ట్యాంక్ బండ్  పై మిలియన్ మార్చ్ మంటలు... రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు

  ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్ బండ్ పిలుపు కేసీఆర్ సర్కారు గుండెల్లో గుబులుపుట్టిస్తోంది. మిలియన్ మార్చ్ తో సత్తా చాటేందుకు ఆర్టీసీ కార్మికులు ఉవ్విళ్లూరుతుండటంతో ప్రభుత్వం కంగారుపడుతోంది. ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్ ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఎలాగైనాసరే అనుకున్నది చేసి చూపించాలని ఆర్టీసీ జేఏసీ పట్టుదలగా ముందుకు కదులుతోంది. ఆర్టీసీ ఛలో ట్యాంక్‌బండ్‌‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు... రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జిల్లాల నుంచి ఎవరూ హైదరాబాద్ రాకుండా.... ఆర్టీసీ కార్మికులను కట్టడి చేస్తున్నారు. అలాగే, విపక్ష పార్టీల కార్యకర్తలు సైతం హైదరాబాద్ తరలిరాకుండా... ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌ కి వచ్చే అన్ని రహదారులను పోలీసులు తమ కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు. పోలీసుల ముందస్తు అరెస్టులతో ఆర్టీసీ జేఏసీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొందరు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుంటున్నారు. అయితే, ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డిని  హైదరాబాద్‌ విద్యానగర్‌లో పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక, ట్యాంక్ బండ్ తోపాటు హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్దఎత్తున బలగాలను మోహరించారు. అనుమాం వస్తే చాలు అదుపులోకి తీసుకుంటున్నారు ఛలో ట్యాంక్‌బండ్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఆటంకాలు కల్పించినా.... పెద్దఎత్తున తరలివచ్చి... కార్మికుల ఐక్యతను చాటాలని అశ్వద్ధామరెడ్డి పిలుపునిచ్చారు. పోలీసుల తీరుపై మండిపడ్డ అశ్వద్ధామరెడ్డి.... కార్మికుల ఇళ్లల్లోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఫైరయ్యారు. అయితే, ఎన్ని ఆంక్షలు విధించినా, నిర్బంధించినా.... ట్యాంక్‌బండ్‌పై జకల జనుల సామూహిక దీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇక, ఆర్టీసీ జేఏసీ పిలుపుతో విపక్ష పార్టీలతోపాటు వివిధ ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు.... ఈ మిలియన్ మార్చ్ లో పాల్గోనున్నాయి.

కాసేపట్లో అయోధ్య తీర్పు... దేశవ్యాప్తంగా సూపర్ హైఅలర్ట్

  దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూవివాదంపై మరికాసేపట్లో సుప్రీంకోర్టులో తుది తీర్పు ఇవ్వనుంది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంపై చరిత్రాత్మక తీర్పును ఇవ్వబోతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన రెండో కేసుగా ఇది రికార్డులకెక్కింది. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని... నిర్మోహి అఖాడ, రాంలాల్‌ విరాజ్‌మని‌, సున్నీ వక్ఫ్‌ బోర్డుకు సమానంగా పంచుతూ... అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ... దాఖలైన 14 పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం విచారణ జరిపింది. 2019 ఆగస్ట్ 6నుంచి అక్టోబర్ 16వరకు మొత్తం 40రోజులపాటు బహిరంగ విచారణ జరిగింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింది. హిందువుల నమ్మకం ప్రకారం ఇది రామజన్మభూమిగా కొనసాగుతోందని, అలాగే రామాలయానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని హిందూ వర్గమైన రాంలాలా విరాజ్‌మని తరపున న్యాయవాదులు వాదించారు. బాబర్ వచ్చి మసీదును నిర్మించాక... ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరిగేవని సున్నీ వక్ఫ్ బోర్డు ధర్మాసనానికి నివేదించింది. ఈ పిటిషన్లతోపాటు పలు వ్యక్తిగత, హిందూసభ, వీహెచ్‌పీ తదితర పిటిషన్లపైనా వాదనలు జరిగాయి. అనంతరం రాతపూర్వకంగా వాదనలను కూడా సుప్రీం ఇవాళ తుది తీర్పు ఇవ్వబోతోంది. అయోధ్య తీర్పుపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమకు సమ్మతమేనని ఇటు హిందూ సంస్థలు.... అటు ముంస్లిం వర్గాలు చెబుతున్నాయి.  

మోడీని కలవనున్న ఎల్వీ.. జగన్ అనుమానమే నిజమైందా?

  ఏపీ ప్రభుత్వం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆయనను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు. అయితే ఎల్వీ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. మరోవైపు ఎల్వీని బదిలీ చేసిన విధానం సరైంది కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఎల్వీ బదిలీని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్వీ ప్రధాని మోడీని కలవనున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎల్వీ మోడీతో భేటీ అయ్యే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆయన ఢిల్లీ వెళ్లి మోడీని కలవనున్నారని సమాచారం. ఎల్వీ మోడీని కలవనున్నారనే వార్త రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎల్వీకి ఆరెస్సెస్ తో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన ఏపీలో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ.. ఆరెస్సెస్, బీజేపీలకు చేరుస్తున్నారన్న అనుమానంతోనే.. ఆయన్ని సీఎస్ పదవి నుంచి జగన్ తప్పించారని ప్రచారం జరిగింది. ఇప్పుడు సీఎస్ మోడీని కలబోతున్నారన్న వార్తలు ఒక్కసారిగా హీట్ పెంచాయి. సీఎస్ మోడీని కలిసి ఏం చెప్పబోతున్నారు? ఏపీ సర్కార్ ని ఇరుకున్న పెట్టే పని ఏమైనా చేయబోతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఎల్వీకి మరో ఐదు నెలల సర్వీసు ఉంది. దాంతో ఆయనను కేంద్రం తన సేవలకు వినియోగించుకోనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలే తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవట్లేదు. మరి ఇప్పుడు ఎల్వీ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ సర్కార్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో చూడాలి.  

ఐదేళ్ల చిన్నారి పై దారుణానికి పాల్పడ్డ దుండుగులు...

  చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికొచ్చిన ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చారు. బి కొత్తకోట మండలం గట్టు గ్రామ పంచాయతీలోని గుట్ట పాలెం గ్రామానికి చెందిన ఉషారాణి, సిద్దారెడ్డి దంపతులు తమ ఐదేళ్ల కుమార్తె వర్షితను తీసుకుని అంగళ్లలో బంధువుల పెళ్లికి వెళ్లారు. పెళ్లికి వెళ్లిన తరువాత వర్షిత కనిపించకుండా పోయింది. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేసిన తరువాత లైంగిక దాడి చేసి చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు. వర్షితను కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాకు చిక్కాయి. పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.   ఐదేళ్ల చిన్నారి హర్షిత పెళ్లిలో ఆడుకుంటూ ఉండగా ఒక యువకుడు ఆ పాపను తీసుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది.  తర్వాత ఆ పాపను అత్యాచారం చేసి చంపేసినట్టుగా వెల్లడైయ్యింది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉత్సాహంగా ఉన్నటువంటి పాప తొమ్మిది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఒక యువకుడు ఫొటో తీస్తా అంటూ తీసుకు వెళ్ళినట్టుగా వెల్లడించారు తల్లిదండ్రులు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పాప కోసం వెతికారు. రాత్రి అంతా కళ్యాణ మండపంతో పాటు సమీప ప్రాతంలో ఎంత వెతికినా కూడా పాప కనిపించకపోవడంతో ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపానికి సమీపంలోనే ఈ చిన్నారి మృతి చెందిందన్న వార్త పెళ్ళికి వచ్చిన బంధువుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లీదండ్రులు  ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిర్మానుష్య  ప్రాంతంలో ఉన్న పాప మృతిదేహం దగ్గరకు వెళ్ళి కన్నీటి పర్యాంతం అయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు అధికారులు వీలైనంత త్వరలో ఆ కామాంధుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మహా రాజకీయం కథ నేటితో కంచెకు చేరనుందా?

  మహా రాజకీయం ఇటివల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అర్ధరాత్రితో మహారాష్ట్ర లోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఆయుష్షు తీరిపోతుంది. ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ పక్షంలో రాష్ట్రపతి పాలన తప్పదు. గవర్నర్ విచక్షణాధికారాన్ని వినియోగించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ను కొనసాగమని కూడా కోరవచ్చు.  ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులైనా బీజేపీ, శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న పెనుగులాట రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది. బీజేపీ, శివసేన నాయకులు కత్తులు నూరుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టటానికి  బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మొత్తం ఎమ్మెల్యేలను బాంద్రాలోని ఓ హోటల్ కు తరలించింది శివసేన నాయకత్వం. పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే నివాసానికి సమీపంలోనే ఈ హోటలుంది. మరోవైపు తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ఎగరేసుకుపోతారన్న భయంతో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవరిస్తోంది. గత అర్ధరాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్ లోని జైపూర్ కు తరలించారు.  మొత్తం మీద మహారాష్ట్ర పాలక కూటమికి ప్రజలు అధికారం ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పీఠాన్ని రెండున్నరేళ్ల పాటు తమకు ఇవ్వాల్సిందేనంటూ శివసేన పట్టుబడుతోంది. అదేంకుదరదు అయిదేళ్లు సీఎం సీటు తమకే అని బీజేపీ భీష్మించింది. ఇన్ని రోజులుగా చర్చలు, విమర్శలూ కొనసాగుతున్నా రెండు పార్టీలూ ఒక్క మెట్టు కూడా దిగేందుకు ప్రయత్నించడం లేదు. మరోవైపు మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేదు అంటున్నారు బీజేపీ నేతలు. బయటకు ఇంత రాద్ధాంతం జరుగుతునా ఇంకా తెర వెనుక మంతనాలు సాగుతూనే ఉన్నాయి.ఈ రాజకీయాలకు నేటి రాత్రితో తెర పడబోతోందే లేదో వేచి చూడాలి.

మద్యం నియంత్రణ పై మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్...

  మద్యం నిషేధం పై జగన్ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది అనే చెప్పుకోవాలి. మద్యం నియంత్రణ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బార్లను రాత్రి పది గంటల వరకే అనమతించాలని ఆదేశాలిచ్చింది. దశల వారిగా మద్య నిషేధం విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏపీలో బార్ ల సంఖ్యను తగ్గించాలని సీఎం జగన్ నిర్ణయించారు. జనవరి ఒకటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.  తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే బారులు ఉండాలనీ, అనుమతిచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్ లలో మద్యం విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఆ మేరకు విధి విధానాల ఖరారు చేయాలని ఆదేశించారు. దశల వారీగా మద్య నిషేధంపై వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి తమ సర్కారు కట్టుబడి ఉందని జగన్ అధికారులకు స్పష్టం చేశారు.  మద్య నిషేధం దిశగా ఏపీ సర్కారు ఇప్పటికే పలు నిర్ణయాలను తీసుకుంది. మద్యం లైసెన్సులు పునరుద్ధరించక పోగా అమ్మకాల్ని ప్రభుత్వ గొడుగు కిందకు తీసుకొచ్చింది. మద్యం రేట్లు కూడా భారీగా పెంచింది. కొన్ని బ్రాండ్ లు మాత్రమే అమ్మాలని కూడా నిర్ణయించింది. మద్యం ధరలు విపరీతంగా పెంచటంపై ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్న జగన్ సర్కారు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.నిజంగానే మద్యం నిషేధం పై జగన్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.

ఒంగోలులో ఓ మహిళ పైశాచికానందం... హాలీవుడ్ మూవీని మించిన క్రైమ్ సీన్...

  సాధారణంగా అడల్డ్ సెక్స్ క్రైమ్ హాలీవుడ్ చిత్రాల్లోనే కనిపిస్తాయ్... విశృంకుల శృంగారం... అన్-నేచురల్ సెక్స్... లాంటి సీన్స్ హాలీవుడ్ క్రైమ్ మూవీస్ లో మాత్రమే చూడగలం... కానీ ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో హాలీవుడ్ నే మించిన సెక్స్ క్రైమ్ బయటపడింది. ఓ వివాహిత తన విపరీతమైన శృంగార కోర్కెలను తీర్చుకోవడానికి చేసిన అకృత్యాలను చూసి పోలీసులే నివ్వెరపోయారు.   ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలానికి చెందిన సుమలత అలియాస్ సాయితేజారెడ్డి... ఆర్ఎంపీ ఏడుకొండలతో సహజీవనం చేస్తోంది. సుమలత చూడ్డానికి అందంగా పదహారణాల అమ్మాయిలా కనిపించినా, ఆమె గొంతు మాత్రం మగరాయుడులా ఉంటుంది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని భర్తలను వదిలేసిన సుమలత... కొన్నేళ్లుగా ఆర్ఎంపీ ఏడుకొండలతో కలిసి ఒంగోలు మారుతీనగర్ లో ఉంటోంది. అయితే, ఈమెకు విపరీతమైన సెక్స్ కోర్కెలు ఉండటమే కాకుండా... అసహజ రీతిలో శృంగారం చేయడం వ్యసనంగా మారింది. దాంతో తన కోర్కెలను తీర్చుకోవడానికి అమాయక అమ్మాయిలకు వలేసి... వారికి మత్తు మందిచ్చి... సెక్స్ టాయ్స్ ను వాడుతూ పైశాచికానందం పొందేది. ఈమె వలకు చిక్కిన అమ్మాయిలపై సెక్స్ టాయ్స్ తో శృంగారం చేస్తూ నరకం చూపించేది. ముఖ్యంగా పెళ్లికాని పేద అమ్మాయి, కాలేజీ యువతులనే సుమలత టార్గెట్ గా పెట్టుకునేది. అయితే అమ్మాయిలను ట్రాప్ చేయడానికి సెల్ ఫోన్ సెంటర్ నిర్వాహకుడు వంశీ సాయం తీసుకునేది. అలా, ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తే... మొదట సుమలత... ఆ తర్వాత, ఆమె భర్త ఏడుకొండలు, సెల్ ఫోన్ సెంటర్ నిర్వాహకుడు వంశీ అత్యాచారానికి పాల్పడేవారు. అయితే, బాధితులంతా తమ పరువు పోతుందని జరిగిన ఘోరం గురించి ఫిర్యాదు చేసేవారు కాదు. దాంతో, సుమలత అకృత్యాలు నిరాటంకంగా సాగాయి. అయితే, బాలిక ధైర్యంచేసి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో సుమలత గుట్టు బయటపడింది. సుమలత తనను ఆటోలో తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకు మత్తు మందిచ్చి, సుమలతతోపాటు మరికొందరు అత్యాచారం చేశారని ఎస్పీకి కంప్లైంట్ చేయడంతో... పోలీసులు సుమలత ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సోదాల్లో పదుల సంఖ్యలో సెక్స్ టాయ్స్... ప్రేమ లేఖలు... స్వాధీనం చేసుకున్నారు. మగరాయుడిలా కనిపించేందుకు సుమలత ధరించే దుస్తులు, లైంగిక చర్యకు ఉపయోగించే కృత్రిమ పరికరం, నడుముకు చుట్టుకునే బెల్టు వంటి వాటిని సీజ్‌ చేశారు. అయితే, పోలీసుల సోదాలు జరుగుతుండగానే, సుమలత భర్త ఏడుకొండలు ... బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక, సుమలతతోపాటు ఆమెకు సహకరించిన వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే, ఆడ పుట్టుక పుట్టి... కృత్రిమ పరికరాలతో మగాడిలా.... అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం పోలీసులనే నివ్వెరపోయేలా చేసింది. కట్టూబొట్టుతో  అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే సుమలత... అమ్మాయిలపై అకృత్యాలకు తెగబడిందనే సంగతి తెలుసుకుని ఒంగోలు వాసులు విస్తుపోతున్నారు.

దేశవ్యాప్తంగా సెక్యూరిటీ అలర్ట్... అయోధ్య తీర్పుపై కేంద్రం అటెన్షన్...

  అత్యంత వివాదాస్పదమైన అయోధ్య తీర్పు త్వరలో వెలువడనుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మత ఘర్షణలు, ఉద్రిక్తలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. తీర్పు ఎలాగున్నా ఏమీ మాట్లాడొద్దంటూ మంత్రులకు ప్రధాని మోడీ ఆదేశించారు. మరోవైపు, ఆరెస్సెస్, బీజేపీ నేతలు... ఎక్కడికక్కడ ముస్లింలను కలిసి సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర హోంశాఖ... భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. అలాగే, సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్, వ్యాఖ్యానాలు చేయొద్దని ఆంక్షలు విధించారు. ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేసినా, వైరల్ చేసినా, లైకులు, షేర్లు చేసినా చర్యలు తీసుకోనున్నారు. సోషల్ మీడియాపై  ఓ కన్నేసిన కేంద్రం... ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేస్తే జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక, వివాదాస్పద అయోధ్య స్థలం దగ్గర యూపీ పోలీసులు నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, మల్టిఫుల్ ప్లాన్స్ తో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఒక ప్లాన్ ఫెయిలైతే... క్షణాల్లో మరో ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి పరిస్థితిని కట్టడి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. వివాదాస్పద స్థలం దగ్గర 12వేల మంది పోలీసులను మోహరించగా, అదనంగా 4వేల పారామిలటరీ బలగాలను యూపీకి పంపింది కేంద్రం. వీళ్లే కాకుండా మరిన్ని దళాలను ఉత్తరప్రదేశ్ అంతటా మోహరించనున్నారు. ఇక, సుప్రీం తీర్పు నేపథ్యంలో... అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సెక్యూరిటీ అలర్ట్ ఇచ్చింది. నవంబర్ 17లోగా సుప్రీంకోర్టు అయోధ్య తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం విస్తృత జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయోధ్యలో సభలు, సమావేశాలు నిషేధించడంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సోషల్ మీడియా వేదికలను పోలీసులు తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. అలాగే, పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేసేందుకు ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించారు. ఇక, గ్రామాల్లో సైతం ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా 16మంది వాలంటీర్లను నియమించారు. ఇక, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి పెద్దఎత్తున అరెస్టులు చేయాల్సి వస్తే... జనాన్ని ఉంచడానికి ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలనే తాత్కాలిక జైళ్లుగా మార్చేందుకు వాటిని ఖాళీ చేయిస్తున్నారు.  

టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారు? రమణదీక్షితులు రీఎంట్రీపై చంద్రబాబు ఫైర్

  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులకు మళ్లీ టీటీడీలో ప్రవేశం కల్పించడంపై చంద్రబాబు మండిపడ్డారు. అసత్య ఆరోపణలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిన దీక్షితులును తిరిగి ఎలా విధుల్లోకి తీసుకుంటారని ప్రశ్నించారు. పింక్ డైమండ్ మాయమైందంటూ నానా యాగీ చేసిన రమణదీక్షితులపై పరువు నష్టం దావాను ఎలా ఉపసంహరించుకుంటారని నిలదీశారు. ఎన్నో ఆరోపణలున్న రమణదీక్షితులను టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుడిగా నియమించడం మంచిది కాదన్నారు చంద్రబాబు. అసలు జగన్ వైఖరిని చూస్తుంటే... త్వరలో దీక్షితులను టీటీడీ ప్రధాన అర్చుకుడిగా నియమించేలా ఉన్నారని నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డికి అసలు తన సొంత మతం గురించి చెప్పుకునే ధైర్యం లేదంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. వెంకన్నతో జగన్ ఆటలు ఆడుతున్నారన్న బాబు.... అది ఎంత కాలమో సాగదన్నారు. దేవుడితో ఆటలాడుకునేవారు అసలు బాగుపడరంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే హిందువులు ఏడాది వరకు ఆలయాలకు వెళ్లరని, కానీ జగన్ మాత్రం హిందూ విశ్వాసాలను తుంగలో తొక్కి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారని మండిపడ్డారు. సోనియాగాంధీ, అబ్దుల్ కలాం లాంటి అన్యమతస్థులు... వెంకటేశ్వరస్వామిపై విశ్వాసముందని అఫిడవిట్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారని, కానీ జగన్ కు మాత్రం ఆ ధైర్యం లేదన్నారు. అసలు తాను క్రిస్టియన్ అని చెప్పుకునేందుకే జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిన విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు.... తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

సురేష్ మృతితో గౌరెల్లిలో టెన్షన్ టెన్షన్... రాత్రికి రాత్రే అంత్యక్రియలకు పోలీసుల ఒత్తిడి...

  తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతితో అతని స్వగ్రామం గౌరెల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 65శాతం కాలిన గాయాలతో నాలుగు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మరణించడంతో ఆగమేఘాల మీద పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు... అప్పటికప్పుడు అంబులెన్స్ లో గౌరెల్లి తరలించారు. అయితే, డెడ్ బాడీ ఇంటికి చేరడంతో గ్రామస్తులు, కుటుంట సభ్యులు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఇక, సురేష్ అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గౌరెల్లి గ్రామంలో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. అయితే, సురేష్‌... అంత క్రూరుడు కాదని, అతడ్ని ఎవరో రెచ్చగొట్టి... విజయారెడ్డిని హత్య చేయించారని కుటుంబ సభ్యులు అంటున్నారు. సురేష్‌ను రెచ్చగొట్టింది ఎవరో తేల్చాలని ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, సురేష్ కాల్ డేటా ఆధారంగా, ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సురేష్ కాల్ డేటాలో పలువురు రియల్టర్లు ఉండటంతో వాళ్లందరినీ పిలిచి విచారిస్తున్నారు. ఇదిలాఉంటే, విజయారెడ్డి మర్డర్ కి రెండ్రోజుల ముందు ఆమె ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. రెక్కీ నిర్వహిస్తూ... విజయారెడ్డి భర్తతో సురేష్ మాట్లాడినట్లు కూడా ఆధారాలు సేకరించారు. ఇక, సురేష్ మృతికి ముందు పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. పట్టా ఇవ్వలేదన్న కోపంతోనే తహశీల్దార్‌ విజయారెడ్డిని సజీవదహనం చేసినట్లు సురేష్ తన వాంగ్మూలంలో తెలిపాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... పట్టా ఇవ్వకపోవడంతోనే చంపేసినట్లు చెప్పాడు. నవంబర్‌ నాలుగున మధ్యాహ్నం చివరిసారిగా విజ్ఞప్తి చేశానని... అయినా విజయారెడ్డి పట్టించుకోకపోవడంతో.... తిరిగి పెట్రోల్‌ డబ్బాతో వెళ్లి... తగలబెట్టానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

అవినీతిలో ముందంజలో ఉన్న రెవిన్యూశాఖ: ఏసీబీ

  అవినీతికి పర్యాయపదంగా మారిపోయేలా వ్యవహరిస్తొంది రెవిన్యూశాఖ. వీఆర్వో దగ్గర నుంచి ఆర్డీవో వరకు చేయి తడపనిదే కనికరించి పరిస్థితి లేదు. ఏసీబీ రైడ్స్ లో పట్టుబడుతున్న వారిలో సగానికి సగం మంది రెవెన్యూ ఉద్యోగులే ఉన్నారంటే పరిస్థితి తీవ్రత ఎంతుందో  అర్థం చేసుకోవచ్చు. ఈ రెండేళ్లలో ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులు 207 మంది ఉంటే, వారిలో యాభై మంది రెవెన్యూ ఉద్యోగులే ఉండడం ఆశ్చర్యం. నాలుగు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ కేశంపేట తహసీల్దార్ లావణ్య, వీఆర్వో అనంతయ్య ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. బాచుపల్లి తహసీల్దార్ శ్రీదేవి మూడు లక్షల లంచం తీసుకుంటూ దొరకగా, రెండు లక్షల లంచం తీసుకుంటూ ఇల్లంతకుంట తహసీల్దార్ రవి రాజ్ కుమార్, వీఆర్ కె రామకృష్ణ పట్టుబడ్డారు. ఇక మద్దివంచ వీఆర్వో శివరావు నలభై వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కొత్తకోట ఆర్డీవో, తాసీల్దార్ కలిసి లక్ష యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అవీనీతి రెవిన్యూ అధికారుల చిట్టా భారీగానే ఉంది అని మనకు తెలుస్తోంది.  ఇంత మంది లంచావతారులు ఉంటే ఇప్పటి వరకు వీళ్ల పేర్లెందుకు  బయటకు రాలేదు ప్రశ్నార్ధకంగా ఉంది. ఏపీపీ లెక్కల ప్రకారంగా నాలుగు లక్షల రూపాయలు ల్యాండ్ మ్యుటేషన్ కోసం అటూ ఇటూ తిప్పి రైతుకు పాసుబుక్కు పట్టా ఇవ్వడం కోసం కూడా లంచాలు తీసుకుంటున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత సంవత్సరంలో కూడా రెవెన్యూ అధికారులే అవినీతిలో ప్రధమ స్థానంలో ఉండడం గమనార్హం. మొన్న జరిగిన తహసీల్దార్  ఘటన ఇంకా మరవక ముందే తాజాగా నిన్న కూడా మెడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో పంచాయతిరాజ్ అధికారులకు లక్ష రూపాయిలు లంచం తీసుకుంటూ దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున ఉన్న అవినీతి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశాలు భారీగానే ఉన్నాయి.

సొంత ఇంటి మేకోవర్ కోసం 16కోట్లా? జగన్ పాలనపై నేషనల్ మీడియా ఫైర్...

  మీడియాను కంట్రోల్ చేయడానికి జగన్ సర్కారు జీవోలు తెచ్చినా జాతీయ ఛానెళ్లు మాత్రం ఏకిపారేస్తున్నాయి. ఎన్నికలకు ముందు... ఎన్నికల సమయంలో జగన్ కు ఓ రేంజ్ లో హైప్ ఇచ్చిన ఛానెళ్లే ఇప్పుడు... వైసీపీ పాలనలో తప్పులను... మిస్ మేనేజ్ మెంట్ ను... జగన్మోహన్ రెడ్డి అనుభవరాహిత్యాన్ని ఎండగడుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ... ఒక్క పైసా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనంటూ లెక్చర్లు దంచికొడుతున్న జగన్మోహన్ రెడ్డి... తాడేపల్లిలోని తన ఇంటి మేకోవర్ కోసం 15.65కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేశారంటూ లెక్కలతో సహా వివరిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దుబారాను అరికట్టి ప్రజాధనాన్ని సేవ్ చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి... దాదాపు 16కోట్ల రూపాయల ప్రజల డబ్బును తన సొంత ఇంటి మేకోవర్ కోసం ఖర్చు చేయడమేంటని నేషనల్ మీడియా దుమ్ముదులుపుతోంది. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి వెళ్లే రోడ్ల విస్తరణ కోసం 5కోట్లు.... వ్యూయింగ్ కట్టర్ కోసం 3.25కోట్లు... సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం 1.89కోట్లు... ఎలక్ట్రిక్ వర్క్ కోసం 3.65కోట్లు... ప్రజాదర్బార్ ఏర్పాట్ల కోసం 82.5లక్షలు... తాత్కాలిక ఏర్పాట్ల కోసం 22.5లక్షలు...  స్టాఫ్ మెయింటెనెన్స్ కి 8.5లక్షలు... ఇంటి కిటికీలు, తలుపుల కోసం 73లక్షలు.... ఇలా ఇప్పటివరకు మొత్తం 15.65 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేశారంటూ కథనాలు ప్రసారం చేశాయి. అయితే, ఎన్నికల అఫిడవిట్ లో 510కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చూపిన జగన్మోహన్ రెడ్డి.... తన సొంత ఇంటి మేకోవర్ కోసం దాదాపు 16 ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నిస్తున్నాయి.

సామాన్య భక్తులపై కక్షగట్టిన టీటీడీ... అద్దె గదుల ధరలు అమాంతం పెంపు... 

  తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి సామాన్య భక్తులకు షాకిచ్చింది. శ్రీవారి దర్శనం దగ్గర్నుంచి వసతుల వరకు ప్రతి విషయంలోనూ సామాన్య-మధ్యతరగతి భక్తులను చిన్నచూపు చూసే టీటీడీ... సడన్ గా ఊహించని ఝలక్ ఇచ్చింది. సామాన్యులు ఉంటే అద్దె గదుల ధరలను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. తిరుమలలోని దాదాపు అన్ని గెస్ట్‌-హౌస్‌ల్లోని గదుల అద్దెలనూ రెట్టింపు చేసింది. తిరుమల నందకం అద్దె గదుల ధరను 600 నుంచి వెయ్యికి పెంచగా, కౌస్తుభం, పాంచజన్యంలో రూమ్స్‌‌ను 500 నుంచి వెయ్యి రూపాయలకి పెంచారు. అలాగే, కనీస వసతి ధరను వంద రూపాయలు చేశారు. అయితే, ఈ అద్దె గదుల ధరల పెంపు కేవలం తిరుమలలో మాత్రమే చేసింది. దాంతో తిరుపతిలో యథావిధిగా పాత ధరలే కొనసాగనున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దివ్యసుందర రూపాన్ని క్షణకాలం చూసి ఆనందంతో పరవశించిపోతారు. అయితే, శ్రీవారి భక్తుల్లో ఎంతోమంది భాగ్యవంతులు ఉన్నా... ఎక్కువగా సామాన్య-మధ్యతరగతి వాళ్లే ఉంటారు. అంతేకాదు శ్రీవారి దర్శనం రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో... సాధారణ అద్దె గదులను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా 100 రూపాయల గదులను తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. కానీ, వంద రూపాయల గదులు తక్కువగా ఉండటం, అవి అందరికీ దొరకని పరిస్థితి ఉండటంతో... ప్రత్యామ్నాయంగా ఐదొందలు, ఆరొందల గదులను ఆశ్రయిస్తారు. అయితే, ఈ గదుల ధరలనే ఇప్పుడు టీడీపీ అమాంతం డబుల్ చేసింది. దాంతో, సామాన్య భక్తులు... టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. సాధారణ భక్తులు ఉండే అద్దె గదుల ధరలను రెట్టింపు చేయడంతో.... ఆ అదనపు ఆర్ధిక భారాన్ని తట్టుకోవడం తమ వల్ల కాదంటున్నారు.  

వెళ్తూవెళ్తూ టీడీపీపై యామిని విమర్శలు... కమలం గూటికి చేరేందుకు సన్నాహాలు

  తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఎన్నికల తర్వాత సైలెంటైపోయిన సాదినేని యామిని టీడీపీకి గుడ్-బై చెప్పేసింది. యామిని టీడీపీకి రాజీనామా చేస్తుందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్నా, ఇప్పుడు తెలుగుదేశం అధికారిక వాట్సప్ గ్రూప్ లో తన రాజీనామా లేఖను పోస్ట్ చేసింది. పార్టీలో అంతర్గత విభేదాలు... దేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు... ఇతరత్రా బలమైన కారణాల వల్లే టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించింది. అయితే, తన రాజీనామా లేఖలో సాదినేని యామిని కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీలో నేతల మధ్య సఖ్యత లోపించిందని, అనేక సమస్యలు, లోపాలు ఉన్నాయంది. టీడీపీకి రాజీనామా చేసిన సాదినేని యామిని... కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నాతో యామిని చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఎన్నికలైన నాటి నుంచే ఈ మాటలు వినిపించినా..... అప్పట్లో చంద్రబాబు బుజ్జగించడంతో ఆగిపోయిందని అంటారు. కానీ, ఇప్పుడు బీజేపీలోకి వెళ్లాలని డిసైడైందని, ఒకట్రెండు రోజుల్లో కమలదళంలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, యామినికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, విమర్శలు, ప్రతివిమర్శలతో అతితక్కువ కాలంలోనే పేరు తెచ్చుకుంది సాదినేని యామిని. టీవీ డిబేట్స్ అయినా, ప్రెస్ మీట్స్ అయినా... టీడీపీ తరపున బలమైన వాయిస్ వినిపించింది. ముఖ్యంగా జగన్, పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. యామిని వాగ్దాటిని చూసి, తెలుగుదేశం కూడా నెత్తినపెట్టుకుంది. ఏళ్లతరబడి పని చేస్తున్న నేతలను కాదని, అప్పుడప్పుడే పార్టీలోకి వచ్చిన యామినికి అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టింది. ఇక, చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ యామినిని ఎంతో ప్రోత్సహించారు. దాంతో టీవీ డిబేట్స్ అండ్ ప్రెస్ మీట్స్ లో ఆమె కనిపించని రోజే ఉండేది కాదు. అంతలా టీడీపీ వాయిస్ వినిపించింది యామిని. యామిని... టీడీపీకి రాజీనామా చేయడానికి అనేక కారణాలు వినిపిస్తున్నప్పటికీ... ఏదోవిధంగా అధికార పార్టీలో ఉండాలన్నదే ఆమె లక్ష్యమని అంటున్నారు. అందుకే, అప్పుడు టీడీపీలో చేరిందని... ఇప్పుడు కేంద్రంలో అధకార పగ్గాలున్న బీజేపీలో చేరబోతోందని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు అప్పుడు ఎంతమంది వారించినా వద్దంటున్నా నెత్తిమీద పెట్టుకున్నారని, ఇఫ్పుడవన్నీ పక్కనబెట్టి రాజీనామాచేసి వెళ్లిపోయిందని టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు.  

మీరు తేల్చుతారా? మమ్మల్ని తేల్చమంటారా? కేసీఆర్ సర్కారుకు హైకోర్టు వార్నింగ్

  మీరు తేల్చుతారా... మమ్మల్ని తేల్చమంటారా... అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించింది హైకోర్టు. వీలైనంత త్వరగా ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని, లేదంటే తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని... తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు... ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే.... కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయనే సంగతి మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇక, ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై ఆయా శాఖాధిపతులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే... కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలుసా? లేదా? అంటూ అధికారుల్ని హెచ్చరించింది. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్‌ శర్మ... ఆర్ధికశాఖ ముఖ‌్య కార్యదర్శి రామకృష్ణారావు.... సమర్పించిన నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టు మండిపడింది. ఐఏఎస్‌లు... ఇలా కోర్టుకు అసంపూర్ణ నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. అయితే, ప్రభుత్వ రికార్డుల ప్రకారమే తాము నివేదికలు ఇచ్చినట్లు అధికారులు... హైకోర్టుకు రిప్లై ఇవ్వడంతో... అలాగైతే, మొదటిసారి ఇచ్చిన నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా? అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఇంత దారుణంగా తప్పుడు వివరాలు ఇచ్చిన అధికారులను తన సర్వీసులో చూడలేదంటూ హైకోర్టు సీజే ఆర్ఎస్‌ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ధికశాఖ... ఆర్టీసీ నివేదికల్లోని అంకెలు వేర్వేరుగా ఎందుకున్నాయంటూ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సమస్యను తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు... పదాలు వాడారని అభిప్రాయపడింది. అధికారుల నివేదికలను చూస్తుంటే... కోర్టునే కాకుండా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, రవాణాశాఖ మంత్రిని, రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా తప్పుదోవ పట్టించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారుల నివేదికలపై మరోసారి హైకోర్టు ఫైరవడంతో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. పొరపాటుకు మన్నించాలని కోరారు. అయితే, క్షమాపణ కోరడం సమాధానం కాదన్న హైకోర్టు.... వాస్తవాలు చెప్పాలంటూ చురకలు వేసింది.  నీటి పారుదల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తోన్న ప్రభుత్వం.... ఆర్టీసీ కార్మికుల కోసం 49కోట్లు చెల్లించడానికి ఎందుకు ఇబ్బంది పడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోవాలని... మానవతా దృక్పథంతో ఆలోచించాలని సూచించింది. కార్మికుల డిమాండ్లను మరోసారి పరిశీలించి... చర్చలు జరపాలని ఆదేశించింది.  

కేంద్రం ఎంట్రీతో తెలంగాణ, ఏపీకి చిక్కులు... కొత్త మలుపు తిరిగిన ఆర్టీసీ కేసు...

  ఆర్టీసీ సమ్మె కేసులోకి కేంద్రం ఎంటరైంది. తెలంగాణ సర్కారుతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో తన వాదనలు వినిపించింది. అసలు ఏపీఎస్-ఆర్టీసీ విభజనే జరగలేదన్న కేంద్రం... టీఎస్‌-ఆర్టీసీ కొత్తగా ఏర్పాటు చేశారా అంటూ ప్రశ్నించింది. ఏపీఎస్‌-ఆర్టీసీలో కేంద్రానికి 33శాతం వాటా ఉందన్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్... ఇప్పటికీ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని తెలిపారు. అసలు ఆర్టీసీ విభజనే జరగనప్పుడు... టీఎస్‌-ఆర్టీసీకి చట్టబద్ధత ఎక్కడుందంటూ వాదించింది. అంతేకాదు, నేరుగా టీఎస్-ఆర్టీసీకి ...ఏపీఎస్-ఆర్టీసీ ఆస్తులు బదిలీ అవుతాయనే వాదనల్లో నిజం లేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ...హైకోర్టుకు విన్నవించారు.  కేంద్రం వాదనలు విన్న హైకోర్టు... ఆర్టీసీ విభజన జరగకుండా అసలు నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, కేంద్రం వాదనలపై సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ అండ్ ఏజీలు హైకోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం... టీఎస్‌-ఆర్టీసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, ఏపీఎస్‌-ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలూ... కేంద్రం అనుమతి ఎందుకు కోరలేదని హైకోర్టు ప్రశ్నించింది. అసలు, ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అంటూ హైకోర్టు నిలదీసింది. కేంద్రం తాజా వాదనతో ఇటు తెలంగాణ... అటు ఏపీ... రెండింటికీ తలనొప్పులు తప్పవనే మాట వినిపిస్తోంది. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వాదనలను విశ్లేషిస్తే... కేంద్రానికి చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు కుదరవని అంటున్నారు. ఏపీఎస్‌-ఆర్టీసీలో కేంద్రానికి 33శాతం వాటా ఉందని, ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదని చెప్పడం ద్వారా... తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ గానీ, ఏపీలో విలీనం కానీ అంత ఈజీ కాదనే మాట వినిపిస్తోంది. మొత్తానికి, కేంద్రం ఎంట్రీతో ఆర్టీసీ కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.

టిక్ టాక్ వల్ల భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయిన భార్య...

  చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాక టిక్ టాక్ అంటే తెలియని వారే ఉండనంత క్రేజ్ సంపాదించుకుంది టిక్ టాక్. అయితే ఇటివల టిక్ టాక్ వల్ల చాలా మంది చిక్కుల్లో పడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఘటనే మళ్ళీ చోటు చేసుకుంది. టిక్ టాక్ పచ్చని సంసారంలో చిచ్చు రేపింది, మంటలు పెట్టించింది. భార్యపై భర్తకు అనుమానం పెంచేలా చేసింది. చివరికి ఆ టిక్ టాక్ వీడియోలే ఆమెను భర్త చేతిలో హతం అయ్యేలా చేశాయి. సోషల్ మీడియా మాయలో కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. టిక్ టాక్ వీడియోల మోజులో పడి జీవితాలు నాశనమవుతున్నాయి అనడానికి ఇది మరో ఉదాహరణ.  ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్ లాల్ వీధిలో భార్యాభర్తలు ఫాతిమా, పాచూ కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. కనిగిరి మండలం తాళ్ళూరుకు చెందిన ఫాతిమా కనిగిరి లో టైలర్ పని చేసే పాచూని వివాహం చేసుకుంది. కొంత కాలంగా భర్తతో ఫాతిమాకు విభేదాలు ఏర్పడ్డాయి. భార్య ఫాతిమాకి వివాహేతర సంబంధం ఉందని, నగదు కూడా విపరీతంగా ఖర్చు చేస్తూ ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తోందనే కారణంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇలా ఉండగానే రెండు నెలల క్రితం ఫాతిమాకి ఎంపీడీవో ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం వచ్చింది. అంతేగాకుండా టిక్ టాక్ లో తాను ఆడుతూ పాడుతూ చేసిన వీడియోలు అప్ లోడ్ చేయడం కూడా ఆమెకి ఫ్యాషన్ గా మారిపోయింది. వీటన్నింటిని చూసిన భర్త.. వద్దని వాదించినా అతని మాట వినకుండా టిక్ టాక్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం ఆపలేదు ఆమె. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఈ వీడియోలు చూసి పాచూలో మరింత పెరిగింది. ఆ అనుమానం పెనుభూతంలా మారి భార్యను దారుణంగా హత్య చేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫాతిమా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించి.. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఫాతిమా హత్యకు కారణం టిక్ టాక్ అని నిందితుడి సోదరులు చెప్తున్నారు. ఫాతిమాకు టిక్ టాక్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం అంటే పిచ్చిగా మారిపోయిందంటున్నారు. మొత్తం మీద టిక్ టాక్ మోజులో పడి భర్త చేతిలో భార్య బలైపోయిన ఈ ఘటన దుమారం రేపుతోంది.  

బీజేపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక లెక్క.. నెల్లూరులో ఒక లెక్క

  భారతీయ జనతా పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకెత్తయితే నెల్లూరులో మాత్రం మరో ఎత్తు అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ప్రస్తుతం నెల్లూరు బీజేపీలో రెట్టింపు ఉత్సాహం నెలకొంది, జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఓ సాధారణ ఏబివిపి కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగారు. సింహపురికి తిరుగులేని పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టారు. జిల్లాకు చెందిన చాలా మంది నేతలకు రాష్ట్ర పదవవులు ఇప్పించారు. కాని, నెల్లూరులో బీజేపీ బలోపేతానికి కృషి చేసినా జిల్లాలో అంతగా పార్టీ పుంజుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల కార్యకర్తలు ప్రజల ఆలోచనల్లో అనూహ్యంగా మార్పులొస్తున్నాయట. మెల్లమెల్లగా కమలం పార్టీకి దగ్గరయ్యే వారి సంఖ్య పెరుగుతోందట. అందుకే ఇప్పుడు నెల్లూరులో భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ప్రజలు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదికి పది సీట్లు ఇచ్చారు. అయితే ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల్లో నిరాసక్తి కనిపిస్తోందని వినికిడి. మరోవైపు ప్రత్యక్ష దాడులు ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు టిడిపి నుంచి సపోర్ట్ కూడా అంతగా లేదన్న భావనతో వారిలో పలువురు బిజెపి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. టిడిపిలో ఎంతో కాలం పని చేసిన వారికి అక్కడ సరైన ఆదరణ కరువవడంతో బిజెపిలో చేరుతున్నారట. అలాంటి వారికి కమలం పార్టీ ముఖ్య నేతలు అండదండలు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు టిడిపికి మైనస్ గా కనిపిస్తుండగా మరోవైపు అవే బిజెపికి ప్లస్ గా మారుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. కావలిలో టిడిపి ఓట్లు వేసినవారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చివేసినప్పుడు బిజెపి నేతలే అండగా నిలిచారు. ఈ విషయంలో కమలం పార్టీ నాయకుల మధ్య పోటీ నెలకొంది, పార్టీ కార్యక్రమాలు ప్రజా పోరాటాల్లో వారు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సీనియర్ నేత కందుకూరి వెంకట సత్యనారాయణకు జాతీయ స్థాయిలో పలుకబడి ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పోటీతత్వంతో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో సుమారు నూట ఎనభై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. గాంధీజీ సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఈ పాదయాత్రకు మంచి స్పందనే వచ్చింది. దీంతో కమలం పార్టీ కేడర్ లో జోష్ పెరిగింది, స్థానిక నాయకులతో పాటు జిల్లాకొచ్చిన నేతలు వయసు మీద పడినా లెక్క చేయక పాదయాత్రను విజయవంతం చేశారన్న టాక్ వినిపించింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్, టిడిపిల్లో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇటీవలే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో వాకాటికి పెద్ద సంఖ్యలోనే అనుచరులున్నారు, వారంతా ఇప్పుడు టచ్ లోకి రావడమే కాకుండా బిజెపి లోకి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన అనుచరులు చాలా మంది బీజేపీ కండువాలు కప్పేసుకున్నారు, పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతో అతి తక్కువ కాలంలోనే పార్టీలో కుదురుకున్నారు. దీంతో జిల్లాలోని తీరం వెంబడి తడ నుంచి సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, కోవూరు, కావలి వరకు పార్టీ ఓ రేంజ్ లో పుంజుకున్నట్టు కనిపిస్తోంది.  ఇక బిజెపి నుంచి గతంలో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన కొండపల్లి గురవయ్యనాయుడు వంటి పాతతరం నేతలు కూడా ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. జిల్లా నేతలతో కలిసి మెట్ట ప్రాంతాల్లోనూ కమలం పార్టీని పటిష్టం చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు. మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి విషయానికొస్తే ఉదయగిరిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన గుండ్లపల్లి భరత్ కుమార్ జోష్ కొనసాగిస్తున్నారు. ఇక ఆత్మకూరు వెంకటగిరి లోనూ పార్టీ అభివృద్ధికి జిల్లా ముఖ్య నేతలు, పాతతరం నేతలు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అమిత్ షాని ఆత్మకూరుకు తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.  ఇటీవల నెల్లూరుకు వచ్చిన ఎంపీ సుజనా చౌదరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణలు జిల్లాలో పార్టీ బలపడుతుండటాన్ని చూసి ముచ్చట పడ్డారు. వారు లోలోపల చాలా ఆనందపడ్డారట. ఇదే జోష్ తో ముందుకు సాగితే పార్టీకి తిరుగే ఉండదని, ప్రాంతీయ పార్టీల వల్ల కలిగే నష్టాలను అధిగమించటానికి గాంధీజీ ఆశయాలను కొనసాగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు సూచించారట. మొత్తం మీద నెల్లూరు జిల్లాకు సంబంధించి గతంలో బిజెపిలో చేరికలు పెద్దగా ఉండేవి కావు కానీ, ఇప్పుడు కార్యకర్తల దగ్గర నుంచి నేతల వరకు చేరికలు బాగా పెరిగాయి. ఆ పార్టీకి ఇది శుభ పరిణామమే ఇదే విధంగా ముందుకెళ్తే పార్టీకి మంచి రోజులే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పైన పటారం లోన లొటారంలా మారిన తెలంగాణ పరిషత్ ల పరిస్థితి...

  పైన పటారం లోన లొటారంలా వుంది తెలంగాణాలో కొత్త జిల్లాల పరిస్థితి పరిపాలనా సౌలభ్యం పేరిట ఇబ్బడిముబ్బడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఉన్న పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది. పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం కొనసాగుతోంది కొన్ని చోట్ల కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రసుతానికైతే అరకొర భవనాలతో చాలీ చాలని వసతులతో ఆయా జిల్లాల కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్, మండల పరిషత్ ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్యాలయాల భవనాలు, ఫర్నీచర్, సిబ్బంది సర్దుబాటు వంటి అంశాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు కనీసం చాయ్ నీళ్ళకు పైసా లేని దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగి మూడేళ్ళు పూర్తయింది. కొత్త జిల్లా పరిషత్ లు కొత్త మండల పరిషత్తులు ఏర్పాటు జరిగి నెలలు దాటింది, నాలుగు నెలల క్రితం ఆయా జడ్పిలు మండలాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. గెలిచిన ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతలు చేపట్టారు కానీ, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే మండల జిల్లా పరిషత్ లకు మాత్రం ఇంత వరకూ నిధుల కేటాయింపు జరగలేదు. కొత్తగా ఏర్పాటైన జడ్పీలు నిధులు లేక విలవిలలాడుతుంటే కొత్త మండలాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అక్కడి నేతలు వాపోతున్నారు. పరిషత్ ల విభజన సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం పాత జడ్పీ నుంచి కొత్త జిల్లా పరిషత్ లకు ఉద్యోగులను, ఫర్నీచర్ ను సిబ్బందిని కేటాయించారు. కొత్త మండలాల ఏర్పాటు సందర్భంగా కూడా ఇదే విధానం పాటించారు. అయితే కొన్ని మండలాల్లో సిబ్బంది మినహా ఇంకేమీ సర్దుబాటు చేయలేదట, కొత్త పరిషత్తులు ఏర్పాటు సమయంలో పాత జడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు బదిలీ చేసింది. బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఇప్పటికీ పాత జడ్పీల నుంచే నెల నెలా జీతాలు చెల్లిస్తున్నారు. ఇక డైరెక్ట్ గా నియామకమైన అధికారులకు, సిబ్బందికి జీతాలకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందట. మండలాల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉందని స్థానికుల కథనం. ఉదాహరణకు ఆదిలాబాద్ జడ్పీ ఖాతాలో ప్రస్తుతం మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులు మండలాల ప్రాతిపదికన కొత్తగా ఏర్పాటైన నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేటాయించాల్సి ఉంది. ఏ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ జిల్లాకు అధిక నిధులు కేటాయించాలి. ఈ లెక్కన ఒక్కో జిల్లాకు ఎనభై ఏడు లక్షల నుంచి తొంభై లక్షల రూపాయల వరకు వస్తాయి. ప్రస్తుతమున్న నిధులు ఆయా జిల్లాలకు పంచాలంటే అందుకు చెక్ పవర్ ను ఉపయోగించాలి. డ్రా చేసిన నిధులను ఇతర జిల్లాలకు అప్పగించాలి కాని, ఆ పని ఇప్పటికీ జరగడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప పైసా కేటాయించలేని దుస్థితి నెలకొన్నది. దీంతో కొత్త జిల్లా పరిషత్తులు ఉత్సవ విగ్రహాల తీరుగా మారుతున్నాయి, నిధుల విషయమై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కార్యాలయాల నిర్వహణకే పైసలు లేనప్పుడు ఇక తాము అభివృద్ధి పనులెలా చేపట్టగలమని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన జిల్లా పరిషత్ ల సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రూపాయ్ లేని కొత్త జిల్లా పరిషత్ లు మండల పరిషత్తులు ఎందుకు అని ప్రతి రోజూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వేరే గత్యంతరం లేక కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు సొంత వనరులతో ఫర్నీచర్ సమకూర్చుకున్నారు. మరికొన్నిచోట్ల ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో అధికారులు అప్పులు చేసి ఫర్నీచర్ కొన్నారు. ఇక రోజువారీ నిర్వహణ భారంగా మారడంతో కార్యాలయాలకు వెళ్లాలంటేనే ప్రజాప్రతినిధులు అధికారులు జంకుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలనే ఆయా నేతలు, అధికారులు కోరుతున్నారు, గులాబీ పార్టీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.