వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్టు.. ఏ కేసులోనో తెలుసా?
posted on Oct 30, 2025 9:21AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీసీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్టయ్యారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం (అక్టోబర్ 29) అరెస్టు చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో రాజకీయ సంబంధం ఉన్న అరెస్టు ఇదే మొదటిది కావడం విశేషం.
విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలసకు చెందిన చిన్న అప్పన్న, హైదరాబాద్ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలచూస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో చిన్న అప్పన్న కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారుల దర్యాప్తులో తేలడంతో అతడిని బుధవారం (అక్టోబర్ 29) తిరుపతిలోని సిట్ కార్యాలయానికి విచారణ కోసం పిలిచారు. అక్కడ చిన్న అప్పన్నను హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం అరెస్టు చేశారు. ఆ వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి తర్వాత నెల్లూరు ఏసీబీ న్యాయమూర్తి నివాసంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
ఈ కేసులో చిన్న అప్పన్నను ఏ 24గా పేర్కొన్నారు. చిన్న అప్పన్నను ఇదే కేసులో సిట్ గత జూన్ 24న కూడా విచారణకు రావాల్సింగా నోటీసులు పంపింది. అయితే ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ కొనసాగడాన్ని సవాల్ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించింది. సుమారు మూడున్నర నెలల తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది. విచారణ మొదలైన కొద్ది రోజులకే ఈ కీలక అరెస్ట్ జరిగింది. చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందనీ, అంతే కాకుండా రానున్న రోజులలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందనీ అంటున్నారు.