పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు

  ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిలకడైన బ్యాంటింగ్ తో తక్కువ స్కోరును ఛేదించి గెలుపు సొంతం చేసుకుంది. టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ 10 ఓవర్లలో కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్ శ్రీశాంత్ వేసిన రెండో ఓవర్లో పంజాబ్ కెప్టెన్ ఆడమ్ గ్రిల్ క్రిస్ట్ (0), మన్ దీప్ (2) పరుగుల చేసి ఔటయ్యారు. మరుసటి ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించిన వోహ్రా (3) రనౌట్ అయ్యాడు. మైఖేల్ హస్సీ, గురుకీరత్ లు నిలకడగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 31 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ ఇన్నింగ్స్ లో హస్సీ (41) ఒక్కడే అత్యధిక స్కోరు చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో ప్రవీణ్ కుమార్ 7 బంతుల్లో 15 పరుగులు (2ఫోర్లు,  1 సిక్స్) చెలరేగి ఆడడంతో పంజాబ్ 124 పరుగులైనా చేయగలిగింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో గురుకీరత్ 10, సతీష్ 11,  అజార్ మెహమూద్ 23, చావ్లా 7, పర్మిందర్ ఆవానా 0, హారీస్ 2 నాటౌట్ గా నిలిచాడు. శ్రీశాంత్ 2, కెవోన్ కూపర్ 2, ఫాల్కనర్ 2, తివేది 2 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ వాట్సన్ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. వాట్సన్ 19 బంతుల్లో 32 పరుగులు (7 బౌండరీలు) చేసిన తరువాత ఆవానా బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ద్రావిడ్ 9,  బిన్నీ 0 లను ప్రవీణ్ కుమార్ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. ఒక పక్క వికెట్లు పడిపోతున్నా ఓపెనర్ రహానే నిలకడగా ఆడుతూ రాజస్థాన్ రాయల్స్ ను నాలుగు బంగులు మిగిలి వుండగానే 126 పరుగల విజయలక్ష్యాన్ని ఛేదించాడు. హాడ్జ్ 15, శ్యామ్ సన్ 23 బంతుల్లో 27 పరుగులు (3 బౌండరీలు)తో అజేయంగా నిలిచాడు. రహానే 42 బంతులలో 34 పరుగులు (3బౌండరీలు) లతో నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ప్రవీణ్ 2, ఆవానా 1, పియూష్ చావ్లా 1 వికెట్లు పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫాల్కనర్ నిలిచాడు.

ఛేజింగ్ లో చతికిలపడ్డ సన్ రైజర్స్

  ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నిర్దేశించిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక సన్ రైజర్స్ చతికిలబడింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ కు దిగిన కోల్ కత్తా ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 59 పరుగులు జోడించారు. గంభీర్ తన 39 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన తరువాత 53 పరుగుల వద్ద ఆశిష్ రెడ్డి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన జాక్విస్ కల్లీస్ బిస్లాతో జతకలిసి వీరవిహారం చేశాడు. బిస్లా 28 పరుగుల వద్ద కరణ్ శర్మ బౌలింగ్ లో విహారీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరుకున్నాడు. మోర్గాన్ క్రీజ్ లోకి రావడంతోనే సన్ రైజర్స్ బౌలర్లను చితకబాదాడు. మోర్గాన్ 21 బంతుల్లో 47 పరుగులు (5ఫోర్లు, 3 సిక్సర్లు) రనౌట్ గా వెనుదిరిగాడు. యూసుఫ్ పఠాన్ క్రీజ్ 3 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కల్లీస్ 27 బంతుల్లో 41 పరుగులు (6 బౌండరీలు)చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. కోల్ కత్తా ఇన్నింగ్స్ 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. కరణ్ శర్మ 1, ఆశిష్ రెడ్డి 1 వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు పార్థివ్ పటేల్ 31 బంతుల్లో 27 పరుగులు (2 ఫోర్లు, 1సిక్సర్), కామెరూన్ వైట్ 31 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్సర్) తో 9 ఓవర్లలో 57 పరుగుల భాగస్వామ్యం జతచేశారు. కల్లీస్ బౌలింగ్ లో కెమరూన్ వైట్ కొట్టిన భారీ షాట్ ను బౌండరీలైన్ లో యూసుఫ్ పఠాన్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టడంతో సన్ రైజర్స్ వికెట్ల పతనం ప్రారంభమైంది. చివర్లో పెరీరా 25 బంతుల్లో 36 పరుగులు (2ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించకపోవడంతో నిర్దేశిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. సంగక్కర 2 పరుగులు, రవితేజ 10, ఆశిష్ రెడ్డి 4, విహారీ 1, కరణ్ శర్మ 5 నాటౌట్, అమిత్ మిశ్రా 1 నాటౌట్ గా నిలిచారు.కలీస్ 3 వికెట్లు, రజత్ భాటియా 2 వికెట్లు, సునీల్ నరైన్ 1 వికెట్ పడగొట్టారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

తక్కువ స్కోరు ... అయినా తప్పని టెన్షన్

  ఐపిఎల్-6 లీగ్ దశ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మరోసారి తడబడింది. శుక్రవారం జరిగిన ఐపిఎల్- 6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ X సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహవాగ్ మరోసారి విఫలమయ్యాడు. టాస్ గెలిచి బ్యాంటింగ్ ని ఎంచుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ మహేళా జయవర్థనే బ్యాంటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ బ్యాట్స్ మెన్ వార్నర్ (0) మొదటి ఓవర్ నాలుగో బంతికే మిడాన్ లో స్టెయిన్ బౌలింగ్ లో రాజన్ క్యాచ్ పట్టడంతో తమ మొదటి వికెట్ ను కోల్పోయింది. వీరేంద్ర సెహవాగ్ (12)కు తోడుగా వచ్చిన జయవర్థనే (12) లను ఇషాంత్ శర్మ వరుసబంతులలో అవుట్ చేయడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ పతనం ప్రారంభమైంది. బోథా (9), జునేజా (15) వికెట్లను కూడా కోల్పోయి కష్టాలలో వున్న డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ ను ఆఖరి ఓవర్లలో ఇర్ఫాన్ పఠాన్ (23), కేదార్ జాదవ్ (30) చెలరేగడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగలిగింది. స్టెయిన్ రెండు వికెట్లు, ఇషాంత్ రెండు వికెట్లు, పెరెరా రెండు వికెట్లు, అమిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది. సునాయాసమైన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒడిదుడుకులతో ప్రారంభమైంది. అక్షిత్ రెడ్డి రనౌట్ అవడంతో సన్ రైజర్స్ కెప్టెన్ సంగక్కర, పార్థివ్ పటేల్ ఇన్నింగ్స్ నిర్మించే పనిని చేపట్టి కావాల్సిన రన్ రేట్ తగ్గకుండా ఆడుతుండటంతో సన్ రైజర్స్ విజయం చాలా తేలిక అనుకుంటున్న సమయంలో పార్థివ్ పటేల్ ను నదీమ్ తన బౌలింగ్ లో నే క్యాచ్ పట్టి అవుట్ చేసాడు. తరువాత బ్యాటింగ్ కు దిగిన బ్యాట్స్ మెన్ సంగక్కర (28), బోథా (17), కెమరూన్ వైట్ (4) వికెట్లను వెంట వెంటనే కోల్పోవడంతో కష్టాలలో పడింది. చివర్లో ఆశీష్ రెడ్డి (16), అమిత్ మిశ్రా (16) నాటౌట్, స్టెయిన్ (9) నాటౌట్ గా నిలిచి రెండు బంతులు మిగిలి ఉండగానే అతి కష్టం మీద 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి విజయం సాధించింది. అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మోర్కెల్ రెండు వికెట్లు, నదీమ్ రెండు వికెట్లు, ఇర్ఫాన్ ఒక వికెట్, బోథా ఒక వికెట్ తీశారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఈ సీజన్ లో వరుసగా ఇది నాలుగో పరాజయం.

కోల్ కత్తాకు చుక్కలు చూపించిన క్రిస్ గేల్

  ఐ.పి.ఎల్.-6 లో క్రిస్ గేల్ మరోసారి విజృంభించడంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. క్రిస్ గేల్ వీరవిహారంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు ఛేదించింది. మొదట టాస్ గెలిచి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కత్తా ఓపెనర్ బిస్లా (1) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరుకున్నాడు. మరో ఓపెనర్ కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కు జాక్విస్ కల్లీస్ జత కలిశాడు. వీరిద్దరూ ఇన్నింగ్స్ ను సరిదిద్దే క్రమంలో జట్టుస్కోరు 54 వద్ద ఉండగా వినయ్ కుమార్ బౌలింగ్ లో కల్లీస్ 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. గౌతమ్ గంభీర్ 46 బంతుల్లో 59 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 27, డివిలియర్స్ 23, మనోజ్ తివారీ 23 ఇన్నింగ్స్ రన్ రేట్ పెంచేక్రమంలో ధాటిగా ఆడి పెవిలియన్ చేరుకున్నారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ మిగతా బ్యాట్స్ మెన్ స్కోర్లు మోర్గాన్ 2, భాటియా 13, మెక్ లారెన్ 2, సంగ్వాన్ 4 నాటౌట్, నరైన్ 1 నాటౌట్. నిర్ణీత ఇరవై ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగుల వద్ద తెరపడింది. తరువాత ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్ అగర్వాల్ (6) వికెట్ ను జారవిడుచుకున్నా మరొక ఓపెనర్ క్రిస్ గేల్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ తోడవడంతో ఛాలెంజర్స్ ఇన్నింగ్స్ జెట్ స్పీడ్ లో పరుగులు రాబట్టింది. క్రిస్ గేల్ ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోయాడు. క్రిస్ గేల్ రికార్డ్ స్థాయిలో తొమ్మిది సిక్సర్లు బాదాడు. క్రిస్ గేల్ 50 బంతుల్లో 85 నాటౌట్, ఇందులో 4 బౌండరీలు కాగా 9 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీ 35 పరుగులు, డీవిలియర్స్ 22 నాటౌట్ గా నిలిచారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించిన క్రిస్ గేల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

11 పరాజయాల తర్వాత విజయం సాధించిన పూణే వారియర్స్

  ఐపిఎల్.-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో తలపడిన పూణే వారియర్స్ తొలి విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో తన ఖాతా తెరిచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాంటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కుషాల్ పెరీరాను (0) భువనేశ్వర్ తోలిబంతికే ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ కు పంపాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఓపెనర్ రహానేతో కలిసి 67బంతుల్లో 81 పరుగులు జోడించారు. ద్రావిడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఐపిఎల్-6 లో తన రెండో అర్థసెంచరీని నమోదు చేశాడు. 54 పరుగులు చేసిన ద్రావిడ్ యువరాజ్ సింగ్ బౌలింగ్ లో టేలర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యువరాజ్ ఒకే ఓవర్లో ద్రావిడ్ (54), స్టువర్ట్ బిన్నీ (1) ల వికెట్లను తీసి రాజస్థాన్ పరుగులకు బ్రేక్ వేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో మిగతా బ్యాట్స్ మెన్ స్కోర్లు రహానే 30, హాడ్జ్ 22 నాటౌట్, యాజ్ఞిక్ 12, ఫాల్క్ నర్ 19 నాటౌట్. రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఓపెనర్లు రాబిన్ ఊతప్ప, ఫించ్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ 29 బంతుల్లో 59 పరుగులు జోడించారు. ఊతప్ప (30), ఫాల్క్ నర్ వేసిన బంతిని ద్రావిడ్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. రాస్ టేలర్, ఫించ్ కు తోడవడంతో తొలిమ్యాచ్ ఆడుతున్న ఫించ్ 36 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు. రాస్ టేలర్ 17 చేశారు. యువరాజ్ 28 నాటౌట్, మాథ్యూస్ 1 నాటౌట్ గా ఉన్నారు. విజయలక్ష్యాన్ని 146 పరుగులను 18.4 ఓవర్లలోనే సాధించింది. 53 బంతుల్లో 64 పరుగులు చేసిన ఫించ్ కు మ్యాన్ ఆఫ్ ది అవార్డ్ దక్కింది. గత సీజన్ తో కలుపుకుని 11 మ్యాచ్ ల తరువాత పూణే వారియర్స్ కు ఇదే తొలివిజయం.

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం

  ఐప్ఎల్-6 లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది బంతుల్లోనే పాంటింగ్ 0, సచిన్ 1, రెండు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కి దిగిన దినేష్ కార్తీక్, రోహిత్ శర్మలు వీరవిహారం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 79 బంతుల్లో 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దినేష్ కార్తీక్ 48 బంతుల్లో 86 పరుగులు 14 ఫోర్లు, 2 సిక్సర్లు చేసి మెండిస్ క్యాచ్ పట్టగా మోర్కెల్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ 50 బంతుల్లో 74 పరుగులు 4 ఫోర్లు, 5 సిక్సర్లతో నాటౌట్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో మిగతా బ్యాట్స్ మెన్ చేసిన పరుగులు పోలార్డ్ 13, అంబటి రాయుడు 24, హర్బజన్ సింగ్ 1 నాటౌట్. 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఈ ఐపిఎల్-6 సీజన్ లో మొదటిసారి 200 పరుగులను దాటింది. ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మొదటి బంతికే రికీ పాంటింగ్ అద్భుత క్యాచ్ పట్టడంతో ఉన్ముక్త్ చంద్ వికెట్ ను కోల్పోయింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ లో మూడో వికెట్ కు డేవిడ్ వార్నర్ 37 బంతుల్లో 61 పరుగులు 5 ఫోర్లు, 4 సిక్సర్లు, మన్ ప్రీత్ జునేజా 40 బంతుల్లో 49 పరుగులు 6ఫోర్లు, 82 పరుగులు జోడించారు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేదు. జయవర్థనే 3, జీవన్ మెండీస్ 0, ఇర్ఫాన్ పఠాన్ 10, జాదవ్ 1, నదీమ్ 2. మోర్కెల్ 23 నాటౌట్, నెహ్రా 1, ఉమేశ్ 5 పరుగులతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓజా, పోలార్డ్, జాన్సన్ రెండేసి వికెట్లు తీసుకోగా హర్భజన్ మలింగలకు చెరో వికెట్ దక్కింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దినేష్ కార్తీక్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సన్ రైజర్స్ దూకుడుకి కళ్ళెం వేసిన రాయల్ ఛాలెంజర్స్

  మొదటి రెండు మ్యాచ్ విజయాలతో దూకుడుమీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్రేక్ వేసింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ కి దిగిన సన్ రైజర్స్ తడబడుతూ తమ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. 62 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన దశలో బ్యాంటింగ్ కి దిగిన కెమరూన్ వైట్, ఫెరీరా వీరవిహారం చేశారు. వైట్ 34 బంతుల్లో 52 పరుగులు 3 ఫోర్లు,  3 సిక్సర్లు చేసి వినయ్ కుమార్ బౌలింగ్ లో డివిలియర్స్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. పెరీరా 24 బంతుల్లో 40 పరుగులు, 1ఫోర్, 4 సిక్సర్లు బాది ఆర్పీసింగ్ వేసిన అద్భుతమైన బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిర్ణీత ఇరవై ఓవర్లలో సన్ రైజర్స్ 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో అక్షిత్ 12 పరుగులు, పార్థివ్ పటేల్ 20 పరుగులు, సంగక్కర 23 పరుగులు, ఆశిష్ 3 పరుగులు, విహారి 4 పరుగులు నాటౌట్, సమంత్రే 2 పరుగులు నాటౌట్. రాయల చాలెంజర్స్ బౌలర్ ఆర్పీ సింగ్ కు మూడు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ మొదటి నుండి దూకుడుగా ఆడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. వెస్ట్ ఇండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ గేల్ ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. కేవలం 13 పరుగులకే వెనుదిరిగాడు. రాయల ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకవైపు వికెట్లు పడుతున్నా మనోనిబ్బరంగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చాడు. కోహ్లీ 47 బంతుల్లో 93 పరుగులు 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు కొట్టి నాటౌట్ గా నిలిచాడు. రాయల చాలెంజర్స్ బ్యాట్స్ మెన్ స్కోర్లు మయాంక్ 29పరుగులు, మొదటి మ్యాచ్ ఆడుతున్న డివిలియర్స్  15 పరుగులు, హేన్రిక్స్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రాయల ఛాలెంజర్స్ 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది.

షారుఖ్ పై శిల్పా శెట్టి విజయం

  ఐపిఎల్-6 లో సోమవారం జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో శిల్పా శెట్టి ఫ్రాంచైజ్ గా వున్న రాజస్థాన్ రాయల్స్ షారుఖ్ ఖాన్ ఫ్రాంచైజ్ గా వున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ పై  19 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఐదు పరుగులే చేశాడు. రహానే 34 బంతుల్లో 36 పరుగులు (3ఫోర్లు, 1సిక్సర్) చేశాడు. ద్రావిడ్ 20 పరుగులు, స్టువర్ట్ బిన్నీ 11 పరుగులు చేసి వెనుతిరిగారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో బ్రాడ్ హాడ్జ్ 31బతుల్లో 46పరుగులు, వికెట్ కీపర్ యాజిక్ట్ 11బతుల్లో 16 పరుగులు అండతో ఒక్కడే చెలరేగి ఆడడంతో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైట్ రైడర్స్ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్, ఓపెనర్ గౌతమ్ గంభీర్ ధాటిగా ప్రారంభించాడు. మూడో ఓవర్లో రాహుల్ శుక్ల వేసిన చక్కటి బంతికి మన్విందర్ బిస్లా క్లీన్ బౌల్డ్ కాగా, క్రీజ్ లోకి వచ్చిన వెంటనే కల్లీస్ కూడా ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లును పోగొట్టుకుంది. 7వ ఓవర్ వేసిన సిద్ధార్థ త్రివేది కూడా రెండు వికెట్లను తీశాడు. మొదట మనోజ్ తివారీని ఎల్బీడబ్ల్యూగా, గౌతమ్ గంభీర్ ను స్లిప్ లో యాజ్ఞిక్ క్యాచ్ పట్టడం ద్వారా పెవిలియన్ కు పంపించాడు. ఇయాన్ మోర్గాన్ ఇచ్చిన క్యాచ్ ను వాట్సన్ జారవిడవడంతో పుంజుకున్న మోర్గాన్ కూపర్ బౌలింగ్ లో 51 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించకపోవడంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ 19 ఓవర్లలో 125 పరుగులు చేసి ఆలౌట్  టో ముగిసింది. యూసఫ్ పఠాన్ 0, లక్ష్మీరతన్ శుక్లా 2పరుగులు, రజత్ భాటియా 12పరుగులు, బ్రెట్ లీ 5పరుగులు, షమీ అహ్మద్  5 పరుగులు, నరైన్ 2 పరుగులు నాటౌట్ గా ఉన్నారు. సిద్ధార్థ త్రివేది 3 వికెట్లు, కూపర్ 3 వికెట్లు, రాహుల్ శుక్ల 2 వికెట్లు, షాన్ టెయిట్ 1 వికెట్టు, శ్రీశాంత్ 1 వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు 3 కీలకమైన వికెట్లను పడగొట్టిన  సిద్ధార్థ త్రివేది కు దక్కింది.

రైజింగ్ ... రైజింగ్ ... సన్ రైజింగ్ ....

  ఐపిఎల్-6 ముచ్చటగా మూడో మ్యాచ్ సన్ రైజర్స్ x పూణే వారియర్స్ మధ్య హైదరాదాబ్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగింది. గత సీజన్ లో హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ పేరుతొ ఆడిన టీం ఎనిమిదవ స్థానంలో నిలిచింది. సన్ రైజర్స్ పేరు మార్పుతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ శుభారంభం చేశారు. పూణే వారియర్స్ టాస్ గెలిచి సన్ రైజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు పార్థివ్ పటేల్, అక్షిత్ రెడ్డి సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పార్థివ్ పటేల్ దూకుడుగా ఆడుతున్న సమయంలో అశోక్ దిండా వేసిన చక్కటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పార్థివ్ పటేల్ 19 పరుగులు చేసి అవుటయ్యాడు. అక్కడినుండి ఆట మందకొడిగా సాగింది. కెప్టెన్ సంగక్కర వికెట్ కాపాడుకునే క్రమంలో నింపాదిగా ఆడుతూ వచ్చాడు. నిలదొక్కుకుంటాదనుకున్న సంగక్కరను(15) రాహుల్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓపెనర్ అక్షిత్ రెడ్డి(27) యువరాజ్ సింగ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో పెరీరా దూకుడుగా ఆడి 30 పరుగులు చేసిన తరువాత దిండా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సన్ రైజర్స్ ఇన్నింగ్ లో మిగతా బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెమరూన్ వైట్ 10, విహారి11, ఆశిష్ రెడ్డి  7 నాటౌట్, రవితేజ 4 నాటౌట్ గా నిలిచారు. సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. తక్కువ స్కోరు చేదించవలసిన పూణే వారియర్స్ 18.5  ఓవర్లలోనే 104 పరుగులు చేసి కుప్పకూలింది. ఒకే ఓవర్లో 6 x 6 కొట్టిన యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. అతను కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో ఇన్నింగ్స్ ను రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే లు ప్రారంభించారు. ఊతప్ప దూకుడుగా ఆడుతుండటంతో పూణే వారియర్స్ విజయం తథ్యమని అందరూ భావించారు. కానీ సన్ రైజర్స్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేశారు. మిశ్రా 3 వికెట్లు, స్టెయిన్ 3 వికెట్లు, పెరీరా 2 వికెట్లు పడగొట్టారు. పూణే వారియర్స్ ఇన్నింగ్స్ లో ఊతప్ప 24పరుగులు, మనీష్ పాండే 15 పరుగులు, శామ్యూల్స్ 5 పరుగులు, యువరాజ్ సింగ్ 2 పరుగులు, రాస్ టైలర్ 19 పరుగులు, నాయర్ 19 పరుగులు,  మాథ్యూస్ 8 పరుగులతో నాటౌట్, మిచెల్ మార్ష్ 7 పరుగులు, భువనేశ్వర్ 3పరుగులు, రాహుల్ 0 పరుగులు, దిండా 0 పరుగులు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అమిత్ మిశ్రా నిలిచాడు.

ముంబైకి చుక్కలు చూపించిన వినయ్

  బెంగళూరు రాయల్ చాలెంజర్స్ X ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపిఎల్-6 రెండవ మ్యాచ్ శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఉత్కంఠభరితమైన ఆఖరి ఓవర్లో 10 పరుగులు కావాల్సి ఉండగా బౌలింగ్ కు దిగిన వినయ్ కుమార్ మంచి ఊపుమీదున్న దినేష్ కార్తీక్ ను క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపించాడు. మరుసటి బంతికే అంబటి రాయుడును కూడా అవుట్ చేసి కేవలం ఎదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో బెంగళూరు రాయల చాలెంజర్స్ రెండు పరుగులతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. ముందుగా ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్ చాలెంజర్స్ ఓపెనర్ గా బరిలోకి దిగిన క్రిస్ గేల్ 58 బంతుల్లో 92 పరుగులు సాధించాడు. దీంట్లో 11 బౌండరీలు 5 సిక్సర్లు ఉన్నాయి. దిల్షాన్ 0 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కొద్దిసేపు మెరుపులు మెరిపించినా 14బంతుల్లో 24 పరుగులు 4 ఫోర్లు, 1సిక్సర్ చేసినా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబదలేకపోయాడు. వికెట్ కీపర్ అరుణ్ కార్తీక్ అండగా క్రిస్ గేల్ నిలకడగా ఆడాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 5వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జన్ ప్రీత్ బూమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగిన రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ తొలి వికెట్ కు 52 పరుగులు జోడించారు. లేని పరుగుకు ప్రయత్నించిన సచిన్ టెండూల్కర్ 23 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. రికీ పాంటింగ్ 28 పరుగులు చేసి మురళీ కార్తిక్ అద్భుత బౌలింగ్ లో స్టంపౌట్ అయి పెవిలియన్ చేరుకున్నాడు.  రాణిస్తాడనుకున్న రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 11 పరుగులు చేసి వినయ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దినేష్ కార్తీక్, రాయుడు చక్కటి భాగస్వామ్యంతో స్కోరును పెంచుతూ వెళ్ళారు. దినేష్ కార్తీక్ 37 బంతుల్లో 60 పరుగులు (3ఫోర్లు 4సిక్సర్లు) చేశాడు. కానీ ఆఖరి ఓవర్లో వినయ్ కుమార్ వేసిన చక్కటి బౌలింగ్ తో ముంబై ఇండియన్స్ రెండు మూడు పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓడిపోయింది.

సత్తా చాటిన డిఫెండింగ్ చాంపియన్

  క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐపిల్-6 మ్యాచ్ లు నిన్నటినుండి ప్రారంభమయ్యాయి. ప్రారంభమ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ x ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో తలపడ్డాయి. నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన డేర్ డెవిల్స్ ను బ్రెట్ లీ తోలిబంతికే ఉన్ముక్ట్ చంద్ ను క్లీన్ బౌల్డ్ చేసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. డేర్ డెవిల్స్ కెప్టెన్ కు వార్నర్ లు కలిసి ఇన్నింగ్స్ ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 44 పరుగులు 34 బంతుల్లో భాగస్వామ్యం చేశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ లో సునీల్ నరైన్ బౌలింగ్ కు దిగి 19 బంతుల్లో 21 పరుగులు చేసిన వార్నర్ ను అవుట్ చేయడంతో డేర్ డెవిల్స్ పతనం ప్రారంభమయింది. కెప్టెన్ జయవర్థనే ఒక్కడే నిలకడగా ఆడుతూ 66 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ జునేజా 8 పరుగులు, ఓజా 9 పరుగులు, బోథా 7 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ 4 పరుగులు, రసెల్ 4 పరుగులు, నదీమ్ శ్రావణ్ 4 పరుగులు, నెహ్రా 0 పరుగులు, ఉమేష్ యాదవ్ 0 నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నైట్ రైడర్స్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ ప్రారంభించి మొదటి ఓవర్ ను మెయిడిన్ వేసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేపాడు. రెండో ఓవర్లో నెహ్రా బిస్రా వికెట్ ను పడగొట్టాడు. కెప్టెన్ గౌతమ్ కు కల్లీస్ జతకలిశాడు. వీరిద్దరూ కలిసి మూడు ఓవర్లలో 35 పరుగులు సాధించారు. వీరిద్దరూ కలిసి 47 పరుగులు చేసిన తరువాత నదీమ్ శ్రావణ్ కల్లీస్ ను పెవిలియన్ కు పంపించాడు. 42 పరుగులు చేసిన గంభీర్ ను బోథా ఎల్బీడబ్ల్యూ చేసాడు. విజయ లక్ష్యం చిన్నదే కావడంతో నైట్ రైడర్స్ ఆచితూచి ఆడారు. తివారీ 23 పరుగులు చేసిన తరువాత నదీమ్ తివారీని నాలుగవ వికెట్ గా పెవిలియన్ కు పంపించాడు.  , మోర్గాన్ 14పరుగులు, పఠాన్ 18 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. కోల్ కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. నాలుగు వికెట్లు పడగొట్టిన సునీల్ నరైన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఐపీఎల్ 6 షెడ్యూల్

ఐపీఎల్ ఆరో సీజన్ ఆరంభానికి తెరలేచింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టేందుకు గతేడాది చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తోపాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు రెడీ అయ్యాయి. బుధవారం జరగనున్న ఆరంభ మ్యాచ్‌కు ఇక్కడి ఈడెన్ గా ర్డెన్స్ వేదికకానుంది. డిఫెండిం గ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న కోల్‌కతాపై ఈ సారీ అంచనాలు భారీగానే ఉన్నాయి.   గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా వరుసగా రెండోసారీ టైటిల్‌పై కన్నేసింది. కాగా, పటిష్ట జట్లలో ఒకటిగా ఉన్నప్పటికీ ఇంతవరకూ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని ఢిల్లీ ఈ సారైనా ఆ కల నెరవేర్చుకోవాలని తలపోస్తోంది.  

విజేందర్ డ్రగ్స్ వాడాడు ... పోలీసులు

  ఒలంపిక్ బాక్సింగ్ లో కాంస్య పతాక విజేత విజేందర్ డ్రగ్స్ తీసుకున్నారని డ్రగ్స్ పరీక్ష చేస్తామని పోలీసులు పట్టుబట్టినా విజేందర్ నిరాకరించారు. పంజాబ్ పోలీసులు పట్టువిడవకుండా విజేందర్ ఫోన్ కాల్స్ లిస్టు పై నిఘా పెట్టి నార్కోటిక్ డీలర్, స్మగ్లర్ కెనడాకు చెందిన అనూప్ సింగ్ కహ్లోన్ అలియాస్ రూబీతో విజేందర్ 80 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో తేలిందని ఆదివారం పోలీసులు వెల్లడించారు. విజేందర్ స్నేహితుడు రాంసింగ్ లకు రూబీతో చాలాకాలం నుంచి పరిచయం ఉందని, విజేందర్, రూబీ మధ్య ఎస్.ఎం.ఎస్.ల రాయబారం కూడా నడిచిందని, రాంసింగ్ ఐదు సార్లు డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు తేల్చారు. ఫోన్ కాల్ లిస్టు, ఎస్.ఎం.ఎస్. ల ఆధారంగా విజేందర్ వెంట్రుక, రక్తం పరీక్షలకు కోర్టు నుంచి అనుమతి పొందాలని లూథియానా రేంజ్ డిఐజి ఫరూఖీ తెలిపారు. పోలీసుల విచారణలో విజేందర్ 12 సార్లు డ్రగ్స్ వాడాడని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

కోమా నుంచి కోలుకున్న జెస్సీ రైడర్

        ఆగంతకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ కోమా నుంచి బయటపడ్డాడు. కుటుంభ సుభ్యులు, స్నేహితులతో కూడా మాట్లాడుతున్నాడు. అయితే దాడికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేకపోతున్నాడు. ఆరోజు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడని రైడర్ వ్యక్తిగత మేనేజర్ శనివారం వెల్లడించాడు. అతని పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, అయితే పూర్తిగా కోలుకోవాలంటే మాత్రం మరింత సమయం పడుతుందని కివీస్ క్రికెటర్ల సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి హీత్ మిల్స్ అన్నాడు. బుధవారం అర్ధరాత్రి క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ బార్ ఎదుట జరిగిన ఘర్షణలో రైడర్ తలకు, ఊపిరి తిత్తులకు బలమైన గాయాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏప్రిల్ 4న వారిని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఐపీఎల్ ఆరో అంచె పోటీల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరుఫున ఆడాల్సిన రైడర్ ఈ ఘటనతో లీగ్‌కు దూరమయ్యాడు. మే, జూన్ నెలల్లో జరిగే ఇంగ్లండ్‌తో సిరీస్ లోపు రైడర్ గ్రౌండ్‌లో అడుగుపెట్టే పరిస్థితి లేదు.

కోమాలో క్రికెటర్ జెస్సీ రైడర్

        న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లాడు. న్యూజిలాండ్ లోని క్రిస్ట్‌చర్చ్ ప్రాంతంలో ఓ బార్ వద్ద జరిగిన గొడవలో రైడర్ ను కొందరు తీవ్రంగా కొట్టడంతో అతను ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. రైడర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రైడర్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాలతో ముడిపడిందే. మద్యానికి బానిసైన రైడర్ పలుమార్లు తప్పతాగి వివాదాల్లో చిక్కుకున్నాడు. జట్టు నుంచి అనేకసార్లు అతణ్ని తప్పించారు. మరో ఆరు రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ ఆరో సీజన్లో రైడర్ పుణె వారియర్స్ తరఫున ఆడాల్సి ఉంది. గత ఏడాది ఆ జట్టు తరఫున రైడర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా రైడర్ పై దాడికి పాత కక్షలే కారణమని తెలుస్తోంది. గతంలో రైడర్ తో గొడవపడిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి వచ్చి అతనిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

ఐసిసి టేస్ట్ ర్యాంకింగ్స్ లొ భారత్ కు మూడవస్థానం

  భారత్ క్రికెట్ జట్టు టేస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లొ మూడవ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. ఏప్రిల్ 1 కట్ ఆఫ్ డే కి సౌత్ ఆఫ్రికా 128 పాయింట్లతో మొదటిస్థానాన్ని నిలుపుకుని 450,000 యు.ఎస్. డాలర్లు సొంతం చేసుకుంది. న్యూజిల్యాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు డ్రా చేసుకుంది. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక న్యూజిల్యాండ్ చేతిలో పరాజయం అయివుంటే భారత్ కు రెండో స్థానం దక్కించుకుని 350,000 యు.ఎస్. డాలర్లు అందుకునేది. ఇంగ్లాండ్ డ్రా చేసుకోవడంతో ఇంగ్లాండ్ కు రెండో స్థానం భారత్ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియాకి 250,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి. అలాగే నాలుగవ ర్యాంక్ పొందిన ఆస్ట్రేలియా జట్టుకు 150,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి.

34 ఏళ్ళలో ఇదే ఆసీస్ చెత్తజట్టు

      భారత పర్యటనలో చిత్తుగా ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టుపై ఆ దేశ మీడియా విమర్శల వర్షం కురిపించింది. 34 ఏళ్లలో ఇదే చెత్త జట్టని క్లార్క్‌సేనను తీవ్రంగా దుయ్యబట్టింది. ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో పిచ్చిగా వ్యవహరించారని పేర్కొంది. 'భారత పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెట్ ప్ర దర్శన అధ్వాన్నంగా ఉంది' అని టెలీగ్రాఫ్ పేర్కొంది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్, తాత్కాలిక కెప్టెన్ షేన్‌వాట్సన్ పేలవ ఆటతీరును విమర్శించింది. వాట్సన్ ఇదే ఫామ్‌తో ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సిడిల్, స్టార్క్ వం టి టెయిలెండర్లు కీలక పరుగులు చేసినపుడు టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఏమైందని ప్రశ్నించారు.