఏర్పాటు చేశారు. ఇంకోవైపు.. మంగళగిరి టీడీపీలో బలమైన నాయకుడిగా పేరున్న గంజి చిరంజీవి లాంటి వారిని సైతం జగన్ పార్టీ ఆకర్షించేసిందని.. అలాగే వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు ఎంత చేయాలో అంతా చేసేందు ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎం హనుమంతరావును సైతం ఇలా పార్టీలొకి తీసుకుని..  అలా ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. అలాంటి సమయంలో సైతం.. మంగళగిరి నియోజకవర్గంలోని జగన్ పార్టీలో కీలక నేతలంతా.. వరుసగా సైకిల్ ఎక్కేస్తుండటం పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెబుతోందని అంటున్నారు. ఇక నారా లోకేశ్.. యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్ర. జనవరి 27న కుప్పంలో ప్రారంభం కానుంది. దాదాపు 400 రోజుల పాటు.. నాలుగువేల కిలోమీటర్లు మేర ఈ పాదయాత్ర సాగనుంది. అలా నారా లోకేశ్.. ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకొంటూ..ఈ జగన్ ప్రభుత్వంలోని పాలన వైఫల్యాలను తన గళంతో ఎండగడుతూ.. నారా లోకేశ్ ముందుకు సాగనున్నారు.

బీజేపీకి ఈశాన్య గండం!

బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమౌతోంది. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయం సాధించాలన్న నిర్ణయంతో అడుగులు వేస్తోంది. పాలనా వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసి కేంద్రం కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయింది. ఈ ఏడాది ఇప్పటికే తొలి ఎన్నికల నగారా మోగింది. మూడు ఈశాన్య రాష్ట్రాలలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 2న విడుదల కానున్నాయి. అయితే కొత్త ఏడాది లో జరగనున్న మూడు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి కేక్ వాక్ కాదు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించేసిన బీజేపీకి ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు పెద్ద అగ్నిపరీక్షగానే మారనున్నాయి.    త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో బీజేపీ విజయంపై పరిశీలకులే కాదు, బీజేపీ శ్రేణులు కూడా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. త్రిపురలో గత ఎన్నికల్లో మేజిక్‌ ఫిగర్‌ను సాధించి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అంతకు ముందు త్రిపురలో బీజేపీకి ఉనికి కూడా నామమాత్రం అన్నట్లుగా పరిస్థితి ఉంది.   అలాంటి స్థితి నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు  గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ   రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత విభేదాలు తీవ్ర మయ్యాయి. 2018లో విప్లవ్‌ దేవ్‌ను సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ ఆయనను దింపేసి మాణిక్‌ సాహాను సీఎం చేసింది. ఇప్పుడు ఆయన కూడా పార్టీ నాయకుల నుంచే  వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  త్రిపురలో బెంగాలీ జనాభా ఎక్కువ. ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు, మమతా బెనర్జీ బరిలో నిలిస్తే..   బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురౌతాయి. ఇక  మేఘాలయ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో  బీజేపీకి ఉన్నది రెండే రెండు సీట్లు. అయితే నేషనల్ పీపుల్స్ పార్టీకి మద్దతిచ్చి ప్రభుత్వంలో భాగం అయింది. . అయితే, ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారాయి . తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని మేఘాలయ ముఖ్యమంత్రి సీఎం కన్రాడ్‌ సంగ్మా ప్రకటించి బీజేపీతో పొత్తు లేదని విస్పష్టంగా చెప్పేశారు. అలాగే బీజేపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతామని ప్రకటించింది. అయితే వాస్తవానికి మేఘాలయలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకటి, రెండు సీట్లు సాధిస్తే.. బలవంతంగా అధికార కూటమిలో చేరే అవకాశం ఉంటుంది. నాగాలాండ్‌లో కూడా బీజేపీ ఒంటరి విజయం సాధించే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ పార్టీ సంకీర్ణ కూటమిలో  భాగస్వామి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు. గత ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు 20 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నది. మరోవైపు   గిరిజన తెగలు  ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్‌  బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి.   ఏ విధంగా చూసుకున్నా.. 2024 సార్వత్రిక ఎన్నికల టార్గెట్ లో భాగంగా బీజేపీ నిర్దేశించుకున్న మిషన్ 9లో తొలి మూడు రాష్ట్రాలలోనే ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్ష అనే చెప్పాలి.  

జనసేనతో బీజేపీ కటీఫ్.. వైసీపీతోనే కలిసి వెళుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనాలంటే పొత్తులు అనివార్యం అన్న నిర్ణయానికి ప్రధాన పార్టీలు వచ్చేశాయి. ఈ విషయంలో మొదటి నుంచీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనని, ఈ విషయంలో అవసరమైతే ప్రధాని మోడీతో స్వయంగా మాట్లాడుతాననీ కూడా ప్రకటించారు. అయితే ఏపీలో ఇసుమంతైనా ఓట్ స్టేక్ లేని బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో ఒకింత ప్రాధాన్యత ఏపీలో రాజకీయంగా లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పవన్ కల్యాణ్ ను ఒక ట్రాప్ లో చిక్కుకునేలా గత మూడున్నరేళ్లుగా దిగ్బంధంలో ఉంచగలిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధం, అరాచకాలు పెరుగుతున్న నేపథ్యంలో జనసేనాని రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండాలన్న దానిపై ఒక క్లారిటీకి వచ్చేశారు. ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయనతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం.. రణస్థలితో సభలో మాట్లాడిన ఆయన తెలుగుదేశంతో కలిసి సాగనున్నట్లు దాదాపుగా స్పష్టత ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీని పూర్తిగా విస్మరించినట్లే కనిపించింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో కలిసి నడవాలా వద్దా అన్నది బీజేపీయే నిర్ణయించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇంత కాలం మిత్రపక్షంగా ఉన్నా జనసేనను బీజేపీ విస్మరిస్తే.. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన బీజేపీని ఇగ్నోర్ చేసింది. బంతిని ఆ పార్టీ కోర్టులోకే నెట్టేసింది. తొలి సారి జనసేనాని ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటించినప్పుడు రాష్ట్రంలో 2014 నాటి పొత్తులు పొడుస్తున్నాయా అన్న చర్చ తెరమీదకు వచ్చింది.  జనసేన విశాఖ గర్జన సందర్భంగా  చోటు చేసుకున్న పరిణామాలు, పవన్ కల్యాణ్ ను హోటల్ కు పరిమితం చేసేలా ఆంక్షలు విధించడం తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించడమే కాకుండా.. ఆయన విశాఖ నుంచి వచ్చిన తరువాత స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయనతో కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంగా జనసేన మిత్ర పక్షం బీజేపీ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు ఖాయమని అంతా భావించారు.   ఈ సందర్భంగానే రాష్ట్ర పతి ఎన్నిక సందర్భంగా  బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ  బీజేపీపై ఎంత  ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా  ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడం,  చంద్రబాబుకు   12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం వీటన్నిటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు దగ్గరౌతున్నాయనడానికి పరిశీలకులు నిర్ధారణకు వచ్చేశారు. అాదే విధంగా `ఢిల్లీలో  మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి కేంద్రం నుంచి అందిన ఆహ్వానం మేరకు  చంద్రబాబు  హస్తిన వెళ్లడం, ఆ సందర్బంగా కొద్ది సేపు మోడీతో ముచ్చటించడాన్ని కూడా పరిశీలకులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనడానికి తార్కానాలుగా పేర్కొన్నారు. అయితే.. ఏపీ బీజేపీలో మాత్రం తెలుగుదేశంతో మైత్రి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఇటీవల హస్తినలో జరిగిన  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీలో పొత్తులు వద్దని నిర్ణయించింది.  ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పొత్తులకు దూరం అని బీజేపీ ప్రకటించడమంటే వైసీపీకి సానుకూలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం 1 లేదా 1.5 శాతం ఓట్లతో బీజేపీ రాష్ట్రంలో సాధించేదీ, సాధించగలిగేదీ ఏమీ లేకపోయినా.. జనసేనకు దూరం జరగడం ద్వారా ఏపీలో వైసీపీ పట్ల బీజేపీ సానుకూలంగా ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.  పేరుకు సొంతంగా ఎదగడానికే పొత్తులకు దూరం అని చెబుతున్నా.. ఇప్పటి వరకూ కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీలోని జగన్ సర్కార్ కు అందిస్తున్న సహకారాన్ని గమనిస్తే బీజేపీ జగన్ పార్టీకి దగ్గరౌతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.