హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో మరణమృదంగం... ప్రాణాలు కోల్పోతున్న ప్రయాణికులు...

మీరు చదువుతున్నది నిజమే, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తొందరగా వెళ్లాలనే ఆత్రుత... షార్ట్ కట్లో గమ్యాన్ని చేరాలన్న ఆశ... మరోవైపు నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... హెచ్చరిస్తున్నా... మైకుల్లో అనౌన్స్ మెంట్స్ చేస్తున్నా... పట్టించుకోకుండా తప్పటడుగులు వేస్తున్న ప్రయాణికులు తమతమ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. రైల్వేస్టేషన్లలో ట్రాక్ దాటడం నేరం... అందుకు వెయ్యి రూపాయల జరిమానాతోపాటు ఏడాది జైలుశిక్ష పడుతుంది. అయితే, జరిమానా, జైలుశిక్షను పక్కనబెడితే... రైల్వే ట్రాక్ దాటుతున్న ఎంతోమంది ప్రయాణికులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఎక్కువగా ఈ మరణాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా కనీసం ఐదారుగురు రైల్వే పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, పట్టాలు దాటుకుండా రైల్వే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... హెచ్చరిస్తున్నా... పోలీసులను కాపలాగా పెడుతున్నా... ప్రయాణికులు మాత్రం లెక్కచేయడంలేదు... రైల్వే ట్రాక్ దాటడం ప్రమాదకరమని తెలిసినా.... నిర్లక్ష్యంగా ముందుకెళ్తున్న ఎంతోమంది తమ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. తాజాగా భరత్ నగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో కేవలం రెండే రెండ్రోజుల వ్యవధిలో పట్టాలు దాటుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ట్రాక్ దాటుతూ హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య నిజంగానే భీతిగొల్పుతోంది. ఎందుకంటే ట్రాక్ దాటుతూ గతేడాది162మంది మరణించగా... పలువురు గాయపడ్డారు. ఇక, ట్రాక్ దాటుతున్న ప్రయాణికులపై 2432 కేసులు నమోదు చేసి 9 లక్షల 45 వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. అయితే, తొందరగా వెళ్లాలన్న ఆత్రుతలో ప్రయాణికులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే చివరికి వాళ్ల ప్రాణాలు తీసేస్తున్నాయి. ట్రాక్ దాటుతూ మరణిస్తున్నవాళ్లలో ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ వెళ్లడం... ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకుని ట్రాక్ దాటటమే కారణంగా గుర్తించారు.  అందుకే, దయచేసి వినండి... రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక... రైల్వే స్టేషన్లలో ఉన్నప్పుడు ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ఫ్లాట్ ఫామ్ పైకి వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వినియోగించుకోండి... త్వరగా వెళ్లాలన్న ఆత్రుతతో రైలు పట్టాలను దాటుతూ మీ విలువైన ప్రాణాలను కోల్పోకండి.

జగన్మోహన్ రెడ్డిపై... షకీలా సెన్సేషనల్ కామెంట్స్

షకీలా. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు శృంగార దేవతగా కుర్రాళ్ల గుండెల్లో నిలిచిన తార. ఇప్పటికీ పోర్న్‌ స్టార్‌గా యూట్యూబ్‌లో చెక్కుచెదరని పేరు. అందుకే, షకీలాకు భాషాభేదం లేకుండా శృంగారాభిమానుల్లో పేరుంది. అన్ని భాషాల్లోనూ షకీలాకు వీరాభిమానులున్నారు. మళయాళ చిత్రసీమను ఒక ఊపు ఊపిన చరిత్ర ఆమెది. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ను సైతం గడగడలాడించిన బాక్సాఫీసు రికార్డులు ఆమె సొంతం. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ షకీలా అంటే తెలియనివాళ్లే ఉండరు. పోర్న్ మూవీలోనే కాకుండా పలు తెలుగు చిత్రాల్లో షకీలా నటించి మెప్పించింది. అయితే, షకీలా తాజాగా పేల్చిన డైలాగ్సే ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అభిమానులకు మంట పుట్టిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానులపై షకీలా సెటైర్లు పేల్చారు. అయితే, ఈ సెటైర్లు డైరెక్ట్ గా వేయలేదు. తన లేటెస్ట్ సినిమా ట్రైలర్ లో ఏపీ మూడు రాజధానుల నిర్ణయంపై పంచ్ లు పేల్చింది. షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో షకీలా చేత ఈ డైలాగ్స్ చెప్పించారు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో షకీలా పేపర్‌ చదువుతూ ఉంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ వచ్చిన వార్తను చదువుతూ ....ఏంటి? ఏపీకి మూడు రాజధానులా? అంటూ తన అసిస్టెంట్‌ని అడుగుతుంది. అవును మేడం! జగనన్న మూడు రాజధానులు చేశాడు కదా అంటూ అసిస్టెంట్‌ సమాధానం చెప్తాడు. అయితే, ఇక్కడే మూడు రాజధానులపై షకీలా చేత సెటైర్లు వేయించాడు దర్శకుడు. ఏంటీ ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులా అంటూ ప్రశ్నించిన షకీలా....పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యం అవసరం లేదంటూ సెటైర్ వేసింది. అయితే, ఈ మూవీ డైరెక్టర్ కావాలనే సినిమాలో ఈ డైలాగ్ చెప్పినట్లు కనిపిస్తోంది. పైగా ఆ డైలాగ్ ను షకీలా చేత చెప్పించి వివాదానికి తెరలేపాడు. దాంతో ఈ మూవీ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ఈ సినిమా కథ షకీలానే రాశారని చెబుతున్నారు. అంటే ఈ డైలాగ్‌ కూడా షకీలా అభిప్రాయమే అనుకోవాలి. అంటే, షకీలాకు మూడు రాజధానులు ఇష్టంలేదన్న మాట. మరి సినిమాలో పొలిటికల్‌ డైలాగ్స్‌ వెయ్యాలంటే, అందులోనూ అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకంగా వివాదాస్పద సన్నివేశాలు పెట్టాలంటే, ధైర్యముండాలి. ఈ విషయంలో షకీలా సాహసం చేశారని సినిమా ప్రేక్షకులంటున్నారు. అయితే, కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే షకీల మూడు రాజధానులపై వివాదాస్పద సన్నివేశాలు, డైలాగ్స్ పెట్టి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణం ఏదైనా షకీల కొత్త సినిమా ట్రైలర్‌లో పంచ్‌లు, సోషల్ మీడియాలో వైసీసీ, టీడీపీ మధ్య అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తెలుగుదేశం సోషల్ మీడియా ఫాలోవర్స్‌, షకీల్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. షేర్లమీద షేర్లు చేస్తూ, వైసీపీ మీద షకీల సైతం సెటైర్లు వేశారంటూ, కామెంట్లు చేస్తున్నారు. అయితే, షకీల ట్రైలర్‌పై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. టీడీపీ మెప్పు కోసమే, ట్రైలర్‌లో త్రీ క్యాపిటల్స్‌ను షకీల వ్యతిరేకించారని కౌంటర్ వేస్తున్నారు. చివరకు షకీలను సైతం, మూడు రాజధానుల వివాదంలో టీడీపీ లాగిందని, ఆమెతోనూ విమర్శలు చేయించే నీచమైనస్థాయికి దిగజారిందని వైసీపీ ఫాలోవర్స్ అంటున్నారు.

టీడీపీ నేతలకు షాక్ తప్పదా... 106మంది పేర్లతో ఐటీకి లేఖ రాసిన సీఐడీ!

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఇచ్చింది సీఐడీ. రాజధాని పరిధిలోని అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసులో విచారణ జరపాలని ఐటీ డిపార్ట్ మెంట్ కు లేఖ రాసింది ఏపీ సీఐడీ. ఇప్పటికే తెల్లరేషన్ కార్డుల భూముల కొనుగోళ్లలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దృష్టికి తీసుకెళ్లింది సిఐడి. దీనిపై విచారణకు ఈడీ కూడా అంగీకరించింది. తాజాగా ఐటీ వింగ్ కూడా ఫోకస్ పెట్టాలన్న సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ లేఖతో పాటు 106 మంది కొనుగోలు దారుల పేర్లను జత చేశారు. వాళ్ల పేర్లు అడ్రస్ వివరాలను అందించారు. అంతేకాదు 2018, 2019 వరకు రెండు లక్షలకు మించి జరిగిన ట్రాన్సాక్షన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని అడిగారు. 2018,19 వరకు కొనుగోలు చేసిన దాని మీద కూడా విచారణ చేయాలంటూ ఈ లేఖలో పేర్కొనటం జరిగింది.  అయితే రాజధాని ప్రాంతం గ్రామాలకు సంబంధించిన అసైన్డ్ భూములకు సంబంధించి భారీగా భూమి కొనుగోలు విక్రయాలు జరిగినాయి కాబట్టి, రూ. 2లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేయాలని కూడా ఆ లేఖలో సునీల్ కుమార్ పేర్కొన్నారు. అయితే చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూములు అమ్మకాలు, కొనుగోలు చేసినట్టుగా సీఐడీ అధికారులు ఆ లేఖలో క్లియర్ గా రాయటం జరిగింది. ఈ లేఖతో పాటు ఒక ఎక్సెల్ షీట్ లో మొత్తం 106 మందికి సంబంధించిన అసైన్డ్ భూముల కొనుగోళ్లల్లో ఉన్న వారి పూర్తి వివరాలు.. వారి అడ్రస్ లు సర్వే నంబర్ తో సహా మొత్తం ఐటీ అధికారులకి సమర్పించడం జరిగింది.

అమ్మాయిల పిచ్చే అతని ప్రాణం తీసింది... జూబ్లీహిల్స్ మర్డర్ కేసులో కొత్త కోణం

హైదరాబాద్ బోరబండ చేపల వ్యాపారి రమేష్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అయితే, రమేష్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిలపై అతనికున్న పిచ్చే రమేష్ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. చేపల వ్యాపారి రమేష్ కు ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకునే నిందితుడు హత్యకు ప్లాన్ చేశాడని తెలిపారు. రమేష్ ఇంట్లో అద్దెకుండి ఖాళీ చేసిన రాజు నాయకే ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈజీ మనీకి అలవాటుపడ్డ నిందితుడు రాజు నాయక్.... రమేష్ ను హానీ ట్రాప్ చేశాడు. తన దగ్గర అమ్మాయి రెడీగా ఉందని... రూముకు రావాలని ఫోన్ చేశాడు. రాజు నాయక్ మాటల నమ్మిన రమేష్... అతని రూముకు వెళ్లాడు. ఆ తర్వాత మద్యంలో మత్తు మందు కలిపి చంపేశాడు. అనంతరం రమేష్ ఒంటిపైనున్న బంగారాన్ని తీసుకుని తాకట్టు పెట్టాడు.  అయితే, మళ్లీ రూముకి వచ్చిన నిందితుడు రాజునాయక్.... రమేష్ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి 90లక్షలు ఇస్తే విడిచిపెడతానని, లేదంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మరోవైపు, డెడ్ బాడీ డీకంపోజ్ అవుతుండటంతో ఎలాగైనాసరే బయటికి తరలించాలనుకున్నాడు. మృతదేహంలో కొన్ని భాగాలు నరికి ప్లాస్టింగ్ కవర్లో ప్యాక్ చేశాడు. అయితే, భారీ కాయం కావడంతో డెడ్ బాడీని బయటికి తరలించలేక రూమ్ లోనే వదిలేసి పరారయ్యాడు. చివరికి రూము నుంచి దుర్వాసన రావడంతో రమేష్ హత్య బయటపడింది. అయితే, సీసీటీవీ ఫుటేజ్, రూములో దొరికిన క్లూస్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు రాజు నాయక్ ను అతనికి సహకరించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.  అయితే, సమాజంలోనే ప్రతి సంఘటన నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకుని అప్రమత్తం కావాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తుంది. ఇలా, అమ్మాయిలపై పిచ్చితో హానీ ట్రాప్ లో చిక్కుకుని ప్రముఖ వ్యాపారవేత్త జయరాం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. మీడియాలో జయరాం హత్య పెద్దసంచలనమైంది. అమ్మాయిలపై పిచ్చే అతని ప్రాణాలు తీసిందని తెలిసింది. తెలిసినే వ్యక్తే హానీ ట్రాప్ తో ఇంటికి రప్పించుకుని కొట్టిచంపేశాడు. ఇలాంటి ఘటనలు రోజూ మన కళ్లే ముందే కనిపిస్తున్నా జాగ్రత్తపడకుండా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం శోచనీయమే.

అప్పుల కొలిమి.. వేల కోట్ల అప్పు కావాలని కేంద్రాన్ని కోరిన జగన్ సర్కార్!

ఆదాయం సంగతేమో.. ఏపీకి అప్పులు మాత్రం బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల అప్పులు నెత్తిమీద ఉన్నాయి. వైఎస్ జగన్ అధికార పగ్గాలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే అప్పుల భారం మరో 47 వేల కోట్లు పెరిగింది. ఇంకా 2000 కోట్లు అప్పు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇవి కాకుండా మరో 7000 కోట్లు అప్పు చేసుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ అవకాశం కూడా దక్కితే 10 నెలల్లో అప్పులు 56 వేల కోట్లకు చేరుకునే అవకాశముంది.  ఆరేళ్లు గడుస్తున్నా రాష్ట్ర విభజన కష్టాలు తప్పడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో అప్పుల వాటా 31.6 శాతంగా ఉంది. తెలంగాణ జీడీపీలో 17 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయి. విడిపోయాక నెత్తిమీద అప్పులు పెట్టుకుని.. కష్టాలతో ఉన్న ఏపీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్రం సాయం చేయాల్సిన రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు పాలనలో రాష్ట్ర నిధులను ఎక్కువగా వాడాల్సివచ్చింది. ఏపీలో పరిశ్రమలు, సేవా రంగాలు లేనందున సహజంగానే ఆదాయం లేదు. దీంతో ప్రతి దానికీ అప్పులు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన సుమారు లక్ష 90 వేల కోట్ల రూపాయల అప్పుల భారం జగన్ సర్కార్ కు సంక్రమించింది. వాటిలో చెల్లించాల్సిన బిల్లులే 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవికాక డిస్టలరీస్, సోలార్, విండ్ పవర్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయి.  ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలే వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితిలో ఉంది జగన్ సర్కార్. నవరత్నాలకు సర్కారు ప్రాధాన్యత ఇస్తుండడంతో బాకీల చెల్లింపులు ఆగిపోతున్నాయి. రుణాలు వాటి వడ్డీల భారం అంతకంతకూ పెరిగిపోవడంతో ఆర్థిక శాఖ పలుమార్లు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది. రాష్ట్ర పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే.. జగన్ కు సంపద సృష్టించటం చేతగాక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. పాలన చేతకాక పోతే పదవి నుంచి తప్పుకోవాలని ఇటు చంద్రబాబు అటు పవన్ విమర్శలు గుప్పిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏపీ రుణభారం జీఎస్డిపీలో 28.79 శాతంగా ఉంది. రాష్ట్రం విడిపోయాక అప్పుల భారం 96 వేల కోట్లు ఉండగా చంద్రబాబు సీఎం అయ్యాక లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఇక, జగన్ సీఎం అయ్యాక కేవలం ఈ ఎనిమిది నెలల్లోనే అప్పుల భారం మరో 47 వేల కోట్లు పెరిగింది.

ఆలయాన్ని కూల్చివేయండి లేదా 5 కోట్లు చెల్లించండి: హైకోర్టు

పార్కును ఆక్రమించి ఆలయం నిర్మించడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్న మూడు కోట్లమంది దేవతలకు ఇలా పబ్లిక్ స్థలాలను ఆక్రమించి గుడులు కట్టుకుంటూ పోతే పరిస్థితేంటి అని నిలదీసింది. గుడిని కూల్చేస్తారా లేక ఐదుకోట్లు చెల్లిస్తారా అంటూ అమీన్ పూర్ ఆలయ కమిటీని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గ్రామం మాధవపురి హిల్స్ లోని రాక్ గార్డెన్ లో 9866 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేసి అనుమతి లేకుండా ఆలయాన్ని నిర్మించడాన్ని ప్రశ్నిస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ 2018 లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హై కోర్టులో మరోసారి విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా ఆలయంలోని దేవుడ్ని ప్రతివాదిగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. ఆలయ కమిటీ తరపున వాదించిన న్యాయవాది 2010 లో ప్రభుత్వం ప్రార్థనా మందిరాలకు సంబంధించిన విధాన నిర్ణయం చేస్తూ రెండు జీవోలు జారీ చేసినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఆలయం పేరుతో పార్కులను కబ్జా చేసుకోడానికి ప్రభుత్వం అనుమతిస్తూ జీవోలు ఇచ్చిందా అని నిలదీసింది.  ఈరోజు ఆలయం నిర్మించారు రేపు గురుద్వార్, మసీదు, చర్చిలు నిర్మిస్తామంటే ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటాయని ప్రశ్నించింది. దేవుడి పేరుతో పార్కు స్థలాన్ని ఆక్రమించి, ఆలయ నిర్మాణాలు చేసి చట్టాలు ఉల్లంఘిస్తుంటే అడ్డుకోవలసిన ప్రభుత్వాధికారులు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. పార్క్ ను ఆక్రమించి ఆలయం కట్టడం కూడా భూ కబ్జా కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 26 న జరిగే విచారణకు పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ ఎం డీ ఏ కమిషనర్, జిల్లా పంచాయతీ ఈవో, అమీన్ పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆలయ నిర్మాణానికి తీసుకున్న అనుమతులు చూపాలని కోర్టు అమీన్ పూర్ ఆలయ కమిటీని ఆదేశించింది. 2018 ఆగస్ట్ లో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. పార్కుల కోసం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేసింది. ఈ చట్టం ప్రకారం ఏ ఉద్దేశంతో ఆక్రమించినా నేరమే అవుతుందని పేర్కొంది. అక్రమంగా నిర్మించిన ఆలయాన్ని కూల్చివేయటం ఒక్కటే మార్గమని లేదంటే ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆలయ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.  

ఎక్కువ వద్దు, ఉన్నవి చెల్లించండి చాలు.. జగన్ సర్కార్ వీరి మొర ఆలకిస్తుందా? 

టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను అందించారు. మసీదుల్లో పని చేసే ఇమామ్, మౌజన్ లకు నెలకు ఐదు వేలు, మూడు వేల చొప్పున గౌరవ వేతనాన్ని అందించారు. అంతేకాక రంజాన్ పర్వదినం ముందు మసీదులకు రంగులు వేసుకునేందుకు ప్రతి మసీదుకు ఆరు వేలరూపాయల చొప్పున సహాయమందించేవారు. రంజాన్ తోఫా కింద ఆరు రకాల సరుకులను రేషన్ దుకాణాల నుంచి తెల్లకార్డు కలిగిన ప్రతి కుటుంబానికి అందించారు. దుకాణ్ ఔర్ మకాన్ పథకం కింద పేద ముస్లింలకు లక్ష రూపాయల వరకూ రుణ సదుపాయం కల్పించారు. దుల్హాన్ పథకం కింద పేద ముస్లిం నవ వధువులకు లక్ష రూపాయల వరకు సాయం చేశారు. విదేశీ విద్య కింద పేద ముస్లిం విద్యార్థులకు పది లక్షల వరకు సహాయమందించేవారు.  అయితే కొత్తగా ఏర్పడిన జగన్ సర్కార్ ఈ పథకాలన్నింటికి మంగళం పాడింది. ఇమామ్, మౌజన్ లకు ఆరేడు మాసాలుగా గౌరవ వేతనాలు అందడం లేదు, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడుమాసాలుగా ఏ ఒక్కరికీ గౌరవ వేతనం విడుదల కాలేదని పలువురు ఇమామ్ లు, మౌజన్ లు ఆవేదన చెందుతున్నారు. రోజు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలను పరిశీలించుకుని వేతనాలు పడకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. నాలుగేళ్ల పాటు టిడిపి ప్రభుత్వం తమకు గౌరవ వేతనాలు అందించిందని ఇప్పుడు వైసీపీ సర్కారు తమను నిర్లక్ష్యం చేస్తోందని వారు వాపోతున్నారు. వేతనాలు పెంచాం అంటున్నారు కానీ, మా ఖాతాల్లో మాత్రం జమకావట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా లోని సుమారు నాలుగు వందల మసీదుల్లో పని చేసే ఇమాం, మౌజన్ లకు గౌరవ వేతనాన్ని ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ అందించారు. గుడివాడలో పదకొండు మసీదుల్లో ఇమామ్ లు, మౌజన్ లకు టిడిపి హయాంలో ముప్పై ఒక్క లక్షల ముప్పై ఆరు వేలు, మచిలీపట్నం లోని ఇరవై మూడు మసీదుల ఇమామ్ లు, మౌజన్ లకు అరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేలు గౌరవ వేతనంగా అందించారు. అయితే ఏడు నెలలుగా ఒక్క పైసా రాలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ జామియా మసీదు అసోసియేషన్ కు ఇమామ్ మౌజన్ ల గౌరవ వేతనం నిమిత్తం ప్రతి నెల రూ ఎనిమిది వేలు అసోసియేషన్ అకౌంట్ కు జమ అయ్యేది. 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పది నెలల కాలానికి పాత విధానంలో ఎనభై వేలు జమ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు నలభై ఎనిమిది వేలు మాత్రమే జమైంది. ఇతరప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తున్న ఇమామ్, మౌజన్ లకు జీతాలు చెల్లించేందుకు అసోసియేషన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పెంచిన గౌరవ వేతనాలు అవసరం లేదని పాత విధానంలోనే సక్రమంగా చెల్లింపులు చేయాలని ఇమామ్ లు, మౌజన్ లు కోరుతున్నారు.

టీడీపీ ఆరోపణలతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిన జగన్ సర్కార్!!

ఏపీలో భారీ సంఖ్యలో పెన్షన్ లు తొలగించారంటూ విమర్శలు వస్తున్న వేళ దిద్దుబాటు చర్యలకు దిగింది జగన్ సర్కార్. తొలగించిన పెన్షన్ ఖాతాల రి వెరిఫికేషన్ జరపాలంటూ అధికారుల్ని ఆదేశించింది. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ పథకంపై దృష్టి సారించింది, అర్హులైన వారికి పెన్షన్ పథకం నుంచి తొలగించారన్న ప్రతిపక్షాల ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది జగన్ సర్కార్. అనర్హులుగా గుర్తించిన 4.80 లక్షల పెన్షన్ ఖాతాలను పరిశీలించనుంది.  ఈరోజు నుంచి ఈ నెల 17 వరకు వాలెంటీర్ లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఖాతాలకు రివెరిఫికేషన్ చేయనున్నారు. దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. పెన్షన్ ల సంఖ్యను తగ్గించుకోవాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అర్హులైన లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కకపోయినా ఈ సారి జరిగే రీ వెరిఫికేషన్ లో న్యాయం జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్రంలో అన్యాయంగా చాలా మందికి పింఛన్ లు తొలగించారని టిడిపి ఆరోపించింది.

తెలంగాణా ఇంటర్ పరీక్షలపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖమంత్రి...

తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. అయితే గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఈ సారి స్వయంగా విద్యాశాఖమంత్రి పరీక్షల ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే నెల నాలుగు నుంచి ఇరవై మూడు వరకు (మార్చి 4-23) ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు 9,65,840 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 1339 సెంటర్ లలో 24,740 మంది ఇన్విజిలేటర్ లను నియమించింది.  గతేడాది ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ పై చెలరేగిన వివాదంతో రాష్ట్రం అట్టుడికింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ విద్యా వ్యవస్థను కుదిపేశాయి. దీంతో ఈ సారి ఇంటర్ పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. పేపర్ వ్యాల్యూషన్ పై గతేడాది జరిగిన పొరపాట్లు మరలా పునరావృతం కాకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కలెక్టర్ అధ్యక్షతన హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు.  జిల్లా కలెక్టర్ లు, ఎస్పీ లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగొద్దని ఆదేశించారు. రెవిన్యూ పోలీస్, ఆర్టీసీ, వైద్య, విద్యుత్తు శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ లను కోరారు. పరీక్షల సమయంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు, తల్లితండ్రులు పరీక్షల నిర్వహణ ఫలితాలపై ఆందోళన చెందొద్దని కోరారు. విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్షల ప్రారంభానికి ముందు చేయాల్సిన మిగతా అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది తెలంగాణ సర్కార్.

తెల్ల కార్డుల సంఖ్య ఎంత తగ్గితే ప్రభుత్వం పై అంత భారం తగ్గుతుంది

  ఏపీలో తెల్లకార్డుల కోతకు రంగం సిద్ధమైంది. ఏకంగా ఇరవై లక్షల కార్డుల తొలగించాలనీ వైసీపీ ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఈ నెల పదిహేను నుంచి కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేసి మార్చి నుంచి వాటి ఆధారంగానే సరుకులు ఇవ్వనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల గుర్తింపునకు నిర్దేశించిన నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని చేపట్టిన సర్వేలో పధ్ధెనిమిది లక్షల మంది తెల్లకార్డు కలిగివుండేందుకు అర్హులు కాదని ఏపీలో క్షేత్ర స్థాయిలో తేల్చారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పుడే వివరాలు బహిర్గతం చేస్తే ఒక్కసారిగా వ్యతిరేకత వస్తుందని అందువల్ల పూర్తిగా వడపోత చేసే వరకూ బయటపెట్టకూడదని ఆ శాఖ భావిస్తోంది. ఈ నెల పదిహేను నుంచి కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేసి మార్చి నుంచి వీటి ఆధారంగానే సరుకులను అందిస్తారు. వేలి ముద్రల ఆధారంగా సరుకుల పంపిణీ జరుగుతున్నందున కొత్త కార్డులు చేతికి వచ్చినా, రాకపోయినా అర్హుల జాబితాలో పేరు ఉండడమే ప్రధానం కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రెండు లక్షల కుటుంబాలకు పైగా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటి పరిశీలన పూర్తి చేసిన తరవాత బియ్యం కార్డులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.  వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్డుల వడపోత కార్యక్రమం ప్రారంభమైంది. అందరికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇంతమందికి కార్డులెలా ఉన్నాయనే దానిపై దృష్టి సారించింది. రేషన్ తోపాటు ఇతర సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా భావిస్తున్న తెల్లకార్డుల సంఖ్య ఎంత తగ్గితే ప్రభుత్వంపై అంత భారం తగ్గుతుందని భావించింది. అందుకే కార్డుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది, ప్రజా సాధికార సర్వే సమాచారం, వాలంటీర్ల సర్వే నిర్వహించి కార్డులు వడపోసింది. అంతకుముందే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న 1.38 లక్షల కార్డులను ఒక నెల నిలుపుదల చేసింది. దానిపై విమర్శలు రావడంతో అది సాంకేతిక సమస్య అని చెప్పి తిరిగి పునరుద్ధరించింది. అన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం అనే విధానం పోతే కార్డుల సంఖ్య తగ్గుతోందని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆరోగ్యశ్రీ కి ప్రత్యేక కార్డులు జారీ చేస్తామని ఇతర పథకాలకు వేర్వేరు కార్డులు ఇస్తామని ప్రకటించింది కానీ, పేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్ళ స్ధలాలు అమ్మఒడి పథకాలకు మళ్లీ బియ్యం కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు వేల ఆదాయం కంటే ఎక్కువ ఉంటే బియ్యం కార్డుకు అనర్హులు. అయితే స్వీపర్ లు, శానిటరీ వర్కర్ లు, సఫాయి కర్మచారి వర్కర్ లుగా పని చేస్తూ ఎంత వేతనం పొందుతున్నప్పటికీ వారికి ఆదాయం, నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు అర్హులు కారు, అందులో మాగాణి మూడెకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. మొత్తం పది ఎకరాలు మెట్ట కానీ మూడెకరాలు మాగాణి దాటకుండా మిగిలింది మెట్టభూమి గానీ ఉండాలి. నాలుగు చక్రాల వాహనం ఉన్నా అనర్హులే, అయితే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ లు కలిగివున్న కుటుంబాలకు మినహాయింపు ఉంది. రెసిడెన్షియల్ కేటగిరీలో విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ లు దాటకూడదు. సొంతిల్లు అయినా అద్దిల్లైనా ఇదే నిబంధన వర్తిస్తుంది, అయితే ప్రభుత్వం విధించిన పది ఎకరాల పొలం నిబంధనపై కార్డుదారుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలో పది ఎకరాల దాటి పొలం ఉన్న వారు కూడా అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సాగునీటి వసతులు ఉన్న డెల్టా ప్రాంతం లోనూ అదే నిబంధన పెట్టారనే వాదన వినిపిస్తుంది. వెనకబడిన ప్రాంతాలు, కరువు ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వాహనాల నిబంధనపైనా విమర్శలు వస్తున్నాయి.

నవరత్న పథకాల అమలు విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న వైసిపి ప్రభుత్వం...

నవరత్న పథకాల అమలు విషయంలో వైసిపి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వెళుతోంది. మిగిలిన అంశాల్లో కాస్త కూస్తో తేడాలు జరిగినా చూసీ చూడనట్టుగా ఉంటుందేమో కానీ నవరత్నాలపై చాలా సీరియస్ గా ఉంది. ఇంటింటికీ పెన్షన్ లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గతానికి భిన్నంగా అత్యంత త్వరగా పారదర్శకంగా పెన్షన్ లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించుకుంది దీనికి అనుగుణంగానే గ్రామ వాలెంటీర్ లు, గ్రామ సచివాలయం సెక్రెటరీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజునే తొంభై శాతం మేర పెన్షన్ లను పంపిణీ పూర్తి చేసింది ప్రభుత్వం. గతంలో ఇవే పెన్షన్ లను పంపిణీ చేయాలంటే కనీసం వారం రోజులు పట్టేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంటింటికీ పెన్షన్ లను అమలు చేసే విషయంలో లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీంతో పెన్షన్ ల పథకం అమలులో మరిన్ని వెసులుబాట్లు కల్పించడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంట్లో భాగంగా పెన్షన్ ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా నుంచి ఆయా మండలాల ఎంపిడీవోల బ్యాంకు ఖాతాలకు ఆ మండలానికి సంబంధించిన నిధులు వెళతాయి. అక్కడ నుంచి ఆ మండల పరిధి లోని గ్రామ సచివాలయాల సెక్రెటరీ కన్వీనర్ కు పెన్షన్ ల మొత్తాన్ని అందజేయడం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ లు జారీ ప్రక్రియ చేపడతారు.  ఇప్పుడు దీనికి చిన్నపాటి సవరణ చేపట్టే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ఖజానా నుంచి ఆయా మండలాల ఎంపీడీవో లకు కాకుండా నేరుగా గ్రామ సచివాలయం సెక్రెటరీ కన్వీనర్ల ఖాతాలకు సదరు గ్రామానికి చెందిన పెన్షనర్ ల నిధులను పంపి జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా గ్రామాల నుంచి సదరు గ్రామ సచివాలయం సెక్రెటేరియట్ కన్వీనర్ కు మండల కేంద్రానికి వెళ్లే బాధ తప్పుతుంది అనేది సర్కారు పెద్దల వద్దకు వచ్చిన ప్రతిపాదన. మరో వైపు పెన్షన్ లను మరింత మందికి అందించేలా చర్యలు ప్రారంభించింది సర్కార్. గతంలో ఉన్న పెన్షన్ లతో పోల్చుకుంటే ప్రస్తుతం పెన్షన్ లు భారీ స్థాయిలో కోతలు విధించినట్టు విమర్శలు వస్తుండటంతో వీలైనంత మందిని పెన్షన్ ల అర్హుల జాబితాలో చేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గతంతో పోల్చుకుంటే సుమారు రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు అదనంగా పెన్షన్ లు జారీ చేస్తున్నా, ఇంతకు ముందున్న జాబితాలో ఉన్నవారిలో నాలుగు లక్షల పదహారు వేల ముప్పై నాలుగు మందిని అనర్హులుగా ప్రకటించారు. అయితే ఈ అనర్హుల జాబితాను పునహ్  పరిశీలించడం ద్వారా మరింత మందికి పెన్షన్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే మూడు వందల యూనిట్ల మేర విద్యుత్ ను వినియోగించుకోవటంతో సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల మంది అర్హత కోల్పోయారు. ఈ జాబితాను కూడా పరిశీలించడం ద్వారా ఇంకొంతమందికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి అనేది సర్కారు సంకల్పం. నవరత్నాల పథకాల అమలు విషయంలో మరీ ముఖ్యంగా పెన్షన్ లు, అమ్మఒడి వంటి పథకాల్లో ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవడం, దానికనుగుణంగా అమలులో అవసరమైన మేరకు మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా పెట్టుకోవాలనే భావన ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది.

సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో ముగియనున్న మేడారం మహా జాతర..

మేడారం మహా జాతర ముగింపు దశకు చేరుకుంది. సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశం చేయడంతో తెలంగాణ కుంభమేళా ముగుస్తుంది. చెర్న కోలాలు చేతబూనిన శివసత్తుల పూనకాల హోరు సమ్మక్క తల్లికి జై, మమ్మేలు తల్లి జీవించు తల్లి అంటూ మొక్కుల నాదంతో ప్రస్తుతం మేడారం మారుమోగిపోతోంది. మేడారం జనాభా వర్ణమైంది, కోట్ల మంది భక్తుల కొంగు బంగారమై మెరిసిపోయింది. పసుపు పీతాంబరమై మురిసిపోయింది, బెల్లం బంగారు నైవేద్యం అయ్యింది. ఇప్పటి వరకు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ముఖం పట్టారు. మొదటిరోజు చిలుకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో గద్దె పైకి తీసుకువచ్చినప్పటి నుంచి మేడారం భక్తజన సంద్రంగా మారిపోయింది. వనదేవతలు గద్దెలపైకి చేరినప్పటి నుంచి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదాలు అందుకుంటున్నారు. చిలకలగుట్ట నుంచి చల్పాయ చెట్టు దాకా అక్కడి నుంచి మేడారం గ్రామం దాకా ఇసుక వేస్తే రాలనంత జనం, నిన్న ఒక్క రోజే అమ్మవార్లను ముప్పై ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఆదివాసి ఆచార సాంప్రదాయాల కళాబృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేడారం వనదేవతలను తెలంగాణ గవర్నర్ తమిళిసాయ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకొని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి బంగారంతో పాటు సారెను కూడ సమర్పించుకున్నారు. ఇక సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారానికి చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇవాళ్టితో మేడారం మహా జాతర ముగియనుంది, సాయంత్రం సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో జాతర ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. తెలంగాణ కుంభమేళగా ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ జాతరకు కోటి మందికి పైగా జనం హాజరవుతారని అంచనాలున్నాయి.

కేవలం పదహారు నిమిషాల్లోనే జేబీఎస్ టు ఎంజీబీఎస్...

భాగ్యనగర వాసుల కల సంపూర్ణమైంది, హైదరాబాదుకు మణిహారంగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టులో మరో కీలక మార్గం అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు మార్గాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, ప్రభుత్వ మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు మొత్తం పదకొండు కిలోమీటర్ల మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్ లు ఉన్నాయి. కేవలం పదహారు నిమిషాల్లోనే వారంతా గమ్యానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ కు అన్ని మెట్రో స్టేషన్ ల దగ్గర స్వాగతం పలుకుతూ అభివాదం చేశారు. తొలిదశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా ఘనత సాధించిందిహైదరాబాద్ మెట్రో. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన నలభై రెండు కిలోమీటర్ల మార్గంలో అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్ గా నిలిచింది, ఇది ఇంజినీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఎంజీబీఎస్ స్టేషన్ నిర్మాణం పలు ప్రత్యేకతలతో నియమించారు, యాభై ఎనిమిది పిల్లర్ లు, ఆరు గ్రిడ్స్ తో పూర్తి స్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్ తో స్టేషన్ ను నిర్మించారు. ఎల్ బి నగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించి కారిడార్-1 కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ కింది అంతస్తుల ద్వారా ప్రయాణం సాగుతుంది. జేబీఎస్ నుంచి ఫలక్ నుమా మార్గంలో సాగించే రైలు పై అంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. అయితే ఒక మార్గం నుంచి మరో మార్గం మారటానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే వంద సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్ లెట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్ లు, కన్వేయన్స్ ఔట్ లెట్ లను కాంకర్స్ లెవల్ లో నిర్మించారు.

ఢిల్లీలో ఎన్నికల పోరుకు సిద్ధమైన పార్టీలు, గెలుపెవరిది..?

రాజధాని ఢిల్లీలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. డెబ్బై స్థానాలకు ఒకే విడతలో జరగతున్న ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేసింది. 13,750 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. 380 పోలింగ్ కేంద్రాలను మహిళలు, పదకొండు సెంటర్ లను దివ్యాంగులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 11 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.  మొత్తం డెబ్బై నియోజక వర్గాలకు గాను ఆరు వందల డెబ్బై రెండు మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కోటి నలభై లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎనభై లక్షల మందికి పైగా పురుషులు, అరవై లక్షల మందికి పైగా మహిళలు ఓటేయనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. వికలాంగులు వృద్ధుల కోసం స్పెషల్ అరేంజ్ మెంట్స్ చేశారు. షహీన్ బాగ్, జామియా మిలియా, ఉస్మానియా యూనివర్సిటీ ఇలా పలు ప్రాంతాల్లో సిఎఎ వ్యతిరేక ఆందోళనలతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. తొంబై వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు, నూట తొంభై కంపెనీల కేంద్ర బలగాలు, నలభై రెండు వేల మంది స్థానిక పోలీసులు, పంతొమ్మిది వేల మంది హోమ్ గార్డులతో భద్రతను కట్టు దిట్టం చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కంటే ఇప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా బలగాలను మోహరించారు.  ఆమాద్మీ, కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగగా బిజెపి, జెడియు, లోక్ జన శక్తి పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. మూడు పార్టీలు ఎవరికి వారే విజయంపై ధీమాగా ఉన్నారు. గత అయిదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే నమ్మకంతో ఆప్ ఉంది. ఇక ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి ఈ సారి కూడా ఓటర్లను తమనే ఆదరిస్తారని ఆశతో ఉంది. మరోవైపు ఢిల్లీని వరుసగా మూడు సార్లు ఏలి 2013 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తుంది.

భార్య సహకరిస్తుంటే... భర్త అత్యాచారం చేశాడు... హైదరాబాద్ లో దారుణం

హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచమైన మహిళను నమ్మించి మోసం చేశాడు. మంచివాడిగా నటిస్తూ అత్యాచారం చేశాడు. హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేటలో నివాసముండే మామిడి సంజీవరెడ్డికి... అమెరికా నుంచి తిరిగొచ్చి కోకాపేటలో నివాసముంటున్న ఓ మహిళతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. 2018 జులైలో సంజీవరెడ్డి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో ఆమె అంగీకరించింది. అప్పట్నుంచి ఇద్దరూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకునే వారు. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే, బాధితురాలు ఒకసారి అమెరికా వెళ్లి తిరిగిరాగా... శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకున్న సంజీవరెడ్డి... ఆమె చెల్లెలు ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. ఆ తర్వాత హోటల్లో భోజనానికి ఆహ్వానించిన సంజీవరెడ్డి... తన భార్య, మేనల్లుడిని పరిచయం చేశాడు. అయితే, ఆమె భోజనం చేసేందుకు నిరాకరించడంతో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు.  అనంతరం అపస్మారస్థితిలోకి వెళ్లిన మహిళను నిజాంపేటలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, ఆమె దగ్గరున్న డబ్బు, బంగారు నగలపై కన్నేసిన సంజీవరెడ్డి... తన భార్య, మేనల్లుడి సహకారంతో బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తుండగా వీడియో తీయించాడు. అప్పట్నుంచి డబ్బు కోసం ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బివ్వకపోతే రేప్ వీడియోను సోషల్ మీడియా పెడతానంటూ 50లక్షల రూపాయలు వసూలు చేశాడు. డబ్బుతోపాటు 30 తులాల బంగారం, చెక్కులు, 6వేల డాలర్లు బలవంతంగా లాక్కున్నాడు. అయితే, రోజురోజుకీ వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో, రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు సంజీవరెడ్డి, అతని భార్య కావేరితోపాటు మేనల్లుడు విశాల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే, సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలపై అటు పోలీసులు ఇటు మీడియా అప్రమత్తం చేస్తున్నా... ఉన్నత చదువులు చదువుకున్న మహిళలు... అమెరికాలో ఉండొచ్చిన వాళ్లు కూడా మోసపోవడం ఆందోళన కలిగిస్తోంది. అపరిచితులనే కాదు తెలిసినవాళ్లను, బంధువులను కూడా నమ్మొద్దంటూ పోలీసులు విస్తృతంగా అవేర్ నెస్ కల్పిస్తున్నా... ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తిని గుడ్డిగా నమ్మి అతను చెప్పిన చోటికి వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. ఇఫ్పుడైనా, ఇలాంటి దారుణ సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకుని ఎవరికివాళ్లు జాగ్రత్తలు తీసుకోకపోతే... మోసగాళ్ల చేతిలో ఇలా అత్యాచారాలకు, మోసాలకు బలైపోతూనే ఉంటారు. అందుకే, బీ కేర్ ఫుల్ అండ్ టేక్ కేర్ లేడీస్.

రాముడు పచ్చి తిరుగుబోతు: కత్తి మహేష్

కత్తి మహేష్ కొత్త వివాదానికి తెర తీశాడు. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు పచ్చి తిరుగుబోతు అనే కామెంట్ చేశాడు. బహుజన సాహిత్య జాతర పేరిట హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని స్త్రీలోలుడు గా అభివర్ణించాడు కత్తి మహేష్. వివాదాల ద్వారా తరచూ హెడ్ లైన్స్ ఎక్కాలనే  తత్వం ఉన్న కత్తి మహేష్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి. శ్రీరాముడు తన అంతఃపురం లోని మహిళలతో సరససల్లాపాలు సాగించే వాడని కత్తి మహేష్ చేసిన  వెటకారపు వ్యాఖ్యలు నెటిజన్లను కదిలించాయి. సోషల్ మీడియాలో ని దాదాపు అన్ని వేదికలమీద ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. మహేష్ ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే చేశాడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ సిపి అధినేత దృష్టిని ఆకర్షించడానికి ఈ చౌకబారు వ్యవహారానికి దిగాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇదే విషయమై తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన కత్తి మహేష్, తన కంటే భయంకరమైన హిందువు ఇంకెవరు లేరని, తాను గుడ్డిగా ఫాలో అయ్యే రకాన్ని  కానని, తాను దళిత  చార్వాకుడు ని అని తనకు తానే సర్టిఫికెట్  ఇచ్చుకున్నాడు. లోగడ పవన్ కళ్యాణ్ మీద కూడా విపరీత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తాజా వ్యవహారం మాత్రం హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక రకంగా లైమ్ లైట్ లో ఉండటానికి కత్తి మహేష్ చేస్తున్నఈ విపరీత వ్యాఖ్యానాలు పరిగణలోకి తీసుకొని, అతనిపై కేసు నమోదు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనానికి తాజాగా కత్తి మహేష్ వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్టు అవుతుందని సోషల్ మీడియా వేదికలు అభిప్రాయపడుతున్నాయి. హిందువులంటే చులకనగా మాట్లాడటం కత్తి మహేష్ లాంటి వారికి ఫ్యాషన్ అయిపోయిందని కూడా హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడిగా నటుడిగా రచయితగా పేరున్న కత్తి మహేష్ ఈ తరహా దిగజారుడు నేలబారు వ్యాఖ్యలు మానుకోవాలని, శ్రీ రాముడి పై చేసిన దురుద్దేశ పూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిన కేసీఆర్

హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు చాలా మంది మెట్రో ప్రయాణం పై ఆసక్తి చూపిస్తున్నారు. మియాపూర్ టూ ఎల్బీనగర్, నాగోల్ టూ రాయదుర్గం ఇలా మెట్రో ప్రయాణంతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య తొమ్మిది స్టేషన్ లను నిర్మించారు మెట్రో సభ్యులు. ఈ మార్గం అందుబాటులోకి రావటం వల్ల జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లటానికి కేవలం 16 నిమిషాల సమయమే పట్టనుంది. ఈ మెట్రో క్యారిడార్ హైదరాబాదీలకే కాదు, జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చే వారికి కూడా ఉపయోగపడుతుంది. గత నవంబర్ లోనే ట్రయల్ రన్స్ మొదలవ్వాల్సి ఉండగా ట్రయల్ రన్స్ లో భాగంగా 17 రకాల పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షలన్నీ సంతృప్తికరంగా పూర్తయ్యేందుకు దాదాపు 45 రోజుల సమయం పట్టింది. జనవరిలోనే క్యాడర్ టూ ను ఆరంభించాలని భావించారు.కానీ మున్సిపల్ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇక శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. జేబీఎస్ టూ ఎంజీబీఎస్ రూట్ తో కలిపి మొత్తం 67 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటు లోకి వచ్చినట్లు సమాచారం.ఇప్పటి వరకు దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్ గా హైదరాబాద్ మెట్రో నిలిచినట్లు సమాచారం. మరో 11 కిలోమీటర్ల రూటు అదనంగా కలవబోతోంది. దీంతో మరింత పొడవైన మెట్రో మార్గంగా రికార్డులోకి ఎక్కనుంది హైదరాబాద్ మెట్రో. మెట్రోతో సిటీ బస్సులు ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైల్వే స్టేషన్ లతోనూ పూర్తిస్థాయిలో అనుసంధానం ఏర్పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగిన వారంతా స్కైవాక్ ద్వారా మెట్రో స్టేషన్ కు వెళ్లిపోవచ్చు. మియాపూర్, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, నాగోల్ నుంచి మెట్రోలో ఎంజీబిఎస్ కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సులభంగా చేరుకోవచ్చు.మొత్తం మీద హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నట్లు తెలుస్తొంది.

టిటిడి బర్డ్ ఆసుపత్రిలో విజిలెన్స్ దాడులు.. గత ప్రభుత్వ లోపాలపై ఫోకస్!

టిటిడి బర్డ్ ఆసుపత్రిలో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాల పై గట్టిగా ఫోకస్ పెట్టింది విజిలెన్స్ విభాగం. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రిలో తనిఖీలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో జరిగిన కొనుగోళ్లు, నిధుల వినియోగం పై ఆరా తీస్తోంది. గతంలో బర్డ్ డైరెక్టర్ గా డాక్టర్ జగదీష్ ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాల పై ఫోకస్ పెట్టారు విజిలెన్స్ అధికారులు. గత ఐదేళ్ల కాలంలో జరిగింది కాబట్టి కొనుగోళ్లకు సంబంధించి కానీ నిధుల వినియోగానికి సంబంధించిన గానీ ఏ రకమైన అక్రమాలు జరిగాయి, ఏ రకంగా అవినీతి జరిగింది. నిధులు ఏ విధంగా దారి మళ్ళాయి అని పలు ఆరోపణల నేపథ్యం లోనే విజిలెన్స్ దాడులు అయితే కొనసాగుతున్నట్లు సమాచారం. గతంలో డైరెక్టర్ గా పనిచేసిన జగదీష్ చాలా కాలంగా డైరెక్టర్ గా కొనసాగిన నేపథ్యంలో గత ఐదేళ్లలో ఏ రకమైన పాలనా పరమైన వైఫల్యాల జరిగాయి. ఇందుకు సంబంధించి పలు ఆరోపణల నేపథ్యం లోనే అధికారులు విజిలెన్స్ దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయిదేళ్ల కాలంలో పరికరాల కొనుగోలుతో పాటు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ రకమైన అక్రమాలు జరిగాయి. ఇందుకు సంబంధించి జగదీష్ తీసుకున్న నిర్ణయాలకు  ఫోకస్ చేసినట్లు సమాచారం. విజిలెన్స్ డీఎస్పీ మల్లీశ్వర్ రెడ్డి తో పాటు విజిలెన్స్ అధికారులతో కూడా తిరుపతి లోని బర్డ్ ఆస్పత్రిలో తనిఖీలు చేయటమే కాక ప్రధానంగా రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద విజిలెన్స్ అధికారులు సర్వత్రా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

స్వరూపానందకి తాకిన రాజధాని ఉద్యమ సెగ...

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నంద సరస్వతికి అమరావతి ఉద్యమ సెగ తగిలింది. శుక్రవారం గుంటూరులోని గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే ఆద్యాత్మిక  కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన స్వామీజీని రాజధాని మహిళలు అడ్డుకున్నారు. అమరావతి మద్దతుగా 'జై అమరావతి' నినాదాలు చేస్తూ తమ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. రాజధానిని మార్చవద్దని ఏపి సీఎం జగన్ కు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగిన మహిళలను స్థానిక వైసీపీ నేతలు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆలయం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్నాయి.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్వామీజీని అక్కడినుండి తీసుకెళ్ళారు.