సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ.. ఇంతకీ అందులో ఏముందంటే?

మాగంటి కుటుంబ కలహం ఇప్పుడు అంటే జూబ్లీ ఉప ఎన్నిక ముంగిట బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు ఇంత వరకూ అంటే జూబ్లీ  ఉప ఎన్నికలో మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే వరకూ.. అసలంతదాకా ఎందుకు మాగంటి గోపీనాథ్ బతికి ఉన్న కాలంలో ఎన్నడూ మాగంటి మొదటి భార్య అన్న ప్రస్తావనే రాలేదు. అసలు మాగంటి సునీత ఆయనకు రెండో భార్య అన్న విషయమే దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ మాగంటి మరణం తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూబ్లీ ఉప ఎణ్నిక ముంగిట మాగంటి కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మాగంటి గోపానాథ్ సిసలైన వారసుడిని తానేనంటూ ప్రద్యుమ్నతారక్ మీడియా ముందుకు వచ్చారు. అంతే కాదు.. ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు.  మాగంటి గోపానాథ్ భార్యను అంటూ సునీత అఫిడవిట్ లో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనీ, ఆమె నామినేషన్ రద్దు చేయాలనీ కోరారు. సరే ఎన్నికల సంఘం మాగంటి సునీత నానినేషన్ సరిగానే ఉందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా మాగంటి తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి మాగంటి సునీతపై విమర్శలు గుప్పించారు. తన కుమారుడు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న సమయంలో కూడా తనను దూరం పెట్టారనీ, కన్నకొడుకుని కడసారి చూసుకునే భాగ్యం కూడా దక్కకుండా చేశారని ఆరోపించారు. అంతే కాదు.. తన కుమారుడి మరణమే ఓ మిస్టరీ అంటూ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.  దీంతో బీఆర్ఎస్ ఒకింత ఇబ్బందుల్లో పడింది.  ఆ తరువాత మాగంటి సునీత రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ మరింత సంచలనం సృష్టిస్తోంది. మాగంటి ఆస్పత్రిలో ఉన్న సమయంలో సునీత ఆస్పత్రి సెక్యూరిటీకి రాసినట్లుగా ఉన్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ లేఖలో మాగంటి తల్లి, సోదరుడు సహా కుటుంబ సభ్యులెవరినీ మాగంటి గోపీనాథ్ ను చూసేందుకు ఆస్పత్రిలోకి అనుమతించవద్దంటూ మాగంటి సునీత  రాసినట్టుగా ఉన్న లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.   దీంతో బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద మాగంటి కుటుంబ వివాదం ప్రభావం జూబ్లీ బైపోల్ పై ఏ మేరకు పడుతుందన్నది వేచి చూడాల్సిందే. 

కొస‌రాజు వ‌ర్సెస్ మాగంటి.. ఓ కుటుంబ రాజ‌కీయ కథాచిత్రం!

మాగంటి గోపీనాథ్ కుటుంబ క‌థా చిత్రంలో రోజుకో కొత్త వాద‌న‌.. రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తున్నాయి.  సునీత గోపీనాథ్ కి భార్యే కాదంటూ ఇటు గోపీనాథ్ త‌ల్లి, అటు మొద‌టి భార్యా మాలినీ దేవి, ఆమె కొడుకు తార‌క్ తీవ్ర  స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పిస్తుంటే..   బీఆర్ఎస్ లీడ‌ర్లు మ‌ర‌లాంట‌పుడు ఈ ఇద్దరు భార్య‌ల పిల్ల‌ల్లో ఎవ‌రి ఇంటి  పేరు ఏంటో చూడాలంటూ లాజిక్ మాట్లాడుతున్నారు.   మాగంటి గోపీనాథ్ తొలిభార్య మాలినీ దేవికి పుట్టిన  తార‌క్ ప్ర‌ద్యుమ్న ఇంటి పేరు కొస‌రాజుగా ఉంది. అదే  సునీత‌కు పుట్టిన  పిల్లల‌ ఇంటి పేరు మాగంటిగా  ఉంది. ఇందుకు త‌గిన సాక్ష్యాధారాలు సైతం వారి ద‌గ‌గ‌ర ప‌దిలంగా ఉన్నాయంటారు మాగంటి సునీత‌కు చెందిన  న్యాయ‌వాదులు. ఇదిలా ఉంటే ఇన్నాళ్ల పాటు తార‌క్ ను మాలినీ దేవి సొంతంగా పెంచుకున్నార‌నీ.. ఆమెకు కూడా గోపీ ఆస్తిలో కొంత వాటా ఇవ్వాలిగా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు గోపి త‌ల్లి మ‌హానంద‌కుమారి. దీంతో ఈ ఫ్యామిలీ డ్రామాలో ఎవ‌రూ ఎక్క‌డా త‌గ్గ‌ట్లా.  అయితే ఈ వివాదం బీఆర్ఎస్ గెలుపు ఆశ‌ల‌పై    నీళ్లు కుమ్మ‌రిస్తుందా అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.  ఇదంతా వాటాల‌కు సంబంధించిన వ్య‌వ‌హార‌మైతే ఈ స‌రికే కేటీఆర్ ఇరు ప‌క్షాల వారిని పిలిపించి పంచాయితీ చేస్తే స‌రిపోతుంది. ఆయ‌న ఈ విష‌యంలో పెద్ద‌గా క‌ల‌గ చేసుకోవడం లేదు.  ఇందుకు కార‌ణ‌మేంటో చూస్తే.. ఒక వేళ ఈ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోతే.. ఇదంతా కుటుంబ క‌ల‌హంగా చెప్పుకోవ‌చ్చు. గోపీనాథ్ అస‌లైన భార్య‌గా జ‌నం సునీత‌ను గుర్తించ‌లేదు కాబ‌ట్టే తాము ఓడిపోయామ‌ని చెప్పుకునే అవకాశం ఉంటుందన్న భావనే అంటున్నారు పరిశీలకులు. అందుకే ఈ కుటుంబ కుంప‌టి ని  చ‌ల్లార్చేందుకు కేటీఆర్ పూనుకోవడం లేదంటున్నారు. 

ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తానంటున్న ట్రంప్

అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరో సారి దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయగమని చెబుతున్నారు.   అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించినట్లు వెల్లడించిన ఆయన  ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో  మాట్లాడుతూ..  మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో మేం ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం. అయితే ఆ అవసరం లేదు. ప్రతిఒక్కరూ డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ఇతర విషయాలు ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిపై ఖర్చు చేయాలని అన్నారు.   ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పిన ట్రంప్..  దానిని సాధించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నామని చెప్పారు. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం అవి లేవన్నారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్ర రాజ్యాధినేత   ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్‌ కూడా ఉందని చెప్పారు.  రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయి. మా దగ్గర అంతకంటే ఎక్కువే  ఉన్నాయన్న హెచ్చరిక లాంటి వ్యాఖ్యలు చేశారు. మావద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు. కానీ, అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించానన్నారు. అయితే ఎక్కడ, ఎప్పుడు ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ బయటపెట్టలేదు. 

అద్దంకిలో వైసీపీ మరో ప్రయోగం.. ఇన్చార్జ్‌గా పల్నాడు డాక్టర్ అశోక్

అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది.  మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అక్కడ తిరుగులేని పట్టుంది. అద్దంకి ఆయన సొంత నియోజకవర్గం కాకపోయినా, తనకు స్థానికంగా ఉన్న పరిచయాలతో, ఆయన 2009లో సొంత నియోజకవర్గమైన మార్టూరు నియోజకవర్గం రద్దు కావటంతో అద్దంకి వచ్చి    గట్టి పాగానే వేశారు. ప్రజలతో మమేకమై ప్రజాభిమానాన్ని పొంది ఓటమెరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 నుండి 2024 వరకు ఓటమన్నదే ఎరగకుండా.. పార్టీతో సంబంధం లేకుండా ఐదు సార్లు విజయం సాధించిన అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్.  2004వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చిన రవికుమార్  మార్టూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సోదరుడు గొట్టిపాటి నరసయ్యపై విజయం సాధించారు. 2009 ఎన్నికలలో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాంపై విజయ ఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరిన రవికుమార్ బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పై పోటీ చేసి విజయం సాధించారు. అనంతర పరిణామాలలో గొట్టిపాటి ఫ్యాను పార్టీని వీడి సైకిల్ ఎక్కారు.  2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి గరటయ్యపై మరో గెలుపు సొంతం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పాణెం హనిమిరెడ్డిపై భారీ విజయం సాధించి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందటమే కాకుండా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 పార్టీ ఆవిర్భావంలో గొట్టిపాటి రవి చలవతో అద్దంకి నుంచి విజయం సాధించిన వైసీపీ తిరిగి అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తోంది గాని ఫలితం లేకుండా పోతుంది. ప్రతి ఎన్నికలకు అభ్యర్థిని మారుస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఫలితాలతో నిరాశ చెందుతోంది.  2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన పాణెం హనిమిరెడ్డి ఎన్నికల అనంతరం పెట్టా బేడా సర్దేశారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్  సత్తా ఉన్న నేత కావాలి అంటూ పలు ప్రయత్నాలు చేసారు. ఆ క్రమంలో పక్కనున్న పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్  అశోక్‌ను అద్దంకి వైసీపీ ఇన్చార్జ్‌గా నియమించారు. వైసిపి వైద్య విభాగపు నేతగా జగన్ దగ్గర గుర్తింపు తెచ్చుకున్న అశోక్ అద్దంకిలో తన సత్తా చూపిస్తానంటూ అధినేతకు మాటిచ్చి వచ్చారంట. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలనైతే ముమ్మరం చేశారు. అద్దంకిలోని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న అశోక్ ప్రతి విషయంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది టిడిపి నేతలను కూడా తన వైపునకు తిప్పుకునేందుకు పలు ప్రయత్నాలు మొదలుపెట్టారంట.అద్దంకి పట్టణానికి చెందిన 50 కుటుంబాలను పార్టీలోకి చేర్చుకొని అధినేత దగ్గర మంచి మార్కులే వేయించుకున్నారంటున్నారు. స్థానిక నేతలకు అందుబాటులో ఉంటూ అద్దంకిలో అశోక్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తుఫాను సమయంలో అధికారులు గుండ్లకమ్మలో చిక్కుకుపోతే వారిని కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని తాను ప్రజలకు దగ్గరగా ఉన్నానని సంకేతాలను పంపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి ఎరగని నేతగా తనదైన రాజకీయ చాతుర్యంతో దూసుకుపోతున్న గొట్టిపాటి రవి కుమార్ ముందు అశోక్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనే అనుమానాలనైతే అద్దంకి ప్రజలు వ్యక్తపరుస్తున్నారట.  రాజకీయ ఉద్దండుడు ప్రజా నేతగా గుర్తింపు ఉన్న గొట్టిపాటి రవికుమార్‌ను అశోక్ ఎంతవరకు ఎదుర్కోగలరు అనే అనుమానాలను  సొంత పార్టీ నేతలే వ్యక్తపరుస్తున్నారంట. ఎన్నికలకు చాలా సమయం ఉందని అప్పటి వరకు నిలకడగా పనిచేసి, ప్రజలతో మమేకమై భరోసా కల్పిస్తే అద్దంకిలో సక్సెస్ కావడం పెద్ద కష్టం కాదని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.   ఆరంభ శూరత్వమో ... చివరి వరకు పోరాడే తత్వమో తెలియదు కానీ తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలను అయితే అటు అధిష్టానంతో పాటు ఇటు అద్దంకి ప్రజానీకానికి కూడా అశోక్ పంపే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు సొంత పార్టీ నేతలు సరైన నాయకుడు వచ్చాడు అంటూ చెప్పుకుంటుండగా,  మరికొందరు మాత్రం ఐరావతం ముందు ఎలుక పిల్ల ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుందనే విమర్శలు కూడా చేస్తున్నారట. అయితే రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదని  ... ట్రెండ్... ప్రజానాడి ఎవరు పట్టగలిగితే వారే సక్సెస్‌ఫుల్ నేతలని ఎన్నో సందర్భాలలో రుజువైందని ... తాను కూడా అదే విధంగా విజయం సాధిస్తానంటూ అశోక్ సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న చందంగా సొంత పార్టీ నేతలకు నమ్మకం భరోసా కల్పించి తరువాత తన సత్తా ఏంటో అద్దంకి నియోజకవర్గానికి చూపాలనే భావనలో అశోక్ ఉన్నారట.  మరి ఎంతవరకు ఈ డాక్టర్ అద్దంకి ప్రజల నాడిని పట్టగలుగుతారో చూడాలి .

బీహార్ తొలి విడతలో ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం (నవంబర్ 6) తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ముందుకు వచ్చి మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నిటికీ మించి తొలి విడతలో గతంలో ఎన్నడూ లేని విధంగా 64.66 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డు స్థాయి అని చెప్పవచ్చు.   రాష్ట్రంలో ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి.  రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో  121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక రెండో విడత పోలింగ్  నవంబర్ 11న జరగనుంది. ఆ విడతలో  మిగిలిప 122 స్థానాలకూ పోలింగ్ జరుగుతుంది.  సరే ఇక తొలి విడతలో పోలింగ్ విషయానికి వస్తే.. మహిళలు అత్యధికంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటింగ్ శాతం పెరగడం అధికార కూటమికా, లేక ఇండియా కూటమిగా ఎవరికి ప్లస్ కానుందన్న చర్చ అప్పుడే మొదలైంది. అలాగే.. జనసురాజ్ పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న అంచనాలు కూడా మొదలయ్యాయి.  బీహార్ అసెంబ్లీకి 1951-52లో జరిగిన మొదటి  ఎన్నికల్లో  అత్యల్పంగా 42.6 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2000 సంవత్సరంలో 62.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2020లో 57.29 శాతం నమోదైంది. అయితా  తాజాగా   తొలి విడతలోనే 64.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే రాజకీయ పరిశీలకుల విశ్లేషణలకు పదును పెట్టింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంపై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం భారీగా పెరగడం జనం రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతమని అంటున్నారు. అయితే భారీగా పోలింగ్ నమోదు కావడంపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మార్పు కోసమే మహిళలు తరలివచ్చారని చెబుతున్నారు. కాదు కాదు.. అధికార కూటమి పనితీరుకు ప్రజలు పాజిటివ్ గా స్పందించడమే ఓటింగ్ శాతం పెరగడానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు.  అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఏ కూటమికి కలిసి వచ్చిందన్నది తేలాలంటే ఫలితాలు వెలువడే నవంబర్ 14 వరకూ ఎదురు చూడాల్సిందే.  

కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తానంటూ జగన్ పిటిషన్!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మొదటికి వచ్చారు.  కోర్టుకు ఆదేశాలను ధిక్కరిస్తానంటూ ఏకంగా కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల లండన్ పర్యటనకు  కోర్టు అనుమతి ఇచ్చిన సందర్భంగా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని షరతు విధించింది. అప్పుడు ఆ షరతుకు ఓకే అన్న జగన్.. ఇప్పుడు దానిని ఉల్లంఘించడానికి రెడీ అయిపోయి.. కోర్టు షరతును ఉల్లంఘిస్తాను అనుమతి ఇవ్వండి అంటూ హైదరాబాద్ సీబీఐ  కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో తాను కోర్టుకు హాజరు కాలేనని పేర్కొంటూ, ఒక వేళ ఆయన తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అయితే.. అందుకు ప్రత్యేక మైన భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందనీ, అది తనకు ఇష్టం లేదు కనుకనే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనీ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.   అయితే ఇక్కడ ఆయన ఎంత వితండ వాదం చేస్తున్నారంటే.. కోర్టుకు హాజరు కావడం అన్నది ఆయన ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయంగా చెబుతున్నారు. న్యాయవ్యవస్థ అంటే తనకు లెక్కలేదన్నట్లుగా ఆయన పిటిషన్ ఉంది. నిజంగా ఆయన కోర్టు హాజరు సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాల్సి ఉంటే ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వ ఏర్పాట్ల విషయంలో ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం ఏముంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పుష్కరంపైగా బెయిలుపై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఆ బెయిలు షరతులను సైతం ఉల్లంఘిస్తుండటం పట్ల న్యాయ నిపుణులలో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది. పైగా తాను హాజరు కాను కనుక అవసరం అనుకుంటే కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే హాజరౌతానంటూ ఆ పిటిషన్ లో కోర్టుకే బంపరాఫర్ ఇచ్చారు.  ఇక్కడే న్యాయనిపుణులు ఆయన పరామర్శల పేరిట దర్జాగా రాజకీయయాత్రలు చేస్తున్నప్పుడు అడ్డు రాని భద్రత.. కోర్టుకు హాజరు కావడానికే అడ్డువచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

టోపీ పెట్టుకునే పరిస్థితి వస్తే తల నరుక్కుంటా.. బండి సంజయ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు అత్యంత కీలకంగా మారింది. మూడు పార్టీలూ ఈ ఉప ఎన్నికలో విజయాన్ని చావో రేవో అన్నట్లుగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీ ఉప ఎన్నిక మూడు పార్టీలకూ అగ్నిపరీక్షగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీంతో పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచార వేడి రోహిణీకార్తెను మించిపోతున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గం హోరెత్తిపోతున్నది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ  ఈ తీరు పెరిగిపోతున్నది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో  ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. 14న ఫలితం వెలువడనుంది.    బీఆర్ఎస్  అభ్యర్థిగా మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో నిలిచారు.   కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం (నవంబర్ 6)  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోరబండ డివిజన్ లో పర్యటించిన ఆయన   కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు.   తాను కట్టర్ హిందువునని, ఇతర మతాలకు చెందిన వారి టోపీ పెట్టుకుని, దొంగ నమాజ్ చేసి కించపర్చనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ  అలాంటి పరిస్థితి వస్తే తల నరుక్కుంటా గానీ టోపీ పెట్టుకోన్నారు. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని ఆరోపించారు. ఈ మాట స్వయంగా గోపీనాథ్ తల్లి చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.   బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు వావి వరసల్లేవని, చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేదన్నారు. సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమని తీవ్ర విమర్శలు గుప్పించారు.తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకోవాలంటూ కల్వకుంట్ల కవితకు హితవు చెప్పారు.  ఇక ముఖ్యమంత్రి రేవంత్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు తినేటోడు వచ్చాడని విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఆడోళ్ల మెడల్లో ఉన్న మంగళసూత్రాలు కూడా గుంజుకుపోతారని బండి సంజయ్ అన్నారు.   టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా నటుడు వేణుమాధవ్ గుర్తొచ్చాడని బండి అన్నారు.  

కంచి ఆలయంలో కలకలం.. బల్లుల విగ్రహాల తాపడాలు మార్చారా?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్లు వస్తున్న ఆరోపణలను సంచలనం సృష్టిస్తున్నాయి.  కంచి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల విగ్రహాల తాపడాలను మార్చినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంచీపరంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలయంలోని పురాతన బంగారు, వెండి బల్లుల తాపడాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటుచేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు.  దీంతో విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు   దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో  ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని పోలీసులు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు. ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైనప్పుడు విచారణకు రావాలని ఆలయ ఈవో, సిబ్బందిని పోలీసులు ఆదేశించినట్లు తెలిసింది. 108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలోని ఈ ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లులు విశిష్టమైనవి. నిత్యం ఈ ఆలయాన్ని దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా  వచ్చే భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి బంగారు, వెండి బల్లులను తాకితే దోషనివారణ జరుగుతుందన్నది భక్తులు విశ్వాసం.  పురాణ గాథ ప్రకారం..  గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో ఓ బల్లి పడింది. ఆ విషయాన్ని శిష్యులు గుర్తించలేదు. అది చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలోనే మీకు విముక్తి లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లుల‌ రూపంలో వుండి స్వామి వారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఆ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపాల్లో శిష్యుల శరీరాలు బల్లుల బొమ్మలుగా వుండి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దోష నివారణ చేయమని మహర్షి ఆదేశిస్తాడు. బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థం అని చెబుతారు.

రాయల చెరువుకు గండి! జలదిగ్బంధంలో గ్రామాలు

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఓల్లూరులోని రాయల చెరువు రిజర్వాయర్ కట్టకు గండిపంది. దీంతో గురువారం (నవంబర్ 6)న పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం సంభవించలేదు కానీ, పశుసంపదకు అపార నష్టం వాటిల్లింది.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలచెరుకువు భారీగా నీరు చేరింది. గత  కొద్ది రోజులుగా వర్షాలు తగ్గడంతో ప్రమాదం లేదని జనం ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే ఏమయ్యిందో తెలియదు కానీ చెరువుకు ఒక్కసారిగా గండి పడి నీరు  ఓల్లూరు, పాతపాలెం, రాజుల కండ్రిగ, కళత్తూరు, కళత్తూరు హరిజనవాడ గ్రామాలను మంచేసింది. వరద నీరు  పోటెత్తడంతో  జనం భయాందోళనలకు గురయ్యారు. కట్టుబట్టలతో ఎత్తైన భవనాలు, ప్రదేశాలను ఆశ్రయించారు. అయితే గ్రామంలో బయట కట్టేసిన ఆవులు, గేదెలు, పాకల్లో ఉన్న మేకలు గొర్రెలు కొట్టుకుపోయాయి. అదేవిధంగా మోటారు బైకులు, ఆటోలు సైతం వరద నీటిలో   కొట్టుకుపోయాయి.  వేలాది ఎకరాలలో పంట ధ్వంసమైంది. రాగిగుంట శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన రోడ్డు మార్గం కూడా కోతకు గురవ్వడంతో ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  అలాగేఆదవరం, కాళంగి గ్రామాల మీదుగా కాళంగి రిజర్వాయర్ కు వరద నీరు చేరింది. దీంతో కాళంగి రిజర్వాయర్ కు సామర్థ్యానికి మించి నీటి నిల్వలు చేరడంతో అధికారులు  గేట్లు ఎత్తివేశారు. ఫలితంగా కాళంగి రిజర్వాయర్ కు దిగువనున్న పంట పోలాలు ముంపునకు గురయ్యాయి. 

గ్రామ సచివాలయాలు కాదు.. విజన్ యూనిట్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేరు మార్చింది. ఇక నుంచీ వాటిని విజన్ యూనిట్స్ గా పిలవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.  గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరుకు చేసి, మరింత మెరుగైన సేవలు అందించే విధంగా రూపకల్పన చేయాలనీ, అందుకే వాటి పేరు విజన్ యూనిట్స్ గా మారుస్తున్నామన్నారు.  భవిష్యత్ లో ప్రజా సేవలకు విజన్ యూనిట్సే కేంద్ర బిందువులుగా నిలుస్తాయన్నారు.   ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా, సమర్థంగా అందించేలా టెక్నాలజీని వినియోగించుకోవాల్నారు.  ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు, రికార్డులు, సర్టిఫికెట్టు ఇలా అన్నీ  ఒకే వేదిక నుంచి అందించేలా విజన్ యూనిట్స్ పని చేయనున్నాయని వివరించారు.   

ఎస్ఆర్ఎం కాలేజీ ఫుడ్ పాయిజినింగ్ ఘటనపై విచారణకు కమిటీ

  అమరావతిలోని ఎస్ఆర్ఎమ్  కాలేజీలో ఫుడ్ పాయిజన్(  కలకలం రేగింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అయితే విషయాన్ని బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం మేనేజ్ చేసింది. అంతేకాదు విద్యార్ధులను ఇంటికి పంపించారు. విషయం బయటకు రాకుండా విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కాగా కాలేజీలో విద్యార్థులు ఫుడ్ పాయిజినింగ్ తో అస్వస్థతకు గురి అయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్ఆర్ఎసం కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ పై గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన కమిటీ వేసింది. విచారణాధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ అంజనాసిన్హాను నియమించింది. ఆమె ఎస్ఆర్ఎం కాలేజీతో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఎస్ఆర్ఎం కాలేజీలో కలుషితాహారం తిని  300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ధృవీకరించారు. ఈ కాలేజీలో ఆహారం నాణ్యతపై గత కొంత కాలంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. ఎస్ఆర్ఎమ్ కళాశాలలో తరచుగా ఇటువంటి ఘటనలు జరగడానికి గల కారణాలను విచారిస్తున్నామని చెప్పిన అంజనా సిన్హా.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  కళాశాలలో ఆరువేల మంది విద్యార్థులకు ఆహారం అందిస్తున్నట్లు తెలిపిన ఆమె విద్యార్థుల అస్వస్థతకు గురి కావడానికి కారణాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.  

రోడ్డు ప్రమాదంలో పది మంది మహిళలకు గాయాలు

 నెల్లూరు జిల్లా ఉలవలపాడు సమీపంలో గురువారం (నవంబర్ 6) జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మహిళలు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా   అలగాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వారే. వీరంతా లోకేష్ ప ర్యటన కోసం వచ్చి తిరిగి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటోను  కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందిస్తామన్న భరోసా ఇచ్చారు.  ఇలా ఉండగా తన పర్యటనకు వచ్చి తిరగి వెడుతున్న మహిళలు ప్రమాదంలో గాయపడటం పట్ల మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

ఆ బ్యాగ్ ల నిండా డ్రోన్లే. ఎక్కడంటే?

ప్రతి విమానాశ్రయంలోనూ భద్రతా ఏర్పాట్లు అత్యంత పటిష్ఠంగా ఉంటాయి.  కస్టమ్స్, డి ఆర్ ఐ,సిఐఎస్ఎఫ్ ఇలా భద్రతాధికారులు అధికారులు విమానాశ్రయానికి వచ్చే, వెళ్లే వారి కదలికలపై డేగకళ్లతో  నిఘా పెడతారు. ఎయిర్ పోర్టులో దిగే ప్రతి ప్రయాణీకుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. స్కాన్ చేస్తారు.  అయినా   స్మగ్లర్లు అంతకు మించి జాగ్రత్తలు తీసుకున్నామని భావిస్తూ, పట్టుబడబోమన్న నమ్మకంతో దర్జాగా అక్రమరవాణాకు  పాల్పడుతూ ఉంటారు.అయినా వారి జాగ్రత్త లకు మించి నిఘా నేత్రాలు ఉండటంతో దొరికిపోయి కటకటాల పాలౌతుంటారు. బంగారం, డ్రగ్స్, నగలు, ఇలా రకరకాల వస్తువుల అక్రమరవాణాకు ప్రయత్నించి దొరికిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం.   ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడు బ్యాగులో డ్రోన్లతో అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన  శంషాబాద్ ఎవిమానాశ్రయంలో జ రిగింది. ఈ సంఘటనలో అధికారులు 22 డ్రోన్లు, వాటికి సంబంధించిన 22 రిమోట్ లను స్వాధీనం చేసుకున్నారు.  సింగపూర్ ఎయిర్ లైన్స్ లో వచ్చిన ముత్తు కనపన్ సతీష్ కుమార్ అనే వ్యక్తి  కదలికలపై  సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతడిని ఫాలో అయ్యారు.  ముత్తు కనపన్ సతీష్ కుమార్ తన బ్యాగులను షేక్ హైమద్ అష్‌రఫ్ అలి అనే వ్యక్తికి అందజేస్తుండగా  సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. బ్యాగ్ లు తెరిచి చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ బ్యాగులలో 22డ్రొన్ లతో పాటు 22 రిమోట్‌లు ఉన్నట్లుగా గుర్తించారు.వెంటనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డ్రోన్లు, రిమోట్ ల విలువ 26 లక్షల 70 వేల రూపాయల వరకూ ఉండొచ్చన్నది అంచనా.  

రజనీకి రేపల్లె దారి చూపుతున్న జగన్!?

ఘోర పరాజయం తరువాత కూడా జగన్ లో ఇసుమంతైనా మార్పు రాలేదు.  2024లో వైసీపీ ఘోర పరాజయానికి తన ఐదేళ్ల హయాంలో అవలంబించిన కక్ష సాధింపు రాజకీయాలు, వేధింపు చర్యలు, అభివృద్ధిని పట్టించుకోకపోవడం వంటి కారణాలతో పాటు మరో కారణం కూడా ఉంది. అదే  సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెట్టడం.  అయితే ఆ విషయం ఇప్పటికీ జగన్ కు అర్ధమైనట్లు కనిపించడం లేదు. 2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే  ఈ విషయాన్ని మాజీ మంత్రి విడదల రజనీకి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో కూడా చిలకలూరి పేట సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విడదల రజనిని అక్కడ నుంచి  గుంటూరు పశ్చిమకు మార్చారు. అయితే ఆమె అక్కడ విజయం సాధించలేకపోయారు. అంతకు ముందు 2019 ఎన్నికలలో విడదల రజని చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు. ఆ తరువాత జగన్ విడదల రజనీకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఆమె మంత్రిగా కొనసాగారు. మంత్రి హోదాలోనే గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన రజని ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆమె పరాజయానికి కారణాలెన్ని ఉన్నా, ఆమె మాత్రం తనను నియోజకవర్గం మార్చడమే పరాజయానికి కారణమని భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతారు. ఓటమి తరువాత  విడదల రజనీ మళ్లీ చిలకలూరి పేటకు వచ్చేశారు. చిలకలూరి పేట క్షేత్రంగానే ఆమె రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2029 ఎన్నికలలో చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఇక్కడే జగన్ ఆలోచన వేరుగా ఉంది. రఆమె ఓటమి తర్వాత, రజినీ నిశ్శబ్దంగా చిలకలూరిపేటకు తిరిగి వచ్చి స్థానిక పనిని తిరిగి ప్రారంభించారు. కానీ జగన్ ఇప్పుడు రేపల్లె నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను పోటీకి దింపాలని కోరుకుంటున్నారని సమాచారం. రేపల్లె నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన  అనగాని సత్యప్రసాద్‌ పై విడదల రజనిని పోటీకి నిలబెడితే.. ఆమె ఖాతాలో మరో పరాజయం జమ కావడం ఖాయమని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  

వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.  కార్తీక పౌర్ణమి పర్వ దినాన క్షుద్రపూజల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు స్మశాన వాటిక  వద్దనిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ క్షుద్ర పూజలు చేశారు.   పసుపు, కుంకుమ, పూలు నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలో పెద్ద దీపాన్ని వెలిగించి పెట్టగా అది గురువారం (నబంబర్ 6) ఉదయం కూడా వెలుగుతూనే ఉండటం, ఆ ప్రాంతంలో జంతుబలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం ఇదే మొదటి సారి కాదని స్థానికులు చెబుతున్నారు. ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. 

మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్

ఇటీవల మరణించిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం (నవంబర్ 6) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సుబ్బానాయుడు, భాను చందర్ వంటి కార్యకర్తలను కోల్పోవడం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు. సుబ్బానాయుడు అనారోగ్యానికి గురయ్యారని తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు చెప్పిన ఆయన సబ్బానాయుడి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మాలేపాటి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అంతే కాకుండా ఆ కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకువచ్చేందుకు వ్యక్తిగతంగా తాను చేయూతనిస్తానని లోకేష్ చెప్పారు. మాలేపాటి పై దుప్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

విజయాడైరీ మాజీ చైర్మన్ మండవ జానకిరాయ్య కన్నుమూత

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్‌ మండవ జానకిరామయ్య గురువారం (నవంబర్ 6)  కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గన్నవరం శివారులోని రుషివాటిక వృద్ధుల నిలయంలో  గురువారం (నవంబర్ 5) ఉదయం తుదిశ్వాస విడిచారు.  జానకిరామయ్య 27 సంవత్సరాలపాటు  విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించారు. జానకిరామయ్యకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డెయిరీ రంగానికి ఆయన అందించిన విశిష్ఠ సేవలకు గాను జానకిరామయ్యకు 2012లో డాక్టర్ కురియన్ అవార్డు లభించింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మండవ జానకిరామయ్య అంత్యక్రియలు గురువారం (నవంబర్ 6) సాయంత్రం ఆయన స్వగ్రామమైన మొవ్వలో జరుగుతాయి. 

కడప దర్గాలో ఏఆర్ రెహ్మాన్

  ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్  కడపలోని అమీన్‌పీర్ దర్గాలో   సందడి చేశారు.  దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా  తొలి రోజు గురువారం (నవంబర్ 6) ప్రధాన ముజావర్ అరిదుల్లా హుసైనీ నివాసం నుంచి  గంధం ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  మతాలకు అతీతంగా భక్తులు ఆ దర్గాకు వెళ్లి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది రాజకీయ నాయకులు హాజరవుతుంటారు.  రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దర్గా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు పటిష్టంగా ఏర్పాటు చేశారు. పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేని ఇంటి నుండి బుధవారం (నవంబర్ 5)రాత్రి మేళ తాళాల నడుమ గంథాన్ని పీఠాధిపతి ఊరేగింపుగా తీసుకుని వచ్చి దర్గాలోని మజర్ వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్  ఏటా ఈ  ఉరుసు ఉత్సవాలలో గంధం రోజు తప్పకుండా పాల్గొంటారు .ఈ ఏడాది జరుగుతున్న ఈ ఉత్సవాల్లో కుడా మొదటి రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మాన్  కడప పెద్ద దర్గా లో పీఠాధిపతి తో అరీఫుల్లా హుస్సేనితో కలిసి ప్రార్ధనలు  చేశారు. 

ఉత్తమ ఉపాధ్యాయులకు సింగపూర్ టూర్..మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ జిల్లాకు ఇద్దరు చొప్పున ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి హస్తినకు విద్యాయాత్రకు పంపిన లోకేష్.. అదే విధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అధునాతన విద్యా విధానాలు, బోధనపై అవగాహన కలిగేలా, అధ్యయనం కోసం సింగపూర్ పంపించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన 78 మంది టీచర్లను ఈ నెల 27న సింగపూర్ పంపించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం (నవంంబర్ 5)  విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో లోకేష్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ నెల 27 నుంచి వారం రోజుల పాటు 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ వారం రోజుల పర్యటనలో ఉపాధ్యాయులు సింగపూర్ లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించి,  అక్కడి బోధనాపద్ధతులు, అనుసరిస్తున్న సాంకేతితక, పాఠశాల తరగతి గదులలో వాతావరణంఅక్కడి అధునాతన సాంకేతికలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాసు రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనంచేసి, రాష్ట్రంలో విద్యాప్రమాణాల మెరుగుకు ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయగలం అన్న అంశాలపై నివేదిక అందజేస్తారని తెలిపారు.