పింఛను విషయంలో పునరాలోచన లేదు.. కలెక్టర్లకు తేల్చి చెప్పిన సీఎం జగన్
posted on Dec 18, 2019 @ 1:18PM
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాప్రతినిధులు , అధికారులు ప్రజా బాట పట్టాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్. కలెక్టర్లుకు, ఎస్పీలకు ఇచ్చిన ప్రత్యేక విందులో ఆయన కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార యంత్రాంగం ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు జనవరి నుంచి గ్రామాల బాట పట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఆదేశాల అమలులో గందరగోళపడవద్దని సందేహాలుంటే సీఎంఓతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎసైలకు, సీఎం జగన్ ప్రత్యేక విందు ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని డిజిపి గౌతం సవాంగ్, జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక టేబుల్ ను ఏర్పాటు చేశారు. ఆ టేబుల్ చుట్టూ ఆ జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు కూర్చున్నారు. సీఎం, సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారులు ప్రతి టేబుల్ దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడారు. విందు కార్యక్రమానికి సీఎం రాక ముందే ఆయన కార్యాలయం అధికారులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడారని సమాచారం.ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయ సామాజిక ఆర్థిక సమస్యలు పాలనా పరమైన ఇబ్బందులు తదితర అంశాల పై వివరాలు తీసుకున్నారు.
జనవరి నుంచి నేతలతో కలిసి గ్రామాల బాట పట్టేందుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని సీఎం వెల్లడించారు.గత ఆరు నెలల్లో పేదల సంక్షేమం కోసం తెచ్చిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఒక్క అవినీతిలో తప్ప మిగతా అన్ని అంశాల్లో మీరు కలిసి మెలిసి పని చేయాలని,పాలు నీళ్ళలా కలిసిపోవాలని,వారి మధ్య చక్కటి సమన్వయం నెలకొనాలి అని సీఎం తెలియజేశారు.2,3 లక్షల మంది ఓట్లేస్తే ఎమ్మెల్యేలు గెలిచారు. వారికి ప్రాధాన్యం ఇవ్వండి. వారు ఫోన్ చేస్తే ఎత్తండి, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతి నిధులు రాత్రి తొమ్మిది తర్వాత అధికారులకు ఫోన్లు చేయకపోవడమే మంచిదని, ఏ సమస్యా సందేహం తలెత్తినా సీఎంవో అధికారులు తోడుగా ఉంటారని సీఎం తెలిపారు.జనవరి ఒకటి నుంచి గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిగా పని చేస్తాయని చెప్పారు. పింఛన్ అమలు పై పెట్టిన నిబంధనలు కొంత కఠినంగా ఉన్నాయని వాటి వల్ల చాలా మంది పేర్లు జాబితా నుంచి తొలగించాల్సి వస్తుందని.. రూల్స్ ను సవరిస్తూ చాలా బాగుంటుందని ఓ కలెక్టర్ విన్నవించారు. దీని పై సీఎం స్పందిస్తూ రూల్స్ ను మార్చేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన వారికి న్యాయంగా పింఛను దక్కేలా నిబంధనలు తీసుకువచ్చామని వాటిని మార్చేది లేదని తేల్చి చెప్పారు. ఇసుక విషయంలో గందరగోళం వద్దని సూచించినట్టు సమాచారం.