జగన్ షాకింగ్ కామెంట్స్.. పవన్ ముగ్గురు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?

  ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొందరు సమర్దిస్తుండగా మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా దీనిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. సోమవారం మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన జగన్.. ఇంగ్లీష్ బోధనపై విమర్శలు చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'రాజకీయ దురుద్దేశంతోనే ఇంగ్లీష్‌ మీడియంను తప్పుబడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగీష్ బోధన అని వారం రోజుల క్రితం జీవో ఇచ్చాం. చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారి నోళ్లు తెరచుకున్నాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ జీవోను విమర్శిస్తూ వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకు?. ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఒక్కసారి ఆలోచించాలి. ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించేవారు.. వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్‌లో చదువుతున్నారు?. యాక్టర్ పవన్ కు ముగ్గురు భార్యలు, నలుగురైదుగురు పిల్లలు.. ఆ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు.?' అంటూ జగన్ విరుచుకుపడ్డారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివితేనే పోటీ ప్రపంచంలో పిల్లలు గెలవగలరని.. అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని జగన్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం తప్పనిసరని, తెలుగు లేదా హిందీ రెండో భాషగా ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలోనే ఉంటుందని.. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతూ.. నాలుగేళ్లలో పదో తరగతి వరకు అమలు చేస్తామని జగన్ తేల్చిచెప్పారు.

నీట మునిగిన జిల్లా పరిషత్ ఆఫీసు.. భవనంలోకి పాములు, తేళ్లు!!

  నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఆఫీసు నీట మునిగింది. చెరువు శిఖం భూమిలో నిర్మించటంతో భవనం చుట్టూ మోకాలు లోతు నీరు చేరింది. చౌడు భూముల్లో నిర్మించడంతో ఎప్పుడు కుప్పకూలుతుందోనని భయపడుతున్నారు జడ్పీ సిబ్బంది. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత ఈ ఏడాది కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు చేశారు. అయితే జిల్లా పరిషత్ భవనాన్ని ఉయ్యాలవాడ గ్రామం దగ్గరలో కేసరి సముద్రం చెరువు పరిసరాల్లో నిర్మించిన మండల మహిళా సమాఖ్య భవనంలో ఏర్పాటు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభించడంతో కృష్ణా జలాలు నాగర్ కర్నూల్ కేసరి సముద్రంలో చేరాయి. దీంతో భవనాల చుట్టూ నీళ్లు చేరాయి. జడ్పీ భవనం నీటిలో ఉండటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ చెప్పులు చేతిలో పట్టుకొని ఆఫీస్ కు వస్తున్నారు. నీటిముంపుతో భవనంలోకి ప్రమాదకరమైన పాములు.. తేళ్లు చేరుతున్నాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారు సిబ్బంది.  నాగర్ కర్నూల్ పట్టణానికి దూరంగా దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో జిల్లా పరిషత్ ఆఫీసు ఏర్పాటు చేయటం జనానికి ఇబ్బందిగా మారింది. చెరువు పరిసరాల్లో జడ్పీ ఆఫీసు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా చిత్తడి చిత్తడిగా మారింది. జిల్లా పరిషత్ తొలి సమావేశాన్ని కూడా ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరుపుకున్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాల్సిన భవనం ఎక్కడో దూరంగా  ఊరి నుండి వెలివేసినట్టుగా ఉంది. జిల్లాలోనే పెద్దదైన కేసరి సముద్రం చెరువు శివారులో దాదాపు 200 ఎకరాల భూమి ఆక్రమణ పాలైంది. ఎండమెట్ల పరిసరాల్లో ఆక్రమించిన భూముల్లో గెస్ట్ హౌస్ లు ఫంక్షన్ హాల్స్ నిర్మించటంతో పాటు వెంచర్ వేసి ప్లాట్లుగా మార్చారు. ప్రజావాణిలో చెరువు అక్రమాలకు అడ్డాగా మారిందని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు రైతులు. ఆక్రమణల వల్ల చెరువుల్లో నీటి సామర్థ్యం తగ్గిపోయి ఆనకట్టు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందంటున్నారు.అధికారుల నిర్లక్ష్యం.. ముందు చూపు లేకపోవడంతో జిల్లా పరిషత్ భవనం ఎందుకూ పనికి రాకుండా పోయిందని అంటున్నారు స్థానికులు.  

'మా స్కూల్.. మంచి స్కూల్'... జగన్ కొత్త ప్రోగ్రామ్

  విజయవాడలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ రోజు మన పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది మనం.. మన రాష్ట్రం..మన జాతి.. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువు అంటూ గొప్పగా సభను మొదలుపెట్టారు. ఆ చదువు ప్రతి పేదవాడికీ చెందాలి.. ఆ చదువు కోసం ఏ పేదింట్లో  ఏ తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తమ పిల్లల్ని చిరునవ్వుతో స్కూళ్ళకు పంపించాలి. అప్పుడే పేద కుటుంబాలు బాగుపడతాయంటూ హితవు పలికారు. ఆ దిశగా అడుగులు వేస్తూ డిసెంబర్ లోనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 45,000 ల స్కూళ్లు ఉండగా.. అందులోని 15,000 స్కూళ్లతో నాడూ నేడూ అనే ప్రోగ్రామ్ శ్రీకారం చుడుతున్నామని అన్నారు. ఆ 15,000 స్కూళ్ల ఫోటోలు కూడా చూపిస్తాము. నేడు ఎలా ఉందో.. మార్పు చెందాక నాడు ఎలా ఉందో అని పెట్టి స్కూళ్ల ఫోటోలను విడుదల చేస్తామన్నారు. ప్రతి స్కూళ్లో ఉండవలసినవి అన్ని సమకూరేట్టుగా చేస్తామన్నారు. ప్రతి స్కూల్లోనూ బాత్రూములు,నీళ్ళు,బ్లాక్ బోర్డ్ లు, ఫర్నీచర్,ఫ్యాన్ లు,ట్యూబ్ లైట్లు ఉండాలి. ప్రతి స్కూలుకూ ఒక కంపౌండ్ వాల్ ఉండాలి. ప్రతి స్కూల్ కు పెయింటింగ్, ఫినిషింగ్స్ జరిగి ఉండాలి. పిల్లలు స్కూళ్లకు వెళ్ళేటప్పుడు "మా స్కూల్ మంచి స్కూల్" అని చెప్పే పరిస్థితి రావాలి. ఇది కాకుండా ప్రతి స్కూళ్లోను ఇంగ్లీష్ ల్యాబ్స్ కూడా పెట్టబోతున్నామని కూడా గర్వంగా తెలియజేశారు. వచ్చే సంవత్సరం నుండి ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళో కూడా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేస్తున్నామని.. ఆ ఇంగ్లీష్ తో పాటు తెలుగు ని గానీ ఉర్ధూ గానీ ఏదైనా భాషను కూడా కంపల్సరీ సబ్జెక్ట్ గా చేస్తామని చెప్పారు.  

ప్రాణం తీసిన సెల్ఫీ.. బీటెక్ విద్యార్థిని మృతి

  స్మార్ట్ ఫోన్.. ఫ్రంట్ కెమెరా.. ఉంటే చాలు కొందరు అమ్మాయిలు పక్కన ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారు. సెల్ఫీ పిచ్చిలో బ్రతికేస్తున్నారు. బ్రతికితే ఏ బాధ లేదు కానీ.. ప్రాణాలు పొగుట్టుకునేంత వరకు తెచ్చుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే.. వరద నీటితో అన్ని నదులు కళకళలాడుతున్నాయి. గలగల పారే కృష్ణా జలాలతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో బీటెక్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. సముద్రం, నదులు, వాగుల వద్ద సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న  ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.  నరసరావుపేట, వెంగల్ రెడ్డి నగర్ కు చెందిన బీటెక్ విద్యార్థిని ధనలక్ష్మి స్నేహితులతో కలిసి స్నేహితుని పెళ్లి ఉండటంతో కండ్లగుంటకు బయల్దేరింది. అయితే దారిమధ్యలో గుంటూరు బ్రాంచ్ కెనాల్ వంతెన పై తన స్నేహితుడు ముకేష్ తో కలిసి సెల్ఫీ తీసుకోవాలనుకుంది. సెల్ఫీ అలా క్లిక్ మనడం.. ఇద్దరూ కాలువలో పడిపోవటం రెండూ ఒకేసారి జరిగాయి. ఒడ్డున ఉన్న స్నేహితులు వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు పడిపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇందులో ముఖేష్ ప్రాణాలతో బయటపడగా.. ధనలక్ష్మిని ఒడ్డుకు చేర్చేటప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ధనలక్ష్మి మృతి చెందినట్టు పరీక్షించిన వైద్యులు తెలిపారు. శుభకార్యానికి వెళుతూ కుమార్తె విగతజీవిగా మారడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

దేశమంతా ఒక రేటు..కర్నూలులో ఒక రేటు.. ఉల్లి ధరలపై లొల్లి

  కొండెక్కిన ఉల్లి ధరల్ని కంట్రోల్ చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలను చేపట్టింది. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉల్లి ధరలు దిగి వచ్చే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్లో ఉల్లి ధర 100 రూపాయలకు చేరుకున్న నేపధ్యంలో ఒక లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.  నవంబర్ 15 - డిసెంబరు 15 మధ్య కాలంలో లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకొని దేశీయ మార్కెట్ లో పంపిణీ చేయాలని ఎంఎంటీసీని కోరినట్లుగా మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని నాఫెడ్ ను ఆదేశించినట్లుగా మంత్రి తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థ ఎంఎంటీసీ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటోందని దేశీయ మార్కెట్ లో కీలకమైన నా ఫెడ్ వీటిని సరఫరా చేస్తుందని మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు.  కొండెక్కిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడంపై సామాన్య మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం చర్యలతో కొండెక్కిన ఉల్లి ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కిలో 100 రూపాయలకు చేరుకోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలో కొనాల్సిన వాళ్ళు పావు కిలో.. అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఉల్లి ధరల నియంత్రణలోకి వస్తాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.ఇదిలా ఉంటే కర్నూలు ఉల్లి మార్కెట్ లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఓ వైపు ఉల్లి ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉంటే కర్నూల్ మార్కెట్ లో మాత్రం ఉల్లికి డిమాండ్ పడిపోయింది. మార్కెట్ లో ఉల్లి పోటెత్తడంతో డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. వేరే ప్రాంతాల్లో డిమాండ్ ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేయటం లేదు. దీంతో వారం రోజులుగా ఉల్లి రైతులు మార్కెట్ లోనే పడిగాపులు గాస్తున్నారు. ఒక పక్క ఉల్లి కుళ్లిపోతుంటే అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉల్లిని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరో 8 గంటల్లో రానున్న శివసేన ప్రభుత్వం.. నేటితో మహా రాజకీయాలకు తెర

  మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మరో 8 గంటల గడువు మాత్రమే మిగిలింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో బిజెపి చేతులెత్తేయడంతో గవర్నర్ శివసేనను ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇచ్చిన గడువు సాయంత్రం ఏడున్నర గంటల వరకే ఉంది.. అందుకే ముందుగా ఎన్సీపీ చీఫ్ పవార్ తోనూ మధ్యాహ్నం తరువాత కాంగ్రెస్ చీఫ్ సోనియాతోనూ సంప్రదింపులు జరపడానికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పరుగులు తీస్తున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే శివసేన నుంచి తొలిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. సాయంత్రానికి పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగానే శరద్ పవార్ పెట్టిన షరతులకు అనుగుణంగా కేంద్రంలో భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న అరవింద్ సావంత్ తో రాజీనామా చేయించింది శివసేన. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించారు అరవింద్ సావంత్. కేంద్రం నుంచి అరవింద్ తప్పుకున్నట్లు ప్రకటించగానే ఒక్కసారిగా మహా రాజకీయాలు ఊపందుకున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు పరిస్థితిని అవకాశంగా మార్చుకోవడానికి సమావేశమవుతున్నాయి. ఈ మధ్యాహ్నం శివసేన నాయకులు రాజ్ భవన్ లో గవర్నర్ తో కూడా సమావేశమవుతారు. ప్రభుత్వం ఏర్పాటుకు మరి కొంత సమయం అడగాలని శివసేన నాయకత్వం భావిస్తోంది. ఇక ఇప్పటికైనా శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో లేదో చూడాలి.

రామ మందిర నిర్మాణమే ప్రధాన ఎజండా.. వచ్చే ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం

  దశాబ్దాల వివాదానికి తెరదించింది సుప్రీంకోర్టు. రెండు వర్గాలకు సమన్యాయం జరిగేలా అయోధ్య వివాదం పై చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించింది. అయితే  సుప్రీం ఇచ్చిన తీర్పు పై కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పును వెలువరించిన ఐదుగురు జడ్జిలపై ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశాలు ఉండటంతో జడ్జిలకు కేంద్ర ప్రభుత్వం భారీ భద్రత పెంచింది.అయోధ్య కేసు తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జిలకు భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్.. జస్టిస్ ఎన్ఎస్ఏ బాబ్డే.. జస్టిస్ డీవై చంద్రచూడ్.. జస్టిస్ అశోక్ భూషణ్.. జస్టిస్ అబ్దుల్ నజీర్ల నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించారు.వీరి నివాసాలకు వెళ్లే రోడ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. జడ్జిల వాహనాల వెంట సాయుధ బలగాలతో ఎస్కార్ట్ వాహనాలను కూడా అధికారులను సమకూర్చారు. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు మెరుపు దళాలను కూడా సిద్ధంగా ఉంచారు.అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో రామమందిర నిర్మాణం పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? నిర్మాణం పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది? అసలు మందిరం నిర్మాణం ఎలా ఉండబోతోంది ? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి.  అయోధ్యలో నిర్మించబోయే మందిరం ప్రపంచంలోనే అతి సుందరమైన ఆలయంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అతి త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించాలని ఆలోచిస్తోంది. అందుకుగానూ ఇప్పటినుండే కేంద్రం కసరత్తులు మొదలుపెట్టింది.. ట్రస్ట్ ఏర్పాటయ్యాక విశ్వహిందూ పరిషత్ బీహెచ్ పీ సహాయంతో మందిర నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని రామ జన్మభూమి న్యాస్ భావిస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయాన్ని సుందరంగా నిర్మించాలని ఆలోచిస్తోందని బీజేపీ నేతలు తెలిపారు. 2024లోపు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తుంది. 2024-25 లోపు రామమందిరాన్ని పూర్తి చేసి ఎన్నికల బరిలోక దిగాలన్న ఆలోచనతో కేంద్ర ఉన్నట్లు వివిధ వర్గాలు భావిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే రానున్న ఐదేళ్ళల్లో రామమందిర నిర్మాణమే కేంద్రం టార్గెట్ గా పెట్టుకుందని తెలుస్తుంది. పగలు.. రాత్రి.. అనే తేడాలేవి లేకుండా పని చేసి రామమందిర నిర్మాణాన్ని చకచకా పూర్తి చెయ్యాలని ఆలోచనలో ఉంది. నిర్మాణానికి కావలసిన రాతి స్తంభాలు 50 శాతం సిద్ధంగా ఉన్నాయంటూ కొందరు తెలిపారు.మిగతా యాభై శాతం స్తంభాలను కూడా అతి త్వరలోనే పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో.. రామమందిరమే ప్రధాన ఎజండాగా మోడీ ప్రచారంలోకి దిగానున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.  

ఎంత పని జరిగింది.. టిక్ టాక్ వీడియో చూసి తట్టుకోలేక ఆత్మహత్య

  టిక్ టాక్ మరొకరి ప్రాణం తీసుకుంది. చీటీ డబ్బులు తీసుకుని పరారయ్యాడని, కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, తన ఫోటోలను టిక్ టాక్ లో వైరల్ చేయడంతో ఓ తెలుగు యువకుడు కువైట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2 వేల దినార్లు తీసుకుని పరారయ్యాడు అంటూ ఫ్రెండ్స్ వైరల్ చేసిన వీడియోతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆ యువకుడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహనకుమార్ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడే పని చేసుకుంటూ ఊరిలో ఉంటున్న తల్లికి డబ్బులు పంపేవాడు. మోహన్ కువైట్ లో చిట్టీలు వేసి 2 వేల దినార్లు తీసుకుని పరారయ్యాడు అంటూ అతని స్నేహితులు దుర్గారావు , మధు తదితరులు టిక్ టాక్ లో వీడియో పోస్ట్ చేశారు.అది కాస్తా వైరల్ కావడంతో పరువు పోయిందని మోహన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.కువైట్ లోని తన నివాసంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3వ తేదీన కువైట్లో మోహన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఇండియన్ ఎంబసీ ద్వారా కువైట్ ఎంబసీని సంప్రదించి మృతదేహాన్ని స్వగ్రామం శివకోటికి తీసుకువచ్చారు.ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు శవంగా తిరిగి రావడం చూసిన మోహన్ తల్లి తల్లడిల్లింది.. ఇతర కుటుంబ సభ్యులు , స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. తన కుమారుడు చాలా మంచివాడని.. చిట్టీలు పాడే మాట నిజమే కానీ 2 వేల దినార్లు తీసుకుని పరార్ అయిన మాట అబద్ధమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ అంటే గిట్టక కావాలనే దుర్గారావు , మధు ఈ పని చేశారని భావిస్తున్నట్లు బంధువులు తెలిపారు. పోలిసులు ఇప్పటికే ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నట్లు సమాచారం.

కాచిగూడలో ప్రమాదం.. ఆగి ఉన్న రైలుని ఢీకొట్టిన మరో రైలు

  హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ నింబోలి అడ్డ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలుని, ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సిగ్నల్ లోపమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే సిగ్నల్ లోపం వల్ల అదే ట్రాక్‌పై ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు వచ్చింది. హంద్రీ ఎక్స్‌ప్రెస్ ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఎంఎంటీఎస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పి.. పక్క ట్రాక్ మీదకు ఒరిగాయి. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎంఎంటీఎస్ రైలు వేగం తక్కువ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. రైల్వే అధికారులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

ఖజానాలో చిల్లిగవ్వ లేదు... కానీ పథకం మీద పథకం... ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ!

  ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడంతో ఖజానాలో చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే నవరత్నాలు, ఎన్నికల హామీలన్నీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తోన్న జగన్మోహన్ రెడ్డి... నిధులను మాత్రం సమకూర్చడం లేదని అధికారులు వాపోతున్నారు. నిధుల కేటాయించాలని ఆదేశాలిస్తున్న జగన్... వాటిని ఎలా సమకూర్చుకోవాలో చెప్పకపోవడంతో ఆర్ధికశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. దాంతో, ఒకపక్క సీఎం ఆదేశాలు... మరోపక్క నిధుల్లేక... అధికారులు అల్లాడిపోతున్నారట. అంతేకాదు, ఉద్యోగుల జీతాలు చెల్లించిన తర్వాత ఆయా శాఖల దగ్గర కేవలం లక్షల్లో మాత్రమే డబ్బు మిగిలిందని చెబుతున్నారు. ఆర్ధిక వ్యవహారాల్లో ఇదే ధోరణి కొనసాగితే ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఆర్ధిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నా.... వాస్తవ పరిస్థితులను వివరించడానికి మాత్రం ఆయా శాఖాధిపతులు జంకుతున్నారట.  మొత్తానికి ఏపీలో ఆర్ధిక పరిస్థితి చేయి దాటిపోతోందని, ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే, ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసిన ఓ ఉన్నతాధికారి... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిధుల సర్దుబాట్లు చేయలేక సెలవుపై వెళ్లడానికి సిద్ధమైనట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి కూడా ఇంచుమించూ ఇలాగే ఉందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి... పథకం మీద పథకం ప్రకటిస్తుంటే.... నిధులు కేటాయించలేక బుగ్గన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. ఆ ఒత్తిడిని భరించలేక, త్వరలో తాను కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాలనుకుంటున్నానని తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోందని ప్రభుత్వ వర్గాల మాటలను బట్టి అర్ధమవుతోంది. మరి, ఈ గడ్డు పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.  

మహారాష్ట్రలో మహా మలుపు... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన పావులు...

మహారాష్ట్ర రాజకీయాలు మహా మలుపు తిరిగాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ... ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేమని సంచలన ప్రకటన చేసింది. తగినంత సంఖ్యాబలం లేనందున రేసు నుంచి తాము తప్పుకుంటున్నట్లు తేల్చిచెప్పింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ పంపిన ఆహ్వానంపై సుదీర్ఘంగా చర్చించిన బీజేపీ... తగినంత సంఖ్యా బలం లేనందున తాము సిద్ధంగా లేమని తెలియజేసింది. గవర్నర్ ను కలిసిన దేవేంద్ర ఫడ్నవిస్ ఈ సమాచారాన్ని తెలియజేశారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించడంతో... శివసేనకు ఆహ్వానించారు గవర్నర్‌. ఈరోజు రాత్రి ఏడున్నరలోపు తమ నిర్ణయం తెలపాలని శివసేనకు సూచించారు. దాంతో, శివ సైనికుడే... మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని మొదట్నుంచీ చెబుతోన్న శివసేన.... ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. ఒకవేళ, శివసేన-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతో, మహారాష్ట్ర పరిణామాలపై సోనియా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, ఎన్సీపీ చీఫ్ పవర్ కూడా, తమ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్నారు. అయితే, శివసేనకు మద్దతివ్వాలంటే... ఎన్డీఏ నుంచి బయటికి రావాలని ఎన్సీపీ కండీషన్ పెట్టింది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 105మంది, శివసేనకు 56మంది, ఎన్సీపీకి 54మంది, కాంగ్రెస్ కు 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు 145మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉండటంతో... శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. దాంతో, శివసేన ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, శివసేనకు ఈ రాత్రి ఏడున్నర వరకు మాత్రమే గవర్నర్ టైమివ్వడంతో.... మహా రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరగనున్నాయోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఆర్టీసీ సమ్మె వెనుక కుట్ర ఉంది... కఠిన చర్యలకు అనుమతివ్వండి... హైకోర్టును కోరిన ప్రభుత్వం

  ఆర్టీసీ సమ్మెపై మొదట్నుంచీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రభుత్వ అఫిడవిట్ లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆర్టీసీ యూనియన్లు-కార్మికులపై విరుచుకుపడ్డారు. పండగలు, ముఖ్య సమయాల్లో సమ్మెకు దిగడం యూనియన్లకు అలవాటుగా మారిందన్న ప్రభుత్వం... ఆర్టీసీ సమ్మె వెనుక కుట్ర ఉందని హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే సమ్మెకు దిగారని సంచలన ఆరోపణలు చేసింది. ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన ఛలో ట్యాంక్-బండ్ కార్యక్రమంపైనా ప్రభుత్వం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయోధ్య తీర్పుపై దేశమంతటా హైఅలర్ట్ ఉండగా, ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్ నిర్వహించారని, దాంతో భద్రతా బలగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని హైకోర్టుకు తెలిపింది. రెండ్రోజుల్లో కోర్టు విచారణ ఉండగా, ఛలో ట్యాంక్-బండ్ నిర్వహించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించింది. కేసు విచారణలో ఉండగా, ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్ బండ్ నిర్వహించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది ప్రభుత్వం. హైదరాబాద్ లాంటి సున్నిత ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం శ్రమిస్తుంటే... ఆర్టీసీ కార్మికులు ఉద్రిక్తతలు సృష్టించారని హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో అసలు చిత్తశుద్దే లేదన్న ప్రభుత్వం... యూనియన్ ఎన్నికలకు ముందు ఇలాంటి ఎత్తులు వేస్తుంటారని హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీ కార్పొరేషన్ ఆర్ధిక స్థితిగతులు బాగాలేనపుడు ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని యూనియన్లు ప్రయత్నిస్తున్నాయని  ప్రభుత్వం వివరించింది. కార్పొరేషన్ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకోకుండా, సమ్మెకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులపై పారిశ్రామిక వివాద చట్టానికి అనుగుణంగా తదుపరి చర్యలు  చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది తెలంగాణ ప్రభుత్వం. మరి, సర్కారు నివేదికపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఆర్టీసీని ఇంకెంత కాలం ఆదుకోవాలి? హైకోర్టులో ప్రభుత్వం స్ట్రాంగ్ అఫిడవిట్

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు నుంచి పదేపదే బౌన్సుర్లు, పంచ్ లు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన కేసీఆర్ సర్కారు... వాస్తవ పరిస్థితిని ఉన్నదున్నట్లు ఉన్నత న్యాయస్థానం ముందుంచింది. 2019 ఆగస్ట్ నాటికి ఆర్టీసీ 5వేల 269కోట్ల నష్టాల్లో ఉందన్న ప్రభుత్వం.... వివిధ వర్గాలకు 2వేల 209కోట్ల రూపాయలు బకాయి పడిందని లెక్కలతో సహా వివరించింది. ఆర్టీసీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఇంకెంత కాలం ఆర్టీసీని ఆదుకోవాలంటూ  ప్రభుత్వం తన నివేదికలో వ్యాఖ్యానించింది. ఆర్టీసీ.... వివిధ వర్గాలకు 2వేల 209కోట్ల రూపాయలు బకాయి పడిందన్న ప్రభుత్వం... ఆ లెక్కలను హైకోర్టు ముందు పెట్టింది. పీఎఫ్ బకాయిలు 788కోట్లు, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బకాయిలు 500కోట్లు, లీవ్ ఎన్-క్యాష్-మెంట్ బకాయిలు 180కోట్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సెటిల్మెంట్ల బకాయిలు 52కోట్లు ఉన్నాయని తెలిపింది. ఇక, మోటారు వెహికల్ యాక్టు కింద 452కోట్లు, హెచ్ఎస్‌డీ ఆయిల్ బిల్స్ 34కోట్లు, హెచ్‌వో రీజియన్, జోన్ బకాయిలన్నీ కలిపి 36కోట్లు ఉన్నాయని లెక్క చూపింది. అలాగే, అద్దె బస్సులకు 25కోట్ల ఇవ్వాల్సి ఉందని నివేదికలో వివరించింది. అసలు సంస్థ ఉద్యోగులకే ఆర్టీసీ యాజయాన్యం 15వందల 21కోట్ల రూపాయిల బకాయి పడిందని లెక్కలు చెప్పింది. ఇక, కాలం చెల్లిన 2వేల 609 బస్సులను మార్చాలంటే 750కోట్లు అవసరమని ప్రభుత్వం తెలిపింది. వచ్చే మార్చి నాటికి మరో 476 బస్సులు కాలం చెల్లుతాయని, అలాగే ఆర్టీసీ బస్సుల మరమ్మతు బకాయిలు 60లక్షలు ఉందని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలియచేసింది. ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి అంతా యూనియన్లకు తెలుసంటోన్న ప్రభుత్వం.... ఆర్టీసీకి 47కోట్లు ఇవ్వాలన్న కోర్టు సూచనను సానుకూలంగా పరిశీలించామని, అయితే కేవలం 47కోట్లతో సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదని, అయినా ఆర్టీసీని ఇంకా ఎన్నిసార్లు, ఎంతకాలం ఆదుకోవాలంటూ స్ట్రాంగ్ అఫిడవిట్‌ దాఖలు చేసింది ప్రభుత్వం. అయితే, ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, రీఎంబర్స్‌‌మెంట్ ద్వారా ఆర్టీసీకే 2వేల 2వందల కోట్లకుపైగా రావాల్సి ఉందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. మరి ప్రభుత్వ అఫిడవిట్ పై హైకోర్టు ఎలా రియాక్టవుతుందో చూడాలి.

మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి... హైకోర్టుపైనే ఆర్టీసీ కార్మికుల ఆశలు

  దాదాపు నెలన్నరగా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం దిగిరాకపోవడంతో, పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడితోపాటు నిరవధిక దీక్షలకు సిద్ధమవుతోంది. జేఏసీ నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి, లింగమూర్తి, సుధలు దీక్షలో కూర్చోనున్నారు. ఇక, ఛలో ట్యాంక్ బండ్ సందర్భంగా ఆర్టీసీ కార్మికులపై జరిగిన పోలీసుల దౌర్జన్యకాండను అన్ని కూడళ్లలో ఫొటోలను ప్రదర్శించాలని జేఏసీ నిర్ణయించింది. అలాగే, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. అదేవిధంగా 18న సడక్ బంద్‌కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఇదిలాఉంటే, హైకోర్టుపైనే ఆర్టీసీ కార్మికులు నమ్మకం పెట్టుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలతోనైనా ప్రభుత్వం దిగొస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. మీరు తేల్చుతారా... మమ్మల్ని తేల్చమంటారా అంటూ గత విచారణలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు... ఈసారి అటోఇటో తేల్చేస్తుందని భావిస్తున్నారు. దాంతో  విచారణపై తీవ్ర ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.  

ఆర్టీసీ జేఏసీ పై టియర్ గ్యాస్ ను ప్రయోగించిన పోలీసులు...

  ఆర్టీసీ జేఏసీ పిలుపు నిచ్చిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బారికేడ్ లను దాటుకుని ఆందోళనకారులు ట్యాంక్ బండ్ పైకి వెళ్లేందుకు దూసుకురావడంతో పోలీసులు వాళ్లను అడ్డుకొని లాఠి చార్జి చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆర్టీసీ కార్మికులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వాళ్ల పైకి బాష్పవాయువు ప్రయోగించారు. ఈ పరిణామాలతో సెక్రటేరియట్ లిబర్టీ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల లాఠీచార్జీ లో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. పోలీసులు వెంటపడి మరీ తీవ్రంగా కొట్ట్టడంతో కొందరు కుప్పకూలిపోయారు. ఒళ్లంతా వాతలు తేలి కొందరు, మోహం నుంచి రక్తం కారుతూ మరికొందరు కనిపించారు. గాయపడ్డ వాళ్లను కూడా పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి ట్యాంక్ బండ్ దగ్గర నుంచి తరలించారు.  మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు, అఖిల పక్షం నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి హిమాయత్ నగర్ లోని లిబర్టీ వద్ద అదుపు లోకి తీసుకొని లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ కు తరలించారు. బైక్ మీద ట్యాంక్ బండ్ దగ్గరకు వెళుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇందిరా పార్కు దగ్గర కోదండరాంను అదుపు లోకి తీసుకున్నారు. బన్సీలాల్ పేటలో వీహెచ్ ను అరెస్టు చేశారు.ఛలో ట్యాంక్ కార్యక్రమం దేనికి దారి తీయబోతోందో వేచి చూడాలి.

బీజేపీలోకి గంటా.. ఆయన వెంట మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!!

  ఏపీలో టిడిపికి మరో షాక్ తగలబోతోందా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నారా? మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే పయనించటానికి సిద్ధమయ్యారా?. ఢిల్లీలో మకాం వేసిన గంటా శ్రీనివాసరావు మాజీ టిడిపి నేతల సహాయంతో కమలనాథులతో చేతులు కలిపే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలుగు దేశం పార్టీ ని వీడే యోచన లో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఆయన మకాం వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. గంటా హస్తినలో బిజెపి ముఖ్య నేత రాంమాధవ్ తో సమావేశమైనట్లు తెలుస్తుంది. రాంమాధవ్ ని కలిసిన గంట బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. రెండు రోజులుగా టిడిపి నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ తో గంటా చర్చలు జరిపారని సమాచారం. మరోవైపు గంటాతో పాటు బీజేపీలోకి వచ్చేందుకు మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారిద్దరితో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంతనాలు సాగించినట్టు సమాచారం. గంటా వైసీపీలోకి కాకుండా బిజెపిలో చేరడం దాదాపు ఖాయమన్న వార్తలకు ఈ పరిణామాలే సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. మొత్తానికీ గంటా టీడీపీని వీడుతున్నట్లు గానే భావించాల్సి ఉంటుందని విశాఖకు చెందిన సొంత పార్టీ నేతలే వెల్లడిస్తున్నారు.ఈ విషయం పై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఆర్టీసీ 'ఛలో ట్యాంక్ బ్యాండ్' లో ఉద్రిక్తత.. పలువురికి గాయాలు

  తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు.. కార్మికులు.. నవంబర్ 9న ఛలో ట్యాంక్ బండ్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతిని నిరాకరించారు. అయినప్పటికీ భారీగా కార్మికులు ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్‌పై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అన్ని దారుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ కు చేరుకోలేని విధంగా చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసినా..ఆర్టీసీ నేతలు , కార్మికులు వాటి పైనుంచి దూకి వెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో ట్యాంక్‌ బండ్‌వైపు వచ్చే అన్ని రహదారులను కూడా  మూసేశారు. ఇప్పుడిప్పుడే కార్మికులు, పలు సంఘాల నేతలు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సెక్రటేరియట్‌ బస్టాప్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు ఓయూ జేఏసీ నేతలు ట్యాంక్ బండ్‌పై సొమ్మసిలి పడిపోయారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి తమ్మినేని వీరభద్రం, విమలక్క ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ట్యాంక్‌ బండ్ వైపు నాయకులు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

సంప్రదాయలతో కూడిన బీచ్ పార్టీ.. నవంబర్ 9,10 తేదీల్లో భీమిలి ఉత్సవాలు

  విశాఖపట్టణం అంటే అందరికీ తెలిసిందే. మరి భీమునిపట్టణం అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అదే ఇప్పుడు భీమిలిగా పిలవబడే అప్పటి భీమునిపట్నం. విశాఖ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అద్భుత పర్యాటక ప్రాంతాల్లో భీమిలి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. విశాఖకు పేరు ప్రఖ్యాతలు రాక ముందే ఓ పెద్ద పట్టణంగా చారిత్రక ప్రాంతంగా విలసిల్లింది భీమిలి. ఈ పట్టణం రానురాను కాస్త మరుగున పడింది కానీ ఇప్పటికీ అక్కడ చూడతగ్గ.. ఆస్వాదించదగ్గ.. విశేషాలెన్నో ఉన్నాయి. గతమెంతో ఘనం అనిపించేలా ఆ చరిత్రను గుర్తు చేసుకునే వేడుకలు జరగనున్నాయి. పర్యాటకులను ఆకర్షిస్తూ ఈ నెల 9,10 తేదీల్లో రెండు రోజుల పాటు భీమిలి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1861లో ఏర్పాటైన భీమిలి మున్సిపాలిటీ భారతదేశంలోనే రెండో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఏపీలో తొలి మునిసిపాలిటీ భీమిలి.. అది ఏర్పాటై 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో ప్రారంభమైన భీమిలి ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. పశ్చిమ వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్ర తీరానికి వచ్చేటప్పటికీ పల్లం కావడంతో అక్కడ సముద్ర తీరంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంటుంది. పావురాళ్ళకొండ, ప్రఖ్యాత గాంచిన నరసింహస్వామి దేవాలయం, భీమేశ్వర ఆలయం కూడా ఇక్కడే ఉన్నాయి. 16-18  శతాబ్దాల మధ్య ఐరోపా ఖండం వారు భారత దేశానికి వర్తకం చేసుకోటానికి వచ్చినప్పుడు భీమిలిలోనే డచ్ వారు అడుగుపెట్టారు. 1624లో డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు డచ్ వారికి మధ్య ఘర్షణలు వచ్చాయని చెబుతుంటారు. ఈ ఘర్షణల్లో 101 మంది సైనికులు 200 మంది స్థానికులు మరణించారని చెప్తుంటారు. ఇప్పటికీ భీమిలిలో డచ్ వారివి సమాధులు ఉండటంతో అక్కడకు వచ్చిన పర్యాటకులు వీటిని తప్పకుండా సందర్శిస్తుంటారు.  భీమిలి బీచ్ పెద్దగా లోతూ ఉండదు కాబట్టి నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. కాకినాడకు, శ్రీకాకుళానికి మధ్య 8 లైట్ హౌస్లు నిర్మించారు.వాటిలో ఉన్న ఒక దీప స్తంభం 18వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్నీ తెలియచేస్తోంది. 24 కిలోమీటర్ల పొడవున్న ఈ బీచ్ రోడ్ భారత దేశంలోని పెద్ద బీచ్ రోడ్డు లో ఒకటిగా చెబుతారు. గ్రామీణ వాతావరణం పట్టణం కలగలిసిన ఈ సాగర తీర పట్టణంలో ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తుంటారు.  ఈ నెల 9,10 తేదీల్లో జరిగే భీమిలి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎయిర్ బెలూన్ ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భీమిలి ఉత్సవ్ సమయంలో విశాఖ నుంచి భీమిలి వరకు ఉచిత బస్సులు నడపనున్నారు. ఈ ఉత్సవాలను 50 లక్షల బడ్జెట్ తో నిర్వహిస్తున్నామని తెలిపారు. భీమిలి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. భీమిలి ఉత్సవ్ సందర్భంగా ఉప్పుటేరులు, తెప్పల పోటీలు తెగ సందడి చేస్తాయి. కుర్రకారు జోరు చూపించే కబడ్డీ ఆటలు, భీమిలి ప్రత్యేక వంటకాల రుచులు, ఘుమఘుమలతో స్వాగతం పలుకుతాయి. రంగవల్లులతో ఊరంతా అందమైన హరివిల్లుల్లా కనిపిస్తుంది. డప్పుల హోరు..పులివేషాల జోరు.. సంప్రదాయ కళల ప్రదర్శనలు, సినీ కళాకారుల అభినయాలు, సంగీత విభావరులు ఒకటేమిటి రెండు రోజుల పాటు ఆద్యంతం ఆహ్లాదకరం. వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా కర్ణాటక తమిళనాడు నుంచి పర్యాటకులు విచ్చేయనున్నట్లు తెలిపారు.

సవాల్, ప్రతి సవాల్.. స్పీకర్ వర్సెస్ నారా లోకేష్!!

  మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని ఆరోపించారు. చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజలముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకెంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. హాయ్ ల్యాండ్ భూములను చంద్రబాబు తన కుమారుడి పేరిట రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని..ఈ వ్యవహారంలో సీఎం రమేష్, యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారని తమ్మినేని సీతారాం ఆరోపించారు. స్పీకర్ స్థానంలో ఉండి ప్రతిపక్ష నేతలపై బహుశా ఈ స్థాయిలో విమర్శలు చేసిన స్పీకర్ మరొకరు లేరనే చెప్పాలి. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్పందించారు. బహిరంగ లేఖ రాసి స్పీక‌ర్ స్థానాన్ని ఆగౌరవపరిచేలా మాట్లాడొద్దని కోరారు. గౌర‌వ‌నీయులైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్ శ్రీ త‌మ్మినేని సీతారాం గారికి, అధ్య‌క్షా! బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు చెందిన త‌మ‌రు అత్యున్న‌త‌మైన శాస‌న‌స‌భాప‌తి స్థానం అలంక‌రించ‌డం చాలా అరుదైన అవ‌కాశం. మీ విద్యార్హ‌త‌లు, రాజ‌కీయానుభ‌వం స్పీక‌ర్ ప‌ద‌వికే వ‌న్నె తెస్తాయని ఆశించాను. విలువలతో సభని హుందాగా నడిపిస్తా అని మీరు మాట్లాడిన మాటలు నన్నెంతో ఆక‌ట్టుకున్నాయి. విలువలతో సభ నడిపించి ట్రెండ్ సెట్ చేస్తా అన్న మీరు స్పీకర్ పదవిలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్ సెట్ చేస్తారని అనుకోలేదు. ఆరుసార్లు ఇదే స‌భ‌లో స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించిన మీరు అదే స‌భ‌కు అధ్య‌క్షులుగా ప్ర‌స్తుతం ఉన్నార‌నే విష‌యాన్ని ఒక్క‌సారి గుర్తు చేస్తున్నాను. స‌భాప‌తిగా ప్ర‌తిప‌క్ష‌నేత‌పై మీరు చేసిన వ్యాఖ్య‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌వేనా అనే అనుమానం క‌లుగుతోంది. ఎనిమిదిసార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికై, ముఖ్య‌మంత్రిగా, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ప‌నిచేసి విజ‌న‌రీ లీడ‌ర్‌గా ప్ర‌స్తుతించ‌బ‌డిన చంద్ర‌బాబుగారి గురించి 'గుడ్డలూడ‌దీయిస్తా' అంటూ మీరు చేసిన వ్యాఖ్య‌లు మీ స్పీక‌ర్ స్థానాన్ని చిన్న‌బుచ్చేలా ఉన్నాయ‌ని నాక‌నిపిస్తోంది. స‌భామ‌ర్యాద‌లు మంట‌గ‌లిసిపోకుండా కాపాడే గౌర‌వ‌స్థానంలో ఉండి..ప్ర‌తిప‌క్ష‌నేత‌ను అవమానిస్తూ మీరు చేసిన వ్యాఖ్య‌లు చాలా మంది చంద్ర‌బాబుగారి అభిమానుల్లాగే న‌న్నూ బాధించాయి. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల పార్టీ అయిన తెలుగుదేశం శాస‌న‌సభాప‌క్ష నేతని మీరు ఎన్నో మెట్లు దిగ‌జారి దూషించి..దానినే 'నేనొక ప్ర‌జాప్ర‌తినిధిగా మాట్లాడుతున్నా'నంటూ స‌మ‌ర్థించుకోవ‌డం హర్షణీయం కాదు. మీరు చేసిన వ్యాఖ్యలే సభలో సభ్యులెవరన్నా చేస్తే మీరెలా స్పందిస్తారు? వాటిని అన్‌పార్లమెంటరీ పదాలు అని తొలగిస్తారా లేక సభలో హుందాగా మాట్లాడాలి, బయట ఎలా మాట్లాడినా పరవాలేదని సూచిస్తారా? వైఎస్ హ‌యాంలో అగ్రిగోల్డ్ మోసాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో డిపాజిట్‌దారుల వివ‌రాలు సేక‌రించాం. న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి అగ్రిగోల్డ్ ఆస్తుల‌ను కాపాడాం. ఈ రోజు అగ్రిగోల్డ్‌కి సంబంధించి ఒక్క సెంటుభూమి కూడా యాజ‌మాన్యానికి, ఇత‌రుల‌కు ద‌క్క‌కుండా కాపాడింది తెలుగుదేశం ప్ర‌భుత్వం మాత్ర‌మే. బాధితుల‌కు న్యాయం చేయాల‌ని రూ.336 కోట్లు సిద్ధంచేస్తే.. అగ్రిగోల్డ్ ఆస్తుల‌పై క‌న్నేసిన వైకాపా నేత‌లే కోర్టులో కేసులు వేసి మ‌రీ అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ నిధుల నుండే రూ.264 కోట్లను పంపిణీ చేసి మిగతా రూ.72 కోట్లు మింగేశారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునేందుకు బ‌డ్జెట్‌లో కేటాయించిన రూ.1150 కోట్లు ఏమ‌య్యాయో తెలియ‌డంలేదు. మీరు ఇటీవ‌ల ఉగాండా వెళ్లారు. మిమ్మ‌ల్ని కుటుంబ‌స‌మేతంగా తాడేప‌ల్లి ఇంటికి పిలిపించుకున్న జ‌గ‌న్ గారు మీ విదేశీ ప‌ర్య‌ట‌న చాలా చ‌క్క‌గా సాగాల‌ని అభిల‌షిస్తూ పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు కూడా. అక్క‌డి స‌ద‌స్సులో మీరు తెలుసుకున్న విలువ‌లు, స‌భామ‌ర్యాద‌లు మ‌న రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి అనుకున్నాం. అలాంటిది అట్నుంచి వ‌చ్చాక మీరు ఇలా ప్ర‌తిప‌క్ష‌నేత‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మ‌మేంటో చెప్ప‌గ‌ల‌రా? అలాగే అగ్రిగోల్డ్‌తో నాకు సంబంధం ఉంద‌ని కూడా మీరు వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌ది మీరే క‌దా!అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా నాపై చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు.గౌర‌వ‌నీయ స‌భాప‌తి స్థానం నుంచి ప్ర‌తిప‌క్ష‌నేత‌పైనా, మండలి స‌భ్యుడినైన నాపైనా నిందారోప‌ణ‌లు చేయడం మీ స్పీక‌ర్ స్థానానికి స‌ముచితం కాదు. అగ్రిగోల్డ్ బాధితుల‌కు టీడీపీ హ‌యాంలో అందించే సాయాన్ని వైకాపా నేత‌లు అడ్డుకోకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టిక‌న్నా ఎక్కువ సాయమే అందేది. మీరు చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటాను అంటే నాదొక స‌వాల్‌. అగ్రిగోల్డ్‌కి సంబంధించి ఏ ఒక్క అంశంలోనైనా నాకు సంబంధం ఉంద‌ని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను. ఒక‌వేళ మీరు చేసిన ఆరోప‌ణ‌లు అన్నీ అవాస్త‌వాల‌ని తేలితే..మీరేం చేస్తారో కూడా చెప్పాల‌ని ఈ బ‌హిరంగ లేఖ ద్వారా స‌వాల్ విసురుతున్నాను. ఇటువంటి బురద జల్లే ఆలోచనలన్నిటి వెనుకా మీ పార్టీ అధ్యక్షులవారి ప్రోద్భలం, ప్రోత్సాహం ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మీ ఆరోపణలకు కూడా అదే కారణమై ఉంటుంది. కాబట్టి మీ ఆరోపణలు అవాస్తవమని తేలితే, మీరన్నట్టే ఒక ప్రజా ప్రతినిధిగా మీ పార్టీ అధ్యక్షుడి గుడ్డలూడదీసి, రాజకీయాల నుండి తప్పించేలా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తూ... ఇట్లు నారా లోకేశ్‌ ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి