ఉపరాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు.. త్వరలో ప్రధానిని కూడా!

అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని  కలిశారు. రాజధాని కోసం రైతుల ఆందోళనలు, రైతుల పట్ల పోలీసుల తీరును వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. ‘రాజధాని కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చాం. ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారు. తాము ఆందోళన వ్యక్తం చేస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు’ అంటూ రైతులు తమ గోడుని ఉపరాష్ట్రపతికి వినిపించారు. రాజధాని తరలిపోకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా సూచించాలని కోరారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ  అపాయింట్ మెంట్ లు కూడా కోరామని, వారిని కూడా కలిసి సమస్య వివరిస్తామని తెలిపారు. అపాయింట్‌మెంట్‌ దొరికితే రైతులు ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సమ్మక్క సారక్కకు బెల్లం అంటే భలే ఇష్టం... అందుకే బెల్లంతో మొక్కులు...

వనదేవతలు సమ్మక్క సారాలమ్మలకు బెల్లం అంటే ప్రీతి. అందుకే, మేడారం జాతరకు వచ్చే భక్తులు... సమ్మక్క సారక్కలకు బెల్లం రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. అలా, వనదేవతలకు సమర్పించే బెల్లాన్ని బంగారంగా భావిస్తారు. కొందరు భక్తులు తమ బరువుకు తగ్గ బెల్లాన్ని తూకమేసి సమర్పిస్తారు. మెజారిటీ భక్తులు తమ స్థోమతకు తగినవిధంగా బెల్లం బంగారాన్ని తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, మేడారం జాతర వచ్చిందంటే బెల్లం ధరలకు ఒక్కసారి రెక్కలు వచ్చేస్తాయి. వ్యాపారులు ఒక్కసారిగా రేటు పెంచేస్తారు. సాధారణంగా కిలో బెల్లం ధర 35 రూపాయల్లోపు ఉంటే... మేడారం జాతర సందర్భంగా దాదాపు 15 రూపాయలు వరకు పెంచేసి కిలో 50కి అమ్ముతున్నారు. అయితే, బెల్లం ధరలు పెంచేసినా అమ్మవార్లకు మొక్కు చెల్లించడం తప్పనిసరి కావడంతో కొందరు భక్తులు చక్కెర సమర్పిస్తున్నారు.  

జగన్ లాగా ఒక్క ఛాన్స్ అంటున్న మోడీ... మరి, ఇస్తారో లేదో?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. అధికార ఆప్... అపోజీషన్ బీజేపీ... ఇంటింటి ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. సభలు, ర్యాలీలతో రెండూ పార్టీలూ హోరాహోరీగా క్యాంపైనింగ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ... పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ అండ్ బీజేపీ మధ్యే సాగుతోంది. అయితే, సర్వే సంస్థలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని చెబుతున్నా... ఈసారి మాత్రం ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ముందుకెళ్తోంది. అందుకే, సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్న కమలనాథులు... టాప్ లీడర్స్ ను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ.... బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ రాజధాని ప్రజలను కోరారు. అభివృద్ధిని, మార్పును కోరుకుంటున్న ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్న నరేంద్రమోడీ... ఒక్క అవకాశమిస్తే... డెవలప్ మెంట్ అంటే ఎలాగుంటుందో చేసి చూపిస్తామన్నారు. బీజేపీని గెలిపించండి... అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానంటూ ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ మొత్తం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు పౌర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఢిల్లీ ప్రజల ఓటు... దేశంలో తమ ప్రభుత్వం చేపడుతున్న మార్పులకు బలం చేకూర్చేలా ఉండాలని మోడీ సూచించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం మార్పు కోసం ఫిబ్రవరి ఎనిమిదిన ఓటుతో బీజేపీకి, ఎన్డీఏకి పట్టం కట్టాలని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే ఢిల్లీని అభివృద్ధిచేసి చూపిస్తామన్నారు.

వామ్మో రఘునందన్... అత్యాచార ఆరోపణలు నిజమేనా?

చట్టాలు, రూల్సూ రెగ్యులేషన్స్, నీతి నిజాయితీ, నిబంధనలు అంటూ మాట్లాడే తెలంగాణ బీజేపీ నేత ఎం.రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పొలిటికల్ లీడర్ కంటే ముందుగా రఘునందర్ రావు లాయర్ కావడంతో ఆ మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేత, లాయర్ రఘునందన్ రావు తనపై అత్యాచారం చేశాడంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కి మహిళ ఫిర్యాదు చేసింది. విడాకుల విషయంలో తనను ఆఫీసుకు పిలిచిన రఘునందర్ రావు... మత్తు మందు కలిపిన కాఫీ ఇచ్చి... ఆ తర్వాత అత్యాచారం చేశాడని మహిళ ఆరోపిస్తోంది. తనపై అత్యాచారం చేస్తున్నప్పుడు తీసిన వీడియోను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. రఘునందన్ రావు దురాగతంపై ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపిన బాధితురాలు.... తనకు న్యాయం చేయాలంటూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కోరింది. అయితే, తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆ మహిళ ఫిర్యాదు చేసిందని బీజేపీ నేత రఘునందన్ రావు అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించేవారిపై కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే తనపై ఎవరో ఈ ఫిర్యాదు చేయించారని రఘునందన్ చెబుతున్నారు. హెచ్ ఆర్సీ నుంచి ఫిర్యాదు పత్రాల కాపీని తీసుకుని మహిళ ఆరోపించిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు.  అయితే, ఓ మహిళ తనపై రఘునందన్ అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి బెదిరిస్తున్నాడని... హెచ్ఆర్సీని, పోలీస్ కమిషనర్ ఆశ్రయించిందంటే అసలేమీ నిప్పు లేకుండా పొగ రాదు కదా అంటున్నారు. ఒకవేళ ఆ మహిళ ఆరోపణలు నిజమైతే రఘునందన్ ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. అయితే, దిశ ఘటన జరిగినప్పుడు మీడియా డిబేట్స్ లో నీతి వ్యాక్యాలు వల్లివేసిన రఘునందన్ రావుపై... ఓ మహిళ... తనపై అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి బెదిరిస్తున్నాడని ఆరోపించడం మాత్రం కలకలం రేపుతోంది.

కుంభమేళా తర్వాత మేడారమే... మహా జాతరకు హెలికాప్టర్లు...

సమ్మక్క సారక్క జాతర... ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండగ... ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరను ...తెలంగాణ ప్రభుత్వం... రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహిస్తోంది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. అందుకే, తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం సకల ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పిస్తోంది. ఇక, మేడారం వెళ్లేందుకు ఆర్టీసీ, రైల్వేలు ప్రత్యేక రైళ్లు, బస్సులను నడుపుతుండగా.... తెలంగాణ టూరిజం... హెలికాప్టర్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి మేడారానికి హెలికాప్టర్లను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే ప్రతి హెలికాప్టర్లో మొత్తం ఆరుగురు ప్రయాణించవచ్చు. అందుకు లక్షా 80వేలు ఛార్జ్ చేస్తారు. అలాగే, జీఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. మేడారం తీసుకెళ్లడమే కాకుండా గద్దె దగ్గర వీఐపీ దర్శనం కల్పిస్తారు. ఇక, మేడారం జాతర ప్రాంగణాన్ని హెలికాప్టర్ ద్వారా తిలకించేందుకు కూడా తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ఒక్కొక్కరి 2999 రూపాయల చొప్పున రేట్ ఫిక్స్ చేశారు. హెలికాప్టర్ సదుపాయం కోసం 94003 99999 నెంబర్ ను కాంటాక్ట్ చేయొచ్చని తెలంగాణ టూరిజం ప్రకటించింది.  అయితే, దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతి మధ్య జరిగే మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు, హెలికాప్టర్ ద్వారా దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతిని, లక్షలాది మంది భక్తుల్ని తిలకించడం అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.

ఏపీ వైద్యారోగ్య మంత్రి ఇంటి పక్కన దుస్థితి ఇది... ఇక, రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందో?

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి... డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంత నియోజకవర్గం ఏలూరులో ప్రజల ప్రాణాలను భరోసా దొరకడం లేదు. వైద్యారోగ్య మంత్రి ఆళ్ల నాని నివాసానికి దగ్గరలో ఉన్న ఏలూరు పెద్దాసుపత్రిలో వైద్యం అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరితే తిరిగి ప్రాణాలతో బయటపడతామనే నమ్మకం లేకుండా పోతోంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏలూరు పెద్దాసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగులను పట్టించుకోకుండా సొంత పనుల్లో మునిగితేలుతున్నారని అంటున్నారు. ఇటీవల ఆస్పత్రి ఆవరణలోనే డీజే పెట్టుకుని డ్యాన్సులేసిన వైద్యులు, సిబ్బంది... విధి నిర్వహణలోనూ అదే తీరుతో ఉంటున్నారని మండిపడుతున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందిస్తామని జగన్ సర్కారు చెబుతుంటే... ఏలూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మాత్రం ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు.  ఇటీవల కళ్లు తిరుగుతున్నాయంటూ ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఓ మహిళ... వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో క్షణాల్లో శవంగా మారింది. నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఇలా ఎంతోమంది రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, దాంతో ఈ హాస్పిటల్ కి రావాలంటేనే వణికిపోతున్నారని అంటున్నారు. జనరల్ వార్డులోకి పంపేసి చేతులు దులుపుకుంటున్న వైద్యులుచ ఆ తర్వాత చికిత్స కోసం రోగుల బంధువులు కాళ్లావేళ్లాపడ్డ రావడం లేదని ఆరోపిస్తున్నారు. రోగుల ప్రాణాలకే కాదు... మృతదేహాలకు కూడా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో రక్షణ కరువవుతోంది. పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకొస్తున్న మృతదేహాలను ఎలుకలు పీక్కుతినేస్తున్నాయి. పోస్టుమార్టం కోసం తీసుకొచ్చిన ఓ మృతదేహం కళ్లను ఎలుకలు తినేయడంతో రిపోర్టే తేడా వచ్చిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇలా, ఒకటి కాదు రెండు కాదు.... అనేక దారుణాలకు ఏలూరు ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా మారుతోంది. ఏకంగా, వైద్యారోగ్యశాఖ మంత్రి సొంత ఇలాకాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై రోగుల బంధువులు మండిపడుతున్నారు.  అయితే, ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోని పెద్దాసుపత్రిలోనే ఇలాంటి దుస్ధితి ఉంటే... ఇక, రాష్ట్రంలోని ప్రభుత్వాస్పుత్రుల్లో పరిస్థితి ఎలాగుందో ఊహించుకోవచ్చని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో... కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వాస్పతుల్లో వైద్యం అందిస్తామని చెబుతుంటే... స్వయంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఇలాకాలోని పెద్దాసుపత్రిలోనే వైద్యం అందక రోగులు మరణించడం విమర్శలకు తావిస్తోంది.

సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపిన టీడీపీ, బీజేపీ!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిమిత్తం పార్టీలు తమ ఎమ్మెల్సీల పేర్లు పంపాలని షరీఫ్ ఇటీవల సూచించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ లు తమ సభ్యుల పేర్లను పంపాయి. టీడీపీ నుంచి మూడు రాజధానుల బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ కోసం.. నారా లోకేష్, అశోక్ బాబు, తిప్పేస్వామి, బీటీనాయుడు, సంధ్యారాణి పేర్లు.. సీఆర్డీఏ రద్దు బిల్లు కోసం.. దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, బుద్ధా వెంకన్న, బీదా రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు పేర్లు పంపారు. బీజేపీ నుంచి మూడు రాజధానుల బిల్లు కోసం మాధవ్, సీఆర్డీఏ రద్దు బిల్లు కోసం సోము వ్రీరాజు. పీడీఎఫ్ నుంచి మూడు రాజధానుల బిల్లు కోసం కేఎస్ లక్ష్మణరావు, సీఆర్డీఏ రద్దు బిల్లు కోసం ఇళ్ల వెంకటేశ్వరరావు.

దూకుడు పెంచిన సీఐడి.. అమరావతి భూముల కొనుగోలు‌పై ఈడీ కేసు

అమరావతి భూముల కొనుగోళ్లు అక్రమాల కేసు పై సిఐడి దూకుడు పెంచింది. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ ప్రారంభించిన అధికారులు కొనుగోళ్లు జరిపిన వ్యక్తులను విచారిస్తున్నారు. ఇప్పటికే 4 వేల ఎకరాల మేరకు కొనుగోళ్లు, అక్రమాలు జరిగాయని క్యాబినెట్ సబ్ కమిటీ తేల్చింది. వారిలో 790 మంది తెల్లరేషన్ కార్డు దారులు ఉండటం గమనార్హం. ఇప్పటికే సీఐడీ వారికి నోటీసులను ఇచ్చింది. భూ అక్రమాల పై దర్యాప్తు చేయాలని సీఐడీ ఈడీకి లేఖ రాసింది. భూమి కొనుగోళ్ళలో మనీ లాండరింగ్ జరిగినట్లు తేల్చి అందుకు సంబంధించిన దర్యాప్తును ఈడీ చేపట్టాలనీ కోరింది. సీఐడీ నోటీసులు ఇచ్చిన వివరాల ప్రకారం కొంతమందికే తెలుసు కాబట్టి వాటి ఆధారంగా భూ డాక్యుమెంట్ ను ఈ తెల్లరేషన్ కార్డుల వివరాలను కూడా ఈడీకి లేఖ రాశారు. సీఐడీ లేఖ ఆధారంగా ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు సోమవారం నాడు కేసు నమోదు చేశారు. ఇక వారి దగ్గర నుండి తీసుకునే భూములను జగన్ ప్రభుత్వం ఏం చెయ్యనుంది? ఎవరికి ఇవ్వనుంది? అనే అంశాలు చర్చలకు దారి తీస్తున్నాయి.

రాజశ్యామల యాగం పూర్ణాహుతికి హాజరైన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి.. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న సీఎం జగన్.. అనంతరం గోమాతకు నైవేద్యం సమర్పించి.. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశారు. అదేవిధంగా పీఠంలో కొత్తగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.  ఆ తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి సీఎం జగన్ పాల్గొన్నారు. లోక కల్యాణార్థం విశాఖ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతికి సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యులు ప్రశాంతిరెడ్డి, నాదెళ్ల సుబ్బారావు, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్టాలిన్ తో కలిసిన పీకే.. తమిళనాట అడుగుపెట్టిన వ్యూహకర్త.. ఇక గెలుపే ఆలస్యం

లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు నెగ్గిన డీఎంకేకు తమిళనాట ఎదురేలేని పరిస్థితి నెలకొంది. రజినీకాంత్ ఎంట్రీతో పాటు ఇతరుల వల్ల తన విజయ యాత్రకు ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలని చూస్తున్నారు స్టాలిన్. అందుకే ప్రస్తుతం దేశంలో సక్సెస్ ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. డీఎంకే తరపున కార్యదర్శి ఆర్ ఎస్ భారతి పీకే టీమ్ తో కలిసి ఒప్పంద పత్రాల పై సంతకం చేశారు. 15 నెలలకు ఈ ఒప్పందం కుదిరింది.  అన్ని రాజకీయ పార్టీ లతో ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకోరని.. గెలుపు అవకాశాలున్న పార్టీలతో మాత్రమే చేతులు కలుపుతారని ప్రచారం ఉంది. గతంలో నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్, మమత బెనర్జీ, జగన్మోహనరెడ్డి, ఉద్దవ్ ఠాక్రే లకు సలహాలిచ్చి తన వ్యూహాలతో ఆయా పార్టీలు విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎన్నికల ప్రసంగంలో సామెతలు, ఊతపదాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. సామెతలను వాడేటప్పుడు పలుమార్లు వాటి అర్ధాలు మార్చేసి వ్యాఖ్యాలు మార్చి పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలుగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ చేశారు. ప్రస్తుతం పికే టీమ్ వాటికి కౌంటర్ ఇచ్చే పనిలో పడినట్లు సమాచారం. మొత్తం మీద అనేక పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించిన పికే టీమ్ దక్షిణ భారతదేశంలో మరో పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రైతుల సవాల్.. కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్!

హైకోర్టును కర్నూలుకు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ వేశారు. జీవో నెంబర్ 13 చట్ట విరుద్ధమంటూ పిటిషన్ లో పేర్కొన్నారు రైతులు. ఈ ఉదయం హైకోర్టుకు రాజధాని ప్రాంత రైతులు, రైతు పరిరక్షణ సమితి తరఫున పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా దాఖలు చేశారు. శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా సీఎం జగన్ రాజధాని కార్యాలయాల తరలింపు నిర్ణయం తీసుకోవటంపై కోర్టును ఆశ్రయించారు. తాజాగా కర్నూలుకు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని వెలగపూడి నుండి తరలించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోర్టు మెట్లెక్కారు రాజధాని రైతులు. కార్యాలయాలను కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటీషన్ లో జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏను ప్రతివాదులుగా చేర్చి పిటిషనర్ పిటీషన్ వేశారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది.

పద్దతి మార్చుకో... జగన్ పాలనపై విమర్శలు చేస్తున్న జాతీయ, అంతర్జాతీయ పత్రికలు!

మూడు రాజధానుల నిర్ణయం పరాకాష్ఠను అందుకుందని తమ సంపాదకీయాలలో ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి పై ఆందోళనను తెలియజేశాయి జాతీయ మీడియా సంస్థలు. బ్లూమ్ బర్గ్ వంటి అమెరికా పత్రికలు సైతం విద్యుత్ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తోందని విమర్శించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ.. ఆయన ఐదేళ్ళలో తల పెట్టిన ప్రాజెక్టులను నిర్ణయాలను పూర్తి చేయటం రాష్ట్రానికే కాదు దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుందని ముక్త కంఠంతో వినిపించాయి. ఈ విషయంలో రాజశేఖర్ రెడ్డి నుండి నేర్చుకోండి అంటూ ముక్తాయించారు.  మూడు రాజధానులు సరైన నిర్ణయం కాదని అన్నారు ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా. భారతదేశానికి అమరావతి వంటి గ్రీన్ ఫీల్డ్ రాజధాని అవసరమని తెలిపారు. అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమన్నారు సహసంపాదకులు సచ్చిదానందమూర్తి. తెలుగు నాడును ఇంగ్లీషు నాడుగా మారుస్తున్నారని.. జగన్ సర్కారు పాలనలో రద్దుల వర్గమే కొనసాగుతోందన్నారు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కులను ఉపయోగించుకొని శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేయడం పూర్తిగా అనవసరమంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. ఈ ఘర్షణాయుత రాజకీయాల వల్ల రాష్ట్రం దెబ్బ తింటుందని.. కక్ష సాధింపే జగన్ ప్రధాన దృష్టిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. చంద్రబాబు మేధో జనితమైన అమరావతి ఇప్పుడు దెయ్యాల నగరంగా మారే ప్రమాదం ఉందన్నారు. జగన్ అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలే అమలు చేస్తే ఖజానా గుల్లవుతుందని వెల్లడించింది. చంద్రబాబుతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలనుకున్న అసంపూర్ణ కలను జగన్ నెరవేర్చారని సూచించింది. తరచు విధాన నిర్ణయాలు మార్చటం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బ తింటుందని.. అదే పత్రిక మరో కథనాన్ని రాసింది. అమరావతి ప్రాజెక్టు విజయవంతమైతే దేశ వ్యాప్తంగా నగరాల నిర్మాణానికి రైతులు ముందుకొచ్చేందుకు దోహదం కలుగుతుందని.. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని జగన్ కు సూచించింది. అమరావతి నిర్మాణాలను అసంపూర్తిగా మిగల్చరాదని దేశ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. చంద్రబాబు వారసత్వాన్ని జగన్ చెరిపేసే బదులు సుపరిపాలన అజెండాను అమలు చేయాలని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాన్ని రాసింది.  విద్యుత్ ప్రాజెక్టుల రద్దు, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్, అమరావతిలో నిర్మాణాలను 100 రోజుల్లోనే నిలిపివేయటం దారుణమంటూ వ్యాఖ్యానించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వెనక్కు వెళ్లడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి మంచి పరిణామం కాదని తెలియజేసింది. అమరావతి ఆలోచనను నిర్వీర్యం చేయాలన్నదే సీఎం జగన్ ఉద్దేశ్యమైతే అది అసమర్థ నిర్ణయమవుతుందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. మూడు రాజధానుల మధ్య వందలాది కిలోమీటర్ల దూరం ఉంది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు దుర్భరంగా మారుతాయని పేర్కొంది.ఇలా జగన్ చేసే పనులు పై ఇప్పటికే అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సూచీలో దేశం ఎంతో వెనుకబడి ఉందని వ్యాఖ్యానించింది. నియంతృత్వ పోకడలు పెట్టడం మానుకోవాలని  పత్రికలు సూచిస్తున్నాయి. రాజకీయ కారణాలతో అమరావతి ప్రాజెక్టు పై సీతకన్ను వేయటం సరైంది కాదని తన సంపాదకీయంలో రాసుకొచ్చింది. హిందుస్థాన్ టైమ్స్ భారీ ఎత్తున ప్రజాధనం వృధా చేస్తున్నందున అందుకు జగన్ బాధ్యత వహించాలని.. అమరావతి కోసం సేకరించిన భూమి ఏమవుతుందో చెప్పాలని కథనంలో పేర్కొంది. తన వ్యక్తిగత ఆకాంక్షల కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బ తీయరాదని సూచించింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ఆంగ్ల పత్రికల సంపాదకీయాలు జగన్ పాలన పై వీలు దొరికినప్పుడల్లా ధ్వజమెత్తుతూనే ఉన్నాయి.8 నెలల క్రితం అధికారంలోకి వచ్చి తొలి అడుగుగా ప్రజావేదికల కూల్చిన నాటి నుంచి తాజాగా రాజధాని మార్పు దాకా ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న ప్రతి చర్య వాటి కన్నెర్రకు గురవుతూనే ఉంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రతి పత్రిక , అన్ని మాధ్యమాలు తప్పుబడుతూనే ఉన్నాయి.  మరి సీఎం తన వైఖరిని ఎంత మేరకు మార్చుకుంటారో లేక తన పంతానికి ప్రజలను ఇబ్బందుల్లోకి నెడతారో వేచి చూడాలి.

తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజి...

కోనసీమలో మళ్లీ గ్యాస్ కలకలం రేగింది, అయితే ఈ సారి అంతా అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. కానీ, గ్యాస్ లీక్ అవుతూనే ఉండటంతో అంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేని కోన మండలం ఉప్పూడి గ్రామం గ్యాస్ గుప్పిట్లో చిక్కుకుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో డ్రిల్లింగ్ సైటు నుంచి ఆకస్మాతుగా భారీ శబ్ధంతో గ్యాస్ లీక్ కావడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. లీకేజీ కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు రెవెన్యూ సిబ్బందితో పాటు ఓ ఎన్ జీ సీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పూడితో పాటు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఫైరింజన్ లను తెప్పించి తీవ్ర ఒత్తిడితో లీక్ అవుతున్న గ్యాస్ ను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు నర్సాపురం, రాజమహేంద్రవరం, తాటిపాక, విశాఖపట్నం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలను రప్పిస్తున్నట్లు ఆధికారులు చెబుతున్నారు.  మహిపాల చెరువు పల్లంకూరు వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలోని ఉప్పూడి వద్ద అపార గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ఓ ఎన్ జీ సీ అధికారులు 2006 లో గుర్తించారు. రెండేళ్ల క్రితం ఈ బావిని బీహెచ్ఈఎల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి అప్పగించారు. మూడు రోజుల నుంచి ఈ గ్యాస్ బావికి సంబంధించి బెల్ క్యాంప్ ఓపెన్ చేసి, పేరుకుపోయిన మురికిని హై ప్రెజర్ ద్వారా పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గ్యాస్ ఒత్తిడి తీవ్రమైన ఉవ్వెత్తున భారీ శబ్దాలతో ఎగిసిపడింది. దీంతో అక్కడ పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కొన్ని గంటల పాటు గ్యాస్ భారీ ఒత్తిడితో ఎగదన్నడం వల్ల ఉప్పూడి పరిసర ప్రాంతాలన్నీ గ్యాస్ తో కలుషితమయ్యాయి. ముందు జాగ్రత్తగా కాట్రేనికోన మండలానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. డ్రిల్ సైట్ కు దగ్గరగా ఉన్న 70 కుటుంబాలతో పాటు సుమారు 2000కు పైగా జనాభా ఉన్న ఉప్పూడి గ్రామం మొత్తం ఖాళీ చేయించారు. లీకేజీ సమాచారం తెలియగానే ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్. ఆర్ డీ వో భవాని శంకర్, డిఎస్పీ మాసూంబాషా అక్కడకు చేరుకున్నారు. బాధితులను ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి మహిపాల చెరువు లోని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఓ ఎన్ జి సి, బి హెచ్ ఇ ఎల్ ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల నిర్లక్ష్య ఫలితమే గ్యాస్ లీకేజీకి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనతో ఓ ఎన్ జీ సీ కి సంబంధం లేదని. 2016-17 ఈ బావిని బి హెచ్ ఈ ఎల్ యాజమాన్యానికి అప్పగించామని అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న గ్యాస్ వల్ల కళ్ళ మంటలు, దద్దుర్లు వస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ల్యాండ్ పూలింగ్ కు విశాఖ రైతుల తిరస్కరణ..!

పేదల గృహ నిర్మాణం పేరిట విశాఖపట్నం చుట్టుపక్కల భారీగా భూ సమీకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పది మండలాల పరిధిలో ఆరువేల ఎకరాలకు పైగా సమీకరించేందుకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. అయితే అక్కడ ప్రభుత్వ అవసరాల గురించి చెబుతున్నారే తప్ప భూములిచ్చేవారికి కలిగే ప్రయోజనం ఏంటో స్పష్టం చేయడం లేదు. రైతులకు చేకూరే లాభం ఏమిటో ఒక్క అధికారి కూడా వివరించటం లేదు. దీంతో భూ సమీకరణ కోసం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్వయంగా కలెక్టర్ వచ్చి ఏ రకమైన ప్రయోజనాలు కల్పిస్తారో వివరిస్తే తప్ప భూములు ఇవ్వబోమని రైతులు పట్టుపడుతున్నారు.  పేదల గృహ నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారునికి సెంటు చొప్పున భూమి పంపిణీ చేయాలనే లక్ష్యంతో విశాఖ జిల్లాలో పది మండలాల్లోని యాభై ఐదు గ్రామాల్లో 6116.5 ఎకరాలు సమీకరించటానికి అధికారులు నడుం బిగించారు. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములు అసైన్డ్ చేసిన భూములను టార్గెట్ చేశారు. వాటిలో సింహ భాగం అసైన్డ్ భూములే ఉన్నాయి. సుమారు 2552.33 ఎకరాలు గతంలో వివిధ సందర్భాల్లో రైతులకు సాగు చేసుకోవటానికి అప్పగించారు. వాటిని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. అసైన్డ్ చేసిన భూమిని వెనక్కి ఇస్తే ఎకరానికి తొమ్మిది వందల గజాలు అభివృద్ధి చేసిన భూమి ఇస్తామని అధికారులు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పదేళ్లకు పైబడిన ఆక్రమిత ప్రభుత్వ భూమైతే 450 గజాలు, ఐదేళ్ళకు పైబడి పదేళ్ల లోపు ఆక్రమిత భూమి అయితే 250 గజాలు ఇస్తామని పేర్కొన్నారు.  ఏ రైతైనా తనకు తగిన గ్యారెంటీ ఇస్తేనే వ్యవసాయ భూమి ఇస్తాడు, రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులను ఒప్పించి 33,000 ఎకరాలు సేకరించారు. అయితే ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి తరలిస్తామనడంతో ఆందోళన చేస్తున్నారు. అక్కడ భూములిచ్చిన రైతులకు ఏడాదికి 50,000 రూపాయల చొప్పున పదేళ్ల పాటు చెల్లించేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. అదే విధంగా రైతు కూలీలకు నెలకు 2500 చొప్పున పింఛన్ ఇచ్చింది. కానీ, ఇక్కడ ఎటువంటి లబ్ధి చేకూరుతుందో అధికారులు విస్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పుడు రైతుల నుంచి సమీకరిస్తున్న అసైన్డ్ భూములన్నీ నగరానికి దూరంగా ఉన్న గ్రామాల్లోనే ఉన్నాయి. అక్కడ పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తే తప్ప లబ్ధిదారుడు అక్కడికి వెళ్లి గృహాలు నిర్మించుకోలేరు.  విశాఖపట్టణంలో గృహ లబ్ధిదారులకు సంబంధించి కొంత చరిత్ర ఉంది. గత ప్రభుత్వాలు పేదల కోసం నగరాన్ని ఆనుకొని కొమ్మాది, పరదేశిపాలెం, మిథిలాపురి వుడా కాలనీ, మారికవలస, అగనంపూడి, చినముషిడివాడ తదితర ప్రాంతాల్లో గృహాలు నిర్మించి ఇచ్చారు. లబ్ధిదారుల్లో అత్యధికులు అక్కడికి వెళ్లలేదు, నగరంలో ఏదో ఒక పని చేసుకుని జీవనం సాగిస్తున్నామని, దూరంగా పంపించేస్తే రోజూ నగరంలోకి రాకపోకలు సాగించటానికే తమ కూలి డబ్బులు సరిపోతాయని చాలా మంది వెళ్లలేదు. కొంతమంది వాటిని అమ్మేసుకున్నారు, వాటిలో కొన్ని ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అంతకంటే దూరంగా భూములు సమీకరిస్తుంది. పైగా అక్కడ స్థలం మాత్రమే ఇస్తామని చెబుతోంది. గృహాలు పేదలే నిర్మించుకోవాలని స్పష్టం చేసింది. ఇదే విధానంతో ముందుకెళితే లబ్ధిదారుల్లో అత్యధికులు అక్కడికి వెళ్లి ఇళ్లు నిర్మించుకునే అవకాశం లేదు. వారికి అంత ఆర్థిక స్తోమత లేకపోవటం ఒక కారణమైతే అవి నగరానికి దూరంగా ఉండటం మరో కారణం. ఇది మళ్లీ దుర్వినియోగానికి దారితీసే అవకాశముంది, దళారులు రంగ ప్రవేశం చేసి వాటిని తక్కువ ధరకు ఎత్తుకుపోతారు.  ప్రభుత్వం ఇప్పుడు సమీకరిస్తున్న భూములన్నీ ఒకే దగ్గర లేవు, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. సుమారు 400 నుంచి 500 ఎకరాలు ఒక్క దగ్గర ఉంటే వాటిని టౌన్ షిప్ గా అభివృద్ధి చేస్తే అక్కడికి వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ వచ్చి భూములకు ధర పెరుగుతోంది. అంతే తప్ప ఇరవై, ముప్పై ఎకరాలలో లేఅవుట్ వేసి పేదలకు సెంటు చొప్పున పంపిణీ చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా తక్కువ. అలాంటప్పుడు అక్కడ భూములకు ధర పెరగదు. దానివల్ల భూములిచ్చిన రైతులకు ప్రయోజనం ఉండదు. వారు పొట్ట కొట్టినట్టే, దీనిని కూడా దృష్టిలో ఉంచుకొని చాలా మంది తమకు పరిహారం ఇంకా పెంచాలని, తమ భూముల్లో చెట్లు, ఫలసాయం, వ్యవసాయ పంపుసెట్ లు అన్నింటికీ పరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. అభివృద్ధి చేసిన భూమి కూడా ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

చిత్తూరులో వైసీపీకి చుక్కెదురు.. వికేంద్రీకరణ మద్దుతు సభకు హాజరుకాని జనం!

చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వైసీపీకి షాక్ ఇచ్చారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లె సమీపంలోని రంగం పేటలో పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సభ నిర్వహించారు. వైసీపీ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కల్లం అంజిరెడ్డి ప్రసంగిస్తుండగానే సభ నుండి ప్రజలు వెళ్లిపోవడం ప్రారంభించారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉండగా సభ దాదాపుగా ఖాళీ అయింది.  సభలోని 90% శాతం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీనితో సభ ఏర్పాటు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతలను క్లుప్తంగా మాట్లాడాలంటూ విన్నవించారు. అమరావతి పై ఉన్న ప్రేమ నారవారిపల్లె పై చంద్రబాబుకు ఎందుకు లేదన్నారు మంత్రి కన్నబాబు. చాలా ప్రాంతాలు అభివృద్ధి కాలేదని.. అందుకే సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు ఆలస్యం కావచ్చేమో కానీ నిర్ణయం పై సీఎం వెనక్కి తగ్గరని అన్నారు కన్నబాబు. అమరావతియే రాజధానిగా ఉండాలని 29 గ్రామాల ప్రజలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు నారా వారి పల్లె వాసులు. బయటి ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకువచ్చి సభను నిర్వహించారని స్థానికులు వెల్లడిస్తున్నారు.అమరావతి రాజధానిగా భూములు ఇచ్చిన రైతులకు సంఘీభావం కోసం అందరం కట్టుబడి ఉన్నామని గ్రామస్తులు తెలియజేశారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చడం పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గ్రామస్తులు. వైసీపీ సభ ముగిసిన తర్వాత నారావారిపల్లె లోని రహదారులను శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. జై చంద్రబాబు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. మొత్తం మీద మూడు రాజధానులకు మద్దతుగా నారావారిపల్లె లో వైసీపీ నిర్వహించిన సభ ఫ్లాప్ అయ్యిందని అంటున్నారు.

కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం.. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ!

అనారోగ్యం తో ఢిల్లీ లోని గంగా రాం ఆసుపత్రిలో చేరారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ విషయం తెలియగానే పలువురు నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. జ్వరం , శ్వాస సంబంధ సమస్యతో సోనియా బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆమె హెల్త్ కండిషన్ పై ఆస్పత్రి వర్గాల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. గత కొంతకాలంగా సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ప్రత్యేక వైద్య చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.  ప్రస్తుతం సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా ఉన్నారు. గతంలో కూడా.. అనారోగ్యంతో కొన్నాళ్లు ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు సోనియా గాంధీ. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప అనారోగ్యమేనని ప్రమాదమేమీ లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆమె అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటారు. ఇప్పుడు కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆమె సర్ గంగా రాం ఆసుపత్రిలో చేరినట్లు నేతలు వెల్లడించారు. సోనియా గాంధీ ఆసుపత్రి లో చేరారన్న సమాచారం తెలియడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.  

విశాఖ భూ కుంభకోణంలో కొత్త సిట్ విచారణ ధర్మానకు అనుకూలంగా జరుగుతుందా?

విశాఖ భూ కుంభకోణంపై కొత్త సిట్ కొద్ది రోజుల కిందటే తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందచేసింది. దాని వివరాలేమిటో తెలియరాలేదు, అయితే పాత సిట్ చెప్పినంత స్పష్టంగా ధర్మాన వ్యవహారంపై కొత్త సిట్ తన రిపోర్టులో ప్రస్తావించిందా, దారి మళ్లిందా అన్న అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం నియమించిన సిట్ విశాఖ భూ కుంభకోణంలో ధర్మానపై తీవ్రమైన అంశాలను ప్రస్తావించింది. పద్నాలుగు ఎన్ వో సీ ల కేసుల్లో ఆయన పాత్రను ఎత్తి చూపింది. విశాఖ, దాని చుట్టుపక్కల కోట్ల విలువ చేసే భూములు మాజీ సైనికుల నుంచి ధర్మాణ కుటుంబీకులు, సన్నిహితుల కంపెనీలూ, వ్యక్తుల పేరిట బదిలీ అయ్యాయని వెల్లడించింది. ఒక్కో భూమి విషయంలో ధర్మాన ఎలా వ్యవహరించారో స్పష్టంగా పేర్కొంది. అయితే కొత్త సిట్ ఇచ్చిన నివేదికలో ఆ తీవ్రత లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ధర్మాన రెవిన్యూ మంత్రిగా ఉన్న సమయంలోనే అధికారులు విశాఖ రూరల్ భీమునిపట్నం, పరవాడ, పరదేశిపాలెం, దేశపాత్రునిపాలెం, మధురవాడ, పెదముసిడివాడ, తదితర ప్రాంతాల్లో మాజీ సైనికులు ఎన్ వో సీ లు ఇచ్చారు. ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములను అమ్ముకునేందుకు భారీగా ఎన్ వో సీ లు ఇచ్చారు. ఈ పత్రాల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని అలా ప్రభుత్వం చేయిదాటిన భూములు, ఆ తర్వాత నాటి పెద్దల నియంత్రణలోకి వెళ్లాయని పాత సిట్ చెప్పింది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల్ని మాజీ సైనికుల నుంచి నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబీకులు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న మిత్రుల కంపెనీలూ చేజిక్కించుకున్నాయని తేల్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ధర్మాన, ఆయన సన్నిహితులపై విచారణ జరిపించాలని కొన్ని కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. రెవిన్యూ అధికారులు భూములపై తీవ్రమైన నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డారని, మాజీ సైనికుల భూములకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ కు గురయ్యాయని పేర్కొంది. వీటిపై ఫోరెన్సిక్ పరిశీలనలు జరిపించాలని సూచించింది, అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘించి తీసుకున్నదే ఎన్ వో సీ అని అందరూ భావించేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది.  కొత్త సిట్ ఛైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ దృష్టికి వచ్చిన అన్ని కేసులను పరిశీలిస్తున్నామని ప్రభుత్వ భూముల దురాక్రమణ, రికార్డుల ట్యాంపరింగ్, క్లాసిఫికేషన్ మార్పు, ఎన్ వో సీ ల జారీ వంటి అంశాలపై విచారణ చేస్తున్నామని అనేక అక్రమాలు, తప్పులను గుర్తించామని చెప్పారు. వీటికి బాధ్యులైన అధికారులు ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశామన్నారు. పాత సిట్ రిపోర్టులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఉంది కదా మీరు ఆ కేసులను విచారిస్తున్నారా అని ఆయనను ప్రశ్నించగా పాత సిట్ రిపోర్టును టీమ్స్ పరిశీలిస్తున్నాయని చెప్పారు. తప్పు చేసిన ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పామని పూర్తి రిపోర్ట్ ఇంకా సమర్పించాల్సి ఉందని బదులిచ్చారు. వాస్తవానికి కొత్త సిట్ కూడా ఎన్ వో సీ ల కేసులపై విచారణ జరిపింది. ఈ కేసుల్లో ధర్మాన ప్రస్తావన ఉందా లేక ఆయనను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

పెనుకొండలో మంత్రి శంకర్ నారాయణ అనుచరుల దందా.. ప్రశ్నిస్తే ప్రజలపై దౌర్జన్యం!!

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి శంకర్ నారాయణ అనుచరులు దందాలకు తెర తీశారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిదారులుగా ఎంపిక కావాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందే అంటూ తమనుంచి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పెనుకొండ నియోజక వర్గంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే అదునుగా భావించిన వైసీపీ నాయకుడు శివానందరెడ్డి దందాకు తెరలేపారు. ఇంటి పట్టా మంజూరు చేయిస్తానంటూ శెట్టిపల్లి గ్రామానికి చెందిన పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అయితే ఇటీవల ఇంటి పట్టాలకు సంబంధించి లబ్ధిదారులుగా ఎంపికైన వారి జాబితాను గ్రామంలో చదివి వినిపించారు. తాము ఒక్కొక్కరం ఇరవై వేల రూపాయలు ఇచ్చినా ఇంటి స్థలం మంజూరు కాకపోవడం ఏంటంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి అనుచరుడు శివానందరెడ్డిని నిలదీశారు.  దీన్ని జీర్ణించుకోలేని శివానందరెడ్డి గ్రామస్థులు తనపై దౌర్జన్యం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని చితక బాదారు. విషయం తెలుసుకున్న బాధితులకు చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఇంటి పట్టా కోసం ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని అడిగితే తమపైనే ఎదురు దాడి చేసి పోలీసులతో కొట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి శంకర నారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఇరు వర్గాలతో పంచాయతీ ఏర్పాటు చేశారు. బాధితులు మంత్రికి తమ గోడు చెబుతూ ఉండగా అడ్డుకున్న శివానందరెడ్డి మళ్లీ వారిని బెదిరించడంతో మంత్రి సమక్షంలోనే రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దాంతో మంత్రి చేసేదేమి లేక అంతా బయటికి వెళ్లి మాట్లాడుకొని రావాలని పంపటంతో ఇరువర్గాలకు చెందిన వారిమధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. తమకు కూలికెళితేగానీ ఇల్లు గడవని పరిస్థితి ఉందని, పైసా పైసా కూడ బెట్టి ఇల్లు కట్టుకుందామంటే మంత్రి అనుచరులు మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ గొడవ అంతకంతకూ పెద్దదై అందరికీ తెలియడంతో మంత్రి అనుచరులపై అంతా మండిపడుతున్నారు. మీ అనుచరులు మోసం చేశారని మంత్రికి చెప్పుకున్నా న్యాయం జరగకపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

విశాఖ నుంచి మొదలైపోయిన పాలన..! మంత్రుల రివ్యూస్ తో రాజధాని కళ 

విశాఖకు రాజధాని కళ వచ్చేసింది. ఇప్పటికే... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల విజిట్స్ పెరగడంతో విశాఖలో రాజధాని హడావిడి కనిపిస్తోంది. మంత్రులు బొత్స, అవంతి, అనిల్‌, వెల్లంపల్లి, కృష్ణదాస్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పదేపదే విశాఖ వస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక, స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా వీలు దొరికితే విశాఖలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఒకవైపు మంత్రులు... మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేల విజిట్స్ తో విశాఖలో రాజధాని కళ కనిపిస్తోంది. అయితే, విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన జగన్ ప్రభుత్వం ....దానికి కార్యరూపం ఇచ్చేందుకు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రాజధాని వీకేంద్రకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో అడ్డంకులను అధిగమించి విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు అడుగులు వేస్తోంది. ఇదిలాఉంటే, కార్యనిర్వాహక రాజధాని విశాఖలో ఆయా శాఖల కార్యాలయాలకు అనువైన ప్రాంతాలను, భవనాలను వెదికే పనిని ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్య నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక, సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సెక్రటేరియట్ వరకు వివిధ కార్యాలయాల ఏర్పాటుకు పలు భవనాలను పరిశీలించిన ప్రభుత్వ పెద్దలు... రుషికొండలో సచివాలయం ఏర్పాటుకు దాదాపు ఖరారు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల రుషికొండలో పర్యటించిన విజయసాయిరెడ్డి... ఆ మేరకు స్థానిక నేతలకు సంకేతాలిచ్చారు. మరోవైపు, సీఎం క్యాంపు కార్యాలయం, గవర్నర్ బంగ్లా కోసం సర్క్యూట్ హౌస్, పోర్ట్ గెస్ట్ హౌస్, ఆఫీసర్స్ క్లబ్, వాల్తేర్ క్లబ్‌తోపాటు ఏయూలో పలు భవనాలను పరిశీలించారు. అలాగే, ఏయూ, పోర్టు, జీవీఎంసీ, ఆర్ అండ్ బీ, వీఎమ్ఆర్డీఏ పరిధిలో ఉన్న స్థలాలను, భవనాలను పరిశీలిస్తున్నారు.  అయితే, ఇప్పుడు సర్క్యూట్ హౌస్‌‌ను బ్రిటీష్ కాలంలో గవర్నర్ బంగ్లాగా వాడేవారు. అలాగే, వాల్తేర్ క్లబ్ కూడా అప్పటి అధికారుల క్యాంపు కార్యాలయంగా ఉండేది. ఈ రెండింటిని ఇప్పుడు కూడా వాటికే వాడాలని భావిస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రైవేట్ హోటల్స్‌, గెస్ట్ హౌస్ లను కూడా పరీశీలించారు. అయితే, భద్రత, పార్కింగ్, విద్యుత్, ఇతర మౌలిక వసతులను పరిగణలోనికి తీసుకుంటున్నారు. మొత్తానికి, అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి మూడో వారం నుంచే విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.