ఉద్యోగుల అవస్థలు.. జీతం అందక తిప్పలు పడుతున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం 2016 , అక్టోబరు 11 న కొత్త జిల్లాలు.. మండలాలు ఏర్పాటు చేశారు. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలగా మారింది. కొత్తగా 23 జిల్లా పరిషత్ లు 101 మండల పరిషత్ లు ఏర్పాటు చేశారు. కొత్తగా 23 మంది సీవోలు, 23 మంది డిప్యూటీ సీఈవోలు, 101 మంది ఎంపీడీవోలు, 101 మంది మండల పరిషత్ ఆఫీసర్లను నియమించారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లా మండల పరిషత్ ఏర్పాటు బాగానే ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. కొత్త జడ్పీలు, మండల పరిషత్లు సమస్యల నిలయంగా మారాయి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, కరకగూడెం, ఆల్లపల్లి మండలాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఏ మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి చూసినా నిధుల నుంచి నియామకాల వరకు అన్నీ సమస్యలే కనిపిస్తాయి. కొత్త మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, ఎంఈవో, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టు అటెండర్లు ఉండాలి, కానీ స్టాఫ్ నియామకం జరగలేదు. జిల్లా పరిషత్ లోనూ ఇదే పరిస్థితి, కొత్త సిబ్బంది నియామకం పక్కన పెడితే ఉన్న సిబ్బందికి గత రెండు నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో జడ్పీ, మండల పరిషత్ ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. జడ్పీ సిబ్బంది నియామకం పై ట్రెజరీకి ఫైల్ పంపక పోవడంతో గత రెండు నెలలుగా జీతాలు రాక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు ఉద్యోగులు. దసరా, దీపావళికి జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా ప్రభుత్వ కొలువులో ఉండి జీతాలు రాక వెట్టిచాకిరీ చేస్తున్నామని ఉద్యోగులు లోలోపల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాదు కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. సమయానికి జీతాలు రాక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అడిగితే ఇబ్బందులు వస్తాయని సర్దుకుపోతున్నారు.

మద్యపాన నిషేధం నామమాత్రమే.. బెల్టు షాపులతో కళకళలాడుతున్న ఏపీ

కర్నూలు జిల్లా పశ్చిమ పల్లెల్లో పొరుగు రాష్ర్టాల మద్యం గుప్పుమంటోంది. తుంగభద్ర నది సరిహద్దు ప్రాంతాలైన మంత్రాలయం, కోడుమూరు, కర్నూలుకు తెలంగాణ మద్యం అక్రమంగా సరఫరా అవుతుంటే, పత్తికొండ, ఆలూరు, డోన్ ప్రాంతాలకు కర్ణాటక మద్యం భారీగా దిగుమతి అవుతున్నాయి. ఇక నంద్యాల డివిజన్ లోని చాలా ప్రాంతాల్లో నాటుసారా, కల్తీ కల్లు ఏరులైపారుతోంది. జిల్లా లోని ప్రభుత్వ వైన్ షాపుల్లో మద్యం ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్యులు తక్కువ ధరలకు దొరికే మద్యాన్ని కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు అధికార పార్టీ నేతలు వారి అనుచరులు గుట్టుగా బెల్టు షాపుల నిర్వహణకు తెరదీశారు. దీంతో ఊరూరా వాడ వాడలా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుడుతున్నాయి. ఓ వైపు బెల్టు షాపులు నిర్వహిస్తే తాట తీస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్న పల్లెల్లో మాత్రం బెల్టు షాపులు యథేచ్ఛగా వెలుస్తున్నాయి.  తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వివిధ బ్రాండ్ లకు సంబంధించిన మద్యం భారీగా అక్రమ రవాణా అవుతుంది. అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. అయినా పొరుగు రాష్ర్టాల నుంచి మోటారు సైకిళ్లు, ఆటోలు, రైళ్లలో మద్యం గుట్టుగా అక్రమ రవాణా జరుగుతూనే వుంది. వాహనాల తనిఖీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్స్ భారీగా పట్టుబడటంపై పోలీసులే షాక్ కు గురవుతున్నారు. మరోవైపు చీప్ లిక్కర్ మాటున కొంత మంది బెల్టు షాపు నిర్వాహకులు కల్తీ మద్యం అమ్మకాలకు తెర తీశారు. దీంతో మందు బాబులు అనారోగ్యం పాలవుతున్నారు. నాటుసారా పల్లెల్లో గుప్పుమంటోంది. అటవీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారవుతుంది. ఇక ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న కొన్ని కళ్లు దుకాణాల్లో తయారయ్యే కల్తీ కల్లు తాగి అమాయకులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. క్రిష్ణగిరి మండలంలో ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపుల పై దాడులు నిర్వహించారు. సోదాల్లో పత్తికొండ ఎమ్మెల్యే అనుచరుడు జయపాల్ రెడ్డి మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా తెలంగాణ, కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకున్నారు. 110 క్వార్టర్ల కల్తీ మద్యం సీసాలను గుర్తించి సీజ్ చేశారు. అధికార పార్టీకి సంబంధించిన వారే పొరుగు రాష్ర్టాల మద్యాన్ని దిగుమతి చేసుకొని కల్తీ మద్యాన్ని బెల్టు షాపుల్లో విక్రయించటం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అందులో కల్తీ మద్యం విక్రయాలు జరుపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా మద్యం దిగుమతి అవుతూనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరిహద్దులపై నిఘా ఉంచి అక్రమ మద్యం సరఫరాను అరికట్టాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

విజయసాయి రెడ్డికి 'కాపు' సెగ.. పవన్ ఎఫెక్టేనా?

కాపు ఉద్యమ సెగ వైసీపీని చుట్టుముడుతోంది. ఏకంగా వైసీపీ నెం.2 అయిన విజయసాయి రెడ్డి ముందే 'జైకాపు… జైజై కాపు' నినాదాలతో వైసీపీ కాపు కార్యకర్తలు రెచ్చిపోయారు. విశాఖలోని కంబాలకొండలో మంత్రి అవంతి శ్రీనివాస్.. ప్రత్యేకంగా తమ పార్టీకి చెందిన కాపు నేతలు, కార్యకర్తలతో కాపుల ఆత్మీయ కలయిక పేరుతో ఓ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకి విజయసాయిరెడ్డిని ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు. అయితే.. ఈ కాపు సభకి హాజరైన విజయసాయికి ఊహించని పరిణామం ఎదురైంది. విజయసాయి అలా సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టారో లేదో.. “జై కాపు.. జై జై కాపు” అంటూ కార్యకర్తలు నినాదాలు హోరెత్తించారు. అప్పటి వరకూ కాపు సామాజికవర్గం కాని ఇతర నేతలు వచ్చినా ఎవరూ స్పందించలేదు.. కానీ విజయసాయి రాగానే ఆయనపై.. కాపు నేతలు, కార్యకర్తలు చెలరేగిపోయారు. కాపు నినాదాలతో హోరెత్తించారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే.. విజయసాయిపై అంత తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆందోళన ముదురుతున్న సమయంలో మంత్రి అవంతి కలగజేసుకునే ప్రయత్నం చేసినా… కాపుల సమావేశానికి రెడ్డిలెందుకు? రెడ్డిలకు ఏం పని? అంటూ కొందరు నిలదీసేందుకు ప్రయత్నించారు. దీంతో విజయసాయి ఆందోళన జరుగుతున్నంత సేపు సైలెంట్ గా కూర్చుండిపోయారు. ఇక నినాదాలు ఆగేలా లేకపోవడంతో.. చివరికి ఆయన కూడా.. తాను కాపునని చెప్పుకోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలో రెడ్లను కాపులంటారని.. ఆ లెక్కన తాను కాపునని చెప్పుకుని వారిని కూల్ చేయడానికి ప్రయత్నించారు. తానూ కాపునేనని, మీలో ఒక్కడినని.. చనిపోయే ముందు తన డెత్ సర్టిఫికెట్ మీద కాపు అనే ఉంటుందని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. అసంతృప్తి జ్వాలలు మాత్రం ఆగలేదు. విజయసాయిపై.. కాపు వర్గం నేతలు, కార్యకర్తలు అంత తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం.. జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఆయన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ నాయుడూ, ప్యాకేజీ స్టారని విజయసాయి చేస్తున్న వ్యాఖ్యలపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారు వేరే పార్టీలో ఉన్నప్పటికీ వారికి పవన్ పై ఎంతో కొంత అభిమానం ఉంటుంది. ఆ విషయాన్ని మరిచి విజయసాయి వంటి నేతలు పవన్ ని నాయుడు అంటూ కులం పేరుతో మరియు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వారికి నచ్చలేదని.. అందుకే వారు విజయసాయి వస్తే ఆ స్థాయిలో నినాదాలతో హోరెత్తించారని అంటున్నారు. మొత్తానికి విజయసాయికి కాపు సెగ గట్టిగానే తాకిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఢిల్లీని తాకిన క్యాబ్ మంటలు.. జామియా ఇస్లామియా విద్యార్థుల నిరసనలు

పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు ఢిల్లీని తాకాయి. జామియా నగర్ లో బస్సును తగలబెట్టారు ఆందోళనకారులు. మూడు బస్సులతో పాటు కార్లకు నిప్పంటించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. జామియా నగర్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అయితే హింసాత్మక ఘటనల పై తమకు సంబంధం లేదంటున్నారు జామీయా ఇస్లామియా విద్యార్థులు. తమ ఆందోళనలు శాంతియుతంగా సాగుతున్నాయని చెబుతున్నారు.  సౌత్ ఢిల్లీ లోని జామియా నగర్ లో భారీ ఎత్తున నిరసనకారులు రోడ్ల పైకి రావడంతో పోలీసులు మోహరించారు. బస్సుల పై రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు హింసాత్మక ఘటనలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.జామియా నగర్ ను మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు.ఢిల్లీ హింస వెనుక ఆప్ ఎమ్మెల్యే ఉన్నారంటూ బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆప్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ కనుసన్నల్లోనే హింస చెలరేగింది అన్నారు. అయితే దీనిని ఆప్ ఖండించింది.పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి మనకి తెలిసిందే.ఈశాన్యం నుంచి బెంగాల్ కు అక్కడి నుంచి ఢిల్లీకి పాకడం కలకలం రేపుతోంది.మరోవైపు పోలీసుల కాల్పుల్లో అస్సాంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బెంగాల్ లో ఆందోళనకారులు కార్లు బస్సులకు నిప్పంటించారు. సంయమనం పాటించాలని గవర్నర్ కోరినప్పటికీ నిరసనల మాత్రం ఆగడం లేదు.

మళ్లీ మొదలైన కాల్ మనీ... గుంటూరులో వేధింపులు తట్టుకోలేక పెట్రోల్ పోసుకున్న యువకుడు

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్ వద్ద వెంకటేష్ అనే యువకుడు హంగామా సృష్టిస్తూ కాల్ మనీ వివాదం తెర పైకి తీసుకువచ్చాడు. తనను గోపాలం సాంబశివరావు అనే వడ్డీ వ్యాపారి అధిక వడ్డీ పేరుతో వేధిస్తున్నాడని ఆరోపించాడు. అప్పు ఇచ్చే సమయంలో మూడు రూపాయల వడ్డీ అని చెప్పి చెల్లించే సమయంలో అధిక వడ్డీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించాడు. అధిక వడ్డీ వేధింపుల పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కూడా వడ్డీ వ్యాపారికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.  తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద వంటి పై పెట్రోల్ పోసుకున్నాడు. వెంకటేష్ చేసిన హడావిడితో పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే అతడిని స్టేషన్ లోకి తీసుకెళ్లారు. ఫిర్యాదును స్వీకరించారు.అప్పు ఎగ్గొట్టేందుకే వెంకటేష్ డ్రామా ఆడుతున్నాడని అప్పు ఇచ్చిన సాంబశివరావు చెబుతున్నారు. కొంత మంది సలహాలతోనే స్టేషన్ వద్ద పెట్రోల్ తో హంగామా చేశాడంటున్నాడు. వెంకటేష్ పై గతంలో పలు ఫిర్యాదులు ఉన్నాయి అన్నాడు.బాగా అప్పుల్లో మునిగిపోవడం వల్ల అందరూ బెదిరించటం వల్ల ఇలా చేస్తే తప్పించకోవచ్చు అని ఇలా చేస్తున్నాడని,గతంలో కూడా అతని పై తాడేపల్లి పీఎస్ లో కేసులు ఉన్నాయని అప్పు ఇచ్చిన వ్యక్తి తెలియజేశాడు.సాక్షాత్తు ముఖ్య మంత్రి నివాసానికి సమీపంలో ఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసు ల పనితీరు పై విమర్శలు కూడా చేస్తున్నారు.ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు పై అసలు నిజాలు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబం అంతా దొంగలేనట...

ఓ కుటుంబంలోని సభ్యులందరూ దొంగలే. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలే వాళ్ల టార్గెట్ గా ఎంచుకుంటున్నారు. కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా దొంగతనాలు చేస్తున్న గాయత్రి గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. చోర్ ఫ్యామిలీ ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగదుతో పాటు బంగారు ఆభరణాలు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. బెంగళూరుకు చెందిన ఎస్ రాజు కుటుంబ సభ్యులంతా ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడ్డారు. రాజు ఇద్దరు భార్యలు గాయత్రి, కోకిల ఈ ముఠాలో సభ్యులు. ఇద్దరు అక్కచెల్లెళ్లు. వీరికి తోడు రాజు చెల్లెలు అనిత ఆమె స్నేహితురాలు జ్యోతి అందరూ దొంగలే. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధి లోని ఒంటరి మహిళా ప్రయాణికులను ఈ గ్యాంగ్ టార్గెట్ గా చేసుకుంది. త్రీ స్టార్ హోటళ్లలో నివాసముంటూ రద్దీ ప్రదేశాల్లో ఉన్న మహిళను ఫాలో అవుతూ వారి దృష్టి మరల్చి దొంగతనాల చేసింది గ్యాంగ్.  ఏడాది జూన్ 29న 69 ఏళ్ల జయలక్ష్మి సికింద్రాబాదు నుంచి మెహదిపట్నం వెళుతున్న సమయంలో ఈ ముఠా వెంబడించింది. ఆమె బ్యాగ్ లోని విలువైన వస్తువులను కాజేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు గాయత్రి గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో ఈ గ్యాంగ్ 13 చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. గాయత్రి గ్యాంగ్ లోని మహిళలు.. చిన్నారులు, ఒంటరి మహిళల వద్దకు వెళ్లి ఏ మాత్రం అనుమానం రాకుండా బ్యాగ్ లోని వస్తువులు కాజేసేవారు. ఒక్క జూన్ నెలలోనే ఈ తరహా చోరీలు 3 నమోదు కావడంతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు పక్కా నిఘా పెట్టారు. ఓ కుటుంబంలోని సభ్యులంతా దొంగలే కావడంతో మహారాష్ట్ర,కర్ణాటకలో ఈ తరహా దొంగతనాలు ఏమైనా జరిగాయా అన్న కోణంలో ఆరా తీస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

సమతా కేసును ఫాస్ట్ ట్రాక్ కు అందజేసిన అధికారులు.....

  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్యాచారానికి గురైన సమత కేసును పోలీసు లు ఈ నెల 16న చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో చార్జిషీటు దాఖలు చేయనున్నారు. శుక్రవారమే ఈ పని చేయాల్సి ఉండగా సోమవారానికి వాయిదా పడింది. నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ ముగ్దుం డీఎన్ఏ రిపోర్టు పోలీసు చేతికొచ్చింది. విచారణలో ఇది అత్యంత కీలకం కానుంది. నిందితులకు న్యాయ సహాయం చెయ్యకూడదని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.మరోవైపు బాధిత కుటుంబానికి ప్రభుత్వం చేయుతనిస్తోంది. సమత్వ పిల్లలను ఇచ్చోడ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించారు. సమత భర్తకు రెవిన్యూశాఖలో అటెండర్ ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వు జారీ చేశారు. తొలివిడత పరిహారంగా 4.12 లక్షలను మంజూరు చేశారు. ఖర్చుల కోసం ఎస్పీ మల్లారెడ్డి నగదు సహాయమందించారు.ప్రత్యేక కోర్టులో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్టు వివరించారు.సమత గ్యాంగ్ రేప్ హత్య కేసు విషయంలో పోలీసు దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. సమత గ్యాంగ్ రేప్ అనంతరం నిందితుడు వదిలిపెట్టిన ఆధారాల అదనంగా పోలీసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.  

ప్రకాశం జిల్లాలో సీమ ఫార్ములా..! టీడీపీ నేతలే టార్గెట్ గా క్వారీల్లో తనిఖీలు

  రాయలసీమలో ప్రత్యర్ధులను దెబ్బకొట్టాలంటే ముందుగా ఆర్ధిక మూలాలపై గురిపెడతారు. పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తారు. చీనీ చెట్లను నరికేస్తారు. అలా, ఆర్ధికంగా దెబ్బకొట్టి ఆ తర్వాత ప్రత్యర్ధులను దారిలోకి తెచ్చుకుంటారు, లేదంటే అటాక్ చేస్తారు. అయితే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ ఇదే ఫార్ములాను తన రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తున్నారనే మాట వినిపిస్తోంది. రివర్స్ టెండరింగ్ కానీ, గత టీడీపీ పాలనపై అవినీతి ఆరోపణలు గానీ, అమరావతిపై గందరగోళం కానీ... ఇవన్నీ రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకేనన్న ప్రచారం ఉంది. ఇవన్నీ పరోక్షంగా జరుగుతున్న కక్ష సాధింపు చర్యలైతే... మరికొందర్ని డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు అలాంటివేనంటున్నారు. టీడీపీ నేతలే టార్గెట్ గా గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మొన్నటిమొన్న అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి క్వారీలపై వరుసగా వాంరోజులపాటు విజిలెన్స్ రైడ్స్ జరగగా, ఇప్పుడు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు టార్గెట్ గా తనిఖీలు జరుగుతున్నాయి. శిద్ధాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధమున్న క్వారీల్లో ఏకకాలంలో విజిలెన్స్ అండ్ మైన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు.   ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శిద్ధాతోపాటు అతని బంధువర్గానికి గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గెలాక్సీ గ్రానైట్ చీమకుర్తిలోనే లభిస్తుంది. దాంతో, ఇక్కడి గ్రానైట్ కు మాంచి డిమాండ్ ఉంది. అయితే, జగన్ సర్కారు వచ్చాక, కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని, చీమకుర్తి అండ్ బల్లికురవలో దాడులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అధికారంలో ఉన్నా లేకున్నా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దూరంగా ఉంటే శిద్ధా క్వారీల్లో కూడా సోదాలు జరగడంపై చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా రాజకీయ దురుద్దేశాలతోనే జగన్ ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తోందని టీడీపీ అంటోంది. అయితే ఇదే ధోరణి కొనసాగితే మాత్రం గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని, అదే జరిగితే వేలమంది కార్మికులు రోడ్డునపడతారని హెచ్చరిస్తున్నారు.  

జేసీకి అసలేమైంది? ఎందుకలా మాట్లాడారు?

  జేసీ దివాకర్ రెడ్డి... ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ పొలిటీషియన్... సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసి... కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ముద్రపడ్డ జేసీ... రాష్ట్ర విభజన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి....2019వరకు ఎంపీగా పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత జేసీ ప్రాధాన్యత కొంత తగ్గినా... ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం చక్రం తిప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు జేసీకి ఒక వాల్యూ గుర్తింపు ఉండేది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మంత్రి పదవినైనా దక్కించుకునేవారు... లేదంటే ప్రభుత్వంలో పలుకుబడి అయినా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా తన స్టైల్ ను మాత్రం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే, జేసీ దివాకర్ రెడ్డి ఎలాంటి భయం బెరుకూ లేకుండా తాను చెప్పదలుచుకున్నది చెప్పేస్తారు. అందుకే జేసీ ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. తిట్టడంలోనైనా, పొగడటంలోనైనా జేసీ స్టైలే వేరు. ఉన్నదున్నట్లు మాట్లాడతారో లేదో చెప్పలేం కానీ, తాను అనుకున్నది మాత్రం కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. అయితే, ఏపీ సీఎం జగన్ పై ఎప్పుడూ విమర్శనాస్త్రాలు సంధించే జేసీ దివాకర్ రెడ్డి.... ఈసారి కాస్త భిన్నంగా మాట్లాడారు. వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తాను చేయాలనుకున్నది ధైర్యంగా చేస్తారని అన్నారు. అయితే, జగన్ లాగా చంద్రబాబు ధైర్మమున్న లీడర్ కాదన్నారు. అయితే, జగన్ ను పొగిడినట్టే పొగిడి తనదైన శైలిలో విమర్శలు కూడా చేశారు. జగన్ ప్రభుత్వానికి.... రెడ్డి రాజ్యంలో కక్ష పాలన అని పేరు పెట్టాలంటూ చురకలు వేశారు. జగన్ తన తాత రాజారెడ్డిని మరిపిస్తూ పాలన చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను అర్ధంచేసుకోలేక వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. అసలు జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడుతున్నారా? లేక తిడుతున్నారో తెలియక తికమకపడుతున్నారు. ఒకపక్క పొగుడుతూనే, మరోపక్క సెటైర్లు వేయడం వెనుక మతలబు ఏంటని మాట్లాడుకుంటున్నారు. అయితే, జేసీ దివాకర్ రెడ్డి వ్యూహాత్మకంగానే అప్పుడప్పుడూ పొగడ్తలు... అప్పుడప్పుడూ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.  

కేకేకు కేసీఆర్ కు దూరం పెరిగిందా? రెన్యువల్ దక్కుతుందా? లేదా?

  టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు పదవీ కాలం త్వరలో ముగియనుంది. దాంతో, తన రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయాలని కేకే కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు సన్నిహితుడు కావడంతో రెన్యువల్ చేయాలని స్వయంగా కోరినట్లు తెలుస్తోంది. అయితే, కేకే విషయంలో రకరకాల ఊహాగాలు పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కేసీఆర్ కి కేకేకు మధ్య దూరం పెరిగిందని, రెన్యువల్ దక్కకపోవచ్చని అంటున్నారు. ఇంకొందరైతే... మళ్లీ కేశవరావుకే ఇస్తారని అంటున్నారు. అయితే మరో మాట కూడా వినిపిస్తోంది. కేకే విషయంలో కేసీఆర్ మరో ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. కేకేను మళ్లీ రాజ్యసభకు పంపడం కేసీఆర్ కు ఇష్టం లేదని, ఈసారి రాష్ట్రస్థాయిలో కేకే సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నారని అంటున్నారు. కేకేను ఎమ్మెల్సీని చేసి, కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెడతారని మాట్లాడుకుంటున్నారు. అయితే, కేకే విషయంలో ఇలా ఊహాగానాలు చెలరేగడానికి ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన ఇన్సిడెంటే కారణమంటున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఆనాడు మీడియాకి లేఖ విడుదల చేయడంతోపాటు చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ కేకే చెప్పడం కలకలం సృష్టించింది. మొదట్లో కేసీఆర్ ఆదేశాలు సూచన మేరకే కేశవరావు ఈ ప్రకటర చేశారని ప్రచారం జరిగినా, అందులో వాస్తవం లేదని తేలింది. కేసీఆర్ ప్రమేయం లేకుండానే, పార్టీని సంప్రదించకుండానే కేకే ఆ ప్రకటన చేసినట్లు తేలడంతో అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. అప్పుడే కేకేకు అక్షింతలు పడ్డాయని, ఆ తర్వాతే కేశవరావు నోరు మెదపకుండా ఆగిపోయారని అంటారు.   అప్పట్నుంచి కేసీఆర్ కి, కేకేకి మధ్య దూరం పెరిగిపోయిందని, అందుకే, కేకే రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసే ఉద్దేశం కేసీఆర్ కి లేదని అంటున్నారు. ఒకవేళ అదే నిజమై... రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేయకపోతే కేకే ఎలా రియాక్ట్ అవుతారు? పార్టీ అధినేత నిర్ణయానికి విధేయత చూపుతారా? లేకపోతే అసమ్మతి జెండా ఎగురవేస్తారో? తెలియాలంటే కొద్దిరోజులు ఆగ్సాల్సిందే.  

రాజ్యసభకు కవిత..! రెండో సీటుపైనే ఉత్కంఠ

  వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఏపీకి నాలుగు, తెలంగాణకి రెండు రానున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం అటు ఏపీలోనూ... ఇటు తెలంగాణలోనూ అధికార పార్టీకే ఆ స్థానాలను దక్కించుకోనున్నాయి. అయితే, తెలంగాణ నుంచి ఖాళీ కాబోతున్న స్థానాల్లో టీఆర్ఎస్ సీనియర్ కె.కేశవరావు సీటు ఒకటి కూడా ఉంది. అయితే, కేకేకు మళ్లీ రెన్యువల్ లభిస్తుందో లేదోనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఈమధ్య కేసీఆర్ కు కేకేకు మధ్య కొంచెం దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. దాంతో, కేకేకు రెన్యువల్ దక్కకపోవచ్చని అంటున్నారు.  మరోవైపు, రాజ్యసభ సభ్యత్వం కోసం టీఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ, ముఖ్యంగా కేసీఆర్ తనయురాలు కవిత... అలాగే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, వినోద్ కు ఇఫ్పటికే కేబినెట్ ర్యాంక్ హోదాతో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ఉండటంతో... రాజ్యసభకు పంపించకపోవచ్చనే అంటున్నారు. ఇక, కవితను మాత్రం కచ్చితంగా రాజ్యసభకు పంపిస్తారనే టాక్ నడుస్తోంది. ఎంపీగా ఉన్నప్పుడు లోక్ సభలో అనేక అంశాలపై ధాటిగా మాట్లాడి ప్రశంసలు పొందిన కవితకు రాష్ట్ర సమస్యలపై పూర్తి అవగాహన ఉండటంతో... రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో, టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. అయితే, రెండో సీటు విషయంలోనే తర్జనభర్జనలు జరుగుతున్నాయని, దాన్ని ఎవరికి కేటాయిస్తారనేది చివరి నిమిషం వరకు సస్పెన్సే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.

ఆయషా రీపోస్ట్ మార్టంకి సీబీఐ రంగం సిద్ధం......

పన్నెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యాచారం కేసు మరోసారి తెరమీదికొచ్చింది. ఆయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. ఈ నెల 20 లోగా పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయేషా మీరా హత్య కేసు సంచలనం రేపింది.2007 డిసెంబర్ లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం లోని ఓ ప్రైవేటు కళాశాల హాస్టళ్లు, ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురైంది. హత్య చెయ్యడానికి ముందు ఆమె పై అత్యాచారం చేసినట్టు పోలీసులు నిర్ధరించారు. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సత్యం బాబు అనే యువకుడిని గుర్తించారు. సత్యంబాబుకి జైలు శిక్ష విధించారు. అయితే ఈ కేసులో సత్యంబాబును న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఆయేషా కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తును సీబీఐ చేపట్టింది. నిజానికి కొద్ది రోజుల క్రితమే ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించుకుంది కానీ అది సాధ్యపడలేదు. సీబీఐ పై నిషేధం ఎత్తివేయడంతో ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో పునర్విచారణను వేగవంతం చేయాలని సిబిఐ నిర్ణయించుకుంది. ఈ కేసులో ఇప్పటికే 12 ఏళ్ళ పాటు జాప్యం జరిగింది ప్రధాన నిందితుడిగా గుర్తించిన సత్యం బాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. దీంతో సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికీ గుంటూరు రెవిన్యూ అధికారులతో సిబిఐ మాట్లాడి, తెనాలిలో ఆయేషాను ఖననం చేసిన ప్రాంతానికి సీబీఐ వెళ్లనుంది. ఇప్పటి కైనా ఆయేషా హత్య కేసులో అసలు దోషుల సిబిఐ గుర్తిస్తోందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.  

మోదీ క్షమాపణ చెప్పాలి.. రేప్ ఇన్ ఇండియా వివాదంపై వెనక్కి తగ్గని రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ రేప్ ఇన్ ఇండియా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యాఖ్యల పై బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే క్షమాపణలు చెప్పేదిలేదని రాహుల్ స్పష్టం చేశారు. దీంతో ఈసీని కలవాలని నిర్ణయించుకుంది బిజెపి, స్మృతి ఇరానీ నేతృత్వంలోని బిజెపి బృందం ఈసీని కలవనుంది. రాహుల్ వ్యాఖ్యల పై లోక్ సభ దద్దరిల్లింది. దేశానికి క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. అయితే క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన రాహుల్ గాంధీ బీజేపీ పై ఎదురు దాడి మొదలు పెట్టారు. క్షమాపణ చెప్పాల్సింది తాను కాదని మోడీనే అని రాహుల్ అన్నారు. గతంలో మోడీ ట్వీట్ చేసిన వీడియోను రాహుల్ రీ ట్వీట్ చేశారు. 2013 ఎన్నికల ప్రచారంలో మోడీ ఢిల్లీని రేప్ క్యాపిటల్ అంటూ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అగ్నిగుండంలా మార్చినందుకు దేశ ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చినందుకు ఢిల్లీని రేప్ క్యాపిటల్ అన్నందుకు మోడీనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్. లోక్ సభ నిరవధిక వాయిదాకు ముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యల పై తీవ్ర దుమారం చెలరేగింది. రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణ చెప్పాలని బిజెపి మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలతో రాహుల్ దేశ ప్రజానీకానికి ఏం సందేశం ఇస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. గతంలో ఏ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె విమర్శించారు.

కేంద్రానికి కంప్లైంట్.. శ్రీ కాళహస్తి ఎమ్మెల్యేపై అమిత్ షా కు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

  ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం హస్తినకు చేరింది. శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి పై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు రాష్ట్ర బిజెపి నాయకులు. నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతల పై విచారణ జరపాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏపీ డీజీపీకి లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాళహస్తిలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ వర్సెస్ బీజేపీ రాజకీయం సరి కొత్త టర్న్ తీసుకుంటోంది. ఇటీవల శ్రీకాళహస్తిలో గంగమ్మ జాతర వద్దకు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, బిజెపి నాయకులు రాకపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గంగమ్మ జాతర తర్వాత పోలీసుల అండతో తమపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు బనాయించారని బిజెపి నేతలు ఎమ్మెల్యే పై ఆరోపిస్తున్నారు, ఎస్పీకు కూడా ఫిర్యాదు చేశారు. తమ పార్టీ బలపడుతుందన్న కారణం గానే నియోజకవర్గంలో అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు బీజేపీ నాయకులు. శ్రీ కాళహస్తి నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే ఆరాచకాలు ఎక్కువయ్యాయని చివరకు పవిత్ర ఆలయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారంటున్నారు బిజెపి నాయకులు. అధికార పార్టీ ఆగడాలను నిలదీస్తే తమపై దాడులు చేయడంతో పాటు కేసులు పెట్టారని నియోజక వర్గ బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ ఆరోపించారు. అందుకే అమిత్ షా కు ఫిర్యాదు చేశామని విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ బలపడుతుందన్న కారణంగా దాడులతో అధికార పార్టీ భయబ్రాంతులకు గురి చేస్తోందని ఏపీ బీజేపీ ఆరోపించింది. ఇటీవల శ్రీకాళహస్తిలో బిజెపి నేతల పై జరిగిన దాడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను జాతీయ పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు బిజెపి రాష్ట్ర నాయకులు.

కోర్టు ధిక్కరణ కేసుల పై హై కోర్టు తీవ్ర ఆగ్రహం ........

  రోజురోజుకు పెరిగిపోతున్న కోర్టు ధిక్కరణ కేసులపై హై కోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సింగిల్ జడ్జి ముందు సుమారు 800 కోర్టు ధిక్కార కేసులున్నాయి. ఈ కోర్టులో 2000 వరకు కోర్టు ధిక్కార కేసులున్నాయి. ఈ రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అని కోర్టుకు హాజరైన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను నిలదీసింది. కోర్టు ఆదేశాలను అధికారులు పాటించకపోవడం వల్లే కోర్టు ధిక్కార వ్యాజ్యాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు పాటించాలని అధికారులకు మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పమంటారా అని ప్రశ్నించింది. ఇద్దరు అధికారులను జైలుకు పంపితే మిగిలిన అధికారులు దారికొస్తారు అని వ్యాఖ్యానించింది. సంస్థాగతం గా సమస్యలను పరిష్కరించుకునేందుకు స్టేట్ లిటిగేషన్ పాలసీని రూపొందించాలని 7,8 నెలల క్రితమే ప్రభుత్వానికి సూచించామని, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించింది.రెవెన్యూ, మున్సిపల్, రవాణా, హోంశాఖల పై ఎక్కువగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలు వస్తున్నాయని తెలిపింది. కావాలని ఎవరూ ధిక్కరణ వ్యాజ్యాలు వెయ్యరని అబిప్రాయపడింది. ఈ వ్యాజ్యాల్లో కోర్టు జోక్యం చేసుకున్నప్పుడే అధికారుల కళ్లు తెరుస్తున్నారని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలు పాటించేలా అధికారులకు నేర్పాలని లేదంటే కోర్టు ఆదేశాలు ఎలా గౌరవించాలో తామే నేర్పుతామని వ్యాఖ్యానించింది.ఒక వ్యాజ్యంలో అప్పీలు చేయడానికి 466 రోజులు ఆలస్యం కావడం పై మన్నించాలని స్పెషల్ జీపీ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అంశం పై స్పందించిన ధర్మాసనం కోర్టు లోనే ఉన్న అడ్వకేట్ జనరల్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ శాఖల్లో పరిశీలన కమిటీ ఏర్పాటు చేయాలని సర్వీసు సంబంధిత వివాదా లను కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టును ఆశ్రయిం చేలా చర్యలు ఉండాలని తెలిపింది. మరి ఈ చర్యలు అమలు అవుతాయో లేదా ఇంకా ధిక్కరణ కేసులు పెరుగుతూనే ఉంటాయా అన్నది వేచి చూడాలి. 

జగన్ కు ప్రివిలేజ్ నోటీసులు.. సభను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

సీఎం జగన్ కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చింది టిడిపి. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడని మాటలను అన్నట్లుగా చెబుతూ సీఎం జగన్ సభను తప్పుదోవ పట్టించారని ఈ నోటీసుల్లో పేర్కొంది టిడిపి. నిన్న ( డిసెంబర్ 12న ) తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు సభకు వచ్చే సమయంలో జరిగిన ఘర్షణపై ఈరోజు ( డిసెంబర్ 13న ) కూడా సభలో వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ ఘర్షణపై స్పందిస్తూ ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను.. ఆయన వాడిన భాషను తీవ్రంగా తప్పు పట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని కించపరుస్తూ ఏ రకంగా దూషిస్తారని.. దానికి ఏం సమాధానం చెప్తారని  సభలో గట్టిగా నిలదీశారు జగన్. ఇదే సందర్భంలో నిన్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు కూడా అధికారి పార్టీ సభ్యులు స్పీకర్ అనుమతితో వాటిని సభలో ప్లే చేశారు. ఈ సందర్భంగా ప్రతి పక్షాలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరాలని దీనిపై వారు చింతిస్తున్నారనే ప్రకటన చేసినట్లయితే ఈ విషయాన్ని ముగిస్తారని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని కించపరిచే విధంగా చంద్రబాబు నోటి నుంచి అటువంటి పదాలు రాలేదని సభను పక్కదోవ పట్టించటానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, చేయనటువంటి వ్యాఖ్యలను చేశారని, దీనిపై విచారణ చేయాలి, చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు ప్రివిలైజ్డ్ నోటీసులు ఇచ్చారు. అయితే సభలో ఉన్న ఇతర సభ్యుల దగ్గర నుంచి కూడా అభిప్రాయాన్ని తీసుకుని తదుపరి ఎటువంటి చర్యలకు వెళ్ళాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

నిర్భయ కేసు... భద్రతా కారణాల వల్ల 18వ తేదీకి వాయిదా

నిర్భయ దోషుల ఉరిశిక్ష పై విచారణ ఈ నెల 18 కి వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పటియాలా కోర్టు విచారించింది. దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలు చేయాలంటూ పటియాలా హౌస్ కోర్టులో నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నవంబర్ 29 న అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రొడక్షన్ వారెంట్ జారీ చేశారు. వారెంట్ ప్రకారం ఇవాళ కోర్టు ముందుకు నిర్భయ దోషులు హాజరు కావాల్సి ఉంది. అయితే తీహార్ జైల్లో ఉన్న దోషులను బయటకు తీసుకు వచ్చే పరిస్థితి లేక పోవడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టు విచారించింది. సుప్రీం కోర్టు ఇప్పటికే మరణ శిక్ష విధించిందని మెర్సీ పిటిషన్ లు కూడా తిరస్కరించారని ఇక ఆలస్యం చేయకుండా శిక్షను అమలు చేయాలని నిర్భయ పేరెంట్స్ కోర్టుకు విన్నవించారు.  మరోవైపు తనకు విధించిన మరణశిక్ష పై రివ్యూ చేయాలని దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీని పై డిసెంబర్ 17న అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. త్రిసభ్య ధర్మాసనం అక్షయ్ సింగ్ పిటిషన్ పై రివ్యూ చేయనుంది. ఒకవేళ తీర్పు పై రివ్యూ చేసేది లేదని గత తీర్పే ఫైనల్ అని సుప్రీం కోర్టు చెబితే మరణ శిక్షకు రూట్ క్లియర్ అయినట్టే. తీహార్ జైల్లోనే దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బక్సర్ జైలు నుండి ఉరితాళ్లు కూడా ఆర్డర్ చేశారు. నలుగురికీ ఒకేసారి ఉరిశిక్ష అమలు చేసే అవకాశమున్నట్టు సమాచారం. అయితే జైలు నిబంధనల ప్రకారం క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన 14 రోజుల తరువాతే మరణ శిక్ష విధించాల్సి ఉంటుంది. దోషుల కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉరితీస్తున్నారో సమాచారమివ్వాలి. ఈ గ్యాప్ లో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. తమ వస్తువులను కుటుంబ సభ్యులకు అందజేసే చాన్సుంది. ఉరివేసి ఒక రోజు ముందు దోషులు కోరుకున్న ఆహారం అందించాలి. నిబంధనలను బట్టి చూస్తే సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్ ను కొట్టివేసినా ఉరిశిక్ష అమలకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఏడేళ్ల నుండి న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని ఇప్పటికీ శిక్ష అమలు చేయడం లేదంటూ నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మరణ శిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లి డిమాండ్ చేస్తున్నారు.

నేనేం నేరాలు చేసి జైలుకి వెళ్ళలేదు.. జగన్ పై బాబు ఫైర్

అసంబ్లీలోకి వెళ్లకుండా టీడీపీ అధినేత చంద్రబాబును అడుగడుగునా అడ్డుకున్నా పట్టువీడని విక్రమార్కుడిలా ఆయన లోపలికి వెళ్లారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా ముందుకు వెళ్తూ ప్రజల కోసం నిరంతరం పోరాడతామని బాబు స్పష్టం చేసారు. ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవించే పరిపాలన ఉండాలే కానీ ఒక ఉన్మాది పరిపాలనలాగా ఉండకూడదని బాబు మండిపడ్డారు. తనని అసెంబ్లీలోకి ఎందుకు అనుమతించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్ నాన్సెన్స్ అని తప్ప తాను తప్పుగా మాట్లాడలేదని.. తనకు లోపలికి వచ్చే హక్కు లేదా అని గట్టిగా నిలదీశాను తప్ప ఇంకోటి కాదన్నారు బాబు. దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బాబు వెల్లడించారు. తనకు పౌరుషంగా మాట్లాడం తెలుసని.. నేరాలు చేసి జైలుకు వెళ్లడాలు తెలియదని.. అలాంటివి తమకు అలవాటు లేదని బాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం కోసం తానూ జీవితాంతం పని చేశానని చెప్పుకొచ్చారు. తాను గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం కానీ.. లోపలకు రానివ్వకుండా అడ్డుపడి లోపలికి రానివ్వకపోతే ఎవరికయినా బాధ ఉంటుందని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అసెంబ్లీలోకి రానివ్వకుండా చేస్తున్నారనే బాధ ఎవరికైనా ఉంటుందని.. అందుకే గట్టిగా చెప్పాను తప్ప మరొకటి లేదని బాబు తెలియజేసారు.

రాజ్యసభలో విజయసాయిరెడ్డికి చుక్కెదురు.. పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నించి అబాసుపాలయ్యారు

ఏపిలో టిడిపిని ఏదో ఒక విధంగా బోనెక్కించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెగ ఆరాటపడుతున్నారు. ఈ వైఖరి శృతిమించి వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవాలి. తాజా విషయం లోకి వస్తే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న సంధించారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా గత కాంట్రాక్టర్ కు రూ.2,343 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు జరిగినట్టుగా తెలిసిందన్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా రూ.787 కోట్ల రూపాయలను నవయుగ కంపెనీకి చెల్లించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఈ అంశాలు నిజమైతే సంబంధిత వివరాలివ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.  తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అంటారే విజయసాయిరెడ్డి విషయం లోనూ ఇదే జరిగింది. ఆయన ఆశించింది ఒకటైతే సంబంధిత మంత్రి ఇచ్చిన వివరణ మరో రకంగా ఉంది. విజయసాయిరెడ్డి ప్రశ్నపై రాజ్యసభలో జలశక్తి శాఖ మంత్రి రతన్ లాల్ కఠారియా బదులిచ్చారు. కేంద్ర జల సంఘానికి ఏపీ ప్రభుత్వం నుంచి అందిన తాజా సమాచారాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో 2,346 కోట్ల 85 లక్షల రూపాయల అదనపు చెల్లింపులు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు 787 రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లుగా కూడా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే 2019 నవంబర్ 13 వ తేదీ న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ పంపిందని కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా చెప్పుకొచ్చారు. నిపుణుల కమిటీ అభిప్రాయం కేవలం ప్రాథమిక నిర్థారణ మాత్రమేనని నిధుల విడుదలలో కాని వ్యయంలో కాని ఎటువంటి నిబంధనల ఉల్లంఘింపు జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో పేర్కొన్నదని కేంద్ర మంత్రి చదివి వినిపించారు.  దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కూడా కాంపిటెంట్ అథారిటీ అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని కూడా రతన్ లాల్ కఠారియా స్పష్టం చేశారు. ఈ అంశాల పై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దర్యాప్తు కూడా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో అదనపు చెల్లింపులు గురించి కేంద్రమంత సీరియస్ గా లేదని కేంద్ర మంత్రి సమాధానం ద్వారా విజయసాయిరెడ్డికి బోధపడింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయమూ ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని రతన్ లాల్ కటారియా విస్పష్టంగా పేర్కొనడంతో సభలో ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అదనపు చెల్లింపుల గురించి ప్రస్తావించారేగానీ ఆ ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వమే సదరు లేఖలో పేర్కొన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు బయటపెట్టారు. ఈ అంశాన్ని టిడిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు సదరు లేఖను తెప్పించుకుని చూసి ఆశ్చర్యపోయారు. ఇదండీ ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న బూమరాంగైన విచిత్ర సన్నివేశం.