గన్నవరం పంచాయతీకి ఎండ్ కార్డ్... భవిష్యత్తులో తలనొప్పులు తప్పవా?

  గన్నవరం వైసీపీలో తీవ్ర కలకలం రేపిన వల్లభనేని వంశీ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడింది. వల్లభనేని వంశీ రాకను మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావుకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ దొరికింది. కృష్ణాజిల్లా మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితోపాటు జగన్మోహన్ రెడ్డిని కలిసిన యార్లగడ్డ... వల్లభనేని వంశీ ఇష్యూపై అరగంటకు పైగా చర్చలు జరిపారు. అయితే, జగన్ దగ్గర కూడా వంశీ రాకపై యార్లగడ్డ తీవ్ర అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, గన్నవరంలో పరిస్థితులను, ఎన్నికల సమయంలో వంశీ బెదిరింపులను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పార్టీ కోసం పని చేయాలని, మీ రాజకీయ భవిష్యత్తుకు నాదీ భరోసా అంటూ జగన్ హామీ ఇవ్వడంతో యార్లగడ్డ మెత్తబడినట్లు తెలుస్తోంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డే హామీ ఇవ్వడంతో వంశీతో కలిసి పనిచేసేందుకు యార్లగడ్డ ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. కేవలం 900 ఓట్ల తేడాతో ఓడిపోవడం, వంశీకి యార్లగడ్డ గట్టి పోటీనివ్వడంతో, ఇరువురికి ఆమోదయోగ్యమైన ఫార్ములాతో గన్నవరం పంచాయతీకి ముగింపు పలికినట్లు చెబుతున్నారు. జగన్ సిద్ధాంతం ప్రకారం వల్లభనేని వంశీ... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే, వైసీపీలో చేరాల్సి ఉంటుంది. అలా వంశీ రాజీనామా చేశాక, గన్నవరం నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే... యార్లగడ్డను బరిలోకి దింపాలనేది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. ఇక, వంశీకి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ, వంశీకే మళ్లీ గన్నవరం బాధ్యతలు అప్పగించి, ఉపఎన్నిక బరిలోకి దింపితే, యార్లగడ్డ భవిష్యత్తు ఏమిటని వెంకట్రావు అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అందుకే, వల్లభనేని వంశీ రాకను యార్లగడ్డ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, ఎన్నికల సమయంలోనూ, ఫలితాలకు ఒకట్రెండు రోజుల ముందువరకు కూడా యార్లగడ్డ, వంశీ మధ్య ఓ రేంజ్ వార్ నడిచింది. యార్లగడ్డ ఇంటికి తన అనుచరులను పంపడం... యార్లగడ్డకు ఫోన్లు చేయడం... లాంటి పనులతో వంశీ బెదిరింపులకు దిగారు. అయితే, ఇటీవల జగన్ ను కలిసిన తర్వాత కూడా యార్లగడ్డపై విరుచుకుపడ్డ వంశీ... ఇళ్ల పట్టాలు ఫోర్జరీ చేశానంటూ తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండానే తనపై కేసు నమోదు చేశారని, దీనిపై గవర్నర్, హైకోర్టు సీజేకి ఫిర్యాదు చేస్తానన్ని చెప్పుకొచ్చారు. అయితే పది రోజులు తిరక్కుండానే మీడియా ముందుకొచ్చిన వంశీ... జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే, యార్లగడ్డతో కూడా కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అయితే, వైసీపీలో చేరకముందే ఆ పార్టీలో కాకపుట్టించిన వల్లభనేని వంశీ ముందుముందు ఇంకెన్ని తలనొప్పులు తెస్తాడోనని మాట్లాడుకుంటున్నారు. జగన్ మాటను కాదనలేక ఒప్పుకున్నా... వంశీ రాకను యార్లగడ్డ జీర్జించుకోలేకపోతున్నారనే అంటున్నారు. దాంతో, ముందుముందు వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయోనన్న చర్చ గన్నవరం వైసీపీలో జరుగుతోంది. మరి, వంశీ-యార్లగడ్డ సమైక్య రాగం ఆలపిస్తారో? లేక వేర్వేరు కుంపట్లతో వైసీపీకి తలనొప్పిగా మారతారో చూడాలి.

ఇసుక విషయంలో నేతలను ఆగ్రహానికి గురిచేస్తున్న పోలీసులు......

  ఇసుక కొరత విజయనగరం జిల్లాలో సరికొత్త ఫైట్ కు తెరలేపింది. నేతలు, పోలీసుల మధ్య వివాదంగా మార్చింది. ఒకానొక దశలో జిల్లా ఎస్పీ, మంత్రి బొత్సకు మధ్య మాటల యుద్ధం జరగడం చర్చ నీయాంశంగా మారింది. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. పోలీసులు ఇష్టానుసారంగా కేసులో పెట్టడం పై వైసిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై కేసులు పెట్టిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన పోలీసుల తీరు పై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో 3 నెలల కిందట జిల్లా ఎస్పీ రాజకుమారిని ఇదే విషయంలో మందలించారు. నాటుబళ్ల పై కూడా కేసులో పెట్టిస్తే ఎలా అంటూ ప్రశ్నించి సీరియస్ అయ్యారు. మంత్రి చెప్పిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇసుక అక్రమ రవాణా పై పోలీసులు ఎడాపెడా కేసులు పెట్టేశారు. దీంతో మరోసారి ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి దృషికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వ్యవహారంపై మంత్రి బొత్సా సీరియస్ అయ్యారు. సమావేశంలో ఉన్న ఎస్పీ రాజకుమారితో విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి కేసులు పెట్టండి కాదనం కానీ మీ పోలీసులు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ విషయం పై కూడా దృష్టి పెట్టండి అంటూ పరోక్షంగా తన అక్కసును వెళ్లగక్కారు. ఇసుక అక్రమ రవాణాపై కేసులు పెట్టే పోలీసులు తమ పనితీరులో కూడా నిజాయితీగా ఉండాలి కదా అంటూ ప్రస్తావించారు. అంతేకాదు సిసిటీవీ ఫుటేజిలను పరిశీలిస్తే మీ పోలీసుల సంగతి తెలుస్తుందంటూ చురకలంటిచారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదం సమావేశాల్లో ఆసక్తిగా మారింది. ఇసుక వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటికే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పోలీసులు అలా మితిమీరి ప్రవర్తిస్తుండడం నేతలకూ అసహనంగా మారింది.ఇక దీని పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.  

నేతలల్లో ఆనందం నింపుతున్న శుభలేఖలు

గులాబీ పార్టీలో ఇప్పుడు ఆ శుభలేఖలు హాట్ టాపిక్ గా మారాయి. నేతల తలరాతలను ఆ శుభలేఖలు మారుస్తున్నాయి విషయానికి వస్తే ఆయన పేరు వెంకటేశ్వర రెడ్డి తన కొడుకు పెళ్లి కోసం సీఎంను ఆహ్వానించడానికి ప్రగతి భవన్ కు వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కూడా శుభవార్త అందింది. ఆ తర్వాత పిడమర్తి రవి కూడా ఇటీవల ప్రగతి భవన్ కు వెళ్లారు. తన పెళ్లికి రావాలని సీఎంను ఆహ్వానించారు.ఇప్పుడు ఈ పెళ్లి విషయం కూడా ఈ నేతకు గుడ్ న్యూస్ అవబోతోందా అని టీఆర్ఎస్ నేతలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి శాప్ చైర్మన్ గా ఉన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పదవి రెన్యువల్ కాలేదు. అయితే తన కొడుకు పెళ్లి కోసం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ప్రగతి భవన్ వెళ్ళారు. సిఎం కెసిఆర్ ని కలిసి శుభలేఖ ఇచ్చి పెళ్లికి రావాల్సిందిగా కోరారు. అయితే అక్కడే అద్భుతం జరిగింది.పెళ్లి కార్డు ఓపెన్ చేసి చూసినా కేసీఆర్ శాప్ చైర్మన్ హోదాలో నువ్వు ఆహ్వానించాలి అని అప్పటికప్పుడు అల్లిపురంకు ఒక పదవి రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు కూడా జీవో ఇచ్చేశారు. దీంతో వెంకటేశ్వరెడ్డి ఆనందానికి అవదులు లేవు. పెళ్లికి పిలవడానికి వెళితే పదవి రెన్యువలైందని ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అలాంటి అనుభవం ఏ ఎదురైయ్యింది.ఆయన తన కొడుకు ఎంగేజ్ మెంట్ కు సీఎం కేసీఆర్ ను పిలిచేందుకు ప్రగతి భవన్ కు వెళ్లారు. అదే హుజూర్ నగర్ గెలుపు గిఫ్ట్ ఆయనకు అందింది. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ జీవో రిలీజైంది. ఇప్పుడు ఇదే అనుభవం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవికి ఎదురైంది. తన పెళ్లి పత్రిక ఇచ్చేందుకు కేసీఆర్ దగ్గరకు వెళ్లారు. ఆయన్ను తన పెళ్లికి ఆహ్వానించారు. దీంతో ఇప్పుడు ఈయన కూడా శుభవార్త అందుతుందని ఆయన అనుచరుడు వెయిటింగ్ లో ఉన్నారు. పిడమర్తి రవి కూడా పదవి రెన్యువల్ కోసం చాలా రోజులుగా వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు పిడమర్తి విషయంలో కూడా శుభలేఖ వర్కవుటైతే మిగితా వారు కూడా తమ కుటుంబంలో జరిగే శుభకార్యాల ఆహ్వాన పత్రికలు తీసుకొని పదవి రెన్యువల్ చేయించు కుంటారని గులాబిదళంలో గుసగుస నడుస్తోంది.

ఇక పై ప్రజల కొసమే అంటున్న ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే రోజా ఏపీఐఐసీ చైర్మన్ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఇతరత్రా కారణాల వల్ల ఆమెకు మంత్రి పదవి రాలేదు. దీంతో ఆమెను ఏపీఐఐసీ చైర్మన్ చేశారు సీఎం జగన్. అయితే ఇప్పుడు రోజా సరికొత్త టార్గెట్ ఒకటి పెట్టుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలువాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతో గెలిచారు. చివరి వరకు ఆమె ఓడిపోతారనే ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆమె 2000 ల ఓట్ల బొటాబొటి మెజారిటీతో గెలిచారు. రోజాకు నియోజకవర్గంపై పట్టు లేదనే విమర్శలూ అపట్లో ఆమె పై వినిపించాయి. మెజార్టీ రాకపోవడంతో పాటు నగరిలో పరిస్థితులు ఆమెను మంత్రి పదవికి దూరం చేశాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు రోజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీఐఐసీ చైర్మన్ అయిన తర్వాత రోజా దూకుడు పెంచారు. నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు చేపట్టారు. గతంలో రోజా నియోజక వర్గాన్ని పట్టించుకోకుండా టీవీ షోల మీద ఎక్కువగా దృష్టి పెట్టారనే విమర్శలూ ఉన్నాయి. ఇకపై ఆ ముద్ర లేకుండా పూర్తిగా నియోజకవర్గానికి ప్రయార్టీ ఇవ్వాలని రోజా నిర్ణయించుకున్నారు. అందుకే ఇకపై కొత్త షోలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు నగరిలోనే రోజా ఇల్లుకట్టుకున్నారు. ఇటీవలే గృహ ప్రవేశం చేశారు. మరోవైపు రెండున్నరేళ్ల తర్వాత వైసీపీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. దీనితో విస్తరణలో అయిన బెర్తు సంపాదించాలనే లక్ష్యంతో రోజా ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రోజా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. మరి అందులో విజయం సాధిస్తారో లేదో చూడాలి.

ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడిట్ పై అశ్వతామరెడ్డి ఫైర్

    ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 44 రోజులు పూర్తయింది. మరీ నిరసనలకు ముగింపు ఎప్పుడు. ఇవాళ హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోంది. కార్మికులకు ఊరటనిచ్చే నిర్ణయం ఏదైనా వస్తుందా లేక ప్రభుత్వం చెప్పిన సమాధానానికి ఊ కొట్టి మిన్నకుండిపోతుందా, నెలన్నర రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో హోరెత్తిస్తున్నారు. సుదీర్ఘ పోరాటం తో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టువీడడం లేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని సంస్థను కాపాడటం దాదాపుగా అసాధ్యం అనే రీతిలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో అసలు ఈ సమ్మెకు ముగింపు ఎప్పుడు ఆందోళనలకూ పుల్ స్టాప్ పడేలా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జిలతో కమిటీ వేస్తాం అంటూ హై కోర్టు చేసిన సూచనను ప్రభుత్వం తిరస్కరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కమిటీ ప్రస్తావన లేదంటూ నో చెప్పింది. దీంతో సమస్య మొదటికొచ్చింది. మరోవైపు కార్మిక సంఘాల జేఏసీ ఒక్కో మెట్టూ దిగుతున్నాయి. విలీనం డిమాండ్ ను పక్కన పెట్టామని ఇప్పటికే ప్రకటించాయి. చర్చలు చేపడితే మరి కొన్ని డిమాండ్ల విషయంలోనూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వ వైఖరి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తొంది. దీంతో అసలు ఈ సమ్మె ఎన్నాళ్లు జరుగుతుంది ఎప్పటి కి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది అయోమయంగా తయారైంది.సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మొదట్నుంచీ వాదిస్తూనే ఉంది. శనివారం నాడు మరింత ఘాటుగా అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. పారిశ్రామిక వివాదాల చట్ట ప్రకారం ముందుగా సమ్మె నోటీసు ఇవ్వాలని చర్చలు జరుగుతుండగా సమ్మె చేపట్టరాదని.. కానీ కార్మికులు చట్ట విరుద్ధంగా సమ్మెకు దిగారని అఫిడవిట్లో పేర్కొంది. ఇప్పటికిప్పుడు కార్మికులు వీధుల్లో చేరతామన్న కొనసాగించటం కష్టమేనంటూ ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్ ఇచ్చారు.సునీల్ శర్మ పేరుతో ఇచ్చిన అఫిడవిట్ పై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏం తెలుసని ప్రశ్నించారు.ఎండీగా బాధ్యతలు చేపట్టిన 17 నెలల్లో కనీసం ఏడు సార్లు కూడా ఆఫీసుకు రాని వ్యక్తి అఫిడవిట్ ఇచ్చారని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టుకు సమర్పించింది రాజకీయ అఫిడవిట్ల ఉందంటూ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం పట్టువీడడం లేదు మరోవైపు కార్మిక సంఘాల దగ్గర ఉన్న నిరసన అస్త్రాలన్నీ అయిపోతున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ సమ్మెతో కార్మికులు కూలీ పనులు, వృత్తిపనులు చేసుకుంటున్నారు. మరి కొందరు అప్పులతో నెట్టుకొస్తున్నారు. జేఏసీ నేతలు తమంతట తాము గృహ నిర్బంధాలు చేసుకొని నిరసన దీక్షలు చేసినా పోలీసులు తాళాలు పగలగొట్టి మరీ దీక్ష భగ్నం చేశారు.ఈ సమ్మెకు ఫలితం ఎంటీ, కనీసం ముగింపు ఎప్పుడు ఈ ప్రశ్నలకు హై కోర్టు తీర్పు సమాధానం చెబుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. హైకోర్ట్ ఇచ్చిన కమిటీ సూచనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. సమ్మె చట్టవిరుద్ధం మాత్రమే కాదు విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అంటూ అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇలాంటి సమయంలో సోమవారం హై కోర్టు ఏం చెప్ప నుంది అనేది ఆసక్తికరంగా మారింది.

కాకినాడ బీచ్ లో యుద్ధ విన్యాసాలకు రంగం సిద్ధం

    ఇండో అమెరికన్ త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం వేదిక కానుంది. ఈరోజు ( నవంబర్ 18వ తేదీ ) నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాలకు సైనిక, నౌకా దళ సిబ్బంది బీచ్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. బీచ్ రోడ్ లోకి వాహనాల రాకపోకలు నిషేధించారు. భారత్, అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలకు కాకినాడ బీచ్ ముస్తాబైంది. 4 రోజుల పాటు తూర్పు తీరంలో అద్భుత విన్యాసాలను ప్రదర్శించేందుకు ఇండియన్ ఆర్మీ అధికారులు కార్యాచరణ చేపట్టారు. కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట అనే గ్రామ పరిధిలో ఉన్న బీచ్ లో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు. ప్రజలు ఏయిర్ షో ను వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జాతీయ విపత్తు వాటిల్లినప్పుడు రోడ్లు మూసుకుపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనే దానిపై సుమారు 150 మంది నావి బృందం విన్యాసాలను ప్రదర్శిస్తారు. నావి ప్రదర్శనలతో భద్రత దృష్ట్యా కాకినాడ బీచ్ రోడ్ లోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. బీచ్ లోకి వచ్చే వాహనాలను పిఠాపురం వైపు నుండి దారి మళ్లించారు. భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించడంలో భాగంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ హార్బర్ పరిధిలో ఈ నెల 16 వరకు విన్యాసాలు జరిగాయి. ఇప్పుడు కాకినాడ తీరంలో విన్యాసాలు కొనసాగనున్నాయి. ఈ విన్యాసాలు భారత నావికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ సంధాయక్ భారత్ ఆర్మీ లోని 7 గాడ్స్ యూనిట్ పాల్గొంటున్నాయి. ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూపర్ హెర్యులస్ విమానం ఎమ్ఐ 17 రవాణా హెలికాప్టర్ లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.

సినిమాల ప్రభావమేనా ..? 7 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన పదో తరగతి కుర్రాడు

    ఈ మధ్యకాలంలో క్రైమ్ కథలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. సినిమాల్లో కూడా థ్రిల్లర్.. క్రైం ఉంటే జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. అలా వచ్చిన కథల్లో ఒకటో రెండో కిడ్నాప్ సన్నివేశాలు ఉండకనే ఉంటాయి. అలా చూసి ఏమైనా చేసాడో ఏమో తెలీదు కానీ..హైదరాబాద్ లో పదో తరగతి చదివే బాలుడు అతి తెలివిని ప్రదర్శించాడు. ఏకంగా కిడ్నాప్ కి పాల్పడ్డాడు.14 గేళ్ళ బాలుడు మాయ మాటలు చెప్పి ఏడేళ్ల బాలుడ్ని తన వెంట తీసుకువెళ్లారు. అనంతరం భాదితుడి తండ్రికి ఫోన్ చేసి డాన్ తరహాలో మాట్లాడాడు. వెంటనే మూడు లక్షలు తీసుకు రావాలని లేదంటే నీ కొడుకు నీకు దక్కడంటూ అంటూ హెచ్చరించాడు.హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.మీర్ పేట టీఎస్ఆర్ నగర్ కు చెందిన రాజు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆయన కుమారుడు అర్జున్ ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కాలనీ లో అర్జున్ ఆడుకుంటూ.. కనిపించకుండా పోయాడు.అర్జున్ కనిపించకుండా పోయిన అరగంటకే అతడి తండ్రి రాజుకు ఒక ఫోన్ వచ్చింది. మీ కొడుకుని కిడ్నాప్ చేశాను, డబ్బిస్తే తప్ప వదలను అంటూ అవతలి వైపు నుంచి ఓ స్వరం వినిపించడంతో హడలిపోయిన రాజు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ కాల్ ఆధారంగా కిడ్నాపర్ అల్మాస్ గూడకు చెందిన వైఎస్సార్ నగర్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ పధ్నాలుగేళ్ల కిడ్నాపర్ ను చూసి షాక్ తిన్నారు.నగరం లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అతడు పదో తరగతి చదువుతున్నట్లుగా గుర్తించారు. కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకొని పీఎస్ కు తరలించారు. జల్సా లకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే పదో తరగతి బాలుడు అలా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

పోసాని, అలీని మర్చిపోయారా? మోహన్ బాబుకి పదవి ఎప్పుడు?

  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... వైసీపీకి అండగా నిలిచిన సినీ ప్రముఖులకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతోంది. 30 ఇయర్స్ పృద్వీని ఎస్వీబీసీ ఛైర్మన్ గా... విజయచందర్ ను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా... నియమించింది. అయితే, ఇప్పటివరకు కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే పదవులివ్వగా, ఇంకా చాలామంది నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లు దాటిపోతున్నా... తమకింకా పిలుపురాలేదని కొందరు అలకపాన్పు ఎక్కారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమ కంటే జూనియర్లను పిలిచిమరీ కీలక పదవులు కట్టబెడుతున్న జగన్.... తమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. ముఖ్యంగా ఆ లిస్టులో అలీ, పోసాని, మోహన్ బాబు, జయసుధ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. హాస్యనటుడు అలీ, ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విజయవాడ, లేదా గుంటూరులో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. అయితే, అప్పటికే అభ్యర్ధులు ఖరారు కావడంతో, అధికారంలోకి వస్తే, న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు అలీకి జగన్ నుంచి పిలుపు రాకపోవడంతో నిరాశగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇక,  చంద్రబాబుపై మొదట్నుంచీ ధాటిగా విమర్శలు కురిపించిన వ్యక్తుల్లో పోసాని మురళి ఒకరు. అయితే, పోసానికి కూడా ఇప్పటివరకు ఎలాంటి పిలుపూ రాలేదు. దాంతో పోసాని కాస్త ఆవేదనకు లోనైనట్టు తెలుస్తోంది. ఇక, మంచు మోహన్ బాబు... సీఎం జగన్ కు స్వయానా బంధువు.... అయితే, ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు.... చంద్రబాబుపై ఓ రేంజులో విరుచుకుపడ్డారు. ఊరూరా తిరిగి వైసీపీ తరపున ప్రచారం నిర్వహించారు. దాంతో, వైసీపీ అధికారంలోకి వస్తే... మోహన్ బాబుకి కీలక పదవి గ్యారంటీ అని ప్రచారం జరిగింది. ఒకసారి టీటీడీ ఛైర్మన్ అని... మరోసారి ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ పదవి అని... ఇలా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్న ప్రతీసారి మోహన్ బాబు పేరు తెరపైకి వచ్చింది. అయితే, ఇంతవరకు మోహన్ బాబుకి ఏ పదవీ కట్టబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవులు పొందినవారంతా మొదట్నుంచీ ఆయన వెంట నడిచివారే. విజయ్ చందర్, 30 ఇయర్స్ పృథ్వీ, లక్ష్మీపార్వతి... వైసీపీ ఆరంభం నుంచీ జగన్ కు అండగా ఉన్నారు. అలాగే, పోసాని మురళి కూడా మొదట్నుంచీ జగన్ వైపే ఉన్నారు. మిగతా వారంతా, ఎన్నికలకు ముందు పార్టీలో చేరినవారే. అందుకే, మొదట్నుంచీ తనతో నడిచినవారికే జగన్ మొదటి ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. అయితే, ఆ ప్రాధాన్యత క్రమంలో కొందరు ప్రముఖులను ఇంకా పదవులు తలుపు తట్టలేదని, కానీ కచ్చితంగా ఏదో ఒక పదవి ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, మొదట్నుంచీ జగన్ కు అండగా ఉంటూ, చంద్రబాబుపై ఒంటి కాలిపై విరుచుకుపడుతూ... ఘాటు వ్యాఖ్యలుచేసిన పోసానికి ఇంతవరకు పదవి ఇవ్వకపోవడంపై మాత్రం చర్చ జరుగుతోంది.

టీకాంగ్రెస్ లో జగ్గారెడ్డి కలకలం... గాంధీభవన్ లో గుసగుసలు....

  తూర్పు జయప్రకాష్ రెడ్డి... అలియాస్ జగ్గారెడ్డి... సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే... కేసీఆర్ ప్రభంజనంలో సైతం విజయఢంకా మోగించిన మాస్ లీడర్. ఇక, జగ్గారెడ్డి ఏం మాట్లాడినా... ఏం చేసినా సంచలనమే... పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారినా... రాజకీయాలకు అతీతంగా ప్రజా మద్దతును సంపాదించుకున్నారు. అందుకే, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి... జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నంతగా క్రేజు సంపాదించుకున్నారు. సంగారెడ్డిని కంచుకోటగా మలుచుకున్న జగ్గారెడ్డి... పంచ్ డైలాగులు పేల్చడంలోనూ... నమ్మి తన దగ్గరకి వచ్చేవారికి సాయం చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. అందుకే, పార్టీలకతీతంగా జగ్గారెడ్డికి మంచి పేరుంది. ఇక, ఏదైనాసరే నిర్మోహమాటంగా, భయం లేకుండా చెప్పగలిగే ధైర్యమున్న జగ్గారెడ్డి.... ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నించడం టీకాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసిన జగ్గారెడ్డి... పీసీసీ చీఫ్ ను మార్చాల్సి వస్తే మాత్రం తనకే అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ ముందు ప్రతిపాదన పెట్టారు. తన బయోడేటాను కాంగ్రెస్ హైకమాండ్ కు అందజేసిన జగ్గారెడ్డి... తన రాజకీయ జీవితం, ఏయే పార్టీల్లో ఏయే హోదాల్లో పనిచేసింది... అలాగే తనపై ఉన్న కేసులు, తన వ్యక్తిత్వం గురించి తెలియజేస్తూ ఏఐసీసీకి బయోడేటా సమర్పించారు. అంతేకాదు, తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే... తాను ఎన్నికల్లో పోటీ చేయనని, అలాగే, రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానంటూ తెలిపారు. అంతేకాదు, తనకు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదని, కాంగ్రెస్ ను గెలిపించడమే తనకు ముఖ్యమని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సడన్ గా జగ్గారెడ్డి రేసులోకి రావడం... కాంగ్రెస్ హైకమాండ్ కే నేరుగా బయోడేటా ఇవ్వడం... గాంధీభవన్లో టాప్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ సైలెంట్ గా ఉండి... ఇప్పుడు సడన్ గా ఎందుకిలా హడావిడి చేస్తున్నాడని సీనియర్లు చర్చించుకుంటున్నారు. అయితే, జగ్గారెడ్డే సొంతగా ప్రయత్నాలు చేస్తున్నారా? లేక జగ్గారెడ్డి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. గాంధీభవన్ లో గుసగుసలు ఎలాగున్నా, పీసీసీ పగ్గాలు కోసం జగ్గారెడ్డి ప్రయత్నాలు చేయడం మాత్రం టీకాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.  

ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఉందా ? లేదా ? ఇంకెన్ని రోజులు ఈ మొండిపట్టు

  ఆర్టీసీ కార్మికులు తల పెట్టిన సమ్మెకు తెరపడనుందా అంటే జవాబు దొరకడం కష్టమేనంటున్నాడు సగటు మనిషి. ఇప్పటికే హైకోర్టులో వివిధ రూపాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి కేసులో విచారణ జరిగింది. తాజాగా ఇవాళ మరోసారి ధర్మాసనం ముందుకు ఆర్టీసి కేసు విచారణకు రానుంది. సమ్మె చట్టబద్ధమని ప్రకటించాలంటూ దాఖలైన పిల్ పై విచారణ చేపట్టనుంది. ప్రైవేటు ఆపరేటర్ల పర్మిట్లు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ సైతం విచారించనుంది హైకోర్ట్. నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మిక జేఏసీ తల పెట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఉద్రిత్తంగా మారింది. దీక్షకు అనుమతి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. అశ్వత్థామరెడ్డి ఇంటిలోనే దీక్ష కొనసాగించగా విపక్ష నేతలు ఆయనకు మద్దతు తెలిపారు. ఇక ఇంట్లో దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు కార్మికుల సమ్మె హైకోర్టులో నేడు విచారణకు రానున్న పిటిషన్ లు సహా పలు అంశాలకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం జరగనుంది. ఇప్పటికే వివిధ పార్టీల మద్దతు కూడా వారికి తెలపడంతో సమ్మెపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. అటు ఉస్మానియాలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగించడం పై సమావేశంలో జేఏసీ నేతలు చర్చించే అవకాశం కన్పిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని పార్టీల మద్దతు తెలిపాయన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కార్మికుల సమ్మె విరమణ ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. రేపటి సడక్ బంద్ కు ఆయన మద్దతు ప్రకటించారు.

ఫోన్ ట్యాపింగా? నమ్మినవాళ్ల కుట్రా? ఫోన్ సంభాషణల లీక్ వెనుక ఉన్నదెవరు?

కరీంనగర్ జిల్లాలో ఫోన్ ఆడియో లీకేజీలు కలకలం రేపుతున్నాయి. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, ఎంపీ బండి సంజయ్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడుకున్న సంభాషణకు సంబంధించిన ఆడియోలు లీక్ అయ్యాయి. రెండు ఆడియో రికార్డింగ్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. మొదటి ఆడియోలో గత అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో బండి సంజయ్, కలెక్టర్ మధ్య సంభాషణ జరిగింది. అయితే బండి సంజయ్-కలెక్టర్ మధ్య సాగిన సంభాషణ... మంత్రి గంగుల కమలాకర్ గురించేనన్న టాక్ వినిపిస్తోంది. అయితే, కలెక్టర్ తో బండి సంజయ్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు  బయటికి రావడంతో... బీజేపీపై టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఇందులో ఏదో కుట్ర ఉందంటూ స్వయంగా మంత్రి గంగుల కమలాకరే ఆరోపిస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ లీడర్ల ఆరోపణలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటరిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని, అందుకే బండి సంజయ్-కలెక్టర్ మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ బయటికి వచ్చిందని ఆరోపిస్తున్నారు. అయినా, లీకైన ఆడియోలో బండి సంజయ్ తప్పుగా ఏమీ మాట్లాడలేదని బీజేపీ అంటోంది. గంగుల కమలాకర్ ఎన్నికల ఖర్చుతోపాటు పెయిడ్ న్యూస్ వ్యవహారాన్ని బండి సంజయ్... కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆ ఆడియోల్లో ఉంది. బండి సంజయ్ ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు లీకైన ఆడియోలను బట్టి తెలుస్తోంది. అయితే, కలెక్టర్ తో మాట్లాడిన ఫోన్ ఆడియో ఎలా బయటికి వచ్చిందని, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారని, దాన్ని ఎవరు బయటికి వదిలిపెట్టారని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పైగా అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మాట్లాడగా, దాదాపు ఏడాది తర్వాత ఆ ఫోన్ ఆడియోలు లీక్ చేయడం వెనుక టీఆర్ఎస్ హస్తముందని బీజేపీ ఆరోపిస్తోంది. బండి సంజయ్ ఫోన్ సంభాషణల లీక్ వెనుక ఏదో కుట్ర, రాజకీయ కోణం ఉందని కాషాయ దళం అనుమానిస్తోంది. ఫోన్ సంభాషణల లీక్ పై ఎంపీ బండి సంజయ్ కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోణంలో ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మొత్తానికి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ‍్మద్... ఎంపీ బండి సంజయ్ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ హాట్ టాపిక్‌గా మారగా, రాజకీయ నేతల కుట్రలో కలెక్టర్ ఇరుక్కుపోయారనే మాట వినిపిస్తోంది. మరి, ఫోన్ ట్యాపింగ్ అండ్ ఆడియో లీక్ వ్యవహారంపై కలెక్టర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

పంచాయితీ కార్యదర్శుల పంచాయితీ.. రంగులు వేసిన నిధులు కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాల సుందరీకరణ ఉత్తర్వులపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. నిధులు లేవంటూ పంచాయతీ కార్యదర్శుల మండిపడుతున్నారు. అప్పు చేసి రంగులు వేపిస్తే ఇప్పుడు బిల్లులు రాక లబోదిబోమనే పరిస్థితి నెలకొంది.పంచాయతీల పట్ల ప్రభుత్వం తీరు చూస్తుంటే.. తినటానికి తిండి లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె అన్న సామెత గుర్తుకొస్తుంది. వాటికి ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని రోజుకొక ఆదేశంతో పంచాయతీల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రామ సచివాలయాలకు పెయింటింగ్ వేయించాలంటూ పంచాయతీ కార్యదర్శులకు తాఖీదులు అందాయి. మరి నిధులు ఎలాగంటే ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టు ఉన్నతాధికారుల వైఖరి ఉంటున్నదని కార్యదర్శుల వాపోతున్నారు. గ్రామాభివృద్ధి కోసం సొంత డబ్బులను పెట్టి.. ఇంట్లో వస్తువులు కుదువుపెట్టి.. పనులు చేయించి ఆ బిల్లులు క్లియర్ కాక  కలత చెందుతున్నారు. పదకొండు నెలలుగా బిల్లులు చెల్లించక పోవడంతో గ్రామ పంచాయితీలు కష్టాల్లో పడ్డాయి. మేజర్ పంచాయతీల్లో సీఎఫ్ఎంఎస్ ఓపెన్ కాకపోవడం, మైనర్ పంచాయతీల్లో ఆ మేర నిధులు లేకపోవటంతో భారమంతా కార్యదర్శుల పైనే పడింది. జేబులోంచి డబ్బులు పెట్టి అప్పుల పాలై బంగారం కుదువ పెడుతున్నారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం విడుదల చేసిందని.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంచుకుని ఒక్క బిల్ కూడా చెల్లించడం లేదంటూ పంచాయతీ కార్యదర్శుల వాపోతున్నారు. మూడు నెలల కిందట కొన్ని బిల్లులు చెల్లించారు కానీ చాలా పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. గ్రామాల్లో ఎవరో ఒకరితో తాగునీటి మోటార్ల రిపేర్లు పైప్ లైన్ మరమ్మతులు చేయిస్తున్నారు. అయితే వారికి నెలల తరబడి చెల్లింపులు చేయ లేకపోతున్నామన్నారు. చాలామంది కార్యదర్శులు జనం ముందుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో కొందరు కార్యదర్శుల సొంత డబ్బు పెట్టి తాగు నీటి సరఫరా కోసం ట్యాంకర్లను తెప్పించారు. ఆ బిల్లులు తడిచి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు జేబులోంచి ఖర్చు చేసి సీఎఫ్ఎంఎస్ ద్వారా పంపినప్పటికీ ఫైనాన్స్ లో బిల్లులు పెండింగ్ లో పెట్టారని తెలియజేసారు.ఒక్కో గ్రామ పంచాయితీలో కనీసం లక్ష రూపాయల మేరకు బకాయిలు ఇవ్వాల్సి ఉందని చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టామని వాటికి నిధులు ఇచ్చేవారు లేక సొంతంగా మొబిలైజ్ చేసుకోవాల్సి వస్తుందని కార్యదర్శుల అంటున్నారు.స్థానిక సంస్థ ల ఎలక్ట్రోరల్ జాబితా తయారీపై ఆయా పంచాయతీల నిధుల నుంచి భరించాలని కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశించారు. ఇందుకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో తెలియక కార్యదర్శులు ఇప్పుడు తలలు పట్టుకున్నారు. గ్రామ పంచాయతీల సర్పంచ్ ల పదవీ కాలం గత ఏడాది ఆగస్టుతో ముగిసింది. అప్పటి నుంచి వాటికి ఎన్నికలు జరగక పోవడంతో 2018-19 ఏడాదికి సంబంధించి 14గో ఆర్థిక సంఘం నిధుల రెండో విడత 2019-20 కి సంబంధించిన నిధులను కేంద్రం నిలిపి వేసింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగితేనే రాష్ట్రానికి ఈ నిధులు అందుతాయి. ఇలా రావల్సిన నిధులు కేంద్రం నుంచి రాకపోవటం.. ఉన్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంచుకుని విడుదల చేయకపోవడంతో పంచాయతీల ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాయని కార్యదర్శుల చెబుతున్నారు.

ఆర్టీసీ సమ్మె వెనుక బీజేపీ వ్యూహం..! లక్ష్మణ్ లేఖతో సర్కారులో కలవరం

తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమంటోన్న బీజేపీ... అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. తెలంగాణలో బలపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న కాషాయ పార్టీ... ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ కంటే ముందుగానే స్పందిస్తూ ప్రజామద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక, ఆర్టీసీ సమ్మె విషయంలోనూ మొదట్నుంచీ కార్మికులకు అండగా నిలిచిన కమలనాథులు... కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  ఒకవిధంగా చెప్పాలంటే ఆర్టీసీ సమ్మెను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకే, ఒకవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు ఉధృతం చేస్తూనే... మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ లూప్ హోల్స్‌ను వెతికి పట్టుకుని కార్నర్ చేస్తోంది బీజేపీ. తాజాగా ఆర్టీసీ నష్టాలపై టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్... కేంద్రానికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. అసలు, ఆర్టీసీ నష్టాలకు యూనియన్లు, కార్మికులే కారణమని కేసీఆర్ ప్రభుత్వం చెబుతుంటే.... టీఆర్ఎస్ సర్కార్ వైఖరి వల్లే ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తుంటే.... ఆ ప్రయత్నాలను కేసీఆర్ అడ్డుకున్నారని లక్ష్మణ్ అంటున్నారు. అసలు, ఆర్టీసీ పెట్రోల్ బంకుల్ని... ఇతరులకు అప్పగించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు... లక్ష్మణ్ లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు, ఆర్టీసీ నష్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటోన్న లక్ష్మణ్‌.... కేంద్రం కేటాయించిన పెట్రోల్ బంకులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఎంవోయూను అతిక్రమించారని ఆరోపించారు. హెచ్‌పీసీఎల్‌... ఐవోసీతో ఆర్టీసీ చేసుకున్న ఒప్పందాల్లో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయంటోన్న లక్ష్మణ్... వాటిని రద్దు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆర్టీసీ భూముల్ని, విలువైన ఆస్తుల్ని, బంకులను నచ్చినవారికి కట్టబెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం... ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీ బంకుల్ని ఇతరులకు అప్పగించడం వల్ల... ఆర్టీసీకి రావాల్సిన కమీషన్‌లో 60శాతం ప్రైవేట్‌పరం అవుతోందని, దాంతో సంస్థ నష్టపోతోందని ఆరోపించారు. భూములను ఆయిల్ కంపెనీలకు లీజుకిచ్చి లబ్ది పొందాలని ఆర్టీసీ భావిస్తే, దానికి కేసీఆర్ ప్రభుత్వం గండికొట్టిందని లక్ష్మణ్ మండిపడ్డారు. ఆర్టీసీకి కేంద్రం కేటాయించిన పెట్రోల్ బంకులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక... పెద్ద కుంభకోణం ఉందంటూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు లక్ష్మణ్‌. అందుకే, ఆర్టీసీకి... ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందాలను బయటపెట్టి.... విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఆర్టీసీ పెట్రోల్ బంకులను ఇతరులకు కట్టబెట్టడం దారుణమైన ఉల్లంఘన అంటోన్న లక్ష్మణ్... ఆ డీలర్ షిప్పులను రద్దుచేసి, వాటిని ఆర్టీసీయే నిర్వహించుకునేలా ఆదేశించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ను కోరారు లక్ష్మణ్‌. మరి... లక్ష్మణ్ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తి :- పదవి ప్రమాణం చేసిన అరవింద్ బాబ్డే

  భారత అత్యున్నత ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బాబ్డే ఇవాళ పదవీ ప్రమాణం చేశారు. అరవై మూడేళ్ల బాబ్డే మహారాష్ట్రకు చెందిన న్యాయమూర్తి.ఆయన సుప్రీం కోర్టుకు 47వ చీఫ్ జస్టిస్ కానున్నారు. 17 నెలల పాటు అంటే 2021 ఏప్రిల్ 23 వరకు బాబ్డే  భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తారు. న్యాయకోవిదునిగా పేరు పొందిన బాబ్డే పలు కీలక కేసులో చరిత్రాత్మక తీర్పునిచ్చారు. ఇటీవల అయోధ్య కేసులో తీర్పు చెప్పిన ఐదుగురు న్యాయమూర్తుల్లో ఆయన కూడా ఉన్నారు. గత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రంజన్ గోగోయ్ పదవీ విరమణతో బాబ్డేకు అవకాశం వచ్చింది.1956 ఏప్రిల్ 24న బాబ్డే జన్మించారు. నాగ్ పూర్ లో పుట్టిన ఆయన అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. లా చదివిన తర్వాత నాగ్ పూర్ లోనే ప్రాక్టీస్ చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లి కొన్ని కేసులు వాదించారు. 2000 సంవత్సరంలో ఆయన బాంబే హై కోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండు వేల పన్నెండులో మధ్యప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2013 లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా చేరారు. అనేక కీలక కేసులో జనం మెచ్చుకునే తీర్పు చెప్పిన తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.

శ్రీ వారి లడ్డు ధర పెంచడం లేదు.. అద్దె గదుల గురుంచి త్వరలో ప్రకటిస్తాం :- టీటీడీ చైర్మన్ వైవి సుబ?

  శ్రీవారి లడ్డు ధర పెంపు పై టీటీడీ వెనకడుగు వేసింది. ధరలు పెంచడం లేదంటూ స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఇది వరకు రూ.50 రూపాయలకు భక్తులు కొనుగోలు చేసే లడ్డు విషయంలో రేటు పెంచడమో లేదా ఇది వరకు ఇచ్చే కొలతలో కొన్ని గ్రాములను తగ్గించి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉండింది. కానీ ఆ నిర్ణయం తీసుకుంటున్నట్లు బయటకు రావడం మొదలు.. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీటీడీ వెనుకంజ వేసిందనే అంటున్నారు భక్తులు. ఇదిలా ఉంటే వసతి గృహాల అద్దె కూడా పెంచుతామని.. రూ.50 , రూ.100 రూపాయల అద్దె ఉన్న వసతి గృహాలను ఏకంగా తీసేయాలని బోర్డు కమిటీ సమావేశంలో చర్చింకున్నట్లు తెలిసిందే. ఇక చెన్నైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం తమిళనాడు ప్రభుత్వం స్థలం కేటాయించిందని తెలిపారు వైవీ సుబ్బరెడ్డి. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలు భక్తులను నివ్వెర పరుస్తున్నాయి. బోర్డు మెంబర్ల నియామకం దగ్గర నుండి కొంతమంది అధికారులను.. అర్చకులను తొలగించడం.. అన్యమత ఉద్యోగులు తిరుమలలో  ఉండటం.. లడ్డు వివాదం.. చివరకి తక్కువ ధర అద్దె గదులను తొలగించడం వరకు ప్రతి విషయంలో ఏదో ఒక వాగ్వాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఈ విషయంపై మాట్లాడిన విపక్షాలకు కొడాలి నాని చాలా ఘాటుగా స్పందించారు. తిరుమల ఏమైనా మీ అబ్బ సొత్తా అంటూ ప్రశ్నించారు. ఆరు నెలల్లోనే ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తే ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులను ఎదురుకోవాలిసి వస్తుందోనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చలు జరపలేము: సునీల్ శర్మ

  ఆర్టీసీ సమ్మెపై తుది అఫిడవిట్ దాఖలు చేశారు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లను పరిష్కరించలేమని వారితో చర్చలు జరపలేమని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి విచారణ ఈ నెల 18 కి వాయిదా పడింది. ఆ రోజున విచారణ జరగనుంది అయితే ఆర్టీసీ సమ్మె వ్యవహారంపైన ఆర్టీసీ యాజమాన్యం చాలా తీవ్రంగా ఉంది. దీనిపైన పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయని ఒక అఫిడవిట్ ను హై కోర్టులో దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం హై కోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేశారు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ. యూనియన్ నేతలను టార్గెట్ చేస్తూ ఈ అఫిడవిట్ దాఖలైంది. అందులో చాలా కీలకమైనటువంటి అంశాలను పొందు పరిచారు.  తీవ్రమైన ఆర్థిక నష్టాలతో ఆర్టీసీ కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఆర్టీసీని బాగుపరిచేటువంటి  అంశం ఏ విధంగా లేదు. అసలు ఆర్థిక పరిస్థితి బాగ లేని సమయంలోనే యూనియన్ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక సమ్మె పేరుతో కార్మికులను ఇబ్బంది కలిగిస్తూ ఆర్టీసీని తీవ్ర నష్టాల్లోకి నెట్టారు అనే విషయాన్ని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని యూనియన్ నేతలు పక్కన పెట్టినప్పటికి మళ్ళీ వాళ్ళు ఏ క్షణంలోనైనా ఆర్టీసీ విలీనం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టె అవకాశాలు ఉన్నాయని అఫిడవిట్ లో సునీల్ శర్మ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం ప్రతిపక్షాలతో కలిసి యూనియన్ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టడంలో గాని ఆర్టీసీని నష్టపరచడంలో వాళ్లు అనేకమైన కుట్రలు పన్నుతున్నారనే  విషయాన్ని కూడా అఫిడవిట్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు.

బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కష్టపడుతున్న కాంగ్రెస్

  మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా ఏఐసీసీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యనేతల సూచనలు తీసుకున్న ఏఐసీసీ వాటి ఆధారంగా కార్యక్రమాలు రూపొందించబోతుంది. ఇప్పటికే బీజేపీ ఆర్ధిక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. అయితే రాఫేల్ డీల్ పై కేంద్రానికి సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వడంతో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఏఐసీసీ నిర్ణయం తీసుకోబోతుంది. డిసెంబర్ లో ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.  గత 20 రోజులుగా అనారోగ్యంతో బెంగుళూరులోని జిందాల్ ప్రకృతి నిలయంలో చికిత్స పొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఏఐసీసీ సెక్రటరీలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ చార్జిలు.. భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. డిల్లీలోని వార్ రూమ్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల సమావేశం కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తాత్కాలిక కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనీయా గాందీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. అన్నీ రాష్ట్రాల నుంచి కీలక నేతలంరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనే ప్రధాన ఎజెండాతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఎన్ని చేసినా ప్రజల్లో ఒక్కసారి పోయిన నమ్మకం అంత సులువుగా తిరిగి రాదని.. బీజేపీ చేస్తున్న మంచి పనులను ప్రజలు చూస్తూనే ఉన్నారని.. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు.

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ కు బహిరంగలేఖ.. రాజకీయ చదరంగం మొదలుపెట్టిన డీఎస్!!

  రాజకీయాల్లో అన్ని దానాల కంటే నిదానం మంచిది అన్నారు పెద్దలు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో డి శ్రీనివాస్ ఈ నినాదాన్నే పాటిస్తున్నారు. పేరుకే ఆ పార్టీలొ ఉన్నారు గాని ఆయన నోరు మెదపడం లేదు. టీఆర్ఎస్ పెద్దలతో గ్యాప్ ఏర్పడిన తరువాత ఆయన సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. అదును చూసి ఇప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఓ లేఖాస్త్రం సంధించారు.  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతుంది. మొదట్లో ఒకరిద్దరు మంత్రులు సమ్మెపై స్పందించి విమర్శల పాలయ్యారు. ఆ తర్వాత మిగతా నేతలెవరూ పెదవి కదపటంలేదు. సమ్మెపై స్పందిస్తే ఎక్కడ బాస్ ఆగ్రహానికి గురికావలసి వస్తుందోనన్న భయంతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అంశమే ఇప్పుడు గులాబీ పార్టీ వర్గాల్లో చర్చలకు దారి తీస్తుంది. ఆర్టీసీ సమ్మెపై డీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఓ వైపు సూచన చేస్తూనే మరోవైపు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. విభజన జరగని ఏపీఎస్ఆర్టీసీని ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ తన స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించడం వెనుక ఏదో కుట్ర కోణం దాగుందని డీఎస్ తన బహిరంగ లేఖలో పేర్కొనడం గమనార్హం.  అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీతో డి శ్రీనివాస్ అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ బిజెపిలో చేరడంతో పాటు అప్పటి సిట్టింగ్ ఎంపీ కవితపై విమర్శలు గుప్పించడం టీఆర్ఎస్ పెద్దలకు రుచించలేదు. దీంతో డీఎస్ కూడా పార్టీ మారుతారంటూ అప్పట్లో చర్చ జరిగింది. డీఎస్ మాత్రం తన కుమారుడుది తనది రాజకీయంగా వేరు వేరు దారులని బహిరంగంగానే చెప్పారు. ఇదే సమయంలో నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారంటూ మాజీ ఎంపీ కవిత నేతృత్వంలో ఆ జిల్లా నేతలు గులాబీ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. డీఎస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కోరారు. అయితే ఆ అంశంపై ఏ నిర్ణయం తీసుకోకుండా టీఆర్ఎస్ అధినేత పెండింగ్ లో పెట్టారు. ఈ నేపథ్యంలో పరోక్షంగా డీఎస్ ను పార్టీ నుంచి పక్కన పెట్టారన్న  వాదన కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కు డి.శ్రీనివాస్ లేఖ రాయడం తాజా కోణం. అయితే డీఎస్ మాత్రం తాను రాసిన లేఖపై ముఖ్యమంత్రి స్పందన కోసం చూస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సూచనలని పరిగణలోకి తీసుకోని కేసీఆర్ డీఎస్ లేఖని ఖాతరు చేయరని అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే డీఎస్ ను పొమ్మనలేక పొగబెట్టారాని అందువల్ల ఆయన లేఖకి పెద్దగా విలువ ఇవ్వకపోవచ్చు అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.  సమయం చూసి డీఎస్ పై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ పెద్దల భావిస్తున్న తరుణంలోనే ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాయడం ద్వారా రాజకీయ చదరంగం మొదలు పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. తనింకా ఆ పార్టీలోనే ఉన్నానని వారికి గుర్తు చేశారని అంటున్నారు. అంతేకాదు సీనియర్ రాజకీయ నేతగా ఆర్టీసీపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే డీఎస్ లేఖ రాశారని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఒక వైపు తనపై వేటు వేయాలని పార్టీ కాచుకొని ఉండడం మరోవైపు కొంతకాలం నుంచి రాజకీయంగా తెరమరుగు కావడం డీఎస్ కు మింగుడు పడటం లేదట. ఈ తరుణంలోనే టీఆర్ఎస్ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారన్న చర్చ డీఎస్ వర్గీయుల్లో కొనసాగుతుంది. మరి ఈ లేఖ వ్యవహారంపై గులాబి అధినేత స్పందిస్తారో లేదో చూడాలి.

ఇది ఫైనల్.. మహారాష్ట్ర లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న శివసేన

  మరాఠా రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఒకటై రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. అయితే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో సెట్ కాలేదు. మరో రెండు మూడు రోజుల్లో మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 5 ఏళ్ల పాటు శివసేనకే సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ , ఎన్సీపీలు అంగీకరించాయి. ఈరోజు గవర్నర్ భగతసింగ్ కోషియారిని కలిసి మెజారిటీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి మూడు పార్టీలు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరనున్నాయి.సీఎం సీటు గురించి బీజేపీ, శివసేనల మధ్య గొడవ వచ్చినందున ఆ పదవిని శివసేనకే వదిలేస్తామన్నారు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్. శివసేన తన గౌరవాన్ని తిరిగి పొందేలా సహకరిస్తామన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కూడా కుదిరింది. సీఎం సీట్ ను 5 ఏళ్ల పాటు శివసేనకే అప్పగించటం.. ఎన్సీపీ, కాంగ్రెస్ లకు ఒక్కో డిప్యూటీ సీఎం పదవి మూడు పార్టీలకు తలో 14 మంత్రి పదవులు కాంగ్రెస్, ఎన్సీపీలకు కీలకమైన హోం రెవెన్యూ అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మూడు పార్టీలతో ఏర్పడబోయే ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా పాలన చేస్తుందన్నారు శరత్ పవార్. శివసేన హిందూత్వ పార్టీనే అయిన కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం సెక్యులరిస్టు ఐడియాలజీ పై కాంప్రమైజ్ కాబోవన్నారు.  రాష్ట్ర నేతలు ఓకే చేసిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పై రేపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించనున్నారు శరత్ పవార్. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో ఇంకా కొన్ని అంశాలు తేలాల్సి ఉంది. దానిని మహారాష్ట్ర వరకే పరిమితం చేయడమా లేదంటే నేషనల్ లెవల్ లో అమలుచెయ్యటమా అనేది తేలలేదు. యూనిఫాం, సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్ ల బిల్లు, వీర్ సావర్కర్ కు భారత రత్న విషయాల్లో ఇంకా అభిప్రాయాలూ కుదరలేదు. పవార్, సోనియా మీటింగ్ లోనే విధానాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.మహారాష్ట్రలో 25 ఏళ్లు ఇక శివసేనదే అధికారమన్నారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్. రెండు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేప్పుడు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఆధారంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాల్సి ఉంటుందన్నారు.  బీజేపీ లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోదన్నారు పార్టీ స్టేట్ చీఫ్ చంద్ర కాంత్ పాటిల్. తాము మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని చెప్పారు. తమ దగ్గర అత్యధికంగా 119 మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతలతో భేటీ తర్వాత ఆయన మాట్లాడారు. హిందుత్వ ఐడియాలజీని శివసేన వదులుకుంటోందని తాను అనుకోవడం లేదన్నారు వీరసావర్కర్ ముని మనవడు రంజిత్. అలాగే వీర్ సావర్కర్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గబోదన్నారు. హిందుత్వ విషయంలో కాంగ్రెస్ మైండ్ సెట్ ను శివసేన మారుస్తుందన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తాయని ప్రశ్నిస్తూ హిందూ మహాసభ ప్రతి నిధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూటమికీ.. ప్రజాతీర్పుకు అది విరుద్ధమన్నారు. అయితే ఈ కేసు విచారణ అంత అత్యవసరం కాదని సుప్రీం ప్రస్తుతానికి విచారించలేదు. వచ్చే వారం విచారణకు వచ్చే చాన్సుంది.