ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!!

ఏపీ రాజధాని వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. విజయవాడలో జరిగిన ‘ది హిందు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ కార్యక్రమానికి హాజరైన ఆయన.. రాజధాని ప్రస్తావన తెచ్చారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అన్నారు. పదేళ్లలో విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. విశాఖలో అభివృద్ధికి అపార అవకాశం ఉందని తెలిపారు. అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని చెప్పారు. అలాగే, అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని మరోసారి జగన్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రిగా రాజధానిపై నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుంది’ అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు. రాజధాని గురించి బాహుబలి లాంటి గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని అన్నారు. తాను ఏం చేయగలనో ఆ వాస్తవాలను మాత్రమే చెప్తాను అన్నారు. ప్రజలను మభ్యపెట్టాలని, గ్రాఫిక్స్‌ చూపించాలని అనుకోవట్లేదు.. జపాన్, సింగపూర్‌ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని అని జగన్ వ్యాఖ్యానించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధానికి సీఎం జగన్ లేఖ...

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పదేపదే తెరపైకి తెస్తున్నారు సీఎం జగన్. హోదాతోనే అభివృద్ధి సాధ్యమని వీలైనంత త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని జోక్యం అవసరం ఉందని లేకపోతే ఏపీ ప్రజలు దురదృష్టవంతులుగా మిగిలిపోతారని జగన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సరైన న్యాయం జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏపీకి చేయూత ఇవ్వడానికి బడ్జెట్ లో ఎలాంటి ప్రస్తావన కూడా లేదని లేఖలో పేర్కొన్నారు జగన్. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కునేందుకు ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇప్పటివరకు రాకపోవడం వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకిచ్చే ప్రత్యేక హోదాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం రెండు వేల పదహారులో ప్రకటించిందని, అయితే పదిహేనవ ఆర్థిక సంఘం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని నివేదికలో పేర్కొన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. కానీ, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవడం అనేది తమ పరిధి కాదని పదిహేనవ ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని అన్నారు. దీన్ని బట్టి కేంద్ర ఆర్థిక శాఖకు, పదిహేనవ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత ఏపీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. విభజన జరిపిన తీరు వల్ల తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ లబ్ధి పొందిందని ఏపీకి కేంద్రం నుంచి సరైన సాయం అందలేదని లేఖలో ప్రస్తావించారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు జగన్.

ఈరోజు ఓ కొలిక్కి రానున్న నిర్భయ దోషుల ఉరితీత వ్యవహారం..!

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నిర్భయ దోషుల ఉరితీత వ్యవహారంపై ఈరోజు క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉరిపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హై కోర్టు ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెల్లడించనుంది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల పిటిషన్ లు వేస్తూ సాగతీస్తున్నారని కేంద్రం ఆరోపిస్తోంది. నిర్భయ దోషుల ఉరి వ్యవహారం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. సుప్రీం కోర్టు పిటిషన్ ను తిరస్కరించినా, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ లను పక్కనబెట్టినా నిర్భయ దోషులు మాత్రం ఒక్కొక్కరిగా కోర్టు మెట్లు ఎక్కుతూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ వినయ్ గుప్తాలకు న్యాయపరంగా అన్ని ఆప్షన్స్ మూసుకుపోయాయి. అయితే మిగతా వారి పిటిషన్ లు పెండింగ్ లో ఉన్న కారణంగా ఉరిశిక్ష వాయిదా పడుతూ వస్తోంది.  దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునే వరకు ఉరితీసే అవకాశం రాజ్యాంగ పరంగా లేకపోవటంతో అనేక పిటిషన్ లు తెరపైకొస్తున్నాయి. డేట్ ఫిక్స్ చేసిన తరువాత ఇప్పటివరకు నిర్భయ దోషుల ఉరి రెండు సార్లు వాయిదా పడింది. దీనిపై నిర్భయ తల్లితో పాటు వివిధ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆలస్యం చేయటం వల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోంది అంటూ కేంద్రం తన అసంతృప్తిని కోర్టుకు తెలిపింది. ఉరి తీయడానికి ఒక్కరోజు ముందు ట్రయిల్ కోర్టు డెత్ వారెంట్ పై స్టే విధించడాన్ని కేంద్రం ఢిల్లీ కోర్టులో సవాలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఉరిని నిలిపివేయడాన్ని సవాల్ చేసింది. శని, ఆది వారాలు కూడా కోర్టును సమావేశపరిచి ప్రత్యేకంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తీర్పు వెల్లడించనుంది. ట్రయిల్ కోర్టు స్టే విధించడాన్ని ఢిల్లీ హై కోర్టు తప్పు పడితే మళ్లీ కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుంది

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం...

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇటీవల రెవిన్యూశాఖపై అనేక ఆరోపణలు రావడంతో ఆ వ్యవస్థను సమూలంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. ఈ నెల పదకొండున (ఫిబ్రవరి 11) ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ప్రధాన ఎజెండా కూడా రెవెన్యూ ప్రక్షాళన అని అధికార వర్గాల సమాచారం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవిన్యూ చట్టాన్ని ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలతో చెడ్డ పేరు మూటగట్టుకుంటున్న రెవిన్యూశాఖను మార్చేందుకు అన్ని రకాలుగా కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించడంతో పాటు కొత్త రెవిన్యూ చట్టాన్ని అమలు చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల పదకొండున ప్రగతి భవన్ లో కలెక్టర్ లతో సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీల తరువాత ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రభుత్వం కొత్త రెవిన్యూ చట్టం అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనం చేసిందని రెవిన్యూ వర్గాల సమాచారం.  కొత్త రెవిన్యూ చట్టానికి తెలంగాణ భూ చట్టంగా నామకరణం చేసి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీవోటీ, ఇనాం, రక్షిత, కౌలుదారు, భూ ఆక్రమణ, భూ దురాక్రమణ, అసైన్, సర్వే, హద్దులు, ప్రభుత్వ భూములు ఇలా ఒక్కో కేటగిరీకి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే కలెక్టర్లు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలు ఈ కొత్త రెవిన్యూ చట్టాన్ని ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అవినీతికి కారణమవుతున్న క్షేత్రస్థాయి రెవిన్యూ వ్యవస్థకు సమూల చికిత్స చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలు లంచాలకు తావు లేకుండా పకడ్బందీగా భూ రికార్డుల వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.  భూ యాజమాన్య హక్కుల బదిలీ, పాసు పుస్తకాల పంపిణీ దస్త్రాల్లో మార్పు చేర్పుల సందర్భంగా అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు సహాయకుల జోక్యం ఉండటం కారణంగా ఈ దుస్థితి ఉందని భావిస్తోంది. ధరణి పోర్టల్ వేదికగా దస్త్రాల నిర్వహణ ప్రారంభమయ్యాక క్షేత్రస్థాయిలో ఎంతమంది వీఆర్వో, వీఆర్యేల సేవలు అవసరమో గుర్తించి ఈ వ్యవస్థను రద్దు చేయాలా లేక ఇతర శాఖల్లో విలీనం చేయాలా అనే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోందని సమాచారం. రాష్ట్రంలో భూ దస్త్రాల నవీకరణ అనంతరం తొంభై నాలుగు శాతానికి పైగా దస్త్రాలో స్పష్టత వచ్చినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. దీనినే టైటిల్ గ్యారంటీ చట్టంగా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్ ను ప్రవేశపెట్టాలన్న వాదన కొందరు అధికారుల్లో వినిపిస్తోంది. ఈ రెండింటితో పాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1907 ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చ సాగుతుంది.

మేడారం జాతరకు ఎలా వెళ్లాలి? రూట్ మ్యాప్ మీ కోసం..!

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరకు ప్రారంభమైంది. వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. అయితే, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మేడారం చేరుకునేందుకు రూట్ మ్యాప్ మీకోసం.... ----హైదరాబాద్ నుంచి----- హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులు... భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్, ములుగు, పసర, తాడ్వాయి మీదుగా లేదా పసర నుంచి నార్లపూర్ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. మేడారం జాతరకు ఇదే ప్రధాన రహదారిగా చెబుతున్నారు.  ----కరీంనగర్ నుంచి---- కరీంనగర్‌ జిల్లా నుంచి వచ్చే భక్తులు ...హుజూరాబాద్‌, పరకాల, ములుగు, పసర, నార్లపూర్‌ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. అలాగే, కరీంనగర్‌ నుంచి మరో దారిలో కూడా మేడారం చేరుకోవచ్చు.... పెద్దపల్లి, మంథని, కాటారం, భూపాలపల్లి, బయ్యక్కపేట మీదుగా జంపన్న వాగు సమీపానికి చేరుకోవచ్చు.  ----ఖమ్మం నుంచి---- మరోవైపు ఖమ్మం వైపు నుంచి వచ్చే భక్తులు.... భద్రాచలం మంగపేట లేదా వాజేడు, వెంకటాపురం మీదుగా ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా మేడారం రావొచ్చు.  ----విజయవాడ నుంచి----- ఇక, విజయవాడ నుంచి వచ్చే భక్తులు నందిగామ, ఖమ్మం, ఇల్లందు, పసర, నార్లపూర్‌ మీదుగా జాతర ప్రాంగణానికి చేరుకోవచ్చు.  ----ఛత్తీస్ గఢ్ నుంచి---- అలాగే ఛత్తీస్‌గడ్‌ నుంచి వచ్చే భక్తులు.... వాజేడు గోదావరి బ్రిడ్జి మీదుగా ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి, తాడ్వాయి మీదుగా మేడారం జాతరకు రావాల్సి ఉంటుంది.  ----మహారాష్ట్ర నుంచి---- ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు... కాళేశ్వరం బ్రిడ్జి మీదుగా మహాదేవపూర్, గారెపల్లి, నార్లపూర్‌ మీదుగా గద్దెల దగ్గరకు రావొచ్చు.  ----రైలు ప్రయాణికులు---- ఇక, రైలు ప్రయాణికులైతే వరంగల్‌ లేదా కాజీపేట స్టేషన్లలో దిగి అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో మేడారం చేరుకోవచ్చు. అయితే, రద్దీ దృష్ట్యా ములుగు నుంచి నార్లాపూర్ మధ్య పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నారు. అలాగే, హన్మకొండ, ములుగు, పసర, తాడ్వాయి రూట్లో వన్ వే ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేప్పుడు నార్లాపూర్, బయ్యక్కపేట, ఘనపురం మీదుగా పరకాల, గుడెప్పహాడ్ వరకు వన్ వే కింద మార్చారు. ఇక, సొంత వాహనాల్లో వచ్చేవాళ్ల కోసం జంపన్నవాగు దగ్గర 10 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ్నుంచి గద్దెల దగ్గరకు వెళ్లాలంటే సుమారు రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవాళ్ల కోసం గద్దెలకు చేరువలో ప్రత్యేకంగా స్టాపులను ఏర్పాటు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి నాయకత్వం మార్పు

మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి నాయకత్వం మార్పు డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలంగాణలో పార్టీ బతికి బట్టకట్టాలంటే టీపీసీసీ చీఫ్ ని వెంటనే మార్చాలంటూ హైకమాండ్ ను కోరుతున్నారు. అయితే అసలు సమస్యల్ని పక్కన పెట్టేసి నాయకత్వ మార్పు చేస్తే కాంగ్రెస్ కు పునర్ వైభవం వస్తుందా.. వరుస ఎన్నికల్లో ఓటమితో మరోసారి పాత రాగమే అందుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ చీఫ్ ను వెంటనే మార్చాలంటూ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణనిచ్చామని పదేపదే చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినప్పటికీ వరుస ఓటములు పలకరించడంతో ఆ నెపాన్ని నాయకత్వంపై తోసేసి చేతులు దులుపుకునే పని చేస్తున్నారు. అసలు పార్టీ ఎందుకు వైఫల్యం చెందుతుందని ఎన్నడూ రివ్యూల జోలికి వెళ్లకుండా అంతర్గత కుమ్ములాటల్లో బిజీ అయిపోయారు. నాయకత్వం మార్పు అనేది సర్వసాధారణం కానీ, కేసీఆర్ ను ఎదుర్కొనగలిగే నాయకుడికి పగ్గాలు అప్పగించాలని కొందరు, లేదు లేదు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పీసీసీ ఇవ్వొద్దని ఇంకొందరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. లాయల్ గా ఉండే వారికే పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినవాళ్లు మరికొందరు. అయితే పార్టీ నాయకులు అసలు లాజిక్ మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి రావాలంటే కేవలం నాయకత్వ మార్పు ఒక్కటే మాత్రం కాదని, అంతర్గత సమన్వయం కూడా అవసరం అంటున్నారు విశ్లేషకులు. గడచిన ఆరేళ్ళలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకోదగ్గ ప్రజా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు. ప్రజల పక్షాన రోడ్డెక్కిన నాయకులు లేరు. దీంతో జనంలోకి వెళ్లడమే మానేసి కుమ్ములాటలు పెట్టుకుంటే అధికారం ఎలా దక్కుతుంది అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఇలాంటి అంశాలను వదిలేసినట్టు కనిపిస్తుంది. నాయకుల మధ్య పోటీ అంతర్గత విభేధాలు పక్కనపెట్టేలా చేసి అందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అధిష్టానం ఇప్పటికీ చెయ్యటం లేదు. పిసిసి నాయకత్వం అప్పటివరకు జిల్లా స్థాయిలో పర్యటన చేసింది కూడా అంతంత మాత్రమే. పార్టీలో సమస్యలు పరిష్కారం చేస్తూనే నాయకత్వాన్ని మార్చితే పార్టీకీ బెనిఫిట్ కానీ, సమస్యలు పక్కన పెట్టి జాతీయ నాయకుడిని పెట్టినా ప్రయోజనం ఆశించలేం అనేది అధిష్టానం ఎప్పుడు ఆలోచిస్తుందో చూడాలి.

యాభైవ రోజుకు చేరుకున్న రాజధాని ఆంధోళన.. రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటన...

  అమరావతి రైతుల ఆందోళనలు యాభైవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా ఈరోజు కూడా రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు. మరోవైపు తెనాలిలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ సర్కార్ పై టిడిపి అధినేత తీవ్ర విమర్శలు చేశారు. అయితే గతంలో రైతుల్ని అన్యాయం చేసి ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారని వైసిపి మండిపడింది. రాజధాని వికేంద్రీకరణపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తమ పార్టీ ధర్మం కోసం పోరాడుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సభలో మాట్లాడిన ఆయన వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు 37 మంది చనిపోయారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు చంద్రబాబు. వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెనాలిలో చిల్లర రౌడీలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారాయన. అప్పుడప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అటు తనను తెనాలి రానివ్వనన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ పై మండిపడ్డ బాబు ఈ పిల్ల కుంక నాకు రాజకీయాలు నేర్పిస్తాడా అంటూ ప్రశ్నించారు. మరోవైపు రాజధాని రైతుల్ని రెచ్చగొట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని వైసిపి మండిపడింది. కేవలం రియల్ ఎస్టేట్ కోసమే గతంలో ఇక్కడ భూసేకరణ చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ. అమరావతి సీఎం క్యాంపు కార్యాలయానికి రాజధాని రైతులతో కలిసి వెళ్ళిన ఆయన వారి సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. రాజధాని రైతులకు చంద్రబాబు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇటు రాజధాని వికేంద్రీకరణపై రైతుల పోరాటం మొదలుపెట్టి నేటికి యాభై రోజులు అయ్యింది, ఈరోజు కూడా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించనున్నారు.

మహానగరాన్ని తలపిస్తున్న మేడారం జాతర...

వనమంతా జనమైంది, మహా జాతర ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి బయలుదేరారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు పయనమై వస్తున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభమవుతోంది. వేల సంఖ్యలో గుడారాలు, దుకాణాలతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం మహానగరాన్ని తలపిస్తోంది. అసలైన జాతర నాలుగు రోజుల పాటు జరగనుంది. నెల రోజుల నుంచే భక్తులు లక్షల సంఖ్యలో వనదేవతను దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఇప్పటికే నలభై లక్షల మంది తల్లులను దర్శించుకున్నారు. జాతర నాలుగు రోజుల్లో అరవై లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రభుత్వం హైదరాబాద్, వరంగల్ నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభించింది. మేడారంలో భక్తులు తల్లులను దర్శించుకునేందుకు క్యూ లైన్ లు సిద్ధం చేశారు. జంపన్న వాగు స్నానఘట్టాల పొడవునా నాలుగు కిలోమీటర్ల మేర జల్లు స్నానాలకు ఐదు వేల షవర్లు ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకునేందుకు పద్నాలుగు వందల కంపార్టుమెంట్ లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 8400 తాత్కాలిక మరుగు దొడ్లను నిర్మించారు. రాజమండ్రి నుంచి 3500 మంది, వరంగల్ మహానగర పాలక సంస్థ నుంచి 600 మంది పారిశుద్ధ్య కార్మికులు మేడారంలో తమ సేవలు అందిస్తున్నారు. మరోవైపు మేడారం జాతర ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాత్రికుల సౌకర్యార్థం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి ఎంటర్ సెక్టోరల్ బృందాలు ప్రతిరోజు సమావేశమై ప్రణాళిక రూపొందించుకుని ఉన్నాయి. మరోవైపు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ సారి కూడా అంచనాలకు మించి వస్తారని భావిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ నుంచి హెలికాప్టర్ సర్వీసు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల ఏడున సీఎం కేసీఆర్ అమ్మలను దర్శించుకోనున్నారు.

కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ రివర్స్ గేమ్... యడియూరప్పకు షాకిచ్చేందుకు స్కెచ్...

నెంబర్ గేమ్ తో సంకీర్ణ సర్కారును కూలదోసి కర్నాటకలో గద్దెనెక్కిన బీజేపీకి అదే ఫార్ములాతో రివర్స్ షాకిచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ పావులు కదుపుతున్నాయి. గతేడాది కాంగ్రెస్-జేడీఎస్ సర్కారుపై తిరుగు బావుటా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబల్ ఎమ్మెల్యేలు తాము ఆశించిన పదవులు దక్కకపోవడంతో మళ్లీ సొంత గూటివైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పదవులు ఆశించి ఆనాడు యడియూరప్పకు సహకరించిన కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు... ఆ తర్వాత అనర్హత వేటుతో తమ పదవులను కోల్పోయి... తిరిగి ఉపఎన్నికల్లో గెలిచారు. అయితే, వీళ్లంతా కేబినెట్లో పదవులు ఆశించగా భంగపాటు ఎదురైంది. దాంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.  మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కవన్న అంచనాకి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు యడియూరప్పపై తిరుగుబాటు ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు పంపుతున్నారు. అయితే, వాళ్ల సంకేతాలను గుర్తించిన కాంగ్రెస్, జేడీఎస్ లు... మళ్లీ సొంత గూటికి తిరిగొస్తామంటే పరిశీలిస్తామంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నాయి. దాంతో, కర్నాటకలో మళ్లీ నెంబర్ గేమ్ మొదలుకానుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పార్టీని వదిలి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలంతా తిరిగి రావాలంటూ కుమారస్వామే స్వయంగా పిలుపునివ్వడంతో కర్నాటక రాజకీయం మరోసారి రసవత్తరంగా మారనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి, రెబల్ ఎమ్మెల్యేలు బుజ్జగింపులకు లొంగుతారో లేక మరోసారి నెంబర్ గేమ్ కు తెరలేపుతారో చూడాలి.

మొత్తం సైన్యాన్ని ఢిల్లీలో మోహరించిన బీజేపీ... ఒక్కడ్ని ఓడించేందుకు కమలదళం తిప్పలు...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. అధికార ఆప్... అపోజీషన్ బీజేపీ... ఇంటింటి ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. సభలు, ర్యాలీలతో రెండూ పార్టీలూ హోరాహోరీగా క్యాంపైనింగ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ... పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ అండ్ బీజేపీ మధ్యే సాగుతోంది. దాంతో, ఆప్ అండ్ బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, సర్వే సంస్థలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని చెబుతున్నా... ఈసారి మాత్రం ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ముందుకెళ్తోంది. అందుకే, సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్న కమలనాథులు... టాప్ లీడర్స్ ను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది. కేజ్రీవాల్ ను ఎలాగైనాసరే ఢిల్లీ గద్దె పైనుంచి కిందికి దింపాలనుకుంటున్న బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. సర్వేలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని చెబుతుండటంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టాప్ లీడర్స్ అందర్నీ బీజేపీ రంగంలోకి దించుతోంది. ఏకంగా 11మంది ముఖ్యమంత్రులు, 59మంది కేంద్ర మంత్రులు, 200మంది ఎంపీలు, 1000మందికి పైగా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి ఢిల్లీ గల్లీల్లో ప్రచారం చేయిస్తోంది. కాషాయ ముఖ్యమంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటేయాలని కోరుతున్నారు.  ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు ఎంపీలు, 15మంది ఎమ్మెల్యేల చొప్పున ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్న బీజేపీ ఏ ఒక్కర్నీ వదిలిపెట్టకుండా అందర్నీ కలిసేలా ప్రచారం చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులైతే బూతుల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ గైడెన్స్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా... లక్షన్నర మంది బీజేపీ సైనికులు కూడా ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. ఇక, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీ అయితే, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఓటర్లను కోరుతున్నారు.

స్థానిక సమరం.. ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

ఏపీలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల ( ఫిబ్రవరి ) 17వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే నెల ( మార్చి ) 15వ తేదీలోగా ఎన్నికలను పూర్తి చేయాలి. ఈ ఎన్నికలకు ప్రభుత్వం రంగం చేస్తుంది. ముందుగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అవ్వగానే.. నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. రిజర్వేషన్ల విషయాలో హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.  ఇక జగన్ సర్కార్ వేసిన మూడు రంగులు కూడా తొలగించాలని తీర్పును ఇచ్చింది హై కోర్టు. పార్టీ రంగులను గ్రామ పంచాయతీలకు వేయడాన్ని తప్పు పడుతూ.. అలా చేయడం మంచి పద్ధతి కాదని మందలించింది. మూడు రాజధానుల రభస.. రైతుల తిరుగుబాటు.. అన్ని అంశాలు ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.

వైష్ణవి హాస్పిటల్స్ ఎండీ అజయ్ కుమార్ ఆత్మహత్య

హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని వైష్ణవి హాస్పిటల్స్ ఎండీ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంత ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ప్రాణాలు పోయాల్సిన వైద్యుడే ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. తన చావుకి నలుగురు వ్యక్తులు కారణం అంటూ ఏడు పేజీల సూసైడ్ నోట్ రాశారు అజయ్. వైష్ణవి ఆసుపత్రి బిల్డింగ్ యజమాని కరుణాకర్ రెడ్డి, అతడి బావమరింది కొండల్ రెడ్డితో పాటు సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ మెగా రెడ్డి, కాంగ్రెస్ నేత శివకుమార్ తనను మానసికంగా వేధించారని అందులో పేర్కొన్నారు అజయ్.  ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్ లో పేర్కొన్న వ్యక్తులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇక వారిని విచారించి ఆత్మహత్యకు గల అసలు కారణాలను వెల్లడించనున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. ఈ కేసు విచారణ వేగంగా పూర్తి చెయ్యడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఆ నలుగురు వ్యక్తులు దొరికే వరకు నిజానిజాలు తెలిసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

జగన్ కి షాక్.. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే!

విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉండగా.. విజిలెన్స్ కార్యాలయాలను కర్నూలుకు ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26 వరకు కార్యాలయాల తరలింపునపై స్టే విధిస్తినట్లు హైకోర్టు పేర్కొంది. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ.. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెం.13 చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై స్టే విధించింది.

ఢిల్లీ పొలిటికల్ వార్.. కేజ్రీవాల్ ఉగ్రవాది.. దమ్ముంటే అరెస్టు చెయ్యండి

కేజ్రీవాల్ ఓ ఉగ్రవాది.. ఆయన ఓ టెర్రరిస్ట్ అని నిరూపించేందుకు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్. ఇక అదే మాటను ఎన్నికల ప్రచారంలో తెగ వాడేస్తున్నారు కేజ్రీవాల్. నేను ఉగ్రవాదినా..? మీరే చెప్పండి అంటూ అమాయకంగా ఢిల్లీ ప్రజలను అడుగుతున్నారు. అందుకు సమాధానంగా కేజ్రీవాల్ ఉగ్రవాదేనంటూ జవదేకర్ అన్నారు. ఒకానొక సమయంలో స్వయంగా తనకు తాను అరాచకవాదినని కేజ్రీవాల్ చెప్పుకున్న సంగతిని మంత్రి గుర్తుచేశారు. అరాచకాలకు పాల్పడే వారిని ఉగ్రవాదితో పోలిస్తే తప్పేంటి అని.. రెండింటికి పెద్ద తేడా లేదని ఆయన పేర్కొన్నారు.  ఇక ఈ వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచాయి. మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై ఆప్ నేతలు మండిపడ్డారు. అంతే కాకుండా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని సంభోదిస్తున్నపుడు భాష ముఖ్యమని గుర్తు చేశారు. ఇక మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎలెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఎలెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన తరువాత ఆయన మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఉగ్రవాది అయితే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆప్ పార్టీ పేరును ముస్లిం లీగ్ అని మార్చుకోమంటూ హితవు పలికారు బీజేపీ నేత కపిల్ మిశ్రా.  

ఆట ఇంకా మొదలు కాలేదు.. రాజధానిని అంగుళం కూడా కదిలించలేరు

మూడు రాజధానుల అంశం ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారికి మద్దతుగా ప్రతిపక్షాలు నిలుస్తున్నాయి. ఇక ఎవరేమన్నా.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా లేదని అంటుంది జగన్ సర్కార్. ఈ సందర్భంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. రాజధానిని అమరావతి నుండి ఒక్క అంగుళం కూడా కదిలించలేరంటూ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఆట ఇంకా మొదలు కాలేదని.. వీళ్ళు తీసుకునే నిర్ణయాలకు కేంద్రం ఏకీభవించదని తేల్చి చెప్పేశారు. సరైన సమయానికి కేంద్రం ఇందులో జోక్యం చేసుకుంటుందని చెప్పారు. రాజధాని విషయంలో రాజ్యాంగపరంగా , న్యాయపరంగానే ముందుకు వెళ్తామని.. అభివృద్ధి పేరుతో జగన్ కాలయాపన చెయ్యడమే కాకుండా ఉన్న పెట్టుబడిదారులను కూడా వెనక్కి పంపుతున్నారని అన్నారు. తమ సొంత తెలివితేటలతో కమిటీలు వేసి.. ఆ రిపోర్ట్ తామే ఇచ్చి ప్రజలను మభ్యపరుస్తున్నారని విమర్శించారు. నెగటివ్ కమిటీలను కాకుండా ధైర్యంగా ఒక పాజిటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని సుజనా సూచించారు. రాజధానిగా అమరావతిని స్వయంగా మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

ఏపీ డిప్యూటీ సీఎం లేఖపై హైకోర్టు సీరియస్.. అంతా మీ ఇష్టమేనా?

"దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు" అని రజినీకాంత్ డైలాగ్ చెప్పినట్టుగా.. "ఉపముఖ్యమంత్రి చెప్పాడు, నేను చేస్తాను" అంటూ ఓ జాయింట్‌ కలెక్టర్.. సామాన్యులపై ప్రతాపం చూపించాడు. చివరికి హైకోర్టు చేత అక్షింతలు వేయించుకున్నాడు. ‘కింద పేర్కొన్న రేషన్‌ షాపులను రద్దు చేయండి. వాటిని నేను సూచించిన వారికి ఇవ్వండి’ అంటూ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి లేఖ రాశారట. ఇంకేముంది, ఉప ముఖ్యమంత్రి లేఖతో జాయింట్‌ కలెక్టర్‌, మిగతా అధికారులు రంగంలోకి దిగారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెదకంటిపల్లిలో పి.మోహనాంబ నిర్వహిస్తున్న రేషన్‌ షాపు అనుమతిని గతేడాది డిసెంబరు 2న రద్దు చేశారు. రేషన్‌ షాపు నిర్వహణలో లోపాలున్నాయని, అందుకే రద్దు చేశామని చెప్పుకొచ్చారు. అయితే, ఆ ఆరోపణల్లో నిజం లేదని, తాను వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా రేషన్‌ షాపు రద్దు చేసారంటూ మోహనాంబ హైకోర్టు గడప తొక్కారు. తన రేషన్‌ షాప్ రద్దు చేయాలని ఉపముఖ్యమంత్రి రాసిన లేఖను సైతం ఆమె కోర్టు ముందుంచారు.  ‘‘ మోహనాంబ నిర్వహిస్తున్న రేషన్‌ షాపులో అధికారులు తనిఖీ కూడా చేయలేదు. ఆమె దుకాణాన్ని రద్దు చేయాలని గంగాధర నెల్లూరు తహసీల్దార్‌ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీనికి ఉప ముఖ్యమంత్రి లేఖే కారణం’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. మొత్తం ముగ్గురు డీలర్లను మార్చి, వారి స్థానంలో తాను సూచించిన వారిని ఎంపిక చేయాలని ఉపముఖ్యమంత్రి స్పష్టంగా పేర్లతో సహా సిఫారసు చేసినట్లు ఆ లేఖలో ఉందని తెలుస్తోంది.  ఉపముఖ్యమంత్రి మంచి రాజకీయ నాయకుడని, లేఖపై సంతకం ఆయనదే కానీ, ఏం సిఫారసు ఉందో ఆయనకు తెలియదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై తీవ్రంగా స్పందించారు. ‘‘డీలర్‌ను నియమించడానికి లేదా తొలగించడానికి ఒక విధానం ఉంది. ఉపముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించకూడదు. ఫలానా వ్యక్తిని డీలర్‌గా నియమించాలని సిఫారసు చేయకూడదు’’ అని కాస్త గట్టిగానే చెప్పారు. అధికారులు నాయకుల కనుసన్నల్లో కాదని, నిబంధనల మేరకు నడచుకోవాలని హితవు పలికారు.

ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చిన గల్లా జయదేవ్

లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తనపై భౌతిక దాడికి పాల్పడిందంటూ.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు అందజేశారు. కాగా, ఇటీవల అమరావతి రైతులకు మద్దతుగా అసెంబ్లీ ముట్టడికి గల్లా జయదేవ్ యత్నించినప్పుడు పోలీసులు ఆయనపై దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన చొక్కా చినిగిపోవడమే కాకుండా, ఒంటిపై స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఈ అంశంపై గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో తనను నిర్బంధించారని, రాత్రంతా పోలీసు వాహనాల్లో తిప్పారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఒక ఎంపీ అని కూడా చూడకుండా... తనపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ కోరారు.