బడ్జెట్ బాగుంటే తారాజువ్వలా... లేదంటే కుదేలే... నిర్మలమ్మ పద్దు ఎలాగుంటుందో?

తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, ఉల్లి ధరల నుంచి ఆర్ధిక మందగమనం వరకు అనేక సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు కనిపిస్తున్నాయి. దేశ ఆర్ధిక పరిస్థితి... ప్రపంచ రాజకీయాలు... ఇలా అన్నీ భారత్‌కు ప్రతికూలంగా పరిణమించాయి. ముఖ్యంగా దేశ ప్రగతిని ముందుకు నడిపించే జీడీపీ వృద్ధిరేటు పతనం కావడం... నిరుద్యోగ రేటు 40ఏళ్ల గరిష్టానికి చేరడం... ఆటోమొబైల్‌ పరిశ్రమ కుదేలవడం వంటి సమస్యలు... ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సవాళ్లు విసురుతున్నాయి. వృద్ధి అంచనాలు కూడా 42ఏళ్లలో అతిస్వల్పంగా నమోదుకావడం కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధి రేటు, ఆర్ధిక మందగమనం పెనుసవాలు విసురుతున్నాయి. ఇలాంటి, పరిస్థితుల్లో దేశంలో అన్ని వర్గాలను సంతృప్తిపర్చేలా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కత్తి మీద సామే అంటున్నారు. అయితే, నిర్మలా బడ్జెట్‌ అన్ని వర్గాలను ఆకట్టుకుందో లేదో స్టాక్ మార్కెట్లు క్షణాల్లో చెప్పేస్తాయని ఆర్ధిక విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ వ్యయాలు బాగుండి... వ్యవస్థలోకి నగదు ప్రవాహం ఉండేలా చూస్తే మార్కెట్లు తారాజువ్వలా పెరుగుతాయని... బడ్జెట్ బాగుందనడానికి ఇదే రుజువని చెబుతున్నారు. ఒకవేళ ఆత్మరక్షణ వ్యూహంతో బడ్జెట్ సాగితే మాత్రం మార్కెట్లు భారీగా పతనమవడం ఖాయమని అంటున్నారు. గతేడాది నిర్మలా బడ్జెట్ తర్వాత మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయని... దానికి అనుగుణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ఇబ్బందుల్లోకి జారిపోయిందని గుర్తుచేస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా ఆరు రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్, అగ్రికల్చర్, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్‌, మెటల్‌ అండ్ ఇన్వెస్ట్‌ మెంట్‌ రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, గత పదేళ్లలోనే అత్యంత కష్టమైన బడ్జెట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి, నిర్మలమ్మ... ఈ సవాళ్లను ఎలా అధిగమించి... అందరినీ మెప్పించేలా బడ్జెట్‌ను ప్రవేశపెడతారో లేదో చూడాలి. అయితే, నిర్మలమ్మ బట్జెట్ బాగుంటే స్టాక్ మార్కెట్లు తారాజువ్వల్లా లేస్తాయని... లేదంటే, భారీగా పతనమవుతాయని... అన్ని వర్గాలను సంతృప్తిపర్చారో లేదో తెలియాలంటే ఇదే రుజువు అంటున్నారు. 

అనుమానించినట్లే జరిగింది... మూడోసారి వాయిదా పడింది...

అంతా అనుమానించినట్లే జరిగింది... చివరి నిమిషంలో ఉరి ఆగిపోయింది... ఎలాగైనా ఉరిశిక్షను వాయిదా పడేలా చేయాలన్న నిర్భయ దోషుల ప్రయత్నం ఫలించింది. న్యాయవ్యవస్థలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకున్న నిర్భయ దోషులు మూడోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడేలా చేసుకున్నారు. డెత్ వారెంట్ ప్రకారమైతే ఈపాటికి నలుగురు నిర్భయ దోషులు ఈ భూమ్మీద లేకుండా పోయేవారు. కానీ, ఉరిశిక్ష అమలుకు సరిగ్గా పది పన్నెండు గంటల ముందు ఢిల్లీ పాటియాలా కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఉరిశిక్ష అమలు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే కొత్త డెత్ వారెంట్ జారీ చేస్తామని తెలిపింది. ఉరిశిక్షను సవాలు చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ పాటియాలా కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదా వేయాలంటూ దోషులు కోరారు. అయితే, ఒక్కడి మెర్సీ పిటిషన్ మాత్రమే పెండింగ్ లో ఉన్నందున మిగతా ముగ్గుర్నీ ఉరితీయోచ్చంటూ ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, ఒక కేసులో మరణశిక్ష పడిన దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలన్న నిబంధన ఉండటంతో దోషుల వాదనను సమర్ధిస్తూ ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా కోర్టు స్టే విధించింది.  మూడోసారి ఉరిశిక్ష వాయిదా పడటంతో నిర్భయ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం, కోర్టులు కావాలనే దోషులను కాపాడుతున్నాయంటూ కంటతడి పెట్టారు. వాళ్లను ఎప్పటికీ ఉరి తీయరంటూ దోషుల తరపు లాయర్ ఏపీసింగ్ సవాల్ విసిరాడని మీడియాతో చెప్పారు. అయితే, దోషులకు ఉరిశిక్ష అమలుచేసేవరకు తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

రోజా అండ్ కుమార్ మధ్య గొడవకు కారణమేంటి? పెద్దిరెడ్డి పాత్రేంటి?

వైసీపీలో రోజా ఆడియో టేప్‌ కలకలం సృష్టిస్తోంది. సొంత పార్టీ నాయకులకే ఆమె వార్నింగ్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, మంత్రి పెద్దిరెడ్డి హాజరవుతున్న కేజే కుమార్ ఫంక్షన్ కి నగరి వైసీపీ శ్రేణులను రోజా ఎందుకు వెళ్లొద్దన్నారంటూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ కేజే కుమార్ తోనూ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనూ గొడవేంటంటూ వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. కేజే కుమార్ ఫంక్షన్ కి వెళ్తే ...పార్టీ నుంచి వెళ్లిపోయినట్లేనంటూ రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం వెనుక కారణాలేంటని చర్చించుకుంటున్నారు. కేజే కుమార్... ఇతను నగరి వైసీపీ స్థానిక నాయకుడు... గతంలో నగరి మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేశాడు... అంతేకాదు స్థానికంగా కుమార్ కు మాంచి పట్టుంది. అయితే, రోజాకి కేజే కుమార్ అస్సలు పడదు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే, ఇద్దరూ ఉన్నది ఒకే పార్టీలో... పైగా ఒకటే నియోజకవర్గం... మరి, వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఎందుకొచ్చాయనుకుంటున్నారా? దానికి బలమైన కారణమే ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేజే కుమార్.... 2014లోనూ... అలాగే 2019లోనూ నగిరి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా లాబీయింగ్ చేశాడు. కానీ, జగన్ దగ్గర రోజాకున్న పలుకుబడి ముందు తేలిపోయాడు. దాంతో, మొన్నటి ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా కేజే కుమార్ పనిచేశాడని... ఓడించేందుకు కుట్ర పన్నాడని రోజా రగిలిపోతున్నారు. అందుకే, కేజే కుమార్ ఫంక్షన్ కు ఎవరూ వెళ్లొద్దంటూ రోజా అల్టిమేటం ఇవ్వడమే కాదు... స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఒకే పార్టీలో ఉంటూ... తనను ఓడించడానికి ప్రయత్నించిన కుమార్‌ ఫంక్షన్‌కు ఎలా వెళ్తారంటూ రోజా మాట. అయితే, రోజా వార్నింగ్ తో నగరి వైసీపీ నేతలు, కేడరే కాదు.... అతిథులు సైతం గైర్హాజరైనట్లు తెలుస్తోంది. కారణాలేమైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు రాకుండా ఆగిపోయారట. అంతేకాదు రోజాతో గొడవ నేపథ్యంలో రాలేమని చెప్పారట. అయితే, నగరి నియోజకవర్గంలో కోల్డ్ వార్ పై అధిష్టానం కోపంగా ఉందని అంటున్నారు. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోవడం పార్టీకి మంచిది కాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

తగ్గనున్న పన్ను భారం.. బడ్జెట్ పై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు

2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి.  2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు. 2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది

జామియా చుట్టూ తిరుగుతున్న హస్తిన రాజకీయం!

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జామియా వర్సిటీ ప్రాంగణంలో గత నెలలో జరిగిన హింసాత్మక ఘటనలు మరువక ముందే మరో ఘటన జరిగింది. సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ చేసిన జామియా వర్సిటీ విద్యార్థుల పై ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ దాడిలో ఓ వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపు లోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన పై రాజకీయ దుమారం రేగుతోంది. జామియా వర్సిటీ దగ్గర జరిగిన కాల్పుల ఘటన పై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందని ఇలాంటి ఘటనలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. నేరస్తులు ఎక్కడికీ తప్పించుకోలేరన్నారు. పౌరసత్వ  సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదే కోరుకుంటున్నారా అంటూ ప్రశంసించింది. జామియా కాల్పుల ఘటన పై ప్రియాంక గాంధీ కూడా ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటనకు బీజేపీయే కారణమంటూ ఆమాద్మీ పార్టీ ఆరోపించింది. రాబోయే శాసన సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. బీజేపీ చర్యల వల్లే పోలీసులు మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. మరోవైపు ప్రతిపక్షాల పై బిజెపి ఎదురు దాడికి దిగింది. సీఏఏ కు వ్యతిరేక నిరసనని ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రోత్సహిస్తోందని పలువురు బిజెపి నాయకులు ఆరోపించారు. షహీన్ బాగ్ లో జరిగిన నిరసనలకు కూడా ఆ పార్టీయే కారణమని.. ఆ ఆందోళనలకు సంబంధించిన ఖర్చులను కూడా ఆప్ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుగానే పరిగణించాలని ఈసీని కోరారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను రికార్డులను ఈసీకి సమర్పించింది. మొత్తానికి మరోసారి జామియా వర్సిటీలో సీఐఏ మంటలు చెలరేగాయి. తమకు రక్షణ కల్పించాలంటూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కాస్తా రాజకీయ రంగు పులుముకుని పార్టీల మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది.

దబిడి దిబిడే... నేను సైగ చేస్తే వాళ్ల పరిస్థితి మరోలా ఉండేదంటున్న బాలయ్య!

టీడీపీ నేతల మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. తనకు అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలను చేశారు. తన వెనక వందలాది మంది ఉన్నారని తాను సైగ చేసి ఉంటే వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏమయ్యేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరెడ్డి శాసనమండలిని పునరుద్ధరిస్తే జగన్ మండలిని రద్దు చేసి తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు. మండలి చైర్మెన్ ను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవని ఆయన ఆవేదనను వెల్లడించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో తాము ముందుకెళ్తున్నామని. తమను అడ్డుకోవడం తగదని ఆయన మండిపడ్డారు. రోడ్ల పై పడి కొట్టుకోవడం లాంటి పనులు సంస్కృతికి తమ పద్ధతులకు విరుద్ధమని బాలకృష్ణ మండిపడ్డారు.

చిత్తూరు జిల్లా కంపెనీలలో కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తున్న వైద్య శాఖ

కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తిరుపతి సమీపంలోని పలు కంపెనీల్లో పని చేస్తున్న చైనా దేశస్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించుకుంది. ఈ మేరకు రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అధికారులు. రేణిగుంట ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న చైనాకు చెందిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సహకరించాలని ఆయా కంపెనీల యాజమాన్యాలకు డీఎంఅండీహెచ్ ఓ లేఖలు అందజేసింది. చిత్తూరు చుట్టుపక్కల హెక్సెను టిసిఎల్ లాంటి  ఎనిమిది నుంచి పది కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రధానంగా హెక్సెను టిసిఎల్ లోనే చైనాకు సంబంధించిన వాళ్లు పని చేస్తున్నారు. కాబట్టి కరోనా వైరస్ అంటే డిసెంబర్, జనవరి మాసాల లోనే అది ఎక్స్ పోజ్ కావడంతో ఈ మాసాల్లో చైనా నుంచి తిరుపతికి రాకపోకలు సాగించిన వాళ్లకి ఏదైనా కరోనాకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కరోనా పై భయాందోళనకు గురవుతున్న చైనా ఉద్యోగులతో కలిసి స్థానికంగా ఉన్నవాళ్లు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్లతో పని చేసే సమయంలో వీళ్ళలో ఉన్న భయాందోళన ఏ విధంగా ఉన్నాయో ఒకవేళ వీళ్లకు ఏదైనా జలుబు, జ్వరం లాంటివి ఉంటే ప్రాథమికంగా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు.

ఒబామా, మోడీ తర్వాత రజనీ వర్సెస్ అక్షయ్

డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్‌వర్క్‌పై ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ అడ్వంచర్ ప్రోగ్రామ్ ప్రసారమవుతుంది. అడవుల్లో తిరుగుతూ... ఎడారులు, నదుల్లో ప్రయాణిస్తూ... కొండలు ఎక్కుతూ... చిత్రీకరించే ఈ అడ్వెంచర్ డాక్యుమెంటరీకి వరల్డ్‌ వైడ్‌ అభిమానులున్నారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా పరిచయమున్న వివిధ రంగాల ప్రముఖులతో ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌‌ను చిత్రీకరిస్తూ ఉంటారు. దాంతో, ఈ షోకి విపరీతమైన ఆదరణతోపాటు అదరిపోయే రేటింగ్ కూడా వస్తుంటుంది. అందుకే, ఈ షోలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమామా కూడా పాల్గొని బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు.  అయితే, ఈ సెన్సేషనల్ షోను ఇండియాలో చేయాలని ప్లాన్ చేసినప్పుడు మొట్టమొదటి ఎపిసోడ్‌కు భారత ప్రధాని నరేంద్రమోడీని బేర్ గ్రిల్స్ ఎంచుకున్నారు. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ అడవుల్లో చిత్రీకరించిన ఈ సాహస యాత్రను డిస్కవరీ ఛానల్ మనోహరంగా చూపించింది. గతేడాది ప్రసారం చేసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీ తన సాహసాలతో ఆకట్టుకున్నారు. ఉత్తరాఖండ్‌ జిమ్‌ కార్బెట్‌ అడవుల్లో మోడీతో మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌ను షూట్ చేశారు బేర్ గ్రిల్స్‌. అత్యంత భయానకంగా ఉండే జిమ్ కార్బెట్ అడవుల్లో బేర్ గ్రిల్స్‌‌తో కలిసి కలియదిరిగారు మోడీ. కొండలు గుట్టలు ఎక్కి దిగారు. అత్యంత సాహసాన్ని ప్రదర్శిస్తూ అడవి మొత్తం కలియదిరిగారు. 2019 ఆగస్ట్‌ 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్‌వర్క్‌పై ప్రసారమైన మోడీ-బేర్ గ్రిల్స్‌... మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌ అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఇక, ఇప్పుడు తన తరువాతి ఎపిసోడ్‌ కోసం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను బేర్ గ్రిల్స్‌ ఎంచుకున్నాడు. కర్నాటకలోని బందిపురా అభయారణ్యంలో రజనీతో మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ అడ్వెంచర్‌ ప్రోగ్రామ్‌ను చిత్రీకరించాడు. రెండ్రోజులపాటు బందిపురా టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో రజనీ అండ్ బేర్ గ్రిల్స్ కలిసి తిరిగారు. పులులు అధికంగా ఉండే బందిపురా అభయారణ్యంలో బేర్ గ్రిల్స్, రజనీ సాహసాలు చేశారు. అయితే, షూట్ సందర్భంగా రజనీ గాయపడ్డారనే వార్తలు కలకలం రేపాయి. చిత్రీకరణ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, తనకేమీ గాయాలు కాలేదని... ఏవో చిన్న ముల్లు గుచ్చుకున్నాయంతే అంటూ రజనీ క్లారిటీ ఇచ్చారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌లో రజనీ గాయపడ్డారన్న వార్తలతో తమిళ సూపర్‌స్టార్‌తో బేర్ గ్రిల్స్ భారీ సాహస కృత్యాలే చేశారనే ప్రచారం జరుగుతోంది. రజనీ ముల్లు గుచ్చుకున్నాయనే చెబుతున్నా.... బందిపురా టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో బేర్ గ్రిల్స్‌తో కలిసి డేరింగ్‌ మూవెంట్స్‌తో రజనీ పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాంతో, రజనీ చేసిన సాహసాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. రజనీ సినిమాలు రికార్డులు సృష్టించినట్లే...  బేర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌ కూడా సంచలనాలు నమోదు చేయడం ఖాయమంటున్నారు. అయితే, రజనీ ఎసిపోడ్‌ను ఎప్పుడు ప్రసారం చేస్తారనేది డిస్కవరీ ఛానల్ ఇంకా ప్రకటించలేదు. అయితే, మోడీ ఎపిసోడ్‌కి 4 బిలియన్ల ఇంప్రెషన్స్‌తో సరికొత్త రికార్డులు నమోదుకాగా, ఇప్పుడు రజనీ డాక్యుమెంటరీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని మాట్లాడుకుంటున్నారు. ఇక, భారత ప్రధాని నరేంద్రమోడీ.... తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ తర్వాత... బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్  కుమార్‌తో... బేర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అసలే, స్టంట్ మాస్టర్ అయిన అక్షయ్ కుమార్‌తో ...  బ్రిటన్ సాహసికుడు బేర్ గ్రిల్స్‌... ఎలాంటి సాహసాలు చేయిస్తారో చూడాలి.  

అప్పుడు రాజయ్య... మొన్న లక్ష్మారెడ్డి... ఇఫ్పుడు ఈటల... కలిసిరాని ఆరోగ్యం...

తెలంగాణ ఆరోగ్యశాఖ గులాబీ నేతలకు అచ్చిరావడం లేదన్న చర్చ నడుస్తోంది. ఒకప్పుడు ఆరోగ్య శాఖ అంటే చాలామంది నేతలు ఎగబడేవారు. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం, సంతృప్తి ఉండేదని ఫీలయ్యేవారు. కానీ తెలంగాణలో ఇప్పుడు ఆరోగ్యశాఖ అంటేనే నేతలు హడలిపోతున్నారు. ఎందుకీ శాఖ ఇచ్చారని సణుక్కుంటున్నారట. ఎందుకంటే, గతంలో ఈ శాఖ నిర్వహించిన నేతల పరిస్థితి అయోమయంగా మారడమే ఇందుకు కారణమంటున్నారు. టీఆర్ఎస్‌ మొదటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో రాజయ్యకు వైద్యారోగ్యశాఖ అప్పగించారు. అయితే ఆయనతో వచ్చిన సమస్య ఏమిటో చెప్పలేదు కానీ, ఏకంగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. తర్వాత ఆ శాఖను లక్ష్మారెడ్డికి అప్పగించారు. ఆయనతో కేసీఆర్ కు ఎలాంటి విభేదాలూ రాలేదు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.  అయితే, ఈసారి వైద్యారోగ్యశాఖను ఈటల రాజేందర్‌కు అప్పగించారు. ఈయనది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఎందుకంటే, ఈటల మంత్రి పదవి ఎప్పుడు పోతుందోనంటూ ప్రచారం జరిగింది. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని ఈటల తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. తామే గులాబీ పార్టీలకు ఓనర్లమంటూ ఏకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసి టీఆర్ఎస్ లో పెను ప్రకంపనలు సృష్టించారు. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈటల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జోరుగా సాగింది. అందుకే ఏడాదిలో ఇంతవరకూ ఒక్కసారి కూడా, ఆరోగ్య శాఖపై ఈటలతో కలిసి కేసీఆర్ సమీక్ష నిర్వహించలేదని చెబుతున్నారు. ఇలా ఆరోగ్య శాఖ తీసుకున్న ఏ నేతకూ, ఆ శాఖ కలిసిరావడంలేదనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి, తెలంగాణలో ఆరోగ్యశాఖ అంటేనే హడలిపోతున్నారు గులాబీ నేతలు. ఏ ముహూర్తాన ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టారో తెలియదు గానీ మానసికంగా రాజకీయంగా అనారోగ్యం బారినపడేస్తుందని అంటున్నారు.

జనసేనానికి మళ్లీ బీజేపీ పిలుపు... ఈసారి ఎందుకు పిలిచారంటే...

ఒకవైపు ఏపీ రాజకీయాలు... మరోవైపు సినిమా షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న పవన్ కల్యాణ్ కు మళ్లీ ఢిల్లీ పిలుపొచ్చింది. ఇప్పటికే రెండుమూడుసార్లు ఢిల్లీ వెళ్లొచ్చిన పవన్ కు... మళ్లీ హస్తిన పిలుపురావడం హాట్ టాపిక్ గా మారింది. మొన్ననే ఢిల్లీకి వెళ్లి మూడు రాజధానులపై కేంద్రానికి నివేదించి, ఆర్థికమంత్రి నిర్మలకు వినతిపత్రమిచ్చి, బీజేపీ అధ్యక్షుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన నడ్డాను కలిసొచ్చిన పవన్‌కు, అంతలోనే మళ్లీ పిలుపెందుకొచ్చిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఈసారి పిలుపునకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసమని తెలుస్తోంది. ఢిల్లీ సమరంలో కేజ్రీవాల్‌ను ఢీకొట్టలేక సతమతమవుతున్న, మోడీ, అమిత్‌ షాలు, అన్ని ఆయుధాలనూ ప్రయోగిస్తున్నట్టే, పవన్‌నూ ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే సైనా నెహ్వాల్‌ను పార్టీలో చేర్చుకున్న కమలదళం... ఢిల్లీ ప్రచారం కోసం రంగంలోకి దింపుతోంది. అలాగే, బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడాకారులను సైతం క్యాంపెయిన్‌కు పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌కు కూడా బీజేపీ పిలిచినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో తెలుగువారి జనాభా బాగానే వుంది. ఇక కన్నడ, తమిళ, కేరళ రాష్ట్రాల ప్రజలూ మంచి సంఖ్యలోనే వున్నారు. సౌతిండియాలో పాపులర్‌ హీరో అయిన పవన్‌ కల్యాణ్‌‌తో ఢిల్లీ ప్రచారం చేయిస్తే, బాగుంటుందని భావిస్తున్నారట బీజేపీ నేతలు. దక్షిణాది ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో క్యాంపెయిన్‌ చేయించేందుకు షెడ్యూల్‌ సెట్‌ చేస్తున్నారు. జనసేన-బీజేపీ జతకట్టిన నేపథ్యంలో, ఉమ్మడి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు రెండు పార్టీల నేతలు. అమరావతిలో రెండుపార్టీలూ కలిసి లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని తలపెట్టినా, ఎందుకనో వాయిదా పడింది. మూడు రాజధానులపై కేంద్రం సుముఖంగా లేదని పవన్‌ ప్రకటించడం, అయితే, కేంద్రానికి ఎలాంటి సంబంధంలేదని జీవీఎల్‌ అనడంపై, ఇప్పటికీ రాద్దాంతం జరుగుతూనే వుంది. ఎవరు చెప్పింది నిజమనుకోవాలో అర్థంకాక జనసైనికులు తికమకపడుతున్నారు. మొత్తానికి అటు సినిమా షూటింగ్‌లు, ఇటు అమరావతి నిరసనలు, పార్టీ నిర్మాణంపై తీరికలేకుండా ముందుకెళుతున్న పవన్‌, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికీ డేట్స్ ఇస్తున్నారు. మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే హస్తిన ఎన్నికల ప్రచారమేనా, రెండు పార్టీలకు సంబంధించి ఇంకా కీలకమైన చర్చలు, అధిష్టాన పెద్దలతో చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

ఊరి మీద పగ.. 23 మంది పిల్లలను బందీ చేశాడు.. కమాండోల చేతుల్లో హతమయ్యాడు

యూపీలోని ఫరూఖాబాద్ లో 23 మంది చిన్నారులని బందీలుగా తీసుకున్న నేరస్తుడు ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. దాదాపు 10 గంటల హైడ్రామా తర్వాత నేరస్థుడిని పోలీసులు కాల్చి చంపారు. అతడి చెరలో ఉన్న చిన్నారులతో పాటు వారి తల్లులని రక్షించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో కలకలం సృష్టించింది. ఫరూకాబాద్ కు చెందిన సుభాష్ బాదం అనే వ్యక్తికి ఒక హత్య కేసులో జీవిత ఖైది పడింది. ప్రస్తుతం పెరోల్ మీద బయటకు వచ్చాడు. నిన్న ( జనవరి 30వ తేదీన ) మధ్యాహ్నం గ్రామంలో తన ఇంటికి సమీపంలో ఉన్న ఇతర ఇళ్లకు వెళ్లి తన కుమార్తె పుట్టిన రోజు ఉందని వెంటనే పిల్లల్ని పంపించాలని అందరిని కోరాడు. తాను మారిపోయిన వ్యక్తినని అందరినీ నమ్మించడంతో వారంతా నిజమే అనుకొని తమ పిల్లలను బర్తడే ఫంక్షన్ నిమిత్తం సుభాష్ తో అతనింటికి పంపారు. ఒకరిద్దరు తల్లులైతే తోడుగా కూడా వెళ్ళారు. అందరూ వచ్చాక ఇంటికింద ఉన్న సెల్లార్ లోని గదుల్లో కూర్చోబెట్టాడు. లోపల్నుంచి గడియలు వేసేసి తాళాలు కూడా వేసి వారందరినీ బందీలుగా చేశాడు. ఆఖరికి తన భార్యాపిల్లలను కూడా బందీలుగా పెట్టాడు.  ఎంతసేపటికీ తమ పిల్లలు తిరిగి రాకపోయేసరికి వీధిలోని కొందరి తండ్రులు అక్కడికి వచ్చి వాకబు చేసేందుకు ప్రయత్నించగా సుభాష్ లోపలి నుంచే వారిని బయటకు తరిమేశాడు. పిల్లల గురించి మాట్లాడితే కాల్చిపడేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత సుభాష్ ఇంటి దగ్గరికి వెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన మరో గ్రామస్థుడి పై తుపాకీతో కాల్పులు జరిపాడు. తాను ఎవరితోనూ మాట్లాడనని ఎమ్మెల్యేను పిలిపించాలని చెప్పాడు. వెంటనే భోజ్ పూర్ ఎమ్మెల్యే నాగేంద్ర సింగ్ కు కబురుపెట్టారు. సాయంత్రానికి నాగేంద్ర సింగ్ అక్కడకు చేరుకున్నారు. ఆయనను కలవడానికి కూడా సుభాష్ ఒప్పుకోలేదు. అర్థరాత్రిదాకా ఈ బందీ డ్రామా కొనసాగింది. నిందితుడు ఏడాది ఒక్క నెల వయసు ఉన్న పాపను మాత్రమే బయటకు వదిలి పెట్టాడు.  సుభాష్ చెరలో 23 మంది పిల్లలు ఉన్నట్టు తెలియడంతో ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్వయంగా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కమెండోలను అక్కడికి పంపించారు. వారిపై కాల్పులు జరిపిన సుభాష్ ఓ గ్రెనేడ్ కూడా విసిరేశాడు. పిల్లలని ఏమీ చేయకుండా లొంగిపోవాలంటూ కమేండోలు విజ్ఞప్తి చేసినా సుభాష్ వెనక్కి తగ్గలేదు. దీంతో బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన కమాండోలు అతడిని కాల్చి చంపారు. 10 గంటల తర్వాత 23 మంది చిన్నారులను వారి తల్లులను విడిపించారు. సుభాష్ ఓ మహిళ హత్య కేసులో దోషి. ఆ హత్యతో తనకు సంబంధం లేదని ఆ సమయంలో తాను ఆ చోటే లేనని వాదించాడు. కాని గ్రామస్తులు కొందరు అతను ఉన్నాడని చెప్పడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఊరి మీదనే కోపం పెంచుకున్నాడు సుభాష్. సుభాష్ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెప్పారు.

టార్గెట్ రోజా.. అనితకు కీలక బాధ్యతల వెనుక బాబు వ్యూహం!

తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నియమితులయ్యారు. మొన్నటి వరకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో దళిత వర్గానికి చెందిన అనితను నియమిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట రావు స్పందిస్తూ.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై వంగలపూడి అనిత సారధ్యంలో తెలుగు మహిళలు పోరాటం చేస్తారని పేర్కొన్నారు. వంగలపూడి అనితకు కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా లక్ష్యంగా అనితకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. టీడీపీలో అనిత ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. గతంలో అసెంబ్లీలో రోజా టీడీపీ పైన విమర్శలు చేసిన సమయంలో అనిత ధీటుగా స్పందించేవారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో రోజా దూకుడు మరింత పెంచారు. దీంతో రోజా వంటివారికి ధీటుగా మాటలతో సమాధానం చెప్పాలంటే.. అనితానే కరెక్ట్ అని భావించిన చంద్రబాబు.. ఆమెకి కీలక బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.

నేటి నుండి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ మరో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతోంది. మోడీ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ సెషన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో  రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. నిర్మలా సీతారామన్ రేపు సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం రెండు విడతలుగా జరగనున్న ఈ శీతాకాల సమావేశాలు తొలి విడతలో ఫిబ్రవరి 11 వరకు జరుగనున్నాయి. అనంతరం మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు రెండవ విడత సమావేశాలు జరగనున్నాయి. రెండు విడతల మధ్య ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు విరామం ఉండనుంది. బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను ఈ విరామంలోనే పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నట్లు సమాచారం.  గతేడాది ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన మోదీ ప్రభుత్వం ఈ సారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ( ఫిబ్రవరి 1వ తేదీన ) కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చాక ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభాపర్వానికి పాలక ప్రతిపక్షాల అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే సీఏఏ , ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నందున ఈ అంశం పై సభ దద్దరిల్లే అవకాశమున్నట్లు అంచనా. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమైంది.పార్లమెంటు సమావేశాలు ఏ స్థాయిలో ప్రజలకు మేలు చేకూర్చుతాయో వేచి చూడాలి.

బోరిస్‌ పంతం నెగ్గింది.. స్వతంత్ర దేశంగా బ్రిటన్

బ్రిటన్ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనిపై క్వీన్ ఎలిజబెత్ టూ కూడా సంతకం చేశారు. దీంతో బ్రెగ్జిట్ నుంచి ఎగ్జిట్ అయిన బ్రిటన్ నేటి నుంచే స్వతంత్ర దేశంగా ఉండనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్టేనని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బ్రెగ్జిట్ కు సంభందించి ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ 330,231 ఓట్ల తేడాతో ఆమోద ముద్ర వేసింది. దీనికి ఎగువ సభ కూడా ఓకే చెప్పడంతో బ్రిటన్ స్వతంత్రంగా మారిపోయింది. ఐరోపా దేశాల సమాఖ్య నుండి విడిపోయింది.  ఈ బిల్లుపై ఈయూలో జరిగిన చర్చ సందర్భంగా చట్టసభ్యులు అందరూ 50 ఏళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం 621-49 తేడాతో బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. ఆల్ లాంగ్ సైన్ అనే సాంప్రదాయ పాటతో ఈయూ పార్లమెంట్ బ్రిటన్ కు వీడ్కోలు పలికింది. బ్రెగ్జిట్ అజెండా తోనే పదవి చేపట్టిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఈయూ నుంచి వైదొలిగేందుకు పట్టుదలతో కృషి చేసి విజయం సాధించారు. 2018లో అప్పటి ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ కోసం చర్చలు జరిపిన దిగువ సభ తిరస్కరించటంతో రాజీనామా చేశారు. ఆ తరవాత పీఠమెక్కిన బోరిస్ సభలో మెజారిటీ లేకపోవడంతో ఎన్నికలకు వెళ్లారు. సంపూర్ణ మెజార్టీతో మళ్లీ ప్రధాని బాధ్యతలు చేపట్టి తన బ్రెగ్జిట్ కలను సాకారం చేసుకున్నారు.

సిల్లీ రీజన్స్.. ప్రతి శుక్రవారం కారణాలు చెబుతూ కోర్టుకు గైర్హాజరవుతున్న జగన్! 

అక్రమాస్తుల ఆరోపణల కేసులో విచారణ కోసం శుక్రవారం (జనవరి 31వ తేదీన) నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ ఆయన హాజరుకాలేదు. అయితే ఇందుకు సంబంధించి ఈడీ కేసులో ఉన్న  ఐదు చార్జ్ షీట్ల వల్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని గత వారం సీబీఐ కోర్టు స్పష్టం చేయడం జరిగింది. దీంతో సీబీఐ కేసుల పై  జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మొత్తం 11 చార్జిషీట్ లకు గానూ 11 పిటిషన్ లో హైకోర్టులో వేయడం జరిగింది. 11 పిటీషన్ లకు సంబంధించి విచారణ జరిపిన హైకోర్టు ఫిబ్రవరి 6 వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.  దీంట్లో ప్రధానంగా సిబిఐ వాదించింది. జగన్ కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అయితేనే కేసులో పురోగతి ఉంటుందని భావించింది. కానీ A1 నిందితుడిగా ఉన్న వైయస్ జగన్ కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల కేసు విచారణలో జాప్యం జరుగుతుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టుకు స్పష్టం చేయడంతో.. సీబీఐ కోర్టు ఈ విషయాన్ని హైకోర్టుకు చెప్పబోతుంది.  ప్రధానంగా ఈ రోజు హాజరు కావాల్సినా కూడా ప్రభుత్వ కార్యకలాపాల వలన తాను హాజరు కాలేకపోతున్నట్లుగా ఈ రోజు జగన్ తరుపున న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే.. ఇదివరకే ఈడీ కేసులో ఖచ్చితంగా హాజరుకావాలని కోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. హాజరుకాని పక్షంలో నోటీసులు జారీ చేస్తామని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇవాళ జగన్ హాజరుకానందున నోటీసులు జారీ చేస్తుందా?.. లేకుంటే హైకోర్టు విచారణను పరిగణనలోకి తీసుకుంటుందా?.. అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి వ్యక్తిగత కారణాలు, ప్రభుత్వ కార్యకలాపాలు అంటూ జగన్ వారంవారం కోర్టుకి కారణాలు చెప్తుండటంతో.. కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

జనగామలో భారీ పేలుడు... ఎగసిపడుతున్న మంటలు

జనగామ జిల్లా ఖిలాషాపురం తారా ఇండస్ర్టీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. రియాక్టర్ లు చార్జింగ్ పెడుతుండగా భారీ శబ్దంతో పేలాయి. ఈ ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు అదుపు లోకి రాలేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని తారా ఇండస్ర్టీస్ లో కెమికల్స్ లో వాడే టిన్నర్ తయారవుతుంది. ఈ టిన్నర్స్ కు సంబంధించిన కెమికల్ ను నాలుగు రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అయితే అక్కడ పనిచేసే కార్మికులు ఉదయమే తమ విధుల్లోకి వచ్చి రియాక్టర్స్ కు చార్జింగ్ పెడుతుండగా అక్కడ షాట్ సర్క్యూటైంది. ఒక్కసారిగా పొగలు అలముకున్నాయి. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది మొత్తం ప్రాణ భయంతో బయటకు పరుగులుతీశారు. అందరూ క్షేమంగా బయటికి వచ్చారు. కాకపోతే ఆ ప్యాక్టరీ లో ఉన్న రియాక్టర్ల మొత్తం ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. మొత్తం భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. అందులో తయారు చేసేది పెయింటింగ్స్ లో వాడే టిన్నర్ అనే కెమికల్ కాబట్టి ఆ కెమికల్ ధాటికి మొత్తం ఆ వాతావరణమంతా దుర్ఘంద పూరితమైంది. ఖిలాషాపూర్ గ్రామానికి మొత్తం దట్టమైన పొగలు అలుముకోనున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెడుతున్నారు.

డమ్మీ ఉరి.. నిర్భయ దోషుల ఉరికి ట్రైల్స్ వేయనున్న తలారి పవన్!

నిర్భయ దోషులు రేపు ( ఫిబ్రవరి 1వ తేదీన ) ఉదయం 6 గంటలకు ఉరికంబం ఎక్కనున్నారు. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీసేందుకు తీహార్ జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి.. ఇవాళ మధ్యాహ్నం డమ్మీ ఊరి వేయనున్నారు తలారి పవన్. నిర్భయ దోషులకు పడిన మరణశిక్షను అమలు చేసేందుకు  ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్నారు తలారి పవన్. తలారి కోసం తీహార్ జైలు ప్రాంగణంలోనే ప్రత్యేక వసతి గది ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణం లోనే ఉంటూ ఉరితాడు సామర్థ్యంతో పాటు ఇతర విషయాలను పరిశీలిస్తున్నారు.  కొద్ది రోజుల ముందు నిర్భయ దోషులకు ఉరివేసేందుకు జైలు అధికారులు ట్రయల్స్ నిర్వహించారు. బక్సర్ నుంచి ఉరితాళ్లను తెప్పించారు. అయితే తమకు విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా ఆపేందుకు నిర్భయ దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా నిర్భయ దోషి అక్షయ్ కుమార్ వేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దాంతో పాటు ఫిబ్రవరి 1వ తేదీన అమలు కానున్న ఉరిశిక్ష పై స్టే విధించాల్సిందిగా అతడు చేసిన మరో పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరో నిందితుడు వినయ్ శర్మ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది.  

నామినేటెడ్ పదవుల కోసం కేటీఆర్ చుట్టూ గులాబీ నేతల ప్రదక్షిణలు!!

నామినేటెడ్ పదవుల భర్తీ కోసం గులాబీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలేవీ లేకపోటంతో కేసీఆర్ పదవులు భర్తీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆశావహులంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కార్పొరేషన్ లు, కమిషన్ లు ఇతర సంస్థలు కలిపి 56 మందికి చైర్మన్ పదవులను కట్టబెట్టింది. అందులో 49 ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి, వీటిలో కొన్ని మూడేళ్ల పదవీకాలం మరి కొన్ని రెండేళ్ల పదవీ కాలంతో నియామకాలు జరిగాయి. వీటి పదవీ కాలం కూడా ముగిసింది, ఇందులో కేవలం టీఎస్ ఐఏసీ చైర్మన్ బాలమల్లు, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పదవీకాలం మాత్రమే రెన్యువల్ అయ్యాయి. ఈ మధ్య పార్టీలో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. గతంలో పదవీ కాలం ముగిసిన ఛైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెన్యువల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న గత చైర్మన్ లకు ఎదురు చూపులే మిగిలాయి. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవుల కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇదుగో అదుగో అంటూ ఊరించడమే తప్ప ఆచరణలోకి రాలేదన్న ఆవేదనకు పార్టీ నేతలు గురవుతున్నారు. జిల్లా స్థాయి పదవులతో కలిపి దాదాపు 500 వరకూ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని అంచనా. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నలుగురికి పైగా అవకాశం వస్తుంది. రాష్ట్రస్థాయి లోని కొన్ని కార్పొరేషన్ లు కనీసం ఆరుగురి నుంచి పదిహేను మంది దాకా డైరెక్టర్ లను, సభ్యులను నియమించే అవకాశం ఉంది. ఆ లెక్కన కార్పొరేషన్ చైర్మన్ లను ఏర్పాటు చేసి అనుబంధంగా నామినేటెడ్ పదవులను ఇస్తే సుమారు 500 మందికి పైగా నాయకులకు అవకాశం దక్కనుంది. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యే లకు, ఎమ్మెల్సీ లకు చీఫ్ విప్, విప్ పదవులు దక్కాయి. ఇక పదవులు దక్కని ఎమ్మెల్యేలు చాలామంది కూడా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. ఇక మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల అనుచరులు కూడా నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు ఎన్నికల్లో టిక్కెట్ దక్కక ఏదో ఒక మంచి పదవి ఇస్తానని టీఆర్ఎస్ నుంచి హామీ తీసుకున్నవారు ఇలా చాలా మంది పదవుల కోసం ఆశపడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతలు అంతా తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేశారు. ఎన్నికల్లో కష్టపడితే.. పని తీరును పార్టీ ముఖ్య నేతలు గుర్తిస్తారని భావించి పని చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ఆశావహులంతా తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసి పదవుల విషయం అడుగుతున్నారు. తాజాగా వివిధ మాజీ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు కేటీఆర్ ను కలిసి తమ పదవుల రెన్యువల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ విద్యార్థి విభాగంతో పాటు మొదట్నుంచీ ఉస్మానియా యూనివర్సిటీ లో ఉద్యమంలో పాల్గొన్న నేతలు తమను గుర్తించాలనీ కేటీఆర్ ను కోరుతున్నట్టు తెలుస్తోంది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మహిళా నేతలు కూడా తమకు పదవులు ఇవ్వాలని కేటీఆర్ ను కోరుతున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. పలుమార్లు ప్రకటిస్తారని ప్రచారం జరిగినా ఏదో ఒక కారణంతో ఆగిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక మున్సిపల్ ఫలితాల జోష్ లో ఉన్న కేసీఆర్ ఓ దఫా నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.

వికేంద్రీకరణ బిల్లుపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ!!

పాలన వికేంద్రీకరణ బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. కమిటీలు వేయొద్దని కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని సమాచారం. చైర్మన్ నిర్ణయం పాటించొద్దు అంటూ ఉప ముఖ్యమంత్రి, చీఫ్ విప్ లు లేఖలు రాశారు. దీంతో కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. పాలన వికేంద్రీకరణ, సీ ఆర్ డీ ఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు కాకుండా జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కమిటీల ఏర్పాటు జరగకుండా చూడాలని ప్రభుత్వ, వేసి తీరాల్సిందేనని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉండటంతో ఉత్కంఠ భరితంగా మారింది. సెలక్ట్ కమిటీల ఏర్పాటును అడ్డుకునే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి కార్యదర్శికి ఏకంగా లేఖ రాయగా కమిటీల్లో నియమించేందుకు తమ సభ్యుల పేర్లను టిడిఎల్పీ ఇప్పటికే ఇన్ చార్జి కార్యదర్శి రాజ్ కుమార్ కు అందజేసింది. దీంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏకంగా మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం తుది నిర్ణయం తీసుకుని పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేదాకా మండలి కొనసాగుతుంది. ఈలోపు సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కాకుండా మండలి ఇన్ చార్జి కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెలక్ట్ కమిటీల్లో నియమించే ఎమ్మెల్సీల పేర్లు పంపాల్సిందిగా ఆయా పార్టీలకు లేఖలు రాయాలని మండల ఇన్ చార్జి కార్యదర్శికి ఇప్పటికే చైర్మన్ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో చైర్మన్ ఆదేశాల ప్రకారం ఆయన వెంటనే లేఖలు రాస్తారు కానీ, ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉండటంతో ఆయన ఇంత వరకూ ఈ లేఖలు పంపలేదు. ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే యోచనతో టిడిపి శాసన సభాపక్షం తమ తరపున పదిమంది ఎమ్మెల్సీల పేర్ల జాబితాను ఇప్పటికే కార్యదర్శికి అందజేసింది. ఒక్కో కమిటీలో టిడిపి కోటా కింద ఐదుగురు సభ్యులు వస్తారు. ఇది అందజేసినట్టు కార్యదర్శి నుంచి రశీదు కూడా తీసుకున్నారు. ఇది తెలిసి అధికార పక్షం వెంటనే రంగంలోకి దిగింది. మండలిలో సభా నాయకుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ లు విడివిడిగా కార్యదర్శికి లేఖలు రాశారు. నియమాలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీల ఏర్పాటు జరుగుతున్నందున అందులో తాము భాగస్వామి కాబోమని తమ పార్టీ నుంచి ఎవరూ ఈ కమిటీల్లో ఉండరని ఉమారెడ్డి తన లేఖలో తెలిపినట్టు ప్రచారం జరుగుతుంది. కమిటీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం.. నియమాలకు విరుద్ధమని అందువల్ల కమిటీలు ఏర్పాటు చేయవద్దని కోరుతూ బోస్ మరో లేఖ రాశారు. ప్రభుత్వ అధికారి అయిన కార్యదర్శి అటు ప్రభుత్వపక్షం మాట కాదనలేక, ఇటు చేరిపోయిన ఆదేశాలను ధిక్కరించే పరిస్థితి లేక ఏ నిర్ణయం తీసుకోకుండా రోజులు నెట్టుకొస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మండలిలో సభా నాయకుడి లేఖను జతపరుస్తూ.. పై అభ్యంతరాల దృష్ట్యా తాను సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేనని చైర్మన్ కు లేఖ రాయాల్సిందిగా కార్యదర్శికి ప్రభుత్వం సూచించిందని అంటున్నారు. మరి ఆయన అలా రాస్తారా లేదా అన్నది చూడాలి.