మండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు..! కేంద్రం ఒప్పుకుంటుందా?

శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లులను శాసనమండలిలో చుక్కెదురు కావడం... రెండు బిల్లులను తిప్పిపంపుతూ మండలి తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు... అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ల ఏర్పాటు బిల్లుల ఆమోదం మండలి కారణంగా ఆగిపోవడంతో ఏకంగా శాసన మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులను మండలి ఆమోదించకుండా తిప్పిపంపడంతో మరోసారి శాసససభలో ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, రెండోసారి కూడా మండలి తిరస్కరించి పంపితే అప్పుడు శాసనసభ నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లులను మండలి ఆమోదించకుండా తిప్పిపంపడాన్ని జగన్ సర్కారు అత్యంత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో, ఏకంగా మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  58మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో టీడీపీకి 26మంది మెంబర్స్ ఉండటంతో ప్రతిపక్షానిదే పైచేయిగా ఉంది. అధికార వైసీపీకి కేవలం 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దాంతో, మండలిలో అనేక విషయాల్లో ప్రతిపక్ష తెలుగుదేశానికే పైచేయిగా ఉంటుంది. శాసనసభలో వైసీపీ సభ్యులు.... టీడీపీని ఆడుకున్నట్లే.... మండలిలో అధికారపక్షాన్ని... తెలుగుదేశం వాళ్లు ఆటాడుకుంటున్నారు. దాంతో, ముఖ్యమంత్రి, మంత్రులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక, నారా లోకేష్ మండలిలో ఉండటం కూడా సీఎం జగన్ కు ఇబ్బంది మారిందనే మాట వినిపిస్తోంది. నారా లోకేష్ కు ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉండటంతో... అన్నేళ్లు మండలిలో అతడిని చూడటం జగన్ కు ఇష్టంలేదని, అందుకే రద్దు దిశగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే, శాసనమండలిని రద్దు చేయాలంటే లోక్ సభ, రాజ్యసభల్లో చర్చ జరిపి తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రాన్ని ఒప్పించుకుంటే ఇది ఈజీగా జరిగిపోయే పనే. అయితే, ప్రస్తుతమున్న మోడీ ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారు. అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే జరిగే అవకాశముందంటున్నారు.

వైజాగ్ లో అప్పుడే కేపిటల్ పనులు ప్రారంభం... ఏప్రిల్ నుంచే కార్యకలాపాలు...!

రాజధానిపై జగన్ సర్కారు నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇంకా రానే లేదు... కానీ, అసెంబ్లీ వేదికగా ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముందే ప్రభుత్వ నిర్ణయాన్ని దాదాపు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అప్పుడే పనులు కూడా ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టుకోవచ్చన్న జగన్....  అక్కడ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలకు కావాల్సిన పనులను    ప్రారంభించేశారు. అయితే, ప్రభుత్వ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం మేరకు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల కోసం పరదేశిపురం ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ కోసం విశాఖ పరిసరాల్లో దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించారు.  అంతేకాదు ఇప్పటికిప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలను విశాఖ నుంచి జరిపేందుకు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన రెండున్నర లక్షల చదరపు అడుగుల క్యాంపస్ ను వినియోగించుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించిన ఈ భవనాలను ఇమిడియట్ యూజ్ కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే, ఆంధ్రా యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న భవనాలను ప్రభుత్వం గుర్తించింది. అవసరమైతే ఈ బిల్డింగ్స్ ను కూడా అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల కోసం వినియోగించుకోవాలని చూస్తోంది. ఇక, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ నివాసం కోసం భీమిలి దగ్గర సముద్ర తీరంలో మూడు ఎకరాల భూమిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే, భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించనుండటంతో ఎయిర్ కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది.  మూడే మూడు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2020 ఏప్రిల్ లోపే మొత్తం ఏర్పాట్లు పూర్తిచేసి అధికార యంత్రాంగాన్ని తరలించనుంది. ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా పర్ ఫెక్ట్ గా సాగేందుకు పార్టీలో ఐదుగురు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక, రాజ్ భవన్ కోసం కూడా అనువైన ప్రాంతాన్ని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

జాతీయ రహదారి చెక్ పోస్ట్ లు అధికారుల లంచాలకు అడ్డాగా మరాయా?

పట్ట పగలు అని కూడా లెక్క చేయకుండా జాతీయ రహదారి పై అధికారులు చేతివాటం తెగ చూపించేస్తున్నారు. ఏపీ నుండి పొరుగు ప్రాంతాలకు అదే విధంగా రాష్ట్ర సరిహద్దు మీదుగా ఇసుకను ఎలాంటి అక్రమ రవాణాకు తావు లేకుండా నిబంధనల మేరకు ఆయా ప్రాంతాలకు తరలించే క్రమంలో ప్రభుత్వం అన్ని జిల్లాల్లో తనిఖీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. పంచాయితీ రాజ్ ఆధ్వర్యంలో అన్ని చెక్ పోస్టులలో ప్రత్యేక శిబిరంతో పాటుగా తనిఖీ గేటును ఏర్పాటు చేసి సీసీ కెమెరాలకు అనుసంధానం చేసేలా తగిన చర్యలను ఉన్నతాధికారులు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా తమిళనాడు సరిహద్దులోని పెరియవట్టు కుప్పం వద్ద జాతీయ రహదారి పై ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 24 గంటల పాటు ఇసుక రవాణా పై అప్రమత్తంగా ఉండేలా తగిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ డ్యూటీ చేస్తున్న సిబ్బందికి చేతి వాటం పెరిగింది. వచ్చిన వాహనంలో ఏముందని గుర్తించకుండా ఇతరత్ర వాహనాల పై దృష్టిపెడుతున్నారు. ఆంధ్రా మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి ఓ అట్టల చెత్త లారీని డ్యూటీ పోలీసులు ఆపారు. వాహనంలో ఏముందంటూ మాటలు కలిపాడు. రవాణాకు చెందిన కాగితాలు ఉన్నాయా అంటూ డ్రైవర్ చూపించిన కాగితాలను చూసి సరే అన్నాడు. మరి తన సంగతి ఏంటంటూ నిర్భయంగా పట్టపగలే కాసులు డిమాండ్ చేస్తూ చేయిచాచాడు. వాహన డ్రైవర్ ఇచ్చిన నగదు సరిపోకపోవటంతో మరింత కావాలనీ అడిగి మరీ తీసుకొని కానీ వాహనానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.చెత్తను తరలించే వాహనానికి చెయ్యి తడపాలన్న డ్యూటీ సిబ్బంది అక్రమ ఇసుకను తరలించే వాహనాల వస్తే పండుగ చేసుకున్నట్లే అవుతోంది. మరి ఇక ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి తంతుల పై ఏం చెబుతారో చూద్దాం.

నిర్భయకు ఎప్పటికి న్యాయం జరిగేను...

పాత తీర్పు పై సమీక్ష అక్కర్లేదు..ఉరి తీయాల్సిందే.. అని నిర్భయకేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశం ఇవ్వడంతో బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆ దుర్మార్గులకు త్వరలోనే ఉరి అనే వార్తలొచ్చాయి. కానీ, అంతలోనే ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఉరికి ఇంకా సమయం పట్టేలా ఉంది. నిర్భయ మరణించి 7 ఏళ్ళు గడిచినా ఇప్పటికి దోషులు హాయిగా జైల్లో జీవితాన్ని గడుపుతునే ఉన్నారు. ఉరికి రంగం అంతా సిద్ధం,ఉరి తాళ్ళు కూడా సిద్ధం అన్న మాటలకు మళ్లీ బ్రేక్ పడింది..నిర్భయ కేసులో దోషులకు డెత్ వారెంట్ పై ఢిల్లీ కోర్టు విచారణను వాయిదా వేసింది .ఈ కేసు విచారణ జనవరి 7డవ తేదీకి వాయిదా పడింది. తక్షణమే డెత్ వారెంట్ విడుదల చేయాలన్న నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్ ను న్యాయస్థానం పక్కనపెట్టింది. దోషులకు కూడా కొన్ని హక్కులుంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే కోర్టు తీర్పు పై కన్నీరుమున్నీరయ్యారు నిర్భయ తల్లిదండ్రులు.14 రోజుల్లో ఆ నలుగురిని ఉరి తీయాలని నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ లో పేర్కొన్నారు. తీహార్ జైలు అధికారులకు కూడా పాటియాలా హౌస్ కోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే ఆలోచన ఉందేమో కనుక్కోవాలని తీహార్‌ జైలు అధికారులకు సూచించింది. అందుకు వారం రోజులు గడువు విధించింది.  కాగా, పాటియాలా హౌస్ కోర్టు తీర్పు పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు నిర్భయ తల్లిదండ్రులు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న మృగాళ్లు జీవించటానికి న్యాయస్థానం మరింత కాలాన్ని ఇవ్వడం దారుణమన్నారు. నిందితులకు డెత్ వారెంట్ విడుదల చేయకపోవడం పై నిర్భయ తల్లి కన్నీరుమున్నీరయ్యారు. న్యాయస్థానం తమ వాదనలు పట్టించుకోవడం లేదని, ఏడేళ్ళపాటు క్షోభ అనుభవించామని వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు కోర్టు నిందితులకి సహకరిస్తుందో వారి విషయంలో ఎక్కువ జీవితం గడిపే సమయాన్ని ఎందుకు కల్పిస్తుందో తెలీక వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క దెబ్బకు వంద పిట్టలు... కేసీఆర్ ఝలక్ మామూలుగా లేదుగా..!

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. యూనియన్ నేతలకు ఇచ్చే అన్ని రకాల ఆన్ డ్యూటీ సౌకర్యాలను రద్దు చేశారు. అసలు యూనియన్లు అంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో యూనియన్లపై తీవ్ర స్థాయిలో ఫైరైన కేసీఆర్.... చివరికి ఆర్టీసీ సమ్మెపైనా, యూనియన్లపైనా పైచేయి సాధించి‌... ఆ తర్వాత అసలు యూనియన్లే ఉండొద్దంటూ మాట్లాడారు. దాంతో ఆర్టీసీ యూనియన్ల ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. ఇక, ఇంటర్ బోర్డు వ్యవహారంతో జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘాన్ని, ఇతర సంఘాలను నామరూపాలు లేకుండా చేశారు. దాంతో, ఉపాధ్యాయ సంఘాలు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నాయి. అయితే, ఇదే తరహాలో అన్ని ఉద్యోగ సంఘాలపై ఉక్కుపాదం మోపబోతోందని తెలుస్తోంది. అయితే, యూనియన్ సంఘాల నేతలు విధులకు వెళ్లకుండా మినహాయింపు ఉంటుంది. ఈ మినహాయింపు కింద దాదాపు 25మంది రాష్ట్రస్థాయి నేతలకు ఆన్ డ్యూటీ సౌకర్యం ఉంటుంది. జిల్లాస్థాయి నేతలు కూడా అధికారులను మేనేజ్ చేసుకుని అనధికారికంగా ఆన్ డ్యూటీలో కొనసాగుతున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం... ఉద్యోగ సంఘాల నేతలకు ఉన్న అన్ని రకాల ఆన్ డ్యూటీ సౌకర్యాలను రద్దు చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని ఉద్యోగ ఉపాధ్యాయ నేతలను ఆదేశించింది. జిల్లా స్థాయిలో కూడా ఎవరికీ అనధికారిక ఆన్ డ్యూటీ సౌకర్యం ఇవ్వొద్దని కలెక్టర్లకు, డీఈవోలకు, ఇతర అధికారులకు ఆర్డర్స్ ఇచ్చింది. దాంతో, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, యూనియన్ల ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, యూనియన్ల నేతలకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కొద్దిమందికైనా ఆన్ డ్యూటీ సౌకర్యం ఇవ్వాలంటూ కోరుతున్నారు. కానీ, యూనియన్ నేతల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోందని అంటున్నారు.

అమరావతి బంద్... సచివాలయం దగ్గర దీక్షలు

ఏపీలో రాజధాని రగడ మరింత తీవ్రమవుతోంది. మూడు రాజధానుల సంకేతాలపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. రాజకీయాలకు తమను బలి చేయొద్దంటూ కోరుతున్నారు. రాజధాని ప్రాంత బంద్ కు పిలుపునిచ్చిన 29 గ్రామాల రైతులు పెద్దఎత్తున నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఏపీకి మూడు రాజధానులు రావొచ్చంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే గానీ, పరిపాలనా వికేంద్రీకరణ కాదని ప్రభుత్వానికి అమరావతి రైతులు సూచించారు. రాజధాని ప్రాంత బంద్ కి పిలుపునిచ్చిన అమరావతి రైతులు.... సెక్రటేరియట్ దగ్గర నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాజధాని ఉద్యమం చేయాల్సి సమయం వచ్చిందని అమరావతి రైతులు అంటున్నారు. ఏదిఏమైనాసరే, మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  

వైఎస్‌లో ఉన్న గుణాలు జగన్‌లో లేవు.. రాజారెడ్డిలాంటివాడు జగన్‌ 

మా వాడు మా వాడు అంటూనే ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద విమర్శలు చేయడం టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి అలవాటు. తాజాగా మరోసారి జగన్‌పై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన టీడీపీ సభలో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ.. జగన్‌ ఎలాంటివాడో నేను గతంలోనే చెప్పా. జగన్‌ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా.  మావాడి సంగతి మీకు తెలియదు. వైఎస్‌లో ఉన్న 10శాతం మంచిగుణాలు కూడా జగన్‌లో లేవు. అచ్చం రాజారెడ్డిలాంటివాడు జగన్‌ అంటూ వ్యాఖ్యానించారు జేసీ. ఆ సమయంలో వేదికపై చంద్రబాబు కూడా ఉన్నారు. ఇంకా జేసీ మాట్లాడుతూ.. చంద్రబాబులో కూడా మార్పు రావాలని అన్నారు. శాంతివచనాలతో సంకనాకించారని.. ఇప్పటికైనా బాబు శాంతివచనాలు పక్కనబెట్టాలని సూచించారు. గతంలో మన ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పినా వినలేదన్నారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేల కంటే మన ఎమ్మెల్యేలే 100 శాతం నయమని చెప్పుకొచ్చారు. చప్పట్లు కొట్టే వాళ్లను పట్టించుకోవద్దని జేసీ హితవు పలికారు.

నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం.. త్వరలో ఉరి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్‌ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌‌ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఉరిశిక్షపై పునఃసమీక్షించబోమని జస్టిస్ ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్, హత్య కేసులో తనకు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలంటూ అక్షయ్ పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారం ఈ కేసు విచారణ నుంచి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తప్పుకున్నారు. తన బంధువు ఒకరు ఈ కేసుని వాదించినందున తాను దీనిపై తీర్పు చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. దీంతో జస్టిస్ ఆర్. భానుమతి నేతృత్వంలోని  త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ కేసుపై విచారణ చేపట్టింది. తీర్పు పునఃసమీక్షించబోమని స్పష్టం చేసింది. సుప్రీం నిర్ణయంతో నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పింఛను విషయంలో పునరాలోచన లేదు.. కలెక్టర్లకు తేల్చి చెప్పిన సీఎం జగన్

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాప్రతినిధులు , అధికారులు ప్రజా బాట పట్టాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్. కలెక్టర్లుకు, ఎస్పీలకు ఇచ్చిన ప్రత్యేక విందులో ఆయన కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార యంత్రాంగం ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు జనవరి నుంచి గ్రామాల బాట పట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఆదేశాల అమలులో గందరగోళపడవద్దని సందేహాలుంటే సీఎంఓతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎసైలకు, సీఎం జగన్ ప్రత్యేక విందు ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని డిజిపి గౌతం సవాంగ్, జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక టేబుల్ ను ఏర్పాటు చేశారు. ఆ టేబుల్ చుట్టూ ఆ జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు కూర్చున్నారు. సీఎం, సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారులు ప్రతి టేబుల్ దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడారు. విందు కార్యక్రమానికి సీఎం రాక ముందే ఆయన కార్యాలయం అధికారులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడారని సమాచారం.ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయ సామాజిక ఆర్థిక సమస్యలు పాలనా పరమైన ఇబ్బందులు తదితర అంశాల పై వివరాలు తీసుకున్నారు. జనవరి నుంచి నేతలతో కలిసి గ్రామాల బాట పట్టేందుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని సీఎం వెల్లడించారు.గత ఆరు నెలల్లో పేదల సంక్షేమం కోసం తెచ్చిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఒక్క అవినీతిలో తప్ప మిగతా అన్ని అంశాల్లో మీరు కలిసి మెలిసి పని చేయాలని,పాలు నీళ్ళలా కలిసిపోవాలని,వారి మధ్య చక్కటి సమన్వయం నెలకొనాలి అని సీఎం తెలియజేశారు.2,3 లక్షల మంది ఓట్లేస్తే ఎమ్మెల్యేలు గెలిచారు. వారికి ప్రాధాన్యం ఇవ్వండి. వారు ఫోన్ చేస్తే ఎత్తండి, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతి నిధులు రాత్రి తొమ్మిది తర్వాత అధికారులకు ఫోన్లు చేయకపోవడమే మంచిదని, ఏ సమస్యా సందేహం తలెత్తినా సీఎంవో అధికారులు తోడుగా ఉంటారని సీఎం తెలిపారు.జనవరి ఒకటి నుంచి గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిగా పని చేస్తాయని చెప్పారు. పింఛన్ అమలు పై పెట్టిన నిబంధనలు కొంత కఠినంగా ఉన్నాయని వాటి వల్ల చాలా మంది పేర్లు జాబితా నుంచి తొలగించాల్సి వస్తుందని.. రూల్స్ ను సవరిస్తూ చాలా బాగుంటుందని ఓ కలెక్టర్ విన్నవించారు. దీని పై సీఎం స్పందిస్తూ రూల్స్ ను మార్చేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన వారికి న్యాయంగా పింఛను దక్కేలా నిబంధనలు తీసుకువచ్చామని వాటిని మార్చేది లేదని తేల్చి చెప్పారు. ఇసుక విషయంలో గందరగోళం వద్దని సూచించినట్టు సమాచారం.

దక్షిణాఫ్రికా మూడు రాజధానుల కథ-కష్టాలు... ఏపీలోనూ తప్పవు తిప్పలు...

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... అందుకు ఉదాహరణగా దక్షిణాఫ్రికాను ప్రస్తావించారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇందులో కొంత వాస్తవం... కొంత అవాస్తవముంది. ఎందుకంటే, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉండటం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఆర్ధిక, చారిత్రక, సామాజిక రీజన్స్ కనిపిస్తాయి. సౌతాఫ్రికాలో చట్టసభలు అంటే శాసన విభాగం కేప్ టౌన్ ఉండగా.... న్యాయ వ్యవస్థ మొత్తం బ్లూంఫౌంటేన్ లో ఉంది. ఇక, కార్య నిర్వాహక వ్యవస్థ అదే జగన్ చెప్పిన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ప్రిటోరియాలో కొలువుదీరింది. దాంతో, దక్షిణాఫ్రికా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ  ప్రిటోరియా నుంచే కొనసాగుతాయి. అయితే, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ జాతుల ప్రజల కోరిక మేరకు ఇలా మూడు రాజధానులను కొనసాగిస్తున్నా... ఇందుకు మరెన్నో కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతమున్న దక్షిణాఫ్రికా... ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఒక వైపున బ్రిటీషర్లు... మరో వైపున డచ్, జర్మనీలు కలిసి పాలించే వారు. డచ్, జర్మనీల పాలనలో ఉన్న రాజ్యాలను బోయెర్ రిపబ్లిక్ లుగా వ్యవహరించే వారు. అయితే, బ్రిటీషర్లకు ఇతర చిన్న రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. యుద్ధంలో గెలిచిన బ్రిటీష్.... ఓడిపోయిన బోయెర్ రిపబ్లిక్ ల మధ్య చర్చలతో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడింది. అయితే, అప్పుడు బ్రిటీష్ ఆధీనంలో ఉన్న కేప్ ప్రావిన్స్ కు కేప్ టౌన్ రాజధానిగా ఉండేది. బోయెర్ రిపబ్లిక్ ఆఫ్ ట్రాన్స్ వాల్ కు ప్రిటోరియా రాజధానిగా ఉండేది. ఆరెంజ్ ఫ్రీ స్టేట్ అనే మరో బోయెర్ రిపబ్లిక్ కు బ్లూమ్ ఫౌంటెన్ రాజధానిగా ఉండేది. యుద్ధానంతర చర్చల తర్వాత ఈ మూడు నగరాలనూ రాజధానులుగా కొనసాగిస్తూ వచ్చారు.  అయితే, 1994లో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి పాలన ముగిసి ప్రజాస్వామ్యం దిశగా పయనం మొదలైంది. దాంతో, ప్రిటోరియానే అన్నిటికీ రాజధాని చేయాలని కొందరు అంటే.... జాత్యంహంకారానికి ప్రతిబింబంగా ఉండే ప్రిటోరియా బదులుగా కొత్త రాజధాని నిర్మించుకుందామని మరి కొందరు అన్నారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కూడా కొత్త నగరానికే ప్రాధాన్యం ఇచ్చింది. కాకపోతే కొత్త నగరం అంటే ఖర్చు అధికమనే భావనతో ఆ ప్రతిపాదనను వదిలేశారు. మరో వైపున మూడు విభిన్న తెగల వాళ్ళు అప్పటివరకూ రాజధానులుగా కొనసాగిన తమ నగరాలు అదే హోదాలో కొనసాగాలని డిమాండ్ చేశారు. ఒక్కో చోట ఒక్కో పార్టీ అధికారంలో ఉండడంతో మూడు రాజధానుల వాదన కొనసాగింది. ఇదీ దక్షిణాఫ్రికా మూడు రాజధానుల కథ.  దక్షిణాఫ్రికా ఫ్రీడమ్ ఫైటర్, సౌతాఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా కూడా, మూడు రాజధానులను వ్యతిరేకించారు. మూడు రాజధానుల నిర్వహణ భారంగా మారడంతో కార్యకలాపాలన్నీ ఒకేచోట  నుంచి నిర్వహించేందుకు ప్రయత్నించారు. సింగిల్ కేపిటల్ కోసం ఒక కమిటీని కూడా నియమించారు. 2016లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జాకబ్ జుమా కూడా ఒకే రాజధానిని ఏర్పాటు చేసుకుందామంటూ సౌతాఫ్రికా పార్లమెంట్ ను అభ్యర్ధించారు. మూడు రాజధానులతో ప్రభుత్వ వ్యవస్థపై నియంత్రణ సాధ్యంకావడం లేదని, అలాగే నిర్వహణ భారం పెరిగిపోతోందని అన్నారు. చారిత్రక నేపథ్యంతో సాతాఫ్రికాకు మూడు రాజధానులు కొనసాగుతున్నాయే తప్పా.... ప్రజల సౌకర్యం, సౌలభ్యం కోసం మాత్రం కాదనేది తెలుస్తోంది. పైగా మూడు రాజధానుల నిర్వహణ సౌతాఫ్రికాకు భారంగా మారింది. ఇప్పుడు ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే, ప్రజలకు కష్టాలు తప్పవు. ఎందుకంటే, ఉత్తరాంధ్రకు రాయలసీమ దూరం కాగా... రాయలసీమకు ఉత్తరాంధ్ర కూడా బహు దూరమే. అటు ఉత్తరాంధ్రకు... ఇటు రాయలసీమకు మధ్యలో ఉన్న అమరావతే అన్నింటినీ బెటర్ ఆప్షన్.

9 మందిని ఇదే విధంగా రేప్ చేసి చంపేసిన దిశా నిందితులు!!

దిశా కేసు నిందితుల గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిందితులు గతంలో తొమ్మిది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. నిందితుల డీఎన్ఏ తో మిస్టరీ కేసులను చేధించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఆరిఫ్ అలీ, చెన్న కేశవులు హత్యలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా మహబూబ్ నగర్,రంగారెడ్డి, కర్ణాటక ,హైదరాబాద్ హైవేల పై జరిగిన దారుణాల పై ఫోకస్ పెట్టారు పోలీసులు. లైంగిక దాడి చేసిన తరువాత వారిని హత్య చేసి పారిపోయినట్లు అనుమనిస్తున్నారు. ఈ విధంగా పదిహేను మృతదేహాలను గుర్తించారు పోలీసులు. ఈ పదిహేను మోడల్ కేసులోని డీఎన్ఏ రిపోర్టులు కూడా పరిశీలిస్తున్నారు.దిశా హత్య కేసులో చార్జిషీట్ వేయటానికి  కంటే ముందుగానే ఈ పదిహేను కేసులను ఛేదించాలనేది పోలీసులే టార్గెట్గా కనిపిస్తుంది. వాస్తవానికి చటాన్ పల్లి ఎన్ కౌంటర్ సమయంలో ఇతర కేసుల్లో నిందితుల పాత్ర పై సీపీ సజ్జనార్ అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటకలో జరిగిన ఈ తరహా ఘటనల్లో వీరి పాత్ర పై దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పారు. దీనికి తోడు ఎన్ కౌంటర్ లో చనిపోయిన నిందితులు ఆరీఫ్, చెన్నకేశవులు నవీన్ శివా డీఎన్ఏలు ఆయా హత్య కేసులతో మ్యాచ్ అవుతున్నట్టుగా నిర్థారించారు. అందుకే నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ బృందాలు ఆ హత్య కేసులో నిందితుల పాత్ర పై ఆరా తీయబోతున్నట్లు సమాచారం. ఇక నిందితుల పూర్తి వివరాలు వారి గురించి అసలు విషయాలను పోలీసులు చేదించే పనిలో పడ్డారు.

యాదాద్రికి వెళ్లిన కేసీఆర్.. 100 ఎకరాల స్థలంలో యాగనిర్వహణ!!

ముఖ్య మంత్రి కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. కొండపై ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపం, అంతర ప్రాకార మండపం, రామానుజ కూటం, యాగశాల, నిత్య కల్యాణ మండపం అద్దాల మండపంతోపాటు, సప్తగోపురాలు, ఆలయ ప్రధాన మండపం, ముఖమండపం, ఉపాలయాలు, అపురూప ఆధ్యాత్మిక మూర్తుల శిల్పాలను సీఎం పరిశీలించారు. 2 గంటల పాటు ప్రధాన ఆలయ మండపంలో కలియతిరిగిన కేసీఆర్ రాతిశిలా నిర్మాణ పనులను అద్భుతంగా చేశారని కొనియాడారు. పనులు ఆధ్యాత్మికత ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి వారు స్వయంభువుగా వెలసిన గర్భాలయాన్ని కేసీఆర్ సందర్శించారు.ఆలయ ప్రధానార్చకులు అనువంశిక ధర్మకర్త ఆలయ ఈవోతో కలిసి స్వయంభూమూర్తులను పరిశీలించారు. ఆ తర్వాత ప్రధాన ఆలయం ముఖమండపం తదితరాల్లో కూడా పరిశీలించారు. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం ఏమాత్రం దెబ్బతినకూడదని ఎక్కడ ఏ మాత్రం తొందరపాటు వద్దని కేసీఆర్ తెలియజేశారు. ప్రతి నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరగాల్సిందే నని స్తపతులు అధికారులకు స్పష్టం చేశారు. యాదాద్రి నర్సిపూడి ఆలయం సనాతమైనదని ఇక్కడ పూజలు చాలామందికీ వారసత్వంగా వస్తున్న సంప్రదాయమని గుర్తు చేశారు.దేశ విదేశాల్లో లక్ష్మీనరసింహుడికి భక్తులు ఉన్నారని రాబోయే కాలంలో లక్షల మంది వస్తారని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు.తద్వారా గర్భాలయంలో మూలవిరాట్టును ముట్టుకున్నారంటూ వస్తున్న ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలిసింది.  లక్షలాది మంది భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయాన్ని సందర్శించేలా సంపూర్ణంగా పనులు పూర్తి చేసి చెబితే చినజీయర్ స్వామితో కలిసి మరోసారి వచ్చి అన్ని పనులు పరిశీలించి ఆలయ ఉద్ఘాటన సుదర్శన మహాయాగం నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పచ్చదనం కోసం ఉద్యానవనాలను పెంచాలనే ప్రాంగణంలో లక్ష్మీనరసింహుల ప్రాశస్త్యం చాటేలా నృసింహ చరితం, స్థలపురాణం, తైలవర్ణ చిత్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు వసతి తలనీలాలు పుణ్య స్నానాల విషయంలో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. క్యూలైన్ల నిర్మాణం, పుష్కరిణి ప్రసాదాల తయారీ కాంప్లెక్స్ తదితరాల పరిశీలించి సూచనలు చేశారు.కొండ పై శివాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ ఆలయ వైశాల్యాన్ని అడిగి తెలుసుకుని కొలతలు వేయించారు.శివాలయం ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహమూర్తి తో అక్కడ జరిగే పూజలు కావలసిన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అర్చకుల నియామకాలు జరపాలని ఈవోకు సూచించారు.కొండ కింద గండి చెరువు వద్ద దాదాపు 100 ఎకరాల స్థలంలో యాగనిర్వహణకు అనుకూలతల పై అధికారులతో చర్చించారు. సందర్శకులకు సౌకర్యాలు వాహనాల పార్కింగ్ పై సూచనలు చేశారు. రాష్ట్రపతి ప్రధాన మంత్రి వంటి ప్రముఖులు ఆలయ సందర్శనకు వచ్చినపుడు వారికి సకల సౌకర్యాలతో ప్రెసిడెన్షియల్ సూట్లు ఉండాలని ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు 15 సూట్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు.

జగన్ సర్కార్ షాక్.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు పింఛన్ రాదు

పట్టణాల్లో పేదలకు కట్టించే ఇళ్లు నామమాత్రంగా కాకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పట్టణ పేదలకు గూడు సైజు సౌకర్యాల గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలకు.. తాజాగా ఇంటి స్థలంతో ముడిపెట్టి సామాజిక పింఛన్ లకు నిర్ణయించిన అర్హతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు.. పేద దంపతులు పట్టణంలో తమకు సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం మూడు సెంట్లు కావాలి. 750 చదరపు అడుగులు ఉంటే తాజా అర్హత నిబంధనల ప్రకారం వారు పేదలు కాదు. కాబట్టి వారికి పింఛను అందదు. అలాగే కొద్ది జీతాలకు పని చేసే అంగన వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వీఏవోలు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబాల్లో పింఛనుకు అర్హులు ఉన్నా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఇక పై అనర్హుల కింద లెక్కే అని తేల్చేసింది ప్రభుత్వం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పింఛన్ల సైజును పెంచటమే కాక అర్హత నిబంధనలను భారీగానే సడలించింది. ఇంత చేసి ఈ విధంగా అర్హతలను నిర్ణయించి అనర్హులు మిగిలే ఉన్నారన్న ఆలోచన ప్రభుత్వంలో మొదలైంది. అటువంటి వారిని ఏరి వేసే పని చేపట్టింది ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 54 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. అందులో 5 లక్షల దాకా ఏరివేతకు గురవుతాయని భావిస్తున్నారు. అందుకోసం పెట్టిన కొన్ని నిబంధనలు పేదవర్గాల్లో చిన్న ఉద్యోగి శ్రేణుల్లోనూ భయాందోళనను పెంచుతున్నాయి.  రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంగన వాడీ కార్యకర్తలు చెరో లక్ష మంది ఉండగా.. వీఐవోలు ఆశాలు కలిపి 60,000 వేల మంది దాకా ఉంటారు. ఏరివేత మొదలైతే తక్షణం దెబ్బ వీరిపైనే పడనుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్ రూ.2000 నుంచి రూ.2,250 ఇస్తూ నాలుగేళ్ళలో రూ.3000 వరకు పెంచుతామని ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. పెన్షన్ లు 250 కలిపి ఇవ్వడం మాత్రమే అమలు చేసిన ప్రభుత్వం అదే ఉత్తర్వుల్లో 60 ఏళ్ల వయస్సున్న వారికి ఇస్తామన్న ఆదేశాలను అమలులోకి తీసుకురాలేదు. పాదయాత్రలో.. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పింఛన్ల పై ఇచ్చిన హామీల మేరకు కొత్తగా సుమారు పది లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ నెల ( డిసెంబర్ ) 13న విడుదలైన పింఛన్ ల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలు కొత్త వారిని ఉద్దేశించి జారీ చేసినట్టు అధికారులు ప్రకటించారు. అదే నిజమైతే ఇబ్బంది లేదు కానీ కొత్త వారికి ఇవ్వడానికి ఇప్పటికే అందుకుంటున్న వారికి వాతపెడతారని.. పింఛన్ లను అమలుపై జగన్ మార్పు కోసమే ఇదంతా చేస్తున్నారన్న ప్రచారం సర్వత్రా బలపడుతుంది. అధికారులు ఎందుకు తమ సంతకాలు తీసుకుంటున్నారో తెలియక ఇక పై పింఛన్ రాదేమోననే భయంతో అక్కడక్కడా సిబ్బందిని పెన్షన్ దారులు నిలదీస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శు లతో గొడవకు దిగుతున్నారు.

మాకొద్దు దొరా.. తెలంగాణ సీఎస్ పదవిపై వెనకడుగు వేస్తున్న ఐఏఎస్ అధికారులు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి ఈ నెల ( డిసెంబర్ ) 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇప్పట్నుంచే అధికారుల గురించి సర్కారు పెద్దలు ఆరా తీయడం ఆ పదవి గురించి ఐఏఎస్ లు చర్చించుకోవడం సహజంగానే జరుగుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం సీఎం కేసీఆర్ 14 మంది పేర్లను పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే వారిలో చాలా మంది అయిష్టం గానే ఉన్నట్టు తెలిసింది. గతంలో ఈ పోస్టు కోసం రెండు మూడు నెలలకు ముందే సీనియర్ ఐఏఎస్ అధికారులు క్యూ కట్టేవారు. తమ సీనియారిటీ ధ్రువపత్రాలని ప్రభుత్వానికి సమర్పించేవారు. తమకే అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసే వారు. ఎవరికి వారు తమ తమ స్థాయిలో ప్రయత్నాలు చేసేవారు. సీనియార్టీ ప్రకారం సీఎస్ పోస్టు దక్కకుంటే ట్రిబ్యునళ్లను సైతం ఆశ్రయించి దాని సాధించే అంత పోటీ ఉండేది. అయితే ఇప్పుడు అంతగా ఎవరూ ఆసక్తి చూపడం లేదని చెపుతున్నారు. అనేక సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పుడు సిఎస్ పదవి ఎందుకని కొందరు ఐఎఎస్ లు అనుకుంటున్నారు. సిఎస్ కు ఉన్న అధికారాల విషయంలోను ప్రభుత్వం బ్రేక్ వేయడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. సిఎస్ పరిధిలో ఉన్న అధికారాల అంశాల్లో కూడా సీఎంఓ జోక్యం చేసుకుంటోందనే భావన ఉంది. సచివాలయం లేకపోవటం అరాకొర వసతులు ఉన్న బిఆర్ కె భవన్ కు వెళ్లడానికి అయిష్టత లాంటి కారణాల వల్ల కూడా అనాసక్తితో ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా శాఖల సమీక్షలు సమావేశాలకు కూడా ముఖ్యమంత్రి సీఎస్ ను ఆహ్వనించకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎస్ కు ఉన్న అధికారాలని ప్రశ్నార్థకం చేస్తున్న తరుణంలో ఆ పోస్టు తీసుకోవడం ఎందుకు ఆ తరువాత ఆపసోపాలు పడటం ఎందుకని ఐఏఎస్ లు లైట్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

రాపాక మాస్టర్ ప్లాన్.. జనసేన నుండి సస్పెండ్ అవ్వడానికే ఇష్టానుసార వ్యాఖ్యలు!!

తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు ఎన్నికయ్యారు. జనసేన నుంచి మొత్తం రాష్ట్రంలోనే ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక. అయితే ఇప్పుడాయన తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ నుంచి సస్పెండ్ కావాలని చూస్తున్నారు. జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరితే కొత్త చిక్కులు వచ్చిపడతాయని భావిస్తున్నారు. అధికార వైసీపీలో చేరదామా అంటే రాజీనామా చేసి రావాలని షరతు పెట్టారు. రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు వెళ్లి రిస్క్ చేయడం రాపాకకు అస్సలు ఇష్టం లేదు. తన గెలుపుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జనసేనను వీడి వైసీపీలో చేరి పోయారు. ఫలితంగా రాపాక రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మరోవైపు తన ప్రత్యర్థి బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రాపాక ఎన్నిక చెల్లదని హై కోర్టులో రిట్ వేశారు. రాపాక అనుచరులపై కేసులు పెట్టించి ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే పలు సందర్భాల్లో ఆరోపణలు సైతం చేశారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు వైసీపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు రాపాక.  సీఎం జగన్ జిల్లాలో పాల్గొనే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం జగన్ చిత్రపట్టానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై విమర్శలు చేస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే రాపాకకు మధ్య దూరం పెరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే రాపాక ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. పవన్ మండపేటలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి చేపట్టిన పర్యటనలో రాపాక పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడం టిడిపి సస్పెండ్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సభలో ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తించడంతో రాపాకలో మార్పు వచ్చింది.పవన్ కల్యాణ్ కాకినాడలో చేపట్టిన జనసేన రైతు సౌభాగ్యం దీక్షకు రాపాక గైర్హాజరయ్యారు. దీనిపై పవన్ కళ్యాణ్ సీనియర్ నాయకులతో సీరియస్ గానే చర్చించారు. రాపాక మరో అడుగు ముందుకు వేశారు. ఏకంగా జనసేనకు భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. ఇలాగే ఉంటే జనసేనలో కొనసాగడం కష్టమని తేల్చి చెప్పారు. నెలకొకసారి అధినేత పవన్ కల్యాణ్ జనాల్లోకి వస్తానంటే పార్టీకి భవిష్యత్తు ఉండదు అంటూ రాపాక చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారాయి. అప్పుడప్పుడూ కనిపించి వెళ్ళిపోడానికి ఇది సినిమా కాదని ఏకంగా అధినేతపైనే మీడియా ముందు విమర్శలు సంధించారు. సీఎం పదవిపై వ్యామోహం లేదని పవన్ వ్యాఖ్యానించటం వల్లే ప్రజల్లో నమ్మకం పోతుందని అన్నారు. జగన్ లాగా కష్టపడితేనే జనసేనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అయితే ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు జనసేన నుంచి సస్పెన్షన్ కు గురి కావడం కోసమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజోలులో జనసేన కార్యకర్తలు కొందరు దూరమైనా సామాజిక వర్గం మద్దతు ఉంటుంది అనేది రాపాక ఆలోచన. ప్రత్యేక సభ్యుడిగా ఉంటే వైసీపీ ప్రభుత్వానికి దగ్గరగా ఉండొచ్చని వైసీపీ ఎమ్మెల్యేలా కొనసాగవచ్చనే ఉద్దేశంతో రాపాక ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈనేపధ్యంలో రాజోలులో రాజకీయ పరిణామాలు మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తో రాజకీయ విభేదాలు కొనసాగిస్తున్న వైసీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావును ఆ పార్టీ అధిష్ఠానం బాధ్యతల నుంచి తప్పించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గా పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన రాజేశ్వరరావు త్వరలోనే రాజోలు నుంచి అమరావతికి వెళ్ళబోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబోయే ఓ కమిటీ లోకి ఆయనను తీసుకుంటున్నారు. తద్వారా జనసేన ఎమ్మెల్యే రాపాకకు స్థానికంగా వైసీపీ నాయకులతో గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉండదని అనుకుంటున్నారు. ఇక పై ఆయన అనధికారికంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినట్లే అని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు.

3 రాజధానులతో ప్రజలకు లాభమా? నష్టమా?

అధికార వికేంద్రీకరణ... మూడు రాజధానులు... అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి... సెక్రటేరియట్ ఒక చోట... హైకోర్టు మరో చోట... అసెంబ్లీ ఇంకో చోట... ఇలాంటి మాటలు చెప్పడానికి... వినడానికి బాగానే ఉంటాయి... కానీ వాస్తవంలో మాత్రం ప్రజలకు కష్టాలు తెచ్చిపెడతాయి. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌.... కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్‌.... అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్‌.... ఇలా ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి సంకేతాలిచ్చినా ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగమనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే, అధికార వికేంద్రీకరణ విధానం మంచిదంటూ స్టేట్ మెంట్ ఇచ్చినంత ఈజీగా ప్రజలకు మేలు జరగనే జరగదు. అందుకే, జగన్ చెప్పిన మూడు ప్రాంతాలు ...రాజధానులుగా ప్రజలకు ఎంతవరకు సౌలభ్యమనేది ఆలోచించారు. ఎందుకంటే, రాజధాని అనేది అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరంలో సెంట్రల్ పాయింట్ లో ఉంటేనే అందరికీ సౌలభ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, విశాఖ, కర్నూలు... ఈ రెండూ కూడా కశ్మీరూ... కన్యాకుమారి మాదిరిగా ఒకటి మ్యాప్ లో మొదట ఉంటే.... రెండోది చివర్లో ఉన్నట్లు ఉంటాయి. అమరావతి-విశాఖ మధ్య దూరం 352 కిలోమీటర్లు.... అలాగే, అమరావతి-కర్నూలు మధ్య దూరం 342 కిలోమీటర్లు... అంటే, అమరావతి నుంచి విశాఖ మధ్య దూరం ఎంతుందో.... అమరావతి నుంచి కర్నూలు మధ్య డిస్టెన్స్ కూడా దాదాపు అంతే ఉంది. దాంతో, అమరావతి నుంచి కర్నూలు వెళ్లాలన్నా.... విశాఖ వెళ్లాలన్నా.... ప్రమాణ సమయం రెండింటికీ దాదాపు ఏడెనిమిది గంటలే పడుతుంది. అయితే, విశాఖ నుంచి కర్నూలు రావాలన్నా..... కర్నూలు నుంచి విశాఖ వెళ్లాలన్నా.... సుమారు 15గంటల సమయం పడుతుంది. దాంతో, కోర్టు పనుల కోసం ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలు రావాలన్నా.... రాయలసీమ ప్రజలు సెక్రటేరియట్‌ కోసం విశాఖ వెళ్లాలన్నా ...చాలా వ్యయప్రయాసలు తప్పవు. ఎందుకంటే, విశాఖ - కర్నూలు మధ్య దూరం 691 కిలోమీటర్లు. అంటే, ప్రయాణానికే దాదాపు ఒకరోజు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇది, చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నదే కాకుండా ప్రజలరు తమ విలువైన సమయాన్ని కూడా కోల్పోతారు. మూడు రాజధానుల ప్రతిపాదన వినడానికి బాగానే ఉన్నా... ఆచరణలో మాత్రం వ్యయభారం, కాలాతీతంతో ప్రజలకు కష్టాలు తెచ్చే అవకాశముంది. ఎవరైనా ఒక వ్యక్తి మూడు రాజధానుల్లో పనులు చక్కబెట్టుకోవాలంటే విలువైన సమయాన్నీ, సొమ్మునీ కోల్పోక తప్పదు. అయితే, అటు ఉత్తరాంధ్రకు.... ఇటు రాయలసీమకు సమాన దూరంలోనూ... రాష్ట్రానికి సెంట్రల్ పాయింట్ గా ఉండే అమరావతే... ఏపీకి రాజధానిగా ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అంటున్నారు.

పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం... జగన్ పై నిప్పులు చెరిగిన బాబు

ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు భగ్గుమన్నారు. కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై జగన్ ఎలా ప్రకటన చేస్తారంటూ ప్రశ్నించారు. జగన్‌ చర్యలు పిచ్చి తుగ్లక్‌‌ను తలపిస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తే జగన్ ఎక్కడ్నుంచి పరిపాలన చేస్తారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు... విశాఖలో ఉంటారా? కర్నూలులో ఉంటారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం నిలదొక్కుకుంటున్నవేళ జగన్ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోతుందన్నారు. ప్రజలు తమ పనుల కోసం అమరావతిలో ఒక ఇల్లు.... కర్నూలులో మరో ఇల్లు కట్టుకోవాలా? అన్నారు. జిల్లాకో ఆఫీస్‌... మండలానికో కార్యాలయం పెట్టుకోండి ఇంకా బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. సంపదను సృష్టించే ఆదాయ వనరుగా అమరావతికి రూపకల్పన చేశామని చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఆదాయ వనరుగా అమరావతిని డిజైన్ చేశామన్నారు. ప్రతీ తెలుగుబిడ్డ గర్వించే ప్రపంచస్థాయి నగరం రావాలన్నదే అందరి ఆకాంక్షన్న చంద్రబాబు... పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని అమరావతిని నిర్మించాల్సిన అవసరముందన్నారు. అయితే, రాష్ట్ర భవిష్యత్ ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని జగన్ చర్యలపై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు సమ్మతం తెలిపారని చంద్రబాబు అన్నారు. 2014 సెప్టెంబర్ 4న అసెంబ్లీ వేదికగా జగన్ తన నిర్ణయం చెప్పారని బాబు గుర్తుచేశారు. విజయవాడలో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు ఆనాడు జగన్ అన్నారని... అలాగే, రాజధాని ప్రాంతంలో కనీసం 30వేల ఎకరాలు ఉండాలని సూచించారని.... ఆనాటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను బాబు చదివి వినిపించారు. కానీ, ఇప్పుడు తనపై కక్షతో అమరావతిని చంపేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

చలిని జయించిన ఉల్లి :- ఉదయాన్నే ఉల్లి కోసం రైతుబజార్ల వద్ద బారులు తీరుతున్న జనం

    కేజీ ఉల్లి కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. బయట మార్కెట్లో ఉల్లి కొనే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం ఉదయాన్నే కౌంటర్ల దగ్గరకు భారీగా తరలివెళ్తున్నారు. డిమాండ్ కు తగ్గ కౌంటర్లు లేకపోవటంతో కొన్ని చోట్ల తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా పార్వతీపురం రైతు బజార్ లో జరిగిన భారీ తోపులాటలు జరుగుతున్నాయి.ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా జనం ఉదయాన్నే బారులు తీరారు. కౌంటర్ ఒక్కటే కావడంతో వందల మంది జనం కౌంటర్ గేటు వెలుపల ఎదురు చూస్తున్నారు. ఒక్క సారిగా గేటు తీయడంతో లైనులో నిలబడేందుకు జనం ఎగబడ్డారు.ఈ క్రమంలోనే ఒకరి పై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. చిన్నపిల్లల కూడా ఉండటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్నవారు కింద పడ్డ వారికి సహాయం అందించటంతో ప్రమాదం తప్పింది. సరిపడా కౌంటర్లు లేకపోవడం తోనే తొక్కిసలాట జరిగిందని అధికారులు కౌంటర్లు పెంచాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

ముచ్చటగా మూడు... మనసులో మాట బయటపెట్టిన జగన్

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి... రాజధానిపై ఆటంబాంబు పేల్చారు. చివరి రోజు రాజధానిపై చర్చ చేపట్టడంతో ఏదో కీలక ప్రకటన ఉంటుందని భావించినా... ఈ రేంజ్ లో సంకేతాలు ఉంటాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అధికార వికేంద్రీకరణ విధానం మంచిదంటూనే... ఏమో ఏపీకి మూడు కేపిటల్స్ రావొచ్చేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్... కర్నూలులో హైకోర్టు... జ్యుడీషియల్ కేపిటల్... అలాగే అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ పెట్టుకోవచ్చంటూ సంకేతాలు వదిలారు. అయితే, రాజధానిపై వారం రోజుల్లో నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇవ్వనుందని, నివేదిక అందాక... సుదీర్ఘంగా చర్చించి రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జగన్... రాజధానిపై ప్రకటనకు ముందే తన బినామీలకు లీకులు ఇచ్చారని ఆరోపించారు. బాబు బినామీలంతా భూములు కొన్నాకే అమరాతిని రాజధానిగా ప్రకటించారని జగన్ అన్నారు. ఇక, రాజధాని నిర్మాణం, కనీస మౌలిక వసతుల కల్పనకు లక్షా 9వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కలు కట్టారని, బాబు హయాంలో కేపిటల్ పేరుతో 5వేల 800కోట్లు ఖర్చు చేశారని... ఇంకా లక్ష కోట్లు కావాలని, ఆ డబ్బును ఎక్కడ్నుంచి తేవాలని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు, రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు.... అభివృద్ధి, పరిపాలన ఒకేచోట కేంద్రీకృతం కావొద్దని ప్రభుత్వానికి సూచించారు. పరిపాలన, చట్టసభలు, కోర్టులు... ఇలా అన్నీ వేర్వేరు చోట ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే... మరోసారి అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందని ధర్మాన హెచ్చరించారు.