మహా రాజకీయం కథ నేటితో కంచెకు చేరనుందా?
posted on Nov 8, 2019 @ 2:24PM
మహా రాజకీయం ఇటివల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అర్ధరాత్రితో మహారాష్ట్ర లోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఆయుష్షు తీరిపోతుంది. ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ పక్షంలో రాష్ట్రపతి పాలన తప్పదు. గవర్నర్ విచక్షణాధికారాన్ని వినియోగించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ను కొనసాగమని కూడా కోరవచ్చు.
ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులైనా బీజేపీ, శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న పెనుగులాట రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది. బీజేపీ, శివసేన నాయకులు కత్తులు నూరుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టటానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మొత్తం ఎమ్మెల్యేలను బాంద్రాలోని ఓ హోటల్ కు తరలించింది శివసేన నాయకత్వం. పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే నివాసానికి సమీపంలోనే ఈ హోటలుంది. మరోవైపు తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ఎగరేసుకుపోతారన్న భయంతో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవరిస్తోంది. గత అర్ధరాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్ లోని జైపూర్ కు తరలించారు.
మొత్తం మీద మహారాష్ట్ర పాలక కూటమికి ప్రజలు అధికారం ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పీఠాన్ని రెండున్నరేళ్ల పాటు తమకు ఇవ్వాల్సిందేనంటూ శివసేన పట్టుబడుతోంది. అదేంకుదరదు అయిదేళ్లు సీఎం సీటు తమకే అని బీజేపీ భీష్మించింది. ఇన్ని రోజులుగా చర్చలు, విమర్శలూ కొనసాగుతున్నా రెండు పార్టీలూ ఒక్క మెట్టు కూడా దిగేందుకు ప్రయత్నించడం లేదు. మరోవైపు మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేదు అంటున్నారు బీజేపీ నేతలు. బయటకు ఇంత రాద్ధాంతం జరుగుతునా ఇంకా తెర వెనుక మంతనాలు సాగుతూనే ఉన్నాయి.ఈ రాజకీయాలకు నేటి రాత్రితో తెర పడబోతోందే లేదో వేచి చూడాలి.